చేరన్ రుద్రమూర్తి/ వొక తీరం:మూడు మాటలు



1

కెరటమై పైకి ఎగసీ ఎగసీ

నురుగులా చనిపోయింది

నీరు.

2

ఆమె తీరం వైపు దూసుకుపోతోంది;

నేనింకా

కెరటాల్లోనే సతమతమైపోతున్నా.

3

సూర్యుణ్ణి మింగేసింది సముద్రం

చీల్చి, సూర్య రక్తాన్ని

మబ్బులమీదికి రువ్వి.

 

వొడ్డు మీద

ఆరిపోతుంది  పగలు,

నెమ్మదిగా

రాలిపడుతుంది రాత్రి.

 

ఇక కెరటాల మాట అంటావా,

అవి ఇంకా జీరాడుతూనే వున్నాయి

దిగులుగా.

(అనువాదం: అఫ్సర్)

 
Category: 0 comments

చేరన్ రుద్రమూర్తి/ సంచారం


 ఎదురెదురుగా కూర్చుంటాం
నువ్వూ నేనూ.

...
వాన రివ్వు రివ్వున దూసుకుపోతున్నప్పుడు
ఈ కిటికీలు రెక్కలవుతాయ్.

సీతాకోక చిలకలు చెదిరిపోతాయ్
ఎగిరిపోతాయ్.

పొలాలు వస్తాయి, పోతాయి.

ఇక
సముద్రం అందంగా వుంది
కొండలూ అందంగా వున్నాయి

నది కూడా భలే అందంగా వుంది.

అన్నీ
అర్థాలు వెతుక్కుంటాయ్

నీ, నా ఉనికిలోంచే!

(అనువాదం: అఫ్సర్ )
Category: 0 comments

ఎక్కడికీ వెళ్లలేని రాత్రుల ఏకాంతంలో...



(ఆవకాయ నుంచి...మిగిలే క్షణాలు-2 )

 

1

          పుస్తకాలుంటాయి. అందులో అక్షరాలూ వుంటాయి. ఉత్తరాలుంటాయి, అందులో పలకరింతలూ వుంటాయి. కానీ, వొక వ్యక్తి పరిచయం అంతటితోనే ఆగిపోదు. అప్పటి దాకా ఆ అక్షరాల్లోంచీ, ఆ పలకరింతల్లోంచీ చూసిన వ్యక్తిని కలవాలని కూడా అనిపిస్తుంది. అప్పటిదాకా కలిసి పంచుకున్న పరోక్ష అనుభవాల సందోహంలోంచి వొక ప్రత్యక్ష బంధం భిన్నమయిన అనుభవంగా మారుతుంది. దాన్ని స్నేహమో, ఆత్మీయతో, ఆత్మ బంధుత్వమో అనుకోవచ్చు. కానీ, అంతగా కలవాలని కోరుకున్న ఆ వ్యక్తిని మనం ఎప్పుడూ చూడనే లేదనుకోండి, అప్పుడెలా వుంటుంది?

          వజీర్ రహమాన్ గారిని తలచుకున్నప్పుడల్లా నన్ను ఈ దిగులు ఆవరిస్తుంది. ఆయన కన్ను మూసే సమయానికి (1983) నేనింకా కవిగా సరిగా కన్ను తెరవలేదు. కానీ, కవిత్వం చదవడం, దాన్నే మననం చేసుకుంటూ గడపడం అప్పటికే చాలా ఇష్టమయిన వ్యాపకంగా మారింది.

          ఇస్మాయిల్ గారు ఎప్పుడూ అనే వారు- “మన మధ్య బంధుత్వమూ వుంది, స్నేహమూ వుంది కానీ, అంత కంటే ఎక్కువ ఆత్మబంధుత్వం వుందని నేననుకుంటాను,” అని! వజీర్ రహమాన్ గారితో నా అనుబంధం అలాంటి ఆత్మబంధుత్వంగానే మిగిలిపోయింది చివరికి. ఇస్మాయిల్ గారితో ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆయన బెజవాడ వచ్చినప్పుడు ఖమ్మం నుంచి పనిమాలా వెళ్ళి కలవడాలూ, ఆయనతో బీసెంట్ రోడ్డులోని మోడరన్ కేఫ్ లో ఆయన హోటల్ గదిలో గంటల తరబడి కబుర్లూ, సాయంత్రాలు ఆయనకిష్టమయిన గాంధీనగర్ లోని ప్రబోధ బుక్ సెంటర్ దాకా నడకలూ..ఈ అన్ని సందర్భాల్లో ఎందుకో నాకు ఇంకో మూడో మనిషి కూడా మా పక్కన వుండే వారని నాకు అనిపించేది. ఆ మూడో మనిషి వజీర్ రహమాన్. ఇస్మాయిల్ గారి తమ్ముడు. ఇస్మాయిల్ గారి కవిత్వం పుస్తక రూపంలోకి రాక ముందే కవిగా తనదయిన దారి వెతుక్కుంటూ వెళ్లారు వజీర్.

          ఇప్పుడు వజీర్ రహమాన్ గారి గురించి తలపోసుకుంటూ వుంటే – అసలు వజీర్ ప్రస్తావన రాకుండా ఇస్మాయిల్ గారితో సంభాషణ ఎప్పుడన్నా ముగిసిందా అనుకుంటే, అలాంటి వజీర్-రహిత సంభాషణ వొక్కటి కూడా లేదని అనిపిస్తుంది. పైగా, నాకు వజీర్ మీదున్న ప్రత్యేకమయిన ఆసక్తి వల్ల ఇస్మాయిల్ గారిని కలిసిన ప్రతి సారీ వజీర్ సంగతులు మా మాటల్లో యేదో వొక విధంగా దొర్లేటట్టు నేను సంభాషణని కొంచెం దారిమళ్లిస్తూ వుండే వాణ్ని.

2

ఎక్కడి నించి మొదలెట్టాలి వజీర్ తో నా ప్రయాణం గురించి?

నిజానికి శ్రీశ్రీ మీది కోపంతో మొదలెట్టాలి. కవిత్వ అభిరుచికి సంబంధించినంత వరకూ “ఊరంతా వొక దారి అయితే, ఉలిపికట్టెది ఇంకో దారి” అన్నట్టుగా వుండేవాణ్ణి నేను మొదట్లో! (ఇప్పుడూ అంతేనేమో?) కాలేజీ రోజుల్లో విద్యార్థి రాజకీయాలతో తలమునకలుగా వుండేటప్పుడు, ప్రతి కాలేజీకి వెళ్ళి ఎప్పటికీ రాని విప్లవాల మీద ఉపన్యాసాలు దంచుకుంటూ తిరిగే కాలంలోనే మొదలయింది శ్రీశ్రీ అంటే ఈ కోపం! రాజకీయాలు ఎలా వున్నా, కవిత్వం విషయానికి వచ్చేసరికి నేను మొదటినించీ అనుభూతి పక్షపాతిని. ఏ అనుభూతీ కలిగించలేని, మిగల్చలేని కవిత్వం అనవసరం. కేవలం నినాదాలు కవిత్వం కాదు- అని అప్పటికీ, ఇప్పటికీ అనుకుంటా. ఈ కోణం నించి చూస్తే, శ్రీశ్రీ కవిత్వం – మహాప్రస్థానం, మరో ప్రస్థానం- వరకూ నాకెప్పుడూ అసంతృప్తిని మిగిల్చేవి. అప్పుడు నేను వెతుక్కున్న ప్రత్యామ్నాయాలు అజంతా, బైరాగి,  ఇస్మాయిల్, వజీర్ రహమాన్! అలా, 1963లో అచ్చయిన “ఎచటికి పోతావీ రాత్రి?” కవిత్వ పుస్తకం నాకు ఎలాగో మా జిల్లా గ్రంధాలయంలో దొరికింది.

అది చదువుతున్న సమయంలోనే ఇస్మాయిల్ గారి తమ్ముడు డాక్టర్  ఖలీల్ రహమాన్ గారు బదిలీ మీద ఖమ్మం వచ్చారు. ఆయన మా ఇంటికి దగ్గిరలోనే వుండే వారు. ప్రతి ఆదివారం డాక్టర్ గారింటికి వెళ్ళి, వాళ్ళ పిల్లలతో (నా ఈడు వాళ్ళే!) కాలక్షేపం చేయడం నాకు అలవాటు అయింది. ముఖ్యంగా, మంజూర్ రహమాన్ తో నాకు బాగా దోస్తీ కుదిరింది. అతని చెల్లి నా తమ్ముడు, ప్రముఖ కవి  ఇక్బాల్ చంద్ కి క్లాస్ మేట్. మంజూర్ కి కాస్త కవిత్వ ఆసక్తి వుండేది. అప్పుడు నేను అతన్ని కూర్చొబెట్టుకుని, వజీర్ కవిత్వం చదివేవాణ్ని. ఎచ్చటికి పోతావీ రాత్రి?” ఎక్కువగా ప్రేమ కవిత్వమే.

దేనికివన్నీ ఉత్త మాటలు

శుష్క ప్రేలాపనలు,

కోరికలేన్నయినా కానీ

దుక్ఖమయినా చెప్పలేని పిరికిని!

వాక్యాలు చదువుతున్నప్పుడు, డాక్టర్ గారు విని, నవ్వుతూ, అవి వాడి ముందు చదివి ఏం లాభం? ఏ అమ్మాయి ముందో చదివితే కనీసం ప్రేమలో పడచ్చు గానీ!” అనే వారాయన! అలా కొన్ని సార్లు మా నెత్తి మీద వొకటిచ్చుకొని, నవ్వుకుంటూ తన గదిలోకి వెళ్లిపోయే వారు. ఇస్మాయిల్ గారిలాగానే, డాక్టర్ గారికీ ఆ వొక్క  వాక్యం సైజు జోకులు కట్ చేసే అలవాటు బాగుండేది. అలాంటి సరదా చలోక్తులు విన్నప్పుడల్లా నాకు వెంటనే అనిపించేది – వజీర్ రహమాన్ గారిని కూడా చూసి వుంటే ఎంత బాగుండేది! నిజానికి దుఃఖ సన్నివేశాల కంటే ఎక్కువగా- అలాంటి చిరు జోకులు మిస్ అవుతున్నప్పుడు మనం ఆ మనుషుల్ని నిజంగా మిస్ అవుతున్నామన్న దిగులు పుడుతుంది. ఆ తరవాత కొన్ని  దుఃఖ సన్నివేశాలు కూడా తోడయి, ఆ దిగులు బెంగగా మారుతుంది.

