ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక సందడి. పైగా, టెంపుల్ నిజంగా గుడి లాంటి వూరు. చిన్న వూరు. పెద్ద వినాయకుడి గుడి. చూడ ముచ్చటయిన వూరు. అక్కడ తెలుగు సాహిత్య సభ అంటే అచ్చంగా అది పండగే!
ఈ సదస్సుకి రమ్మని మందపాటి సత్యం గారు, టెంపుల్ రావు గారు ఆహ్వానం పంపినప్పుడు మొదట వక్తగా వెళ్లడానికి పెద్ద ఉత్సాహంగా అనిపించలేదు. వేదిక కిందనే వుండి అందరితో పిచ్చాపాటి మాట్లాడుతూ కాస్త బాధ్యత లేకుండా సరదాగా గడిపేద్దామని అనుకున్నా. కానీ, రావు గారు మళ్ళీ ఈ-లేఖ రాసి, ఉత్సాహ పరిచారు. చాలా ఆలోచించిన మీదట ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం ఎట్లా మారిందో మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. నాకు ఇంటర్నెట్ లోకంతో అంత పరిచయమేమీ లేదు. కానీ, అచ్చు పత్రికలలో చాలా కాలం పాటు సాహిత్య పేజీలూ, ఆదివారం అనుబంధాలు ఎడిట్ చేసిన అనుభవం వున్నందు వల్ల, ఇంటర్నెట్ లోకం సాహిత్యాన్ని ఎట్లా ప్రభావితం చేసిందో మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా. నెట్ వచ్చాక తెలుగు భాష కూడా కొంత మారింది. నెటిజనులు, అంతర్జాలం, బ్లాగరి, బ్లాగడం లాంటి పదాలు పుట్టడం పైకే కనిపిస్తున్న మార్పు. ఇది కాక సాహిత్య సంస్కృతి బాగా మారిందని నా అభిప్రాయం. పాఠకుడు అన్న పదానికి అర్ధం మారిందని నాకు అనిపిస్తోంది. అసలు నెట్ చూసే జనం ఎంత అన్న ప్రశ్న పక్కన పెడితే, ఈ మార్పు తెలుగు సాహిత్య సంస్కృతిని కొంచెం మలుపు తిప్పేదేనని నాకు అనిపిస్తోంది.
ఈ విషయం మీద ఇప్పుడిప్పుడే నేను ఆలోచనలు కూడదీసుకుంటున్నా. ఈ లోగా మీ అందరితో ముచ్చటించవచ్చు కదా అని అనుకుని, ఈ విషయం మీద మీ అభిప్రాయాల్నీ, మీ అనుభవాల్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నా.
మీరు నెట్ లో చదివే పత్రికల గురింఛీ, రచనల గురింఛీ, నెట్ చదవడం మొదలు పెట్టాక మీ అభిరుచిలో వచ్చిన మార్పుల గురించీ ఇక్కడ రాస్తే అది నాకు ఎంతో వుపయోగపడుతుంది. మీ మాటల్ని మీ మాటలుగానే నేను సభాముఖంగా, ఆ తరవాత నా సుదీర్ఘ వ్యాసంలోనూ పేర్కొంటాను.
ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించండి.
1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
ఈ మూడు ప్రశ్నలకే పరిమితం అవ్వాలని లేదు, అంతకి మించి చెప్పాలనుకున్న విషయాలు వుంటే నిర్మొహమాటంగా చెప్పండి.
మీ అభిప్రాయాలూ తప్పక రాస్తారని నమ్ముతున్నా.
31 comments:
ఇంటర్నెట్ తరువాత తెలుగు సాహిత్యం లో మార్పు వచ్చింది.గతం లో పత్రికలలో సాహిత్య పేజీలు ,ఆదివారం అనుబంధాలలోని వ్యాసాలకు ఇప్పుడు వచ్చే వాటికీ తేడా వుంది.కాలంతో సహజంగా వచ్చే మార్పును గురించి కాదు నేను చెప్పేది ...నా వుద్దేశ్యంలో పత్రికలలో శీర్షికలు నిర్వహించేవారే ఇంటర్నెట్ వాళ్ళ ఎక్కువ ప్రభావితం అవుతున్నారు.సహజంగానే ఆ మార్పు పాఠకుడి మీద కూడా పడి తీరుతుందికదా!ఇది ఒకందుకు మంచిదే.ఇంటర్నెట్ అందరకి అందుబాటులో లేకపోతే ఎప్పటిలాగానే ఏదో కొద్దిమంది దాని ఫలితాన్ని దొరక బుచ్చుకుని పెద్ద పీటలు వేయించు కుంటుండేవారు.ఉదాహరణలు వివదాస్పదమవుతాయి కనక ఇక్కడ చెప్పటం భావ్యం కాదు కానీ మీరు లేవనెత్తిన ప్రశ్నకు పరిమితమయి చెప్పాలంటే ఇంటర్నెట్ వాళ్ళ పాఠకుల సంఖ్య స్వల్పంగా పెరిగిన మాట వాస్తవమే కానీ గుణాత్మకంగా చూస్తే మాత్రం పరిణితి గల చదువరుల సంఖ్య గతం లో కన్నా తక్కువ గానే వుంది.సాంకేతికంగా జరిగిన, జరుగుతున్న అభివృద్ది స్థాయిలో సాహిత్యం పరిపుష్టితం కావటం లేదనేది నా వుద్దేశ్యం .
2.ఇంటర్నెట్ మూలకంగా ప్రపంచ సాహిత్యం లో వస్తున్న మార్పులను వేటిని మన సాహిత్య కారులు మునుపటంత గా పట్టించుకోవటం లేదనే నా వుద్దేశ్యం. తెలుగులో సాహిత్యం అంటే ఇప్పటికి పత్రికల ద్వారా నేఎక్కువ మందికి అందేది అనే భావన వుంది.కవులు రచయతలు కూడా ప్రింట్ మీడియా లక్ష్యం గానే రచనలు చేస్తున్నారు.
౩.అధిక శాతం కవులు రచయతలు మధ్య వయస్సు లోనో ,దాటినా వరుగానో వుండటం వాళ్ళ మన సాహిత్యం ఇంటర్నెట్ వంటి ఆధునిక సాంకేతిక సౌకర్యాన్ని పూర్తిగా అందిపుచ్చుకోలేని స్థితి లో ఉందననుకుంటున్న్నాను .
-కర్లపాలెం హనుమంత రావు
తెలుగు సాహిత్యం దినపత్రికల కాలంలలో ప్రచురితమైతేనే గౌరవంగా భావించే కాలంనుండి తనకు తానుగా లేక ఈ-పత్రికలలోనో కూడా రాసుకునే సౌలభ్యం వలన రచయితల సంఖ్య పెరిగింది. చర్చకు కూడా ఎక్కువ అవకాశం ఏర్పడింది. ఏదైనా కవితో, వ్యాసమో నెట్ లో రాసిన తరువాత దానిని చదవిన వారి సంఖ్య చూస్తే సుమారుగా వందమంది వరకు వుంటోంది. ఇదేమీ తక్కువ కాదు. బయట పత్రికలలో వచ్చిన సాహిత్య పేజీలు చదివే వారు సుమారుగా వుంటే ఐదు వందలు మించి వుండరనుకుంటా. అది కూడా ఆ కవి నా కవిత వచ్చీందని తన వాళ్ళకు చెపితే కానీ చూసే వారు తక్కువ. సాహిత్యం పేజీలు చదివి ఓపికగా విమర్శలు రాసే వారి సంఖ్య ఈ మధ్య కాలం బాగా తగ్గిపోయింది. జెండర్ పరంగానో, కులపరంగానో చర్చ పెట్టే విషయాలు మినహాయించి సాహిత్యపరంగా జరుగుతున్న చర్చలు అత్యల్పం. వేసిన కవితా, కథా సంకలనాలు ఆయా ప్రచురించుకున్న వారు కాంప్లిమెంటరీ కాపీలుగా ఇచ్చుకోవాలే తప్ప కొని చదివే వారు లేకపాయె. ఇంటర్నెట్ తరువాత ఈ ప్రభావం మరింత ఎక్కువయింది. ఓపికగా చదివి చర్చ చేసే వాతావరణం కరువవుతోంది. ఏదో ఒక భావోద్వేగానికి గురై చర్చ పక్కదారిపట్టిన సందర్భాలు ఎక్కువగానే వున్నాయి. ముఖాముఖి చర్చలు జరగడం లేదు. సాహిత్య సమావేశాలు అంతంత మాత్రంగా జరుగుతున్నాయి. దీనివలన సాహిత్యకారుల మధ్య ఎడబాటు పెరిగింది. ఆత్మీయ కరచాలనాలు తగ్గిపోయాయి. మారుతున్న జీవన వేగం సాహిత్యానికి దూరం చేస్తున్నదిగా అనిపిస్తోంది. కాలాన్ని రికార్డ్ చేసే పనికి దూరంగా పోతున్నామ అన్న సందేహంగా వుంది. జీవన సంక్షోభం సాహిత్య వాతావరణాన్ని స్తబ్ధతకు గురిచేస్తోందని నా అభిప్రాయం.
ఇదంతా మీముందు కుప్పిగంతులే సారూ..
ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీదా!! అలాంటిదేమీ పెద్దగా లేదని నా అభిప్రాయం. సాహిత్య ప్రభావం ఇంటర్నెట్ మీద అనండి తప్పక ఉన్నది. సాహిత్యం గురించి వ్రాసే వారు చాలా తక్కువమంది. వారు దశాబ్దాలపాటు సాహిత్య పఠనం తరువాత తమకు నచ్చిన పుస్తకాలు కథలు ఆపైన తాము మెచ్చిన రచయితల గురించి వ్రాస్తున్నారు. ఒక్కటే ఇంటర్నెట్ వల్ల ఉపయోగం. వ్రాద్దమనై కోరిక, ఓపిక, సామర్ధ్యం ఉన్నవాళ్ళు హాయిగా వ్రాసుకునే ఒక వేదిక ఏర్పడింది. అలా వ్రాద్దామనుకునేవారికి కొద్దిగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు సొంతంగా ఒక బ్లాగు ఏర్పాటు చేసుకుని తమకు తోచినది వ్రాసుకోవచ్చు. పూర్వం ఇలా సొంతంగా వ్రాసి పదిమందికి తెలియ చెప్పాలంటే అవకాశం చాలా తక్కువ. ఉన్నవే ఒక అరడజను వార/మాస పత్రికలు, అక్కడకు పంపేవారి సంఖ్య ఎక్కువ. అక్కడ కూచున్న ఉపసంపాదకుని అక్షరాస్యత మీద ఆధారపడి ఉంటుంది ఎవరన్నా వ్రాసినది ఎంపిక కావటం కాకపోవటం. బ్లాగుల పుణ్యమా అని ఆ కష్టం తప్పింది. మనం వ్రాసుకుని కనీసం ఒక రెండు మూదు వందలమంది వెను వెంటనే చదివే ఎర్పాటు ప్రతి బ్లాగరుకు దొరికింది.
ఇక బ్లాగుల్లో ఒక విషయం గురించి క్షుణ్ణంగా పరిశోధించి వ్రాసే వారు చాలా తక్కువ. సరదాగా బ్లాగు మొదలుపెట్టి చిత్ర విచిత్రాలతో ఆకట్టుకోవలన్న తపనతొ వ్రాసే కుర్రకారే ఎక్కువ. సాహిత్యం మీద అభిరుచి అవగాహన ఉండి వ్రాసే వారు పెద్దగా లేరు. పనికిరాని, అనవసరమైన విషయాల మీద పెద్ద పెద్ద చర్చలు, పోట్లాటలు , పేరడీ బ్లాగులు, ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవటం, ఎద్దేవా చేసుకోవటమే బాగా కనపడుతోంది. ఏదైనా విషయం మీద చర్చ రాగద్వేషలకు అతీతంగా జరగటం లేదు. ద్వేష పూరిత వ్యాఖ్యలు, ఆవతలి వారిని ఎంత మాటంటే అంత మాట అనెయ్యటం వంటివి చులాగ్గా పేట్రేగిపోతున్నాయి.
ఎతా వాతా చెప్పేదేమంటే ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీద ఉంటే గింటే చాలా స్వల్పం. సాహిత్యాన్ని ప్రభావపరిచే అవకాశం ఇంటర్నెట్‌కు ఉన్నదా అని చూస్తే మనకు ముందుగా స్పురించవలసిన విషయం ఇదొక మాధ్యమం మాత్రమే అని, అందువలన, తనంతట తానుగా సాహిత్యాన్ని మలుపు తిప్పగల అవకాశం ఇంటర్నెట్టుకు తక్కువ. పత్రికల సంఖ్య లేదా ప్రచురణకర్తల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగినంత మాత్రాన సాహిత్యం ప్రభావితం అవుతుందా? అవుతుంది! ఎలా? పోటీ వల్ల, సామాన్యంగా ప్రచురణకు అవకాశం లేని సరుకు కూడా ప్రచురించబడుతుంది. దానివల్ల సాహిత్య విలువలు పెరుగక పోగా పడిపోయే ప్రమాదం ఎంతైనా ఉన్నది 1980లు 1990లలో తెలుగు పత్రికా/ప్రచురణా ప్రపంచంలో జరిగింది అదే. అలాగే ఇంటర్నెట్, బ్లాగుల వల్ల ప్రచురించటానికి పెద్దగా ఇబ్బంది, వెరేవారి అనుమతి, ఎంపిక లేనందువల్ల తోచిందల్ల ప్రపంచం మీదికి వదిలే వెసులుబాటుతో, సాహిత్యం మీద ప్రభావం నాణ్యత పెంచటం కన్నా, నాణ్యత లోపమే ఒక ప్రభావంగా ఉండే ప్రమాదమున్నది.
ఇక్కడే నిస్పక్షపాతమైన బ్లాగ్ ఆగ్రిగేటర్ల అవసరం ఎంతైనా ఉన్నది. ఆగ్రిగేటర్లు కొంతమంది సాహిత్య పెద్దలను పానెల్ గా ఉంచి, బ్లాగుల్లో వ్రాయబడుతున్న వ్రాతలను క్షుణ్ణంగా పరిశీలించి తప్ప తాలు ఏరేసి, నాణ్యంగా వ్రాయబడుతున్న విషయాలను (ఆ బ్లాగు మొత్తాన్ని కాదు) ఎంపిక చేసి, ప్రత్యేక విభాగంలో ఉంచితే, ఆ విభాగంలో చోటు సంపాయించటం ఒక ధ్యేయంగా వ్రాసే వారు తమ తమ వ్రాతలను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటూ చక్కగా వ్రాసే అవకాశం పెరుగుతుంది . ఒకరు వ్రాసిన ఒక వ్యాసం ఆ విభాగంలో ఉంచినంత మాత్రాన ఆ బ్లాగు మొత్తానికి అక్కడ స్థానం దొరక కూడదు. ఆ వ్రాసిన వ్యాసం మాత్రమే ఆ ప్రత్యేక విభాగంలో ఉంచాలి. మళ్ళి అదే బ్లాగరు మంచి వ్యాసం వ్రాసి ఎంపిక ఐతేనే ప్రత్యేక విభాగంలో ఉంచాలి. దీనివల్ల కొంత నష్టం ఉన్నప్పటికీ (ఎంపిక చెసే వారి ఇష్టా ఇష్టాల మీద అధారం కాబట్టి-కాని ముగ్గురు నలుగురు ఎంపిక చేస్తే వ్యక్తిగత ఇష్టాఇష్టాల ప్రభావం తగ్గవచ్చు) లాభ శాతమే ఎక్కువగా ఉంటుందని నా అభిప్రాయం
పుస్తకాలకే పరిమితమైన నాకు ఉద్యోగంలో చేరగానే పుస్తకాలు చదివే తీరిక లేక తెలుగు మీద ఆశ చావక దాహార్తినై ఉన్న నాకు "ఇంటర్నెట్ లో తెలుగు" ఒక తియ్యని మంచినీటి కుండలా కనిపించింది. ఇప్పుడు పుస్తకాలకి దూరమయ్యానన్న బెంగ లేదు. ఇంటనెట్ లో సాహిత్యం బాగానే ఉపయోగపడుతున్నాది. కొత్త రచయితలు, రచనలు పరిచయమవుతున్నాయి. సమకాలీన రచనా వ్యాసంగం ఒంటబడుతోంది. బ్లాగు వల్ల నా రచనా శైలిని వృద్ధి చేసుకోగలుగుతున్నాను. ఔత్సాహిక రచయితలను కలుసుకుంటున్నాను. పాత రచనలపై చర్చలు, కొత్త రచనలపై విశ్లేషణలు ఆసక్తిని కలిగిస్తున్నాయి. నా మటుకు నాకు "ఇంటర్నెట్ తెలుగు లేదా సాహిత్యం" ప్రజల మనసుకి దగ్గరవుతూ, తెలుగుకి దూరమవకుండా చేస్తోందన్న ప్రబల నమ్మకం, ప్రగాఢ విశ్వాసం, అనుభవైకవేద్యమని నిజం.
అంతర్జాలం ఒక రంగస్థలం.
ఆడే వారు ఆడతారు,
మెరుగులు దిద్దుకునే వారు దిద్దుకుంటారు,
చూసే వారు చూస్తారు,
రాళ్లు విసిరే వారు విసుర్తారు,
చప్పట్లు కొట్టేవారు కొడతారు.
ఇంటర్నెట్ వచ్చిన తరువాత సాహిత్య పాఠకులు ఖచ్చితంగా పెరిగారు.
2004 లో నేను మొదటిసారి telugupeople.com సైటు చూసాను. అప్పటిలో ఈ సైటు చాలా బావుండేది లెండి.ఉద్యోగంలో చేరాక పుస్తకాలు కొనడనికి కూడా తీరిక లేకుండా అయిపోయిన నాకు ఎడారిలో మంచు కురిసినట్టు అనిపించింది. అచ్చం సౌమ్య చెప్పినట్టుగా. ఇంక ప్రతి రోజూ ఆ సైటులో కవితలు, సమీక్షలూ చదువుతూ ఉండేదాన్ని. అక్కడినుంచే నాకు కవిత్వం గురించి ఎన్నో మంచి విషయాలు తెలిసాయి. ఎందరో గొప్ప కవులగురించి తెలిసింది. వారు వ్రాసిన కవితా సంకలనాల గురించి అక్కడి సమీక్షల్లో చదివాక, ఆ పుస్తకాలు ఎలాగో సంపాదించి చదివాను. నేనెంతో అభిమానించే కవి ఇస్మాయిల్ గారి గురించి తెలిసింది. ఆయన కవిత్వమే కనుక నాకు పరిచయం కాకపొయి ఉంటే జీవితం లో చాలా miss అయ్యి ఉండేదాన్ని. నత్త ప్రణయ యాత్ర, చెట్టు నా ఆదర్శం, బాల్చీలో చంద్రోదయం ఇంత గొప్ప కవిత్వం చదివే అవకాశం నాకు కలిగేదే కాదు.
