"ఇది చదివాకే నాకనిపిస్తున్నాది మీరో కథ రాస్తే చదవాలని. ఇంతమంది సాహిత్యవేత్తలతో పరిచయం ఉంది. వారి ప్రభావమూ మీ పై ఉంటుంది. మీరు కథ రాస్తే ఎలా రాస్తారో, ఏ పంధాలో ఉంటుందో, ఎలాంటి ఆలోచనలను చర్చిస్తారో తెలుసుకోవాలని ఉంది. ఆ ఆశలు ఫలిస్తాయంటారా?"
రెండు మూడు వారాల కిందట ఆలమూరు సౌమ్య రాసిన వ్యాఖ్య అది.
సౌమ్యకి దివ్య దృష్టి వుందని నాకు అనుమానం.
అంతకు ముందు వారమే నేనొక కథ రాసి, ఆంధ్రజ్యోతికి పంపాను. ఆ విషయాన్ని క్రాంతదర్శి అయిన సౌమ్య ముందే పసిగట్టేసిందా?ఏమో?! ఇదిగో మొత్తానికి ఆ కథ "ముస్తఫా మరణం" ఇక్కడ...
కథ రాయడంలో కవిత్వానికి మించిన ఆనందం ఏదో వుంది! ఈ కథ చదివితే మీకూ అట్లా అనిపిస్తుందా? అనిపించినా అనిపించకపోయినా మీరేమనుకున్నారో తప్పక రాయండి.
http://epaper.andhrajyothy.com/PUBLICATIONS/AJ/AJYOTHI/2012/01/29/index.shtml
Saturday, January 28, 2012
Wednesday, January 25, 2012
నువ్వొచ్చేటప్పుడు....!
ఎటు నించి ఎప్పుడొస్తావో
తెలీదు గాని
నువ్వొచ్చేటప్పుడు
కాసింత నిశ్శబ్దాన్ని పట్రా...
వొక నిరామయ నిరాలోచననీ పట్రా...
1
సతమతమయి వున్న గదిలో గాలినీ వెలుతురినీ నులిమేసిన ఇరుకు గోడల్లో లోపలంతా ఇంకిపోయిన ఎడారిలో
2
రాలినపూల వొంటి మీద వూరేగుతున్న శబ్దాల రెపరెపల్లో నిప్పు పూలు పూసిన కన్రెప్పల్లో కాయలై కాసిన చూపుల్లో
3
కలల్ని నిద్రపోనివ్వని కళ్ళల్లో నీడల్ని నెమరేసే నీళ్ళల్లో
4
ఎటు నించి ఎప్పుడొస్తావో కానీ,
నువ్వొచ్చేటప్పుడు
చింతాకంత నిశ్శబ్దం
ఎంతో కొంత మౌనం!
Sunday, January 22, 2012
ఏం రాస్తాం?
(ఇది మిత్రుడు రవీ వీరెల్లి కవిత...ఆవకాయ నుంచి)
వలసపోయిన పిట్టలతో మూగబోయిన చెట్టు తొర్రలో
దేనికదే ఒంటరిగా ఉన్న రెండు ముసలి ఆత్మలనడిగా.
మునిమాపువేళ దాటినా దయగలమారాజు దొరకని
బిచ్చగాని ఖాళీ సత్తుబొచ్చె తడిమా.
ఎప్పుడో కోసిన వరిమడిలో ఇంకా పరిగేరుకుంటున్న
ఓ అవ్వ ఆరాటంలో వెదికా.
ఒక్కో మెట్టుకు పసుపు రాస్తూ ఏడు కొండలెక్కుతున్న
ఓ కళ్ళూ కాళ్ళు లేని కబోది లోలోనికి పరకాయప్రవేశమూ చేసి చూసా.
పదాల కోసం నిఘంటువులు వెదకక్కరలేదు
మన పల్లెను ఓసారి కలెదిరిగిపోతే చాలురా
అని ఆర్తిగా నాన్న చెప్పిందీ... చేశా.
ఊహూ... ఆకారం లేని పదాలు. పద్యానికి పనికిరావు.
చివరాఖరికి
సిగరెట్ పొగల అంచుల్లో
వో ఆలోచన అస్తిపంజరం
ఉత్తుత్తి చర్మాన్ని కప్పుకుని
రంగులద్దిన పదాలను రక్తనాళాల్లో నింపుకుని
ఖరీదైన వో కాయితం పై ఒలికింది.
ఏం రాస్తాం?
అఫ్సర్ గారి "కొన్ని పంక్తులు ఇలా కూడా..." చదివిన స్పూర్తి తో. అఫ్సర్ గారి కవితలు చదివాక చాలా రోజుల వరకు అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి నాకు నచ్చిన కవితల్లో ఒకటి "కొన్ని పంక్తులు ఇలా కూడా...". మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆర్ద్రంగా సాగిన ఆ కవిత చివరి పాదం చదివాక ఎవరైనా అలా కాసేపు ఓ అనిర్వచనీయమైన అనుభూతిలోకి వెళ్లి (ముసుగు తీసేసి) ఆలోచించాల్సిందే.
