శ్రీశ్రీ
మీద వున్న విపరీతమయిన ఇష్టం వల్ల ఆరుద్ర అంటే ఎందుకో అంతగా ఇష్టం వుండేది కాదు
నాకు! అట్లా అని అయిష్టమూ లేదు.
మరీ లేత
వయసులో- అంటే టీనేజీ అని నా ఉద్దేశం- శ్రీశ్రీని ప్రత్యక్షంగా కలిసి వున్న అనుభవం దానికి
కారణమయి వుంటుంది! అయితే, ఆంధ్రజ్యోతి లో చేరిన
కొత్తలో మంచి వచనం రాయడం ఎలాగా అని తెగ మథనపడే రోజుల్లో శ్రీశ్రీ వచనం, మరీ
ముఖ్యంగా శ్రీశ్రీ వ్యాసాలు, నాకు పెద్ద ఆకర్షణ. అలా శ్రీశ్రీని వొక కవిగా
కంటే గొప్ప వచన రచయితగా సొంతంగా డిస్కవర్ చేస్తున్న కాలం అది. ‘నువ్వు నీలాగే
రాయ్” అని నండూరి అనే వారు. అయినా, ఏదో తాపత్రయం!
అలాంటి 1986 కాలంలో ఒక
తెల్లారుజామున బెజవాడ బందర్ రోడ్డులో వేంకటేశ్వర స్వామి వీధిలో వున్నమా వొంటరి గది
– ఈ ఇరుకు గదిలో నేనూ, రుద్రాభట్ల
కిషన్ చాలా ఏళ్ళు ఒకే మంచం ఒకే కంచంగా బతికాం. ఆ గది తలుపు తట్టారెవరో! తలుపు
తీస్తే ఎదురుగా వొక అపరిచిత వ్యక్తి.
అతను నన్ను
పరిచయం చేసుకొని, “సార్, ఆరుద్ర గారు కబురు చేశారు. ఇవాళ మీకు వీలు
కుదిరితే రమ్మన్నారు.” అన్నాడు.
ఆరుద్రగారు
వూళ్ళో వున్న సంగతి నాకు తెలుసు కానీ, నా పొగరు వల్ల (పొగరు అనే కంటే శ్రీ శ్రీ పట్ల
వున్న ప్రేమలోని “విగరు” వల్ల అనుకోవచ్చు) ఆ విషయం నేను అంతగా పట్టించుకోలేదు.
“సరే, వస్తాను”
“ఇప్పుడు
వెంటబెట్టుకొని రమ్మన్నారండి” అన్నాడతను కదలకుండా.
నేను అంత
తేలికగా కదిలే ఘటం కాదని అతనికి తెలీదల్లే వుంది. అప్పట్లో నాదయిన ఒక చచ్చు/నచ్చు
క్రమశిక్షణ నాకుండేది. పొద్దున లేవగానే బందరు రోడ్డు పక్కగా నడుచుకుంటూ వెళ్ళి
గాంధీనగర్ పక్కన ఎప్పుడూ వొకే టిఫిన్ సెంటరులో ఎప్పుడూ అదే ఇడ్లీ వడ సాంబారు
లాగించి, ఎప్పుడూ
అదే దారిలో వున్న ప్రబోధ బుక్ సెంటరులో మధ్యాన్నం దాకా పుస్తకాలు చదువుతూ కూర్చోడం
అప్పటి అలవాటు. (అప్పుడంతా మధ్యాన్నమో, రాత్రి డ్యూటీలో వుండేవి కనుక, పుస్తకం
కొనడం అంటే నెల జీతంలో సగమో, మూడు వంతులో “ధార” పోయడమే కనుక, ఆ క్రైస్తవ
దుకాణం నాకు మంచి ఆశ్రమం అయ్యింది). మూడు నాలుగు గంటల చదువు తరవాత, విశ్వేశ్వర
రావు గారి మెస్ (అవును, ఇప్పటి
‘శ్రీశ్రీ’ విశ్వేశ్వర రావే!) లో మధ్యాన్న భోజనం! బ్రహ్మాదులు వచ్చినా ఆ రొటీన్
మారేది కాదు.
‘నేనొస్తాను, మీరు
పదండి” అని అతన్ని అప్పటికప్పుడు పంపించేసి, తరవాత నిదానంగా నేను నా డొక్కు ర్యాలే
సైకిలెక్కి ఆరుద్ర దిగిన హోటల్ చేరుకున్నా.
వెళ్ళేసరికి
ఆరుద్ర అప్పటికే రెడీగా వున్నారు, “రండి…మీరొస్తే కలిసి టిఫిన్ చెయ్యొచ్చని కూర్చున్నా”
అంటూ కింద రెస్టారంట్ కి దారి తీశారు.
ఆరుద్ర
గారు నాకంటే తాపీ మేస్త్రీ! చాలా తాపీగా పనులు చేసే మనిషిలా కనిపించారు మొదటి
పరిచయంలోనే. ఆయన కదలికలూ, మాట తీరు
చూసి, “మీరు కూడా తాపీ ధర్మారావు గారేనా?” అన్నాను
సరదాగా. అసలు అంత నెమ్మదిగా వొక్కో వాక్యం తూచినట్టుగా మాట్లాడ్డం సాధ్యమా అని
ప్రతిసారీ అనిపిస్తుంది ఆయన మాటలు వింటూ వుంటే!
దానికి ఆయన
పెద్దగా నవ్వేసి, “అవును అందరం ఆ తాపీ తానులో గుడ్డలమే కదా!”
అన్నారు, అదీ
తాపీగానే! “నేనెక్కాల్సిన రైలు ఎప్పుడూ జీవిత కాలం లేటు” అని ఆయన ఎందుకు అంత
అథారిటీగా అనగలిగారో అప్పుడే అర్ధమవడం మొదలయ్యింది.
“మీ గడ్డం
ఇన్స్పిరేషను కూడా ఆయనేనా?”
“లేదు, లేదు.
కేవలం నా బద్దకం వల్ల, తీరిక లేక, వదిలేశాను
గడ్డం!” అన్నారాయన.
టిఫినీ
కార్యక్రమాలు అయ్యాక, ఆయన
నెమ్మదిగా విషయంలోకి వచ్చారు.
‘నేను ఒక
సంకలనం పని మీద మీ కోసం కబురు చేశాను. ఇది కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు నాకు
అప్పజెప్పిన పని. వాళ్లకేమీ కాలం పట్టింపు లేదు. కానీ, నాకు
వుంది. ఈ సంకలనంలో 1975 తరవాత కవిత్వం ఎక్కువ వుండాలి అనుకుంటున్నా.”
“అవును, 75 తరవాతే
బాగుంటుంది. కనీసం అంతకు ముందు వచ్చిన కవిత్వం అంతా ఏదో వొక విధంగా సంకలనాలకి ఎక్కింది.
పైగా, 75 తరవాత చాలా కొత్త తరం వచ్చింది.” అన్నాను నేను.
“ఇంకో మాట
ఏమిటంటే, ఈ సంకలనం
వచ్చేనాటికి ఇంకా కొంత సమయం పట్టవచ్చు. కనీసం 75 ని ఒక కొండగుర్తుగా గుర్తిస్తే మనం
సాహిత్యాన్ని చూసే దృష్టి మారుతుంది. కానీ, ఇటీవలి రాస్తున్న వాళ్ళ గురించి నాకు ఆట్టే తెలియదు.
అక్కడ మీ సాయం కావాలి. మనం ఇద్దరం కూర్చొని వొక జాబితా తయారు చేసి, వాళ్లందరినీ
కలిసి సంప్రదిద్దాం.” అన్నారాయన.
‘నండూరి
గారు, శ్రీకాంత
శర్మగారు ఇంతకు ముందు “మహా సంకల్పం” చేశారు. వారిని అడిగితే బాగుంటుందేమో?!’ అన్నాను
నేను.
“వాళ్ళతో
మాట్లాడాను. వాళ్ళే మీ పేరు చెప్పారు.” అన్నారు ఆరుద్ర.
ఆ తరవాత
చాలా సేపు మా చర్చ అప్పుడు కొత్తగా రాస్తున్న వాళ్ళూ, వాళ్ళ
కవిత్వాల చుట్టూ తిరిగింది. కానీ, చాలా సేపటి కబుర్ల తరవాత నాకు అర్ధం
అయ్యిందేమిటంటే, సమకాలీన
కవిత్వాన్ని ఆయన చాలా శ్రద్ధగా చదువుతున్నారని! నన్ను అడగడం కేవలం క్రాస్ చెక్
చేసుకోవడం కోసం మాత్రమేనని!
మేము అలా
చర్చిస్తూ వుండగానే, అక్కడికి
నండూరి, పురాణం
గార్లు కూడా వచ్చారు. ఇక నేను నిష్క్రమించడం మంచిదని అనుకుంటూ, లేవడానికి
ప్రయత్నిస్తూ, “నేను మళ్ళీ కలుస్తాను” అనబోతుండగా, నండూరి
గారు “ఏం పర్లేదు, వుండవోయ్, కాసేపు!”
అన్నారు.
కానీ, ఆ కాసేపటి
తరవాత ఆరుద్ర గారు “అఫ్సర్ గారూ, నేను వొక రెండు రోజులు ఈ చుట్టు పక్కల గుంటూరు, తెనాలి, బందరూ
అన్నీ తిరిగి, కొత్త
రచయితల్నీ, కవుల్ని
కలుద్దామని అనుకుంటున్నా. మీరొస్తే బాగుంటుంది.” అన్నారు. నేను నండూరి గారి వైపు
తిరిగాను, ప్రశ్నార్థకంగా.
“పరవా లేదు, వెళ్ళు. ఈ
వారం సాహిత్య పేజీ ఇచ్చి వెళ్ళు, సరిపోతుంది” అన్నారాయన. ఆంధ్రజ్యోతి సాహిత్య
వేదికని నిండు సాహిత్య పేజీగా మార్చిన కాలం అది. చాలా కొత్త శీర్షికల వల్ల సాహిత్య
వేదిక అందరినీ ఆకట్టుకుంటున్న కాలం కూడా – రచనలు, లే ఔట్ విషయంలో ఇద్దరం చాలా శ్రద్ధ
పెట్టేవాళ్లం. ప్రతి అక్షరం పట్టి పట్టి చదివే వాళ్ళం. కానీ, రచనల ఎంపిక
విషయంలో నాకు పూర్తి స్వేచ్చ వుండేది. నేను వెంటనే ఆఫీస్ కి వెళ్ళి, ఆ
సాయంత్రానికల్లా పేజీ ముస్తాబు చేసి, ఇచ్చి, హోటల్ కి వచ్చి, మళ్ళీ ఆరుద్రగారిని కలిశాను.
2
సాయంత్రం
అయిదు గంటలకి మేము బెజవాడ నించి కారులో బయలు దేరాం. ఆ రెండు రోజుల ప్రయాణాలు నేను
మరచిపోలేనివి. పూటకి ఒక ఊళ్ళో దిగడం, అక్కడి కవులూ, రచయితలతో మాట్లాడ్డం…! వెళ్ళిన వూళ్లలో కొద్ది
సెపే వున్నాం కానీ, వొక వూరి
నించి ఇంకో వూరికి ప్రయాణం మా ఇద్దరి మధ్య చాలా కబుర్లకూ, కథలకీ
అవకాశం ఇచ్చింది.
ఆరుద్రని
నేను నా చిరకాల స్థిర నిశ్చిత పూర్వ అభిప్రాయాల నించి కాకుండా, ప్రత్యక్షంగా
చూడడం మంచిదే అయ్యింది. ఆరుద్రగారికి వున్న అనేక ఆసక్తుల్లో స్థల
పురాణం వొకటి. దారిన కనిపించే ప్రతి వూరి కథా పురాణం ఆయనకి తెలిసినట్టే అనిపించింది, ఆయన చెబుతూ
వుంటే! అలాగే, దాదాపు
ప్రతి వూరు సాహిత్య చరిత్ర ఆయన కి కొట్టిన పిండి. అక్కడి రచయితలూ, వారి జీవన
విశేషాలూ చెప్తూ వుంటే, ఇంత చరిత్ర
దృష్టి వుండడం సాధ్యమా అని ఆశ్చర్యపోవడం మినహా నేను చేయగలిగిందేమీ లేదు. ప్రాంతీయ, స్థానిక
చరిత్రల గురించి ఇప్పుడు ఇంత కంఠ శోష పెట్టినా, అసలు ఆ చరిత్రల్ని తవ్వి తీయగల శక్తి మనకి
వుందా అనిపిస్తోంది నాకు! అసలు మన జాతి (అది “ఆంధ్రా” అయినా, “తెలంగాణ”
అయినా, “రాయలసీమ’ అయినా) సాంస్కృతిక చరిత్ర గురించి అంత దీక్షగా
పనిచెయ్యగలిగే అంకిత భావం మనకుందా అని!
అవన్నీ
పక్కన పెట్టి, మా మధ్య
జరిగిన కొన్ని సాహిత్య కబుర్లు మాత్రమే ఇప్పుడు చెప్తాను.
శ్రీశ్రీ
గురించి మొదలయిన కబుర్లు ఆరుద్ర తొలినాళ్ళ దాకా వెళ్ళాయి. నాలో చాలా కాలంగా
నలుగుతున్న ప్రశ్నల్ని బయటికి రువ్వే అదను దొరికింది. “ఇదే అదను…” అనుకుంటూ
వొక్కోకటీ నెమ్మదిగా సంధించడం మొదలెట్టాను. ఆయన తాపీగా సమాధానాలివ్వడం
మొదలెట్టారు.
‘మొదట్లో
మీరు డిటెక్టివ్ నవలలు రాశారు, అవి ఎందుకూ?”
“డిటెక్టివ్
నవలలే కాదు, ఇంకా చాలా
రకాలు రాసి, ఒక విధంగా
చెప్పాలంటే, పారేశాం.
మీ శ్రీశ్రీ కూడా డిటెక్టివ్ నవలలూ, కథలూ రాశాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, మేం చేసిన
పని ఏమిటో మీకు అర్థమవుతుంది. మేము అసలు పాఠకులు అంటూ కొత్తగా ఒక వర్గం
తయారవుతున్న కాలంలో చేసిన రచనలు అవి. ఆధునికత వచ్చింది. పత్రికలు వస్తున్నాయి.
అప్పుడప్పుడే కొత్త పాఠకులు తయారవుతున్నారు. ఎవరీ పాఠకులు? కాస్తో
కూస్తో ఇంగ్లీషు చదువుకున్న వాళ్ళే కాదు, తెలుగులో పత్రికలకు, రాత
సాహిత్యానికీ అలవాటు పడుతున్న వాళ్ళు. మధ్యతరగతి వాళ్ళు. ఇంకా కమ్యూనిస్టు భావజాలం
ప్రవేశించని కాలం అది. పాఠకుడికి వామపక్ష స్వభావమో, ఇంకోటో అంటూ ఏర్పడని కాలం అది. వాళ్ళకి చదివే
ఆసక్తి పెంచడం వొక్కటే అప్పట్లో మా పని. దాని కోసం కొన్ని పనులు పని కట్టుకుని
చేశాం. ఇంగ్లీషులో డిటెక్టివ్ కథలు వున్నాయా, సరే, అయితే, తెలుగులో కూడా అవి వుండి తీరాలి. ఇంగ్లీషులో
స్కేచెస్ వున్నాయా, సరే, అయితే, తెలుగులో
కూడా అవి మనం రాసి తీరాలి. ఇలా అన్న మాట! అందులో సాహిత్యం వుందా లేదా అన్నది
అప్పట్లో ముఖ్యం కాదు. అవి కొత్త పాఠకుల చేత చదివిస్తున్నామా లేదా అన్నది మా
తాపత్రయం. ఇవన్నీ దాదాపూ అనుకోని చేశాం మేం!”
నిజమే, అచ్చు
సంస్కృతి అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలంలో వాళ్ళు పడ్డ కష్టాలేమిటో నిజంగానే
ఇంకా మనకి తెలియదు, శ్రీ శ్రీ
“అనంతం”లో, శ్రీపాద
“అనుభవాలూ జ్నాపకాల”లో కొన్ని ఉదాహరణలు తప్ప –
కానీ, ఆరుద్ర ఆ
డిటెక్టివ్ తరహా వచనంలోంచి సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం దాకా తెలుగు వచనాన్ని
తీసుకువెళ్లడం చాలా పెద్ద మలుపు. అది కేవలం సాహిత్య చరిత్ర కాదనీ, మొత్తంగా
సాంస్కృతిక చరిత్ర నిర్మాణమే అనీ నా అభిప్రాయం.
అనేక రకాల
పనులు చేస్తూ కూడా సమగ్రాంధ్ర సాహిత్యం మీద పని చెయ్యడం ఎలా సాధ్యపడిందని అడిగాను.
“ఏమీ లేదు. కొంచెం బండగా అంత కంటే మొండిగా కూర్చొని తెల్లారే లేచి రాయడం
మొదలుపెట్టాను. లేకపోతే, ఎక్కడ
అవుతుంది, ఆ సినిమాల
గోలలో, నానా రకాల
వ్యాపకాలలో? కానీ, అలాంటి
పనుల్లో రాయడం కంటే కూడా పరిశోధనకి ఎక్కువ సమయం కావాలి. సరే, ఆ పుస్తకం
నా జీవితకాలం రచన అనుకున్నాను కాబట్టి అదే కాస్తో కూస్తో మిగిలే రచన అనుకున్నాను
కాబట్టి దీక్షగా రాశాను.” అన్నారు ఆరుద్ర. ఆ రచన పరిశోధనకి ఆయన పడిన కష్టాలు, అన్నిటికీ
మించి కొన్ని నిర్ధారణలకు రావడానికి ఆయన పడిన సంఘర్షణని చక్కగా పూసగుచ్చినట్టు
చెప్పారు. ఇప్పుడు “పూసగుచ్చినట్టు” అంటే గుర్తొచ్చింది, ఆ మాట
ఆరుద్ర మాట్లాడే శైలికి చక్కగా సరిపోతుంది నిజానికి.
సాంస్కృతిక
చరిత్ర నాకు మొదటి నించీ చాలా ఆసక్తికరమయిన రంగం. ఆ విషయం మీద ఆయన ఆలోచనలూ, పరిశోధనా
పద్ధతి తెలుసుకోవాలన్న ఉత్సాహంతో కొన్ని సంభాషణలు అటు తీసుకువెళ్లాను.
అప్పుడు
ఆయన అన్న వొక మాట మా చర్చనీ వేరే దారి పట్టించింది . “మన చరిత్రలో విదేశీ
చరిత్రల్లో మాదిరిగా సాంస్కృతిక చరిత్రని గాని, సాహిత్య కళా చరిత్రల్ని కానీ సామాజిక రాజకీయ
చరిత్రల నుంచి విడిగా చూడడం సాధ్యం కాదు. ఉదాహరణకి ఇంగ్లీషులో
రొమాంటిక్ ఉద్యమం వుందనుకోండి, అక్కడ మీరు వర్డ్స్ వర్తు, కీట్సు, షెల్లీని
విడదీసి వాళ్ళ సాంస్కృతికతని చూడవచ్చు” అన్నారు.
ఠక్కున
కౌంటర్లు ఇవ్వడం నాకు పుట్టుకతో అబ్బిన విద్య కాబట్టి, వెంటనే
నేను దానికి కౌంటరు కొట్టేశాను.
“అది నిజం
కాదేమో! ఏ సాంస్కృతిక చరిత్ర అయినా సమాజంతోనో, రాజకీయాలతోనో ముడిపడి వుంటుంది. వర్డ్స్
వర్తుని, కీట్సుని
కూడా వాటికి విడిగా అధ్యయనం చేయలేం అనుకుంటా. వర్డ్స్ వర్తు చాలా స్పష్టంగానే తన
రాజకీయాలు చెప్తాడు. కీట్సు చెప్పకపోవచ్చు, కానీ అలా చెప్పకపోవడం కూడా రాజకీయమే. కీట్సులోని
నైరాశ్యానికి కేవలం అతని వ్యక్తిత్వమే కారణం కాదు, అతని చుట్టూ వున్న రాజకీయాలు, సమాజం
సమానంగా కారణం” అన్నాను.
“ఆ…కావచ్చు.
కానీ స్పష్టంగా చెప్పే రాజకీయాలకూ, చెప్పని రాజకీయాలకూ తేడా వుంటుంది” అన్నారాయన
అంత తేలికగా నన్ను కాదనలేక, అవునని
కూడా అనలేక.
“తెలుగు
వాళ్ళం మనం షెల్లీని, కీట్సుని
కొన్ని చరణాలుగా (stanzas) మాత్రమే చదువుతాం. ఆ మేరకే అర్ధం చేసుకుంటాం, అందుకే మనం
మన కృష్ణ శాస్త్రి గారిని ఆంధ్రా షెల్లీ అని అమాయకంగా పేరు పెట్టుకున్నాం.
నిజానికి కృష్ణ శాస్త్రి గారికీ, షెల్లీకి ఏ విషయంలోనూ పోలిక లేదు. షెల్లీకి
వున్న స్పష్టత కృష్ణ శాస్త్రి గారికి లేదు, ఎందుకంటే, కృష్ణశాస్త్రి గారికి విషాదం అంటే అదేదో వేరే
లోకం నుంచి ఉత్పత్తి అయిన వస్తువు.” అన్నాను నేను.
“ఇదేదో నాకు
కొత్త సంగతి. కాస్త ఆలోచించనివ్వండి నన్ను- కృష్ణ శాస్త్రి గారి గురించి మీరు
చెప్పింది నిజమే!” అన్నారాయన నేను వొక పట్టాన ఆ విషయం వదిలేట్టు లేదని
అర్థమయినట్టుగా- “మీరు ఇంగ్లీషు కవిత్వమూ తెలుగు కవిత్వం మధ్య పోలికలు చూపిస్తూ
మంచి వ్యాసాలు రాయాలి” అని ఆ పూట ఆయన మంచి సలహా ఇచ్చారు కానీ, అది మంచి
సలహా కాబట్టి నేను వినలేదు!
ఆ ప్రయాణాల
సందర్భంగా ఆరుద్ర గారు తన రాత క్రమశిక్షణ గురించి చెప్పిన చాలా విషయాలు నాకు
నచ్చాయి. అంత క్రమశిక్షణ శ్రీశ్రీ కి వుంటే ఎంత బాగుండేది అనుకున్నా. ఆ విషయమే
ఆయన్ని అడిగా.
“శ్రీ శ్రీ
యవ్వనంలో వున్నప్పుడు బాగా క్రమశిక్షణగానే వున్నాడు. అందుకే చూడండి, ఎన్ని
అనువాదాలు చేశాడో! అతని వచనం చాలా గొప్పది. కానీ, వొక్క సారిగా ‘మహాకవి’ అన్న ముద్ర పడ్డాక అతను
ఆ వచనం జోలికి వెళ్ళలేదు. ఎంతో శక్తి వుండి కూడా ఏమీ చేయకుండా వుండి పోయాడు.
రాజకీయ పర్యటనలు అతని సమయాన్ని బాగా తిన్నాయనుకోండి. నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి
లేదని అనను గాని, అలా తిరగడం
మీద ఆసక్తి లేదు. నేను ఏమన్నా తిరిగితే ఇదిగో ఇలా సాహిత్యం పనులు పెట్టుకొనే
తిరుగుతాను”
నిజమే!
కానీ, శ్రీశ్రీకి
అలాంటి తిరుగుళ్ళు వుండబట్టే, కొత్త తరంలోనూ అతని కవిత్వం బతికింది. అది
కాదనలేని సత్యం. శ్రీశ్రీ గురించి ఆయన ఇంకా చాలా వ్యక్తిగత విషయాలు కూడా
మాట్లాడారు కానీ, వాటిలో సగం
విషయాల మీద నాకు ఆసక్తి లేదు, అవి నిజమని కూడా నాకు నమ్మకం లేదు! కాబట్టి, ఇక్కడ
చెప్పడమూ లేదు.
మొత్తం మీద
ఈ ప్రయాణం తరవాత ఆరుద్ర వ్యక్తిత్వంలోని కొత్త కోణాలు నాకు చాలా దగ్గిరగా
అర్థమయ్యాయి. ఆయన మీద అంత అయిష్టం వుండక్కరలేదు అని కూడా అర్థమయింది. అప్పటి నించి
ఆరుద్ర రచనల్ని తిరిగి ఇంకో సారి చదవడం మొదలెట్టాను, ఈ సారి నాకు తెలిసిన వ్యక్తిత్వపు వెలుగులో!
చాలా
ఆశ్చర్యంగా వుంటుంది. జీవితం ఎప్పుడూ వొక ప్లాట్ ఫారం లాగానో, రైలు
ప్రయాణమో అనుకుంటే, కొన్ని
సార్లు మనం ఎక్కాల్సిన రైళ్లు మనం చూస్తూండగానే వెళ్లిపోతాయి. వొక్కో సారి అదృష్టం
బాగుంటే, మనం ఎక్కిన
కోచ్ లోనే మనకి బాగా ఇష్టమయి ఎన్నాళ్లుగానో కలవాలని ఎదురుచూస్తున్న వ్యక్తిని
కలవవచ్చు. కాస్త మాట్లాడుకునే అవకాశమూ దక్కవచ్చు.
ఆ రెండు
రోజుల ప్రయాణాల తరవాత ఆరుద్ర అనే రైలు నేను కాస్త లేటుగా ఎక్కానని అనిపించింది.
కానీ, అది జీవిత
కాలం లేటు కానందుకు ఇప్పటికీ సంతోషంగా వుంటుంది.
ఆ తరవాత
ఆయన కన్ను మూసినప్పుడు ఎడిటర్ యంవీయార్ శాస్త్రి ఆంధ్రభూమిలో ఆయన్ని
గురించి ప్రత్యేక సంపాదకీయం రాయించారు. అది ఆరుద్రగారికి నేనిచ్చిన చివరి అక్షర
నివాళి.
జీవితం మీద ఆయనకి
ఫిర్యాదులు లేవు
1
ఇప్పుడెలా వుందో తెలియదు
చింతకాని!
ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో
పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి
వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా
వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే
ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద
చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని
తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ
వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.
స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్
ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే
వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్
ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో
బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం
పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని.
కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత
నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు
అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.
చింతకాని స్కూల్లో అబ్బాజాన్
“మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక
సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన
చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే
బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో
నిలిచిపోతుంది,”
అని విద్యార్థులు ఆయన
గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో
ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య
సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల
రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద
రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి
పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు
ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా
రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా
వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు.
నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను
అతికష్టమ్మీద వొక గేయం, వొక
కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా
అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా
ప్రయోగాలు విఫలమయినా సరే!
ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే
కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం.
దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక
సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని
వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ
మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు
కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు
బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి
తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే
వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని
నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్
రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా
సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే
వాణ్ని. ఇదీ నా పాఠశాల!
ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర
బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది.
నెలకోసారి తెల్లన్నం, పావుకిలో
మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ
కొంచెం ఎక్కువ పాలు,
పెరుగు వచ్చిన రోజున
అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక
పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు
ఇంటికి వచ్చేవి,
కొత్త కొత్త సాహిత్య
మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా
కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.
ఆ చిన్న వూళ్ళో మా చదువులు
ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం
తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ
క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు
మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు
ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి
మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!
2
“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ
సాబ్!”
అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు
కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు.
కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు
వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా
గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.
ఖమ్మం మా జీవితాల్లో పెద్ద
కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక
పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది
కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు.
ప్రెస్ నిండా మునిగింది, మేము
అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.
ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు
ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం
డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు
ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి
దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా
ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు
గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన
అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా
చదువుకున్నారు,
ప్రాచీన ఆధునిక
సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో
వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి
కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ
ఇస్లాం కి దూరం కాలేదు, అవి
వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.
తాతయ్య గారు నిజాం కొలువులో
పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం
వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు
అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా
ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి
అప్పుడపుడూ అనేది,
“భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి
వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం
చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే
వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా
వెంటాడుతూనే వుండింది, ఇలా
మిగలాలా అని!
3
“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం
లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”
అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద
నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం
అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు
ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో
విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల
సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది.
కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని
వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం
లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో
అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు.
ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల
నించి తీసినవి కొన్ని, కవితలు.
నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ
ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా
సేకరిస్తున్నవి కొన్ని.
1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా
దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది
రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా!
కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన
ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ
తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం
అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో
ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి
కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో
ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం
జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే
మందలించే వారు.
ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే
వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం
జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి
ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం
జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని
సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు
వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు
నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు
రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు
చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ
తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది.
నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను
వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ
వొక్క పెట్టున దాడి చేశాయి.
పరిస్తితులు ఎటు తిరిగి ఎటు
వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం
స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం
అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం
ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే
వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత
తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా
రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు.
రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే
రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని
శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే
రాయాల్సింది రాయలేరు కదా?!” అనే
వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి
మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది
వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో
కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా
సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది.
కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన
కన్ను మూశారు.
ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని
మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన
మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు
లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర
నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా
అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!
*
సైదా, ఇలా కాదు మన మిలన్!
1
ఇంకో సందర్భం యేదైనా వుంటుందేమో
సైదాచారి గురించి మాట్లాడడానికి అనుకున్నాను. నెలకిందట అతను పుట్టాడు. పుట్టిన
రోజు వెళ్ళిపోయింది కేవలం నాలుగు పదాలతో! పెళ్ళిరోజుకి రెండు పదాలు. ఏదైనా నెగ్గుకొస్తే
వొకే వొక్క పదం. కాని, మరణాన్ని
నెగ్గుకురాలేని నిస్సహాయతకి అనంతమైన శాంతిని కోరుకునే మూడు పదాలు. మూడున్నర
దశాబ్దాల స్నేహానికి తెగతెంపులు చేసుకొని వెళ్ళిపోయిన వాడికి ఏం చెప్పాలి?! కొన్ని మాటల్నీ, లేతయవ్వనాల కొన్ని కలల్నీ, జీవితాన్ని బేఖాతర్ చేసి గొప్ప
గర్వంతో వెలిగిపోయిన నిన్నటి కాలాల్ని యెన్ని పదాల్లో పెట్టి చెప్పాలి?! తెలియదు. తెలియడం లేదు. తోచడం
లేదు. దూరంగా వున్న వాడికి అసలింకేమీ తోచదు. అనంతు అంటున్నాడు: “నిజంగా నిన్న
సాయంత్రం నించీ మృత్యు భయం పట్టుకుంది రా!” అని!
కాని, ఆ మృత్యువు గురించి తప్ప ఇంకా
దేన్ని గురించో మాట్లాడాలని అనిపిస్తోంది సైదాచారిని తలచుకుంటే!
ఇంకా నా డిగ్రీ చదువు పూర్తి
కాలేదు. పుస్తకాలూ కవిత్వమే బతుకుగా గడుస్తున్న రోజుల్లో ఇంకాస్త ఎక్కువ చదవాలన్న
తపనతో కాళ్ళకి బలపం కట్టుకొని హైదరాబాద్ పరిగెత్తే వాణ్ని. అప్పటికింకా యాకూబ్
హైదరాబాద్ చేరుకోలేదు కాబట్టి హైదరాబాద్ లో నాకొక ఠికానా లేదు. ఉస్మానియా
యూనివర్సిటీ హాస్టల్లోనో, ఆ
కేంపస్ లోనే వున్న అమెరికన్ లైబ్రరీ సెంటర్లోనో వుండే వాణ్ణి. అప్పుడు నాలుగు
దిక్కుల నించి నలుగురు – గుడిపాటి, రాం
దాస్, బాణాల శ్రీనివాస్, సైదాచారి- వచ్చే వాళ్ళు. ఉస్మానియా
యూనివర్సిటీ చెట్ల కింద వెల్లకిలా పడుకొని ఆకాశంలోకీ, అంత కంటే ఎక్కువ దూరం దూసుకుపోయే
తొలి యవ్వనాల కలల్లోకీ చూస్తూ వుండే వాళ్ళం. ఇవాళ ఆ యవ్వన అహంకారమే గుర్తొస్తుంది. ఈ మధ్య హైదరాబాద్ లో “ఇంటి వైపు”
సభకి బహుదూరం నించి వచ్చాడు సైదా. అదే మా ఇద్దరి చివరి రోజు అని ఇప్పుడు
ఊహించుకుంటే దిగాలుగా వుంది.
అప్పుడు సైదాచారి కళ్ళు ఎలా
వుండేవో గుర్తుందా మీలో ఎవరికైనా?! అతని
బక్కపల్చటి, బంగారు మేని ఛాయ సూర్యుడి
కిరణాలకి మెరుస్తూ వుండగా, అంతకంటే
పదిరెట్లు ఎక్కువ మెరుపు ఆ కళ్ళల్లో!
2
అనుమానమే లేదు, మాకెవ్వరికీ అప్పుడు “రేపు”
అనేదొకటి వుందన్న వూహ లేనే లేదు. ఇవాళ దొరికిన క్షణాల్ని కవిత్వంలాంటి వూహలతో
ఎల్లా నింపాలన్నదే వెతుకులాట. ఆ వెతుకులాటలో పుస్తకాలూ, పెయింటింగులూ, సంగీతం, ఉస్మానియా చుట్టూ సంచారాలూ, సెకండ్ షో సినిమాలూ, ఇంకా తెల్లారక ముందే చాయ్ కోసం, ఉస్మానియా బిస్కట్ల కోసం
పరిగెత్తడాలూ..అంతకంటే ఎక్కువగా రాత్రి కన్న కలలు కంటి అద్దాలలో ఇంకా
మిగిలివున్నాయేమో అని వెతుక్కోడాలూ!
జీవితం అట్లాగే మొదలవుతుంది.
సైదాచారికి బాగా తెలుసు. నాకు తెలిసీ అతను ప్రకృతికి ఇంకా దగ్గిర! ప్రకృతికి, పంట పొలాలకూ దగ్గరైన వాడికి
జీవితం ఇంకా బాగా తెలుస్తుంది. వాడి కళ్ళల్లో తడి ఆరదు. నాకు తెలిసీ అతను స్త్రీకి
ఇంకా దగ్గిర! స్త్రీకి దగ్గిరైన వాడికి జీవన మోహం ఇంకా బాగా తెలుస్తుంది. వాడి
కళ్ళల్లో వెన్నెల మాయ కాదు. అట్లా వున్నప్పుడే కవిత్వమూ సంగీతమూ రెండూ పోటీ పడి
వాణ్ని ప్రేమిస్తాయి. ఇవాళ మృత్యువు గురించి మాట్లాడే కంటే నేను సైదాకి ప్రాణమైన
కవిత్వం వింటాను,
అతని వయొలిన్ వింటాను.
౩
మరీ ఎక్కువగా దేన్నయినా ప్రేమించినప్పుడు
దాన్ని అందుకోడానికి కొంత ఆలశ్యమే అవుతుంది. మా అందరి కంటే ఆలశ్యంగా కవిత్వం రాయడం
మొదలెట్టాడు సైదా. నిస్సందేహంగా చెప్పగలను, కవిత్వం
గురించి నాకంటే అతనికి ఎక్కువ ఊహలే వుండేవి. అతని మాటల గాఢత్వాన్ని కొన్నేళ్ళ
తరబడి వింటూ వస్తున్నాను కాబట్టి. అతని తొలి యవ్వనంలో కవిత్వమే అతని ప్రేయసి
కాబట్టి నా కంటే ఎక్కువే అతను ప్రాణం పెట్టాడు తన వాక్యాల్లో! ప్రాణం పెట్టలేక
నేను కొన్ని వాక్యాలు అట్లా వదిలేసినప్పుడు తనే విలవిల్లాడాడు నేను రాయలేని
వాక్యాల్లో! సందేహమేమీ లేదు, నేను
సైదాచారిలా రాయడానికి మళ్ళీ అతనిలానే పుట్టాలి. ఆ సున్నితత్వంతో, ఆ తాత్వికతతో, ఆ సంచార తపనతో పుట్టాలి. కనీసం
అతనిలోని నిదానంతో పుట్టాలి. వయొలిన్ యెంత నిదానంగా పాడుతుందో అంత నిదానం.
సైదాచారి మొదటి కవిత్వ సంపుటి
“ఆమె నా బొమ్మ” పద్దెనిమిదేళ్ళ కిందట వచ్చింది. అప్పటికే అది చాలా ఆలశ్యం. అంత
నిదానం అన్న మాట సైదా! ఆ కవిత్వ సందర్భం నాకు బాగా గుర్తుంది, ఎందుకంటే అప్పటికే చాలా కాలం
ఎదురు చూపుల్లోనే గడిచిపోయింది కాబట్టి.
అంత సుదీర్ఘ కాలంలోనూ సైదాచారి
రాసిన కవిత్వం కొంతే. ఇవాళ ఆ రెండు పుస్తకాలూ దగ్గిర పెట్టుకుని చదువుతూ, నేను అనేక కాలాల మధ్య సంచారం
చేస్తున్నా. 2010
లో నేనూ వంశీ కృష్ణా
కలిసి “అనేక” సంకలనం ఎడిట్ చేస్తున్నప్పుడు సైదాచారి తో ఎక్కువ సేపు మాట్లాడే
అవకాశాలు దొరికాయి. అప్పటికి ఏడాది కిందట అతని రెండో కవిత్వ సంపుటి “నీలం మాయ”
వెలువడింది, అంటే దాదాపు తొమ్మిదేళ్ళ తరవాత
రెండో పుస్తకం. 2010
లో రెండు పుస్తకాలూ
దగ్గిర పెట్టుకొని,
వొకే వొక్క కవిత
అనుకుంటే సైదాచారిని ఏ కవితలో పూర్తిగా చూడగలనా అన్న ఆలోచనలో పడ్డాం. నాకు ఎందుకో
“ఆమె నా బొమ్మ” కవిత్వం మీద కొంత సెంటిమెంట్ వుండేది అప్పట్లో.
ఎటూ తేల్చుకోలేక సైదాచారికి ఫోన్
చేస్తే, “నా కంటే నీకే బాగా తెలుసు, అఫ్సర్! నేను కవిత్వం అనేదొకటి
రాయక ముందు నించీ నువ్వు చూశావ్ నన్ను. నీకే వదిలేస్తున్నా!” అన్నాడు. అది యెంత
భారమైన బాధ్యత నా మీద పెట్టాడో ఇప్పుడు తలచుకుంటే భయమేస్తుంది. వొకటికి మూడు సార్లు సైదాకవిత్వం
చదువుతూ ఆలోచిస్తూ మధనపడుతూ వుండిపోయాను. నాకు నచ్చిన కవిత్వాన్ని నాకు
తెలీకుండానే పైకి చదవడం మొదలెట్టడం నా అలవాటు. అట్లా కనీసం అతని పది కవితలు పైకే
నాకు నేను వినిపించుకున్నాను. చివరికి వొక కవిత దగ్గిర సైదాచారి దొరికాడని
అనిపించింది. అది “ఒక సంచార తల్లి కోరిక.” ఆ కవిత నించే సైదాచారి గురించి
మాట్లాడాలి. ఆ కవితతోనే సైదాచారితో సంభాషణ వొక చివరకొస్తుంది. నిజానికి మళ్ళీ
మొదటికొస్తుంది. ఇప్పుడు అతని కవిత్వం తప్ప అతన్ని గురించి మాట్లాడాల్సింది
ఇంకేమన్నా ఉందా?
జీవితాన్ని చూస్తున్నాను, తల్లీ
అనుభవం కోసం బతుకుతున్నాను.
తల్లివైనా నువ్వు స్త్రీవి
నీ స్థావర,
నా జంగమాత్మక ప్రపంచాలు వేరు.
రజని అంటే పాట మాత్రమే కాదు!
చాలా సందర్భాల్లో రజని స్వరం వింటున్నప్పుడో, ఆయన సాహిత్యం నాలో నేను చదువుకుంటూ వున్నప్పుడో భావకవిత్వ ప్రభావాల నీడలు
మెల్లిగా చెదిరిపోయి, రజని మాత్రమే నిలువెత్తు రూపంలో
ప్రత్యక్షమవుతూ వుంటారు. ఇంతకుముందు రవీంద్రుడి వాక్యాల్లో చెప్పినట్టు- వొక
అందమైన చెట్టు ఆశ్చర్యపు మెరుపులతో నిలబడి ధ్యాన నిమగ్న అయినట్టు!
“అబ్బురంపు
శిశువు” రజనీకాంత రావు గారు వెళ్ళిపోయారు.
ఆయన వెనక కొన్ని లలిత గీతాల తొలకరి వాన పడుతూ
వుండగా. ఆ వాన చినుకుల మధ్యలోంచి పొన్న పూవూ ఛాయ పొగడ పూలా ఛాయ శ్రీసూర్యనారాయణుడు
మేలుకుంటూ వుండగా! అట్లాంటి పొగడ పూలా ఛాయ భానుడి వెలుగులోనే నేను ఆయన్ని చూస్తూ
వుండే వాణ్ని కొంత కాలం కిందట! అదీ బెజవాడ వెలుగులో! రజనీకాంత రావు గారి గురించి
మాట్లడడం అంటే కనీసం అయిదు పదుల బెజవాడ చరిత్ర గానమే. ఈ యాభయ్యేళ్ళలో బెజవాడ యెంత
మారిపోయిందో, యెన్ని రంగుల ఛాయలు అలదుకుందో అవన్నీ
గుర్తుకు తెచ్చుకోడమే.
అయితే, రజని సమక్షంలో ఆ చరిత్ర వొక దశాబ్దం దగ్గిర
గడ్డకట్టుకుపోతుంది. అది 1970. ఆ కాలాన్ని గురించి నాకంటే ఇంద్రగంటి
శ్రీకాంత శర్మ గారూ, పన్నాల సుబ్రహ్మణ్య భట్టు వంటి వారూ, ఇప్పుడు లేరు గాని, వుండి వుంటే నండూరి, పురాణం లాంటి వారూ బాగా చెప్పగలరు.
నేను ఆయన్ని 1984
ప్రాంతంలో
మొదటి సారి చూసి వుంటాను. బెజవాడ లబ్బీపేట, బందర్రోడ్డు అప్పుడు కాస్త సందడిగా వుండేది.
నేను వెంకటేశ్వర స్వామి ఆలయం వీధిలో వుంటే, పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు మసీదు సందులో
వుండేవారు. మా వెంకటేశ్వర స్వామి వీధిలోనే ఆంధ్రజ్యోతి ఆఫీసు వెనక రజనీకాంత రావుగారుండే
వారు. ఇప్పుడెలా వుందో తెలీదు కాని, అప్పట్లో ఆ వీధి ప్రశాంతంగా వుండేది. నా
చిన్ని ఇరుకు గదిలో నేనూ రుద్రభట్ల కిషన్ కాపురం వుండేవాళ్ళం. కిషన్ ని ఆ రోజుల్లో
రజని గారు “కిషనారా బేగం” అని ఆట పట్టించేవారు. మేమిద్దరమూ రజని గారబ్బాయి
వెంకోబుకి సన్నిహిత మిత్రులం. పొద్దున్నే
లేచి, బందర్రోడ్డులో రామకృష్ణ హోటల్ కి కాఫీ కోసం వెళ్ళేటప్పుడు మాకు రజని గారి కంఠం
వినిపించినట్టే అనిపించేది. ఎందుకంటే, ఆ రోజుల్లో ఆయన స్వరం వినకుండా రోజు గడిచేది
కాదు! అదే రోజుల్లో ఆయన సీజర్ (కుక్క పేరు)కి సంగీతం నేర్పిస్తున్నారు. అప్పుడప్పుడూ
అదొక వీనుల విందు, కన్నుల పండగ.
నాకు సాహిత్య చరిత్ర అంటే ఇష్టం కాబట్టి, రజనిగారి ప్రాణం తోడేసే వాణ్ణి- ఆ రోజుల కబుర్ల కోసం! ఆయన ఎక్కువ మాట్లాడడం
గుర్తు లేదు కాని, ప్రతి దానికీ పాట అందుకోవడం బాగా గుర్తుంది.
ఆ కాలంలో నాకు ఆసక్తి వున్న విషయాల్లో లలిత సంగీతం పుట్టుకా, బెంగాలీ సాహిత్యం. అయితే, ఆశ్చర్యంగా రజని ఆ సమయంలో హైదరాబాద్ చరిత్ర గురించి ముఖ్యంగా కులీ కుతుబ్ షా కాలం గురించి ఎక్కువ మాట్లాడేవారు. బహుశా, అది ఆయన ఆ రూపకం మీద పనిచేస్తున్న కాలమో, పని ముగించిన కాలమో,ఆ రూపక
ప్రదర్శన
విశేషంగా జరుగుతున్న కాలమో! అనేక విషయాల శాఖా చంక్రమణం జరిగినా, మా ఇద్దరికీ బెంగాలీ సాహిత్యం ప్రధానమైన ఆసక్తి. రవీంద్రుడి “గీతాంజలి” భిన్న
తెలుగు అనువాదాల్ని దగ్గిరగా చదువుతున్న కాలం. గీతాంజలి తెలుగు సేత విషయంలో నేను
బెల్లంకొండ రామదాసు పక్షం. చాలా మంది చలం పక్షం.
ఆ సమయంలో
రజని అన్న మాట నన్ను చాలా కాలం కుదిపేసింది. “గీతాంజలి కొంచెం overrated. మీరు Fireflies చదవండి. మీకు కవిత్వం అంటే ప్రేమ కాబట్టి
కవిత్వంలో ఉండాల్సిన క్లుప్తతా, సూక్ష్మ సౌందర్యమూ, సున్నితత్వమూ వాటిల్లో కనిపిస్తాయి.”
ఆ మాట విన్నాక కొద్దికాలం పాటు Fireflies లో లీనమైపోయాను. ఇప్పటికీ Fireflies చదువుతున్నప్పుడు రజని మాట గుర్తొస్తుంది.
నా ఆలోచనలు మెరుపుల్లా
ఆశ్చర్యాల రెక్కల మీద సవారీ చేస్తాయి
ఓ చిన్ని నవ్వు పొదువుకొని-
తన నీడని తానే తనివితీరా చూసుకొని
మురిసిపోతుంది చెట్టు
-తను అందుకోలేని తన నీడని!
ఇలాంటి వాక్యాలు చదువుతున్నప్పుడు అది ఆ కవి
ఏ కాలంలో రాసి వుంటాడో అన్న ఆలోచన వచ్చి, ప్రతి అంచనా తప్పయిపోయి, కవి ఊహాశక్తికి ఆశ్చర్యమేస్తుంది చాలా సార్లు.
నిజానికి రజని పాటలన్నీ అట్లాంటి ఆశ్చర్యాలే.
ఆయన “అబ్బురంపు శిశువు” మాత్రమే కాదు, అబ్బురమైన
కవి కూడా.
వొక వూహ చేయడంలో కవికీ, గేయ రచయితకీ చాలా తేడా వుంటుంది. గేయ రచయితకి
కవికున్నంత స్వేచ్ఛ లేదు. లయ అందమైన కట్టడి. కాని, రజని పాటలన్నీ జాగ్రత్తగా గమనిస్తే, ఆయన గేయ రచయితగా కంటే కవిగా ఎక్కువ సంచరించాడని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ పాటల
ఎత్తుగడలు గమనించండి. సాంద్రమైన భావన వెంటపడి వేధించే వొక కవి మాత్రమే
అందుకోగలిగిన ఎత్తుగడ అది. ప్రతి పాటలోనూ ఆ ఎత్తుకు తీసుకువెళ్లి, శ్రోతని అందంగా కట్టిపడేసే భావ లయ అది. రజని పాటల భాషలోనే చెప్పాలంటే, ఆ భావాలయ సమన్వితమైన అనుభవం ఇదిగో ఇలా వుంటుంది:
స్వప్నజగతిలో ఛాయావీణా
సమదశ్రుతులెవో
సాగునవే!
అంతరాళమున వింతరంగులెవో
అలసాలసములై
అలమునవే!
రెప్పపాటులో
కోటికోటి శశి
రేఖలాశలకు
యేగునవే!
కల్పనాకృతులు కథలు కథలుగా
కదలి మెదలి
చెలరేగునవే!
జన్మజన్మ
గతస్నేహమాధురులు
ఝరులు
ఝరులుగా మూగునవే!
తెలుగు సాహిత్యంలో భావకవిత్వం తీసుకువచ్చిన
కొత్త లక్షణాలూ అవలక్షణాలూ చాలా వున్నాయి. భావకవిత్వ వారసత్వంగా చెప్పుకోదగిన వొక
గొప్ప లక్షణం: భావ ధార కొనసాగినంత మేరా శబ్దలయా, సౌందర్యం కొనసాగడం! నిజానికి ఇది ఆంగ్ల
సాహిత్యంలో షెల్లీ, కీట్సులు సాధించినదే. ఈ ఇద్దరికీ భిన్నంగా
వర్డ్స్ వర్తు సాధించిన విజయం ఇంకోటి వుంది- అది అనుదిన జీవితానికి దగ్గిరగా భావ
శబ్ద లయల్ని అనుకరించడం. వర్డ్స్ వర్తు చేసిన ఈ పని వల్ల కాల్పనిక కవిత్వ వ్యాకరణం
మారింది. కచ్చితంగా అలాంటి పనే రవీంద్రుడు Fireflies
లో చేశాడు.
తెలుగులో కృష్ణశాస్త్రి గారి వంటి భావకవులకి భిన్నంగా రజని కనిపించడానికి కూడా ఇదే
కారణం అని నా అభిప్రాయం. జీవన సౌందర్యం ఎక్కడో వేరే ఊహాలోకంలో లేదని, ఇక్కడే మన చుట్టూ వుందని అటు వర్డ్స్ వర్తూ, మధ్యలో రవీంద్ర కవీ, ఇటు మనకి దగ్గిరగా రజని నిరూపించారని నేను అనుకుంటూ వుంటాను. ఉదాహరణకి రజని
పదిహేనేళ్ళ వయసులో రాసిన ఈ కవిత చదవండి:
జీవుడా! ఏల కనుగొన వీవు నన్ను
ఏను నీ ప్రక్కనే యుండగానే యిట్లు
మతములంబడి నా జాడ వెతకనేల?
హిందువుల గుళ్ళు కావు నా మందిరములు
తురకల మసీదులందు నే దొరకబోను
కాశికాపురి నా గృహాంగణము కాదు
కాదు మక్కాపురంబు నాకాపురంబు
ముడుపులకు మ్రొక్కులకు మోము జూప
యోగశక్తిచే తపము చే లొంగబోను
నిజముగా నన్నుచూడ యత్నింతు వేని
చెంతనే యున్న నను నీవు చేరగలవు.
1935లో రాసిన ఈ ఖండిక వెనక బలమైన సామాజిక రాజకీయ కారణాలు వుండడం మాట అటుంచి, దేవుడి కన్నా అతి ఉన్నతమైన స్థానంలో మనిషిని నిలబెట్టిన కవి రుషి పరంపరని రజని
ఇక్కడ అక్కున చేర్చుకుంటున్నారు. కర్మకాండల కింద మాయమైపోయిన మాధవ రూపాన్ని
నిర్గుణ కాంతిని చేరుకునే ప్రయత్నం గురించే ఆయనా మాట్లాడారు. “చెంతనే” వుండడం
అన్నది ఆయన భిన్న సంస్కృతుల సాహిత్య సాంప్రదాయాల దీపంలో నేర్చుకున్న పాఠమే.
అట్లాగే, కవిత్వ శిల్ప పరంగా చదువరిని కాకుండా శ్రోతని
అందలమెక్కించడం కూడా ఆ పరంపరే.
ఆధునికత వెలుగులో తెలుగు కవిత్వానికి రజని
అందించిన సుగుణం ఇది. అందుకే, చాలా సందర్భాల్లో రజని స్వరం వింటున్నప్పుడో, ఆయన సాహిత్యం నాలో నేను చదువుకుంటూ వున్నప్పుడో భావకవిత్వ ప్రభావాల నీడలు
మెల్లిగా చెదిరిపోయి, రజని మాత్రమే నిలువెత్తు రూపంలో ప్రత్యక్షమవుతూ
వుంటారు. ఇంతకుముందు రవీంద్రుడి వాక్యాల్లో చెప్పినట్టు- వొక అందమైన చెట్టు
ఆశ్చర్యపు మెరుపులతో నిలబడి ధ్యాన నిమగ్న అయినట్టు!
1984 ఆ ప్రాంతాల్లో మా బందర్రోడ్డు ఆంధ్రజ్యోతి వెనక మూడు సందులూ చాలా సందడిగా
వుండేవి. మసీసు సందులో పురాణం గారింట్లో “సాక్షి” క్లబ్ సమావేశాలు. మా వెంకటేశ్వర
స్వామి సందులో నిరంతరం రచయితలూ కవుల రాకపోకలూ. ఇక ఆంధ్రజ్యోతి అప్పట్లో సాహిత్య
కేంద్రమే! వీటన్నీటి మధ్యా ఇవేమీ పట్టకుండా తన పాటల తపస్సులో తానూ నిండా మునిగి
వుండేవారు రజని. తనదైన ప్రశాంత మందిరమేదో నిర్మించుకొని అందులో లీనమై పోయిన యోగి.
పాటతో మాత్రమే జతకట్టి, ఇంకే తొందరలూ పెట్టుకోకుండా “స్వప్న జగతిలో
ఛాయా వీణా/ సమద శృతులేవో” సాగుతూ వుండగా- రజని వెళ్ళిపోయారు! కాని, ఎందుకో పాట ఇంకా పూర్తికాలేదనిపిస్తోంది. ఆయన ఇంకా పాడుతూనే ఉన్నారనీ
అనిపిస్తోంది.
*
“సంపూర్ణ అనే
సంస్కృతం పదం వాడను కాని, పూర్తి జీవితం
ఎలా వుంటుందో నాకు ఇంకా తెలియదు, తెలుస్తుందన్న
నమ్మకమూ లేదు. కాని, “యాది” చదివాక ఆ
పూర్తి జీవితంలోని కనీసం ఒక కోణం నాకు తెలిసింది. జీవితం ఒక పదిలమయిన యాది ఎలా
అవుతుందో తెలిసింది. నలుగురు మనుషుల మధ్య జీవితం పండగ అవుతుందని తెలిసింది. “యాది”
నేను ఎప్పుడూ తలుచుకునే పుస్తకం”
ఈ మాటలు నావి
కావు.
తెలుగు
సాహిత్యానికి – ఆ మాటకొస్తే సాహిత్యానికే – పూర్తిగా కొత్త వాడయిన బ్రైస్
రాబిన్సన్ అనే వొక అమెరికన్ విద్యార్థి సదాశివ గారి “యాది” లో కొన్ని భాగాలు చదివి
రాసిన వ్యాఖ్య.