1984 తరవాత నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో లో పని చేసే కాలంలో ప్రసిద్ధ కథకులు   కేతు విశ్వనాథ రెడ్డి గారు పరిచయ మయ్యారు. వజీర్ , కేతు వాళ్ళిద్దరూ కొంత కాలం తిరుపతిలో చదువుకునే రోజుల్లో రూమ్ మేట్లు. వాజీ గురించి ఆయన చాలా కబుర్లూ, జోకులూ చెప్పేవారు.  వాళ్ళిద్దరూ వున్న ఇరుకు గదికి వజీర్ యమ ద పిట్” అని పేరు పెట్టారట.

వజీర్ కి కవిత్వం అంటే ప్రాణమే కానీ, అంత కంటే ఎక్కువగా స్నేహితులంటే ప్రాణం. వాళ్ళతో గడపడం, వాళ్ళకి ఉత్తరాలు రాయడం ఆయనకి ఇష్టమయిన వ్యాపకంగా వుండేదట. ఫోటోగ్రఫీ ఇష్టం. అన్నిటికంటే ఎక్కువగా ఆయనకి కాలేజీలో లెక్చరర్ గా పని చేయాలన్న కోరిక వుండేదట. కానీ, జీవితం వొక్కో సారి ఎంత అన్యాయంగా వుంటుందంటే, ఆ వొక్క పని తప్పా, ఉపాధి కోసం ఆయన ఇతర అన్ని టెక్నికల్ పనులూ చేయాల్సి వచ్చింది. “ఎచటికి పోతావీ రాత్రి?” 1963లో అచ్చయ్యే నాటికి ఆయనకి 29 యేళ్ళు. అప్పటికింకా ఆయన ఉద్యోగన్వేషణ కూడా పూర్తి కాలేదు.

 

జీవితాన్ని వొక అందమయిన కళగా పూజించాలనుకున్న ఈ స్వాప్నికుడు వొక స్థిరత్వం లేక, వొక కుదురు చిక్కక సతమతమయిపోతూనే బతికాడు. ఆయనకి దక్కిన వొకే వొక్క అపురూపమయిన స్వప్నసంపద చంపక- చలం గారి కూతురు. ఆవిడని నేనెప్పుడూ చూడలేదు. కానీ, ఇస్మాయిల్ గారికీ, మాకూ బంధువయిన హబీబ్ రహమాన్ (ఇతనిదీ నా వయసే! సాఫ్ట్ వేర్ ఇంజనీరు.) ఆమెని వొక సారి చూశాడట. కాకినాడలో వాళ్ళ ఇల్లు ఇస్మాయిల్ గారి ఇంటికి తరవాతి సందులో వుండేది. నేను ఇస్మాయిల్ గారి కోసం కాకినాడ వెళ్లినప్పుడు హబీబ్ ఇంట్లోనే ఎక్కువ వుండే వాణ్ని.  హబీబ్ చంపక గారితో మాట్లాడడానికి వెళ్ళిన రోజు గురించి చాలా సార్లు చెప్పేవాడు. “వొక రోజు నేను వెళ్ళేసరికి బాబాయ్ గారి ఇల్లు చాలా సందడిగా వుంది. నేను బయట రియాజ్ (ఇస్మాయిల్ గారి అబ్బాయి, ఇతను మాట్లాడ్డమే చాలా పోయేటిక్ గా మాట్లాడే వాడు)తో మాట్లాడుతూ కూర్చొని వున్నా. ఇంతలో ఇంట్లో నించి వొక నవ్వుల జలపాతం వురుక్కుంటూ మా ముందు దూకి వెళ్ళిపోయినట్టనిపించింది. రియాజ్ అన్నాడట- “నయాగరా నిన్ను తడిపివెళ్ళినట్టుందా?  ఆ నవ్వు చంపక గారిది. వజీర్ బాబాయ్ భార్య.”

నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వజీర్ గానీ, చంపక గారు గానీ, చాలా అరుదుగా ఇల్లు వదిలి ఇంకో చోటికి వెళ్ళే వారు. ఇస్మాయిల్ గారింటికి కూడా పెద్దగా రాకపోకలు వుండేవి కావు. చలం అనే మహాచెట్టు కింద వొదిగిపోయిన తరవాత వజీర్ కి ఇంకే లోకమూ అక్కరలేకపోయింది. వజీర్ ఇలా చెప్పుకున్నాడు 1963లోనే:

అవును,

నా కవిత్వ సాధనలో చరణ చరణమూ

అతని ప్రభావం, పర్యవేక్షణా.

నా జీవితంలో నిమిష నిమిషమూ

అతని రక్షణ హస్తం, ప్రోత్సాహం నాకు.

అతనిచ్చిన బలంతోనే

చూపిన అతని తోవ వెంటనే

ఈ నడక నాకీ నాడు –

మధురానంద కవితాకాశంలోనూ

దుర్గమ జీవన కీకారణ్యంలోనూ.

చలం చాలా మందిని ప్రభావితం చేసిన గొప్ప శక్తి. అనుమానమే లేదు. కానీ, వజీర్ దగ్గిరకి వచ్చేసరికి చలమే ఈశ్వరుడు. ఇలా ఆలోచించడం సరికాదని నాకూ తెలుసు కానీ, వొక దశలో చలం నీడ వదులుకొని వుంటే, వజీర్ ఇంకో దారి పక్కన ఇంకో పూల చెట్టుగా అందంగా నిలబడి వుండే వాడేమో! చలం వొడిలో అతనొక మొక్కగా మాత్రమే మిగిలిపోయాడేమో! కానీ, ఇది జీవితం కదా! అలా అనుకోనిస్తుందా జీవితం?! ఎవరి దిగుళ్లు, ఎవరి సంతోషాలు ఎలా వుండాలో వాళ్ళకే తెలిసినంతగా మనకి తెలియదుగా!

అంత మహావృక్షం నీడలో కూడా వజీర్ 1963 కవిత్వం నించి 1983 నాటి “సాహసి”దాకా వొక అందమయిన continuity ని సాధించాడు. వజీర్ కవిత్వం మీద పరిశోధన చేసిన నా తమ్ముడు ఇక్బాల్ చంద్ మొన్న అంటున్నాడు: నా దృష్టిలో జీవితాన్ని కవిత్వంలోకి కుదించడం కంటే కవిత్వంగా జీవించడం బాగుంటుంది. వజీర్ అలా కవిత్వంగా జీవించారు. అలా జీవించడం ద్వారా కవులు షరా మామూలుగా బతికే మోసపూరిత జీవనాన్ని ఆయన తిరస్కరించాడు. అందుకే, చివరి వాక్యం దాకా వజీర్ లో ఆ తీవ్రత, ఆ జీవన లాలస!”

3

కవిత్వం విలువ ఎప్పుడు అర్థమవుతుందంటే, ఆ కవిత్వ పంక్తులు కొన్ని సీదా మన జీవితాల్లోకి దారి వెతుక్కున్నప్పుడు – అంటే – ఆ వాక్యాలు మననం చేసుకునే సందర్భాలు మన జీవితాల్లో దొరికి, వాటిని మనం తిరిగి చదువుకున్నప్పుడు! అంటే, అనుభవమే కవిత్వానికి కోటబిలిటీ ఇచ్చినప్పుడు! వొక గాఢమయిన అనుభవం తట్టి పలకరించినప్పుడల్లా ఆ వాక్యాలు మనల్ని ముసురుకుంటాయి.

వజీర్  కవిత్వంలో అలాంటి కోటబిలిటీకి కరువు లేదు.

వజీర్ కవిత్వం అప్పుడే కాదు, ఇప్పుడు చదివినా కొన్ని పంక్తులు మన కోసమే రాసిపెట్టినట్టు అనిపిస్తుంది. వొక స్నేహితుడు వెళ్తూ వెళ్తూ మన కోసం కొన్ని వుత్తరాలూ, వాటిల్లో కొన్ని మాటలూ మిగిల్చి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. వ్యక్తిగతంగా నాకు వజీర్ రాసిన కొన్ని కవితలతో ఆత్మీయ బంధం వుంది.  నాలోపలి  జీవితాన్ని వెలిగించిన కల్పనతో కలిసి చదువుతున్నప్పుడు వాటి లోతయిన అర్థాలు బాగా తెలిసి వచ్చాయి.  మా దగ్గిర వున్న వజీర్ పుస్తకం చిరిగి శిధిలావస్థలో వున్న స్థితిలో , అందులో  కొన్ని కవితల్ని కల్పన తన చేరాతతో రాసి దాచిపెట్టుకుంది కూడా!

వజీర్ ని తలచుకున్నప్పుడల్లా అతనే రాసుకున్న వొక పంక్తి నాకు భలే గుర్తొస్తుంది:

ఇదేం లేదనుకో

మర్చిపో

నేనేం కాదనుకో

రాలేదనుకో

అని వారిస్తావు కాని,

నువ్వు లేని నన్ను

వూహించడమే

భరింపరాని బాధయి

నేనెట్లా మరవగలను?

 

నీ ఆలోచనే చాలు,

నా నరాలు తిరగబడి

బాధతో పదునెక్కి

ప్రేమతో, మోహంతో

మధుర జ్నాపకాలతో

రౌద్ర సముద్రుడి వలె

విలవిలలాడిపోతాను.

