అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో మ‌న‌ 'సహన ప్రతీకలు'..

ఇంటర్వ్యూ: కందుకూరి రమేష్ బాబు 


ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్- పాపులర్ ఇస్లాం అండ్ షేర్డ్ డివోషన్ ఇన్ సౌత్ ఇండియా పుస్తకం వచ్చి దాదాపు ఏడాదైంది. ఇది తప్పక చదవ వలసిన గ్రంథం. ఎందుకంటే.. మన సంస్కృతి ఎంత వైవిధ్యమైందో మనకు తెలుపుతుంది కనుక. మన ప్రత్యేకతలు మనకే తోచవు. స్థానికుడికి విహంగ వీక్షణానికి అవకాశం వుండ దు. కాస్త దూరం జరిగి చూడటానికీ వెసులుబాటూ ఉండదు. ఆ పనే ఒక పరిశోధకుడు బాగా చేయగలుగుతాడు. ఆ పరిశోధకుడు సామాజిక బాధ్యతను నిర్వచించుకున్నవాడు, ఆధ్యాత్మికశక్తిని దర్శించగలవాడూ అయితే అది దివ్యంగా మారుతుంది. అతడు మన దేశీయతలోని విశిష్టతను, భిన్నత్వాన్ని, లౌకికత్వాన్ని లోతు గా తరచి చూడగలవాడు అయితే ఒకేసారి ప్రపంచానికి భిన్నాంశాలను బలంగా చెప్పగలడు.
అదే సమయంలో తన ప్రపంచానికి కూడా చెప్పిఔను గదాఅని మెప్పించగలడు. ఇదంతా ఒక అద్భుతమైన కార్యాచరణ. ఇందులో నిమగ్నమైన వ్యక్తి పరిశోధన అంటే అది కేవలం విజ్ఞానమే కాదు, వికాసం. మరింత విశాలంగా మన మనోగవాక్షాలను తెరిచే పెద్దబడి. ఒక సహన ప్రయత్నం. అఫ్సర్ మహ్మద్ రచించిన ది ఫెస్టివల్ ఆఫ్ పీర్స్ గ్రంథం అదే చేసింది.
అఫ్సర్ పాఠకులకు బాగా తెలిసినవారే. పాత్రికేయుడిగా, కవి గా, విమర్శకుడిగా మూడు దశాబ్దాలుగా తెలుగు సాహిత్యంపై చెరగని ముద్ర ఆయనది. తన నిశితమైన కలం కల్పనా సాహిత్యంలోనూ అడుగుపెట్టి వర్తమాన సమస్యలను కథలుగా మలిచి చర్చ కు పెడుతోంది. తాను తెలంగాణను వదిలి అధ్యాపకుడిగా టెక్సాస్ యూనివర్సిటీకి వెళ్లాక ఇక్కడ తెలంగాణ ఉద్యమం జోరందుకున్న ది. సాంస్కృతిక పునరుజ్జీవనంలో పెద్ద ముందడుగు పడింది. ప్రత్యేక రాష్ట్రమూ సాకారం అయింది. ఇక్కడ మనం ఇలా ఉండ గా, అక్కడ ఆయన ప్రపంచ పౌరుడిగా మూడో ప్రపంచ సాంస్కృతిక వైవిధ్యాన్ని బలంగా వినిపించే సబాల్ట్రన్ ఐకన్ అయ్యారు. కల్లోల సంక్షోభాన్ని శక్తివంతంగా చాటే విమర్శకుడిగానూ మారా రు.
తెలుగు భాషా వికాసానికి అమెరికాలో కేంద్రం అయ్యారు. అంతర్జాతీయ మేధావుల సరసన చేరి పరిశోధకుడిగా మరింత లోతైన అధ్యయనశీలిగానూ మారారు. టెక్సాస్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకులుగా పనిచేస్తున్న అఫ్సర్ దక్షిణాసియా సాహి త్య, సంస్కృతులను బోధిస్తున్నారు. తెలుగు విభాగం అధిపతిగా నూ విశేషమైన సేవలందిస్తున్నారు. మరో పక్క గ్రంథ రచయితగా తెలంగాణ సంస్కృతిలో కీలకమైన పీరీలను ఆయన అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అధ్యయనాంశంగా మలిచారు. ఈ సందర్భంగా ఆ గ్రంథం గురించి అఫ్సర్‌తో.. కందుకూరి రమేష్ బాబు ఆత్మీయ సంభాషణ...
1. అసలు పీర్ల పండగపై పుస్తకం ఎందుకు రాయాలనిపించింది?
- నేను మొదట దళిత - ముస్లిం సాహిత్యాల మీద లోతైన విశ్లేషణతో, వర్తమాన పరిశోధనా అంశాలు కలిపి ఏదైనా రాయాలని అనుకున్నా. ముఖ్యంగా, ముస్లిం సాహిత్యం మీద దృష్టి పెట్టాలని ఆలోచన వుండేది. కానీ, తెలుగులోనే కాకుండా, వివిధ ప్రపంచ భాషల్లో వస్తున్న ముస్లిం సాహిత్యం చదువుతున్నప్పుడు కేవలం ఉపరితలం నుంచి కాకుండా సమాజం పునాదీ, అంతర్గత నిర్మాణాల్లోకి వెళ్లి ముస్లిం అస్తిత్వ చర్చ చేయాల్సిన అవసరం వుందనిఅనిపించింది. ముస్లిం ఉనికిని బాహాటంగా ఎక్కడ గమనించవచ్చు అన్న ప్రశ్నకు పీర్ల పండగలో సమాధానం దొరికింది నాకు. ఎక్కడో కొన్ని వేల మైళ్ళ దూరాన ఉన్న ఇరాక్‌లో కర్బలా అనే చోట జరిగిన యుద్ధగాథ మనకు ఎందుకు అంత ముఖ్యమైందో తెలుసుకోవాలన్న మౌలికమైన ఆసక్తి ఈ పుస్తక రచనకు ప్రధాన కారణం.
2. రాస్తున్నప్పుడు ఈ గ్రంథం ఇంత ముఖ్యమైంది అవుతుందని అనుకున్నారా?