టెక్సస్
యూనివర్సిటీలో రెండేళ్ళ పాటు తెలుగు నేర్చుకున్న బ్రైస్ “ఇప్పటి దాకా మా చేత మంచి
తెలుగు కథలు చదివించారు. ఇప్పుడు కొన్ని జీవిత కథలు – ఆత్మకథలు- చదివించండి” అని
అడిగినప్పుడు సదాశివ “యాది”, తిరుమల రామచంద్ర
“హంపీ నుంచి హరప్పా దాకా”, శ్రీపాద
“అనుభవాలూ-జ్ఞాపకాలూను” నించి కొన్ని భాగాలు చదివించాను. ఈ విధంగా వాటిని చదివిన
వాళ్లలో అయిదుగురు అమెరికన్ విద్యార్ధులు, పదమూడు మంది
అమెరికన్-భారతీయ విద్యార్థులలో బ్రైస్ వొకడు. అందరికీ బాగా నచ్చిన పుస్తకం “యాది”. రమ్య అనే మరో అమెరికన్ తెలుగమ్మాయి ఇప్పటికీ
ఫోన్ చేస్తే, “యాది గుర్తొస్తుంది. అప్పుడప్పుడూ చదువుతున్నాను.
సదాశివ గారి కొత్త పుస్తకాలు వుంటే చెప్పండి” అంటుంది.
కొత్త పాఠకులు
ఎలా తయారవుతారన్నది ఎప్పటికీ పెద్ద ప్రశ్నే. మరీ ముఖ్యంగా, వ్యాపార విలువలు చుట్టుముట్టిన కాలంలో నిజమయిన
సాహిత్యానికి స్థానం వుందా , కొత్త తరంలో
పాఠకులు తయారవుతున్నారా అన్నవీ ప్రశ్నలే! ఈ మధ్య చాలా మంది సాహిత్య మిత్రులు
“సాహిత్య సభలకి వచ్చే వాళ్ళలో అందరూ నలభై దాటిన వాళ్ళే. అసలు పాఠకులు అంటూ కొత్త
తరంలో వుండడం లేదు. ఈ సంగతులు మాట్లాడే వాళ్ళు ఎక్కువ నలభై ప్లస్ వాళ్ళే” అనడం
విన్నాను. పాతిక-ముప్ఫై అయిదు ఏళ్ళ వాళ్ళలో పాఠకులు తక్కువ అనీ విన్నాను.
అలాంటి సమస్య అమెరికాలో కూడా లేకపోలేదు కాని, భాషలకి అమెరికన్ విశ్వ విద్యాలయాల్లో వున్న
ప్రాధాన్యం వల్ల, రాయడం అనే
ప్రక్రియ మీద పెరుగుతున్న శ్రద్ధ వల్ల కొత్త తరంలో పాఠకులు తగ్గే ప్రమాదం లేదు. ”
యాది చదివాక రాయడం/ చదవడం అంటే నాకు ఇంకాస్త ప్రేమ పుట్టింది. తెలుగులో రాయడం ఇంకా
బాగా నేర్చుకోవాలి.” అన్నాడు ఆస్టిన్ సీర్స్ అనే విద్యార్థి వొక సారి క్లాసులో.
ఆస్టిన్, బ్రైస్ లకి తెలుగు ‘తల్లి భాష’ కాదు,కాని రమ్య కరీం నగర్ లో పుట్టి, టెక్సస్ లో పెరిగిన అమ్మాయి. తెలుగులో “దోస్తు”
“జర” “పరేషాన్” లాంటి కొన్ని మాటలు తప్ప అన్నీ మరచిపోయింది. “నేను జరంత తెలంగాణ
తెలుగు చెప్త. అందరు నవ్వుతరు” అనేది.తెలుగు మాట్లాడానికి జంకేది. సదాశివ గారి
“తెలంగాణా వాళ్లకి తెలుగు రాదా?” అన్న వ్యాసం
చదివాక రమ్యలో తన భాష పట్ల మమకారం పెరిగింది. “ఎవరేమనుకున్నా గిట్లనే చెప్త” అని, హాయిగా మాట్లాడ్డం మొదలు పెట్టింది. “ఏ పుస్తకం
చదివాక అయినా భాష మీద ప్రేమ పుట్టాలి.” అనే వాడు ఆస్టిన్. ఈ ప్రేమ ఎంత దూరం
వెళ్ళిందంటే, వాళ్ళు టెక్సస్
లో చదువుకున్నంత కాలం నేను చెప్పిన ప్రతి సాహిత్యం కోర్సులోనూ చేరారు. “సాహిత్యం
ఇప్పుడు మా జీవితాల్లో వొక భాగం.” అంటాడు ఆస్టిన్ ఇప్పటికీ. అలాంటి ప్రేమని మన
ఆలోచనల్లోకి వొంపడం కన్నా సాహిత్యం చెయ్యాల్సిన గొప్ప పని ఇంకోటి ఏముంది?
*
సదాశివ గారి గురించి
కొత్త తరం అంటున్న ఈ మాటలు వింటున్నప్పుడు నాకు నా బడి జీవితం గుర్తు వచ్చింది.
నేను బడిలో ఏ నాడూ తెలుగు మీడియం చదవ లేదు. మొదట తప్పని సరయి ఉర్దూ, తరవాత కాన్వెంటు
ఇంగ్లీషు రాపిడి…ఇంగ్లీషు కవిత్వం మీది వ్యామోహం…షెల్లీ, కీట్సులని బట్టీ కొట్టి వాటిని ఎడపెడా
అనుకరించిన ఇంటర్ బతుకూ…ఈ స్థితిలో మా ఇంటికి వొక పుస్తకం చేరింది. దాని పేరు
“ఫారసీ కవుల ప్రసక్తి.” ఆ పుస్తకం లోపలి పేజీలో వొక కనికట్టు లాంటి అక్షరం. నీలి
సిరాలో ఎప్పటికీ మరచిపోలేని అంధమయిన దస్తూరి. అది సదాశివ గారి సంతకం.
బ్రైస్, ఆస్టిన్, రమ్య లాంటి
వాళ్లకి వచ్చే సరికి సదాశివ గారి కొన్ని పుస్తకాలు అయినా అందుబాటులోకి వచ్చాయి.
పుస్తకాల అందుబాటు విషయానికి వస్తే, ఈ తరం చాలా
అదృష్టం చేసుకుందని చెప్పి తీరాలి.
అప్పుడు మా ఇంట్లో సదాశివ గారి “ఫారసీ కవుల ప్రసక్తి ” తో పాటు, ఆయన అనువాదం చేసిన “ఉర్దూ సాహిత్య చరిత్ర ”
మాత్రమే వుండేది. అవి రెండూ నాకు కనీసం వొక రెండేళ్ళ పాటు మెదడుకి మంచి మేత
పెట్టాయి. కాని, “ఫారసీ కవుల
ప్రసక్తి” మాత్రం ఇప్పటికీ నెలకి వొక సారి అయినా చదువుతూ వుంటాను. దాదాపు
పాతికేళ్ళ పైబడి నా పాఠక
హృదయంలో పీట
వేసుకున్న ఈ పుస్తకాల గురించి నేను అనాలనుకున్న మాటలు ఈ పరదేశీయులు అంటూ వుంటే –
ఒక పఠనానుభవాన్ని చక్కగా మాటల్లోకి వొదిగించిన వాళ్ళ వ్యక్తీ కరణ శక్తికి
ముచ్చటేసింది. కొత్త తరం వాళ్ళు పుస్తకాల గురించి ఏం మాట్లాడుకుంటారా అని ఆసక్తిగా
వెతుక్కుంటాను నేను. కొన్ని మాటలు విపరీతమయిన వాడుక వల్ల మన దగ్గిర అరిగిపోతాయి.
కాని, కొత్త వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనకి కొత్త
పదాలు దొరుకుతాయి. కొత్త పదాలు అంటే కొత్త భావనలు కూడా.
“రక్తస్పర్శ” కవిత్వంలో కొత్త ప్రతీకల్నీ, పదచిత్రాల్నీ తలుచుకున్నప్పుడల్లా- సీతారాం అనే
వాడు – ” నీ కవిత్వంలో ఉర్దూ, ఫారసీలు నీకు
తెలీకుండానే వచ్చేశాయేమో?!”అని! ఆ కవిత్వం
ఆ కాలంలో ఎందుకు అంత కొత్తగా అనిపించిందో ఇప్పటికీ పూర్తిగా తెలీదు. కాని, సీతారాం చాలా పాసింగ్ గా అన్న ఆ మాట ఆ
కవిత్వంలోకి ఒక రహస్య ద్వారం కావచ్చు. పాఠకుడిగా మన లోపల స్థిరపడి వున్న కొంత మంది
కవుల నించి తప్పించుకోవడం అంత తేలిక
కాదు. సదాశివ
గారు కవి కాదు, కాని, అనేక మంది ఉర్దూ, ఫారసీ కవులని మన మనసుల్లోకి తీసుకువచ్చిన వచన
వాహిక. ఆయన అందించిన తీగ పుచ్చుకొని, ఆ ఉర్దూ, ఫారసీ డొంకల్ని కదిలిస్తూ మనలో కొందరి కొంత ప్రయాణం సాగింది. ఇక్బాల్ చంద్ కవిత్వంలో
కూడా ఈ తీగల సున్నితమయిన పరిమళం, తీయని గాయాల
నెత్తుటి గీతలూ వుంటాయి.
అలా సాగి సాగి.
సదాశివ గారి పుణ్యమా అని- ఇప్పుడు హఫీజ్ దగ్గిర దిగాలుగా కూలబడి పోయాను నా మటుకు
నేను. ఎప్పుడో పదమూడో శతాబ్దం నాటి ఈ పురాకవి ఇప్పుడీ క్షణాన నన్ను ఎంత క్షోభ
పెడ్తున్నాడో మాటల్లో చెప్పలేను.
“ఆసవ పాత్ర
యట్టడుగు నందొక చుక్కయె నిల్చెనేని తె
మ్మా సఖి! దుమ్ము చల్లెద నిహమ్ము పరమ్మును రెంటి పైన
అన్న వాడిని, ఆ పలుకులోని
వాడినీ తెలియచెప్పిన సదాశివ గారికి ‘ఖదంబోసి’ చెప్పకుండా వుండడం సాధ్యమా?
*
సదాశివ గారి
కృషి కేవలం భాషకి సంబంధించింది మాత్రమే అనుకుంటే పొరపాటు. ఆయనకి ఉర్దూ ఫారసీకాల
మీద వున్న ప్రేమని కొంచెం సేపు పక్కన బెట్టి, వొక దీర్ఘ కాలిక
ప్రసవ వేదనలా ఆయన అరవయేళ్ళుగా చేస్తున్న ఈ పని మొదలయ్యింది 1950 ల ప్రాంతంలో- ఇప్పుడు ఈ మాట కొంత మందికి కోపం
తెప్పించవచ్చు కానీ, తెలుగు భాష
ప్రాతిపదికగా ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రం వల్ల తెలుగు బాగా నష్టపోయింది. అందుకే, సదాశివ గారు ఎక్కడో రాసినట్టు గుర్తు – “నవంబరు
వొకటి తెలుగుకి బ్లాక్ డే” అని! అది ఎంత నిజమో ఈపాటికి మనకి అనుభవం అయ్యి వుండాలి.
రాజకీయంగా కంటే, సాంస్కృతికంగా
ఇది పెద్ద కుదుపు. తెలుగుకీ ఉర్దూకీ వున్న బంధం ఇక్కడిన్ నించి తెగిపోయింది.
ఇప్పుడు ఉర్దూ రాని/చదవలేని ముస్లిం తరం రావడానికీ, ఉర్దూ అనేది పరభాష కావడానికీ విష బీజం పడిన
కాలం అది. రాజకీయాలు ఎక్కించిన ఈ విషాన్ని తొలగించి, మన వొంట్లో మన అసలు రక్తం ఎక్కించడానికి చాలా
నిశ్శబ్దంగా కలం పట్టి పోరాడుతున్న యోధుడు సదాశివ గారు.
ఈ రక్తం అన్ని
జాతుల ప్రజలది. అన్ని భాషల కలయిక. దేశ దేశాల నించి వచ్చిన వాళ్ళు ఉర్దూని వొక
ఆసరగా చేసుకుని అల్లుకున్న మల్లె తీగ. అలాంటి ఉర్దూ తరవాత తరవాత ముస్లిం ల భాషగా
మాత్రమే మిగిలే దుస్థితి ఎలా ఏర్పడిందో సుతిమెత్తగా గుర్తు చేస్తూ వస్తున్న
బుద్ధిజీవి సదాశివ. 1948 తరవాత నించి 1950 మధ్య కాలంలో తెలుగు-ఉర్దూ భాషల మధ్య అప్పటి
దాకా కట్టిన మంచితనపు వంతెనలన్నీ కుప్పకూలిపోయాయి. ఈ సాంస్కృతిక విషాదాన్ని
రికార్డు చేసే ఆధారాల కోసం నేను గత కొంత కాలంగా వెతుకుతున్నాను. అలా దొరికిన
వాళ్ళలో – కవిరాజ మూర్తి, నెల్లూరి కేశవ
స్వామితో పాటు సదాశివ గారు వొకరు. ఈ వైపు ఇంకా నా పని కొన సాగుతూనే వుంది. అయితే,మిగతా వారి కృషికీ, సదాశివ గారి కృషికీ వొక తేడా వుంది. మిగిలిన
వారు సృజనాతంక రంగాలలో పనిచేసిన వారు. భాషా సాంస్కృతిక చరిత్రకి, ఆనుభవిక కోణాన్ని జత చేసి, తన చుట్టూరా చూసిన/అనుభవించిన కాలాన్ని చరిత్ర
చేస్తున్న అరుదయిన వ్యక్తి సదాశివ.
ఇంటి ముందో వెనకో ఏదో వొక పువ్వు పూసే చెట్టు వుంటే, ఎంత బాగుంటుందో! సదాశివ గారు మన మధ్య వుండడం
అంత పరిమళభరితమయిన అనుభూతి.
నా అదృష్టం బాగుండి, ఇప్పటి దాకా –
చింతకాని నించి ఆస్టిన్ దాకా- ఏదో వొక చెట్టు మా ఇంటి ముందో వెనకో వుంది.
పొద్దున్నే లేచి, చాయ్ చప్పరిస్తూ
ఆ చెట్టు కింద నిలబడి అవి రాల్చే పూల స్పర్శలో పొద్దు చురుకెక్కుతుంది. ఈ పరదేశపు
చెట్టు చుట్టూ పరిమళం వేప పూత పరిమళం లాగా వుంటుంది. అది నిజంగానే ఆ వేప పూత
పరిమళమో, లేక నేను చేసుకున్న పరిమళానువాదమో/ఇచ్చానువాదమో తెలీదు. కాని, ఈ చెట్టు నా చెట్టే, ఈ పరిమళం ఆ వేప చెట్టుదే అనుకునేంత బలంగా నా
పొద్దులో కలసిపోయింది. సదాశివ గారి ఉర్దూ, ఫారసీ లోకం కూడా
అలానే మన లోకం అయిపోయింది ఇప్పుడు. ఆ రెండు భాషలకి మనం గత కొంత కాలంగా ఆపాదిస్తూ
వచ్చిన పరాయీ భావనని చెదరగొట్టే ప్రభావం ఆయనది.
ఈ పొద్దు పరిమళ
విహీనం కాక ముందే, వొక్క సారి
ఆయన్ని పలకరించి వద్దామా?! ఆయన మన కోసం
వెతికి పట్టుకొచ్చిన పూల వాసనల యాది
కొంత అయినా దాచుకుందామా?
*
చరిత్ర
భాష అతనికి తెలుసు. సంక్లిష్టమయిన పూర్వ ఆధునిక గతాన్ని
అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్టు, వొక
మరచిపోలేని కథలాగా చెప్పడం ఆయనకే సొంతమయిన శైలి. ఆయన వచనంలో నిన్నటి చరిత్ర కళ్లకి కట్టినట్టు మన
ముందు నిలబడుతుంది. ఆయన పేరు రిచార్డ్ మాక్స్ వెల్ ఈటన్ .
ఈ మధ్యనే ఆయన 1300 నుంచి 1761 వరకూ కాలాన్ని తీసుకుని రాసిన దక్కను చరిత్రని
కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం అచ్చు వేసింది. ఇందులో ఆయన మనకు తెలిసిన సర్వాయి పాపడు, ప్రతాప రుద్రుడు, రామరాయలు, మహమూద్ గవాన్ ల వంటి చారిత్రక
వ్యక్తుల గురించి మనకి తెలియని చరిత్ర కోణం నుంచి రాశారు.
ఈ
పుస్తకం నిండా మనకు తెలిసిన మన వరంగల్లు, దేవగిరి, బీదరు, గోల్కొండ, తిరుపతి, షాపూర్ , తెలంగాణా లాంటి ప్రదేశాలు కొత్త
ఆధారాల వెలుగులో తళుక్కుమంటాయి. కథ చెప్పడమంటే ఈటన్ కి భలే ఇష్టం! ఆ కథల్లో తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, ఫారసీ, బెంగాలీ భాషల అందాలు వాటి వాటి సహజ
అందాలతో, జీవకళతో కళ్ల ముందు కదలాడతాయి. ఈటన్
తో మాట్లాడ్డం అంటే – ఆ భాషలతో, వాటి
గతంతో సంభాషణే! ఆయన చరిత్ర పుస్తకాలు చదవడం అంటే ఆ అపూర్వమయిన పూర్వ ఆధునిక
కాలాల్లో సంచారమే!
ఏడాదికి వొక సారి మాడిసన్ లో జరిగే
దక్షిణాసియా సదస్సుల మేళాలో నాలుగేళ్ల క్రితం మొదటి సారి ఈటన్ తో నాలుగు మాటలు
కలిసినప్పుడు గొప్ప ఆనందం. అదే సమయంలో ఆయన దక్కను చరిత్ర పుస్తకం పూర్తి అయ్యింది.
వ్యక్తుల జీవితాల్ని ఆధారంగా తీసుకుని చరిత్ర రాయడమనే కొత్త ప్రక్రియకి ఆయన ఓనమాలు
దిద్దిస్తున్నారు. సర్వాయి పాపడు జీవితంలోంచి తెలంగాణా చరిత్రని చూడడం, రామరాయలు కథలోంచి గోల్కండ, విజయనగర చరిత్ర వినిపించడం లాంటివి
చాలా మందిని ఆకట్టుకున్నాయి. అసలు వ్యక్తి, సమాజ
చరిత్ర, రాజకీయాలు, సంస్కృతి కలగలిసే చోటులోంచి చరిత్రని
చూడాలన్న తపనకి శాస్త్ర ప్రతిపత్తి కలిగించిన ప్రయాణం అది. ఆయన ఈ కొత్త దారిలో
ఎందుకు వెళ్లారా అన్నది ఆసక్తికరమయిన అన్వేషణ. ఈ సారి ఆయన దృష్టి దక్కనులోని పూర్వ
ఆధునిక దుర్గాల మీదికి మళ్లింది. ఆ దుర్గాలు అధికార కేంద్రాలుగా మారడం, వాటి వాస్తుకీ, అప్పటి రాజకీయ సామాజిక జీవనానికీ
వున్న చుట్టరికం ఎలాంటిదన్న ప్రశ్న వైపు ఆయన ఆలోచన వెళ్లింది. గత వారం టెక్సస్
విశ్వ విద్యాలయం ఆసియా విభాగం ఏర్పాటు చేసిన సదస్సులో ఆయన దక్కనీ రాజుల కోటలూ
దుర్గాల వాస్తు మీద చేసిన ప్రసంగం తర్వాత మేం ఆయనతో మాటల్లో పడ్డాం. ఆ మాటలు
మరునాడు దాకా సాగాయి. ప్రశాంతమయిన ఆస్టిన్ ఫోక్ హౌస్ మీద చలికాలపు పొద్దుటి సూర్యుడి
బలహీనమయిన కిరణాలు పడుతున్నప్పుడు – మంచి
బ్రేక్ ఫాస్ట్ , వేడి వేడి కాఫీ కడుపులో పడ్డాక – మా
వేడి వేడి కబుర్లు మొదలయ్యాయి. మాతో పాటు ఇప్పుడిప్పడే బెజవాడ కనక దుర్గమ్మ చరిత్ర
మీదా, తెలంగాణా బతుకమ్మ మీదా ప్రేమ పెంచుకుంటున్న నా విద్యార్ధి
జాన్ రోజ్ కూడా వున్నాడు. దక్కను చరిత్ర గురించి ఈటన్ మాట్లాడుతున్నప్పుడు ఈ
దక్కనీ చరిత్ర పరిశొధక పుటల్లో తను ఏ పంక్తిలో వున్నానా అని వెతుక్కుంటున్నట్టుగా
వున్నాడు జాన్ . అసలు ఏది దక్కను, దాని
పటం ఎందాకా వుంది అన్న ప్రశ్నలో తలమునకలయ్యి ఎక్కడ తేలాలో ఎక్కడ మొదలు పెట్టాలో
తెలియని స్థితిలో “అసలు చిన్న ప్రశ్నలతో మొదలెడదాం. ఆ తర్వాత ఎక్కడయినా పెద్ద
గంగలో మునకేద్దాం” అన్నాను నేను. ఆ తర్వాత మూడు గంటల పాటు ఏకధారగా సాగిపోయింది
సంభాషణ.
ఈటన్ కీ, నాకూ వొక చోట చుట్టరికం వుంది. అది
దక్కనీ ఇస్లాం. కాని,
దక్కనుని అర్ధం చేసుకోవడానికి
ఇస్లాం ఎంత ముఖ్యమో,
అట్టడుగు ముస్లిమేతర కులాల
చరిత్ర, మత పద్దతులు కూడా కీలకం అని నా వాదం.
దాంతో ఆయనకి ఎలాంటి పేచీ లేదు కాబట్టి మా మధ్య మాటలు బాగా నడిచాయి. పక్కనే వున్న
జాన్ కి దక్కను గొడవ మరింత అర్ధం అవ్వడానికి
ఆయన మా మాటల్లోని సాంద్రతని కొంత తగ్గించారు కూడా. అయినా, సంక్లిష్టంగా మాట్లాడడం, రాయడం ఆయన శైలి కాదుగా!
గుంటూరు
పెద్దాయనా – దక్కను సూఫీల కథలూ
దక్కను మీద మీకు ఆసక్తి ఎలా కలిగింది?
– నిజానికి అది నా బుర్రలోంచి వచ్చిన ఆలోచన కాదు. పీ ఎచ్ డి కోసం
మాడిసన్ – విస్కాన్సిన్ వెళ్లాను. అప్పుడు అక్కడ ప్రొఫెసర్ రాబర్ట్ ఫ్రైకెన్ బర్గ్
వున్నారు. ఆయన మీ గుంటూరు వాడే. అక్కడ పెరిగిన వాడు. గుంటూరు మీద మంచి మోనోగ్రాఫ్
రాశాడు. నేను మాడిసన్ లో చదువుకుంటున్న కాలంలో ఎక్కువ మంది ఉత్తరాది మీదా, ఇస్లాం మీద ఆసక్తి వున్న వాళ్లు అయితే
మొగల్ చరిత్ర మీదా పని చేసేవాళ్ళు.
ఎవర్ని అడిగినా, మొగల్ …మొగల్ అనే వాళ్లు. దానికి భిన్నంగా ఏమయినా చెయ్యాలనుకున్నాను. సరే, ఫ్రైకెన్ బర్గ్ కి దక్షిణ భారతం అంటే ప్రేమ. బీజపూర్ , అహ్మద్ నగర్ , గోల్కండ….ఈ దిక్కు ఆలోచన
చెయ్యమన్నారాయన. ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్లి పాత కవిలె కట్టలు వెతుకుతూంటే, సూఫీ ఫక్కీర్ల కథలు పర్షియన్ లో
దొరికాయి. దాంతో నా దృష్టి అటు మళ్లింది. దక్కనీ ఇస్లాం నన్ను ఆకట్టుకుంది.
ఒక చరిత్రకారుడిగా సూఫీల పాత్రని మీరు
ఎలా అంచనా వేస్తారు?
– చాలా మంది పరిశోధకులు సూఫీల్ని ఈ
లోకంతో అసలే మాత్రం సంబంధం లేని పరలోక జీవులుగానే చూశారు. ముఖ్యంగా ఇస్లాం మీద
జరిగిన చాలా పరిశోధనలు ఆ దిక్కు గానే వెళ్లాయి. ఇప్పటికీ అలానే వెళ్తున్నాయి.
ఇస్లాం, సూఫీ ల సామాజిక పాత్రని చాలా మంది
పట్టించుకోవడం లేదు. అసలు ఆయా కాలాల్లో ఈ సూఫీలు ఏం చేశారు? వాళ్ల కథలూ, వాళ్లు వున్న ప్రదేశాలూ చిన్న చిన్న
దక్కనీ పల్లెల్లో కూడా ఎందుకంత ప్రభావాన్ని చూపిస్తున్నాయి? అసలు వీళ్లు కొత్తగా సమాజంలో ఏం
చెయ్యడం మొదలు పెట్టారు? ఈ మూడు
ప్రశ్నలే నేను పదే పదే వెతుక్కుంటూ వచ్చాను. మతం సామాజిక పాత్రని గురించి మాక్స్
వేబర్ లాంటి వాళ్లు చాలా చెప్పారు. అసలు ఈ సూఫీలు దక్కనులో ఎవరు? వీళ్లు పండితులా? సంస్కర్తలా? అసాధారణ శక్తులున్న “దైవ” దూతలా? వాళ్లు కేవలం ఇస్లాం సైనికులా? సమాజానికి వీళ్ల అవసరం ఎందుకొచ్చింది? అనుకుంటూ , వాళ్ల సామాజిక చరిత్రని తవ్వుకుంటూ
వెళ్లాను. ప్రపంచ వ్యాప్తంగా అనేక రకాల సూఫీలు వున్నప్పుడు, ప్రత్యేకించి దక్కనీ సూఫీలు ఎవరు? ఆ దక్కనీ తనం ఏమిటి? అన్నది నా ప్రశ్న. అది అంత తేలికపాటి
ప్రశ్న కాదు. ఇన్నాళ్లుగా నేను చేస్తూన్న పని అంతా ఆ ప్రశ్నకి సామాజిక కోణం నించి
జవాబు రాబట్టడం ! ఇది అంతకు ముందు సూఫీవాదాన్ని కేవలం మార్మిక ధోరణిగా చూసిన
దానికి భిన్నమయిన దారి.
హైదరాబాద్ లో దొరికిన సూఫీ జీవిత కథలు
ఈ అభిప్రాయాన్ని ఎలా మార్చాయి?
ఈ జీవిత కథలు మామూలుగా చదివినా, చప్పున
స్ఫురించే సంగతి వొక్కటే: సూఫీలు పరలోకమే పరమార్ధంగా బతకలేదు అని! మార్మిక
వాదాన్ని నేను పూర్తిగా కాదనడం లేదు. కాని, వాళ్లు
ఈ లోకంలో వుంటూ, ఇక్కడ కచ్చితంగా కొన్ని అక్కరకొచ్చే
పనులు చేశారు. ఆ పనుల గురించి మాట్లాడితే తప్ప, వాళ్ల
పాత్ర గురించి సరయిన అంచనా వెయ్యలేం. బీజపూర్ సూఫీల మీద రాసిన పుస్తకంలో ఆ ప్రయత్నం చేశాను.
దక్కను సూఫీ జీవిత కథలు అంతకు ముందు నాకు సూఫీ వాదం మీద వున్న అభిప్రాయాల్ని
పూర్తిగా మార్చి వేశాయి. సూఫీలు వొక కొత్త ప్రేమపాఠాన్ని మనకు నేర్పించడం
మొదలెట్టారు. సమాజంలోని భిన్న వర్గాల మధ్య వుండాల్సిన కొత్త బంధాన్ని గుర్తు
చేశారు. ఆ బంధానికి కావలసిన కొత్త సూత్రాలు మార్మిక వాదంలో లేవు. ఈ సమాజంలోనే
వున్నాయి. మధ్య యుగ భారతానికి వాళ్లు మైలు రాళ్లు, ఆశాకిరణాలు.