వలసపోయిన పిట్టలతో మూగబోయిన చెట్టు తొర్రలో
దేనికదే ఒంటరిగా ఉన్న రెండు ముసలి ఆత్మలనడిగా.
మునిమాపువేళ దాటినా దయగలమారాజు దొరకని
బిచ్చగాని ఖాళీ సత్తుబొచ్చె తడిమా.
ఎప్పుడో కోసిన వరిమడిలో ఇంకా పరిగేరుకుంటున్న
ఓ అవ్వ ఆరాటంలో వెదికా.
ఒక్కో మెట్టుకు పసుపు రాస్తూ ఏడు కొండలెక్కుతున్న
ఓ కళ్ళూ కాళ్ళు లేని కబోది లోలోనికి పరకాయప్రవేశమూ చేసి చూసా.
పదాల కోసం నిఘంటువులు వెదకక్కరలేదు
మన పల్లెను ఓసారి కలెదిరిగిపోతే చాలురా
అని ఆర్తిగా నాన్న చెప్పిందీ... చేశా.
ఊహూ... ఆకారం లేని పదాలు. పద్యానికి పనికిరావు.
చివరాఖరికి
సిగరెట్ పొగల అంచుల్లో
వో ఆలోచన అస్తిపంజరం
ఉత్తుత్తి చర్మాన్ని కప్పుకుని
రంగులద్దిన పదాలను రక్తనాళాల్లో నింపుకుని
ఖరీదైన వో కాయితం పై ఒలికింది.
ఏం రాస్తాం?
అఫ్సర్ గారి "కొన్ని పంక్తులు ఇలా కూడా..." చదివిన స్పూర్తి తో. అఫ్సర్ గారి కవితలు చదివాక చాలా రోజుల వరకు అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. అలాంటి నాకు నచ్చిన కవితల్లో ఒకటి "కొన్ని పంక్తులు ఇలా కూడా...". మొదటి నుంచి చివరి వరకు ఎంతో ఆర్ద్రంగా సాగిన ఆ కవిత చివరి పాదం చదివాక ఎవరైనా అలా కాసేపు ఓ అనిర్వచనీయమైన అనుభూతిలోకి వెళ్లి (ముసుగు తీసేసి) ఆలోచించాల్సిందే.
Wednesday, January 18, 2012
సైగల్ పాట
కిటికీ తెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట
చిరుగాలి రెక్కల మీద
చిర్నవ్వు కదలికల కలల వీణ
చిగురాకు కొనపై
మంచుబిందువు మరణవేదన
కాలం క్రూర శాసనానికి
కునారిల్లుతున్న కూజితం
స్రవించే స్వరపేటికని
నిర్దాక్షిణ్యంగా తెంపేసి
కాలం మెడలో హారంగా అలంకరిస్తుంది జీవితం
సజీవ వేదనా స్రవంతిగా
ప్రవహిస్తూనే వుంటుంది నీ పాట.
వీణ తీగల మీద కదలాడే వేళ్ళు
మెల్లిగా తెగిపోతాయి.
వేగంగా వీచే గాలిలోకి
భళ్ళున కూలిపోతుంది చెట్టు.
బాధని స్వరాల సరంగా కూర్చి
లోకాన్ని ఊహల తోటల్లోకి నడిపించి
తను మాత్రం
కాలగర్భంలో వొత్తిగిలి పడుకుంటుంది.
దిక్కుల్ని ధ్వనులతో బంధించి
వెన్నెల ధనస్సు సంధించి
చీకట్లను ధ్వంసం చేసి
కాంతి శిఖరాగ్రాన సిందూరమయి
పలకరిస్తాడు.
అతనే వినిపించకపోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లిగా కదిలి
తుపానయి చుట్టుముడుతుంది జ్ఞాపకంలా.
నడుస్తున్న నిన్ను వెంటాడి వేధిస్తుంది
రాత్రిలోంచి రాలి పడ్డ స్వప్నంలా.
("రక్తస్పర్శ" 1985)
ఇవాళ సైగల్ స్మృతిని మళ్ళీ తట్టి లేపిన చిత్రశిల్పి, మిత్రుడు అన్వర్ భాయికి కృతజ్ఞతలతో
Saturday, January 14, 2012
కారామాస్టారూ...బందరు రోడ్డు కబుర్లూ!
ఇది రెండు పుష్కరాల కిందట బెజవాడ బందరు రోడ్డు మీద కారా మాస్టారూ...నేనూ!వొక సాయంకాలపు సుదీర్ఘ నడక తరవాత మా దండమూడి సీతారాం కెమెరా కంట్లో పడ్డాం.
బెజవాడలో వున్న రోజుల్లో కూడా కాళీపట్నం రామారావు మాస్టారితో నేను కలిసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన్ని మొదటి సారి ఖమ్మంలో నేను ఇంటర్ సెలవుల్లో కలిశాను. అప్పుడే ఆంధ్రజ్యోతి వారపత్రికలో నా కథ అచ్చయ్యి వుండడం వల్ల ఆయన్ని కలవడానికి పాస్ పోర్టు దొరికినట్టయింది. "రా. నీ గురించి పురాణం గారు చెప్పారు," అన్నారాయన నన్ను కబుర్లకి పిలుస్తూ.