వొక్కో సారి మనకి బాగా ఇష్టమయిన కవి హటాత్ నిష్క్రమణ అనిపించేది అదే కదా! వొక్కటే వూరడింపు ఏమిటంటే ఆ అక్షరాలు మిగిలి వుంటాయి వెచ్చగా!

*

 

 

 

 

 
Category: 3 comments

వుంటే, సరే!


సురయా అంటేనే నక్షత్ర సమూహం. నాకు వొకప్పుడు ఆకాశమూ, చంద్రమా, నక్షత్ర గోళం అంతా సురయానే!

ఇవాళ ఎందుకో జయశ్రీ నాయుడు Jayashree Naiduనాకెంతో ప్రాణమయిన సురయాని గుర్తు చేశారు.   ఎట్లా మరచిపోతాను సురయాని? నన్ను నా బాల్యంలోకీ, నా యవ్వనంలోకీ విసిరిసిరి కొట్టే ఆ పాటల హోరుని?!



ఇంకో చోటికి...
...

వెనక్కి రాదు
దూరాల సొరంగంలోకి
జారిపోయాక, రైలు.

కాసేపే
ఇక్కడి యీ వెతుకులాటలూ బతుకుపాటలూ
ఎదురుచూపులూ తలపోతలూ
చివరి ఎడబాటు దాకా.

వస్తున్నప్పుడు ఎంత అలజడి!
రైలు .. రైలు .. హమారీ ఘర్‌కీ రైల్‌ .

ప్లాట్‌ఫారమ్మీద పిల్లల ఏడుపులూ
ఎదురుచూపు కొసన పెనవేసుకునే ఒత్తిళ్ళూ.
విడిపోయేటప్పటి మౌనానికి
ఏదో వొక భాషనివ్వు .. ఏదో వొక సంకేతాన్నివ్వు
కన్నీళ్ళు తప్ప.

మరణం కూడా అంతేనా?
దేహం వొక భాష. వొక గుర్తు.

దూరంగా మబ్బుపొరమీద పగిలిపోతుంది పాట
చూపుపొలిమేర దాటి మలుపు తిరిగే రైలుబండిలానే.
చివరాఖరి రైలుకూత గుండెలోకి దూసుకుపోతుంది.
రాత్రీపగళ్ళూ దగ్గరికొస్తూ దూరమవుతూ
అదే కూత … లోపల.

దీనికి మందు లేదు, సురయా!
నువ్వేదో పాడుకుని వెళ్ళిపోయావు కానీ
దీనికి భాష లేదు.

యీ గదిలోంచి ఆ గదిలోకి వెళ్ళినంత తేలిక.
వొక మౌనంలోంచి యింకో మౌనంలోకి
వొక నిద్రలోంచి యింకో నిద్రలోకి.

బతుకు, వొక దిల్లగీ.
ఎక్కడాలేని వూరికి గాలిరైల్లో ప్రయాణం.

పోనీలే, సురయా!

కాస్త ప్రేమా, కాస్త స్నేహమూ
కాస్త సంతోషమూ … నీకోసమే వీచే గాలీ
నీ వెంటే నడిచే ఆకాశమూ
నిన్ను మాత్రమే పాడే పాటా
చిటికెన వేలు వొదలని నీడా
అక్కడైనా వుంటాయంటావా?
వుంటే, సరే!
Category: 7 comments

మిగిలే క్షణాలు-1 : పూవు క్షణికమే...పరిమళం 'సదా'

 
 
 
 
కొన్ని మరణాల్ని కనీసం ఊహించలేను నేను!
 
అలాంటి ఉద్వేగంలో అసలేం మాట్లాడాలో కూడా తెలియదు.
 
పోయిన ఎండాకాలం సదాశివ గారు చనిపోయారన్న వార్త విన్న రోజున నేను ఖమ్మంలో అనారోగ్యంతో ఆసుపత్రిలో వున్నాను. సూఫీ యాత్రస్థలాల్లో కాళ్ళరిగేలా తిరిగీ తిరిగీ ఖమ్మం చేరుకుని అనారోగ్యం పాలయ్యాను. ఆ క్షణాన ఆంధ్రజ్యోతితో సహా వివిధ టీవీ చానల్స్ వాళ్ళు అనేక సార్లు ఫోన్ చేసి, సదాశివ గారి గురించి కనీసం రెండు ముక్కలు చెప్పండి అని అడిగారు. ఏం చెప్పాలి? అసలు ఆ వార్త నేను నమ్మలేని స్థితిలో వున్నా. మౌనం ఒక్కటే సమాధానం! “ఇప్పుడు మాట్లాడలేను” అని మరో సమాధానం.
1
 
సదాశివ గారికి నేను కౌముది గారి కొడుకుగానే చాలా కాలం తెలుసు.
 
దానికి కారణం మేమిద్దరం మొదటి సారి కలుసుకుంది నేను ఖమ్మంలో ఎనిమిదో తరగతి చదువుతున్నప్పుడు! కానీ, తరవాతి కాలంలో మేమిద్దరం ఎంత దగ్గరయ్యామంటే, 2005లో ఆయన రాసుకున్న “యాది”లో మా నాన్నగారి గురించి రాయడానికి ఆయన “నేటి సుప్రసిద్ధ తెలుగు కవి అఫ్సర్ తండ్రి” అని పరిచయం చేశారు. మా ఇద్దరి మధ్యా పెనవేసుకున్న ఆత్మీయతకి వయః భేదం లేదు.
 
నేను హైదరబాద్ లో పనిచేస్తున్న కాలంలో సీతాఫల్ మండిలో వొక మారుమూల చిన్న గదిలో వుంటున్నప్పుడు కూడా సదాశివ గారు ఆ గదికి వచ్చి, గంటల తరబడి మాట్లాడుతూ కూర్చునే వారు. సాహిత్యం , సంగీతం తప్ప ఇంకో లోకం వుందా సదాశివ గారికి? అనుకునే వాణ్ని. నిజంగానే ఆయనకి ఇంకో లోకం తెలియదు. ఆయన మాతృ భాష ఉర్దూ కాదు, కానీ ఉర్దూ ఆయన ఊపిరి. ఆ భాష లేకపోతే అసలు ఆయన ఉనికి ఎలా వుండేదా అని అనుకుంటాను వొక్క సారి! ఆయన గాయకుడు కాదు, కానీ సంగీతం ఆయన ప్రాణం! అదీ...హిందూస్తానీ! ఇలాంటి అభిరుచి ఎలా పుట్టిందో వొక పెద్ద ప్రశ్న అయితే, అసలు ఆ రెండు లోకాలూ పట్టని చోట బతుకుతూ ఆ రెండీటీని అంటిపెట్టుకొని వుండడం ఆయనకి ఎలా సాధ్యమయిందన్నది పెద్ద ప్రశ్న. ఎప్పటికప్పుడు సమాజం ఆమోద ముద్ర వేసిన రంగాలే మనల్ని శాసించే కాలంలో సదాశివ గారిని ఎలా అర్థం చేసుకోవాలి? వీటన్నీటికి మించి, ఆయన సంస్కారం!
 
“ఛలో అఫ్సర్ సాబ్, మనిద్దరం కలిసి వొక కప్పు చాయ్ తాగాలి!” అని ఆయన మాటల మధ్యలో అంటున్నప్పుడు
 
“మీరు నన్ను సాబ్ అనడమేమిటి? నన్ను చడ్డీల్లో వున్నప్పటి నించీ చూశారు.” అన్నాన్నేను వొక సారి.
ఆయన వెంటనే, “సాబ్ అన్నది నీ వయసు కోసం కాదు. నీ ఆలోచనల్లో నువ్వు చూపిస్తున్న పరిణతికి!” అనేశారు చప్పున - సదాశివ గారితో మాట్లాడ్డం అంటే, కేవలం వొక రచయితతో మాట్లాడ్డం కాదు. సంస్కారంలో ఎప్పటికప్పుడు కొత్త పాఠాలు నేర్చుకోవడం!

2
 
సదాశివగారిని మొదటి సారి చూసినప్పుడు అప్పుడప్పుడే నేను టీనేజ్ లోకి ప్రవేశిస్తున్నా.
 
ఖమ్మంలో నర్సింహ స్వామి గుట్టకి వెళ్ళే దారిలో ప్రసిద్ధ రచయిత హీరాలాల్ మోరియా గారి ఇంట్లో మేము అద్దెకి వున్న కాలం. ఆ ఇంట్లో రెండు గదులే వున్నా, పెద్ద ఆవరణ వుండేది. ఆ ఆవరణలో నేను, మా చెల్లి నుస్రత్ చిన్న సైజు పొలం పనులు చేసే వాళ్ళం. ఒక డజను టమాటా, ఇంకో డజను బెండకాయ, వొక డజను వంకాయ, కొత్తిమీర మొక్కలు వేసి బడి నించి రాగానే ఆ తోటపనిలో వుండే వాళ్ళం. నాకు మొక్క జొన్న పొత్తులు అంటే చచ్చేంత ఇష్టం. ఎనిమిదో తరగతి ఎండాకాలం సెలవుల్లో మేం వరైటీగా మొక్కజొన్న వేశాం. చూస్తూండగానే అవి పొట్ట వేసి, పొత్తులయ్యాయి.
 
