అమెరికన్ కవిత్వంలో ఒక దక్కన్ కెరటం!




“దక్కన్” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.



2007 అమెరికన్ కవిత్వ సంపుటంలో మొదటి పుటలో కాజిం అలి కవిత్వం కనిపించింది. ఆ కవిత హిందూ-ముస్లిం ప్రతీకల సమాహారం. దక్కన్ ఇండియా- అమెరికన్ అనుభవాల మేలు కలయిక, అచ్చం నేను తాగే కొబ్బరి కాఫి లాగా.

కాజిం అలి హిందూ ధర్మ గ్రంధాలు శ్రద్ధగా చదువుకున్నాడు, పుట్టి పెరిగిన దక్కను ఇస్లాం వాతావరణం అతని జీవితంలో విడదీయలేని భాగం. రోజూ యోగాతో మొదలయ్యే ఇతని దినచర్య కవిత్వ పాఠాలతో కొనసాగి, కవిత్వ రచనతో ముగుస్తుంది. సూఫీ తాత్వికత తన జీవితాన్ని నడిపించే సూత్రం అని నమ్ముతాడు కాజిం. అతని కుటుంబ చరిత్ర వొక విధంగా దక్షిణ భారత ఇస్లాం చరిత్ర. వెల్లూరు నించి అతని కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది. కాజిం బాల్యం హైదరబాద్ పాత బస్తీలో గడిచింది. తన కవిత్వంలో కనిపించే మత ప్రతీకల్లో ఆ హైదరాబాదీ బాల్యపు పునాదులు వుంటాయంటాడు కాజిం. కాజిం ఇప్పటి దాకా రెండు కవిత్వ పుస్తకాలు అచ్చులో చూసుకున్నాడు: వొకటి, “ఫార్ మాస్క్” (దూరపు మసీదు), రెండు: “ఫార్టియత్ డె” (నలభయ్యొ రోజు).

అమెరికాలోని వొక ప్రసిద్ధ కాలేజిలో కవిత్వ పాఠాలు చెప్పే కాజిం అలికి కొంచెం తెలుగు వచ్చు. “తెలుగులో కవిత్వం బాగుందని విన్నాను. యేనాడయినా ఆ కవిత్వం చదవాలని అనుకుంటున్నా” అంటాడు కాజిం.

గ్యాలరి

వొక ఎడారి దాకా వచ్చావు నువ్వు
వొక్క అక్షరమ్ముక్కా లేకుండా
దెయ్యం పట్టినట్టు
ఆకలితొ మాడిపోడానికేగా?

వయొలిన్ మీద సూర్యుడి చెయ్యి
అనంతమయిన దిగంతాన్ని చెక్కుతూ వుంది.

కౌపీన వస్త్రాలు ఎకరాల కొద్దీ
నీలి ధూళీ దూసరితమయిన ఆకాశం నెత్తిన
యెవరో వొక అపరిచిత యువకుడు నీ పక్కన.

విలియం బ్లేక్ కి కలల చిత్రాలు గియ్యడం
నేర్పిన మనిషిలోకి తొంగి చూస్తూ.

బహుశా నువ్వు అనుకుంటూ వుంటావు:
ఆ స్పర్శకి నేను సిద్ధమే.
అతనికి దొరికిపోవడానికీ సిద్ధమే”

బహుశా అతనూ అనుకుంటూ వుంటాడు:
ఇంత మిట్ట మధ్యాన్నం
ఇలా తప్పిపోయానేమిటి?
మరీ అంతూ పంతూ లేకుండా?!”

నీకెప్పుడు తెలుస్తుందో?
ఈ రాత్రి: ఈ చప్పుళ్ళు

వూదా వెతుకులాటలు
వయొలిన్ ఆకలి కడుపు మార్మోగి పోతుంది.

నాలుగు తీగలతొ
బట్ట బయలయ్యే గాయం – సంగీతం.

వొక ఆకలి సైన్యం
రాగాలుగా వణికి పోతుంది.

ఆకలితో
మాడిపోడానికేగా కదా
వచ్చావు, ఈ ఎడారికి!
Category: 1 comments

1 comments:

akella said...

ohhh beautiful poem

Web Statistics