పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

చిత్రం: రాజశేఖర్ చంద్రం 



1 


కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
దాన్ని కప్పేశాం, గుర్తుందా?
మరీ చిన్నప్పటి సరదా కదా,
గుర్తుండి వుండదులే!


*
 పద్యం కూడా అంతేనా ?

2

రాయడానికేమీ లేని తనం
నీకూ, నాకూ , బహుశా అందరికీ.
కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.
ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.
బాధ లేదని కాదులే!
కాకపోతే, ఎవరి బాధో తప్ప
రాయలేని తనం
అరువు కళ్లతో ఏడుపు,
కొయ్య కాళ్ళతో పరుగు!  
*
ఏదో వొక కొయ్య కాలు చాలదేమో,  లోపలి పద్యానికి!


3

సొంతమూ, పరాయీ అని కాదు కాని
నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి
ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!
చర్మం కూడా  పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.
  
*
మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!

 4

తవ్వోడ దొరికింది సరే,
అదే పద్యం అనుకుంటున్నాం
నువ్వూ, నేనూ, అందరం!
లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,
 లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే – దొరుకుతుందా, పద్యం?

  *
పద్యం పుట్టుక  అసలేమైనా గుర్తుందా?
వుండి వుండదులే,
మరీ చిన్నప్పటి సరదా కదా?!
 
Web Statistics