అలాంటి రోజుల్లో మొదటి సారి మా ఇంటికి వచ్చారు సదాశివగారు.
ఆయన వచ్చీ రాగానే ఆయనకో సలాం కొట్టి, బొగ్గు కుంపటి రాజేశాను. అమ్మ ఆయన కోసం టీ చేసే లోపు వొక మొక్కజొన్న పొత్తు ఆయనకి వేడివేడిగా అందించాను. ఆయన ఎంత సంబరపడిపోయారో చెప్పలేను.
“అఫ్సర్, నువ్వు షాయరీ చదువుతున్నావా?” అని ఆయన అడిగిన మొదటి ప్రశ్న. నేను సమాధానం చెప్పేలోగానే నాన్నగారు పెద్దగా నవ్వి, “వాడు షాయరీ కంటే ఎక్కువ ప్రయోజనకరమయిన పనులు చేస్తున్నాడు, తోట పని! వాడు అక్షర సేద్యం కాదు, నిజం వ్యవసాయం చేస్తాడట”
 
నేను తోటపనిలో ఎక్కువ సమయం వృధా చేస్తున్నానని అప్పటికే నాన్నగారికి లోపల కోపంగా వుండేది కాస్త!
“ఏం పర్లేదు బేటా, ఇప్పుడు తోటపనిలోంచి కవిత్వంలోకి మళ్ళావనుకో, నీకు కవిత్వ రహస్యాలు మీ అబ్బాజాన్ కంటే ఎక్కువ అర్థమవుతాయ్!” అని నన్ను దగ్గిరకి లాక్కుని నా తల మీద జుట్టుని చేతుల్తో బుజ్జగించారు. ఆ రోజు ఆయన నాన్నగారికి “ఫారసీ కవుల ప్రసక్తి” అనే పుస్తకం కానుకగా ఇచ్చి వెళ్లారు. వెళ్తూ, వెళ్తూ “ఇది అబ్బా జాన్ కే కాదు, నీకు కూడా! ఇప్పుడు కాదనుకో, కొన్నాళ్లు ఆగి చదివితే అర్థమవుతుంది!” అన్నారాయన.
కొన్నాళ్లు ఆగు అని ఎవరయినా అంటే, ఆ టీనేజీలో వెంటనే రోషం పుట్టుకొచ్చేది. ఆ రోషంతో ఆ రాత్రి మొదటి సారి సదాశివ గారి పుస్తకం చదివాను. ఏం అర్థమవుతోందన్న ప్రశ్నకి సమాధానమేమీ ఇచ్చుకోకుండా మొదటి పేజీ నించి చివరి పేజీ దాకా చదివేశా మొండిగా.
 
అందులో నా గొప్పతనం కానీ, మొండితనం కానీ ఏమీ లేవు. అది కేవలం సదాశివ గారి వచనంలోని వేగం. ఈ పుస్తకంలో కవిత్వం కంటే ఎక్కువగా కవుల జీవితాల్లోని ఆసక్తికరమయిన కథలుంటాయి. ఫారసీ కవులు చాలా మంది సూఫీలే! వొక కథ ఇప్పటికీ నాకు గుర్తుంది.వొక ముస్లిం పండగ పూట బాధపడుతూ కూర్చున్నాడట. “మసీదుకు వెళ్దామంటే కాళ్ళకి చెప్పుల్లేవు. కొందామంటే డబ్బుల్లేవు. దేవునికి తన మీద దయ లేదనుకున్నాడు అతను. సరే, ఏదయితే అదే అనుకుని, మసీదుకి వెళ్ళాడు. మసీదు మెట్ల మీద వొక బిచ్చగాడు కూర్చొని వున్నాడు. అతనికి కాళ్ళు లేవు. ఆ ముస్లిం మరీ బాధపడ్డాడు. కానీ, ఇంతలోనే “ దేవుడు నిజంగా నా మీద దయచూపించాడు. చెప్పులు లేకుంటే మానే...కాళ్ళయితే వున్నవి.” అనుకోని నమాజ్ చదువుకుని తృప్తిగా వెనుదిరిగాడట.
 
ఈ పుస్తకంలోని చాలా కథలు చాలా కాలం నేను నా స్నేహితులకి చెప్పే వాడిని. నేను చదివిన మంచి పుస్తకం నా స్నేహితులూ నలుగురూ చదివి తీరాలని అనుకునే వాడిని. వాళ్ళతో పనిమాలా చదివించే వాడిని. సదాశివ గారి రచనలు ఎక్కడ కనిపిస్తే అక్కడ చదవడం, వాటి మీద దోస్తులతో ముచ్చట్లు..కొద్దికాలం ఆ హవా నడిచింది.
 
ఆ క్రమంలో సదాశివ గారి ఇతర పుస్తకాల కోసం గాలింపు మొదలుపెట్టాను. ఆయన అనువాదం చేసిన “ఉర్దూ సాహిత్య చరిత్ర” చదివాను. అది ఆ వయసులో బాగా కష్టమయిన పుస్తకం నాకు. కానీ, చివరి దాకా వదలకుండా చదివాను. ముఖ్యంగా అందులో వున్న గజల్ పంక్తులు బట్టీ కొట్టడం మొదలెట్టాను. అది చదివాక ఇంకో సారి సదాశివ గారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు నేను తొమ్మిదో తరగతిలోకి వచ్చాను. “పుస్తకం అంతా సరళంగా రాశారు. గజల్ అనువాదాలు మాత్రం కష్టమయిన తెలుగులో రాశారు. “ అన్నాను. ఆ రోజుల్లో అట్లా ఎవరినయినా ముఖమ్మీద అనేయడం నాకు అలవాటుగా వుండేది.
 
“ఏదీ వొక ఉదాహరణ చెప్పు!” అన్నారాయన. నేను పుస్తకం తీసి, అయిదారు గజల్స్ అనువాదాలు చూపించాను. “అవి సరళంగా రాస్తే వాటి ప్రభావం తగ్గుతుందా?” అని అడిగాను.
 
అలా సూటిగా మాట్లాడే వాళ్ళంటే ఆయనకీ ఇష్టమే! “కౌముదీ సాబ్, మీ వాడు మంచి విమర్శకుడవుతాడయ్యా!” అని నవ్వి, నా వేపు తిరిగి “ నువ్వన్నది నిజమే బేటా! షాయరీ అనగానే అది గంభీరంగా వుండాలనుకుంటాం. అది పొరపాటు! ఈ సారి సరళంగా తర్జుమా చేస్తా నీ కోసం!” అన్నారు.
 
తొలి సంభాషణలు కాబట్టి అవి నాకు బాగా గుర్తుండిపోయాయ్. కానీ, తరవాత సదాశివ గారిని ఎన్ని సార్లు కలిశానో లెక్క లేదు. కలిసిన ప్రతి సారీ ఆయన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పడం, లేదా ఆయనే నా కోసం కొన్ని పుస్తకాలు పట్టుకు రావడం. అవి నేను చదవడం, ఆయనతో మాట్లాడ్డం...సంభాషణ అనేది ఎంత అందమయిన అనుభూతో ఆయన చెప్పక చెప్పేవారని అనిపించేది ఆ తొలియవ్వనంలో...
 
సదాశివ గారు రాసిన పుస్తకాలల్లో ఎంత నేర్చుకున్నానో, ఈ సంభాషణల్లో అంత నేర్చుకున్నానన్న తృప్తి ఇప్పటికీ వుంది నాకు. .
ఆయనలో ఆ మనుషుల్ని వెతుక్కుంటూ వెళ్ళే అన్వేషణ కూడా నాకు బాగా నచ్చేది. మా ఇద్దరికీ మధ్య వున్న వయసు దృష్టితోనో, చదువుల తారతమ్యమో చూస్తే ఆయనకి నన్ను వెతుక్కుంటూ రావలసిన అవసరం లేదు. నిజానికి కొన్ని సందర్భాల్లో ఆయన్ని నేను బాగా నిరాశపరిచాను కూడా! ముఖ్యంగా ఆయన నన్ను ఉర్దూలో రాయమని ఎంత ప్రోత్సహించారో చెప్పలేను. “నీకున్న భావనాశక్తికి ఉర్దూ భాష నిజంగా తగిన భాష. అచ్చంగా కవిత్వ భాష అంటే ఉర్దూనే!” అనే వారు. కానీ, ఉర్దూ సాహిత్యం మీద నాకు ఆసక్తి వున్న మాట నిజమే కానీ, అందులో రాయగలగిన శక్తి అవతల పెడితే, తెలుగుతో పోల్చినప్పుడు ఉర్దూ – ఈ మాట కటువుగా అనిపించినా- పరాయీ అనే అనిపించేది.

3

2006లో మేం ఇండియా వెళ్లినప్పుడు, వెళ్ళిన వారం రోజులకే సదాశివ గారి ఫోన్. నిజానికి అప్పటికింకా ఆయనకి ఫోన్ చేసి మాట్లాడాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు. ఆయనే ఫోన్ చేసే సరికి సిగ్గనిపించింది.
 
“అఫ్సర్ సాబ్, మొత్తానికి దొరికారు. ఏమిటి మీరు కూడా గడ్డం పెంచుకు తిరుగుతున్నారా?”
“అదేమిటి? నేను గడ్డం పెంచుకోవడం దేనికి?” అన్నాను నేను ఆయనేం మాట్లాడుతున్నారో అర్థం కాక.
“తెలీదా మీకు, ముస్లిం రచయితలు కుర్రాళ్ళు ముస్లిం అనిపించుకోవడానికి గడ్డాలు పెంచుకు తిరుగుతున్నారు కదా!”
నిజానికి ఆ కొత్త మార్పు అప్పటికి నాకు తెలీదు. కానీ, పీర్ల పండగకి సంబంధించిన కథలు సేకరించడానికి నేను వూళ్లలో తిరగడం మొదలెట్టినప్పుడు అర్థమయింది ఆయన మాటల అంతరార్ధం. ముస్లిం సంస్కరణ వాదం నిజంగానే ఎక్కువగా పనిచేస్తోంది ఆ పట్టణాల్లో! ఆ వూళ్ళన్నీ తిరుగుతూ నేను ఆదిలాబాద్ వెళ్ళాను. అప్పుడు సదాశివ గారిని చాలా కాలం తరవాత చూశాను. అప్పుడు వొక పూట అంతా మేము అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూనే వున్నాం. ఎన్ని గంటలు దొర్లిపోయాయో కనీసం గడియారం వేపు చూపు మళ్లలేదు.
 