-నిజానికి ఈ పుస్తకం రాసేటప్పుడు నాకు పెద్ద ఆశలేమీ లేవు. రాయాలీ అనుకుని రాశాను. అంతే! అయితే.. ఆసక్తితో మొదలైన రచన నాకే కాదు, చాలామంది ఆసక్తికి, అధ్యయనానికి ఊతమిస్తుందని తర్వాత అర్థమైంది.
3.పుస్తకానికి ఎటువంటి గుర్తింపు వచ్చిందంటారు?
-ఈ పుస్తకం రాశాక ఇది తక్షణం అచ్చులో రావాలని అమెరికాలోని నా మిత్రుల నుంచి, స్కాలర్స్ నుంచి ఒత్తిడి పెరిగింది. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లాంటి ఆంతర్జాతీయ సంస్థకు ఆ రాతప్రతిని పంపినప్పుడు నాకేమాత్రం నమ్మకం లేదు. అంత పెద్ద సంస్థకు ఇంత చిన్న అంశం ఏం పడుతుందిలే అనుకున్నా. కానీ, రాత ప్రతి పంపిన నెలరోజుల్లో అక్కడి ఎడిటర్ థియో ఈ మెయిలు చేసి అభినందించారు. అంతేకాదు, ఆశ్చర్యంగా కేవలం ఆరు నెలల వ్యవధిలో వారు ఈ పుస్తకం బయటికి తీసుకువచ్చారు. అప్పుడర్థమైంది, ఎంత ముఖ్యమైన పుస్తకం పూర్తి చేశానో అని!ప్రస్తుతం ఈ పుస్తకం పాఠ్యగ్రంథంగా మారిందని విన్నాం!అవును. ఈ పుస్తకానికి దక్కిన గుర్తింపు చాలా కీలకమైంది. దాదాపు పదిహేను అమెరికన్ /యూరోపియన్ విశ్వవిద్యాలయాల్లో ఇది పాఠ్య పుస్తకమయ్యింది. ఒక రకంగా అంతర్జాతీయ స్థాయిలో పీరి వేదికనెక్కిందని సగర్వంగా చెప్పవచ్చు.
4.సిద్ధాంతపరంగా మీరు ఈ గ్రంథంలో ఏం చర్చించారు?
-నేను రెండు మౌలిక భావనలు ఆశ్రయించి ఈ రచన చేశాను. local Islam/ localized Islam లేదా స్థానిక ఇస్లాం, స్థానికీకరించబడిన ఇస్లాం అనవచ్చు. వీటి మధ్య చర్చ మొదలయింది, ఆ చర్చ ఇప్పటికీ సాగుతోంది. ఆ మేరకు నాకు తృప్తిగా వుంది.ఆ గ్రంథం ఒక ముఖ్యమైన రిఫరెన్స్ బుక్‌గానూ మారిందంటున్నారు!నిజమే. పాపులర్ ఇస్లాం, షియా సంప్రదాయాలు, దక్షిణాసియ ఇస్లాం -అనే విభాగాల్లో వచ్చిన రచనల్లో ఈ పుస్తకాన్ని ప్రముఖంగా పేర్కొంటున్నారు. మరో విశేషం, ఇప్పటికీ ఈ అం శం మీద నన్ను ప్రసంగించమని అమెరికా, యూరప్ దేశాల నుం చి ఆహ్వానాలు అందుతున్నాయి.సరే, మన దగ్గరకు వస్తే.. పీర్ల పండగ తెలంగాణకు ముఖ్యమైన ప్రతీక.
5.అయితే, మీ పరిశోధనల్లో మీరు సూఫీయిజం గురించి బాగా చర్చించారంటారు? అసలు మీరు వ్యక్తం చేసిన అవగాహన ఏమిటి?
-పీర్ల పండగ తెలంగాణలో మాత్రమే కాదు, వేర్వేరు పేర్లతో ఇస్లాం చరిత్రతో సంబంధం వున్న ప్రతి చోటా వుంది. అయితే, తెలంగాణలో మనం పీర్ల పండగ అంటాం. ఇక్కడ ఇది సూఫీ సంప్రదాయాలతో కలగలిసిపోయి, ఆ సంప్రదాయ ప్రతీకలైన పీర్ల వల్ల వీటికి మరింత స్థానిక చరిత్ర తోడయింది. మరోమాటలో చెప్పాలంటే-ఇది అందరి పండగగా మారడం వెనక సూఫీ ప్రభా వం బలంగా వుంది. నా పుస్తకంలో ప్రధానమైన వాదన కూడా అదే. మొదట అది షియా సంప్రదాయంగా షురూ అయినా, తరువాత అది నడిచిన చరిత్ర సూఫీలతో కొత్త వెలుగు ప్రసరించింది. ఈ మధ్య మిత్రుడు సుమనస్పతి రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో గోండులు జరుపుకునే పీర్ల పండగ గురించి చిత్రాలు షేర్ చేసుకున్నారు. అంటే, మారుమూల ప్రాంతాలకు కూడా ఈ సంప్రదా యం ఎంత బలంగా ప్రయాణించిందో మనకు అర్థమవుతుంది.
6.తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండుగ కలసిపోవడం, దాని ఆధ్యాత్మిక విశిష్టత గురించి వివరిస్తారా?
-నిజమే. తెలంగాణ సంస్కృతిలో పీర్ల పండగ కలగలిసి పోయిన విధానం గురించి ముఖ్యంగానే చెప్పుకోవాలి. కుతుబ్ షాహీల సామరస్య దృక్పథంలోంచి మన పల్లెల్లోకి ఈ పండగ ప్రవేశించినా, స్థానికంగా వున్న సాంస్కృతిక అంశాలను కలుపుకొని, పల్లెల స్వరూపాన్ని మార్చిన పండుగ ఇది. ముఖ్యంగా మన జానపద సంస్కృతికి ఒక కుదుపు ఇచ్చింది. తెలంగాణ పల్లెల్లో వున్న దీర్ఘ కథనాల సంప్రదాయం దీనికి బాగా సరిపోయింది. అలాగే, అగ్రవర్ణాల ఆసరా అక్కర్లేని ఆధ్యాత్మికతకు ఇది దారి తీసింది. పీరు సంప్రదాయం ఆ విధంగా హిందూ మతంలో వున్న కులాధిపత్యాన్ని కూడా ప్రశ్నించింది. మతం అనేది పడగ విప్పడానికి కాదని, ప్రేమని పంచడానికని రుజువు చేసింది.
