కవిత్వం గీత దాటితే...!

(ఇది ఈ నెల "పాలపిట్ట"లో నా కాలమ్ 'కాలిబాట" నుంచి...)




కవిత్వానికి వొకే రూపం వుండదు. వొకే నడకా వుండదు. వుంటే అది ఏదో వొక దశలో కవిని వూపిరాడనివ్వదు, స్వయం ఖైదులాగా –

ఈ మధ్య కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ఈ ఆలోచన చాలా బలంగా కదిలిస్తోంది. ఎప్పటికప్పుడు ఇది కవిత్వానికి కాలం కాదనో, అసలు కవిత్వం ఇప్పుడు ఎవరు చదువుతారులే అన్న నిరాశా ఈదురు గాలులు వీస్తునప్పుడు కూడా కవిత్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంది, అలుపూ సొలుపూ అన్నది లేకుండా-

కవిత్వానికి వచన కవిత్వం అని పేరు పెట్టిన ముహూర్తం అంత బాగున్నట్టు లేదు. అది చాలా మందికి ఇప్పటికీ వొక విరోధాభాసలా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే వచనం వొక దిక్కూ, కవిత్వం ఇంకో దిక్కూ. ఈ రెండీటీ మధ్యా రాజీ కుదిరేది లేదు అనే వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తారు. కానీ, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ బహిరంగ ప్రకటన ఎంత అసంబద్ధమో తెలుస్తుంది. కథల్లో కవిత్వం రాసే వాళ్ళని, ఆ మాటకొస్తే సాహిత్య విమర్శలో కూడా కవిత్వం రాసిన వాళ్ళని మనం చూశాం. కవిత్వంలో వచనం రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ, అసలు కవిత్వాన్ని కవిత్వం అనుకోవడానికి ఏ ప్రమాణాలూ, కొలమానాలూ వున్నాయని అడిగితే ఎంత కవికయినా, వచన రచయితకయినా పొలమారుతుంది ఖాయంగా.

కాశీభట్ల వేణుగోపాల్ నో, రెడ్డి శాస్త్రీనో, చంద్రశేఖర రావునో, అప్పుడప్పుడూ రమణజీవినో, అప్పుడెప్పుడో నగ్నమునినో, త్రిపురనో, ఇంకా దూరం వెళ్ళి ....ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారినో, బుచ్చి బాబు సరే సరే...అడిగితే వాళ్ళు వచనాన్ని ఎలా నిర్వచిస్తారో వినాలని వుంది నాకు.

ఇక కవిత్వంలో వచనం పండించే సేద్యగాళ్ళకి కొదువే లేదు. అదీ మంచి వచనమా అంటే అది వేరే కథ!
అసలు వచనం అని మనం అనుకుంటున్న దాన్ని గురించీ, కవిత్వం అని తీర్మానిస్తున్న రూపాన్ని గురించి అందరికీ ఎంతో కొంత అసంతృప్తి వుందన్నదే నేను చెప్పాలనుకున్నది! ఈ అసంతృప్తి ఘనీభవించినప్పుడు అటు వచన రచయితా, ఇటు కవీ వాటి వాటి చట్రాలని బద్దలు కొట్టి, ఇంకో కొత్త రూపంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త రూపాన్వేషణ వొక తాత్కాలికమయిన వెసులుబాటు మాత్రమే అనిపిస్తోంది నాకు. కథకులు “కవిత్వ” సీమల్లోకి చొరబడే సన్నివేశాలని కాసేపు పక్కన పెట్టి, కవులు వచనసీమల్లోకి పోలో మని దూసుకొస్తున్న కొన్ని సందర్భాలు కొన్ని ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే, ఇక్కడ కవిత్వమూ, వచనమూ అనే సంప్రదాయిక చట్రాలతో విబేధించడం నా ఉద్దేశం.

ఉదాహరణకి పసుపులేటి గీత ఈ మధ్య రాసిన “దేహం” అనే కవిత చూడండి. ఈ కవితలో గీత చాలా విషయాలు మాట్లాడింది. కొన్ని రాజకీయ స్థాయిలో, కొన్ని జెండర్ స్థాయిలో, కొన్ని భిన్న అస్తిత్వాల స్థాయిలో , ఈ కవితకి అనేక రూపాలున్నాయి. వాటన్నిటిని దేహం అనే బాహ్య రూపం కింద చెప్పుకుంటూ వెళ్లింది. ఆ మాటకొస్తే, దేహం బాహ్య రూపం కాదనుకోండి. ఈ కవిత నిస్సందేహంగా చాలా బలమయిన రాజకీయ ప్రకటన.