అప్పటికే నేను ఆయన్ని చూసి పదిహేనేళ్ళయింది. ఆయన నా ముఖం తన అరచేతుల మధ్యకి తీసుకొని, “ఇప్పుడు మిమ్మల్ని ‘నిన్ను’ అని పొరపాటున కూడా అనలేను, అఫ్సర్ సాబ్!” అన్నారు. అంతకు ముందు జరిగిన సంభాషణలన్నీ వొక ఎత్తు అయితే, ఈ సంభాషణ వొక్కటే వొక ఎత్తు నా యాదిలో. ఆ రోజు ఎందుకో ఆయన కైఫీ అజ్మీని బాగా తలచుకున్నారు. అసలు సంభాషణే కైఫీ గజల్ తో మొదలయ్యింది.
 
‘నేను వెతుక్కుంటున్న ప్రపంచం దొరకడం లేదు
నేను వెతుక్కుంటున్న కొత్త ఆకాశం దొరకడం లేదు
కొత్త ప్రపంచం, కొత్త ఆకాశం దొరికినా
కొత్త మానవుని ఆచూకీ దొరకడం లేదు.
 
“అఫ్సర్ సాబ్, ఇప్పుడు నేనేం మాట్లాడినా ఫిర్యాదులు చేస్తున్నట్టే వుంటుంది. నిజానికి నాకు ఈ లోకం మీద ఫిర్యాదులే ఎక్కువున్నాయి. ఒక తృప్తి లేకుండా పోయింది, మనుషుల్లో!”
 
ఆయన ఆ మాట అన్నప్పుడు నాకు ఫారసీ కవుల ప్రసక్తిలో చదివిన మసీదూ- చెప్పుల కథ గుర్తొచ్చింది. ఆ చిన్న కథ ఆయనకి గుర్తు చేశాను.
 
ఆ రోజు ఆయన అన్న మాటల్లో ఇవి కొన్ని మాత్రమే:
 
“హిందువులు- ముస్లింలు అన్న తేడా ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ- అది తెలుగు ఉర్దూ అన్న తేడాగా కూడా కనిపిస్తోంది. ఉర్దూ ముస్లింల భాష మాత్రమే అని దాన్ని వొక మతానికి అంటగట్టి మాట్లాడినప్పుడల్లా నేను తల్లడిల్లిపోతాను. ‘బేచెయిన్’ అయిపోతాను.”
“షాయరీ అన్నది మనసులోపల వున్న తేడాల్ని తొలగించాలి. కానీ, షాయరీ పేరుతో మళ్ళీ గోడలు కడ్తారేమిటి?”
“అసలు ప్రేమా, దుఖఃమూ, సంతోషమూ ఏవొక్క భావమూ తాజాగా మిగలడం లేదు. అన్నీటి మీదా రాజకీయ సంతకాలు పడుతున్నాయి.”
చాయ్ చాయ్ తాగుతూ కొన్ని గంటల తరబడి సాగిన సంభాషణలో సదాశివ గారి దిగులు ఏమిటో నాకు అర్థమవుతూనే వుంది. కానీ, సమాధానం ఏముంది నా దగ్గిర అప్పుడయినా, ఇప్పుడయినా?
అదే మా చివరి సంభాషణ అవుతుందని ఆ రోజు ఊహించలేకపోయాను. ఆయన నోటి వెంటే నేను గతంలో అనేక సార్లు విని వున్న ఈ వొక్క మీర్ గజల్ మాత్రం నా లోపల ఇప్పుడు మూగగా రోదిస్తోంది.
 
“సరానే మీర్ కే ఆహిస్తా బోలో
అభీ తక్ రోతే రోతే సొగయా హై!”
 
“మీర్ సమాధి తలాపున నెమ్మదిగా మాట్లాడండి. ఏడ్చి ఏడ్చి ఇప్పుడే నిద్రించాడు.”
Category: 3 comments

"ఆవకాయ"లో "మిగిలే క్షణాలు"

వంతెనలు చాలా అవసరం. వంతెనల్లేని సమాజాన్ని ఊహించలేం. ఆ గట్టునూ, ఈ గట్టునూ ఏకకాలంలో పలకరించగలిగే ఆత్మీయబంధువది. అంతేనా, గట్టుల్ని చీలుస్తూ పారే నదిని సాదరంగా వెళ్ళనిస్తుంది. కొండకచో దాని ఉద్దృతిని ఆపివుంచి ప్రమాదాల్ని నివారిస్తుంది కూడా. తెలుగు సాహిత్యసీమలో కొన్ని వంతెనలున్నాయి. ఉదాహరణకు - అఫ్సర్, ఇక్బాల్‍చంద్, ముకుందరామారావు మొదలైనవారు. గిరీశంతో మాట్లాడ్డమే ఎడ్యుకేషన్ కాగలిగినప్పుడు, ఈ సాహిత్యకారులతో మాట్లాడ్డం పోస్ట్ గ్రాడ్యుయేషనే! "ఆ పూట మున్నేరు పాడలేదు!" అని మొదలు పెట్టి దాశరథి, ఆరుద్ర, అజంతాలతో తమ అనుభవాల్ని పంచుకున్న అఫ్సర్ గారు "ఓ పాట జ్ఞాపకం" వద్దకు వచ్చి కించిత్తు విశ్రాంతి తీసుకున్నారు. నేడు మళ్ళీ ఈ వ్యాసం ద్వారా ప్రముఖ ఉర్దూ పండితుడు, హిందుస్తానీ సంగీతంలో లోతైన పాండిత్యంగల సామల సదాశివ గారి తలపుల్తో మళ్ళీ మీ ముందుకు వస్తున్నారు అఫ్సర్‍. ఆలోచనల్ని రేకెత్తించడమే గాక కొన్నిసార్లు ఆలోచనాతీతమైన హృదయపంజర బంధితాలైన గురుతుల్ని అలా ఉన్నపళాన నెమరువేసుకోవడంలో ఓ విషాదంలాంటి సుఖముంది. సదాశివగారి పై అఫ్సర్ గారు వ్రాసిన ఆ నాలుగు మాటలూ పాఠకులను ఈ అనుభూతికే గురిచేస్తాయి. కొత్త తరానికి అలనాటి దిగ్గజాల్ని పరిచయం చేయిస్తున్న సాహిత్యవారధి అఫ్సర్ గారు తమ వ్యాసాల్ని ప్రచురించే అవకాశం ఆవకాయ.కామ్‍కు ఇచ్చినందుకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్సులతో... ఆవకాయ.కామ్ బృందం
Category: 3 comments

వెల్చేరు “కన్యాశుల్కం” : మంచి అనువాదానికి భాష, దృక్కోణం రెండు కళ్ళు!

“కేవలం ఈ నాటకం మళ్ళీ చదవడం కోసమయినా మరో సారి ఈ కోర్సు తీసుకుంటాను. నా స్నేహితులందరికీ ఈ నాటకం చదివే అనుభవం కోసమయినా ఈ కోర్సు తీసుకోమని చెప్తాను. ఈ నాటకం చదవడం వల్ల ఆధునికతకి వున్న ప్రాంతీయ కోణం ఏమిటో నాకు తెలిసి వచ్చింది. ఇంగ్లీషు – అమెరికన్ సాహిత్య సంస్కృతుల్లోంచి మాత్రమే తెరుచుకున్న నా కంటికి ఇది కొత్త చూపునిచ్చింది,” అని కేస్లీ బాక్స్ అనే వొక అమెరికన్ అండర్ గ్రాడుయేట్ విద్యార్థిని గురజాడ “కన్యాశుల్కం” అనువాదం “గర్ల్స్ ఫర్ సేల్” చదివాక తన ప్రతిస్పందనగా రాసింది. ఆ స్పూర్తితో ఆ అమ్మాయి నాతో మూడేళ్ళ పాటు తెలుగు భాష కూడా నేర్చుకుంది.

తెలుగు భాషతో పాటు, టెక్సాస్ యూనివర్సిటీలో దక్షిణాసియా సాహిత్యం మీద ప్రతి ఏడాది రెండు కోర్సులు చెప్పాలని మా శాఖ అడిగినప్పుడు ఎంతో కొంత తెలుగు సాహిత్య అనువాదాలని కూడా ప్రవేశ పెట్టాలని అనుకున్నాను. అట్లా అనుకోవడం తేలికే గాని, దాన్ని ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదని నెమ్మదిగా అనుభవమయ్యింది. మిగిలిన దక్షిణాసియా భాషల నించి అనువాదాలు ఎంపిక చేసుకోవడం నాకు పెద్ద కష్టం కాలేదు. కానీ, తెలుగు అనువాదాల విషయంలో అది చాలా కష్టమయ్యింది.