7.అసలు పీర్ల పండగ దేనికి ప్రతీక?
-ప్రధానంగా ఇది హిందూ- ముస్లిం సంస్కృతుల కలయికకు ప్రతీక. అయితే, ఆధునిక సమాజానికి మూలసూత్రాలైన సమిష్టి వాదం, సామాజిక న్యాయం, సమానత్వ కాంక్షకు కూడా ఈ పీర్ల కథనాలు, సంప్రదాయాలు ప్రతీకలు. సంక్షిప్తంగా చెప్పాలంటే.. అవి మన సామాజిక సహన ప్రతీకలు.
8.సహన ప్రతీకలు అన్నారు.. వివరిస్తారా?
-ఇప్పుడున్న వాతావరణంలో ఈ మాట నొక్కి చెప్పవలసిందే. నిజంగానే పీర్లు మన సహన ప్రతీకలు. ముఖ్యంగా, తెలంగాణ, రాయలసీమ పల్లెల్లో పీర్ల కథనాల మీద ఇంకా సమగ్రమైన శోధన జరగాల్సి వుంది. ఆ కథనాల్లో జనం చెప్పుకునే భావనల అన్వేషణ కూడా విస్తారంగా జరగాలి. అయితే, దురదృష్టవశాత్తూ, ఇప్పుడు పెరిగిపోతున్న మత అసహనాల వల్ల, ముఖ్యంగా ముస్లింల పట్ల పెరుగుతున్న వివక్ష వల్ల.. ఈ పండగ ప్రాముఖ్యం తగ్గిపోతోంది. ఈ అసహనం ఎంత తీవ్రంగా వుందంటే..బహుశా ఇంకో అయిదేళ్ళ తరవాత ఈ పండగ ఎక్కడా కనిపించకపోవచ్చు కూడా! అంటే, మన సహన ప్రతీకలన్నిటినీ మనం చంపుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోతున్నామన్న మాట!
9.ఇప్పుడు మీ అన్వేషణ ఎటువైపు?
-పీర్ల పండగ పరిశోధనకు కొనసాగింపుగా అసలు పీరు సంప్రదాయానికి పునాది వేసిన సూఫీ సాహిత్యం వైపు దృష్టి పెట్టాను. లిఖిత సాహిత్యాన్నీ పరిశీలిస్తున్నాను.
10.కవి, విమర్శకుడు ఇప్పుడు సంపద్వంతమైన చింతనాపరుడిగా మారుతున్నాడని అనవచ్చునా?
-ఇదంతా స్థానికత మహత్యం. సంస్కృతి, సంప్రదాయాల ఘనత. పునరుజ్జీవనం. ప్రపంచ పౌరుడిగా వీటన్నిటీనీ ఇముడ్చుకున్న ఫలితం అంటాను నేను. అయితే ఇక్కడో మాట చెప్పాలి. అసలు తెలుగులో సూఫీ సాహిత్యం ఉందా? అని చాలామంది నన్ను ఎదురు ప్రశ్నించారు. వుందన్నదే నా వాదన. ది ఫెస్టివల్ అఫ్ పీర్స్‌లో నేను మౌఖిక కథనాలు మాత్రమే డాక్యుమెంట్ చేశాను. ఇప్పుడు లిఖిత సాహిత్యంలోకి కూడా వస్తున్నా. ఇప్పటికే కొన్ని అనువాదాలు పూర్తయ్యాయి. కథలూ, కవితల అనువాదాలు ఒక భాగం, విశ్లేషణ ఇంకో భాగం.. రెండు పుస్తకాలుగా ఇవి త్వరలో రాబోతున్నాయి. ఇవన్నీ వస్తే ఈ గ్రంథం రచించాలన్న నా మౌలికమైన ఆసక్తిలో నాకే తెలియకుండా బీజ రూపంలో ఇమిడివున్న తాత్విక చింతన నన్ను నిజంగానే సంపద్వంతమైన వ్యక్తిగా, పరిశోధకుడిగా మార్చినట్టే. అది నిజంగా చెప్పలేని తృప్తీ. ఆనందం.
Interview published in Chelime page,
Namasthe telangana.08.11.2015

చమ్కీ పూల గుర్రం


-అఫ్సర్

          

“ఇప్పుడు ఆ గుర్రం.... ఆ చమ్కీ పూల   గుర్రం ... బొమ్మ మీద నిజంగా కోపమొస్తోంది నాకు! ఈ బొమ్మ వల్ల కదా ఇప్పుడు నేను మున్నీతో  మాట్లాడకుండా అయిపోయింది. పో... పోవే..చమ్కీ!”
          -అని పైకే అనేస్తూ  చేతిలో వున్న బొమ్మని మంచమ్మీదికి విసిరింది అపూ. ఆ విసరడం ఎంత నాజూకుగా విసిరిందంటే నిజంగా బొమ్మకేమయిపోతుందో అన్న దిగులు మనసులో పెట్టుకొని నెమ్మదిగా, వీలయినంత  మెత్తగా విసిరింది.
           విసిరేసిన తరవాత “పోనీలే పాడు చమ్కీ!” అనుకోలేకపోయింది. మళ్ళీ పరుగు పరుగున వెళ్ళి, ఆ బొమ్మని చేతుల్లోకి తీసుకొని, అదేమయినా గాయపడిందేమో, నొచ్చుకుందేమో అన్నంత ఆతృతగా, కంగారుగా దాన్ని తన మెత్తని వేళ్ళతో సవరదీసింది.
