మంచి యానిమేషన్ సినిమా....ఆమె రహస్యం...పుస్తకాల మౌన వేదన!
“ఈ కాలం పిల్లలకి పుస్తకాలు చదివే అలవాటు చెయ్యడం మన తరమా?”

ఇలాంటి ప్రశ్న ఇప్పుడు పఠనాసక్తి వున్న తల్లి దండ్రులకి సహజమే. అనేక రకాల వీడియో ఇంద్ర జాలాల ముందు పుస్తకం ఏ మూలకి?

అలాంటి ప్రశ్నే, ఫ్రెంచ్ దర్శకుడు డొమినిక్ మాన్ఫెరే ని కలచివేసినట్టుంది! అది వొక అందమయిన యానిమేషన్ సినిమాగా రూపు దిద్దుకుంది. ఆ సినిమా పేరు “ఎలియనార్స్ సీక్రెట్”

నిన్న సాయంత్రం మాడిసన్ యూనివర్సిటీ స్క్వేర్లో ఈ సినిమా చూసి వచ్చినప్పటి నించీ పుస్తకాల భవిష్యత్తూ, “పాఠకులు” అనే వర్గం చావు పుట్టుకలూ నా ఆలోచనల నిండా కదులుతున్నాయి.ఈ సినిమా కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇంకా చదివే వయసు నిండా రాని ఓ చిన్న పిల్లాడికి వాళ్ళ అత్తమ్మ అప్పనంగా ఓ గొప్ప సంపద రాసిపెట్టి వెళ్లిపోతుంది. ఆ సంపద ఆమె ఏళ్ల తరబడి పోగు చేసుకున్న గొప్ప లైబ్రరీ. అందులో అన్నీ అద్భుత జానపద కథల పుస్తకాల మొదటి ఎడిషన్లు మాత్రమే వుంటాయి. అత్తమ్మ ఏం ఇచ్చిందో చూద్దామని ఆ గదిలోకి మహా ఆసక్తిగా అడుగు పెట్టిన ఆ పిల్లాడికి ఈ పుస్తకాలు కనిపిస్తాయి. “అబ్బా, ఇంతా చేస్తే ఇవి పుస్తకాలా?” అనుకుంటాడు ఆ పసివాడు. కానీ, ఆ పుస్తకాలే అతన్ని ఇంకో ప్రమాదంలో పడేస్తాయని అతని ఊహకి రాదు.
అతను ఆ గదిలో నించి బయటపడదామని తలుపు వేపు వెళ్తూండగా – ఆ పుస్తకాలలోని కార్టూన్ పాత్రలు పుస్తకాలలోంచి నడిచి వచ్చి అతన్ని వొక ఆట పట్టిస్తాయి. చివరాఖరికి ఆ పాత్రలే ఆ పిల్లాడి కథని మలుపు తిప్పుతాయి. ఇక్కడే మనకి దర్శకుడు మాన్ఫెరే యానిమేషన్ ప్రతిభ విశ్వరూపం కనిపిస్తుంది. ఆ కొన్ని దృశ్యాల కోసమయినా ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూడవచ్చు.

కానీ, ఈ సినిమా వెనక వున్న భావన నాకు బాగా నచ్చింది. అసలు ఈ పుస్తకాలు ఎవరికి కావాలి? అన్నది ఆ ప్రశ్న. దానికి సమాధానం వెతకడానికి పడిన పాట్లు బాగున్నాయి. తరాలలో వస్తున్న మార్పు, పుస్తకాలు క్రమంగా పురాతన వస్తువులుగా మారిపోతున్న విషాదం ఈ సినిమాలో చూస్తున్నంత సేపూ సరదాగా వుంటుంది, కానీ – ఆలోచించడం మొదలెడితే దిగులుగా వుంటుంది. అలాంటి దిగులు కలిగించడమే ఈ సినిమా అసలు ఉద్దేశం.

మొన్న “బ్రెత్ లెస్” చూపించినప్పుడు సినిమా హాలులో అందరూ పాతికపై బడిన వాళ్ళే వున్నారు. ఈ యానిమేషన్ సినిమా చూడడానికి పిల్లలు బిల బిల మని వచ్చేశారు. ఆ తల్లిదండ్రులూ పిల్లల మధ్య నేను వొక్కణ్ణీ కాస్త ఎడంగా కనిపించాను. కానీ, సినిమా చూస్తున్నంత సేపూ పిల్లల నవ్వులూ నిట్టూర్పులూ వినిపిస్తూనే వున్నాయి! హాల్లోంచి బయటికి వస్తూంటే వొక పిల్లాడు అంటున్నాడు “ఆ పిల్లాడికి చదవడం రాదు, చదవడం వస్తే కథ ఇంకోలా వుండేది!” అని! ఏమో?!
Category: 2 comments

2 comments:

Anil Atluri said...

పుస్తకాలు క్రమంగా పురాతన వస్తువులుగా మారిపోతున్న విషాదం
అంటే మీ ఉద్దేశం..పుస్తకం రూపురేఖలు మారిపోతున్నవనా..కాగితం..ముద్రణ వగైరాలా లేక సాహిత్యమా?

Afsar said...

అనిల్ గారూ:

"పురాతన" అంటే ఆ సందర్భంలో నా ఉద్దేశం "మ్యూజియం" వస్తువులుగా...అని!

పొరపాటుకి క్షమించండి.

Web Statistics