ఇప్పుడు ఎన్నో మంచి పుస్తకాలు, వాటిని మనకు పరిచయం చేసే సమీక్షలు aavakaaya.com, poddu.net, eemaata.com మొదలయిన sites lO మనకి విందుగా కనిపిస్తాయి.
ఇంటర్నెట్ లో వచ్చిన ఈ తెలుగు సాహిత్యం వల్ల ఈ రోజుల్లో బిజీ జీవితం గడుపుతున్న ఎంతో మంది సాహిత్యాభిమానులకు జరిగిన ప్రయోజనం మాత్రం మాటల్లో వర్ణించలేనిదనే నేను అంటాను. ఇంటర్నెట్లో ఈ తెలుగు సాహిత్యం వల్ల సాహిత్యానికి దగ్గరగా ఉండే అవకాశం పెరిగింది.
1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
నాకైతే ప్రత్యేకంగా ఇంటర్నెట్ ప్రభావం సాహిత్యం మీద పెద్దగా ఏమీ కనపడటంలేదు. స్పుటంగా కనపడుతున్న విషయం మటుకు పాఠకుల ఆదరణకు నోచుకోని అనేకానేక రచనలు, కవితలు, ఇంటర్నెట్ పుణ్యమా అని పాఠకుల ఇళ్ళల్లోకి వెళ్ళిపోయి, వారందరిచేతా చదువబడే అవకాశం ఐతే వచ్చింది. ఎక్కడెక్కడో తెలుగు భాష కాని ప్రదేశాల్లో ఉండే తెలుగు వారికి ఇంటర్నెట్ ఒక వర ప్రసాదిని. తద్వారా వారు తెలుగులో వ్రాయబడుతున్న అనేకానేక "వ్రాతలు" చదువగలుగుతున్నారు. ఆ "వ్రాతలు" అన్నీ కూడ సాహిత్యమేనా? వేచి చూడాలి. శతాబ్దాల నుండి సాహిత్యం అనేకానేక కొత్త పుంతలు తొక్కుతూనే ఉన్నది. పురాణ కథలు మత్రమే సాహిత్యం, శ్లోకం లేదా పద్యమే కవిత్వం అన్న రోజుల నుండి, కార్డు కథలు, మిని కవితలు, ఇంక ఇలా అనేకానేక రకరకాల ప్రక్రియలు సాహిత్యాన్ని పరిపుష్టం చేశాయి. పైన వ్రాసినట్టుగా, బ్లాగుల్లో వ్రాయబడేది సాహిత్యం కిందకు వస్తుందా, వస్తే ఇదే రకపు సాహిత్యం అనే విషయాలు తెలియటానికి ఇంకా వేచి చూడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. బ్లాగులు వ్రాయటం అనే విషయం చాలా ప్రాధమిక స్థాయిలోనె ఉన్నది. ఒక్క తెలుగులోనె కాదు దాదాపు అన్ని భాషల్లోనూ అదే పరిస్థితి. ఇలా వ్రాయగలగటం అన్న వింత అనుభూతి, కొత్తగా దొరికిన ఈ ప్రచురణా స్వాతంత్ర్యపు ఆనందలో కొట్టుకుపోతూనే ఉన్నారు అందరూ. ఈ కొత్త రకపు వ్రాత పధ్ధతికి అలవాటుపడి, మనకు సాంకేతికపరంగా అందుబాటులోకి వచ్చిన అనేకానేక ఉపకరణాల కలయికతో కొత్త సాహిత్య ప్రక్రియ ఉదయిస్తుందా? అది ఏ రకంగా ఉంటుంది, కథగానా, సినిమాలోలాగ కథ చెప్పటమా, రేడియో నాటకం లాగ వివిధ వ్యక్తులు ఒక కథను పాత్రోచితంగా చదువటమా, సంఘటనలను బొమ్మలతో చెప్పటమా, మనిషి ప్రవృత్తిని ఫొటోలతో వివరించటమా. ఇందులో ఏదైనా కావచ్చు, వీటన్నిటి కలయికా కావచ్చు.
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య తప్పకుండా పెరిగిందనే చెప్పాలి. కాని ఆ పాఠకులు ఏ వర్గం నుంచి పెరిగారు అని పరికించి చూస్తే, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. కొంతలో కొంత ఎగువ మధ్యతరగతి వారిలో కూడ పాఠకులు ఇంటర్నెట్ వల్ల పెరిగారు. కింది స్థాయిలో ఉన్న రోజువారి సంపాదనతో జీవించే వారు కాని, అమితమైన సంపద కలిగిన వర్గాలనుండికాని ఇంటర్నెట్ వల్ల పాఠకులు పెరగలేదు. కారణం, కింది తరగతివారికి ఇంటర్నెట్ అందుబాటులో లేదు. కంప్యూటర్ వాళ్ళకు అందని ఫలమే. పైగా రోజులో ఎక్కువ సమయం ఆరోజు సంపాదనకే శ్రమ పడాలి, అదికూడ శారీరిక శ్రమ. అందువల్ల బీదవారిలో ఇంటర్నెట్ పాఠకులు ఎవరూ పెరగలేదనే జవాబు వస్తుంది. ఇక ధనిక వర్గాల వారికి ఇంటర్నెట్ వంటివి వారి సంపాదనను మరింత పెంచుకోవటానికి వాడుకుంటున్నారే తప్ప సాహిత్య పఠనానికి అతి కొద్ది మంది మాత్రమే వాడుతున్నారు అనిపిస్తుంది.
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
బ్లాగులు ప్రస్తుతానికి అద్దాల్లాగ ఉండి వస్తున్న సాహిత్య ప్రక్రియలను పరిచయం చెయ్యటమో లేక సమీక్షించటమో వరకే పరిమితమై ఉన్నాయి. సాహిత్య పరంగా చూస్తే ఒక కథ పత్రికలో ప్రచురితమైనా, లేదా రచయిత తన బ్లాగులో ప్రచురించుకున్నా ఒక సాహిత్య ప్రక్రియగా పెద్ద తేడా ఏమీ లేదు. మాధ్యమం మారింది అంతే. "ఈ పత్రికలు" కూడ ప్రస్తుతం వస్తున్న వార పత్రికల దారినే వెడుతున్నాయి. ఒక్కటే బేధం, వ్యాపార పరంగా నడుపబడుతున్న వార/మాస పత్రికలలో ఎన్నెన్నో ప్రకటనలు ఉంటాయి. ఈ పత్రికల్లో ప్రస్తుతానికి ప్రకటనలు చాలా తక్కువగా ఉంటాయి. మిగిలిన విషయాల్లో, అంటె, ప్రచురణ చేసే వివిధ అంశాలను చూస్తే పెద్ద తేడా ఏమీ లేదు. సాంకేతిక పరంగా అందుబాటులో ఉన్న మల్టీ మీడియాను వాడుకుని వ్రాతకు శబ్దం, చలన చిత్రం కలిపి సినిమాలా కాకుండా, మరో రకమైన సాహిత్య ప్రక్రియ ప్రయోగాలు "ఈ పత్రికలు" చేయవలసి ఉన్నది. సాహిత్య పరిణామ క్రమంలో పద్యాలు, శ్లోకాలతో విషయం చెప్పటం మొదలయ్యి, వచన రూపంలో కథలు, నవలలు వచ్చి, పద్య కవితలు, గద్య కవితలు, కార్టూన్లు, బొమ్మల కథలు, నాటకాలు ఇలా అనేక ప్రక్రియలు వచ్చినాయి. నాటక రచన ఒక సాహిత్య ప్రక్రియ ఐతే, నాటక ప్రదర్శన మరో రకమైన సాహిత్య ప్రక్రియ. సాంకేతిక పరంగా సంగీత సాహిత్యాలను మిళాయించే మరోరకమైన సాహిత్య ప్రక్రియ సినిమా. మరి బ్లాగులు, "ఈ పత్రికలు", కొత్త రకమైన సాహిత్యాన్ని పుట్టించగలవా?
ఎంతటి సాంకేతిక అభివృధ్ధి జరిగినా, ఒక రచయిత పరిశీలనలోనుండి ఊహాలోనుండి సాహిత్యం పుట్టవలసినదే కాని ఆ సాహిత్య ప్రచురణా మాధ్యమాలు సాహిత్యాన్ని పుట్టించలేవు.
Here are a few quick observations:
1. Internet use is more of a personal expression than what literature has been traditionally.
You might say, a poem or a story is also a personal expression. True. However, When one is writing it down on paper and sending it to a magazine, one has the audience in mind to some extent. What I am saying is, internet writer is less concerned about the audience and more concerned about getting his/her ideas out. It generates its own audience is a by-product.
2. There is "selection" and "selectiveness" involved in publication of traditional literature. Internet writing is more free in this respect. There is no filtering by a 3rd party. This gives raise to some interesting side-effects.
a) questionable quality;
b) questionable authenticity;
c) writing that spans genres; writing that defies genres
A piece of writing may be a review, a creative expression, a reminiscence all in one.
There may be some more elements here.
3. On internet, the line between "author" and "audience" is being wiped out. Most of the time, especially in blogs and blog-like publications (say, pranahitha or navatarangam, poddu or pustakam), the primary audience is the group of other authors. Moreover, the comments on any post add to the value of the post. So, the audience is actively participating in generating and adding to the content, and enhancing the experience of the next reader.
4. Interestingly in Telugu, both in AP and in the US, established writers in general did not embrace internet writing. Why this is so - may be explored further. Internet access and lack of time are not issues. Many established Telugu writers in AP are internet savvy. My suspicion is - there is some form of "elitism" at play here. This is worth exploring - may be developed into a study by itself.
@ Siva garu,
"ఒకరినొకరు ఎత్తిపొడుచుకోవటం, ఎద్దేవా చేసుకోవటమే బాగా కనపడుతోంది"
Sir, this is the nature of internet itself. From the earliest days of Usenet groups to the present day, the noise level is deafening. Even some of the greatest sites which allow public comments are grappling with this - how to reduce noise level, keep the discussions civil, etc. Apparently they are developing and implementing algorithms that can do this automatically.
The noise level is comparatively low in Telugu blogs.
శివ గారూ, ఇప్పుడే మీ బ్లాగు చూశాను. మీతో పాటు, ఈ చర్చలో పాల్గొంటున్న ఇతర మిత్రులందరికీ:
దయచేసి ఈ చర్చలో వెంట వెంటనే నా స్పందన కోసం ఎదురుచూడకండి.
నా స్పందన అంటే తిరిగి నా సొంత అభిప్రాయాల్ని మీ మీద రుద్దడం అవుతుంది.
అలా కాకుండా, ఈ చర్చ నిరాటంకంగా, స్వేచ్ఛగా జరగాలని నా అభిప్రాయం.
ఈ చర్చ ముగించే ముందు మీ అందరికీ నేను నా స్పందన తెలియజేస్తాను.
OK Sir. Thank you for your response. Whatever I wish to say I have said. If anybody responds on the points made by me, I am ready for discussion.
ఇంటర్‌నెట్‌లో తెలుగు వాడటంలో రెండు చెప్పుకోతగ్గ పరిణామాలు ఉన్నాయి. మొదటిది వెబ్ పత్రికలు. రెండవది బ్లాగులు. ఈ రెండిటి పరిణామ దశల్లో దాదాపు ఒక దశాబ్దం కాలం తేడా ఉంది. వెబ్ పత్రికలు సుమారు 90 దశాబ్దం చివరలో వచ్చాయనుకోవచ్చు. అందుకు పదేళ్ళ తరవాత వచ్చాయి బ్లాగులు. అచ్చు పత్రికల నుంచి స్వాతంత్ర్యం పొందటానికి వెబ్ పత్రికలు వచ్చాయనుకుంటే వెబ్ పత్రికల నుండి స్వాతంత్ర్యం పొందినట్టు బ్లాగులు పుట్టుక తోస్తుంది. వెబ్ పత్రికల ప్రారంభదశలో ఎదుర్కున్న కష్టాలను వివరిస్తూ కొన్ని వ్యాసాలు అంతర్‌జాలంలో ఉన్నాయి. వెబ్ పత్రికలు ఒక పరిణితి సాధించిన తరవాత వాటి సంఖ్య పెరగటం మాత్రమే కాకుండా ఎన్నో వెబ్ పత్రికలు ప్రారంభించిన అతి కొద్ది కాలానికే మూతపడటం కూడా జరిగింది.
బ్లాగుల గురించి ముచ్చటించే ముందు వెబ్ పత్రికల విజయాలతో పాటు ఎదురు చూచిన అపజయాలు కూడా తెలుసుకోవాలి. కొత్తల్లో సరదాగా ఔత్సాహిక కుర్రకారుతో మొదలయిన కొన్ని వెబ్ పత్రికలు ప్రజాదరణ పొందాయని చెప్పక తప్పదు. కొందరు వ్యాపార దృష్టితో కొన్ని వెబ్ పత్రికలు మొదలెట్టినా చాలా పత్రికలు ఈ విషయంలో విజయం పొందలేకపోయాయి.మొత్తం మీద లాభాపేక్ష లేని పత్రికలనే జనం ఇష్టపడటం ఎక్కువైంది. కొన్ని వెబ్ పత్రికలు కొన్ని విషయాల్లో ప్రత్యేకతని చూపటానికి ప్రయత్నం చేసాయి. ఉదాహరణకి సాహిత్యం, సంగీతం, సినిమా, వంటలు మొదలైన విషయాల పై దృష్టి పెట్టి ప్రారంభించిన పత్రికలు ఎన్నో ఉన్నాయి. మరి వీటి
పెరుగుదలకు పాఠకుల ఆదరణ ముఖ్యమని వేరే చెప్పక్కరలేదు. మరి ఈ వెబ్ పత్రికలకి ఈ మధ్య జనాదరణ తగ్గుతున్న విషయం అసత్యం కాదు. అందుకు నాకు తెలిసిన కారణాలు ఇవి.
ఒక మంచి రచన పాఠకులకి ఇవ్వాలని ఒక రచయిత(త్రి)కి అచ్చు పత్రికల్లో ఎలా ప్రేరణ కలుగుతుందో అదే ప్రేరణ వెబ్ పత్రికల విషయంలో కూడా వర్తిస్తుంది. ప్రచురించబడిన రచన పారితోషకం విషయం ఇక్కడ చర్చించట్లేదు. మరి అటువంటి రచనకి ప్రేరణ ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు పాఠకుల ఆదరణే కాక అతి సులభంగా అందరికీ వీలుబాటుగా దొరికే అంతర్జాలం అనే మాధ్యమం. మరి ఈ వెబ్ పత్రికలకి ఎవరు పడితే వారు రచనలు రాసి ప్రచురించుకోవచ్చా? చాలా వెబ్ పత్రికలలో ఇది సాధ్యమైనా కొన్ని పత్రికలు తమ సంపాదకత్వం నిర్వహణ పేరుతో కొందరు మంచి రచనలని పోగొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. కొన్ని వెబ్ పత్రిక సంపాదకుల నిరంకుశధోరణి మంచి రచయిత(త్రు)లని పాఠకులని కూడా పోగొట్టుకున్నాయన్నది నా స్వానుభవం.
ఈ వెబ్ పత్రికల్లో బాగా కృషి చేసి ఆ పరిశ్రమ వల్ల జనించిన రచనలు తక్కువ. ఏవో పైపై అభిప్రాయాలు, లోతుగా లేని ఆలోచనలతో ఎదైనా సరే రాసి తమ పేరు ఇంటర్‌నెట్‌లో చూసుకుందాం అన్న ధోరణే ఇందుకు కారణం.
ఈ ఉపోద్ఘాతం ఇక్కడితో ముగించి అఫ్సర్ అడిగిన ప్రశ్నలకి నా జవాబులు ఇక్కడ ఇస్తున్నాను.
ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులేమిటి?
ఒక్క ముక్కలో చెప్పాలంటే భావస్వాతంత్యం. ఎవరైనా, ఏ విషయమైనా స్వేచ్చగా ప్రకటించగలిగే (కొంత వరకు) అవకాశం వచ్చింది. ఇందువల్ల గొప్ప సాహిత్య సృష్టి జరిగిందా అని ప్రశ్నిస్తే సమాధానం నిరుత్సాహాన్నే సూచిస్తుంది. కాని ఇది ఒక సంధికాలంగా మాత్రమే చూడాలి. అంటే గత 10 లేక 15 ఏళ్ళగా ఇంటర్నెట్‌లో వస్తున్న తెలుగు సాహిత్యాన్ని వందల సంవత్సరాల సాహిత్యానికి ప్రత్యామ్న్యాయంగా చూడటం కూడా ఒక తప్పే. ఆ తప్పు మనదే!
ఇదివరకు లేని ఒక కొత్త అంశం సాహిత్య రూపంగా ఇక్కడ చోటు చేసుకుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అది ప్రవాసాంధ్రుల రచనలు. ఇందులో సాహిత్యం ఎంత ఉందో విజ్ఞులకే అనుభవం. కాని ఈ కొత్త గొంతుల రచనలను పక్కన పెట్టలేము. అలాగే, అఫ్సర్ అన్నట్టు, పాఠకుడు అంటే ఒకప్పుడు మనకున్న నిర్వచనం మారుతోంది. అంతా అంతర్‌జాలం మహిమ. రాబోయే కాలంలో ఈ మార్పులు మరింత ప్రస్ఫుటంగా మనకి కనపడే సూచనలు ఇప్పుడే కనిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య బాగా పెరిగిందా?
అవును. సంఖ్యలో పెరిగింది. మరి తెలుగు సాహిత్యంలో సత్తాగల పాఠకుల సంఖ్య పెరిగిందా? బహుశా లేదనే సమాధానం చెప్పుకోవాలి. విసృతంగా తెలుగు సాహిత్యం చదివిన పాఠకుల కొరత బాగా కనపడుతోంది.40 వయస్సులోపున ఉన్న వారిలో తెలుగు సాహిత్యం, అంటే సాంప్రదాయ సాహిత్యం బాగా తెలిసిన వారు కాని, సాహిత్యాన్ని ఒక సాంప్రదాయంగా చూస్తున్నవారు కాని ఎక్కువ లేరు. అది ఇంటర్‌నెట్ రచనల్లోనూ అవి చదివినవారి అభిప్రాయ ప్రకటనల్లోనూ స్పష్టంగా తెలుస్తోంది.
ఈ-పత్రికలు, బ్లాగుల గురించి మీరేమనుకుంటున్నారు?
ఇందాకే ఈ విషయాలు కొంచెం చెప్పుకున్నాం! Public Domainలో ఉన్నవి వెబ్ పత్రికలు. ఇక్కడ అభిప్రాయాలను, అందులో తెగడ్తలు, ఎక్కువ. "నువ్వు ఏం రాస్తావో రాయి! దాన్ని చీల్చి చెండాడుతాం!" అన్న ధోరణిలో ఉన్న పాఠకులు ఇక్కడ కనపడతారు. Private Domainలో ఉన్నవి బ్లాగులు. ఇక్కడ ఎవరికి కావలసింది వారు రాసుకోవచ్చు. రచనల నాణ్యత కొంచెం తక్కువనే చెప్పాలి.
విష్ణుభొట్ల లక్ష్మన్న
తెలుగు సాహిత్యం వైయక్తికంగా ,ప్రాంతీయ అస్తిత్వ వాదాలకు లోబడి ,కులాల వారీగా,మతాల వారీగా,,జెండర్ వారీగా తమని తాము నియంత్రించు కుంటూ రచనలకు కూడా ఆ పరిధులు వర్తింప చేస్తూ,గిరి గీసుకు కూర్చోవడం చూస్తున్నాం.మారిన ఆధునిక జీవన శైలి అన్ని రంగాలలోనూ సంక్షోభం కలిగిస్తున్నట్లే,సాహిత్య రంగం లోనూ కలిగిస్తుంది.దీనివల్ల గతం లో లాగా ఒక రచనను క్షుణ్ణంగా చదివి లోతుగా విశ్లేషణ, విమర్శా చేసే
పరిస్థితులు,సందర్భాలు ఇప్పుడు లేవు.తెలుగు సాహిత్యం లో కాకలు తీరిన విమర్శకులు కూడా కరువవడంతో
వర్తమాన సాహిత్య ప్రమాణాల్ని శాస్త్రీయంగా అంచనా వేసే వారు లేరు.అయితే అన్ని సంక్షోభాల మధ్య
తెలుగు సాహిత్యం మాత్రం ఇంకా దిన పత్రికల సాహిత్య శీర్షికలలో కొన ఊపిరితో కొన సాగుతుండడం గమనార్హం..తెలుగు నాట కవులు ,రచయితలు కోకొల్లలుగా సంఖ్యా పరంగా పెరిగినా వాసి పెరగలేదన్నది మాత్రం అక్షరసత్యం..అచ్చులో వచ్చే సాహిత్యాన్ని అప్పుడు,ఇప్పుడు చదువుతున్నది పది శాతం పాథకులే.ఇందులో పాట చేరినంత త్వరగా సామాన్యుడికి చేరువవుతున్న సాహిత్య ప్రక్రియ మరేదీ లేదు..
ఇంటర్నెట్ తర్వాత తెలుగు సాహిత్యం లో బాగా కనిపిస్తున్న మార్పు తెలుగు అంతర్జాల పత్రికలు,తెలుగు
బ్లాగులు..వీటిలో మంచి ప్రమాణాల ప్రాతిపదికన నిర్వహిస్తున్నవిగా కౌముది,సుజనరంజని,ఈ మాట,ప్రాణహిత,
పొద్దు,తెలుగు పీపుల్ .కామ్ ఉదహరించ వచ్చు.పేరెన్నిక గన్న పలువురు రచయితలు ,రచయిత్రులు,రచనలు వీటిలో మనం చదువుతున్నాం.కొన్ని వార్షికలలో సైతం పై పత్రికలలోని ప్రచురణలు చోటు చేసుకుంటున్నాయి..
ఇంటర్నెట్ సాహిత్య పరిధిని విస్తృతం చేసిందన్నది మాత్రం వాస్తవం.అచ్చు పత్రికలలో వచ్చే అన్ని ప్రక్రియలు
కథ,కవిత,నవల సమీక్ష వ్యాసాలు ఇంకా అన్ని రకాల శీర్షికలు ఈ పత్రికల్లో మరింత అందంగా ,ఆకర్షనీయంగా
కొనసాగుతుండడం అభినందనీయం..జోకులు,కార్టూన్లు సైతం అద్భుతంగా అంతర్జాల ప్రచురణలకు నోచుకోవడం
ఆయా వర్గాల వారికి అందుతున్న కొత్త ప్రోచ్చాహం .
ఇంటర్నెట్ వల్ల పాట్టకుల సంఖ్య కొత్తగా ఒక వర్గాన్ని చదువర్లుగా మార్చింది.పుస్తక పట్టనం చేసే వారితో పాటు
నెట్ పట్టనం చేసే వారు.వీరు కార్పోరేట్ విద్య రంగంలో విద్య నభ్యసించి వృతి రీత్యా కంప్యూటర్ తో అనుభందం
కలిగి ప్రవృతి రీత్యా భాషా ,సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగిన వారు..వీరు అనేక తజాలపత్రికల్లోను,బ్లాగుల్లోను
రచనలు,చదివిన అంశాల పై అభిప్రాయాలు,రాస్తుండడం గమనిస్తున్నాం.కొన్ని సార్లు కొన్ని విషయాల పై
సుదీర్గ చేర్చాలు జరుగు తుండడం కూడా చూస్తున్నాం.ఇవి అచ్చు పత్రికల్లో జరిగే సాహిత్య చేర్చ లకన్నా
కొంత భిన్నంగా వుంటాయి.
ఇంటర్నెట్ కొత్త సాహిత్య సంస్కృతికి తెరతీస్తుంది..పాట్టకుడు అన్న పదానికి ఇంటర్నెట్ సాహిత్యం కొత్త అర్ధాన్నిస్తు
దన్న అఫ్సర్ అభిప్రాయం అక్షరాల నిజం.అచ్చులో సాహిత్యం కూడా అట్టడుగు జనానికి చేరనప్పుడు నెట్ సాహిత్యం
చూసే జనం ఎంత అనే ప్రసన అనవసరమేమో..అక్కడ, ఇక్కడ ఆసక్తి వున్నా వారే సాహిత్యం వైపు దృష్టి సారిస్తున్నారు.
ఈ పత్రికలు,బ్లాగులు తెలుగు భాష ,సాహిత్యాలకు ప్రాచుర్యం కలిగించడంలో తమ వంతు పాత్ర సమర్ధ వంతంగానే పోషిస్తున్నాయి..
అయితే అచ్చులో రాస్తున్న అనేక మంది ప్రామాణిక రచయితలు తమ రచనలు అంతర్జాల పత్రికల్లో నమోదు కావడం లేదు.ఇది మాత్రం బాదాకరం.
చివరగా ఇంటర్నెట్ సాహిత్యం లో వైయక్తిక భావాలు కు సంబందించిన రచనల చిత్రణే అధికంగా కనిపిస్తుంది..సామాజిక స్పృహ ,
విశ్వ జనీన అంశాల పై రచనలు విస్తృతంగా వెలువడాల్సిన అవసరం ఎంతైనా వుంది...!
పెరుగు.రామకృష్ణ
నెల్లూరు
b s ramulu social philosopher
internet created so much in world as well as in english and telugu .
in telugu it is being used mostly for communication.i.e for news, emails, search, vikipedia,chatting,
...and zero point one percent may not seeing for literature in telugu in internet .
but at the same time internet is helping to writers and readers to send magazines their articles like me . and i am .. belongs india seeing now in u s a
telugu literature pages.
since seven years i did not write with hand but with telling to dtp compositor.. i wrote so many books, articles,thousands of pages.
it made me easy self editing..sizable editing to fit particular paper or book.
but fiction writing on inter net not so easy ..it demands more privacy..more lonely ness ..i.e to write with out the help of dtp compositor.
this a practical problem.
internet reached world widely but not using in the same way . netizens are choosing their vested interests.. but not choosing read literature newly as seeing vedios, U tube etc..internet does not working to change interests of individual for higher range aesthatics.. but popular, cheap, light going time pass.
meetings create good readers healthy thinking ..that is to be done through internet.
now a days 10th students are also visiting inter net cafes for various purposes...so do create literature which is to think necssary to their development . they should feel to read . so literature in a total must transform itself to attract people ..
now change is going for the interests of elite sections' conservative thinking..authority.
but it should reach bottom of the pyramid ..people just like said Padmabhushan.. c. k prahalad in his book 'THE FOTUNE AT THEBOTTOM OF THE PYRAMID[eradicating poverty through profits]
".....ఇదివరకు లేని ఒక కొత్త అంశం సాహిత్య రూపంగా ఇక్కడ చోటు చేసుకుంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. అది ప్రవాసాంధ్రుల రచనలు...."
విష్నుభొట్ల లక్క్ష్మన్న గారూ. నమస్తే. ప్రవాసాంధ్రులు వ్రాసినంత మాత్రాన ఆ రచనలను కొత్త సాహిత్య రూపంగా ఎలా పరిగణించగలం? వ్రాసింది ఎవరైనా కథ, కథే, నాటకం, నాటకమే, పాట, పాటే లేదా కవిత్వం కవిత్వమే. ఎక్కడ వ్రాసినా (అచ్చులో కాని, ఇంటర్నెట్ లో కాని) సాహిత్య రూపాలలో మౌలికమైన మార్పులేమీ రాలేదు, కొత్త సాహిత్య రూపం ఇంటర్నెట్ వల్ల రూపొందిన దాఖలాలు నాకైతే కనపడలేదు. బ్లాగుల్లో స్వగతాల్లగ, అనుభవాలు (నిజం కావచ్చు కల్పితాలు కావచ్చు), కొంత అలోచనతో అంశాలవారీగా రచనలు బాగానే వస్తున్నాయి. సాహిత్య రూపాలలో ముఖ్యమైన కథలు బ్లాగుల్లో చాలా తక్కువ, కవితల పేరుతో చాలామంది తమ తమ బ్లాగుల్లో వ్రాసుకుంటున్నారు. కాని ఇవన్ని కూడ, ఇప్పటికే ఉన్న సాహిత్య రూపాలే కాని, కొత్తవిగా, పైగా ఇంటర్నెట్ వల్ల వచ్చిన సాహిత్య రూపాలుగా ఏమీ కనపడటంలేదు. అప్సర్ గారు అడిగిన ప్రశ్న నాకు అర్ధమైనది ఏమంటే, సాహిత్యం మీద ఇంటర్నెట్ ప్రభావం ఏమిటి అని. ఆ ప్రభావం స్వల్పంగా ఉండి వ్రాసే ఆసక్తి, శక్తి గలవారిమీద, వ్రాసి ప్రచురించుకోగల స్వాతంత్రాన్ని, వెసులుబాటును ప్రసాదించటం వరకే ఉన్నది. మరంతకంటే ప్రభావం పెద్దగా లేదని నేను అనుకుంటున్నాను.
శివ గారు అనేక విషయాలు నిష్పాక్షికంగా చెప్పారు.ముఖ్యంగా పేరున్న రచయితల్ని
పానెల్ ఎడిటర్స్ గా వుంచి రచనలు ఎంపిక చేయిస్తే ,సమీక్ష చేయిస్తే చాల
ఉపయోగం వుంటుంది..
శివ గారూ, మళ్ళీ విభేదిస్తున్నాను మీతో. ప్రవాసాంధ్రుల రచనలు వేరేనే, కచ్చితంగా. ఈ రచనలకి మోట్టమొదటి లక్షణం ఆయా రచయితల్లోనే ఉన్నది. వీళ్ళెవరూ ఆంధ్రనీ, భారద్దేశాన్నీ విడిచి వచ్చి ఉండకపోతే అసలు రాసి ఉండేవారు కాదు, రాసినా ఇంత విరివిగా రాసిఉండేవారు కాదు. కొత్త ప్రాంతంలో కొత్త అనుభవాల్ని రికార్డుచేసుకోవాలనే తపనే మాలో చాలామందిని రచయితల్ని చేసింది. అఫ్కోర్సు, పాఠకుడి దృష్టిలో ఈ తేడాలు ఉండాల్సిన అవసరం ళేదనుకోండి. నచ్చితే మెచ్చుతారు, లేకుంటే లేదు.
కొత్త పాళీగారూ. విబేధం ఏముందండీ, మనం ఒక చర్చ చేస్తున్నాం, వాదన కాదుకదా. అవును ప్రవాసాంధ్రులు రచనలు విభిన్నమే. కాని అదొక ప్రత్యేక సాహిత్య "రూపం" కాదు. అది సాహిత్యం కాదు అనటంలేదు నేను, అదొక ప్రత్యేక సాహిత్య రూపం కాదు అని మాత్రమే అంటున్నాను. గమనించగలరు. వాళ్ళు వ్రాసేవీ కథలే, పాటలే, కవితలే. ప్రవాసాంధ్రులుగా ఉండి వ్రాయటానికి, ఇంటర్నెట్టుకు సంబంధం లేదు. ప్రవాసాంధ్రులుగా ఎప్పటినుండో ఇంటర్నెట్ అంటే తెలియని రోజులనుండి ఉన్నారు. కాకపోతే ఇంటర్నెట్ లో వచ్చిన ఈ సౌకర్యాన్ని వాడుకుని వ్రాసేవారు పెరిగి ఉండవచ్చు. కాని ఆ వ్రాయటం కొత్త సాహిత్య రూపాన్ని ఏర్పరచలేదు. ఇది నా అభిప్రాయం. ప్రవాసాంధ్రుడు వ్రాసినా, తెలుగు ప్రాంతంలో ఒక మారుమూల కుగ్రామంలో ఉన్నవారు వ్రాసినా సాహిత్య రూపాలు అవే ఉన్నయికాని, కొత్త రూపాలు ఇంటర్నెట్ వల్ల ఏర్పడవు అన్నది నా అభిప్రాయం. ఇంటర్నెట్ అనేది మాధ్యమం మాత్రమే. కొత్త సాహిత్య రూపాన్ని రూపొందించటంలే ఇంటర్నెట్/కంప్యూటర్ పరిజ్ఞానం బాగా తోడ్పడవచ్చు. కాని ఇంతవరకూ అలా ఏర్పడిన కొత్త సాహిత్య రూపం, కథ, కవిత, నవల, నాటిక, పద్యం వగైరా మనకు తెలిసిన రూపాలు కాకుండ, ఏమైనా ఉన్నదా? అలా కనుక మరో కొత్త సాహిత్య రూపం ఇంటర్నెట్టు వల్ల మాత్రమే రూపం దాల్చి ఉంటే, అప్పుడు ఇంటర్నెట్ ప్రబ్యావం సాహిత్యం మీద ఉన్నది అనవచ్చు.అప్పడు కూడ ఇంటర్నెట్ పాత్ర "సహాయక పాత్రే" కాని ప్రధాన పాత్ర కాజాలదు. ఏది ఏమైనా ఒక రచయిత మస్తిష్కంలోంచి సాహిత్యం పుట్టాల్సిందే కాని, ఏ యంత్రంలోచి కాని, సాంకేతిక ఉపకరణం నుండి కాని ఏవిధమైన సాహిత్యమూ జన్మించే అవకాశం లేదు. అలా ఆటో రైటర్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి కాని, వాటి పరిమితులు వాటికి ఉన్నాయి, రచయిత మేధస్సుకు అవి ఏపాటికీ, ఎప్పటికీ సరిఫొవు.
1.ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
సాహితీసృజనలో విప్లవాత్మకంగా ఏమీ మార్పులు లేవుగానీ ఇప్పుడిప్పుడే కొన్ని హద్దులు చెరిగి కొత్తపాఠకులు ఏర్పడే అవకాశం కలుగుతోంది. రచయితలు సరాసరి పాఠకుల మనోభావాలు తెలసుకోగలిగే సౌలభ్యం కలుగుతోంది. అక్కడక్కడా ఇంటర్నెట్ లో రాసిన వ్యాసాలను కూడా ప్రమాణాలుగా రెఫరెన్సులుగా వాడుకున్న సాహితీవిమర్శనం కనిపిస్తోంది. కానీ సాహితీసృజనలో ఎటువంటి మార్పులూ లేవు.
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా?
ఖచ్చితంగా పెరిగింది. కనీసం చదవాలి అనుకునేవాళ్ళ సంఖ్య అయితే పెరిగింది. కానీ పాఠకులకు అనుగుణంగా వారిని అందిపచ్చుకునే సౌకర్యాలు, సౌలభ్యాలూ పెరగాలి. ఒక పుస్తకం గురించి ఇంటర్నెట్లో విపరీతమైన చర్చ జరిగినా, ఆ పుస్తకాన్ని అందుకోవాలనుకునే పాఠకులకు సరైన సమయంలో పుస్తకం అందుబాటు కాలేని పరిస్థితి ఉంది.
2B:పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
మధ్యతరగతి. ఎన్.ఆర్.ఐ జనతా మధ్యన పెరిగింది.
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
ఇవి ప్రత్యామ్న్యాయంగా ఉంటే అస్తిత్వం ఉంటుంది. వ్యక్తిత్వాల్ని ప్రతిఫలిస్తే మనుగడ ఉంటుంది. ఇవికూడా మళ్ళీ తెలుగు సాహిత్యప మూసల ధోరణుల్లోకి వెళ్ళిపోతే ఏంలాభం?
నిస్సందేహముగ ఇంటర్నెట్ మాధ్యమము మూలాన ఎందరో కొత్త తెలుగు పాఠకులు వారితో పాటు మరెందరో ఔత్సాహిక రచయితలు కవులు వచ్చారు. తెలుగు సాహిత్యానిక ఒక రకమైన స్తబ్థత నుంచి బయట పడే అవకాశము ఈ ఇంటర్నెట్ ద్వారా లభ్యమయ్యింది. గత పది పదిహేను సంవత్సరాలలో కొత్తగా ప్రచురింపబడిన పుస్తకాల యొక్క ప్రతుల సంఖ్య చూస్తే ఈ విషయము మరింత బాగా అర్థమవుతుంది. నా దగ్గర లెక్కలు లేవుగానీ, ఏ ఒక్కటి గూడా వందల సంఖ్యను మించి ఉండకపోవచ్చు. అదే ఒక మంచి బ్లాగు పోష్టు రాస్తే దానికంటె ఎక్కువ హిట్లు అతి తక్కువ వ్యవధిలోనే వస్తాయి. ఎందువలన? బాంక్ టెల్లరు కంటే బాంకు ఏ.టి.యమ్ మరింత దక్షత గలది - అందువలన. ఎలక్ట్రానికు టైపురైటర్లని కంప్యూటర్లు మూలపడేసినట్టు, మరి కొన్ని సంవత్సరాలలో పుస్తకాల రూపములో ఉన్న తెలుగు సాహిత్యాము ఇంటర్నెట్ మరియు Kindle లాంటి eReaders ద్వారా మాత్రమే లభ్యమవ్వవచ్చు. ఇది ఒక అనివార్యమైన పరిణామము. ఆలాగే హర్షించదగ్గది కూడా.
మిగిలిన వ్యాఖ్యలలో రాసినట్టుగా ఈ కొత్త పాఠకులలో ఎక్కువ శాతము చదువుకున్నవారు మరియు సాంకేతికపరమైన వృత్తులలో ఉన్నవారు. అలాగే తెలుగు దేశానికి దూరముగా ఉన్న వారు ఎక్కువగా ఈ మాధ్యమాన్ని వాడుతున్నారు. ఇంటర్నెట్ అనేది లేకపోతే, నా మట్టుకు నేను ఒక తెలుగు దినపత్రిక గాని ఒక తెలుగు పుస్తకము గాని చదవి ఉండేవాడిని కాదేమో. ఒక పదిహేను సంవత్సరాల కాలము అలాగే గడిచిపోయింది కూడా. కాని ఇప్పుడు అలా బాధ పడవలసిన అవసరము అస్సలు లేదు. చక్కగా ఈనాడు పేపరు చదవ వచ్చు. అలాగే 'సితార' కంటే మేలైన సినీ మషాలా బ్లాగులెన్నో ఉన్నాయి.