అపూకి  ఈ చమ్కీల  గుర్రం బొమ్మ అంటే ఎంత ప్రాణమో! ఆ  మావిచిగురు రంగు గుర్రం వొంటి మీద నల్లని జూలు...దాని వీపు మీద మెరిసే ఎర్ర ముఖమల్ గుడ్డ కుట్టిన తళుక్కు చమ్కీలు. రాత్రి నిద్రలోకి నెమ్మదిగా జారిపోతున్నప్పుడు లైట్లన్నీ ఆర్పేశాక అవి భలే మెరుస్తాయ్! ఆ చిన్ని  మెరుపుల్లో చమ్కీతో బోలెడు కబుర్లు చెప్పుకుంటుంది అపూ.
ఇంకా ఆ బొమ్మ అంటే ఎందుకు ప్రాణం అంటే...అది మున్నీ ఎంత ఇష్టంగా అపూకిచ్చిందో! ఇంకా ఇంకా ఎందుకు అంటే,  మున్నీ  అంటే ప్రాణంలో ప్రాణం కాబట్టి!  మున్నీ వాళ్ళమ్మ భాషలో చెప్పాలంటే మున్నీ – అపూ  వొకళ్ళకొకళ్ళు జిగర్ కా టుకడా (ప్రాణంలో  వో ముక్క) కాబట్టి!
మరీ మున్నీకి దూరంగా వున్న క్షణాల్లో చమ్కీని దగ్గిరకు హత్తుకొని, “మున్నీ!” అని ప్రేమ గోముగా పిల్చుకుంటుంది  అపూ మళ్ళీ మళ్ళీ! మున్నీతో చెప్పుకోవాల్సిన  కబుర్లన్నీ దాంతోనే చెప్పుకుంటుంది అపూ. అమ్మ వొడిలో వున్నప్పుడు కూడా కిటికీలోంచి ఆకాశంలోకి చూస్తూ, చమ్కీకి నక్షత్రాలు చూపిస్తూ, వాటిని లెక్కపెడ్తూ నిద్రలోకి జారుకుంటుంది.
           ఇవాల్టికి అయిదు రోజులు- మున్నీని  అపూ  చూడక, మున్నీతో అపూ ఆడుకోక.
 మున్నీతో కథలూ లేవు,  కబుర్లూ చెప్పుకోలేదు. మున్నీ  వాళ్ళింటికి వెళ్ళి వాళ్ళమ్మమ్మ ఫాతమ్మ  ముందు కూర్చొని అల్లరీ  చేయలేదు. ఫాతమ్మ కథలు చెప్తూ చెప్తూ వుంటే కొట్టనూ లేదు! అపూకి  ఊహ తెలిసిన తరవాత చూసిన మొదటి పీర్ల పండగనాటి సాయంత్రం పీరు కథ ఫస్టు ఫస్టు చెప్పింది ఫాతమ్మే. అప్పటి దాకా  అపూ దృష్టిలో పీరు అంటే చేతి ఆకారంలో వుండే వొక బొమ్మ మాత్రమే. కాని, ఫాతమ్మ చెప్పిన కథ విన్న తరవాత పీరు అంటే వొట్టి బొమ్మ కాదనీ, వాళ్ళు దేవుళ్ళ లాంటి గొప్ప మనుషులనీ అర్థమైంది. అందుకే, వాళ్ళని వూళ్ళో అందరూ అంత గొప్పగా కొలుస్తున్నారనీ తెలిసింది.
“అవును, మనుషులు వూరికే దేవుళ్ళు అయిపోతారా మరి!” అని అమ్మ కూడా ఫాతమ్మ చెప్పిన కథే మళ్ళీ చెప్పుకొచ్చింది. వూళ్ళో కరువొచ్చినప్పుడు పీరు దేవుడి మహిమే కరువుని వెళ్ళగొట్టిందని వొక కథ. వూరి మీద ఎవరో మూకలు పెద్ద యుద్ధానికి వచ్చినప్పుడు పీరు దేవుడే కత్తి దూసి యుద్ధం చేశాడనీ, తన ప్రాణం అడ్డుపెట్టి, వూరిని కాపాడాడని ఇంకో కథ. చివరి యుద్ధంలో శత్రువులు కుట్ర చేసి, పీరు దేవుడిని యుద్ధ భూమిలో చంపేశారనీ ఇంకో పెద్ద కథ పాటగా పాడుతారు వూళ్ళో పీర్ల చావిడి దగ్గిర!
అదలా వుంచితే, అసలు ఫాతమ్మ పాల కోవా ఎంత బాగా చేస్తుందో!  తన  కోసమే ఎప్పుడూ  దాచి వుంచే  కోవా బిళ్ళని ఇప్పుడు  ఫాతమ్మ ఏం చేస్తోందో! తను లేకుండా దాన్ని మున్నీ తినేస్తోందా? లేకపోతే, అన్నీ దాచిపెట్టి తను కలిసిన రోజున ఇస్తుందా? అపూ ఆలోచనల్లో కలల్లో మున్నీ తప్ప ఇంకోటేమీ లేదు!
           అసలు మున్నీతో  మాట్లాడకుండా ఆడుకోకుండా ఈ అయిదు రోజులూ వుండడమే వింతల్లో వింత. కానీ, ఆ ఇంట్లో నాన్న  చండశాసనం ముందు అపూ అమ్మ సత్యా, నానమ్మ కూడా నిజానికి వణికిపోతారు, తొమ్మిదేళ్ళ  అపూ ఎంత? అయినా సరే,  మున్నీ  దగ్గిరకి వెళ్ళి రావాలి దొంగచాటుగా అయినా! కానీ, ఎప్పుడూ ఆ దొంగా పోలీస్ ఆటలోలాగా దొరికిపోతుందేమో అని అపూ భయం!
“ఒరే, నువ్వు పొరపాటున కూడా మున్నీ వాళ్ళ ఇంటివైపు వెళ్ళకు. మీ నాన్నకి  ముందూ వెనకా అన్నీ కళ్లే! ఎలా తెలిసిపోతుందో తెలిసిపోతుంది...నీ  వీపు విమానం మోత మోగిపోతుంది.” అని నానమ్మ ముందే హెచ్చరించేసింది కూడా. ఇంతకుముందు వో సారి వెళ్లి వస్తే, నాన్న  ఎలా కొట్టాడో ఏమైందో ఎలా మరచిపోతుంది అపూ?!
 “పూవు లాంటి పిల్లని ఎందుకలా కొట్టి కొట్టి చంపుతావ్?” అని నానమ్మ  ఆ రోజు అడ్డు వచ్చింది  కానీ, సురేష్ అలాంటి క్షణాల్లో ఎవరేమిటని చూసుకోడు...వొక్క చేత్తో విస్సిరి అవతల పడేస్తాడు! “ఒరే, సురేష్ , నీకు పెద్దా చిన్నా అని కూడా తెలియకుండా పోతోంది!” అని అనేసి బయటికి వెళ్లిపోతుంది నానమ్మ  కోపంగా.
          ఈ గుర్రం    బొమ్మ తెచ్చిన సాయంత్రం “ఇంకొక్క సారి ఆ గుమ్మం తొక్కావంటే వూరుకోను!” అని కోపంగా అరిచేసి, ఆ రాత్రి గుళ్ళో భజనకి  వెళ్ళిపోయాడు సురేష్.
అంతే! ఆ రోజు నించి మున్నీతో  అపూ మాటలు బంద్...ఆటలు బంద్...ఈ వీధిలో కాకి ఆ వీధిలోకి వెళ్ళి కావ్ కావ్ అనడానికి కూడా వణికిపోయేంత గొడవ అయిపోయింది.
          కానీ, గుర్రం  బొమ్మని ఎలాగోలా ఆ గొడవలో కాపాడుకొని కుర్చీ కిందకి నెట్టేసింది అపూ. జై పీరు బాబా  ... కాపాడవా ఈ దెబ్బల నించి...!” అనుకుంటూ. “అది ఎలాంటి కష్టమైనా పీరు బాబాని వొక్క సారి తలచుకుంటే చాలు, ఇట్టే దూరమైపోతుంది,” అని కదా ఆ రోజు ఫాతమ్మ గారు చెప్పారు! పీరు బాబా ఈ గుర్రమ్మీదనే ఊళ్ళోకి వచ్చారట, అప్పుడెప్పుడో పెద్ద యుద్ధం జరిగినప్పుడు- శత్రువులందరినీ తుడిచి పెట్టేసి, ఆ గుర్రమ్మీదనే ఎటో వెళ్లిపోయారట. అందుకే, వూళ్ళో పీర్ల చావిడి మీద అన్నీ గుర్రం బొమ్మలుంటాయి, అవి అన్నీ పీరు ఎక్కి స్వారీ చేసిన గుర్రాలే, అవి పవిత్రమని వూళ్ళో అంతా నమ్ముతారు.
ఇప్పుడు ఈ క్షణాన  ఏ రాముడైనా, పీరు బాబా అయినా పర్లేదు, ఇప్పటికిప్పుడు  అపూకి కావలసిందల్లా తన మొరాలకించి, మున్నీని, తననీ కలపాలి!! అంతే!!

2

          “సత్యమ్మా, ఇదిగోనే  నీ కోసం ఈ పటం తెచ్చానే!” అంటూ పీర్ల బొమ్మలున్న వొక క్యాలెండరు తెచ్చి ఇచ్చింది పక్కింటి అరుణ వాళ్ళమ్మ నెలరోజుల క్రితం. అది పక్కూళ్ళో  ఆ వూరి  పీర్ల పండగ సంతలో కొనుక్కొచ్చిందట. అరుణ వాళ్ళు ఈ వూళ్ళో పీరు దర్శనం చేసుకున్న తరవాత, యింకో  రోజు పక్కూళ్ళో పీర్ల పండక్కి కూడా వెళ్లి వస్తూ వుంటారు. ఆ పీరు మరీ చిన్నప్పుడే యుద్ధంలో నేలకొరగడం వల్ల అతని మహిమ ఇంకా పెద్దది అని అరుణ వాళ్ళమ్మ అంటూ వుంటుంది.
          “ ఈ పీరు బొమ్మ ఇంట్లో వుంటే దుష్టశక్తులు రావు. నియ్యతూ బర్కతూ బాగుంటయ్యని తెచ్చా!” అంది అరుణ   వాళ్ళమ్మ.
          “అక్కా, నీకు తెలుసు కదా! మా ఆయనకి ఇలాంటి తురక బొమ్మలూ, తురక మాటలూ  అవీ ఇష్టం వుండడం లేదీ మధ్య!” అని సత్య  అరుణ  వాళ్ళమ్మకి చెప్పబోయింది కానీ ఆమె వినిపించుకుంటేగా!
          “అందరూ పీర్ల సంతకి వెళ్తున్నారు...ఇది మనూరి ఆచారం! మీరూ ఆ రమేష్ వాళ్ళే  కదా ఇట్లా వూరూ వాడా పట్టకుండా...ఎందుకలా? ఈ క్యాలెండరు చూడగానే నువ్వు గుర్తొచ్చావ్. తీసుకో సత్యమ్మా! ఇంట్లో గోడకి వుంచు. నీ ఇంటికి రక్ష,” అని క్యాలెండరు సత్య   చేతుల్లో పెట్టి వెళ్లిపోయింది అరుణ  వాళ్ళమ్మ.
          రమేష్  పేరు వినగానే సత్యకి   సర్రున కోపం తన్నుకొచ్చింది లోపల్నించి – ఆ రమేషే వారానికో సారి  వచ్చి, నాన్ననీ, ఇంకో ముగ్గురు గుడి  పెద్దల్ని కూర్చోబెట్టి మన ధర్మం, పరధర్మం అంటూ  లేనిపోనివన్నీ  చెప్తుంటాడు. అది మన  మతం కాదు, మన ధర్మం కాదు ...అంటూ. “మన ధర్మం గంగనీరు..పరధర్మం ఎండమావి” లాంటి మాటలు వినడం ఆ రమేష్ దగ్గిరే మొదటి సారి.
          ఆ పేరు వినగానే  వెంటనే అడిగేసింది అపూ  అమ్మని వొకటికి రెండు సార్లు  –
“అమ్మా, ధమ్మం ఏమిటి? మతం ఏమిటి? అవేమన్నా కొత్త బొమ్మలా?”