ఆ తరవాత బెజవాడలో కాళీపట్నం గారిని తుమ్మల వేణుగోపాల రావు గారింట్లోనూ, పురాణం గారింట్లోనూ అనేక పర్యాయాలు కలిశాను, కానీ - ఆయనతో సుదీర్ఘ సంభాషణకి వేదిక అయ్యింది బెజవాడ బందరు రోడ్డు. "ఆంధ్రజ్యోతి" కార్యాలయం నించి బయటికి నడిచి, మేమిద్దరం బందరు రోడ్డుని ఈ చివర నించి ఆ చివర దాకా మా కాళ్లతో కొలిచినట్టే తిరిగాం. అప్పుడు కథారచన గురించీ, తన పరిచయాల గురించీ, తెలుగు కథలకి సంబంధించి తనకి వున్న ప్రణాళికల గురించి మాస్టారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు. అవి అప్పటికి నాకు కొంత స్పూర్తినిచ్చాయి కానీ, ఆ తరవాత నేను అనుకోకుండా కవిత్వంలోకి దారి తప్పడం వల్ల అవన్నీ బూడిదలో పోసిన పన్నీరయ్యాయి!
Sunday, January 8, 2012
వంశీ బ్లాగులో నండూరి కథ!
మిత్రుడు వంశీ బ్లాగులో నండూరి రామ మోహన రావు గారి "లలిత పిన్ని" కథ ఇప్పుడే చదివాను. కథ బాగుంది. చాసో గారి "వాయులీనం" గుర్తుకొచ్చింది వొక్క సారిగా!
కథలో వచన శైలి విషయంలో నండూరి గారికి ఎంత పట్టింపు వుండేదో స్పష్టంగా తెలుస్తుంది,ఇందులో ఆయన వాడిన పంక్చుయేషన్ మార్కులు వొక సారి గమనిస్తే! ఆయన దగ్గిర పనిచేసిన కాలంలో ఈ కామాలు, ఫుల్ స్టాపులు, హైఫెన్ ల గురించి చాలా సార్లు వినేవాణ్ని, మెత్తటి తిట్లూ తినేవాణ్ని.
ఈ కథలో నాకు లలిత పిన్ని కంటే ఎక్కువగా నండూరి వారే కనిపించారు. లలిత పిన్ని మాదిరిగానే నండూరికి కూడా సంగీతం వొక అణగారిన లోలోపలి కోరికగానే వుండిపోయిందని చాలా సార్లు అనిపిస్తుంది.
http://janatenugu.blogspot.com/2012/01/blog-post_7140.html
తా.క. : వంశీ, మీ బ్లాగులో కామెంట్ ఆప్షన్ లేదా, ఏమిటి? అందుకే, ఇది ఇక్కడ పోస్ట్ చేస్తున్నా.
Wednesday, January 4, 2012
మహాకవి ఆరుద్రతో వొక సభలో...స్మృతిచిత్రం!
పాతికేళ్ళ కిందటి చిత్రం ఇది.
నేను ఆంధ్రజ్యోతి దినపత్రికలో పని చేస్తున్న కాలంలో బెజవాడ ప్రెస్ క్లబ్ లో మహాకవి ఆరుద్ర సాహిత్య ప్రసంగం చేశారు. ఆ సభకి అధ్యక్షత వహించే అవకాశం అప్పుడు నాకు దొరికింది. ఆరుద్ర ఈ సభలో చేసిన ప్రసంగం ఎప్పటికీ మరచిపోలేను. తన బాల్యం, యవ్వనం తో మొదలుకొని, అప్పటికి తన సాహిత్య దృక్పథంలో వచ్చిన మార్పులన్నిటినీ ఆరుధ్ర పూసగుచ్చినట్టు వివరించారు. సభ తరవాత ప్రశ్నలూ- జవాబులలో కూడా ఆరుద్ర చాలా సేపు మాట్లాడారు.
"మీరు నిమ్మళంగా, నిశ్శబ్దంగా వున్నారు కానీ,నాతో తెగ మాట్లాడించారు." అని ఆ రోజు సభ తరవాత ఆరుద్ర నవ్వుతూ అన్నారు.
Subscribe to:
Posts (Atom)
పూర్తి కాని వాక్యాలు
ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ- 1 మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే! ...

-
1 అ ర్థరాత్రి మెలకువొస్తుంది. వున్నట్టుండి లేస్తావు. మూత్రం వస్తున్నట్టుగా శరీరంలో వొక అసౌకర్యమైన చలనం. అటు తిరిగి పడుకొని వున్న శాం...
-
శ్రీశ్రీ మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు నాకు! అట్లా అని అయిష్టమూ లేదు. మరీ ల...
-
ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక ...