ఆంధ్రా తెలుగు సాహిత్యం, అమెరికా తెలుగు సాహిత్యం అన్న పదాలు వినడానికి అంత బాగుండక పోవచ్చు కానీ, ఇప్పుడు అమెరికాలో పెరుగుతున్న తెలుగు సాహిత్య సందడిని గమనిస్తే ఇవి నిజమే కదా అనిపిస్తుంది. నిజానికి గత అరవై ఏళ్ల పైబడి అమెరికాలో తెలుగు రచయితలు ఏదో వొకటి రాస్తూనే వున్నారు. కథలూ, కాకరకాయలూ, వ్యాసాలూ కొత్త కాదు. కానీ, గత అయిదారేళ్లుగా గమనిస్తే ఈ ఉరవడి పెరిగినట్టు స్పష్టమయిన ఆధారాలే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు ఆంధ్ర దేశపు తెలుగు పత్రికలలో అమెరికా తెలుగు రచయితల రచనలు ఎంత వెతికినా కనిపించేవి కావు, అవి ఎంత సేపటికీ ఏ తానా, ఆటా సావనీరుకో పరిమితమయ్యేవి. ఇప్పుడు అలా కాదు. అమెరికా తెలుగు రచయితల రచనలు చెప్పుకోదగిన స్థాయిలో కనిపిస్తున్నాయి. ప్రచురణ రంగంలో అమెరికా తెలుగు రచయితలు ఉత్సాహంగా కనిపిస్తున్నారు.
ఇక అమెరికాలోని కొన్ని పట్టణాల్లో ఎక్కడ తెలుగు సాహిత్య సభ జరిగినా కనీసం వంద మందికి తక్కువ కాకుండా హాజరవుతున్నారు. తానా, ఆటాలు నిర్వహించే సాహిత్య సభలతో పాటు, స్థానికంగా అనేక సాహిత్య సంఘాలు ఏర్పడి చురుకుగా పనిచేస్తున్నాయి. ఇవి కనీసం నెలకి వొక సభ అయినా ఠంచన్ గా నిర్వహిస్తున్నాయి. పైగా, ఈ సాహిత్య సభల్లో నలభై యేళ్ళ లోపు వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తున్నారు.
ఇక అదనంగా, అమెరికాలోని వివిధ యూనివర్శిటీలలో తెలుగు అంశాల మీద పరిశోధన చేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కొన్ని యూనివర్శిటీలలో తెలుగు కోర్సులకి ఆదరణ కూడా పెరుగుతోంది. ఒక్క టెక్సాస్ యూనివర్సిటీలోనే ఏడాదికి 30 మంది విద్యార్థులు ఈ కోర్సుల నించి గ్రాడ్యుయేట్ అవుతున్నారు. మిగిలిన యూనివర్సిటీలు కూడా తెలుగు మీద ఆసక్తి చూపిస్తున్నాయి. తెలుగు సాహిత్యం మీదనే కాకుండా, ఇతర సాంస్కృతిక అంశాల మీద మన వాళ్ళకే కాకుండా, అమెరికన్ విద్యార్ధులకి ఆసక్తి పెరుగుతోంది.
అంతర్జాలంలో తెలుగు హడావుడి చెప్పనే అక్కరలేదు. అంతర్జాల పత్రికలూ, బ్లాగులూ రోజూ కొన్ని వందల పేజీల్ని ఉత్పత్తి చేస్తున్నాయి. గతంలో సాహిత్యేతర అంశాలకే పరిమితమయిన అంతర్జాలం ఇప్పుడు సాహిత్య అంశాల మీద కూడా దృష్టి పెడుతోంది. ఈ-పత్రికలకి పోటీగా బ్లాగర్లు సాహిత్య సృష్టి చేస్తున్నారు.
ఇది ఒక రకంగా అమెరికా తెలుగు సాహిత్యం ఒక రూపం దాల్చే వాతావరణం. ఒక అభిరుచిని తీర్చి దిద్దుకునే దశ. కొత్త తరం రచయితలు కొత్త ఇతివృత్తాల వైపు మళ్లి, సాహిత్యాన్ని మార్చగలిగిన సన్నివేశం.
ఈ దశలో అమెరికా రచయితలు కొంత ఆత్మ విమర్శ కూడా చేసుకోవాలి. మారుతున్న పాఠక లోకాన్ని అవగాహన చేసుకోవాలి. అలాగే, అంతర్జాలం, అమెరికా జీవితమూ తమ సాహిత్య అభిరుచిని ఏ దిశగా తీసుకువెళ్తున్నాయో ఆలోచించుకోవాల్సిన బాధ్యత పాఠకులది కూడా.
అటు రచయితల, ఇటు పాఠకుల మధ్య వంతెన కట్టే శీర్షిక : అమెరికా తెలుగు సాహిత్యం.
ఈ శీర్షికకి ప్రసిద్ధ రచయితలే కాదు, ఇప్పుడే పుస్తకం పట్టి పాఠకులుగా మారుతున్న వారు కూడా రాయవచ్చు.
మీరు చదివిన రచన గురించో, మీరు కలిసిన రచయిత గురించో, మీరు హాజరయిన సాహిత్య సభ గురించో, మీలో కలుగుతున్న కొత్త సాహిత్య స్పందనల్ని గురించో ఏమయినా మీరు రాయవచ్చు. ఫలానాది రాయాలి, ఫలానా రాయకూడదు అన్న నిబంధన లేదు, పెద్ద రచయితలే రాయాలి అన్న నియమం అసలు లేదు. మీ రచనలు నా ఈమైలు కి పంపండి. afsartelugu@gmail.com
ప్రతి నెలా ప్రసిద్ధ అమెరికా రచయితల ముఖాముఖీ మాత్రం ఈ శీర్షికలో తప్పక వుంటుంది. వచ్చే శనివారం ప్రసిద్ధ రచయిత్రి నిడదవోలు మాలతి గారి ముఖాముఖితో ఈ శీర్షిక మొదలవుతుంది.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
0 comments:
Post a Comment