          “అమ్మా, ఆ  రమేష్ అంకుల్ వాళ్ళ  వల్లనే కదా మనం పండక్కి  వెళ్లకుండా అయిపోయింది! పండక్కి వెళ్తే ఎంత బాగుంటుందో, నా దోస్తులందరూ కలిసేది. ఆడుకునేది. చాలా తినేది. పక్కింటి అరుణ  వాళ్ళు కూడా వెళ్తారు కదమ్మా పీర్ల పండక్కి! అది మన పండగే కదా! మనం వెళ్లచ్చు కదా!”
          “నీకు అర్థం కాదులే...అది నాన్నకి ఇష్టం వుండదు. అది మన పద్ధతి కాదు. నాన్న  వూళ్ళో మన వాళ్ళందరికీ  పెద్ద కదా,  అందరికీ చెప్పాల్సిన పెద్ద. ఆయనే తురక సంతలకీ, పీర్లదగ్గిరకీ వెళ్తే...ఈ నాలుగూళ్ళ మనోళ్ళంతా   పాడయిపోతారు. అసలే మనకీ మనవాళ్ళకీ మంచి కాలం కాదిది,” అంది.     అంత కంటే ఏం చెప్పాలో అర్థం కాలేదేమో మౌనంగా వుండిపోయింది సత్య.
          నాన్నకి  ఇష్టం వుండదు ...అన్నంత వరకే అపూకి  కూడా అర్థమయింది. ఆ తరవాతది దాని తల మీంచి ఎటో ఎగిరిపోయింది.
          ఆ రోజు ఆ క్యాలండరు ఏం చేయాలో తెలీక ముందు గదిలో కనిపించీ కనిపించకుండా వొక మూలకి గోడ మీద పెట్టింది సత్య.
          కానీ, అది సురేష్   కళ్ళలో పడనే పడింది. అంతే! ఇంట్లో రామ రావణ యుద్ధం మొదలైపోయింది. ఆ యుద్ధం తరవాత అపూకి  ఇంకోసారి అర్థమయిందేమంటే అరుణ  వాళ్ళింట్లో లాగా తురక దేవుళ్ళ బొమ్మలూ గట్రా ఏమీ తనింట్లో వుండకూడదు అని!
               అరుణ  వాళ్ళింట్లో దేవుడి గది అంటే అపూకి ఎంత ఇష్టమో! ఒక ఆదివారం ఆడుకుంటున్నప్పుడు అరుణ  ఆ చిన్ని గదిలోకి తీసుకు వెళ్లింది. గోడ మీద పటాలూ, అవి కాక చిన్ని పెళ్లి మంటపంలాంటి అరుగుల మీద సీతా రాముడూ, శివ పార్వతులూ, వినాయకుడు....వాటితో పాటు పీర్ల గుడి ఫోటోలూ, పీర్ల ఫోటోలూ, అన్నిటికంటే అపూకి ఎంతో  ఇష్టమైన చమ్కీ పూల గుర్రం ఫోటో...అవన్నీ అరుణ  చూపించింది. కానీ, అన్నీట్లోకి అపూకి  బాగా నచ్చింది ఆ గుర్రం  బొమ్మ క్యాలెండర్! ఆ మెరుపు పూలు ...దాని నడుమ్మీద చేతి గుర్తు!  ఆ చేయి పీరు దేవుడిదే అని అరుణ వాళ్ళమ్మ, మున్నీ వాళ్ళమ్మ కథల్లో  విన్నదే.
               తను గుర్రం  బొమ్మ వేపు పరీక్షగా చూస్తున్న ఆ సమయంలోనే అక్కడ వొక గిన్నెలోంచి కాసింత విభూతి తీసి తన నుదుటి మీద పెట్టింది అరుణ. అది పీర్ల గుండం దగ్గిర నించి తీసుకువచ్చిన బూడిద..కళ్ళకి అద్దుకొని రాసుకుంటే మనసులో బాధలన్నీ పోతాయంటుంది అరుణ.
                అపూ  వెంటనే అది చెరిపేసి, “అమ్మో! నాన్నకి కోపమొస్తుంది!” అంది.
                అరుణ వాళ్ళమ్మ గారు  “సర్లే... ఎవరి పద్ధతి వాళ్ళది. ఏం కాదులే! ఇలా కూర్చోండి చక్కిలాలవీ పెడతా!” అంటూ ముందు గదిలో  కూర్చోబెట్టి, చక్కిలాలూ అరిసెలూ పెట్టింది. అందుకే, అపూకి  అరుణ వాళ్ళమ్మ  గారంటే మహా ఇష్టం!అసలు ఎన్ని రకాల వంటలు చేస్తారో..ప్రతి పండక్కి! ఆ మాటకొస్తే ఎప్పుడు వాళ్ళింటికొచ్చినా పండగే అపూకి!
               “అత్తయ్యా! ఈ చమ్కీ పూల దేవుడి కథ చెప్పవా?” అంది అపూ.
               “ఓ ...పీరు  స్వామా?!” అంటూ అరుణ వాళ్ళమ్మ  గారు ఆ కథ చెప్పాక పీరు స్వామీ  తెగ నచ్చేశాడు అపూకి.
               అందుకే, ఆ రోజు అరుణ వాళ్ళమ్మ  గారు కథ చెప్పగానే “అత్తయ్యా, నా ఫేమరెట్ దేముడు పీరు సామి!” అని ప్రకటించేసింది సంతోషంగా.
               ఆ ప్రకటన ఇంత దూరం వచ్చి, ఇవాళ మున్నీనే దూరం చేస్తుందని అనుకోలేదు పిచ్చి అపూ!
3
               “వేరేవాళ్ళతో  సావాసం చేస్తే అన్నీ వాళ్ళ  బుద్ధులే వస్తాయి. దీన్ని ఆ తురకల  ఇంటికి పంపద్దు అంటే నువ్వు వినవ్!” అన్నారు నాన్న  అవాళ పొద్దున్న కూడా కోపంగా.
               దానికి అమ్మ  ఏం చెప్తుందో అని ఎదురుచూస్తూ వుంది అపూ.
