బచ్ పనా...




ఇన్నిన్ని దుఖాల మధ్య

వొక్క సంతోషపు తునకా

లేదు, లేదనేనా ?



రాత్రి చుట్టపు చూపు కలల్లోనూ

ద్రోహాల వంచనల మోసాల కథల క్లిప్పింగ్స్.

వొక్క స్నేహరాహిత్యం మాత్రమేనా వేల వర్ణాల మాయ?!


కాసింత ప్రేమ ఎప్పుడూ తెలుపు నలుపుల నిర్మోహ చిత్రమేనా?

అప్పుడప్పుడూ
ఆ చిన్నప్పటి తలుపు తీసి
పద,
వెళ్దాం బచ్ పన్..ఆ ప్రాచీన దేశంలోకి!పూర్వ దేహంలోకి!


బచ్ పనా...ఎవరూ ఎల్ల కాలమూ అక్కడే ఆగిపోరు, నిజమే.
వెళ్లిపోవాలి ముందుకే ...అదీ నిజమే.


అట్లా అని ఎంతదూరమో వెళ్లరులే,

వొక మోహం నించి ఇంకో నిర్మోహంలోకి,

వొక లిప్త ఉత్సాహంలోంచి ఇంకో నిర్లిప్తతలోకి.


అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్ర నగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ

వొక లేత గులాబీ కల - బచ్ పనాలోకి.


మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుందా,

అక్కడే ఆగిపోదామనీ, కాసేపు గడ్డకట్టిపోదామని.



ఇంకో నిజం కూడా ఇంతలోనే చెప్పనీ,

ఇంతకూ- ఆ వొక్క కల మాత్రం ఎవరి సొంతం?!
అందులో లేతదనం ఎంత కల?!
Category: 5 comments

5 comments:

Rohith said...

Sir,
మంచి కవిత. చిన్న పిల్లోడు రాసినట్టు అనిపించింది.

దీనిలోని ప్రశ్నలు అమాయకంగా, లోతుగా అనిపించింది...అందుకే ఏమో , బహుశ అలా అనిపించింది.
కవులు చిన్నపిల్లలా గురించి రాస్తున్నపుడు వాళ్ళే చిన్నపిల్లలోవుతారు...శ్రీశ్రీ లో టాగోర్ లో ఇప్పుడు మీ లో.

@అరుణ్ కుమార్- బాగా బొమ్మ గీసావ్.

malli said...

చాలా సరళంగా హాయిగా వొక లేత గులాబీ కలని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. ఎన్ని దుఖాలూ,ఎన్ని మాయలూ తుడిపివేయలేని ఆ లేతదనం,పచ్చిదనం కల కాకుండా వాస్తవం చేసుకోవాలి కదా మనుషులం....

కెక్యూబ్ వర్మ said...

నిజమే సార్...అక్కడే అలా గడ్డకట్టిపోదామని వుంది..సాధ్యమా...చాలా బాగుంది సార్...

Afsar said...

@రోహిత్; అవును కదా, కవిత్వం రాయడం అంటే పరకాయ ప్రవేశమే ఒక విధంగా! అదీ బాల్యకాయం అయితే ఆ కవిత నిజంగా అది సాధించినట్టే. సదా బాలకుడు టాగోర్ ఎప్పుడు చదివినా సదా తాజా పవనమే!
@మల్లీ: సరళత్వమే సౌందర్యం. ఏ కల అయినా వాస్తవం చేసుకోవాలంటే ముందు ఆ సరళత్వాన్ని అందుకోవాలి.
@వర్మ: అలా గడ్డ కట్టి వుండడం సాధ్యం కాదని చెప్పడమే ఈ కవిత. కానీ, అలాంటి అసాధ్యాల మధ్య ఏది సాధ్యమో చెప్పే ప్రయత్నం కూడా చేసానేమో!

రవి said...

అఫ్సర్ గారు,
చాలా బావుంది.
చదివి బచ్ పనా లోకి వెళ్లి చాలాసేపు అలా ఉండిపోయాను.
ఇన్నిన్ని దుఖాల మధ్య అప్పుడప్పుడు
బచ్ పన్ లోకి వెళ్లి రావడం నిజంగా చాలా సంతోషాన్నిస్తుంది.

-రవి

Web Statistics