అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
ఇవాళ వొక్క వాన చుక్కయినా రాలలేదు
-
పోనీ, ఎవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు
2
ఇలా వుండనీ కొన్ని క్షణాలు
ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలు
-
నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు
3
గది లోపల నా లోపల
ఎక్కడెక్కడి నించో శరీరపు లోచర్మపు లోలోపల నించి
పాడుతూనే వున్నాడు నస్రత్ ఫతే అలీ ఖాన్
-
పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా.
4
కిటికీ బయట చెట్ల ఆకుల్లో
కార్డినాల్ పక్షులు కాషాయెరుపులో.
-
ఈ క్షణపు నిశ్శబ్దపు అందానికి ఏదో వొక రంగు
5
నా కంటి రెప్పల మీద
వొక నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు
-
ఈ వొంటరి క్షణపు నిరీహకి ఏదో వొక శబ్దం!
6
లోయలూ శిఖరాలూ నీ లోపలే.
ఆకాశాలూ అరణ్యాలూ నీలోనే.
-
ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం.
(ఈ ఆరు పదాలూ మా జావేద్ కోసం...)
painting: Mandira Bhaduri
9 comments:
ఇలా వుండనీ కొన్ని క్షణాలు
ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలు
- నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు
............
బావుందిగాని వెలితి కాదేమోనండి?
fantastic.....chaala lothulaki thesukellaru...love j
Lolopali manishini munivrellato takutunnayi Afsargaru
ivi aaru padaala aaru vaakyaalaa?
లోయలూ శిఖరాలూ నీ లోపలే.
ఆకాశాలూ అరణ్యాలూ నీలోనే.
- ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం.
అద్భుతం సార్...జావేద్ గారు అదృష్టవంతులు...
నా కంటి రెప్పల మీద
వొక నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు
- ఈ వొంటరి క్షణపు నిరీహకి ఏదో వొక శబ్దం!
ఎంత బాగుంది ఈ కవిత. అఫ్సర్, లోలోపలి మనసుతో పలకరించావు
@సౌమ్య: అవును మీరన్నది నిజమే. అక్కడ వెలితి అనే పదం లేకపోయినా నిజానికి వెలితి లేదు. ఇంకేదో పదం పడాలి పడలేదు. బాగా గుర్తించారు, మొత్తానికి!
@జగతి గారు: థాంక్ యు
@బీవీవీ; లోపలి మనిషి జాడ పట్టుకోవడం కవిత్వం చెయ్యాల్సిన మంచి పని. ఆ పని కొంచెమయినా చెయ్యగలిగితే సంతోషం.
@అనానిమస్ గారు: ఆరు పదాలు అన్నాను, కొంచెం సంప్రదాయికంగా. కవిత్వాన్ని మనం పదాలు అనే వాళ్ళం పూర్వం నించీ. ఎందుకో, నాకు కవిత్వం అనే మాట కంటే, పదాలు అన్న మాటే నచ్చింది.
@వర్మ; మీకు నచ్చినందుకు సంతోషం. జావేద్ కి కూడా నచ్చితే ఇంకా సంతోషం.
@హరగోపాల్; ఎన్నాళ్లయింది నిన్ను చూసీ, మాట్లాడీ?! బ్లాగోన్ముఖంగా ములాఖత్ బాగుంది. చాలా మంది పాత స్నేహితుల్ని మళ్ళీ కలుపుతున్నది బ్లాగ్! ఆ రకంగా బ్లాగోత్సాహం కాస్త!
ఇవాళ కల్పన గారి బ్లాగు లో పోస్ట్ చదువుతుంటే ఈ అక్షరాలు కనిపించాయి.
"ఎవరన్నారు ఒంటరితనం బాధాకరమని?
ప్రాణ వాయువు లాగా అది కూడా ఓ తప్పనిసరి అవసరం కదా! మనుష్యుల మధ్య ప్రేమ ఎంత ఎవసరమో, ఒంటరి తనం కూడా అంత అవసరం. అప్పుడే కదా మన లోపల్లోపలికి తొంగి చూసుకోగలం."
మీ "నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు" గుర్తొచ్చింది.:)
ఇలా వుండనీ కొన్ని క్షణాలు
ఎవరూ రాని ఏమీ జరగని కొన్ని క్షణాలు
- నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు
నాకిలా తోచిందండి ...తప్పైతే క్షమించండి
Post a Comment