               సురేష్  దృష్టిలో అందరూ “వేరేవాళ్ళే” అని తరవాత్తరవాత నెమ్మదిగా అర్థమవడం మొదలైంది.
                నానమ్మకి అసలు ఈ గొడవే లేదు. రాముడికీ మొక్కేది, పీరుకీ మొక్కేది. ఇద్దరూ వొకటే కదా అనేది ఇంకేమన్నా అడిగితే! మరి, అరుణ వాళ్ళమ్మ  గారు వొక్క రోజు కూడా పూజ చేయకుండా ఏ పనీ ముట్టుకోరు. అట్లాగే, పీరుకి కూడా మొక్కుకుంటారు. అరుణ పీరు  దేవుడికి దండం పెట్టుకోకుండా ఇంట్లోంచి బయటికి అడుగు పెట్టదు. లక్ష్మి  వాళ్ళమ్మ పొద్దున్న లేవగానే పీర్ల చావిడికి వెళ్ళి, ఆ చావిడి మెట్లని కళ్ళకి అద్దుకొని గాని పనిలోకి దిగదు. వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముతారా లేదా?
               సురేష్  దృష్టిలో అవన్నీ తప్పుడు పనులు ..ధర్మం కాదట! గుడికి వెళ్తేనే ధర్మం, శుభం.  మిగతావన్నీ- అంటే ఈ పీర్ల దేవుడి పటాలు పెట్టుకొని పూజలు చేయడం, గుడికి వెళ్ళినట్టు పీర్ల చావిడికి వెళ్ళడం, పీర్ల బొమ్మలు తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం- ఇవన్నీ తప్పుడు--అంటే మనవాళ్ళు  చేయకూడని  పనులు!
                    మున్నీ  చమ్కీ గుర్రం  బొమ్మ ఇచ్చినప్పుడు అపూ దాన్ని కాదనలేకపోయింది. దాన్ని గౌనులో దాచుకొని తెచ్చి, ఇంట్లో పెట్టేసుకుంది. అది తండ్రి  కంట పడితే ఏమవుతుందో తెలుసు.  ముఖ్యంగా అలాంటివి నాన్న  కంటికి కనిపించకుండా చేయడం చాలా   కష్టం!
                ఆ బొమ్మ తెచ్చిన రోజే అపూ ఇంటికి వెళ్ళి దానితో ఆడుకునే చివరి రోజు అవుతుందని అనుకోలేదు అపూ.
               మున్నీ  వాళ్ళింటికి వెళ్ళడం, దానితో ఆడుకోవద్దనీ అన్న  నాన్న  మీద, ఆయన పద్ధతుల మీదా చచ్చేంత కోపంగా వుంది. అసలు నాన్నని   వొక్క మాట అయినా అడగొచ్చు కదా అమ్మ!  నిజానికి నానమ్మ  అవీ ఇవీ కబుర్లయితే చెప్తుంది కానీ, మున్నీతో ఇవాళ ఆడుకోలేదేం అని వొక్క ముక్క అడిగిన పాపాన పోలేదు. వాళ్లెవరికీ ఇదొక పెద్ద సమస్యే కాదు.
               “వీడు  ఏ లోకంలో వున్నాడోనమ్మా!” అంటుంది నాన్నమ్మ. “ఈ వూళ్ళో నాకు ఊహ తెలిసీ, మనమూ, పరాయీ అన్నది నా ఊసులో ఎన్నడూ లేదు,” అంది అమ్మతో ఒక సారి- నాన్న ఎంత చెప్పినా, నానమ్మ, అమ్మ నాన్న కంట్లో పడకుండా పీర్ల గుడికి వెళ్లి వస్తూనే వుంటారు. మిగతా అరుణ వాళ్ళమ్మా, అందరూ అంతే.. వాళ్ళు గుడికీ  వస్తారు, ఆ పీర్ల చావిడికి వెళ్ళి అక్కడ పెట్టిన బొమ్మలకూ మొక్కుకుంటారు!
               కాని, అపూకి ఇవన్నీ అక్కర్లేదు, తనకేం కావాలి? కాసేపు మున్నీతో  హాయిగా ఆడుకోవాలి, పాడుకోవాలి, దాని బొమ్మల్ని సింగారించాలి. ఇద్దరూ కలిసి ఆ బొమ్మలతో కబుర్లు చెప్పుకోవాలి. అంత వరకే! కాని...అంత వరకూ వెళ్ళడానికి...!?
4
               లోచిస్తూ ఆలోచిస్తూ అపూ  ఎప్పుడు నిద్రలోకి జారిపోయిందో తెలీదు.  నిద్రలో మున్నీతో  తనదైన లోకంలో  పీర్ల  ఊరేగింపులో పరుగులు తీస్తోందట. పీర్ల సాయిబు పీరు ఎత్తుకోలేక అవస్థ పడుతున్నాడట. మున్నీ అపూ   ఇద్దరూ కలిసి జై ఆంజనేయా!” అనగానే పీరు ఎత్తుకున్న సాయిబుకి కొండంత బలం వచ్చేసిందట.
               అపూ  నిద్రలోపలి లోకం చాలా సందడిగా వుంది.  నిద్ర బయట అపూ  గొంతు లోంచి రెండు మాటలే బయటికి వచ్చాయి. అందులో వొకటి:  “జై పీరు సామీ !” రెండోది: మున్నీ!
               ఆ రెండు పదాలూ అప్పుడే అపూకి  దుప్పటి కప్పడానికి వచ్చిన సత్య  చెవిన పడ్డాయి. మంచి నిద్రలో వుంది అపూ !  దాని ఛాతీ మీద రెండు చేతుల మధ్యా చమ్కీ గుర్రం  బొమ్మని గట్టిగా హత్తుకుని వుంది.
               ఆ బొమ్మని అపూ  చేతుల్లోంచి బయటికి తీయబోయింది సత్య.  అపూ  చేతులు అది పడనివ్వలేదు. సత్య   చేతుల్ని తప్పించుకుని పక్కకి తిరిగి ఇంకా దగ్గిరకి వొత్తిగిలి పడుకుంది అపూ. అలా చేసే ప్రయత్నంలో మళ్ళీ కలవరించింది అపూ. “మున్నీ, రేపు నేనొస్తాగా!” అంటోంది నిద్రలోనే!  