చరిత్ర ఆధారాల్ని సునిశితంగా చూస్తే, ఇస్లాం
గాని, సూఫీ వాదం గాని కత్తులూ కటార్లతో
విస్తరించిన భావన కాదని మనకి
అర్ధమవుతుంది. సూఫీలు ప్రతిపాదించిన కొత్త ప్రేమ, కొత్త
బంధాల సూత్రాలు ముస్లిమేతరులని సున్నితంగా కట్టిపడేశాయి. వూరూరా తిరిగిన సూఫీ
మునులు జనజీవనంలో భాగమయ్యారు తప్ప వూళ్లకి దూరంగా బతకలేదు. అలా బతుకుతున్నప్పుడు
వాళ్లు ఉన్నతమయిన కొత్త ఆలోచనల్ని జనంలోకి తీసుకు వచ్చారు. ఆ ఆలోచనల ఆనవాళ్లు
పట్టుకునే పని చెయ్యడం ముఖ్యం అనుకున్నాను.
అలా ఆలోచిస్తున్నప్పుడు మీకు వెంటనే
దొరికిన ఆధారం ఏమిటి?
చాలా మంచి ప్రశ్న. నేను రకరకాల పుస్తకాలు, కవిలె కట్టలు గాలిస్తున్నప్పుడు, అనేక మందితో మాట్లాడుతున్నప్పుడు
ఎప్పుడూ ఈ ప్రశ్న నన్ను వుక్కిరి బిక్కిరి చేసేది. అలా మధన పడగా, పడగా దొరికిన జవాబు : ఆ కాలంలో జనం
వాడిన భాషే మొదటి పనిముట్టు అని. దక్కనీ అని పిలుస్తున్న ప్రాంతాల్లో జనం భాష
ఏమిటి? మీరు తెలుగు ప్రాంతాలు అని
పిలుస్తున్న ప్రాంతాల్లో ఇప్పటికీ జనం వొకే వొక్క తెలుగు మాట్లాడుతున్నారా? మీరు చెప్పండి. లేదు కదా! తెలుగుతో
పాటు ఇతర భాషలు మాట్లాడుతున్నారు. ఆ భాషలు ఏమిటి? వాటి
వాటి సామాజిక పాత్రలు ఏమిటి? అన్న
ప్రశ్న ఇప్పుడు కూడా ముఖ్యమే! చాలా ముఖ్యంగా ఉర్దూ, ఫారసీలు. అవి కేవలం రెండు వేరే భాషలు కావు. ఆ భాషలు జన జీవనంలోకి అడుగు పెట్టాక చాలా మార్పు
వచ్చింది. అది ఎలాంటి మార్పు? వొక
భాష బతుకుని మారుస్తుందా? మారుస్తుంది.
ముందు భావనలు మారతాయి. మొత్తంగా దక్కను ప్రాంతం భాషకి దక్కనీ అస్తిత్వమే వుంది.
తెలుగు, కన్నడ, మరాఠీ., ఉర్దూ వీటన్నిటికీ వాటి వాటి
విశిష్టతతో పాటు దక్కనీ గుణం వుంది. అది మన అవగాహనకి చాలా అవసరం. ఏది దక్కను? అన్న ప్రశ్నకి మనం చాలా రాజకీయ కారణాలూ, భౌగోళిక పరిమితులూ వెతుకుతాం గాని, ఆ భాష ఎందాకా వుంది, ఎలా వుంది అన్నది చూడాలని అనుకుంటాను
నేను.
వ్యక్తుల
జీవితాలు చరిత్ర పరికరాలు
రిచార్డ్ ఈటన్ లో నాకు బాగా నచ్చిన
కోణం : ఆయన చరిత్ర పరిశోధనా విధానం. ఇటీవలి ఆయన పుస్తకం- దక్కను సామాజిక
చరిత్ర – లో కీలకవ్యక్తుల జీవిత
చరిత్రలు ప్రధాన ఆధారంగా ఆయన చరిత్రని శోధించారు. ఎనిమిది మంది వ్యక్తుల జీవిత
చరిత్రల్ని తీసుకుని,
1300-1761 మధ్య దక్కను
చరిత్రని ఆయన విశ్లేషించారు. “ అసలు సరయిన చరిత్ర అంటూ ఏదీ లేదు, ఉన్నదల్లా జీవిత చరిత్రలే!” అన్న ఎమర్సన్
వాక్యంతో మొదలు పెట్టిన ఈ పుస్తకం ముందు మాటలో
తన కొత్త పరిశోధనా విధానాన్ని వివరించారు. కాని, జీవిత
చరిత్రని ప్రధాన ఆధారంగా తీసుకుని సామాజిక చరిత్ర రాయడంలో అనేక సమస్యలున్నాయి. ఒక
వ్యక్తి జీవితాన్ని అప్పటి సమాజ చరిత్రగా ఎలా ఆలోచించగలమన్నది ముఖ్య సమస్య అయితే, వ్యక్తిగత కథనాల్లోంచి సామాజిక
సారాంశాన్ని ఎలా వడపోస్తామన్నది మరో పెద్ద చిక్కుముడి. చరిత్ర రచనకి సంబంధించిన ఈ
కొత్త కోణం మీదికి మా సంభాషణ మళ్లింది.
“ ఇలా రాయడంలో వొక్కసారిగా అనేక
ప్రయోజనాలు కలిసివస్తాయి. ముందు, చరిత్ర
అనగానే మొహం తిప్పుకునే పాఠకుల్ని చరిత్ర వైపు తిప్పవచ్చు. కథలు, అందునా జీవిత కథలు ఎవరినయినా
ఆకట్టుకుంటాయి. తెలియని వొక ఆకర్షణ ఏదో అలాంటి కథల్లో వుంటుంది. ఇతరుల కథలు తెలుసుకోవాలన్న ఆసక్తి
కూడా మనలో సహజం. నైరూప్యంగా అనిపించే ఏదో సిద్దాంత రచన చదివే కన్నా ఈ విధమయిన రచన
ఎక్కువ మందికి నచ్చుతుంది. ఎక్కువ మంది చరిత్ర పుస్తకాల వైపు మళ్లాలన్న చిన్న ఆశ
నన్ను ఈ ప్రయోగం వైపు తీసుకువెళ్లింది. ఆ విధంగా చరిత్రని మనం మానవీకరణ
చెయ్యవచ్చు. దాంతో పాటు, సిద్దాంతాన్ని
వాస్తవికతకి అన్వయించడానికి వీలు దొరుకుతుంది. ఈ క్రమంలో నేను చేసిందేమిటంటే, నా రచనలో వ్యక్తికీ, సమాజానికీ మధ్య ప్రయాణం చేశాను. వాటి
రెండీటికీ మధ్య రాకపోకలు సాగించాను. అలా ఎంత దూరం వెళ్లానంటే, అవి రెండూ వొక దానిలో వొకటి లీనమయి
పోయేట్టుగా! అలా రాస్తున్న కొద్దీ అసలు చరిత్ర
రాసే విధానం ఇది అని గట్టిగా అనిపించడం మొదలెట్టింది నాకు. అంటే, ఇదొక్కటే విధానం వుందీ అని కాదు, తప్పనిసరిగా ఇది బలమయిన విధానం
అనిపించింది. పైగా,
దక్కను చరిత్రకి ఈ విధానం
చక్కగా సరిపోయింది. ఒక బలమయిన కేంద్రం లేని చరిత్ర దక్కనుది. అలాంటి బలమయిన
కేంద్రం ఏదీ లేనప్పుడు సహజంగానే చరిత్ర రచనకి అనేక ఇబ్బందులుంటాయి. సరయిన ఆధారాలు
దొరకవు. ఏదీ నిశ్చితంగా చెప్పలేం. ఈ విషయం నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు మళ్లీ
ఆలోచించాను. అందుకే,
చాలా మంది చరిత్రకారులు
డిల్లీ గురించో, మొగల్ సామ్ర్రాజ్యం మీదనో అనగానే
చప్పున పనిలో దిగిపోతారు. ఎందుకంటే, అవి
చాలా నిశ్చితమయిన కేంద్రం వున్న రాజ్యాలు. వాటికి రికార్డులు కుప్పలు తెప్పలుగా
దొరుకుతాయి. అవి కొంత కాలం నికరమయిన కేంద్రం పరిధిలో వున్నాయి కాబట్టి వాటి వాటి
పత్రాలు, కథనాలూ సరయిన సాక్ష్యాలతో దొరుకుతాయి.
దక్కనుకి అలాంటి సౌకర్యమూ, సౌలభ్యమూ
లేవు. గోల్కండ, విజయనగరం, బీదరు వున్నాయి కదా అంటే వున్నాయి.
అవి ఏ డిల్లీ నో, లండనో కాదు. చాలా మంది చరిత్ర కారులు
దక్కను వైపు చూడకపోవడానికి అదొక కారణం. చాలా పని ఆధారాల సేకరణలో గడిచిపోతుంది.
దొరికిన ఆధారాలు కూడా చరిత్ర అంతస్సూత్రాన్ని పట్టివ్వవు. అలాంటప్పుడు, జీవిత కథలు మంచి ప్రత్యామ్నాయం. ఈ
దారి నాకు చాలా కష్టం మీద దొరికింది. లోపల్లోపల చాలా తన్నుకు లాడి ఈ దారిలో
పడ్దాను. ఇది ఎంత వరకు సరయిన దారి అన్నది పాఠకుడి విచక్షణకి వదిలేస్తున్నాను. కాని, ఒక రచయితగా నాకు ఇది చాలా
సంతృప్తినిచ్చింది. అసలు ఏది దక్కను అనేదే ఇంకా తేల్చుకోలేని స్థితిలో మనం
వున్నప్పుడు దాని చరిత్ర రచన ఎలా వుంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. “
ఆలయ
విధ్వంసాలు – వాద వివాదాలు
_ ఆలయ విధ్వంసాల మీద మీ రచనకి ఏమయినా వ్యతిరేకత వచ్చిందా?
నిజానికి నేను వూహించినంత వ్యతిరేకత
రాలేదు. ఆలయ విధ్వంసాల వ్యవహారం చాలా వివాదాస్పదమయింది. మరీ ముఖ్యంగా ఇప్పుడు
వున్న పరిస్థితుల్లో ఇలాంటి విషయాలు సున్నితంగా మారాయి. ఒక విధంగా అలాంటి
విషయాల్లో కల్పించుకోకపోవడం మంచిదన్న ధోరణి పెరుగుతోంది. నా రచన ఆ నిశ్శబ్దాన్ని
బద్దలు చేసింది. ఈ విషయంలో నన్ను విమర్శించిన వొకే వొక వ్యక్తి – కాన్రాడ్ ఎల్స్
ట్ . అతను యూరోపియన్ . హిందూ మతం పుచ్చుకున్నాడు. ఇండియాలో హిందూ మత చాదస్తుల కంటే
నాలుగాకులు ఎక్కువే. అతనేదో రాశాడు. కాని, అది
ఎవరినీ ఒప్పించలేకపోయింది. నన్ను అసలు ఒప్పించలేకపోయింది. అతనిలో వాదంలో పస లేదు.
కారణం ఒక్కటే: అతనికి విశ్వాసాలు గట్టిగా వున్నాయేమో గాని, ఆధారాలు లేవు. నా రచనకి వ్యతిరేకంగా
వాదించాలంటే నేను ఎటు వైపు నించి నరుక్కు వస్తున్నానో తెలియాలి. పూర్వ ఆధునిక కాలం
గురించీ, ముస్లిం గతాన్ని గురించీ శోధించాలంటే, ముందు పర్షియన్ భాష తెలియాలి. అది
అతనికి రాదు. సరే, భాష విషయం పక్కన పెట్టినా, అప్పటి చరిత్ర నడక తెలియాలి. అప్పటి
మూలాధారాలు కొన్ని అర్ధం కావాలి. శాసనాలు చదవాలి. తారీఖులు దస్తావేజులు అర్ధం
కావాలి. అసలు ఏది చరిత్రకి పనికొచ్చే సాహిత్యమో తెలియాలి. అవన్నీ వుంటాయని అతనికి
తెలియదు. చాలా మందికి తెలియదు ఆ మాటకొస్తే! విశ్వాసాలు వేరు, చరిత్ర వేరు. పరిశోధన పూర్తిగా వేరు.
ఆధారాలు లేకుండా పరిశోధన వుండదు. ముస్లింలు ఆలయాలు ధ్వంసం చేశారనీ రకరకాల అంకెలు
కూడగట్టి మాట్లాడడం ఇప్పుడు మామూలుగా జరుగుతున్న పని. అందులోంచి వాస్తవం రాదు.
వక్రీకరించిన వాస్తవమే వస్తుంది. అది చరిత్ర కాదు. ఆ కాలంలో అలా జరగలేదు అని
చెప్పడానికి నేను చాలా శ్రమ పడాల్సి వచ్చింది. ఇంకా చాలా సమాచారం మిగిలిపోయింది.
కాన్రడ్ లాంటి వాళ్లు చాలా మంది వుంటారు. అలాంటి వాదనలు నిలవవు.
అప్పటి
దక్కను చరిత్ర పాఠాలు
– ఇప్పుడు మతం స్వభావం మారింది. అప్పటి
దక్కను మత చరిత్ర నించి మనం తెలుసుకోవలసిన పాఠాలు ఏమన్నా వున్నాయా?
–
(పెద్దగా
నవ్వుతూ) అఫ్సర్ ,
మీరు తేలిక ప్రశ్నలు మాత్రమే
అడుగుతానని ఈ సంభాషణ మొదలు పెట్టారు! అవునా? కాని, నన్ను చాలా దూరం లాక్కు వెళ్లారు. ఈ
ప్రశ్నకి జవాబు కష్టం అని మీకూ తెలుసు. కాని, ఈ ప్రశ్న మీరు ఎందుకు అడిగారో నాకు
తెలుసు. మీకు తెలుసు ,
గడియారాన్ని వెనక్కి
తిప్పలేం. నిజానికి అది అసాధ్యం. చరిత్ర ఒక గడిచిపోయిన కాలం. దాన్ని పాఠ్య
పుస్తకంగా చూడలేం. అప్పటి అనుభవాలు ఇప్పటి అనుభవాలు కాలేవు. మనం బ్రిటిష్ వలస పాలన స్వభావాన్ని ఇంకా
బాగా అవగాహన చేసుకోవాల్సి వుంది. వలస పాలన తర్వాత భారత దేశ చరిత్ర చాలా మారింది.
అప్పటి దాకా, మతం స్వభావం వేరు, వలస పాలన తర్వాత మతం స్వభావం వేరు.
కాని, పదహారు, పదిహేడు
శతాబ్దాల దక్కను చాలా లౌకికమయిన వ్యవస్థ. అప్పటి హిందూ – ముస్లిం సంబంధాల్లో గొప్ప
సహనం, సమన్వయం వున్నాయి. మీరు స్వయంగా ఆ
రంగం మీద పరిశోధన చేస్తున్న వారే. కాబట్టి, నేను
మరీ అంత వివరంలోకి వెళ్లను. అయితే, చరిత్ర
కోణం నుంచి చూస్తే,
నేను అప్పటి చట్ట సంబంధమయిన
కొన్ని దస్తావేజులని చదువుతున్నాను. అసలు న్యాయ సంబంధమయిన వివాదాల్ని అప్పటి
వ్యవస్థ ఎలా పరిష్కరించేదో ఆ దస్తావేజులు చదువుతూంటే అప్పటి సమాజం నా కళ్లకి
కట్టినట్టు కనిపిస్తోంది. వలస పాలన వల్ల ఆ సహనాన్ని ఇప్పుడు భారత దేశం పోగొట్టుకుంది.
మీరు తెలంగాణా, రాయల సీమ పల్లెల్లో చాలా ఫీల్డ్ వర్క్
చేశారు. ఆ పల్లెలు వలస పాలనకి ముందు ఎలా వున్నాయన్నది కూడా కొంత పరిశోధన చేసి
వుంటారు. అసలు వలస పాలనకి ముందు ముస్లింల పాలనలో ఎక్కడయినా ఇస్లామిక్ చట్టం అమలు
చేశారా? మీ పల్లె కథనాల్లో ఆ చాయలు ఎక్కడయినా
వున్నాయా? నేను దస్తావేజులు చూశాను, మీరు జనంలోకి వెళ్లి చూశారు. అచ్చంగా
మతం పేరుతో జనం ఏం చేశారో, చేస్తున్నారో
చూశారు. వలస పాలన ఏం చేసిందో బాగా అర్ధం అయ్యి వుండాలి. ముస్లిం రాజులు ఇక్కడి
జనంలో కలిసిపోయి, పాలించారు. దక్కను చరిత్ర నించి ఒక
నమూనా ఏమయినా వుంటే,
సహనం – సమన్వయం ఆ నమూనా.
మీకు
తెలిసే వుండాలి, ఇప్పుడు తెలంగాణా గురించి చాలా ఆసక్తి
పెరుగుతోంది. చరిత్ర, సంస్కృతికి సంబంధించిన అంశాల మీద చాలా
కృషి జరుగుతోంది. ఈ నేపధ్యంలో కొత్త పరిశోధకులకు మీ సలహా ఏమిటి?
–
ముందు పర్షయన్ బాగా నేర్చుకోవాలి. ఇండియాలో ఈ భాష మీద అంత ఆసక్తి వున్నట్టు లేదు.
అమెరికాలోనేమో, అది మధ్య ప్రాచ్య భాషగా ముద్ర పడింది.
అసలు ఇరాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ పర్షియన్ సాహిత్యం పుట్టింది. ఇరానీలు ఈ మాట
వొప్పకోక పోయినా సరే,
ఇది పచ్చి నిజం. 19 వ
శతాబ్దంలో ఇరాన్ లో కంటే ఇండియాలోనే ఎక్కువ పర్షియన్ రచనలు వచ్చాయి. 20 వ
శతాబ్దంలో అది తగ్గిపోయింది. విభజన తరవాత అసలు ఆ భాషకి ఉనికే లేకుండా పోయింది. అది
పెద్ద విషాదం. ఇప్పుడు దక్కను పరిశోధకులు తక్షణం చెయ్యాల్సింది – పర్షియన్
పట్టుబట్టి నేర్చుకోవడం. తరవాత ముఫసిల్ వూళ్ళలోకి వెళ్లి, అన్ని రకాల రికార్డులూ గాలించడం. వూళ్లలో
ఏం జరుగుతున్నదో చదవండి. నేను బెంగాల్ మీద పని చేసినప్పుడు అప్పుడు జాతీయ
ఆర్కైవ్స్ అంటూ లేదు. ప్రతి జిల్లాకీ వెళ్లి రికార్డు రూముల దుమ్ము దులిపాను. ఆ
పని దక్కనులో జరగాలి. చరిత్ర పరిశోధన అనగానే కలకత్తానో, లండనో పరిగెత్తాలనే వ్యామోహంలోంచి బయట
పడాలి. అసలు చరిత్ర అంతా వూళ్లలో వుంది.
ఆ తర్వాత మా మాటలు చాలా సేపు వూళ్లలో
ముస్లిం జీవనం, హిందూ – ముస్లిం సంబంధాల మీదకి
మళ్లాయి. నా పరిశోధనలో నేను వుపయోగిస్తున్న అంశాలని గురించి ఆయన ఆసక్తి చూపించారు.
మతవిధుల్లో వస్తున్న మార్పులు, ముస్లిం
సమాజం మారుతున్న తీరు,
ఇస్లామిక్ సాహిత్యం
తెలుగులోకి విస్తారంగా అనువాదమయి, ప్రచారమవుతున్న
విషయాల మీద చాలా సేపు ఆసక్తి కరమయిన చర్చ జరిగింది. అవి నేను వేరే సందర్భంలో
ప్రస్తావిస్తాను.
ఈటన్ తో మాటల్ని నెమరేసుకుంటూ నేనూ, జాన్ బయటికి నడిచాం. ఈటన్ మాతో పాటు
బయటికి నడిచారు. బయట బారెడు పొద్దెక్కినా ఆస్టిన్ సూర్యుడు ఇంకా బలహీనంగానే
వున్నాడు. “ఇంకా ఎండ చురుకెక్కలేదు” అన్నాను నేను. “పర్లేదు, నాకు మాత్రం ఈ సంభాషణతో చాలా
చురుకెక్కింది” అన్నాడు జాన్ . ముగ్గురమూ పెద్దగా నవ్వుకున్నాం, బయటి ఎండ మెరుపులా.
‘ఆ మైదానంలోకి వెళ్లిపోండి. వెనక్కి
తిరిగి చూడకండి. తిన్నగా వెళ్లండి సూర్యుడి కిరణంలాగా’
గత
కొన్ని దశాబ్దాలుగా ఇదే వాక్యాన్ని పదేపదే వేరేవేరే సందర్భాల్లో చెబ్తూవచ్చిన
తీవ్ర స్వరం హీరాలాల్ మోరియాది. నాకు సాహిత్య ఊహలు తెలుస్తూ, అర్థమవుతూ వచ్చిన పదేళ్ళ ప్రాయంనుంచీ
ఇప్పటివరకూ మోరియాని అనేక సందర్భాల్లో చూశాను, విన్నాను. మేం అప్పుడు పల్లెనుంచి పట్నానికి
వచ్చిన రోజులు. ఒక రోజు సాయంత్రం ఇంటికి తెల్లఖద్దరు బట్టల్లో మంచి మల్లెపువ్వులా
ఆయన నడిచివచ్చారు. ఆ సాయంత్రం ఆయనా, నాన్నగారు
(కౌముది) ప్రపంచ సాహిత్యాన్నంతా ఆగమేఘాల మీద సందర్శించారు. ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు…
భాషల అడ్డుగోడల్లేని సాహిత్య సంభాషణ. ఆ రోజు రాత్రి ఆయన వెళ్ళిపోతూ ‘అఫ్సర్ బేటా’
అని నావైపు తిరిగి పైన చెప్పిన ఒకే ఒక్క పంక్తి చెప్పారు. అదేమాట ఆయన రెండేళ్ళ
క్రితం నేను మాడిసన్ నుంచి వచ్చినపుడు (2004) మరోసారి
మళ్ళీ చెప్పారు. అది ఆయన్నించి నేను విన్న మొదటి, చివరి
మాట కూడా!
మోరియాని
తలచుకొంటే నా బాల్యం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే యాభైయేళ్ల తెలంగాణ సాహిత్య
ప్రయాణం గుర్తొస్తుంది. మోరియాని తలచుకుంటే ఒక మహోద్యమ వారసత్వాన్ని గర్వంగా
భుజానికెత్తుకున్న వ్యక్తి కనిపిస్తాడు. ఆయన రాజకీయాల్లో ఎన్నాళ్ళున్నారో నాకు
గుర్తులేదు. ఆ మాటకొస్తే ఆయన ఎప్పుడూ ఆ రాజకీయోద్యమాన్ని గురించి మాట్లాడ్డం నేను
విన్లేదు. ఎప్పుడు కలిసినా ఆయన చుట్టూ సాహిత్య సంభాషణల జడివాన. రచయిత ఎప్పుడూ
రచయితగానే ఉండాలని ఆయన అనేవారు. ఖమ్మంలో చరిత్రాత్మకమైన విజ్ఞాన నికేతనం గ్రంథాలయం
వీధిలో మేడమీది ఆయన గది అంటే నాకు విపరీతమైన ఆకర్షణ. అది గదికాదు. ఒక పెద్ద
గ్రంథాలయమే. హిందీ,
ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు
పత్రికలూ, పుస్తకాల గుట్టలమధ్య ఒక కుర్చీలో
తపస్సులో కూర్చున్నట్టు నిరంతరం ఆయన ఏదో రాస్తూ… ఆలోచిస్తూ… ఆయన రాతల్నీ, ఆలోచనల్నీ తెంపుతూ అప్పుడప్పుడూ నేను
ఆయన గదిలోకి వెళ్ళేవాణ్ని. నేను వెళ్లిన మరుక్షణం నాకోసం నాకు అత్యంత ఇష్టమైన
‘రసమలై’ స్వీట్ వచ్చేది. అంతకంటే ఇష్టమైన మోరియా మాటల తీయదనం.. మాట మోరియా తొలి
ఆయుధం. ఆయన వాక్ ప్రవాహం ముందు నిలబడడం కష్టం. ఆ ప్రవాహలక్షణమే ఆయన సాహిత్యంలోనూ!
కథ, కవిత్వం, చరిత్ర, నవల, విమర్శ, అనువాదం…
ఇలా ప్రతీ ప్రక్రియ లోనూ మోరియా పనిచేశారు.
‘రచయిత
కావడం అంటే ఒక పెద్ద బాధ్యత. ఇవాళ పది పేజీలు రాయనిది నేను రొట్టె ముట్టను’
అనేవారాయన. రోజూ పొద్దున్నే లేచి కలం పట్టుకుని ఆయనలా రాస్తూ కూర్చునే దృశ్యం నాకు
చాలా గొప్ప గొప్ప స్ఫూర్తినిచ్చేది. మోరియా అనేక భాషల సంగమం. ఆయన మాతృభాష మరాఠీ, ఆయన రాసిన భాష ఉర్దూ, ఆయనకు పేరొచ్చిన భాష తెలుగు. ఇది
భారతీయ సాహిత్య ప్రపంచంలోనే చాలా అరుదైన సన్నివేశం. ఇంతకీ మీ భాష ఏది?’ అని నేను ప్రతిసారీ గుచ్చిగుచ్చి
అడిగేవాణ్ని. ‘సాహిత్యం నా భాష. సాహిత్యం దానికదే భాష. నేను ఏ భాషలో రాసినా ఇక్కడ
ఉన్న వాళ్లకోసం రాస్తున్నానన్న సంగతిని నేను మరిచిపోను. నాకు సాంస్కృతికంగా
జన్మనిచ్చింది తెలంగాణ. ఈ మట్టిలో పుట్టిన గింజలు తిన్నాను. దీని ఉప్పు తిన్నాను.
నేను రాసింది కూడా ఈ నేల కోసమే’ అన్నారాయన ఓసారి.
‘మీరు
కాంగ్రెస్ నాయకుల మధ్య తిరిగారు. కానీ మీ మాటలు కమ్యూనిస్టులకంటే పదునుగా ఉంటాయి’
అని ఓసారి అంటే… ‘కాంగ్రెస్‌లో ఉండడం నా జీవితంలో చాలా యాదృచ్ఛికంగా జరిగింది.
నేను ఎప్పుడూ గరీబుల పక్షం. నా రచనల్లో ఎట్లా కనిపిస్తానో నా జీవితంలోనూ అదే
చేశాను. నా మాటకీ, నా రాతకీ, నా చేతకీ ఎప్పుడూ తెగని బంధం’
అన్నారాయన. తెలంగాణ రచయితల సంఘం చాలా క్రియాశీలంగా పనిచేసిన 1950 లలో మోరియా రచనలన్నిట్నీ పరిశీలిస్తే
ఆయనపైన సామాజిక ప్రభావాలు ఎంత బలంగా ఉండేవో తెలుస్తుంది. అన్నింటికీ మించి, తన చుట్టూ ఒక గొప్ప సాహిత్య
వాతావరణాన్ని సృష్టించుకోవడం మోరియాలో విశేషం. విశ్వనాథ, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి, రాయప్రోలు, దాశరథి, ఉటుకూరు
రంగారావు, కవిరాజమూర్తి, కౌముది, కొలిపాక, గోపాలరావు, మంజు నుంచి ఈ తరం రచయితలదాకా అందరికీ
ఆయన ఆత్మీయుడు. వాదాలు ఏవైనా, వివాదాలు
ఎన్ని ఉన్నా ఆ మేడమీది ఇంటికి వెళ్లే అందరి మధ్యా పూసలో దారంలా ఆయన తీవ్రస్వరం!
ఆయన నిష్క్రమణ తెలంగాణ సాహిత్య చరిత్రకి పెద్ద వెలితి.
1944తెలంగాణ
గ్రామాల్లో ఆంధ్రమహాసభ జెండాలు ఉత్తేజంగా ఎగురుతున్నాయి. ప్రతి గ్రామం ఒక నిప్పుల
కుంపటిగా మారుతోంది. నెత్తురు మండి, కాసింత
ధిక్కారపు గొంతు ఎత్తిన ప్రతి యువకుడి మీదా రాజ్యం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటి
ఖమ్మంజిల్లాలోని పిండిప్రోలు అలాంటి ఒక గ్రామం. నిర్బంధాన్ని భరించలేక నిండా రెండు
పదులు నిండని ఒక బ్రాహ్మణయువకుడు అరచేతుల్లో ప్రాణాల్ని దాచుకొని భాగ్యనగరం
చేరుకున్నా డు భార్యతో. నగరం బతుకు అతనికీ, ఆమెకీ
కొత్త. పూటకి ఠికానా లేదు. నిలువ నీడలేదు. అతికష్టంమీద కోఠీలో ఒక ఇరుకుగది
దొరికింది. ఆ ఇరుకుగది అతని ప్రపంచమయ్యింది. కాదు, ప్రపంచమే
అతని ఇరుకుగదిలో ఇమిడిపోయింది. ఎందరో తెలం గాణ యువరచయితలకు అది కేంద్రమయ్యింది.
అక్కడ
తన కలల్ని నిజం చేసే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ని అతను స్థాపించాడు. ఉన్న కొద్దిపాటి
డబ్బులతో ఒక బుక్‌స్టాల్ ప్రారంభించి, టాల్‌స్టాయ్,దాస్తవస్కీ లాంటి రష్యన్ రచయితలతో
పాటు గొప్ప ఉర్దూ పుస్తకాలు తెప్పించాడు. అవి అమ్మగా వచ్చిన కాసినిడబ్బులతో ఏపూటకి
ఆ పూట గడిచిపోయేది. అంతటి దుర్భర దారిద్య్రంలోనూ అతని కవితాత్మ రాజీపడలేదు. ఈ
ఇరుకుగదిలో ఉండగానే అతనొక మంచి నవల రాశాడు. అదీ దక్కనీ ఉర్దూలో! ఆ రచయిత
పూర్తిపేరు సర్వదేవభట్ల నరసింహమూర్తి. అతని కలంపేరు ‘కవిరాజమూర్తి’. అతను ఉర్దూలో
రాసిన నవలపేరు ‘మై గరీబ్ హూఁ’. కవిగా మాత్రమే అందరికీ తెలిసిన సర్వదేవభట్ల
నరసింహమూర్తి 1926 అక్టోబర్ నెలలో ఖమ్మంలో జన్మించారు.
ఖమ్మంలో నూరేళ్ళ పైబడి చరిత్ర ఉన్న ఆంధ్ర బాలాభివర్థనీ గ్రంథాలయం, విజ్ఞాన నికేతనం ఆయన చదువుకున్న
బళ్ళు. ఇప్పుడు ఖమ్మంజిల్లాలో ఉన్న పిండిప్రోలు ఆయన స్వగ్రామం.
తండ్రి
వీరభద్రయ్య న్యాయవాది. బాబాయి సర్వదేవభట్ల రామనాథం పెద్ద కమ్యూనిస్టు నాయకుడు.
తమ్ముడు విశ్వనాథం ఖమ్మంలో తరువాత మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన న్యాయవాది, గాంధేయవాది. రెండో కొడుకు
నరసింహమూర్తిని కూడా న్యాయవాదిగా చూడాలన్నది తండ్రి కల. కాని, నరసింహమూర్తి లోకమే వేరు. ఇంకా
ఇరవయ్యేళ్ళు నిండకుండానే అతనిపైన కమ్యూనిస్టు ఉద్యమ ప్రభావం పడింది. ముఖ్యంగా బాబా
యి రామనాథం గొప్ప స్ఫూర్తి. తరువాత ఉర్దూ అభ్యుదయకవులు నరసింహమూర్తి దారినే
మార్చివేశారు. బాబాయి మాదిరిగా ప్రత్యక్ష కమ్యూనిస్టు రాజకీయాల్లోకి రాలేదు
నరసింహమూర్తి. ఉర్దూ కవిత్వం మీద మమకారం పెంచుకుని, ఉర్దూలో
కవి త్వం చెప్పడం మొదలుపెట్టాడు.
ఉర్దూలో
అతని కవిత్వ పటిమకి మెచ్చి నైజాం సర్కారు ‘ప్రజా కవిరాజు’ బిరుదునిచ్చింది. ఆ
బిరుదు అందుకునే నాటికి అతనికి పందొమ్మిదేళ్ళు. నైజాం ఇచ్చిన బిరుదు తరువాత
‘కవిరాజమూర్తి’గామారి స్థిరపడిపోయింది. కమ్యూనిస్టుల ఏరివేత ప్రారంభమయిన తరువాత ఈ
పల్లెటూరి యువకుడు హైదరాబాద్ చేరుకున్నాడు. అంతకుముందు, అంటే 1944
ప్రాంతాల్లో కవిరాజమూర్తి ఉర్దూ, తెలుగు
భాషలలో విస్తృతంగా రచనలు చేసినట్టు తెలుస్తోంది. కాని అవి ఏవీ ప్రస్తుతం
అందుబాటులో లేవు. అతికష్టం మీద ఈ వ్యాసరచయితకి అందుబాటులోకి వచ్చిన ‘మై గరీబ్
హూఁ’ నవల తెలుగు అనువాదం (రెండో ముద్రణ -1950) వెనుక
అట్టమీద వివరాల ప్రకారం ఆయన ఉర్దూలో రెండు నవలలు, ఒక
నాటిక, ఒక జముకుల కథ, గేయాలు ప్రచురించినట్టు ఉంది.
ఉర్దూలో
ఆయన రాసిన నవలలు ‘లహూకీ లకీర్’ (రక్తరేఖలు), కవితాసంపుటి
‘అంగారే’ (నిప్పురవ్వలు) కూ డా ఇప్పుడు ఎక్కడా లభ్యమవ్వడం లేదు. ‘మై గరీబ్ హూఁ’
నవల తెలుగు అనువాదం మాత్రం ఖమ్మం సాహిత్యచరిత్రపై పరిశోధన చేస్తున్న
నరసింహారావుగారి ద్వారా లభించింది. (ఉర్దూమూలం కోసం పరిశోధకుడు వెతుకుతూనే
ఉన్నారు). “మై గరీబ్ హూఁ నవల మీరు తెలుగులో చదివితే మీకు ఆ జోష్ (ఊపు)రాదు. అది
ఉర్దూలో చదవాలి,అందునా మూర్తిగారు చదువుతుంటే నాకు
కళ్ళనీళ్ళు ఆగేవి కావు” అన్నారు కవిరాజమూర్తిగారి భార్య వరలక్ష్మి. డెబ్బయ్ ఆరే
ళ్ళ వరలక్ష్మిగారు ఈ నవల పేరు ప్రస్తావించగానే ఒక గొప్ప ఉత్సాహంతో అప్పటి సాహిత్య
విశేషాలు చాలా చెప్పారు. నవలలోని కొన్ని సంభాషణల్ని అలవోకగా వినిపించారు. అంతేకాదు, 1946-1950 మధ్య హైదరాబాద్ తెలుగు- ఉర్దూ రచయితల
ఉమ్మడి సాంస్కృతిక జీవన విధానాన్ని గురించి ఆమె చెప్పిన ప్రతి అంశం తెలంగాణ
చరిత్ర పునర్నిర్మాణానికి ఒక సాధనమే! అంత వృద్ధాప్యంలో కూడా అప్పటి ఉమ్మడి
జీవనశైలి ఎలా ఉండిందో ఆమె అనేక జ్ఞాపకాల మధ్యచెప్పుకుంటూ వచ్చారు.
ఊరు
వదిలి భాగ్యనగరానికి…!
‘1942, 1946,1949, 1950… ఇవి నా
జీవితంలో మరిచిపోలేని సంవత్సరాలు. 1942లో
(అంటే అప్పటికి మూర్తిగారికి పదహారేళ్ళు) మూర్తిగారితో నా పెళ్ళయింది. పెళ్ళయిన మూ
డేళ్ళు మాత్రమే మా జీవితంలో సంతోషంగా సాగిన రోజులు. 1946లో ఖమ్మంలో పెద్ద ఎత్తున ఆంధ్రమహాసభ
జరిగింది. సుందరయ్యగారు వచ్చారు. చుట్టుపక్కల ఊళ్ళనుంచి వేలకొద్దీ జనం బండ్లు
కట్టుకుని వచ్చారు. గొప్ప సభ జరిగింది. కాని మూర్తిగారి జీవితం ప్రమాదంలో పడింది.
ఆయన్ని కమ్యూనిస్టు అన్న కసితో ఒక హత్యకేసులో ఇరికించారు. ఇల్లూవాకిలీ ఊరూ వదిలి
పొట్టచేతపట్టుకుని హైదరాబాద్ చేరాం. హైదరాబాద్‌లో ఎట్లాబతికామో మాకే తెలీదు. ఈ పూట
రొట్టి దొరుకుతుందా,దొరకదా అని ప్రతిపూటా నరకం. కాని
మూర్తిగారికి సాహిత్యమే పెద్ద జీవితం. ఆయన ఉర్దూ సాహిత్య జిజ్ఞాస ఎందరినో
స్నేహితుల్ని సంపాదించిపెట్టింది.
ఉర్దూ
కవులూ,రచయితలతోపాటు బెల్లంకొండ రామదాసు, రెంటాల, అబ్బూరి
వరదరాజేశ్వరరావు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, దేవులపల్లి రామానుజరావులాంటి వాళ్ళంతా
ఆ ఇరుకుగదికి వచ్చిపోతుండేవాళ్ళు. నేనూ ఒక మూల కూర్చొని వాళ్ళ మాటలన్నీ
వింటూండేదాన్ని. కొద్దికాలానికి- అంటే 1949లో
గిడుతూరి సూర్యంగారు హైదరాబాద్ కుద్బీగూడలో పద్మశాలి ప్రింటింగ్ ప్రెస్ పెట్టారు.
అప్పుడే ‘ప్రజాసాహిత్య పరిషత్తు’ కూడా ఏర్పడింది. తరువాత మూర్తిగారికి నృపతుంగ
హైస్కూల్లో తెలుగుపండితుడి ఉద్యోగం అయ్యింది. ఆ సమయంలోనే సుల్తాన్‌బజార్‌లో
‘మూర్తీస్ బుక్‌హౌస్’ పేరుతో బుక్‌స్టాల్‌పెట్టారు. కేవలం ఇంగ్లీషు పుస్తకా లు
మాత్రమే బొంబాయినుంచి తెప్పించి అమ్మేది. అలా తెప్పించిన పుస్తకాలలో కొన్నాయన నాకు
చదివి వినిపించేవారు. ‘అన్నా కెరెనీనా’ ఆయన చదువుతూండగా విన్నవాటిల్లో నాకు నచ్చిన
గొప్ప పుస్తకం.
రచన ఒక
జ్వరవేదన!
అదే సమయంలో మూర్తిగారు
ఉర్దూలో ఏదో రాయడం మొదలుపెట్టారు. ‘ఇది పెద్ద నవల. దక్కనీలో రాస్తున్నా’ అంటూ
రోజుకి కొన్ని పేజీలు చదివి వినిపించేవారు. అది రాస్తున్నంత కాలం ఆయన
మూర్తీభవించిన అశాంతిలా ఉండిపోయారు; ఏదో
జ్వరం వచ్చినట్టే! ఈ నవల ఎప్పుడు పూర్తవుతుందా అని బెంగపెట్టుకునే దాన్ని. కాని
ఆయన ఉర్దూలో అది చదువుతున్నంతసేపూ విపరీతమైన ఉద్వేగానికి లోనయ్యేదాన్ని. ఏదో
మంత్రించినట్టుగా కళ్ళప్పగించి వింటూ వుండిపోయేదాన్ని. ఆ భాష, ఆ ప్రవాహం, ఆ వేగం… ‘వినడం కాదు, మాట్లాడు….’ అనేవారాయన. మూర్తిగారు
కవిత్వం చాలా రాసినా అది ఎప్పుడూ నాకు వినిపించేవాళ్ళు కాదు. కాని, నవల ప్రతి పేజీ రాసింది రాసినట్టుగా ఏ
రోజుకి ఆరోజు వినిపించేవారు.
అలా
వినిపించకపోతే ఆయనకి కలం ముందుకి సాగేది కాదు. పైగా ప్రతిపేజీ మీదా ఇద్దరం చాలా
సేపు మాట్లాడుకొనేవాళ్ళం”. ఆశ్చర్యంగా నవలలోని ప్రతిభాగం ఇప్పటికీ ఆమెకి కళ్ళకి
కట్టినట్టుగా గుర్తుంది. ముఖ్యంగా ‘మై గరీబ్ హూఁ’ అనే వాక్యం పునరుక్తి అయిన
ప్రతిసారీ ఆ వాక్యం చుట్టూ మూర్తిగారు అల్లిన సన్నివేశాల్ని ఆమె బాగా
గుర్తుంచుకొని చెప్పారు. కాని, ఆమె
దగ్గర ఈ నవల తెలుగు అనువాదం లేదు. ‘ఒక్క ఊళ్ళోనూ స్థిరంగా ఉండకపోవడం వల్ల ఎక్కడి
పుస్తకాలు అక్కడే పోయాయి. చివరికి ఆయన రచన
ఒక్కటీ మా దగ్గర మిగల్లేదు’ అన్నారామె. నా చేతుల్లో ఉన్న ‘మై గరీబ్ హూఁ’ జిరాక్సు
ప్రతిని చేతుల్లోకి తీసుకుని, ఆమె
కొద్దిసేపు ఆ పుస్తకా న్ని అప్యాయంగా తాకుతూ ఉండిపోయారు.
చాలాసేపు
మా ట్లాడిన తరువాత ‘నా దగ్గర మూర్తిగారి ఒకే ఒక పుస్తకం మిగిలింది. అది మీకు
ఇస్తాను. తీసుకెళ్ళండి’ అంటూ లోపలకి వెళ్ళి, అతి
శిథిలావస్థలో ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని తీసుకువచ్చారు. ఆ పుస్తకం పేరు ‘మార్పు’.
అది 1949లో మూర్తిగారు రాసిన నాటిక.
తెలంగాణలోని గ్రామాల్లో ఈ నాటిక ప్రదర్శించేవారనీ, జనం
బాగా వచ్చేవారనీ ఆమెచెప్పారు. ‘మై గరీబ్ హూఁ జిరాక్సు నాకు ఇవ్వండి దయచేసి. మా
వద్దలేదు’ అన్నారామె. సంభాషణలో చాలాసేపు ఆమె ఈ నవల గురించి మాట్లాడడానికి ఆసక్తి
చూపించారు. ‘అది ఉర్దూలో సంపాదించి, చదవండి’
అని పదేపదే చెబుతున్నప్పుడు ఉర్దూ మూలరచన ఆమెపై ఎంత ప్రభావం కనబరిచిందో తెలుస్తూనే
ఉంది. ‘మూర్తిగారు తెలుగులో బాగా రాయగలిగి ఉండీ,ఈ
నవలని ఉర్దూలోనే ఎందుకు రాశారు?’ అడిగాన్నేను.
‘ఆయన ఏం రాసినా ముందు ఉర్దూలో రాసేవారు. కవిత్వం, కథ, వ్యాసం ఏదైనా కానివ్వండి.తన భాష
ఉర్దూ అని స్పష్టంగా చెప్పేవారు.
ఆయన
తెలుగులో రాయడం మొదలుపెట్టింది చాలా కాలం తరువాత. తెలుగులో రాసినా, అదీ ఉర్దూ ప్రభావం తోనే. ఉర్దూ కవుల
గురించీ, లేకపోతే వాళ్ళ అనువాదాలే.
వ్యక్తిగతంగా నాకు కూడా ఆయన ఉర్దూలో రాస్తున్నప్పుడు చాలా సౌకర్యంగా ఉండేవారని అనిపించేది.
ఆయన వ్యక్తిగా ఎంతో ఉద్వేగశీలి. లోపల చాలా అశాంతి ఉండేది. దానికి అనువైన తీవ్రతా, పదునూ ఉర్దూలో ఉండివుండవచ్చు. పైగా, ఇంటికి ఎవరొచ్చినా ఉర్దూలో వ్యవహా రం
నడిచేది. తెలుగులో మొదలైనా, కాసేపట్లో
ఉర్దూ దానికదే వచ్చేసేది. ఆయన ఉర్దూలోనే ఆలోచించేవారు. అందుకే, ఆయన తెలుగు రచనల్లోని వాక్యనిర్మాణం
కూడా ఉర్దూ ప్రతీకలూ పదచిత్రాలతో నిండి ఉండేదనుకుంటా’. ‘ఈ నవల తెలుగు అనువాదం
ఎప్పుడొచ్చింది?’ ‘కనీసం ఏడాది తరువాత, 1950లో నవల అచ్చయింది.
నా
అంచనా ప్రకారం ఈ నవల 1948 ప్రాంతాల్లో రాసి ఉంటారు. గిడుతూరి
సూర్యంగారు ‘పద్మశాలి ప్రింటింగ్‌ప్రెస్’ పెట్టిన తరువాత తెలుగులోకి అనువదించాలన్న
ఆలోచన వచ్చింది.’ ‘ఈ నవల ఆయన మిత్రులు చదవడం,చర్చించడం
చేశారా?’ ‘లేదు. ఉర్దూ కవిత్వంగురించి చాలాసేపు
చర్చలు జరిగేవి. ఈ నవల ఆయన ఒక స్వగతంలాగా రాసుకున్నారు. తన జీవితం, తన సమాజం, తనకి ప్రభుత్వం మీద ఉన్న ఆగ్రహం…
బహుశా… ఈనవల గురించి ఆయన నాతోనే ఎక్కువగా మాట్లాడి ఉంటారు. తెలుగులో ఈనవల
అచ్చులోకి వచ్చిన తరువాత, అంటే 1950లలో మళ్ళీ ఆయన మీద నిర్బంధం
పెరిగింది. మళ్ళీ ఊరు మారాం.తాండూరు వెళ్ళిపోయాం. ఏడాది తరువాత పటాన్‌చెర్వులో
వ్యవసాయశాఖలో ఉద్యోగం దొరికింది.అప్పటిదాకా ప్రాణభయంతోనే బతికారు.
1949 ప్రాంతాల్లోనే
ఉర్దూలో ‘తెలంగాణ’ అనే ఒక పక్షపత్రిక నడిపారు. అది పోలీసుచర్య తరువాత
ఆరునెలలపాటువచ్చింది’. ‘శ్రీమంతుల కుటుంబంలో పుట్టిన మూర్తిగారు ‘గరీబు’పక్షం
ఎందుకు చేరారు?’ ‘కమ్యూనిస్టు పార్టీప్రభావమే! బాబాయి
రామనాథం అంటే ఆయనకు ప్రాణం. శ్రీమంతుల కుటుంబంలోపుట్టారన్న మాటేగానీ, ఏనాడూ భోగభాగ్యాలు అనుభవిం చింది
లేదు. మేం పిండిప్రోలు నుంచి హైదరాబాద్ పోయేటప్పటికి ఆయనకి ఇరవయ్యేళ్ళలోపే! 1954 వరకూ మళ్ళీ ఖమ్మం మొగమే చూళ్ళేదు. ఇంక
ఆ సంపద ఉందో పోయిందో చూసుకున్నదీలేదు. తరువాత ఆయన పార్టీని వదిలివేశారు.కాని,పార్టీభావాల్ని మాత్రం వదల్లేదు. ‘మై
గరీబ్ హూఁ’ నవలలో మీకు ఈ విషయం అతి తేలి గ్గా అర్థమైపోతుంది.అందులో పేదవాడు
పడ్డకష్టాలేవీ ఊహల్లోంచి పుట్టినవి కావు. ఆయన అనుభవంలోనివే! ఆకథలోని
ప్రధానపాత్రధారి’అపరిచితుడు’ ఆయనే.
‘ఈ నవల
తరువాత, మళ్ళీ ఖమ్మంవచ్చాక ఆయన ఎక్కువగా
ఏమీరాయలేదా?’ ‘రాశారు.కాని తెలంగాణ ఉద్యమం ముందూ
వెనకా ఉన్న రచనల్లోని తీవ్రతవాటిల్లోలేదు. ఆయన రచయితగా ఒక సైనికుడిలాంటివారు.
యుద్ధసమయం అయిపోయాక,
ఆయన ప్రధానంగా అనువాదాల్లోకి
వెళ్ళిపోయారు. మనిషిలో నిదానం వచ్చింది.నిబ్బరంగా కవిత్వం రాసుకున్నారు’
వరలక్ష్మిగారితో మాట్లాడాక, కవిరాజమూర్తి
నవలని మరోసారి చదివాను. ఒక నవల సమకాలీన సమాజాన్నిగురించి ఎన్ని విధాలుగా, ఎన్ని స్వరాలలో మాట్లాడుతుందో
అర్థమైంది. సమాజం చీలుదారుల్లో నిలబడిన రచయిత ఎన్ని విషయాలు చూడగలడో, వాటికి ఎంత లోతయిన భాష్యం ఇవ్వగలడో
అర్థమైంది. ఒక నవల సాంఘిక చరిత్రగా మారి, అప్పటి
అనేక భౌతిక,మానసిక స్థితిగతులకు ప్రతిఫలనం ఎలా
అవుతుందో తెలిసివచ్చింది. అన్నింటికీ మించి- ఈ నవల ప్రధానంగా చర్చకిపెట్టిన
అంశం:-మతం. ఇప్పుడు ముస్లిం భాషగా ముద్రపడిపోయిన ఉర్దూలో ఒక ముస్లిమేతరుడైన రచయిత
ఇస్లాంనీ, నైజాం పాలనలోని ‘ఇస్లామీకరణ’నీ ఎట్లా
అర్థం చేసుకున్నాడని వేరే చర్చ.
(Andhrajyothy Oct 10,2007)
ఎప్పుడో వొక
కవితలో రాసినట్టు గుర్తు – వుత్తరాలు
దూరాల్ని కలిపే దారాలు – అని! ఇవాళ వొకే
వొక్క సారిగా నీ వుత్తరాలన్నీ చదివాక అనిపించింది, వుత్తరాలు దూరాల్ని కలిపే
దారాలే కాదు, తరాల్ని కలిపే, అంతరాల్ని
చెరిపే సఖ్యరాగాలు అని!
అవును, సఖ్యత,
సహనం ఇవీ ఇవాళ మనకి అత్య్గవసరంగా కావలసిన నిత్యావసర వస్తువులు.
నిజానికి ఇక్కడ నేను వస్తువులకి బదులు ‘భావనలు’ అనే పదం వాడాలి. కాని, వుద్దేశపూర్వకంగానే
వస్తువు అనే పదం వాడాను. ఎందుకంటే, చూస్తూ చూస్తూ
వుండగానే మనం భావనలకి దూరమయి, వస్తువులకి దగ్గిరయ్యాం.
ఏదయినా వస్తువుకున్న గౌరవం, విలువా భావనకి లేదు. ఇంట్లో
ఫ్రిజ్ కి వున్న విలువ చల్లని మనసుకి లేదు. ప్లాస్మా టివీకి వున్న విలువ మన మధ్య
కబుర్లకి లేదు. అందమయిన ఫర్నీచర్ కి వున్న విలువ ఆతిధ్యంలోని ఆత్మీయతకి లేదు.
మనసులు ఇరుకు
అయినా పర్లేదు,
కాని, ఇల్లు రాజసౌధంలా వుండాలి. మరేమీ
ముఖ్యం కాదు, ఇంట్లో వస్తువులు తప్ప. అలాంటి వస్తువుల్ని
వుత్పత్తి చేసే శక్తి మాత్రమే గొప్ప శక్తి. ఇతర శక్తులు అసమర్ధుల భావనలు. డబ్బు
సంపాదించలేని వాళ్ల సాకులు. చుట్టూ ఏం జరుగుతున్నా సరే, మన
ఇల్లు విలాస వస్తువులతో నింపుకుంటే చాలు. వీధులు రక్తసిక్తమవుతుంటాయి. ఈ పూటకి
కడుపు ఎలా నింపుకోవాలా అని సగానికి సగం జనం పొట్ట పట్టుకుని, చౌరస్తాల్లో శరీరాలే పనిముట్లుగా అడ్డాలలో నిలబడి వుంటారు. అయిననూ,
మన గది భద్రంగా వుంటే చాలు. మన లాభాలు ఎడతెగక పారితే చాలు. మన
పాచికలు విజయవిహారాలు చేస్తే చాలు.
ఇలాంటి వస్తు
భావనలు మస్తుగా వున్న ఈ కాలంలో – వంశీ, నీ ఆలోచనలు, నీ
అనుభూతులు వొకింత విచిత్రంగా వుండక మానవు. ఈ వుత్తరాలు చదువుతున్నప్పుడు చాలా
మందికి ఇవి ఎదో చిత్రమయిన లిపిలో కనిపించి, కాసేపు
వుక్కిరిబిక్కిరి అవ్వక మానరు. చాలా కాలం క్రితం నా లోపల కవిత్వమనే వొక పురుగు
మసిలి సతమతం చేస్తున్న తొలి రోజుల్లో బెజవాడలో మోహన రాం ప్రసాద్ అనే మిత్రుడు –
వాక్యం అంటే disturb
చెయ్యాలి.
వాక్యం అంటే పునాదిమట్టంగా destruct
చెయ్యాలి-
అని రాసి చూపించాడు వొక చిత్తు కాగితమ్మీద. ఇది తన కవిత్వ motto అని ప్రకటించుకున్నాడు. నిజానికి అది గొప్ప కవిత్వ వాక్యం అని నేనేమీ
చెప్పను కాని… ఆ సమయంలో అది వొక మాని ఫెస్టొ లాంటి వాక్యం లాగా అనిపించింది. ఇవాళ
వంశీ వుత్తరాలు చదువుతున్నప్పుడు అలాంటి ఆవేశమే కాసేపు పట్టి కుదిపింది. ఈ
వుత్తరాల్లోని చాలా వాక్యాలకు వొక కవిత్వ వాక్యానికి వుండాల్సినంత పొగరూ, విగరూ,
వగరూ వున్నాయి.
వంశీ మంచి కవి/
కథకుడు/విమర్శకుడు. అతని మనహ్ కార్మికశాల అనేక భావనల కొలిమి. నిజమయిన వూపిరితో, స్వచ్చమయిన
మనసుతో వూదీ, వూదీ నిప్పు కణికల్ని మన కళ్ల ముందు
మెరిపించే వచనశిల్పి వంశీ. మనకి మంచి వచనం రాసే వాళ్ళు లేరన్నది వాస్తవం. చాలా
మంది వచనం పేరుతో మన కళ్ల ముందు పేర్చేది తడి కట్టెలు. అవి చితి పేర్చుకోడానికి
కూడా పనికి రావు. వచనం పే రుతో వొట్టి దగా. పోనీ
అది కవిత్వమూ కాదు. కవిత్వం పేరుతో ఆత్మ/ పర వంచన. ఎక్కడో ఇంగ్లీషులో చదివిన
వాక్యాల్ని తెలుగులో కక్కి మన మనసుల్ని మురికి చేసే ప్రక్రియ. అలాంటి వచన వంచనలకూ,
కవిత్వ నేరాలకూ వంశీ మొదటినించీ దూరం. గత రెండు పదులుగా వంశీ
రాస్తూ వస్తున్న కవిత్వ, కథా, విమర్శ
రచనల్లో ఇది కనిపిస్తున్న సత్యమే. ఇవాళ నేను ప్రత్యేకించి చెప్పక్కరలేదు.
ఈ వుత్తరాల్లో
వంశీ ఇంకాస్త బాగా అర్ధం అవుతాడు. ఇన్నాళ్లుగా అతని రచనల అంతరంగంలోని మాటని ఈ
వుత్తరాలు ఎలాంటి దాపరికమూ లేకుండా విప్పి చెబుతాయి, రెండు కారణాల వల్ల – వొకటి,
వంశీ తనలోకి తాను తొంగి చూసుకునే ఆంతరంగిక వేళ ఇవి రాశాడు.
తనలోకి తాను తొంగి చూసుకున్నప్పుడు తనని తానుగా అన్ని బలహీనతలతో, అశక్తులతో, సంశయాలతో , సంకోచాలతో అందుకునే వ్యక్తి కోసం రాశాడు. చాలా సందర్భాలలో ఈ వుత్తరాలు
చదువుతున్నప్పుడు నాకు బుచ్చిబాబు ‘అంతరంగ కధనం’ గుర్తుకి వచ్చింది. వంశీ
చాలా సార్లు ఈ వుత్తరాల మధ్య చలాన్ని ప్రస్తావిస్తాడు కాని, నిజానికి
బుచ్చిబాబులోని ఆ ప్రచండమయిన అంతరంగ తీవ్రతే వంశీలో వుంది. చలం వుప్పెన లాంటి
వాడు. వొక్క క్షణం ఆలోచించే వ్యవధి ఇవ్వడు. బుచ్చిబాబు సెలయే రు, తెలియని ఆ వేగంలో, తీవ్రతలో ఆలోచించుకునే
నిబ్బరం కాస్త వుంది. వంశీలోనూ ఈ గుణం వుంది, వ్యక్తిగా,
రచయితగా.
వంశీ, నేనూ
ఇరుగుపొరుగు వూళ్లలో పెరిగాం. ఇరుగుపొరుగు వీధుల్లో చదువుకున్నాం. వొకే చోట కలిసి
పని చేశాం. అన్నిటికీ మించి చాలా పుస్తకాలు కలిసి చదివాం, చాలా ఆలోచనలు కలిసి చేశాం. అలా కలిసి పెరగడంలో కొన్ని సంతోషాలూ,
కొన్ని దుఖ్ఖాలూ వున్నాయి. ఎవరినించి ఏం తీసుకున్నామో తెలియదు.
అలా తీసుకుంటొ, తీసుకుంటొ వొక దశలో అహాలు పెరిగి, వొకళ్లనొకళ్లం క్షమించుకోవడం మానేస్తాం. చుట్టు వున్న వ్యాపార సూత్రాలు
అవతలి వ్యక్తి లోని గొప్పతనాన్ని వొప్పుకోనివ్వవు. ఇంతా చేస్తే, మనం వున్నది వస్తుగతమయిన వ్యాపార లోకమే! మిత్రులు శత్రువులవుతారు. లేదా,
మిత్రత్వపు ముఖం కింద శత్రుపార్శాన్ని దాచుకుని, నటించడం మొధలు పెడతారు. అలాంటి వ్యాపార వస్తు వంచనత్వం వంశీకి
పట్టుబడలేదు.
అంతటా వ్యాపార
వ్యామోహమే జీవన శాసనం అయ్యినప్పుడు….అప్పుడేం చెయ్యాలి? ఎవరికయినా
మనసు విప్పి వొక వుత్తరం రాయాలి, ఈ మెయిల్స్ , సెల్ ఫోన్స్ , ఫోన్స్ పక్కన పడేసి, పొస్టాఫిస్ కి వెళ్లి, వొక నీలి కవరు
కొనుక్కొచ్చి, ఎగశ్వాస, దిగశ్వాస
వినపడేట్టు- కొన్ని అక్షరాలు సిరాలోంచి కాగితమ్మీదికి ఎలాంటి పూచీకత్తు లేకుండా
రాలాలి.
అలాంటి అనుభూతి
కలగలేదనుకోండి.
అప్పుడు – ఈ
వంశీ వుత్తరాలు చదవండి. వాటిల్లో మనసుని తేలిక చేసే
చిక్కని ఇరానీ చాయ్ గమ్మత్తు వుంది. చదివాక – ఎంత
కాదన్నా కాస్త మనసు తడుస్తుంది.
అప్పటికీ మనసు
రాలేదనుకొండి.
అప్పుడు –
ఈ నానా
వస్తువ్యాపార పట్టణ మహమ్మారిని వదిలించుకొని – వొక ఆకుపచ్చని దారి గుండా వొక చిన్న
వూరికి కాలి నడకన వెళ్ళండి.
ఖమ్మం నించి
మధిరకి పాసింజరు బండిలో ఎక్కి, పందిళ్లపల్లి అనే చిన్న వూరి దగ్గిర దిగండి. ఆ
వూళ్లో చెట్లకి , ఆ వూరి మధ్య నాటకాల ఆరుబయలుకి
ముప్పయ్యేళ్ళ కింద సత్యం అనే పిల్లగాడు తెలుసు. అతని తండ్రికి బడి పిల్లలన్నా,
నాటకాలన్నా ప్ర్రాణం కాబట్టీ , ఆ పంతులు
గారి అబ్బాయి అని చెప్పండి వివరం కోసం.
ఆ వూరికి నాటకాల
కోసం నేను చింతకాని నించి నడుచుకుంటూ వెళ్లిన చిన్నతనంలో ఆ పంతులు గారి అబ్బాయిని
మిస్సయ్యాను. చాలా కాలం తర్వాత కలిసినప్పుడు ‘మనం ఇద్దరం వొక వూరి గాలి
కలిసి పీల్చాం,
వొక వూరి నీళ్లు కలిసి తాగాం. వొక వూరి ఆరుబయలులొ కలిసే ఆ
నాటకాలు చూసి వుంటాం,’ అన్నాను. అది
అంటున్నప్పుడు కూడా వంశీ ఎవరో నాకు పెద్దగా తెలియదు, ఈ వుత్తరాలు చదివాక
తెలిసినంతయినా.
కాని, అది వూహ
తెలియని లోకం. బహుశా ఇంకా మనకి వూహ తెలియలేదనే అనుకుంటాను. అప్పుడప్పుడూ ఇలాంటి వుత్తరాలు చదువుతున్నప్పుడు కొన్ని వూహలు తెలుస్తాయి. ఆ పల్లెటూరి
ఆకుపచ్చ దారి లా అవి తెరుచుకొంటాయి. కాసేపు పసితనంలోకి వెళ్లి , వూహల స్కేలు మీద వాటి తీవ్రతల్ని ఆనవాలు పడతాం.
అలాంటి వుత్తరాల
వూహల ఆనవాళ్లని కానుక చేస్తున్న వంశీకి
…… ప్రేమతో …………….. సరిహద్దుల ఆవలి నించి
తన మార్గం సుహానా సఫర్ !
మళ్ళీ ఇల్లు మారుతున్నాం. ఇట్లా
ఇల్లు మారినప్పుడల్లా పాత కాయితాల్లోంచి కొన్ని అద్భుతాలు మెరుస్తాయి, నిన్నటి జ్నాపకాల తళతళతో- అట్లా అబ్బూరి ఛాయాదేవి గారు
కల్పనకి రాసిన వొక వుత్తరం కనిపించింది. ఛాయాదేవి గారి కుదురైన చేరాత చూస్తూ
కాసేపు ముచ్చటపడి, పుస్తకాలు సర్దుకోవడం అయిపోయాక ఇవాళ
సాయంత్రం తీరిగ్గా ప్రశాంతంగా చూద్దామని టేబుల్ మీద పెట్టుకున్నాను. సాయంత్రం
కొంతమంది తెలుగు మిత్రులతో మా వూళ్ళోని షూకిల్ నదీతీరానికి నడక ప్లస్ డిన్నర్
కార్యక్రమం ముగించుకొని, తిరిగి వస్తున్నప్పుడు కొండవీటి
సత్యవతి గారి ఫేస్ బుక్ మెసేజ్—ఛాయాదేవి గారు ఇక లేరని! ఇవాళ పొద్దున్న లేవగానే
చూసిన/ తారసపడిన కుదురైన అక్షరాల సమూహం
వొక్కసారిగా చెరిగిపోయినట్టుగా అనిపించింది. యింటికి వచ్చాక ఛాయాదేవి గారి వుత్తరం
చదువుతూ వుంటే, ఆ అక్షరాల వెనక ఆమె అందమైన ఆహ్లాదమైన
వ్యక్తిత్వం కనిపిస్తూ వుంది.
ఛాయాదేవిగారితో ముఖాముఖీ పరిచయం ముప్పయ్యేళ్లు
పైనే- పరోక్ష పరిచయం యింకో అయిదేళ్లు
వెనక్కి- అంటే, దరిదాపూ ఆమె పేరు
నా ఆలోచనల్లోకి అడుగుపెట్టి ముప్ఫై అయిదేళ్లు.
1
డిగ్రీ చదివే రోజుల్లో కవిత్వం
చదవడం అనే జ్వరం బాగా వేడెక్కినప్పుడు ఆశ్చర్యంగా చేతికందిన అందమైన పుస్తకాల్లో
“కవిత” వొకటి. కవిత్వ పుస్తకాలు- ఆ మాటకొస్తే యే పుస్తకమైనా అయితే, 1/8 డెమ్మీ లేదూ, ¼ డెమ్మీ, లేదూ క్రౌన్ సైజులో మాత్రమే కనిపించే లెటర్
ప్రెస్ యుగం అది. ఆ మూడింటికీ భిన్నమైన సైజులో “కవిత”. అది మొదటి ఆశ్చర్యమైతే, రెండోది: అసలు కేవలం కవిత్వానికి మాత్రమే పరిమితమైన వొక ప్రత్యేక సంచికని
చూడడం గొప్ప ఆనందం. దాన్ని ‘unsize’ అనేవాళ్లం. అన్నింటికంటే
పెద్ద ఆశ్చర్యం: మహిళా ఎడిటర్ నిర్వహణ! అంటే, అబ్బూరి
ఛాయాదేవి గారి సంపాదకత్వం.
ఏడాదికి మూడు సార్లు రావాల్సిన “కవిత” రెండు సంచికల దగ్గిరే ఆగిపోయిందని తరవాత విన్నాను. నా
దగ్గిర వొకటి యెలానూ వుంది కాబట్టి, రెండోది కూడా
దొరకపుచ్చుకోవాలని ఆ సమయంలో చాలా ప్రయత్నం చేశాను. నాకు తెలిసిన లైబ్రరీలన్నీ
గాలించాను, ఖమ్మం నుంచి బెజవాడ టాగోర్ లైబ్రరీ దాకా- ఇక నాకు
అందుబాటులో వున్న వ్యక్తిగత లైబ్రరీలు -వేగుంట మోహన ప్రసాద్,
హీరాలాల్ మోరియా, నండూరి రామమోహన రావు గారు, టీయల్ కాంతారావు గారు మొదలుకొని
హైదరాబాద్ దాకా-
అప్పటికి నాకు ఛాయాదేవి గారు
తెలీదు. పూర్తిగా కొత్త వ్యక్తులతో స్నేహహస్తం చాచే కలుపుగోలుతనం లేదు. కానీ, జీవితం అనేది దానికదే విచిత్రమైంది కాబట్టి- ఆరుద్రగారు
హైదరాబాద్ వస్తూ, “నువ్వొస్తే మనం కొంతమందిని కలుద్దాం” అని
ఆయనే నండూరిగారికి చెప్పి నాకు మూడు రోజుల సెలవు ఇప్పించారు. అవి నేను బెజవాడ
ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్న రోజులు. కేంద్ర సాహిత్య అకాడెమీ కోసం ఆరుద్ర గారు 1975
తరవాతి కవిత్వాన్ని సంకలనం చేసే బాధ్యత తీసుకున్నారు. దానికి నన్ను
సహాయకుడిగా పెట్టుకున్నారు. ఆరుద్ర గారు ఇటు బెజవాడ, అటు
హైదరాబాద్ వచ్చినప్పుడల్లా ఆయనే నండూరి గారికి చెప్పి, “
అఫ్సర్ ని నేను కిడ్నాప్ చేస్తున్నా” అని తన వెంట తీసుకువెళ్తున్న రోజులవి. అట్లా
హైదరాబాద్ లో మొట్టమొదటిసారి ఛాయాదేవి గారిని కలిశాను.
కలవగానే ఆమె అన్న మొదటి వాక్యం:
“అఫ్సర్ కదా..ఆ పేరు నాకిష్టం. మా కాపురం మొదలు పెట్టిన మొదటి ఇంటి పేరు అఫ్సర్
మంజిల్!” అన్నారు చాలా సంతోష పడిపోయి- అది చిన్న సంతోషమే కావచ్చు కానీ, ఆ సంతోషం ఆమెని చాలా గతంలోకి లాక్కు వెళ్లింది. అప్పటి
హైదరాబాద్, హిమాయత్ నగర్...అవన్నీ ఆమె
నెమరేసుకుంటూ, మధ్యలో “కవిత” గురించి
చెప్పడం మొదలు పెట్టారు. నాకు కావలసిన అసలైన సమాచారం దొరకడం మొదలు పెట్టింది.
“కవిత” మొదలైంది 1954లో- ఆధునికత
అనే భావనకి వొక ఆకారమేదో యేర్పడుతున్న కాలం అది. ముఖ్యంగా హైదరాబాద్ కేంద్రంగా
సాహిత్య వాతావరణంలో కొత్త మార్పు వస్తోంది. తెలుగు భాషకి సొంత అస్తిత్వం కావాలనే
కాంక్షతో పాటు కాస్మోపోలిటన్ సంస్కృతి వల్ల హైదరాబాద్ hybrid సాహిత్య ప్రయోగాలకు అది తొలి దశ. వొక వైపు “కవిత” సంచికల మీద వివాదం మొదలయింది. ఆ కవిత్వంలోని ఆధునికత, ప్రయోగ ధోరణి మీద ప్రధాన స్రవంతి పత్రికలన్నీ కరవాలాలు దూస్తున్నాయి. ఆ ప్రయోగంలో దేశీయత లేదన్నది ప్రధానమైన విమర్శ.
దానికి దీటుగా “తెలుగు స్వతంత్ర”లో శ్రీశ్రీ సమాధాన అస్త్రం. యిట్లాంటి ప్రయోగాలు
వచ్చి తీరాల్సిందేనని మొండి సమాధానం. అట్లాంటి వాతావరణంలో కవిత్వంలో మాత్రమే
వుండకుండా, వచనం వైపు మళ్లారు ఛాయాదేవి. ఆ తరవాత అదే “తన
మార్గం”గా ఆమె ప్రకటించుకోలేదు గాని, అంతకంటే యెక్కువ
ఏకాగ్రతతో రచనావ్యాసంగం కొనసాగించారు.
తెలుగు సాహిత్యంలో స్త్రీవాదం
వొక్కసారిగా పెల్లుబికిన వుద్యమం కాదు. అనేక దశల్ని దాటుకుంటూ 1985 తరవాత
స్థిరపడిన అస్తిత్వ వుద్యమం అది. భారతీయ సాంస్కృతిక రాజకీయ చరిత్రలో the long 50s గా భావించే యాభైల గురించి మనకింకా సరైన పరిశోధన
గాని, చరిత్ర నిర్మాణం గాని జరగలేదు. ఆ పరిశోధన సాధ్యపడి, ఆ దశకానికి
సంబంధించిన సాహిత్య ఆకరాలు దొరికితే తప్ప తెలుగు సాహిత్య చరిత్ర పునర్ నిర్మాణం
సాధ్యపడదు. ఆ దశకంలో ఛాయాదేవి గారి వంటి రచయిత్రులు చేసిన కృషి కూడా వెలుగులోకి
రాదు.
అయితే, ఛాయాదేవి గారు ఆ దశలో రాసిన కథల్లోనే నగరజీవితం ఎక్కువగా
కనిపించడానికీ, హైదరాబాదీ సాంస్కృతిక వెలుగునీడల్లో వరద
రాజేశ్వర రావుగారూ ఆమె కలిసి నడిచిన అడుగుల ప్రభావం చాలా వుందని మాత్రమే యిప్పటికి
నేను చెప్పగలను. ఇక్కడ కూడా నాకు బాగా ఆకట్టుకున్న విషయమేమిటంటే- రాజేశ్వరరావు
గారి దారికి భిన్నంగా ఛాయాదేవి గారు తనదైన మార్గాన్ని discover చేసుకోవడం. తన దారి మీద తనదైన గొప్ప నమ్మకంతో ముందుకు కొనసాగడం---ఆ
విధంగా ఆమె రెండు రకాల hegemony ని subtle గా ప్రశ్నిస్తూ ముందడుగు వేశారని నాకు అనిపిస్తుంది.
2
ఆరుద్రగారి వల్ల ముందే పరిచయమైనా, నేను యింకో రెండు మూడడుగులు ముందుకేసి,
ఆమె స్నేహ హస్తాన్ని అందుకున్నది మాత్రం 1992 తరవాతనే!
అదే సంవత్సరం నా కవిత సంపుటి
“ఇవాళ”కి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు దక్కింది. అప్పట్లో మా తరానికి ఆ అవార్డు
ఫ్రంట్ రాంక్ సత్కారమే! హైదరాబాద్ సిటీ సెంట్రల్ లైబ్రరీలో అవార్డు ప్రదానం
జరిగింది. ఆ సభకి సిరి చుక్కల్లాగా మొదట వచ్చిన వారిలో ఛాయాదేవి గారు వొకరు. “
అఫ్సర్ కి మంజిల్ దొరికింది!” అన్నారామె మనస్ఫూర్తిగా అభినందిస్తూ. ఆ మర్నాడు
వాళ్ళ యింటికి బ్రేక్ ఫాస్ట్ కి పిలవడం వల్ల మరిన్ని కబుర్లు చెప్పుకునే అవకాశం
దొరికింది. అదే సమయంలో నా రీడింగ్ జర్నీలో మరో అద్భుతం జరుగుతూ వుంది. అది అబ్బూరి
రామకృష్ణా రావు గారి “ఊహాగానం మరి కొన్ని కృతులు” అనే మరో అందమైన పుస్తకం- ఎర్రట్ట పుస్తకం మీద బంగారు రంగు అక్షరాల
ఎమ్బోజింగ్ తో వచ్చింది ఆ పుస్తకం. చేతిలో పట్టుకుంటే దానికదే అలంకారంగా వుండేది.
యీ రెండో కలయికలో కబుర్లన్నీ
యెక్కువగా అటే మళ్లాయి. అయితే, అవి మనకున్న
మరో నగరం విశాఖ పట్నం చుట్టూ తిరిగిన విషయాలు. అభ్యుదయ వుద్యమం, అందులో అబ్బూరి వారి పాత్రా...యిట్లా అనేక గత జ్నాపకాల సంచారం.
నాకు గుర్తున్నంత మేరకు ఛాయాదేవి
గారి దృష్టి, ఆమె అనుభవాల బలమంతా హైదరాబాద్
జీవితం నించి వచ్చిందే. ఆ రోజు చెప్పిన విషయాల్లో నాకు ఆమె విశాఖ – హైదరాబాద్ లు
యే రకంగా భిన్నమైన ప్రభావాలో యెక్కువగా చెప్తూ వచ్చారు. బహుశా, ఆ భిన్నత్వం అర్థమైంది కాబట్టే ఆమె అయిదు నక్షత్రాల ఆసుపత్రుల కొర్పోరేట్
మార్కెట్ గురించి కథ రాయగలిగారు. నాకు తెలిసీ, ఆ రకమైన
కార్పొరేట్ జీవన విధానం సాహిత్యంలోకి తీసుకువచ్చిన తొలి రచన ఆమెదే కావచ్చు. అయితే, ఈ కథ కంటే ముందే ఛాయాదేవి గారు రాస్తూ వచ్చిన కథల్లో హైదరాబాదీ మధ్యతరగతి
మహిళ చాలా బలమైన subjectivity తో కనిపించడం మొదలెట్టింది. ఆ
కోణాన్ని ప్రోటో-ఫెమినిస్టు దృక్పథం నించి గమనిస్తే, ఆమె
సృష్టించిన స్త్రీపాత్రలన్నీ స్వయం వ్యక్తిత్వంతో అందంగా ప్రకాశిస్తూ కనిపిస్తాయి.
3
ఛాయాదేవి గారిని 1992 తరవాత
యెన్ని సార్లు కలిశానో నాకు గుర్తు లేదు. కానీ,
మరో మరచిపోలేని సందర్భం నేను మాడిసన్ విస్కాన్సిన్ వచ్చే ముందు చేకూరి రామారావు
గారితో కలిసి, వాళ్లింటికి వెళ్ళాం.
ఆ సమయంలో మాడిసన్ వెళ్లాలా వద్దా
అన్న డైలమాలో విపరీతంగా నలిగిపోతున్నప్పుడు “లేదు, వెళ్ళాల్సిందే!” అని ఖరాఖండిగా చెప్పి, యెందుకు
వెళ్లాలో సాక్ష్యాధారాలు చూపించే ప్రయత్నంలో చేరాగారు నన్ను వాళ్లింటికి లాక్కు
వెళ్లారు. వరద రాజేశ్వర రావు గారు కొన్నాళ్లు మాడిసన్ లో పాఠాలు చెప్పారు, చేరాగారు మాడిసన్ వెళ్లడానికి అటూ యిటూగా- మాడిసన్ జీవితంలోని మాధుర్యం
గురించి కథలు కథలుగా వాళ్ళిద్దరూ ఆ రోజు చెప్పుకుంటూ వెళ్ళడం యిప్పటికీ గుర్తుంది.
మాడిసన్ రావడానికి ముందు నన్నూ కల్పనని భోజనాలకు పిలిచిన సందర్భాలు కూడా కొన్ని
వున్నాయి. కల్పన నవల తన్హాయీ వెలువడినప్పుడు ఆ నవలకి మనస్ఫూర్తిగా స్వాగతమిస్తూ విపులమైన సమీక్ష
రాశారు ఛాయాదేవి గారు. నిజానికి ఆ సమీక్ష ఆమె రాశారని తెలీదు. ఆ సమీక్ష అచ్చయ్యాక
యెవరో చెప్తే, తెప్పించుకొని, చదివి, మేమే మళ్ళీ ఫోన్ చేశాం, ఆస్టిన్ లో వుండగా-
ఆమెని దగ్గిరగా చూసిన వాళ్ళకి
రెండు విషయాలు అర్థమవుతాయి. వొకటి: ఆమెలోని నిలకడ, రెండు: జీవితం యెట్లాంటి చేదు అనుభవాలిచ్చినా, తను
మాత్రం స్నేహామో ప్రేమో తిరిగివ్వడం.
ఆమె వ్యక్తిగత, సాహిత్య జీవితాల్లో గొప్ప నిగ్రహమూ,
విశ్వాసంతో నిండిన నిలకడ వుంది. ఆమె మొదటి కథ నించి తాజా రచన దాకా ఆమెలోని ఆ
కుదురైన బతుకు ఇరుసు చెక్కుచెదరలేదు.
ఛాయాదేవి గారు యెక్కడున్నా తనున్న
చోటుని ఆహ్లాదంగా అందంగా నిరాడంబరమైన aesthetic beauty తో నింపుకుంటారు. అవి పుస్తకాలా, చిత్రాలా, తనదే అయిన స్వచ్చమైన presence ...వీటిల్లో దేనిది ఆ అందమూ చెప్పడం కష్టమే! బహుశా,
వాటన్నీటి కంటే యెక్కువగా ఆ చల్లనైన చిరునవ్వు కావచ్చు. స్నేహితుల పట్ల తనకున్న
నిండైన ప్రేమభావమంతా వ్యక్తమయ్యే తన కదలిక కావచ్చు.
కాలంతో పాటు మారే శక్తి అంత
తేలికేమీ కాదు. పైగా, కొన్ని తరాల
చరిత్రని చూస్తూ చూస్తూ కాలంతో పాటు వచ్చే ప్రతి కదలికని తన మార్గంలో కలుపుకుంటూ
వెళ్ళడం యింకా కష్టం. ఛాయాదేవి గారి జీవితం నేర్పే పెద్ద పాఠం అదే అనుకుంటాను.
*
(జూన్ 28, 2019)
బెజవాడ సాహిత్య చరిత్ర అంటూ యెవరైనా రాయగలిగితే, ఇంద్రగంటి శ్రీకాంత
శర్మగారికి అందులో కనీసం వొక అధ్యాయం తప్పకుండా కేటాయించాల్సిందే. శ్రీకాంత
శర్మగారు బెజవాడ ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు అన్న
తారీఖులూ దస్తావేజులు పక్కన పెడితే, ఆంధ్రజ్యోతి వారపత్రికలో
మొదలైన ఆయన వుద్యోగ పర్వం కేవలం ఆయన వ్యక్తిగతం కాదు. అదంతా సాహిత్య చరిత్రే! ఆయనే
అన్నట్టు: “నేను విజయవాడలో పాతికేళ్ళ పాటు గడిపిన జీవితం—ఒక సాహిత్యోత్సవం. మూడు
తరాల విభిన్న రచయితలతో గడిపిన సందర్భాలు ఎన్నటికీ మరుపురానివి.” (2014).
శర్మగారితో నా చిట్టచివరి సంభాషణ ఈ ఏడాది జనవరి 20. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన సమక్షంలో
వున్నాను, నవ్వుతూ తుళ్లుతూ- గతంతో పోల్చినప్పుడు ఆయనంత
ఆరోగ్యంగా యేమీ లేరు అప్పుడు. కానీ, యింకో స్నేహితుణ్ణి
చూశానన్న ఆ ఉత్సవపు మెరుపు తగ్గలేదు కొంత కూడా! “మిమ్మల్ని చూసి ఆ వుత్సాహం!
బెజవాడని తలచుకొని పండగ!” అన్నారు జానకీబాల గారు, కిరణ్మయి, మోహన కృష్ణ, ఉమ, బలరామ్ ఆ
రోజు.
గతంలోకి వెళ్తే, శర్మగారికి కనీసం యెనిమిదేళ్ళ తరవాత నేను ఆంధ్రజ్యోతి
దినపత్రికలో చేరాను. ఆయన ఆకాశవాణికి మారారన్న మాటే కానీ,
దాదాపూ ప్రతి రోజూ శర్మగారి పేరు నేను వింటూ వుండే వాణ్ని. పురాణం- శ్రీకాంత శర్మ-
శ్రీరమణ అదీ అప్పటి “జ్యోతి”త్రయం! అప్పటి ఎడిటర్ నండూరి రామమోహన రావు గారి నోటి
వెంట ఆ మూడు పేర్లూ రాని రోజంటూ వుండేది కాదు. ఏదో వొక సందర్భంలో –ఆ మాటకొస్తే మేం
దినపత్రిక వాళ్ళమే అయినా- నండూరిగారితో యెప్పుడూ రాజకీయ విషయాలు ప్రస్తావనకి
వచ్చేవే కాదు. ఆయన ప్రాణాలన్నీ సాహిత్యంలోనో, న్యూ వేవ్
సినిమాల్లోనో, సంగీతంలోనో
వుండేవి. శర్మగారు కూడా అంతే!
ఆంధ్రజ్యోతిలో నేను రాసిన మొట్టమొదటి వ్యాసం “నిరాశా వైణికుడు ఆంటన్ చెహోవ్”.
ఆ వ్యాసం మీద నండూరిగారికి చాలా అభ్యంతరాలుండేవి. చెహోవ్ నిరాశావాది కాదని ఆయన
గట్టిగా నమ్మేవారు. అట్లా అని అతను ఆశావాది కూడా కాదని నేనూ గట్టిగానే వాదించే వాణ్ని. (నిరాశావాదం.
ఆశావాదం --ఆ రెండూ యేమిటనేది ఇప్పటికీ తెలీదు!) కానీ, ఆ వ్యాసం బెజవాడ సాహిత్య దిగ్గజాల మధ్య
ఎంట్రీకి నాకు వీసా ఇచ్చింది. ముఖ్యంగా, శ్రీకాంత శర్మగారికి
చెహోవ్ అంటే వున్న విపరీతమైన ప్రేమ వల్ల మా ఇద్దరి మధ్యా అదే తొలి ముచ్చట అయింది.
ఆ వ్యాసం తరవాత ఉషశ్రీగారు ఏకంగా ఆఫీసుకే (సొంత ఫోన్లు లేవు కదా!) ఫోన్ చేసి, “నాయనా, నువ్వు ఇవాళ సాయంత్రం దర్శనమిచ్చి వెళ్ళు”
అన్నారు.
ఆ రోజు సాయంత్రం మొట్టమొదటిసారి శ్రీకాంత శర్మగారిని కలిశాను. అప్పుడు నా వయసు
పందొమ్మిది అని గుర్తుకు తెచ్చుకుంటే మా
ఇద్దరి బంధం ముప్పయి అయిదేళ్ళ పైనే!
అంతకుముందు శర్మ గారంటే నాకు “మహాసంకల్పం” కవిత్వ సంపుటి(1975) , “అనుభూతి
గీతాలు” (1976) మాత్రమే! “మహాసంకల్పం” చాలా విధాలుగా ససేమిరా విడిపోని companion.
మేం రేడియోలో మొదటి సారి కలిశాక, ఆ రెండూ
వెనక్కి వెళ్లిపోయాయ్. అప్పటి నుంచీ బెజవాడ ఎవరైనా వస్తే,
శర్మగారు నాకు కబురు పంపడం ఆనవాయితీ అయింది. అప్పటికి నేను పెద్ద మాటకారిని
కాకపోయినా, నా మౌనం
కష్టంగానే వున్నప్పటికీ శర్మగారు కానీ, మా అతిధులు కానీ
యేనాడూ కష్టపడలేదు. చాలా ఇష్టంగానే నా కొద్దిపాటి మాటల్ని,
మోతాదు మించిన మౌనాన్ని భరిస్తూ వచ్చారు. ఉషశ్రీగారికి మాత్రం నా మౌనం నచ్చలేదు.
“శర్మా, వీడికి కాసిని మాటలు నేర్పించరా!” అని నన్ను శర్మ
గారికీ అప్పజెప్పేశారు. నన్ను మాటకారిగా మార్చే వుద్యమం అంత సఫలం కాలేదు కానీ, స్నేహం మాత్రం ముందుకు సాగిపోయింది. శర్మగారికి నాకూ వయసులో చాలా అంతరం
వుంది. కానీ, వయసుతో నిమిత్తం లేని ప్రేమ ఆయనది. మనిషినీ, వయసునీ ఎగాదిగా చూసి సంభాషణ
మార్చే తత్వం కానే కాదు ఆయనది. బహుశా, నేను చూసిన
పెద్దవాళ్లల్లో అట్లాంటి విశాలమైన మనసున్న వాళ్ళు కొద్దిమందే. అదే మిమ్మల్ని
చివరిదాకా నడిపించిన శక్తి అని నా నమ్మకం.
శ్రీకాంత శర్మ గారు అనేక ప్రపంచాల నివాసి. ఆయన్ని కేవలం లలిత గీతాల్లోకో,
వచనకవిత్వంలోకో, ఆయనకెంతో ఇష్టమైన రేడియో రూపకాల్లోకో
కుదిస్తే, ఆయనెవరో మనకి సరిగ్గా తెలియనట్టే. ఆ మాటకొస్తే, ఆయన వచన కవిత్వంలోకి ఆలశ్యంగా అడుగుపెట్టారు. అదీ మొదట్లో ఆయనకి lyric
మీద మొగ్గు. అచ్చంగా వచనకవిత్వంలోకి ఆయన అడుగుని పదిలం చేసింది “అనుభూతి గీతాలు.” అంటే రచనా వ్యాసంగం మొదలైన పదిహేనేళ్ల తరవాత చేరుకున్న
మజిలీ అది. అప్పటిదాకా ఆయన కవిత్వంలో కూడా లిరిక్ లయ కనిపిస్తూనే వుండేది. ఆ లయని
దాటి వచనకవిత్వానికి కావలసిన వచనపు నడక సాధించడానికి ఆయన చాలా conflict కి లోనైన ఛాయలు కూడా “అనుభూతి గీతాలు”లో కనిపిస్తాయి. కవిత్వంలో
దృశ్యాన్ని freeze చేసి, దాని
వర్ణనలోంచి భావనలోకి ప్రయాణించిన ధోరణి ఆయనది. అందుకే, ఆయన
వూహించిన/ చూపించిన కవిత్వ దృశ్యాలు చాలా బలంగా వుంటాయి. ఆ దృశ్యం ప్రకృతిది
కావచ్చు, మనిషికి సంబంధించిందే కావచ్చు. ఈ రెండు ఉదాహరణల్లో ఆయన ఎక్కువగా
కనిపించకపోవచ్చు గాని, ఆయన భావాన్ని ఎట్లా “చిత్రం”గా
వూహిస్తారో తెలుస్తుంది.
సూర్యకిరణాల జీవధార
నిద్రపోయే నది గుండెని తట్టి
పడవను మేలుకొలుపుతుంది- (“అనుభూతి గీతాలు” 1976)
కొండరాళ్ళ మీద నుంచి
వర్షాధారలు జారిపోయినట్టు
ఎన్నేళ్లు గడిచాయో కదా! (చివరి కవిత “ఏరు
దాటిన కెరటం” , 2018)
ఆయన అనేక వచన రచనలూ, సాహిత్య
కాలమ్ ల మధ్యా నా మటుకు నేను వుక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు -- “ఇంతకీ మిమ్మల్ని
యెట్లా చూడాలి?” అంటే ఆయన “స్నేహితుడిగా!” అనేసి గట్టిగా
నవ్వేసిన సందర్భాలు చాలా వున్నాయి కానీ, పట్టువదలని నాలోపలి
విక్రమార్కుడు ఆయన్ని వదల్లేదు. “అదే ప్రశ్న ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరేం
చెప్తారు?” అంటూ ఆయన వొకసారి తానే సమాధానమిస్తూ వెళ్లారు.
“జీవితం కొన్నిటిని నిర్దేశిస్తుంది. ఆదేశిస్తుంది. అవే నేను అనుసరించాను. యెక్కడా
యెప్పుడూ వొక ప్రక్రియలోనే బందీగా వుండలేకపోయాను. బహుశా, అది
నేను జీవితాంతం నేర్చుకున్న స్వేచ్ఛా భావన
వల్ల అనుకుంటా!”
కవిత్వం మీది ఆయన మమకారం అందరికీ తెలిసిందే అయినా, వచన
ప్రక్రియల్లో మాత్రమే శర్మగారి నిలువెత్తు
వ్యక్తిత్వం తెలుస్తుందని నేను మొదటి నుంచీ అనుకుంటున్నా. తొలినాళ్ళల్లో – అంటే
1962 ప్రాంతాల్లో- రాసిన కథలు మొదలుకొని, “ఇంద్రగంటి ఇంటి
పేరు” అనే ఆత్మకథ దాకా శర్మగారి వచనం ఆయన కవిత్వానికి సరిదీటుగా నిలబడుతుంది. ఇస్మాయిల్
గారు ఆంధ్రజ్యోతిలో 1980 ల ప్రాంతాల్లో కవిత్వం స్వేచ్ఛ అనే వ్యాసం పెద్ద వివాదం
అయినప్పుడు శర్మగారితో పాటు కొందరు అనుభూతి వాద ఛాయల్లోకి బలంగా నెట్టివేయబడ్డారు
కానీ, శర్మగారి బహుముఖ అన్వేషణ ఆ అనుభూతివాద ఛత్రం కింద అంతగా యిమడలేదని
అప్పుడూ ఇప్పుడూ నా నమ్మకం. ఆ చర్చలో భాగంగా ఆంధ్రజ్యోతిలో నేను రాసిన వ్యాఖ్య ఆయన
ఎప్పటికీ మరచిపోలేదు కూడా. “తెలుగు కవిత్వంలో నిజంగా కవిత్వం అనేది రాస్తున్న
వాళ్ళని చేతి వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు.” అన్న వాక్యం ఆయన మొన్న జనవరి 20 న మా
చిట్టచివరి సంభాషణలో కూడా గుర్తుకు తెచ్చుకొని, పగలబడి
నవ్వారు. ఆ విషయం పక్కన బెడితే, “మీరు గమనించారో లేదో
గాని...కవిత్వం కంటే మన ఆత్మలు వచనంలో స్ఫుటంగా పలుకుతాయి.” అని ఆ రోజు ఆయన అన్న
వాక్యం నాకు ఆయన మొత్తం సాహిత్య యాత్రకి
సూచికలా అనిపిస్తుంది. అదే మాట ఈ
మధ్య తల్లావజ్ఝల పతంజలి గారికిచ్చిన వొక ఇంటెర్వ్యూలో ఆయన చాలా నిక్కచ్చిగా
చెప్పారు.
ఆయన అంటారు:
నేను
ఇంగ్లీష్ లో ఆస్కార్ వైల్డ్, గోర్కీ, కాఫ్కా, చెహోవ్, ఓ హెన్రీ, మపాసా వంటి రచయితల కథలు చదివి
కవిత్వం వైపు మళ్లిన వాడిని.
నా
ఊదేశ్యంలో రచయిత అయినవాడికి అన్ని ప్రక్రియలు కరతలామలకంగా ఉండాలి. ఏ పరికరం అవసరమో గుర్తెరిగి ఆ
వృత్తంతో అనుసంధించ గలగాలి.
‘కలిపి
కొట్టరా కావేటి రంగా ‘ అన్న సామెతగా సర్వం కవిత్వం పేరిట ఊరదొక్క కూడదు. నేను చేసిన వృత్తుల కారణంగా వివిధ
ప్రక్రియలలో రచనలు చేయవలసిన అవసరం నా కేర్పడింది. నాకా ప్రక్రియలు లొంగడానికి
కారకులు – గాయకులు, నర్తకులు, నాటక ప్రయోక్తలు – యక్ష గాన
కళాకారులు – నేనెరిగిన మూడు తరాల రచయితలూను. సాహిత్యంలో
ప్రక్రియా వైవిధ్యం నాకు చాలా ఇష్టమైన అంశం. (“సారంగ”
వెబ్ పత్రిక, 2017)
వచనంలో శర్మగారు దాదాపు ప్రతి ప్రక్రియల్లోకీ
ప్రవేశించారు. వీటన్నిటిలోనూ ఆయన అనుభూతి కవిత్వం పేరుతో చేసిన రచనలకు
భిన్నమైన ప్రయాణమే కనిపిస్తుంది. నిజానికి ఈ ముప్పయేళ్ల పైబడిన మా సంభాషణల్లో
కవిత్వం ప్రస్తావన చాలా తక్కువ. అటు పాశ్చాత్య సాహిత్యమైనా, ఇటు
భారతీయ సాహిత్యమైనా ఆయన ముఖ్యంగా మాట్లాడుతూ వచ్చింది వచన రచయితల గురించే! ఆయన
తనకెంతో ప్రధానమైన వచన శైలీ నిర్మాతలు చలం, శ్రీపాద ని తలచుకోని సందర్భం వొక్కటీ లేదు. “వాళ్ళిద్దరూ లేకుండా ఆధునిక
తెలుగు వచనాన్ని నేను కనీసం వూహించగా లేను. ఇప్పటికీ తెలుగు సాహిత్యానికొక శైలీ
సిలబస్ కావాలంటే వాళ్లతోనే నేను మొదలెడ్తాను” అన్నారాయన వొక సందర్భంలో-
అనేక రకాల వచన ప్రక్రియల మధ్య కవిత్వం ఆయన దారిలో చిన్న pause లాగా
కనిపిస్తుంది. అయిదేళ్ళ కిందట ఆయన కుటుంబ సభ్యులు- నాకు తెలిసీ ముఖ్యంగా “అనల్ప” బలరామ్ ప్రమేయం వల్ల- అచ్చయిన ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారి
సాహిత్యం రెండు బృహద్ సంపుటాలు పైపైన చూసినా ఈ విషయం గట్టిగానే తెలుస్తుంది. ఈ
సంపుటం రెండో భాగంలో ఆయనే అంటున్నారు: “గుడిపాటి వెంకట చలం,
దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీపాద,
శ్రీశ్రీ, బుచ్చిబాబు, దేవరకొండ
బాలగంగాధర తిలక్, రాచకొండ విశ్వనాథ శాస్త్రి, అజంతా—నన్ను మిక్కిలిగా ఉక్కిరి బిక్కిరి చేసిన నా ముందుతరం రచయితలు.” (2014)
ఈ రచయితలందరి గురించీ యేదో వొక సందర్భంలో మేం మాట్లాడుకుంటూనే వున్నాం.
వ్యక్తిగతంగా జరిగే సంభాషణల్లో బోనస్ యేమిటంటే, ఆయన ఎప్పుడూ
ఎక్కడా రాయని విషయాలు కొన్ని బయట పెడుతూ వుండడం! కృష్ణశాస్త్రి గారు గొంతు పోయాక
రాసిన కొన్ని స్లిప్స్ చూపించినప్పుడు నాకు కళ్ల నీళ్ళు ఆగలేదు. వాటిలో కొన్ని
ఆయనా, నండూరి చాలా జాగ్రత్తగా దాచిపెట్టారు. ఆ అందమైన
దస్తూరీ యిప్పటికీ కళ్ల ముందు rainbow. చలం గారిని మొదటిసారి
కలుసుకోవడం, ప్రేమా పెళ్లీ విషయాల్లో ఆయన guidance. తిలక్ పేకాట, రావిశాస్త్రి గారి మూడో పెగ్గు తరవాతి
మాటలూ...అజంతాగారితో బెజవాడ వీధుల నిశాచరత్వం.
బెజవాడ మసీదు వీధిలో పురాణం గారి మేడ మీద “సాక్షి క్లబ్” సమావేశాలు మరో
మలుపు. నెలకో అతిథితో సంబాషణ రెండు భాగాలుగా జరిగేది. మొదటి భాగం బహిరంగం, రెండోది ఆంతరంగికం. మొదటి భాగం అయ్యాక కేవలం కొద్దిమంది సన్నిహితులతో
రెండో భాగం సకల అతిథి మర్యాదలతో జరిగేది. ఇందులో కొన్ని మర్యాదలు నాకు అలవాటు
లేకపోయినా, క్లబ్బులో నా యాక్టివిజం వల్ల నాకు ఎంట్రీ
దక్కేది. నిజానికి ఈ రెండో భాగమే అసలు సిసలు సెషన్. బయటిలోకంలో చాలా
మర్యాదస్తులుగా కనిపించే వాళ్ళు ఇక్కడ అసలు రూపాల్లో కనిపించి ఆశ్చర్యం కలిగింకే వాళ్ళు.
శ్రీకాంతశర్మ గారు మాత్రం రెండు సెషన్స్ లో కూడా వొక్క రకంగానే వుండేవారు. అది
నాకు ఆశ్చర్యంగా వుండేది. అదేమిటని అడిగితే “వాళ్ళు పాపం బాధా సర్పదష్టులు. అంత
బాధ మనకేలా?” అనేవారు.
శర్మగారి తత్వం వున్నంతలో స్నేహంలోని తీయదనాన్ని అందుకోవడం! అది చేదుగా మారే
సన్నివేశాలు ఆయనకి ముందే తెలిసేవి. అందునా, అప్పుడప్పుడే బెజవాడ సాహిత్య లోకపు ఆలోచనలు
చేదెక్కుతున్న కాలం కూడా అది. పురాణంగారికి విరసంతో బాగానే బెడిసికొట్టిన కాలం.
కొంతమంది సాక్షి క్లబ్ సమావేశాలకు ముఖం చాటేసిన కాలం కూడా! కానీ, శ్రీకాంత శర్మగారికి అట్లాంటి పరిస్థితి లేదు. కేవీ రమణారెడ్డి లాంటి
వారు కూడా బెజవాడ వచ్చినప్పుడల్లా తప్పకుండా శర్మగారిని కలిసే వారు. శర్మగారు
ఆయన్ని అప్పుడప్పుడూ గేలిచేసినా, కేవలం స్నేహమే వాళ్ళిద్దరి
మధ్యా గెలిచేది.
మేం హైదరాబాద్ మారాక జీవితంలో చాలా మార్పు వచ్చింది. కానీ, శర్మగారి
స్నేహంలో మార్పు రాలేదు. ఆంధ్రప్రభ వారపత్రిక ఎడిటర్ గా ఆయన పనిచేస్తున్నప్పుడు
దాదాపు ప్రతి వారం మేం ఎక్కడో వొక చోట కలుస్తూనే వుండే వాళ్ళం. అన్నిటికీ మించీ
అది మాకు – అంటే నాకూ,
కల్పనకి-ఆర్థికంగా అత్యంత గడ్డు కాలం. ఆ సమయంలో ఆయన మా చేత చేయించిన అనువాదాలూ, రాయించిన రచనలూ ఆర్థికంగా పెద్ద తోడ్పాటు. అనిందూ పుట్టినప్పుడు
ఆస్పత్రిలో మిమ్మల్ని పలకరించిన అతికొద్ది మంది స్నేహితుల్లో శర్మగారూ, జానకీబాల గారు ముఖ్యులు. అంతే కాదు, బాబుకి మేం
పెట్టిన మొదటి పేరు అనింద్య. అయితే, “అది modern గా లేదు” అంటూ “అనిందు” అని మార్చిన వాళ్ళు శర్మగారూ, మోహన ప్రసాద్ గారు. “అనిందు అంటే రవి అంతే! “ఇందు” కానివాడు అని కదా
అర్థం!” అని వ్యాఖ్యానం చేశారు శర్మగారు.
శ్రీకాంత శర్మగారిది నిస్సందేహంగా సఫలమైన ప్రయాణం. చాలా కొద్దిమంది వుంటారు
అంత తృప్తిగా జీవించిన వాళ్ళు.
*
" ఆ వూరు మీకు బాగా నచ్చుతుంది, కవిత్వం మాటెలా వున్నా?!" అన్నాడు మిత్రుడు స్టీవ్ పెడ్రో -మాడిసన్ లో కారు
స్టార్టు చేశాక. స్టీవ్ పెడ్రో మంచి కవిత్వం రాస్తాడు. అంతకంటే ముఖ్యంగా అతని
ఆలోచనలు చాలా బలంగా వుంటాయి.ఎంత మెత్తగా మాట్లాడతాడో అంత బలమయిన వాక్యాలు
సంధిస్తాడు. మాడిసన్ కి నలభై అయిదు నిమిషాల దూరంలో వున్న ఎరీనా అనే వూళ్ళో డానియల్
స్మిత్ అనే కవి ఇంట్లో, వాళ్ళ విశాలమయిన పంట పొలాల మధ్య జరుగుతున్న
విస్కాన్సిన్ కవిత్వ పండగ మా గమ్యం.
2002లో నేను మాడిసన్ వచ్చాక
వరసగా నాకు రెండు సార్లు విస్కాన్సిన్ కవిత్వ పండగల్లో పాల్గొనమని ఆహ్వానం
వచ్చింది. కాని, వేరే అకడమిక్ సదస్సులకు వెళ్ళాల్సి రావడంతో ఆ రెండు సార్లు నేను వెళ్ళలేకపోయాను. ఈ సారి వచ్చి తీరాలి
అని పట్టుబట్టడమే కాకుండా, దగ్గిరుండి తీసుకు రమ్మని మరో మాడిసన్ కవి స్టీవ్
కు పురమాయించారు డానియల్ స్మిత్.
మొక్కజొన్న తోటల మధ్య, ముసురుకుంటున్న చీకట్ల మధ్య, అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇండ్ల మధ్య ఎరీన ఒక
ఆకుపచ్చ లోయలో వున్నట్టుగా వుంది. స్టీవ్ అమెరికా వ్యవసాయం, చదువుల కబుర్లు చెబుతున్నాడు దారి పొడవునా. మధ్యలో వుండీ వుండీ తన మిల్వాకీ బాల్యాన్ని గురించి చెబుతున్నాడు. ఆ కబుర్ల
మధ్య ఎరీన ఇట్టే వచ్చేసింది. మేము డానియల్ స్మిత్ ఇంటికి చేరేసరికి కవిత్వ పండగ
అప్పటికే మొదలయ్యింది. డెబ్బయేళ్ళ జె.డి. వైట్ కవిత్వం చదువుతున్నారు. ఆయన కవిత్వం
హైకూల మాదిరిగా వుంటుంది. కానీ, చాలా లోతయిన భావాలు.
జేడీ అని అందరూ ఆప్యాయంగా పిలుస్తారు ఆయన్ని.
"అమ్మమ్మ అంటుంది కదా?!" అనే శీర్షికతో ఆయన వొక తరం వెనక సంగతుల్ని, వర్తమానానికి మెలేసి చెప్పిన కవితలు కొంత వ్యంగ్యం, కొంత నేటివ్ ఇండియన్ విషాదమూ కలిసి వుంటాయి. ఆయన కవిత్వంలో మామూలు మనుషుల్లో వుండే కవితాత్మని వెతికి పట్టుకోవాలన్న తపన కనిపిస్తుంది.
ఆయన చదవడం అవ్వగానే స్టీవ్ తో వచ్చిన నన్ను గుర్తు
పట్టి, డానియల్, ఆయన భార్య చెరిల్ మా దగ్గిరకి వచ్చి "ముందు
భోంచెయ్యండి. ఈ కవిత్వంతో
అర్ధ రాత్రి దాటిపోతుంది" అంటూ మమ్మల్ని వాళ్ళ
ఇంటికి తీసుకు వెళ్లారు. భోం చేసుకుని,
వచ్చేసరికి మేగన్ జాన్సన్ అనే కొత్త తరం కవయిత్రి
కవిత్వం చదువుతోంది. జేడీ కవిత్వం రెండు తరాల కిందటి అమెరికన్ కవిత్వానికి
ప్రతినిధి అయితే, మేగన్ కవిత్వం ఈ తరానికి ప్రతినిధి అనుకోవచ్చు.
పాప్యులర్ కల్చర్ కి సంబంధించిన ప్రతీకలూ,
పదచిత్రాలు వాడుతూ, వాటి విరోధాభాసని
చెప్పడంలో మేగన్ దిట్ట. కవిత్వ వాక్యాలతో,
మీడియాలోని ప్రకటనల వాక్యాలతో ఆడుకోవడం ఆమెకి సరదా.
దాదాపు ముప్పయి మంది వివిధ వయస్కుల అమెరికా కవులు ఈ
పండగ (జూలై 9,10)లో కవిత్వం చదివారు. ఒక విధంగా అమెరికాలోని మూడు
తరాల కవుల్ని ఇక్కడ కలుసుకునీ, రెండు రోజుల పాటు వాళ్ళతో దగ్గిరగా గడిపి, ఒకరి మీద ఒకరు చలోక్తులు విసురుకునే దాకా వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన పండగ ఇది.
ఈ ముప్పయి మంది లో కనీసం సగం మందికి నేను వివిధ కవిత్వ సమ్మేళనాల ద్వారా కొంచెం
తెలుసు. నేను రెండు తెలుగు అనువాద కవితలూ,
రెండు ఇంగ్లీషు కవితలూ వినిపించాను. ఇంకా రెండు
కవితలయినా చదవాలని పట్టుబట్టారు కాని,
నేను ఆ నాలుగు కవితలే తెచ్చాను. మరునాడు నాతో
కొద్దిసేపు సంభాషణ కార్యక్రమం పెట్టారు. తెలుగు భాష నించి తెలుగులో వస్తున్న దళిత, ముస్లిం, ప్రాంతీయ కవిత్వాల దాకా క్లుప్తంగా చెప్పాను. ఆ
తరవాత కొన్ని ప్రశ్నలూ, సమాధానాలు! చూస్తూండగానే మధ్యాన్నం
అయిపోయింది.
పొలాల మధ్య కలకలం!
సాధారణంగా అమెరికాలో కవిత్వ పండగలయినా, కవిత్వ పఠనాలయినా ఏ పుస్తకాల షాపుల్లోనో, యూనివర్సిటీలలోనో, లైబ్రరీలలోనో,
పెద్ద పెద్ద హోటళ్ళలోనో పెట్టడం ఆనవాయితీ. అమెరికా
వచ్చిన తరవాత ప్రతీ ఏటా ఎక్కడో ఒక చోట ఇతర అమెరికన్ కవులతో పాటు కవిత్వం చదవడానికి
రమ్మని నాకు ఆహ్వానాలు అందూతూనే వున్నాయి. మాడిసన్ లో వుండగా - బార్డర్స్ పుస్తకాల
షాపులో ఒక సారి,విస్కాన్సిన్ యూనివర్సిటీలో మూడు సార్లు, మాడిసన్ లైబ్రరీలో వొక సారి, అతి ప్రాచీనమయిన కఫే మాంట్ మాత్రే అనే హోటల్లో
రెండు సార్లు కవిత్వం చదివాను. మాడిసన్ లో కాపిటల్ భవనం బయట ఆరు బయలులో జరిగిన
"యుద్ధ వ్యతిరేక కవి సమ్మేళనం" మరచిపోలేని అనుభూతి.
కాని,ఈ సారి
విస్కాన్సిన్ పంట పొలాల మధ్య జరిగిన ఈ కవిత్వ పండగ
కేవలం కవిత్వానికి సంబంధించిన విషయమే కాదు. "ప్రధాన స్రవంతి సంస్కృతి "
పేరిట అమెరికాలో పెచ్చు మీరుతున్న నగర కేంద్రిత ధోరణుల మీద ఒక నిరసన ప్రకటన. పెద్ద
హోటళ్ళలోనో, యూనివర్సిటీ హాళ్ళలోనో, పెద్ద పెద్ద పుస్తకాల షాపులలోనో కాకుండా రైతు జీవితానికి కేంద్రమైన ఒక
"బారన్" లో, పంట పొలాల మధ్య ఈ కవిత్వ పండగ చేశారు. రైతుల
సంప్రదాయ పనిముట్లు, గడ్డి మోపులు,
పాతకాలపు ట్రాక్టరు నేపధ్యంగా వున్న వేదిక మీద
కవులు కవిత్వం చదివారు. చాలా మంది కవితలకి అమెరికా పల్లె బతుకు వొక అంతస్సూత్రంగా
వినిపించింది. పాప్యులర్ కల్చర్ మీద ఆగ్రహం,
మూలన పడి పోతున్న అనుబంధాల మీద ప్రేమా, అల్ప సంఖ్యాకుల్ని అణచివేస్తున్న రాజకీయ వ్యవస్థ మీద నిరసనా చాలా కవితల్లో
కనిపించాయి. ఆశ్చర్యంగా ఈ పండగలో చదివే కవిత్వం ఇలాగే వుండాలి
అని నిర్వాహకులు ఎవరికీ చెప్పలేదు. ఒక అప్రకటిత భావస్వామ్యం అందరి కవుల్లోనూ
కనిపించడం విశేషమే!
