భైరవభట్ల కామేశ్వర రావు గారు ఈ నెల "ఈమాట "లో కవిత్వం మీద మంచి వ్యాసం రాశారు.
అందులోంచి చిన్న భాగం ఇది. ఈ చిన్న భాగం ఇక్కడ అందించడంలో నా స్వార్థం వుంది కానీ, మొత్తం వ్యాసం చదివి, జాగ్రత్తగా దాచుకొదగింది అని నా అభిప్రాయం.
కవిత్వ వస్తువు సంక్లిష్టమయ్యే కొద్దీ దాని అభివ్యక్తిలో కూడా సంక్లిష్టత ఏర్పడే అవకాశం ఉంది. అలాంటి కవిత్వాన్ని అర్థం చేసుకోడానికి మరింత పరిశ్రమ సాధన అవసరమవుతాయి. నాకే జన్మభూమీ లేదు! అన్న యీ కవిత దీనికొక ఉదాహరణగా తీసుకోవచ్చు:
శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.
నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
‘47 దగ్గిరే ఎలా విరిగానో
మీరెవరూ చెప్పలేదుగా -
దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా -
నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని -
దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.
ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.
అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.
రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!
నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.
నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.
నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.
నాలో సగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.
నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.
అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.
శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.
ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో అంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.
నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.
నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.
విభజించి పాలించే నా శత్రువులారా,
నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.
ఈ కవిత సాధారణ పాఠకుడికి అర్థమవ్వడం కష్టమే. ఇది వ్రాసిన కవి ఒక భారతీయ ముస్లిం అన్న సంగతి ముందు పాఠకుడికి తెలియాలి. ఈ కవి వ్రాసిన కవిత్వం కొంత చదివి ఉండాలి. అప్పుడే యీ కవితలోని వస్తువు కాస్తంత బోధపడుతుంది. ఒక భారతీయ ముస్లిం అస్తిత్వ వేదన ఇందులోని వస్తువు. ఆ అస్తిత్వం - అనేక దృక్పథాల, అనేక సంఘర్షణల కలగాపులగపు సంక్లిష్ట స్వరూపం. ఆ సంక్లిష్టత కవితలోనూ ఉంది. దానికి తోడు అభివ్యక్తిలో ప్రత్యేకత కోసం వాడిన ప్రతీకలు, ధ్వని, సంక్లిష్టతని మరింత ఎక్కువ చేస్తున్నాయి. అయితే, కవితాభివ్యక్తిని శక్తివంతం చేస్తున్నవి కూడా అవే. సరిగా అర్థం చేసుకుంటే, ఒక భారతీయ ముస్లిం తన అస్తిత్వంలో అనుభవిస్తున్న ఒక శూన్యత, అనేక వైరుధ్యాలు యీ కవితలో స్పష్టంగా సాక్షాత్కరిస్తాయి. భారతీయ వర్ణవ్యవస్థలో ఇమడనితనమూ, అనుభవిస్తున్న పరాయితనము, దేశంతో పూర్తిగా ముడిపడని అస్తిత్వమూ, మొఘల్ కాలపు మతదౌష్ట్యాలు ఇంకా తనపై ప్రభావం చూపడమూ, మైనారిటీ రాజకీయాలు - ఇలా ఎన్నెన్నో ధ్వనిస్తాయి. ఇందులోని ఆత్మీయత, అభివ్యక్తిలోని నేర్పరితనము, యీ కవితని ఇతర అస్తిత్వవాద ఉద్యమ కవితలనుండి వేరు చేస్తున్నాయి. దీన్ని అర్థం చేసుకోవాలంటే కవి నేపథ్యం తెలియాలి. కవిత్వ వస్తువుపై కొంత అవగాహన, సానుభూతి ఉండాలి. ప్రతీకలని, ధ్వనిని సరిగా అర్థం చేసుకొనే అనుభవమూ ఉండాలి.