దీని మూలాన ఉపయోగము ఏంటి అలాగే మంచి సాహిత్యము ఎందుకు వస్తుంది అంటారా? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే కార్యాకారణ సంబంధము ఉన్నది కాబట్టి. ఎక్కువ మంది పాఠకులుంటే మరింత మంది రచయితలు వస్తారు. కొత్తపాళి గారు, లక్ష్మణ్న గారు అన్నట్టు, వైవిధ్యభరితమైన రచనలు వస్తాయి. రాసి పెరిగే కొద్ది దానంతటదే వాసి లో కూడా మార్పు వస్తుంది - వచ్చింది కూడా. తెలుగు బ్లాగులను షుమారు ఒక సంవత్సరమునుంచి చదువుతున్నాను. ఉత్కృష్టమైన టపాలనెన్నో చూసాను. కవులు కాని కవుల మేలిమి రచనల నెన్నో చదివాను. సమకాలీన రాజకీయాలు, సమస్యల గురించి మరింత అవగాహన పెంచుకున్నాను. బ్లాగ్గురువుల ద్వారా ఛందస్సు నేర్చుకున్నాను, రాసాను. ఎన్నో మంచి మంచి పుస్తకాల పేర్లు వాటి గురించిని విశేషాలు తెలుసుకున్నాను. అఫ్సర్ గారి లాంటి వారి పరిచయము ఏర్పడింది.
ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
రెండూ అవసరమే. కాలక్షేపము బటానీలు తినాలని అప్పుడప్పుడు అనిపించవచ్చు. అలాగే మరోసారి కొంచెము సీరియస్ విషయము చదవాలని అనిపించవచ్చు.
నా ఉద్ధేశ్యములో మంచి ఈ-పత్రిక అనేది సాన పెట్టిన మేలైన రచనల సముదాయము అయిఉండాలి. అందులో ప్రచురింపబడాలి అంటే ఒక రకమైన ప్రమాణం కలిగి ఉండాలి. విలువైన నా సమయము వృధా అవ్వకుండా మేలైన రచనలు (?) అందివ్వగలిగి ఉండాలి. పుచ్చు వంకాయలన్నీ ఏరిపారేసి మంచి నవనవలాడే వాటిని మాత్రమే ఉండేట్టుగా చూడాలి. అలాంటి పత్రికలే ఎక్కువ కాలము మనగలుగుతాయి.
1.ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
సమాధానం - ఈ విఘడియ దాకా మార్పులు రుద్రంలో వల్లించినట్టు "అశ్మాచమే, మృత్తికాచమే" మాత్రమే! అశ్మమనగా రాయి, మృత్తికమనగానేమిటో మీకు తెలుసని నాకు తెలుసు. :) ఎవడి రాయి ఎవడికి తగుల్తుందో తెలియని స్థితిలో ఉన్నది. అందులో విసిరేవాడు పిచ్చోడైతే తట్టుకోటం మరింత కష్టంగా ఉన్నది. రాళ్ళగుట్టలో రత్నాలు అక్కడక్కడా మెరుస్తున్నాయి. ఆ రత్నాలు తవ్వేవాడికి, సానపట్టేవాడికీ, అమ్మేవాడికి, కొనేవాడికి మధ్య(వీళ్ళంతా కూడా ఎవరో మీకు తెలుసు!) తరంగదైర్ఘ్యం సునామీలో వచ్చే పెద్దతనం అలల్లాగా కొన్ని కోసుల దూరంలో విస్తరించి ఉన్నది. కానీ ఏదో ఒక రూపంలో ఒక దైర్ఘ్యం తగలడిందిగా అని సంతోషపడే నాలాటి వాళ్ళూ ఉన్నారు. భాష మొదటినాళ్ళలో అనాగరిక స్థితిలో, నియమహీనంగా ఉంటుందే అలాగున్నయి ఇంటెర్నెట్టు వచ్చాక సాహిత్యంలో వచ్చిన మార్పులు. ఆ తీరూ తెన్నూ లేని భ్రమణాన్ని నియమాలేర్పరుచుకుని సరిచేసుకోగలిగితే బండి దారిలో పడుతుంది. ఉద్గ్రంధాలు వెలువడతాయి. అప్పుడెప్పుడో వ్యాకరణాన్ని వేదిక చేసుకుని వెలుగులు విరజిమ్మినట్టు. ఇంటర్నెట్టొచ్చాక ఈ సాహిత్యంలో వ్యాకరణం ఉన్నదా అన్న ధర్"మార్పు"సందేహం నాకొక్కడికే వస్తే అంతకన్నా సంతోషమూ లేదు. పిచ్చోడి చేతిలో రాయిని, భ్రమణాన్ని సరిచేసుకోలేనినాడు - లేని రోగానికి చికిత్స ప్రారంభించిన చందం అన్న నామాట తామరాకు మీద నీటిబొట్టు మాత్రం కాదని మనవి. మీరు కవి కాబట్టి ఎవరికి అర్థం అయినా కాకపోయినా ఈ నా కవి హృదయం మీకు అర్థమయ్యిందనే అనుకుంటున్నా. అర్థం కాకపోతే మీరూ కవి కాదు, నేనూ కవి కాదు... జై ఏక్ నిరంజన్!
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా?
గౌరాంగ చరిత్ర మౌంట్ బాటన్ దొరగారు గంట వాయించుకుంటూ చదువుతుంటే ఊర్లో జనాలు వాయనాలిచ్చుకున్న రీతిలో ఇబ్బడి ముబ్బడిగా పెరిగారు. ఎవరికి లాభం అన్నది ప్రశ్న! భాషకా, సాహిత్యానికా, ఇంటర్నెట్టుకా? పోనీ ఏదో ఒకదానికి లాభం ఉందనుకుంటే లాభం వీశమెత్తేస్తే నష్టం మణుగుల్లెక్కన లాగుతోంది ఎవరికీ కాకుండా!
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
ధోవతికి ఖర్చు తక్కువ, షరాయికి బడాయి ఎక్కువ...మళ్ళీ వివరంగా తరువాత ఎప్పుడైనా
మీర్రాసినవన్నీ బానే ఉన్నాయి కానీ అసలు సంగతి అర్థం కాలేదనన్నారనుకోండి - మీకో (అనగా అన్నవారికి) చీటీ రాసిస్తాను, సమయమొచ్చినప్పుడు చిత్రగుప్తుల వారికి చూపించండి, శిక్ష తక్కువచేస్తాడు. :)
1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
సాహిత్యానికి సాంకేతికానికి మధ్య ఉన్న ఒకే ఒక వారధి ఇంటర్నెట్ అని మనం అనుకుని చర్చిస్తే.. సాంకేతికమైన ఇంటర్నెట్ ఈ రోజుల్లో లభ్యంలో ఉంది కాబట్టి ఆ విషయమై మనం ఆలోచిద్దాం అనేటట్టైతే.. కొత్తనీరు ఎప్పుడూ ఏదో విధమైనటువంటి మార్పుని తెస్తుంది. గోదారిలో ఎఱసిరా పోసినట్టుగా ఉంటుంది మన చర్చ. తెలుగు సాహిత్యం ఓ గోదారిలాంటిది ఇంటర్నెట్ పదజాలమైనా.. అందులో చేరే భావజాలమైనా.. గోదారిలోని ఎఱసిరాలాంటిది. అలా పెద్ద మార్పేమీ లేదని నా అభిప్రాయం
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా?
ఇక్కడ పాఠకుల ప్రసక్తి వచ్చినప్పుడు ఏ మాధ్యమానికి సంబందించిన పాఠకులు ఆ మాధ్యమానికి ఉంటారు. శివ చెప్పినట్టు పేరడి బ్లాగులు బోలెడన్ని మొదలైనాయి. కాకపోతే వాటిని సాహిత్యంతో పోల్చడం ఏమాత్రం సబబు కాదు. కాబట్టి పాఠకుల ప్రస్తావన ఇక్కడ అంత ప్రాసస్త్యం లేదు. పత్రికా పాఠకులను మరియు ఇంటర్నెట్ పాఠకులను ఒక్కతాటితో కట్టేయ్యలేం
పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
అసందర్బమైన ప్రశ్న
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
వీటిలో సాహిత్య పరమైన ప్రచురణలు కొంచం కనబడుతున్నా క్రియాత్మకమైన చర్చ మరియు సహేతుకమైన వివరణలతోకూడిన వాదనలు జరగక పోగా తాపట్టిన కుందేటికి మూడుకాళ్ళన్న వాదన కనబడుతోంది. కొంతవరకూ మార్పు వచ్చి ఒకరినొకరు విభేదించుకోకుండా చర్చిస్తే ఓ గొప్ప వాతావరణానికి ఇవి బాగా ఉపయోగపడే సాధనాలు.
@తిక్కలోడు గారూ. పేరడీ బ్లాగులే కాదు, దొంగ పేరడీ బ్లాగులూ వచ్చి చేరాయి. ఇలాంటి పరిణామాలు రావటానికి కి గల కారణాలను శోధించి, ఆ పరిణామ మూలాలను శుభ్రపరచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని నా అభిప్రాయం, నమ్మకం.
అఫ్సర్ జీ ! చివరగా మీ అభిప్రాయం చెప్పనే లేదు,మీ presentation కూడా వుంటే బాగుండేది-కర్లపాలెం హనుమంత రావు
@కర్లపాలెం:
టెంపుల్ సాహిత్య సదస్సు నించి నిన్న రాత్రే వచ్చాం. సదస్సు మేం వూహించిన దాని కంటే చాలా బాగా జరిగింది. మిత్రులు ఉరిమిండి నరసింహా రెడ్డి గారు చెప్పినట్టు - చాలా క్వాలిటీ సదస్సు.