దక్షిణాసియా సాహిత్యం అనగానే హిందీ, ఉర్దూ, బంగ్లా సాహిత్యాల అనువాదాలు మాత్రమే ఎక్కువగా వాడడం ఇక్కడి విశ్వవిద్యాలయాలలో ఆనవాయితీ. ఆ భాషల నించి ఎక్కువ మంది పరిశోధకులు రావడం వల్లా, ఆ భాషలలొ అందుబాటులో వున్న విస్తారమయిన అనువాదాల వల్ల, దక్షిణాసియా అనగానే ఆ మూడు భాషలు మాత్రమే అన్న అభిప్రాయం ఇక్కడి యూనివర్శిటీలలో బలంగా నాటుకుపోయింది. దీనికి భిన్నంగా కొంత దక్షిణ భారత సాహిత్యాన్ని, మరీ ముఖ్యంగా తెలుగు సాహిత్యాన్ని అనువాదాల రూపంలో అయినా విద్యార్థుల చేత చదివించాలన్నది నా పట్టుదల. దీనికి మొదటి అడ్డంకి: తెలుగు నుంచి ఇంగ్లీషులోకి తగినన్ని మంచి అనువాదాలు లేకపోవడం; రెండో అడ్డంకి: అనువాదాలు వున్నా అవి ప్రపంచ పటం మీద నిలబెట్టినప్పుడు వాటి గురించి ఎట్లా వివరించడం అన్నది. అంటే, మంచి అనువాదం వున్నంత మాత్రాన్న సరిపోదు, ఆ రచన వొక ప్రాంతంలో గొప్పదే అయినప్పటికీ, ప్రపంచ సాహిత్య పటం మీద దాని స్థానాన్ని ఎట్లా చర్చించాలన్నది కూడా ముఖ్యం. అంటే, వొక విధంగా అది మంచి అనువాదం అయినంత మాత్రాన్నే సరిపోదు, అది ఏ వాదనతో రచనారూపం పొందిందన్నది కూడా అవసరమే. మౌలికంగా అది మంచి అనువాదం అయితే తప్ప, ఆ అనువాదం చుట్టూ అనువాదకుల వ్యాఖ్యానాలకి ఆట్టే విలువ వుండదు. క్లుప్తంగా చెప్పాలంటే, మంచి అనువాదానికి భాష వొక కన్ను, దృక్కోణం రెండో కన్ను. అందునా, పరదేశంలో పరభాషా విద్యార్థులకి పాఠాలు చెప్పే సాహిత్య అధ్యాపకుడిగా నా మటుకు నాకు ఆ అనువాదంలోని ఇంగ్లీషు చాలా ముఖ్యం. అనువాదంలో ఎట్లాంటి ఇంగ్లీషు వాడారు, ఆ ఇంగ్లీషు ఎంత వరకు ఇక్కడి విద్యార్థులకి అర్థమవుతుందన్నది వొక విషయమయితే, అది అనువాదం అనిపించక స్వంతంత్ర రచనే అనిపించే పఠనీయత మరో సవాలు. ఇవి రెండూ వొక దానితో వొకటి ముడిపడి వున్న విషయాలు. గురజాడ “కన్యాశుల్కం” తెలుగులో పలు మార్లు చదివి, పలవరించిన అనుభవం వున్న అధ్యాపకుడికి ఇది మరీ కత్తి మీద సాము. దాన్ని నాటకంగా రంగస్థలం మీదా, సినిమాగా తెర మీదా చూసిన అనుభవం, ఆ రచనతో ఆ అధ్యాపకుడికి ఇంకాస్త వ్యక్తిగత మమకారం కూడా తోడవుతుంది. అలాంటి పరిస్థితిలో అధ్యాపకుడిగానే కాక ఇతరత్రా కూడా తృప్తి కలిగితే తప్ప ఈ అనువాదాన్ని కోర్సులో పాఠంగా న్యాయం చేయలేం. గురజాడ వారి “కన్యాశుల్కం” కి నారాయణ రావు గారి అనువాదం “గర్ల్స్ ఫర్ సేల్” వొక పాఠ్యాంశంగా ప్రవేశపెట్టి, నాలుగేళ్లు వరసగా ఈ రచనని బోధిస్తున్న అధ్యాపకుడిగానే కాక, ఆ రచన పట్ల, తెలుగు సాహిత్యం లో దాని వారసత్వం మీద మమకారం వున్న వ్యక్తిగా ఈ అనువాదం నాకు వొక మైలు రాయి. ఈ మాట నేను అనుకోవడం కాకుండా, నా విద్యార్థులతో అనిపించడం కాస్త గర్వ కారణం కూడా. పైన నా విద్యార్థిని చేసిన వ్యాఖ్యలో రెండు ముఖ్యమయిన అంశాలున్నాయి. ఒకటి: అనువాదంలోని భాషతో ఆ విద్యార్థిని పూర్తిగా మమేకం అవ్వడం; రెండు: రచన నేపధ్యంగా అనువాదకుడు ఆధునికతకి సంబంధించి అందించిన కొత్త కోణంలోని లోతుల్ని తను కూడా చూడగలగడం. ఇందులో మొదటి విషయం అనువాద విజయానికి సంబంధించింది, రెండోది – ప్రపంచ సాహిత్య పటం మీద ఆ నాటకాన్ని నిలబెడుతూ అనువాదకుడు అందించిన దృక్కోణానికి సంబంధించింది. ఈ రెండు అంశాలు యూనివర్సిటీ చదువుల పరిధిలోనే కాదు, తెలుగు సాహిత్య పరిధిలో కూడా చర్చించదగినవే. ఏది మంచి అనువాదం అవుతుందన్నది మౌలికమయిన ప్రశ్న. నిస్సందేహంగా అనువాద లక్ష్యం, లక్ష్య భాషని బట్టి ఈ ప్రశ్నకి సమాధానం వుంటుంది. లక్ష్య భాష విశ్వ భాషే అయినా, ఈ ప్రశ్నకి వొకే విశ్వజనీన సమాధానమూ సాధ్యం కాదు. ఇంకా కొంత ఉన్నత స్థాయిలో, సంస్కృతిని మనం ఎట్లా అర్ధం చేసుకుంటున్నాం అనే అంశంపై కూడా అది ఆధారపడి వుంటుంది. ప్రసిద్ధ తత్వవేత్త మర్తా నస్బమ్ ఇటీవల అన్న వొక మంచి మాట అనువాదాలకి కూడా వర్తిస్తుంది : “ఇప్పుడు ఏ విషయన్నయినా అర్ధం చేసుకోవాలంటే, మనం అలవాటు పడి వున్న/ మనలో జీర్ణించుకుపోయిన కొన్ని లక్షణాలని అధిగమించి వొక బహుళ సాంస్కృతిక చైతన్యంతో ఆలోచించడం నేర్చుకుంటే తప్ప ఇప్పటి మార్పు అర్థం కాదు.” తెలుగు సాహిత్యంలో అనువాదాల గురించి జరుగుతున్న చర్చలు ఇంకా మన పాత అలవాట్లతో నిండి వున్నవే. ఇటీవలి అత్యాధునిక సాధనాల వాడకం వల్ల, ఇంగ్లీషు అనువాదాల వ్యాప్తి వల్లా, మన ఇంగ్లీషు కొంత తేటపడే దారిన వున్నా, ఈ ఇంగ్లీషు ఇప్పటికీ సర్కారీ ఆఫీసుల దరఖాస్తులకు, లేదంటే వకీళ్ల భాషకి దాటి ముందుకు వెళ్లలేదన్నది కొంచెం కటువయిన వాస్తవం. మన ఇంగ్లీషు అనువాదాలు బ్రిటిష్ వలస వాద సాహిత్య వ్యూహంలోనే ఇప్పటికీ బందీలు! నారాయణరావు గారి అనువాద కృషిని సరిగా అర్థం చేసుకోవాలంటే, మనలో జీర్ణించుకుపోయి వున్న ఆ భాషాపరమయిన అలవాట్ల నించి బయట పడాలి ముందు. వర్తమాన ఇంగ్లీషు మాట్లాడే భాషగా ఎట్లాంటి రూపం పొందుతున్నదో అర్థం చేసుకోగలగాలి. ఈ స్థితిలో మాండలికం కూడా తోడయిన “కన్యాశుల్కం” లాంటి బహుళ సాంస్కృతిక వాచకాన్ని ఇంకో భాషలో – ఈ సందర్భంలో ఇంగ్లీషులో- అర్థం చేసుకోవడం కష్టమే. అదనంగా, కన్యాశుల్కంలో వున్నది కేవలం మాండలికం కాదు, అందులోని భాష తెలుగు సంస్కృతి వొక ఆధునికతని సంతరించుకుంటున్న సంధి భాషకి కూడా ప్రాతినిధ్యం వహిస్తుంది. “కన్యాశుల్కం” విషయంలో ఆ మాండలికం/ ఆ ఆధునిక సంధి భాష ఎట్లా అనువదించాలన్నది కూడా పెద్ద సందేహమే. “కన్యాశుల్కం” లాంటి సందిగ్థ కాల రచన విషయంలో అనువాద న్యాయాన్ని తేల్చడం అంత తేలిక కాదని చెప్పడమే ఇక్కడ నా వుద్దేశం. మక్కీ కి మక్కీ అనువాదమే కోరుకుంటే, ఈ అనువాదం మాండలికం దగ్గిరే చతికిలబడుతుంది. మాండలికాన్ని దాటి వొక స్పష్టమయిన ఆధునిక దృక్కోణాన్ని, వలసవాద వ్యతిరేక “స్వరాన్ని” వినిపించడానికి గురజాడ ఈ రచనని వాహిక చేసుకున్నాడు. ఈ విషయం అర్థం కావడానికి అసలు గురజాడ కోణం నించి భాషనీ, ఆధునికతనీ మరో సారి ఆలోచించుకోవాల్సిన అవసరం వుంది. అప్పటి నుంచి ఇప్పటి దాకా గురజాడ నామస్మరణ లేకుండా మనకి ఆధునికత చర్చ లేదు. కానీ, గురజాడ ఆధునికత అనేది మౌలికంగా ఐరోపా-కేంద్రిత/ లేదా బ్రిటిష్-కేంద్రిత ఆలోచన కాదన్నది మనకి ఇప్పటికీ అర్థం కాలేదన్నది నిజం. ఆ రెండిటికీ భిన్నంగా గురజాడ చేస్తున్న స్థానిక ఆధునికతలొంచే ఆయన కొత్త భాషా, కొత్త ఆలోచనా పుట్టాయి. ఈ సిద్ధాంత పునాది మీంచి నిర్మించిన అనువాదం నారాయణరావు గారి “గర్ల్స్ ఫర్ సేల్.” పది పదిహేనేళ్ళ కింద కూడా నారాయణ రావు గారు వొక తెలుగు రచనని అంతర్జాతీయ పఠితకి పరిచయం చెయ్యాలంటే, తెలుగు అనేదొక భాష అని కూడా పరిచయం చేయాల్సి వచ్చేది. ఆయన డేవిడ్ షుల్మన్ తో సాగిస్తూ వచ్చిన నిరంతర అనువాద కృషి వల్ల ఇవాళ ఆ అవసరం తప్పిందంటే అతిశయోక్తి కాదు. ఆ కృషి ఫలంగా ఇవాళ అమెరికాలోగానీ, యూరప్ లో గాని తెలుగు భాషకి పరిచయం అక్కరలేదు. అందుకే, వారి మిగతా అనువాదాలకి భిన్నంగా “గర్ల్స్ ఫర్ సేల్” అనువాదంలో తెలుగు భాష పరిచయానికి సంబంధించి అంత కంఠశోష పడక్కర్లేకపోయింది. పాతికేళ్లుగా మొదటి నించీ నారాయణ రావు గారు స్వయంగా చేసిన అనువాదాలు కానీ, డేవిడ్ షుల్మన్ తో కలిసి చేసిన రచనల్లో కానీ, అనువాద విధానం గమనించిన వారికి అది వొక క్రమ పద్ధతిని అంటిపెట్టుకుని వుందని అర్ధమవుతుంది. తెలుగు భాష అంటే అసలేమీ తెలియని అంతర్జాతీయ పఠితకి వొక తెలుగు రచనని ఎట్లా అందించాలన్నదే ఆ పద్ధతిని నడిపించే సూత్రం. అట్లాగే, కేవలం అనువాదంతోనే సరిపెట్టుకోవడం కాకుండా, మొత్తంగా సాహిత్య ప్రపంచంలో ఆ రచన స్థానాన్ని బేరీజు వేసే వొక వాదనా, విశ్లేషణా ప్రతి అనువాదంలోనూ కనిపిస్తాయి. ఈ వెనక మాటలు విడివిడిగా తెలుగులోకి అనువాదమయినా అవి సాహిత్య విమర్శకి సంబంధించిన బౌద్ధిక క్రమశిక్షణని నేర్పిస్తాయి. “కన్యాశుల్కం” అనువాదంలో కూడా అదే తనదయిన పద్ధతిని ఆయన అనుసరించారు. ఈ అనువాదం గురించి ఆయన మాటల్లోనే - Translating Apparao into English is a challenge…..Every character in the original speaks in a dialect of Telugu specific to his or her caste, social status, gender, educational level, and individual style. Determined to use to spell every word as it is spoken in real life, Apparao took care to spell every word as it is pronounced by the character. He even made a few orthographic innovations to indicate the precise sounds. I made no effort to reflect the dialect variations in my translation. ఇంగ్లీషులోకి ఏది వెళ్తుందో, ఏది వెళ్లదో వొక స్పష్టమయిన ప్రకటన చేసి, తరవాత రచనలోకి తీసుకువెళ్లారు అనువాదకుడు. తెలుగు మాత్రమే బోధించే సాహిత్య కోర్సులలో ఇది పెద్ద సమస్య కాదు, కానీ, ఇంగ్లీషు ద్వారా సాహిత్యాన్ని బోధించే స్థితిలో ఆ రచన ప్రభావం కొంత మేరకే వుంటుంది. ఇది పఠనానికి కూడా వర్తిస్తుంది. మూలం చదివే సౌకర్యం వున్న ప్రతి సందర్భంలోనూ అనువాదం ఎంతో కొంత అసంతృప్తి మిగుల్చుతూనే వుంటుంది. ఆ వాస్తవికతని గుర్తిస్తూనే, మూలంలోని ఆ పరిమళాన్ని పూర్తిగా కాకపోయినా, వీలయినంత మేరకు తీసుకు రావడమే అనువాదకుడి పని. ఈ విషయం గమనించిన వొక విద్యార్థిని ఏమందో చూడండి: “నేను తెలుగు నేర్చుకుంటే ఎంత బాగుంటుందో! అప్పుడు ఈ నాటకంలోని భాష పూర్తిగా నాకు తెలిసేది కదా! అది నా ఆశ గానీ, ఇంగ్లీషులో – మా ఇంటి భాషలో- చదువుతున్నప్పుడు కొన్ని సన్నివేశాలు మా ఇంటి రంగస్థలంలో వూహించుకొని నాలో నేనే నవ్వుకున్న సందర్భాలు ఎన్నో! ఈ అనువాదంలో వాడిన ఈ భాష, ఈ నుడికారం అచ్చంగా నావే! వాటిని చెప్పడానికి ఇంకో యాస ఏమయినా దొరుకుతుందా, ఇంకో విధంగా ఆ వాక్యాల్ని తిరగ చెప్పగలనా అని కొన్ని సార్లు ప్రయత్నించాను. కానీ, ఇంత కంటే మెరుగయిన భాష నాకు దొరకలేదు,” అని అదే కోర్సులో ట్రాన్స్ లేషన్ స్టడీస్ పైన థీసీస్ రాసిన లారా క్లార్క్ అనే ఇంగ్లీషు డిపార్ట్మెంట్ పీఎచ్ డీ విద్యార్థిని తన ప్రెసెంటేషన్ లో చెప్పింది. (ఈ కోర్సు రీడర్ రెస్పాన్స్ థియరీ ప్రాతిపదికగా రూపొందించింది కావడం వల్ల విద్యార్థులు ముందే కొన్ని ప్రేసెంటేషన్లు చేసే వారు. విద్యార్థుల స్పందనల్ని చర్చకి పెట్టి, తరవాత నేను లెక్చర్ ఇచ్చే వాణ్ని) ఇలాంటి కోర్సులలో అనువాదాలు వుపయోగించినప్పుడల్లా – అది భగవద్ గీతకి బర్బరా స్టోలర్ మిల్లర్ అనువాదం కావచ్చు, మను ధర్మ స్మృతికి పాట్రిక్ అలివేల్ అనువాదం కావచ్చు, అనంతమూర్తి ‘సంస్కార’కి రామానుజన్ అనువాదం కావచ్చు, మహాశ్వేత కి గాయత్రి స్పివక్ అనువాదం కావచ్చు - భాష మీదా, నుడికారం మీదా చర్చ తప్పక జరుగుతుంది, ఎందుకంటే ఇక్కడి విద్యార్థులకి, పండితులకి ఆయా భాషలు ఎట్లా పని చేస్తాయన్నది అత్యంత ఆసక్తికరమయిన ప్రశ్న, వొక తెగని అన్వేషణ. వొక అనువాదం చూపిస్తే, ఇంకో మూడు నాలుగు అనువాదాలు వెతికి పట్టుకొని సరిపోల్చుకుంటూ భాషా చర్చ చేయాలన్న కుతూహలం వాళ్ళది. ఇలాంటి సందర్భంలో అనువాదం సరిగా లేకపోతే, మొత్తంగా కోర్సు అభాసు పాలు అవుతుంది. “కన్యాశుల్కం” ఇంగ్లీషు అనువాదం ఇప్పటి దాకా ఈ కోర్సులలో కనీసం మూడు వందల మంది చదివి వుంటారు. ఆ మూడు వందల మందికీ అమెరికన్ ఇంగ్లీషు ఇంటి భాష, అమ్మ భాష. ఇందులో భాష పంటి కింద రాయిలా తగులుతోందని ఇప్పటి వరకూ వొక్క వ్యాఖ్య కూడా నేను వినలేదు. ఆ మేరకు నారాయణరావు గారి అనువాదం వొక విజయమే నాకు. •
Category: 1 comments