*
ఈ అనుభూతి కవితలో ఆలోచనకీ, తర్కానికీ, విశ్లేషణకీ స్థానం లేదు. మన పంచేంద్రియాల్ని తాకే పద చిత్రాలద్వారా మన అనుభూతిని మేలుకొలుపుతాడు కవి. తను ఉద్దేశించిన సంవేదనల్ని (feelings) మనలో రేపే పదచిత్రాల్ని (images) ఎన్నుకుంటాడన్నమాట. అనుభూతికి అవరోధమయే ఆలోచనా సామాగ్రిని దరికి జేరనివ్వడు. అనుభూతి ద్వారా మనిషికి స్వస్వరూప జ్ఞానం కలుగుతుంది. ఆ అనుభూతి స్వరూపం ఆనందం. ఇంతకన్నా పరమార్థం వేరే ఉందనుకోను.”
ఈ తత్త్వం తెలిసిన పాఠకునికే ఈ కవిత్వం అర్థమవుతుంది. ఒక రకంగా చూస్తే ఇలాంటి కవిత్వ సృజనలో కవి పాత్ర నూరుశాతం, పాఠకుని పాత్ర కూడా నూరుశాతమే! ఉదాహరణకి మూలా సుబ్రహ్మణ్యంగారి ‘మంచు’ కవిత చూడండి:
చలికాలపు సాయంత్రం
ఎవ్వరూ లేని బాట మీద
ఏకాకి నడక.
రాలిన ఆకుల కింద
ఎవరివో గొంతులు
ఎక్కడో దూరంగా
నిశ్శబ్దపు లోతుల్లోకి
పక్షి పాట
లోయంతా సూర్యుడు
బంగారు కిరణాలు పరుస్తున్నా
కాసేపటికి ఆవరించే చీకటి మీదకే
పదే పదే మనసుపోతోంది
కర్రపుల్లల కొసన నర్తించే
ఎర్రని చలిమంటలోకి
ప్రవేశించాలనిపిస్తోంది.
కురిసే మంచు
నా గొంతులో
ఘనీభవిస్తోంది.
ఈ క్షణం నా పాటకి
మాటల్లేవు!
కొన్ని దృశ్యాలని కవి ఇక్కడ వర్ణిస్తున్నాడు. ఒక వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఒక సన్నివేశంలో తనకి కలిగిన ఒకానొక అనుభూతికి అక్షరరూపమిచ్చే ప్రయత్నం చేశాడు. ఇందులో అస్పష్టతకి తావులేదు. ఆలోచనకీ విశ్లేషణకీ కూడ తావులేదు. చదివిన పాఠకులకి ఎవరి అనుభూతి వారిదే, పూర్తిగా. అయితే, యీ కవితలో కవి గొంతు కొంత ఉంది. అంటే, కేవలం దృశ్యాన్ని పదచిత్రాలతో వర్ణించి ఊరుకోకుండా, తను పొందిన అనుభూతిని కూడా పదాలలో పెట్టే ప్రయత్నం కవి చేశాడు. అనుభూతికవిత్వంలో పదచిత్రాలు మాత్రమే ఉండాలన్న నియమం లేదు. కవి పొందిన అనుభూతిని వ్యక్తం చెయ్యడానికి పదచిత్రాలు ఒక సాధనం మాత్రమే. అయితే కొన్నిసార్లు కవి పూర్తిగా మౌని అయిపోయి, కేవలం అతను చూసిన దృశ్యాలు మాత్రమే ఉండటం కూడా జరుగుతుంది. అలాటి కవితల్లో పాఠకునికి పూర్తి ఏకాంతం దొరుకుతుంది. ఉదాహరణకి సుబ్రహ్మణ్యంగారిదే మరో కవిత:
ఎగురుతూ ఎగురుతూ
చటుక్కున కొలను బుగ్గని
ముద్దు పెట్టుకుంది తూనీగ
తెరలు తెరలుగా….
సిగ్గు.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
0 comments:
Post a Comment