"నిజానికి ఇది ఆశ్చర్యమేమీ కాదు. చాలా మంది ఈ తరం
కవులు ఏదో ఒక రూపంలో ఇలాంటి బాధనే వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మోడ్రనిజం పేరిట
నిజ జీవితాన్ని మరుగు పరిచే భ్రమల్ని ఈ కవులు బద్దలు కొడుతున్నారు. అసలు
జీవితంలోకి వెళ్ళి, నిజ ప్రతీకల్ని,
పద చిత్రాల్ని వెతుక్కుంటున్నారు." అని ఈ పండగ
నిర్వాహకులు మైకేల్ థియూన్, ఆస్టిన్ స్మిత్ అంటారు. "పట్టణాలూ, నగరాల కవులు కవిత్వ వాక్యాల్ని అమ్మేశారు. వాళ్ళే దారుణంగా అమ్ముడు పోయారు.
వాళ్ళ కవిత్వాలు ప్లాస్టిక్ సరుకులు మాత్రమే." అంటారు వాళ్ళు. అట్లా అని
ఇక్కడ చదివిన వాళ్ళెవరూ కేవలం "నినాద" కవిత్వం చదవలేదు. (ఆ మాటకొస్తే, నినాద కవిత్వం అనేది వొకటి వుందని నేను అనుకోవడం లేదు. వుందల్లా
కవిత్వం/అకవిత్వం మాత్రమే). ఒక వ్యక్తిగా కవికీ, అతని చుట్టూ వున్న
లోకానికి ఎలాంటి బంధం వుండాలో, అలాంటి బంధం తెగిపోతున్నందుకు పడే ఆక్రోశం నినాదం
అయితే, దాన్ని కవిత్వంగా ఒప్పుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ పండగలో చదివిన
ముప్పయి మంది కవులూ ముప్పయి భిన్న వ్యక్తిగత కోణాల నించి తమ చుట్టూ వున్న లోకాన్ని
వ్యాఖ్యానించారు. ఇందులో కొంత మంది కవులు స్వయంగా రైతులు. కొంత మంది
యూనివర్సిటీలలో పాఠాలు చెప్పే వాళ్ళు. కొంత మంది వ్యవసాయ ఫారంలలో పనిచేసే వాళ్ళు.
కొంత మంది యువకులు, కొంత మంది నడి వయస్కులు, కొంత మంది ముసలి తనం ముసురుకొస్తున్న వాళ్ళు. కాని, వీళ్ళ గుండెలు చాలా తడిగా వున్నాయి,
గొంతుల్లో నిప్పుల సెగలున్నాయి. వీళ్ళ గొంతులు వింటున్నప్పుడు వీళ్ళు కవిత్వం వూరికినే రాయడం లేదని వెంటనే
తెలిసిపోతుంది.
విస్కాన్సిన్ 'పోతన ' డానియల్
రాగానే పిలిచి అన్నం పెట్టాడని కాదు కానీ, వీళ్ళందరిలోకీ నాకు బాగా నచ్చిన కవి డానియల్ స్మిత్. చాలా నెమ్మదస్తుడు.
ఎక్కువ మాట్లాడడు. కాని, మాట్లాడినప్పుడు మన సింగమనేని నారాయణతో
మాట్లాడినట్టే వుంటుంది.తేడా వొక్కటే...నారాయణ గారి మాటలు అప్పుడప్పుడూ కొంచెం
వామపక్షమై బరువెక్కుతాయి. కాని, డానియల్ మాట్లాడుతుంటే, ఇప్పుడే పొలం పని ముగించుకొచ్చి,
కాసేపు దగ్గిర వాళ్ళ కబుర్లతో సేదతీర్చుకుందాం
అన్నట్టుగా వుంటుంది. డానియల్ మంచి చదువరి. ఈ వారమే వేడి వేడిగా మార్కెట్ లోకి
వచ్చిన సాహిత్య పుస్తకమయినా, పత్రికయినా అతని ఇల్లు చేరాల్సిందే. కాని, చదివాను కదా అని అన్నీ ఏకరువు పెట్టే మాటకారి కాదు అతను. బతుకంతా పొలం పనిలోనే అయిపోయింది డానియల్ కి. ఎప్పుడొ కానీ వొక చిన్న కవిత
రాసుకునే వ్యవధి లేదు. రాసిన కొద్ది కవితలు కూడా వాళ్ళ నాన్న గురించీ, తన పొలం పని గురించీ, తన సంసారం గురించీ! అదే డానియల్ సొంత సంతకం అయ్యింది.
"ఫాదర్ లాండ్" అనే పేరుతో ఈ పండగలో వొక రోజు రాత్రి ఆయన కవిత్వం
చదివినప్పుడు అది వొక రైతు ఆత్మ చరిత్రలోంచి చింపుకొచ్చిన పేజీలా అనిపించింది. అది
ఏ దేశం రైతు కథ అయినా కావచ్చు కదా అనుకున్నాం. ఒక రోజు సాయంత్రం ఆయన తన యాభయేళ్ళ రైతు జీవితం చిన్న చిన్న మాటల్లో చెబుతూంటే
ముచ్చటేసింది. అసలు ఏ సాహిత్య నేపధ్యమూ లేని వొక రైతు బిడ్డ కవిత్వంలోకి వచ్చిన ఆ
కథ ఈ కాలానికి అమెరికాలో మాత్రం వొక విశేషంగానే అనిపిస్తుంది.
"భాష దొరకాలి,
వొక్క సారి భాష దొరికాక కవిత్వం దారి తేలిక
అవుతుంది. నేను ఇంకా కొంత గతంలోనే బతుకుతున్నాను కాబట్టి నా భాషలో ఇంకా చాలా గతమే
వుంది. ఆ గతం ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తోంది. ఇప్పుడు అమెరికాలో ఆఘ మేఘాల మీద
రాస్తున్న వాళ్ళు కొద్ది సేపు ఆ గతంలోకి వెళ్ళి రాక తప్పదు అనిపిస్తోంది. కొద్ది
సేపు ఆగి ఆలోచించుకొని ముందుకు అడుగు వెయ్యాల్సిన స్థితి ఇప్పుడు కవిత్వంలోనే కాదు, అన్నిటా వుంది" అన్నారాయన. మా ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే డానియల్
భార్య చెరిల్ మా కోసం మంచి కాఫీ తీసుకు వచ్చారు. "నిన్న మీరు కవిత్వం చదివిన
తీరు బాగుంది. ఇంకా మీ దేశంలో కవులకి మౌఖిక బంధం వుందనుకుంటా. ఆ మౌఖికతలోని బలం మీ
గొంతులో వినిపించింది." అంటూ మళ్ళీ మరో సారి అంతకు ముందు రాత్రి నేను చదివిన
నాలుగు కవితలని మళ్ళీ చదివించుకున్నారు. "మౌఖికత" మీద ఈ కవుల మధ్య చాలా
చర్చ జరగడం విన్నాను. అందరిలోకీ పెద్ద కవి జేడీ కూడా తన మాటల్లో "మౌఖిక
" లక్షణాలే కవిత్వాన్ని బతికిస్తాయని అంటూ తన తరం నించి ఈ తరానికి వచ్చే
సరికి మౌఖికత అరుదయిన దినుసు ఎలా అయ్యిందో చెప్పారు.
చెరిల్ ఒక బడిలో టీచర్ గా పనిచేస్తారు. కవిత్వం రాయరు కాని బాగా చదువుతారు. 1930 ల అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ గురించి నేను కొంత పని చేస్తున్నానని
తెలిసి ఆ ముగ్గురు పెద్ద వాళ్ళూ చాలా సంతోషించారు. "ఆమె వొక విస్మృత
కవయిత్రి. మీరు ఏ కొంచెం ఆమె గురించి రాసినా అది అమెరికన్ కవిత్వానికి గొప్ప సేవ”
అని డానియల్ అన్నారు. "ఈ జీవిత కాలంలో పూర్తి చేస్తానో లేదో చెప్పలేను
గాని, అది ఇప్పుడు వొక ఆలోచన మాత్రమే" అని నేను అనగానే, " అయితే, మీరు ఆ పని పూర్తి చేసేంత దాకా మీ ఆయుష్షు పెరగాలి" అన్నారు జేడీ.
కవిత్వం అంతా వొక ఎత్తు, కవిత్వం చదివాక రాత్రి కొండ కొమ్మున చలి నెగడు చుట్టూ చేరి అంత మందిమీ రాత్రి
మూడు గంటల దాకా కబుర్లూ, కథలూ చెప్పుకోవడం ఇంకో గొప్ప అనుభూతి. వ్యక్తిగత
జీవితాలూ, స్థానిక సంగతులూ, సాహిత్యం కబుర్లూ అన్నీ జమిలిగా అక్కడ కలిసిపోయాయి.
అసలు నిజంగా పండగ హడావుడీ అంతా అక్కడే! కావలసినంత తిండీ, అనేక రకాల మద్యం, కావలసినన్ని కబుర్లూ!
వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఎరీనా వైపు చూస్తే, కొంచెం దిగులుగా అనిపించింది.
"ఎరీనా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. ఒక్క సారి ఇక్కడి
గింజ నోట్లో పడ్డాక మీరూ/ మేమూ దాన్ని మరచిపోలేం" అన్నారు డానియల్ ఇతర ఎరీనా
వాసులు మాకు వీడుకోలిస్తూ.
విస్కాన్సిన్ నుంచి *
జులై 19, 2010 ఆంధ్ర జ్యోతి "వివిధ" నించి
[ఈ వ్యాసం 2003 డిసెంబర్ లో రాసింది. అంటే, ఇస్మాయిల్ గారు కన్ను మూసిన పక్షం రోజుల తరవాత
రాసింది. నవంబరు 23, 2003 ఇస్మాయిల్ గారు వెళ్ళిపోయారు. మంచి కవిగా ఆయన
నాకు ఆత్మబంధువు. కాని,అంత కంటే
ఎక్కువగా ఆయన బంధువు కూడా. ఆయన చివరి రోజుల జీవితాన్ని దగ్గిరగా చూసిన వాణ్ని
కావడం వల్ల ఈ వ్యాసం పైపైన రాసినట్టే అనిపిస్తుంది నాకు ఇప్పటికీ- కాని, ఆయన మరణానికి తక్షణ నివాళి ఇది. నా దగ్గిర లేని
ఈ వ్యాసం ప్రతిని పంపిన మిత్రుడు విన్నకోట రవిశంకర్ కి ధన్యవాదాలు]
1
ఇస్మాయిల్ గారి ఈ నిశ్శబ్దం ఇక చిట్ట చివరిది.
ఆయన ఇంక అసలే మాట్లాడరు. మనకు ఈ నిశ్శబ్దం అలవాటై, అయిదేళ్ళ పైనే అయింది. మనం ఏదైనా అన్నప్పుడు
అయితే చిరునవ్వుతో,
కాదంటే వొక
పెద్ద నవ్వుతో సమాధానం చెప్తున్నారు కొంత కాలంగా ఆయన- లేదూ, మనం చెప్పింది నచ్చనప్పుడు చిన్న నవ్వుతో
చెయ్యి జెండాలా వూపుతున్నారు తప్ప మాట లేదు. ఆయన మాటలన్నీ మనం చూస్తూండగానే ఆయన
వుండగానే నిన్నటి జ్ఞాపకాలయ్యాయి. ఆయన మల్లెపూవులాంటి నవ్వునీ, చిరుగాలిలాంటి అందమైన కదలికల్నీ వొక
తెల్లవస్త్రం దాచెయ్యడం ఏమిటి?! ఆయనకి చివరిసారి భుజాన్ని అందించలేని దూరంలో నేను వుండడం ఏమిటి?
మాటల్లో ఏమైనా చెప్పడం కష్టం. అందుకే ఆయన మొదటినించీ నాకూ మనకీ నిశ్శబ్దాన్ని అలవాటు
చేస్తూ వచ్చారు. ఇంత దూరంలోంచి నిశ్సబ్దంగా నిశ్శరీరంగా భుజాన్నివడంలో ఎన్ని
దిగుళ్ళున్నాయి?!
ఎన్ని
జ్ఞాపకాలున్నాయి?గొంతు దాటని ఎన్ని మాటలున్నాయి? పోయిన నెల ఆయనకి చివరిసారి భుజాన్నిచ్చిన
స్నేహితులందరి భుజాల మీదా వొక చిన్ని ముద్దు!
నమ్మలేకపోతున్నాను!
వొక నాటి రోజుల్లో ఎర్రసిరా తారీఖూ ఆకుపచ్చ అక్షరాలూ కనిపించగానే ఎంత ఆనందం!
చిన్న చిన్న వాక్యాల మధ్య స్వచ్చమైన కలకల నవ్వు వొక్కోసారీ, పదునైన వ్యంగ్య బాణాల విసురు మరోసారీ –
ఇప్పుడేమీ కనిపించవూ వినిపించవు కదా!
ఇస్మాయిల్ గారిని తలచుకోగానే నా మటుకు నాకు తక్షణం గుర్తొచ్చేవి – అవును, ఆ ఆకుపచ్చ అక్షరాలే! అలాంటి ఆకుపచ్చా పచ్చని
వుత్తరం మొదటి సారి ఇరవయ్యేళ్ళ కిందట అందుకున్నాను.
2
అప్పటికింకా “రక్త స్పర్శ” అచ్చు కాలేదు. “శిధిల నేత్రాలు” అనే నా కవిత ఆంద్ర
ప్రభలో అచ్చులో చూసి వెంటనే ఆయన వుత్తరం రాశారు, “ఇది తెలుగు పద్యంలా లేదు!” అని!
ఆయనేమంటున్నారో నాకు అర్థం కాక, వెంటనే నేను మళ్ళీ వుత్తరం రాస్తే, వారం పది రోజుల తరవాత (ఈమెయిల్ లేని కాలంలో ఆ
ఎదురుచూపు ఎంత నరకమో!) ఆయన సమాధానం. “తెలుగు పద్యం అంటే ఇప్పుడు మనకి ఒక స్థిరమైన
చట్రం వుంది. ఈ చట్రం శబ్దంలోనూ, అర్థంలోనూ గట్టిగా బిగుసుకొని వుంది. మీరు చట్రాన్ని తప్పించుకుంటున్నారు లేదా
దాన్ని ముక్కలు చేస్తున్నారు. మీ గొంతు ఈ కాకిగోలలో మునిగిపోవచ్చు. లేదా, మీకు శక్తి వుంటే కాకుల్ని మీరే తరిమేయచ్చు.”
అసలు వాక్యం రాయడానికే సిగ్గుతో చితికిపోతున్న కుర్రకవికి ఆ మాటలు కొన్ని రోజుల
పాటు నిద్రాభంగమయ్యే పెద్ద సత్కారం.
బహుశా,
ఈ బందాల్నీ, చట్రాల్నీ నిరాకరించడమే ఆయన తన కవిత్వంలోనూ, వచనంలోనూ, చివరికి వొక్క క్షణమూ శాంతినివ్వలేని
జీవితంలోనూ చేశారేమో! ఇప్పుడనిపిస్తుంది, వొక్క వాక్యంలో ఇస్మాయిల్ గారి గురించి
చెప్పాలంటే – అలాంటి చట్రరహితమైన జీవనస్వేచ్చకి ఆయన ప్రతీక. నలభయ్యేళ్ళ పైబడి
తెలుగు కవిత్వంలో ఆ ప్రతీకని వొక చెట్టు రూపానికి పరిమితం చేసి మనం మాట్లాడుతూ
వచ్చాం. ఆ ప్రతీక మనలోని సాంప్రదాయపు వేళ్ళని పెళ్లగించింది. ఆలోచనల్ని బిగించి
పెడుతున్న మూసల్ని చెదరగొట్టింది. పదాల మారుమూలల్ని శుభ్రం చేసింది. మామూలు పదాలకు
అమామూలు శక్తినిచ్చింది. జీవితంలోని ముచ్చట ఎక్కడో లేదనీ, మనలోనే మన చుట్టే వుందని మనల్ని మన
పరిసరాల్లోకి మళ్ళీ ప్రతిష్టించింది.
ఈ పరిసరాల స్పృహలోంచి ఇస్మాయిల్ రెండు ముఖ్యమైన పనులు చేశారనుకుంటాను. వొకటి:
జీవితం చుట్టూ,
సాహిత్యం
చుట్టూరా పేరుకుపోయిన కాలుష్యాల్ని తుడిచిపెట్టడం; రెండు: సిద్ధాంతం అనేది వొక బ్రహ్మ పదార్ధం
లాంటి metanarrative
కాదనీ, అది మన కళ్ళ ముందే పరచుకొని వుందనీ
అసిద్ధాంతీకరించడం (ఇప్పుడు దీన్ని మనం deconstruction / de-schooling అనుకుందామా?) ఈ రెండూ ఆయన పుస్తక జ్ఞానంలోంచి కాకుండా తన
ఆనుభవిక చైతన్యంలోంచి చెప్పడం ఆయనలోని overarching phenomenon.
కవిత్వానికి గొప్ప వస్తువు అంటూ అక్కర్లేదు. నిజమే, కాని, అలా అనుకున్న తరవాత నిజంగా కవిత్వం
రాయబోయేసరికి ఆ గొప్పది కాని విషయాన్ని అర్థం చేసుకొని రాయడం అన్నది అంత తేలిక
కాదు. అసలు తేలికగా కవిత్వం చెప్పడం అంత తేలిక కాదు. తేలిక మాటల్ని అనుభవాల
బరువుతో తూకం వేయడం చిన్న సంగతీ కాదు. పదచిత్రాలూ, ప్రతీకలూ ఇతర అలంకారాలేవీ లేకుండా కేవలం వొక
భావమే ప్రాణంగా కవిత్వాన్ని బతికించుకుంటూ పోవడానికి కవికి చాలా శక్తి కావాలి.
ఇప్పటిదాకా మనం చేస్తూ వచ్చిన పొరపాటు ఏమిటంటే, కవిత్వం జీవితమంత బరువుగా వుండాలేమో అనుకొని
దాని మీద గాడిద బరువు మోపుతున్నాం. ఇస్మాయిల్ గారి కవిత్వంలో గాడిదల ప్రస్తావన చాల
చోట్ల వస్తుంది. బహుశా,
గాడిదలకి
అంత సాహిత్య పాపులారిటీ ఇచ్చిన రచయిత కిషన్ చందర్ తరవాత ఇస్మాయిల్ గారే కావచ్చు.
కవులు గాడిదలు కాకూడదన్న సందేశం ఇస్మాయిల్ కవిత్వంలో వుందని వేరే చెప్పక్కర్లేదు
కదా!
ఆ గాడిద బరువు లేకుండా కవిత్వం నిరలంకారంగా వుండాలన్న టాగోర్ ని సదా బాలకుడని
వో పద్యంలో వర్ణించారు ఇస్మాయిల్. నిజానికి సదాబాల్యం ఇస్మాయిల్ కవిత్వానికి
అంతర్వస్తువు (Internalized
theme). ఆయన బాల్యం
గురించి రాసిన పద్యాల్లో కేవలం బాల్యం గురించే ఆయన చెప్పలేదు. ఆ మాటకొస్తే, బాల్యం ఆయనకొక గతానుభవం కాదు. ఆ నిన్నటి
బాల్యంలోంచి ఆయన గుర్తుచేసే/ గుర్తించే వర్తమానం ముఖ్యమైంది. జీవితంలోని స్వచ్చతని
పదిలంగా కాపాడే శక్తి బాల్యానికి మాత్రమే సొంతం. ఆ స్వచ్చతని చెప్పడానికే ఆయన
పసితనం గురించీ,
పసివాళ్ళ
గురించీ రాస్తారు.
గుర్రప్పిల్ల
కాళ్ళతో
పరిగెత్తుకుంటూ
వచ్చాడు
బడి
వదిలినట్టున్నారు.
బుర్రనీ, కాళ్ళనీ
బంధించిన
సంకెళ్ళు విప్పేయగానే
మధ్యాహ్నపు
ఎండ బయళ్ళు
మహోత్సాహంతో
ఆహ్వానించాయి
ఎంత
స్వేచ్చ! ఎంత హాయి!
అన్న పద్యపాదాల్లోంచి కనిపించేది ఆయన మనవడా? ఇస్మాయిల్ గారా? మనమా? నన్నడిగితే అది వొకే సమయంలో ఒకే దృశ్యంలో
ముగ్గుర్ని బంధించే కవిత. ఆ తరవాత ఆ మనవడు చేసే పనుల జాబితాలోని పనుల్ని యింకో
కోణంలోంచి చూస్తే,
అవి ఇంకో
రూపంలో మనకీ స్వేచ్చనిస్తాయి. రోజువారీ బతుకులో పోగొట్టుకుంటూ వస్తున్న మన
స్వేచ్చని గుర్తు చేస్తూ- చివరికొచ్చేసరికి మనం పోగొట్టుకున్న ఆ స్వేచ్చని అందంగా
అప్పగించడం ఈ కవిత చేసే పని. అలా అందుకోడానికి మనకి కాసింత వెసులుబాటు దొరకాలి
అంతే! ఆ కాస్త వెసులుబాటే దొరికితే జీవితానికి అర్థమే మారిపోతుంది. అలాంటి
అర్థాన్ని వెతుక్కునే దారినే ఆయన “ఉత్సవం”గా వర్ణించారు వొక సందర్భంలో-
“చెట్టు నా ఆదర్శం” నించి ఇటీవలి “కప్పల
సముద్రం” దాకా ఇస్మాయిల్ గారి కవిత్వ ప్రయాణాన్ని నిశితంగా గమనిస్తే, ఆయన పోనుపోనూ బాలకుడైపోతున్నాడని
అనిపిస్తుంది. అది ఆయన తీసుకునే ఆయన వస్తువులోనూ కనిపిస్తుంది. ఆయన రాసుకునే
భాషలోనూ అనిపిస్తుంది. లేకపోతే-
తరుచాపము
వీడిపోయి
గురిమరచిన
బాణంలా
తిరుగాడును
పిట్ట
అంటూ అత్యంత గంభీరంగా రాసిన కవి, పదచిత్రాల మీదా, కొండొకచో అంత్యప్రాసల మీదా ఆధారపడిన కవి
నెమ్మదిగా ఆ ఆధారాల్నీ,
ఆ
అలంకారాల్నీ వొదిలేసి-
నా కోసం
పూర్తిగా
నగ్నవైనపుడు
మాత్రమే
నా దానివి
అని తనే వొక కవితలో అన్నట్టు తన ‘self’ ని ఆవరిస్తున్న ఆచ్చాదన గుర్తెరిగి రాయడం ఆయన
కవిత్వంలోని ఇంకో రహస్యం అనుకుంటాను. ఆ ఆచ్చాదనల్ని చింపేసిన ఉత్సవ సమయంలోనే ఆయన
“గోళీకాయలు” “బెల్లంకాయ” లాంటి కవితలు రాశారనుకుంటాను. ఆ సమయంలో చుట్టూ వున్న
లోకంలోంచి వొక సంతోషాన్ని,
వొక
ఆశ్చర్యాన్ని తోడుకునే విషయాలన్నీ ఆయనకు కవిత్వమవుతాయి. ధనియాలతిప్ప అనే స్పష్టమైన
స్థలం చూస్తే ఎంత ఆనందమో,
అస్పష్టమైన
వొక వాన్ గొ చిత్రం చూసినా అదే ఆనందం. పాముల వాణ్ని చూస్తె ఎంత సంభ్రమమో, పికాసో బొమ్మని చూస్తే అంతే సంభ్రమం. చుట్టూ
పరచుకొని వున్న చెట్లనీ,
నదుల్నీ, మనుషుల్నీ చూస్తే ఎంత సంతోషమో, ఎక్కడో వున్న పారిస్ మహానగరాన్ని చూసినా అంతే
సంతోషం. ముఖ్యంగా,
వ్యక్తులూ, స్థలాలకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఇంత
సున్నితంగా ప్రేమగా రాసిన ఇంకో కవి ఎవరైనా వున్నారా అంటే లేరనే అనిపిస్తుంది నాకు.
చాలా మంది ఆయన కేవలం ప్రకృతి గురించే రాశారని పొరబడతారు కాని, నిజానికి ఆ ప్రకృతిలో లీనమయ్యే కల కంటున్న
మనుషుల్ని గురించే ఆయన రాస్తున్నారని నేను అనుకుంటాను.
పిల్లల్ని గురించి,
అంత కంటే
ఎక్కువగా తన స్నేహితుల్ని గురించి రాయన రాసిన కవితలు నన్ను ఎప్పుడూ విస్మయంలో
పడేస్తాయి. సూఫీలు కలకంటున్న వొక ప్రాపంచిక జీవిని ఈ మూడింటి కలయికలోంచి
చూపిస్తున్నారా అనుకుంటాను. మా ఇద్దరి సంభాషణల్లో సూఫీ మహాకవి హఫీజ్ ని ఆయన
ఎన్నిసార్లు ప్రస్తావించే వారో లెక్కలేదు. మొదట్లో నేను హఫీజ్ ని చదవడానికి
బద్దకిస్తున్నప్పుడు “అయ్యో…హఫీజ్ ని చదవకుండా, ఎట్లా రాస్తారు మీరు అసలు?” అని వొక సారి గట్టిగా మందలించే వారు కూడా- ఈ
కాలంలో అలా మనల్ని ఫలానా చదవలేదే అని మందలించే వాళ్ళు లేరు కదా అనిపిస్తుంది
కొన్ని సార్లు! అలాంటి క్షణాల్లో ఆయన మాటలు గుర్తొచ్చి మొదట ఆయన మాటనీ, తరవాత ఆయన్నీ పోగొట్టుకున్నాను కదా మరణం అనే
ఈ తెర అడ్డుపడి అనుకుంటూ వుంటాను.
4
కవిత్వం విషయంలో నాకూ మా నాన్నగారికి మొదటి నించీ చుక్కెదురు. మా నాన్నగారు
కమ్యూనిస్టు సాహిత్య జీవి. నాకు కవిత్వ ఊహలు అప్పుడప్పుడే అందుతూ వస్తున్న నా
డిగ్రీ రోజుల్లో “లేచిపోదామా?” అని చిలిపి హుషారుగా అనే అమ్మాయిలా ఇస్మాయిల్ గారు అనిపించారు నాకు. కవిత్వ
పరంగా నేను ఆయనతో లేచిపోయాను, మా నాన్నగారి కమ్యూనిస్టు పంజరం విడిచి-
అయితే,
నా మొండితనం
మీద గాఢమైన నమ్మకం వుండడం వల్ల నాన్నగారు నన్ను ఇస్మాయిల్ గారి మైదానంలో హాయిగా
వదిలేశారు. నాన్నగారు మంచి సాహిత్య వక్త. ఖలీల్ జిబ్రాన్ గురించీ, కొంత మంది పర్షియన్ కవుల గురించి నాన్నగారి
రేడియో ప్రసంగాలు విని,
ఇస్మాయిల్
గారు “కౌముదీ,
మీలోని
నిజమైన వ్యక్తీ ఇదిగో ఇక్కడున్నాడు! మీరు ఎందుకలా తప్పించుకు తిరుగుతారు
అతన్నించి!” అని వొక సారి కార్డు ముక్క రాశారు. అదే వుత్తరం కింద నా కోసం “అఫ్సర్, నాన్నగారి మార్క్సిస్టు మాటలు మినహాయించుకొని, ఇదిగో హాయిగా ఈ పర్షియన్ కవుల్ని చదువుకో
నువ్వు! ఆయన మార్క్సిస్టు కాని వేళల్లో సాహిత్యం గురించి చక్కగా మాట్లాడతారు.” అని
రాశారు.
ఇక నించి అలాంటి ఆకుపచ్చ ఉత్తరాలూ, అందమైన వాక్యాలూ రావు కదా!
ఇలా వెళ్లిపోతారని తెలిస్తే, ఇంకాసిని ఎక్కువ మాటలు ముందే మాట్లాడి వుండే వాణ్ని కదా, ఇంకా కొన్ని కాలాలు నాలో దాచుకోడానికి!
*