               మంచం మీద ఓ పక్కకి కూర్చొని అపూ  నుదుటి మీద చేయి వేసింది సత్య. నుదురు వెచ్చగా అనిపించింది.
               ఇంతలో  అమ్మా!” అంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సురేష్.
               పిలిచింది వాళ్ళ అమ్మనే అయినా తనే జవాబిచ్చింది అలవాటు ప్రకారం-  ఏమండీ  ...ఇక్కడ పాప  దగ్గరున్నా!” అని నెమ్మదిగా.
               సురేష్  బయటినించే  “సరే... అన్నాడు.
                 “అపూకి కాస్త నలతగా వుంది. దాంతో వున్నా!”
               అప్పుడైనా సురేష్ లోపలికి వచ్చి, పాపని చూస్తాడేమో అన్న ఆశ- అలా వచ్చినప్పుడు సురేష్ తో అపూ మనసులోని బాధంతా తన భాషలో  చెప్పేయాలని సత్య  ఆశ. 
               “అన్నం తిందా?” అని బయటి గది నించే  అడిగాడు.
               “లేదు...అది సరిగా తినడం లేదు... అంది తనే బయటికి వస్తూ.
               ఆమె ఏదో చెప్పబోతుందన్న విషయం సురేష్  కి అర్థమవుతోంది. కానీ, ఆ  వేళప్పుడు అపూ  నిద్ర చెడగొట్టడం ఇష్టం లేక కొంతా, బయటికి వెళ్ళే హడావుడి  వల్ల కొంతా ఆ సమయంలో ఎక్కువ మాట్లాడ్డం ఇష్టం లేదు సురేష్ కి!
               రెండు మెతుకులు గతికి వెంటనే బయటికి వెళ్ళిపోతూ - “తెలుసు కదా, మందిరం డబ్బు కోసం ఇంకా తిరుగుతూనే వున్నాం. ఇంత చిన్న వూళ్ళో లక్ష రూపాయలు పోగేయాలంటే తల ప్రాణం తోకకొస్తోంది. ఈ పూట  నేనూ, రమేష్ మళ్ళీ రెండు మూడు ఇండ్లకి వెళ్ళాలి!” అన్నాడు.
               ఇంకేమీ అనలేక ఆటను అటు వెళ్ళగానే ఇటు అపూ దగ్గిరకి వచ్చి కూర్చుంది. నిద్రపోతున్న అపూ  ముఖాన్ని పరీక్షగా చూస్తూ వుండిపోయింది.  ఆ వయసులో తను ఎలా వుండేదో, ఎంత అల్లరిగా ఆడుకునేదో గుర్తొస్తోంది సత్యకి! తనని తాను ఆ వయసులో ఊహించుకొని ఎన్నాళ్ళయిందో కదా! ఆ అమాయకత్వం, అందరితో యిట్టే కలిసిపోయే తనం! అపూ తన పోలికే అంటుంది అమ్మ!
               అపూ   ముఖంలోని అమాయకత్వం, పసితనం, ఏమీ తెలియని తనం అన్నీటినీ పరీక్షగా చూస్తూ చూస్తూ వుండిపోయింది.
               బహుశా, ఇంత పరీక్షగా ఇంతకు ముందెన్నడూ తను అపూని చూసి వుండదు. ఆ అమాయకమైన ముఖమ్మీద ఏవేవో నీడలు పడుతున్నాయి. అవి చీకటి నీడలు. తన పసితనంలో తను ఎప్పుడూ చూసెరుగని నీడలు. కాలం ఎంత మారిపోయిందీ...ఎంత మార్చేసిందీ ముఖ్యంగా తన కుటుంబాన్ని! తన అపూని! చూస్తూ వుండగానే, ఆ పిల్ల వొంటరిదై పోతోందా అనిపిస్తోంది.   
               మున్నీతో గడిపే క్షణాల్లో అపూ  ముఖమ్మీద కదలాడే సంతోషాలన్నీ వూహించుకునే ప్రయత్నం చేస్తోంది తను.
               అపూని ఇంకా దగ్గిరకు తీసుకుంది.  
               “అది చిన్న పిల్ల. దానికి ఈ వయసులో ఇంకేం తెలుస్తుంది? ఆ దేవుడి బొమ్మ కూడా ఆటబొమ్మ తప్ప ఇంకేమీ కాదు దానికి! కాసేపు ఆడుకుంటుంది, అంతే! పిల్లల ఆటలో దేవుడిని తెచ్చిపెడితే ఎట్లా? అక్కడ దానికి భక్తీ   గురించి,దానికి ఇంకా అర్థం కానీ ధర్మం  గురించీ  చెప్తే ఎట్లా?”
               ఈ మాటలు సురేష్ తో ఎప్పుడైనా అనాలి. కాని, అలా మనసు విప్పి మాట్లాడుకునే  కాలం అంటూ వొకటి వస్తుందా?! రాదేమో ఇక!                    అపూ  చేతుల్లో వున్న బొమ్మలో చమ్కీ గుర్రం బొమ్మలో గుర్రం తోకా, దాని మూతి చూసి, ఆమె  పెదవి మీద వొక చిరునవ్వు పూసింది. కచ్చితంగా ఆ క్షణాన  ఏమైతే అయింది, తనే అపూని  మున్నీ వాళ్ళింట్లో దిగబెట్టి రావాలని అనిపించింది  సత్యకి.
                సురేష్ ఎలాగూ ఇది పడనివ్వడు..కాని, తను దిగబెట్టి రాగలదా? చూడాలి ఎంతవరకు ఆ పని చేయగలదో!  అంత తెగింపు తనలో ఉందా అని ఆలోచనలో పడింది సత్య. 
               కలలో మున్నీతో ఎక్కడెక్కడో తిరిగి వస్తున్న అపూకి ఆ విషయం  తెలియదు.
               తల్లి  వేపు తిరిగి బొమ్మని ఇంకాస్త దగ్గిరకి హత్తుకుంది అపూ..మున్నీని హత్తుకున్నట్టే!


*

Web Statistics