పుట్టిన రోజు అక్షరాలా...




ఓ జ్ఞాపకానికి శుభాకాంక్షలు

- రఘోత్తమ రావు

శీతగాలితో బాధ ఒకటి ఊసులాడిన
నిన్నటి రోజు ఎందుకలా గడిచింది?

ఎండపొడ గిట్టని మనసు
తడిలేని కళ్ళతో ఏమిటా సైగలు?

ఇంకా నిద్రపోతున్న గుబులుకు
మేలుకొలుపు పాడుతున్నట్టు ఎవరిదా గొంతు?

కదల్లేని గడియారం
కాలాన్ని కదిలించేస్తోంది.

పద!
ఒకటో అరో అక్షరాల్ని
రక్తనాళాల్లోకి ఎక్కించుకుందాం.

ఆ స్పర్శతో
ఈ గుండెదడ తగ్గొచ్చు!

(ఆవకాయ నుంచి)

అన్నేసి రంగుల్లో..

-కొండముది సాయి కిరణ్ కుమార్

కళ్ళాపి చల్లుతూ
వస్తూ పోయే మేఘాలు.
అన్నేసి రంగుల్లో
చీకటి అద్ది వెళ్ళిన చుక్కలు.
అక్షరాల పూలతో
ముగ్గులేస్తూ....
"ఊరిచివర" "అఫ్సూర్యుడు"


అఫ్సర్ !

-ఎండ్లూరి సుధాకర్

నీ పుట్టిన రోజు
అక్షరం పుట్టిన రోజు
ఆకాశం పుట్టిన రోజు
ఆధునికత పుట్టిన రోజు

ఈ మట్టిలో పుట్టి
అమెరికా మట్టిపై అడుగు పెట్టి
తెలుగమెరికా తేజం నింపిన
తెలుగు వాడా అఫ్సర్ !
తెలుపుతున్నాను జన్మదిన శుభాకాంక్షలు !

లేవు వాటికి తెలుపు నలుపుల ఆంక్షలు !
నీ కలంతీర్చాలి
కవిత్వంలో ఖండాంతర కాంక్షలు !
మూడు దశాబ్దాల నా స్నేహానికి
'రక్త స్పర్శ'లో
'ఇవాళ' తీరని సరస్వతీ మోహానికి
నీకిస్తా ఒక ముద్దా బంతుల గోదావరి గుల్దస్తా! ( పూల గుత్తి)
సాల్ గిరా ముబారకులతో

నీ మిత్రుడు ....
- సుధాకర్ భాయ్ ఎండ్లూరి.





క్యాలండర్ చిరునవ్వే రోజు

------వాసుదేవ్

ఎడాదికొక్కరోజే క్యాలండర్ నవ్వేది
అక్షరం పుట్టినరోజని...

కాలం గడ్డకట్టాలనుకున్నదీరోజే
ముందుకు జరగనంటూ మొరాయింపుతో.....