ఇక ఈ చర్చ ఇంకా ముందుకు కొనసాగించమని మిత్రులు అడుగుతున్నారు. ప్రశ్నలు కొంత సీరియస్ గా వుండడం వల్ల కొంత వ్యవధి అడుగుతున్నారు. వారి కోసమే కాక, ఈ అంశం ఇప్పుడు లోతుగా చర్చిందగింది కావడం వల్ల చర్చని ఆపదలచుకోలేదు.
నేను వ్యాసం అంత తేలికగా రాయలేను కూడా. నాకూ కొంత వ్యవధి కావాలసిందే.
చూద్దాం, ఇంకా ఇతర అంతర్జాలికులు ఏమంటారో?
శివ గారు:
నమస్తే!
నేను రాసి మీరు కోట్ చేసిన వాక్యంలో అర్ధం వివరిస్తాను. అంతర్జాలం వల్ల సాహిత్యంలో ఒక కొత్త అంశం (ప్రవాసాంధ్రుల రచనలు) వస్తుందన్నాను కాని ఒక కొత్త సాహితీ రూపం వస్తుందనలేదు.
జీవితం నుంచే సాహిత్యం పుడుతుందని పెద్దలు అంటారు. అప్పుడు ప్రవాసాంధ్రులు అనుభవిస్తున్న జీవితం నుంచి ఒక సాహిత్యం పుడుతుంది. ఇదొక కొత్త సాహితీ రూపమా కాదా అన్నది ఇక్కడి చర్చ కాదు. అటువంటి సాహిత్యం ఇదివరకు లేదన్నది సత్యం. మరి ఈ సాహిత్యం ఎవరికోసం? ప్రతి సాహిత్యానికి ఒక పాఠక వర్గం ఉంటారుగా? ఈ ప్రవాసాంధ్రుల అనుభవాలని నివాసాంధ్రులు అర్ధం చేసుకోక పోతే అది ఆంధ్రా తెలుగుల తప్పు కాదు. 25 ఏళ్ళుగా అమెరికాలో ఉన్న నా అనుభవాలు మీ వంటి వారికి అనుభవంలోకి సహజంగా రావు. అది మీ తప్పు కాదు. అలాగే మూడేళ్ళు అమెరికా నుండి ఫ్రాన్స్ వెళ్ళిన నాకు అక్కడ ఎదురైన నా జీవితానుభవాలు నా అమెరికన్ తెలుగు స్నేహితులకి అర్ధం కావు. అది కూడా సహజమే!
అయినా సరే నా అనుభవాలని తెలుగులో రాసి, నాకు చేతనైనంత వరకు, అంతర్జాలంలో మిత్రులతో పంచుకున్నా. దీన్ని ఏ సాహిత్య రూపం అంటారో నాకు తెలియదు. అది నా దృష్టిలో అప్రస్తుతం. నేను మాట్లాడుతున్న విషయాలు, అలాగే నా తోటి ప్రవాసాంధ్రులు పంచుకున్న విషయాలు ఇదివరకు తెలుగు సాహిత్యంలో దాదాపు లేవనే చెప్పాలి.
ఇంతటితో ఈ వివరణ ముగిస్తాను.
విష్ణుభొట్ల లక్ష్మన్న
లక్ష్మన్న గారూ నమస్తే. మీ ప్రతిస్పందన చదివాను. నేను మీరు వ్రాసిన వ్యాఖ్యను యథాతధగానే నా స్పందనలో ఉట్టంగించటం జరిగింది. "సాహిత్య రూపంగా" అన్న మాట మీరు వాడినదే.
1. ప్రవాసాంధ్రులు వ్రాసినంత మాత్రాన అదొక కొత్త సాహిత్య రూపం ఎలా అయినదో వివరించగలరు. మీరు ప్రవాసంధ్రుడిగా ఉండి వ్రాసినా, ఇప్పటికే ఉన్న సాహిత్య రూపాలనే వాడుకుంటున్నారు కాని (కథ, నాటకం, కవిత ఇత్యదిగా), కొత్త రూపాలేమి కనిపెట్టారు? అదీ ప్రవాసాంధ్రుడిగా ఉన్నంత మాత్రాన ఏర్పడిన రూపమేమిటి. ఆంగ్ల సాహిత్యంలో తరచుగానూ, తెలుగులో అడపా తడపా వచ్చే Travelogue అనే ఒక సాహిత్య రూపం ఉన్నది (మన రాజశేఖర చరిత్ర ఆ రూపనికి చెందినది) ప్రవాసాంధ్రులు తాము చూసిన విషయాలను తమ కథల్లో ఇమిడ్చి వ్రాస్తే, ఆ Travelogue సాహిత్య రూపానికి చెందుతుంది.
2. మీరు వ్రాసే విషయంలో, మీరు వేరే దేశాలలో ఉండటం వల్ల మీకు కలిగిన అనుభవాల ప్రభావం ఉండి ఉండవచ్చు, లేదా మీ "సాహిత్య రూపాలకు" వేదిక అక్కడి సమాజం, ఆచార వ్యవహారాలు కావచ్చు. కాని, ఎక్కడ, ఏ నేపధ్యంలో వ్రాసినా కథ కథే కాని మరొకటి కాదు. నేను ఇప్పుడు తెలుగు నేల విడిచి దాదాపు, దశాబ్ధం అయ్యింది, 9 ఏళ్ళు ముంబాయిలో, సంవత్సరంగా బెంగుళూరులోనూ ఉంటున్నాను. నేను కథంటూ వ్రాస్తే ముంబాయి లోకల్ రైళ్ళు, బెంగుళూరు చల్లదనం గురించి వ్రాసినంత మాత్రాన, అదొక కొత్త సాహిత్య రూపం అవుతుందని నేను అనుకోవటంలేదు. వ్రాసిన రూపాన్ని బట్టి, అది కథో, గేయమో, కవితో అవుతుంది.
3. అఫ్సర్ గారి ప్రశ్న, తెలుగు సాహిత్యం మీద ఇంటర్నెట్ ప్రభావం. ప్రవాసాంధ్రులు ఇంటర్‌నెట్ అంటే ఏమిటో తెలియని రోజులనుండి రచనలు చేస్తూనే ఉన్నారు. , ఇంటర్నెట్ వచ్చినాకా చేస్తున్నారు. స్పుటంగా, ఇంటర్నెట్ వల్ల కొత్తగా సాహిత్యానికి ఒనకూడినది అతి స్వల్పం. అది లేఖిని వంటి ఉపకరణాలు అందుబాటులోకి రావటం , బ్లాగుల్లో ఎవరైనా సరే వ్రాసుకోవటం మాత్రమే, ఆపైన, కొద్దొ గొప్పో తాము బాగా చదువుకున్నామన్న విషయం జ్ఞాపకం ఉన్న పాఠకుల సంఖ్య పెరగటం.
1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
ఇంటర్నెట్ కు ముందు ఎలా ఉండేదో నాకు తెలియదు కానీ - ఇంటర్నెట్ వల్ల నా తరం వారికి వెదుక్కునే తతంగం కాస్త సులువైందని చెప్పాలి. ఇప్పుడు నాకెవరన్నా రచయిత గురించో, రచనల గురించో తెలుసుకోవాలనిపిస్తే ఆన్లైన్ గుంపుల్లో అడిగో, శోధనా యంత్రాలలో వెదికో - ప్రయత్నిస్తాను. చాలా మటుకు ఈ దశలోనే సమాధానాలు దొరుకుతాయి. దొరక్కపోతే, ఎక్కడ దొరుకుతాయో తెలిసిపోతుంది. ఇది ఒక కోణం. రెండవ కోణం రాసే వారి సంగతి. బ్లాగులు అవీ వచ్చాయి కనుక, ఎవరి భావాలు వారు రాస్కుంటున్నారు. అన్నిసార్లు కాకపోయినా, చాలాసార్లు దీని వల్ల ఎన్నో సాహితీ సంబంధమైన చర్చలకు అవకాశం కలుగుతోంది. చర్చలు చదివితే కూడా బోలెడు విషయాలు తెలుస్తున్నాయి. మొత్తంగా శాతాల్లో చూస్తె, ఎక్కువ ఉండకపోవచ్చు కానీ, చాలా మంచి వ్యాసాలు నేను ఆన్లైన్ పత్రికలలోనూ, బ్లాగుల్లోనూ చదివాను, గత నాలుగైదేళ్ళలో.
a
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
పెరిగి ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. ప్రధాన వర్గం పాఠకులు : టెక్నాలజీ కి అలవాటు పడ్డ యువత, అని నా ఊహ. వేరే విధంగా అయితే, ఈ వర్గం వారిలో తెలుగు చదవడం పెరిగి ఉండే అవకాశాలు చాలా తక్కువ - మన స్కూళ్ళలో ఉండే పోటీ వాతావరణం, భాషల పట్ల నిర్లక్ష్య ధోరణి, ఆపై చదువులు, ఉద్యోగాల వేట - ఏదన్నా కారణం కావొచ్చు.
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?
-పైన మొదటి ప్రశ్నలోనే అన్నట్లు: నా దృష్టిలో, నా వ్యక్తిగత జీవితంలో : ఆఫ్లైన్ పత్రికల కంటే, సాహిత్యం గురించి నాకు బ్లాగులు, ఈ-పత్రికలే ఎక్కువగా చెప్పాయి.
--
Sowmya V.B.
Post a Comment