ఈ కవితని అలా వొకే పారాగ్రాఫ్ లాగా రాయకుండా మామూలు వచన కవితలాగా పాద విభజన చేసి వుంటే ఎలా వుంటుందా అని వొక సారి ఆలోచించాను. పాద విభజన వుండడమే కవిత్వ లక్షణం కాదని ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కానీ, పాద విభజనని ఈ సందర్భంలో నిరాకరించవచ్చు అనే ఆలోచన కవికి ఎలా వచ్చి వుంటుందన్నది ఆసక్తికరమయిన ప్రశ్న.
ఎంత కాదనుకున్నా పాద విభజనకి వొక లయ వుంది. పాదాల్ని విభజించేటప్పుడు కవి తనకి తెలియకుండానే పఠిత పైన వొక ప్రభావాన్ని కలిగిస్తాడు. ఫలానా చోట కాస్త ఆగి చదవండి అనే సైన్ బోర్డు వేలాడదీస్తున్నాడు. అలా ఆగి చదవడానికి ఆలోచనతో సంబంధం లేదు, అది చాలా మటుకు ఆవేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం.

వచనం చదివేటప్పుడు కూడా పఠిత కొన్ని సార్లు ఆగి చదవాలి. అలా ఆగి చదవడం అనేది కవిత్వంలో వొక మాదిరిగా, కథలో ఇంకో మాదిరిగా, విమర్శలో ఇంకో మాదిరిగా వుంటుంది. కథలో కానీ, విమర్శలో కానీ, అలా ఆగి చదవడం మీద రచయితకి అధికారం లేదు. కానీ, కవిత్వంలో కవి అలా ఆగి చదవడాన్ని నిర్దేశిస్తాడు. కవి నిర్దేశానికి వ్యతిరేకంగా పఠిత తన ఇష్టం వచ్చిన చోటల్లా ఆగితే, కవితలో పాద విభజన ప్రయోజనం దెబ్బ తింటుంది.

కానీ, కొత్త కవి పఠిత స్వేచ్చని నియంత్రించే నిరంకుసత్వాన్ని భరించలేడు/లేదు. దానికి మరో బలమయిన కారణం మామూలు వచనంలో మాదిరిగానే కొత్త కవిత్వంలో ఆలోచన రూపం మారింది. గీత కవిత లో ఆవేశం కంటే, ఆలోచన బలమయిన పాత్ర తీసుకుంది. కొన్ని ఆలోచనల యూనిట్లుగా కవిత నడక సాగుతుంది. ఇలాంటి వస్తువులు కవిత్వానికి పనికి రావనీ, ఆలోచనని ప్రోది చెయ్యడమే ఉద్దేశం అయితే వ్యాసం రాసుకోవచ్చని కొందరు వాదించ వచ్చు. నిజమే, వ్యాసం రాయడం ద్వారా గీత ఈ విషయం మీద ఇంత ప్రభావపూరితమయిన ప్రకటన చెయ్యగలదా అన్నది నా ప్రశ్న. ఇంకో చిన్న మాట: అసలు ఈ కవితలో దేహాన్ని కవితా రూపానికే ఆపాదించి ఇంకో సారి చదవండి. ఈ కవిత ఎందుకు ఇలా పారాగ్రాఫు లాగా మారిందో వొక క్లూ దొరకవచ్చు. కానీ, ఆ విధంగా చదవడం కవితలోని మూల భావానికి దెబ్బ కావచ్చు, అయినా, మన లోపలి పఠితని కట్టడి చెయ్యడం ఎవరి తరం?!

*
Category: 4 comments

4 comments:

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

'కవిత్వం గీత దాటితే' చదివానండి..మంచి విషయాన్ని ప్రస్తావించారు..మరిన్ని విషయాలు మీనుంచి తెలుసుకోవాలని ఉంది

Rohith said...

నాకున్న చాల doubts clear అయ్యాయి. లోతుగా పరిశీలిస్తే Poetry~Prose...వీటిని వేరు గా చూడటం కష్టంగా ఉంటుంది. ఆ నా వాదన కి కొంచం బలం కొంచం correction జరిగినట్టు అయ్యింది దీనిలో.

ఈ మధ్య ఏప్పుడో చదివినట్టు గుర్తు..."ఒక వేల ఆలోచన, information వంటివి చెప్పేదే కవిత్వం అయితే సుందరయ్య స్పీచ్ లు వినచు" అని

Thanx for making me read this worthy piece sir.

Anonymous said...

aalochimpajese vishayalanu rasaru thanks for sharing your thoughts.....love j

Afsar said...

@జ్యోతిర్మయి గారు: చాలా థాంక్స్ అండి! పాలపిట్ట లో కాలమ్ చూడండి. వచ్చే నెల వొక గ్రీసు సినిమా గురించి, అందులో ఈ తరం అమ్మాయి కథ గురించీ రాశాను. ఆ సినిమా ఇటీవలి నా ఇన్స్పిరేషన్. మరింత రాయాలని తపన. కానీ, సమయాభావం!
@రోహిత్; సందేహాలు ఎప్పుడూ తీరవు, కొత్త సందేహాలు పుడతాయి తప్పక! అవును, సమాచారానికీ, సంవేదనకీ మధ్య తేడా కవిత్వంలోనే తెలుస్తుంది.
@జగతి గారు: కవిత్వ రూపం గురించి కొన్ని కొత్త ఆలోచనలకి రూపం ఇవ్వాలని ఆలోచన. అందులో ఇది మొదటి వ్యాసం. మిగతావి త్వరలో వస్తాయి.

Web Statistics