అక్షరాలన్నీ మురిసిపోయేదీనాడే
తమ శతార్ధాల సృష్టికర్తకి హారమవుతూన్నవేళ!

నిముషాలు గంటలకిందుగా జారిపోతున్నప్పుడు
రోజు బాధపడిందీరోజే
కరిగిపోతున్నందుకు......
కాగితం నల్లపడ్డప్పడల్లా
అక్షరం, భావం ఆధిపత్య పోరులో
పాఠకుడి వెతుకులాటకి ప్రాణంపోసేదిక్కడే!

(అక్షర అఫ్సూర్యుడికి పద బహుమానం-- పుట్టినరోజు సందర్భంగా)



జయహో...
జయహో...


- డాక్టర్ పులిపాటి గురుస్వామి

ఓ చల్లని పలకరింత
వెచ్చని ఆలింగనం
చెరగని చిర్నవ్వు

అమెరికా నుండి
ఇక్కడి దాకా
అక్షర బీజాలు చల్లుతున్న
తెలుగు కృషీవలుడు

''అ'' కారాన్ని
అలంకరించుకున్న
అందరి ప్రేమికుడు...

అక్షరమే
గుర్తింపు కిరీటం గా కల్గిన
మేధావి రత్నం
'అఫ్సర్'

జయహో...
జయహో...

జన్మదిన శుభాకాంక్షలు...
మనసారా....
Category: 4 comments

ఒక పాట జ్ఞాపకం

పాత కాయితాలు వెతుకుతున్నప్పుడు ఏం దొరుకుతాయి? కొన్ని జ్ఞాపకాలు! నెమలీకలు! ఎండిన రావి ఆకుల బుక్ మార్కులు! రంగు వెలిసిన ఉత్తరాలు.

ఎటో వెళ్ళిపోయిన స్నేహితుల స్మృతులు! నిన్నటి చేతిరాతలోంచి నిండుగా నవ్వే అమాయకపు ఆ ఆత్మీయ ముఖ పుస్తకాలు! మరలి వస్తే బాగుణ్ణు అనుకునే కొన్ని క్షణాలు!

(మిగతా.. ఆవకాయ లో
Category: 2 comments

తొలి ఆధునిక ముస్లిం కవయిత్రి - అక్బర్ బేగమ్!

(ఇది నిన్న ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ "వివిధ"లో అచ్చయిన వ్యాసం)


అక్బర్ బేగమ్....తొలి ఆధునిక ముస్లిం కవయిత్రి ?
1850 నుంచి 1910 - తెలుగు సాహిత్య సాంస్కృతిక చరిత్రలో వొక మేలు మలుపు. కొత్త రూపం దిద్దుకుంటున్న సంప్రదాయాలు, ఇంకా పూర్తిగా ప్రసరించని ఆధునికతల మధ్య వొక సందిగ్ధ ఉదయ సంధ్య.
సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ కొంత, విచ్ఛిన్నం చేయకుండా కొంత, కొత్త భావనల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం ఈ కాలంలో జరిగింది. ఒక భావనగా ఆధునికత – ఈ మార్పులన్నిటికీ మూల బిందువు. ఆధునికత ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయంలో ఇప్పుడు కొన్ని కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఆధునికత అనేది విశ్వజనీన భావన కాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. స్థానిక ఆధునికత అనేది పాశ్చాత్య ఆధునిక భావనకి, వలస ఆధునికతకీ ఎంత భిన్నంగా వుంటుందో కొత్త ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. అయితే, తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణంలో ఈ కొత్త భావన ఎలాంటి పాత్ర పోషించబోతుందో ఇంకా మనకి స్పష్టంగా రూపు కట్టడం లేదు. ముఖ్యంగా, 1900 తరవాత ఆధునిక సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషించిన కథ, కవిత లేదా పద్యం, వ్యాసం, పత్రికా రచన లాంటి సాహిత్య రూపాల మీద ప్రత్యేకించి కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఈ కొత్త ఆధారాలు నొక్కి చెబ్తున్నాయి. ఇప్పటికే, ఆధునిక కథకి సంబంధించినంత వరకూ, భండారు అచ్చమాంబ కథల గురించి కొంత చర్చ మొదలయ్యింది. అచ్చమాంబ కృషిని సాహిత్య దృష్టితో మాత్రమే కాకుండా, స్త్రీల చరిత్ర నిర్మాణంలో భాగంగా చూడాలని పరిశోధకులు గుర్తిస్తున్నారు. ఈ చర్చని విస్తరిస్తూ, 1904 లో “హిందూ సుందరి” పత్రికలో అక్బర్ బేగమ్ అనే వొక ముస్లిం తెలుగు కవయిత్రి ప్రచురించిన పద్యాన్ని అప్పటి చారిత్రక నేపధ్యం నుంచి పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ఉద్దేశం.
ఆధునికత కేవలం సాహిత్య భావన కాదు, అది వివిధ స్థాయిలలో ఆచరణలోకి అనువాదమయ్యేటప్పుడు వొక సామాజిక భావనగా తనదయిన బహిరంగ ఆవరణ (పబ్లిక్ స్ఫియర్ లేదా పబ్లిక్ స్పేస్) ని సృష్టించుకుంటుంది. పత్రికల ఏర్పాటు – వాటిలో పాఠకులకు తగినంత చోటు, విద్యా సంస్థల ప్రారంభం, గ్రంథాలయోద్యమం వ్యాప్తి, టౌన్ హాళ్ళ వంటి పబ్లిక్ సంఘాల నిర్మాణం, చర్చా వేదికలు, ప్రకటనలు, కరపత్రాలు – ఇవన్నీ ఇందులో భాగమే. మనకు తెలిసిన ఈ ఆధునిక చరిత్రలో స్త్రీల స్థితిగతుల ప్రస్తావనకి లోటు లేదు. కానీ, స్త్రీలకి సంబంధించిన ఈ కొత్త భావనలూ, ఉద్యమాలూ, సంఘాలు కూడా పురుషుల ఔదార్యం, స్పూర్తి వల్ల మాత్రమే జరిగినట్టు చదువుతూ వుంటాం. ఇలాంటి రంగాలలో అధికారిక చరిత్ర విస్మరించిన కొన్ని కోణాల లోతుల్లోకి వెళ్తే, ఆధునిక భావాల నిర్మాణంలో స్త్రీల పాత్ర నిర్లక్ష్యానికి గురయ్యిందని అర్థమవుతుంది. మనకి తెలిసిన చరిత్రకి భిన్నంగా, స్త్రీలు సంఘాలుగా ఏర్పడడం, చర్చా వేదికలు నిర్వహించడం, స్త్రీ విద్య లాంటి భావనల్ని మారుమూల పల్లెలకి తీసుకు వెళ్ళడం మొదలయినవి స్త్రీల వైపు నించి విస్తృత స్థాయిలో జరిగాయని కూడా అర్థమవుతుంది. “స్త్రీల కొరకు స్త్రీలు నిర్వహించిన” తొలి ఆదునిక పత్రికా ప్రయోగం “హిందూ సుందరి” సంపాదకీయాలు చదువుతున్నప్పుడు ఈ చర్చలు చాలా సందర్భాలలో ఉద్వేగభరితంగా కూడా జరిగాయని తెలుస్తుంది.
1902 తరవాత మొసలికంటి రామాబాయి (ఈమె, ఈమె భర్త సత్తిరాజు సీతారామయ్య ఇప్పటి ప్రసిద్ధ చిత్రకారులు “బాపు” పూర్వీకులని అంటున్నారు) అనే వొక మహిళ సంపాదకత్వంలో వెలువడిన “హిందూ సుందరి” పత్రికలోని స్త్రీల రచనలని ఈ చారిత్రక నేపథ్యం నించి తిరిగి పరిశీలించాల్సిన అవసరం వుంది. ఈ పత్రికలో సంఖ్యానేకంగా వెలువడిన స్త్రీల రచనలు ఆధునికత అనే భావన చుట్టూ వాళ్ళు స్వతంత్రంగా నిర్మించిన కొత్త ఆలోచనా వ్యవస్థ గా చూడవచ్చు. ఇవి విడివిడిగా ఆయా రచయిత్రులు తమ తమ వ్యక్తిగత పరిధుల్లోనే చేసినప్పటికీ, కొన్ని ప్రయత్నాలు స్థానికంగా సంఘ నిర్మాణం దాకా వెళ్ళినా, అచ్చు సంస్కృతి లోకి ప్రవేశించడం వల్లా, వొక పత్రిక దానికి వేదిక అవ్వడం వల్లా వాటికి వొక సమష్టి బహిరంగ రూపం దక్కింది. స్త్రీ విద్యా కేంద్రంగా నిర్మితమయిన ఈ భావాల వ్యవస్థ సంప్రదాయాన్ని పూర్తిగా నిరాకరించలేదు, అట్లా అని పూర్తిగా అంగీకరించ లేదు కూడా. సాంప్రదాయ భావనల్ని తిరగదోడి, వాటి అసలు ఉద్దేశాలను పునర్నిర్మించే ప్రయత్నం ఈ రచనల్లో గట్టిగా కనిపిస్తుంది. దీనికి అప్పటి హిందూ భావనల పునర్నిర్మాణ ప్రక్రియతో సంబంధం వుంది. ఇది హిందూ పునరుద్ధరణ ప్రక్రియ కాదన్నది మనం స్పష్టంగా గుర్తించాలి.
అయితే, ఈ పరిధిలో కథ, వ్యాసం, పత్రికా రచన లాంటి వచన ప్రక్రియలు చేసే పనికీ, కవిత్వం లేదా పద్యం లాంటి ప్రక్రియలో జరిగే పనికీ చాలా వ్యత్యాసం వుంటుంది. సాహిత్యంలో వ్యక్తమయ్యే స్పందనలు అనుదిన జీవితంతో ముడిపడి వుండేవే అయినప్పటికీ, అనుదిన జీవన సంస్కృతికి వుండే చట్రాన్ని కూడా అవి ఉద్వేగంగా ప్రశ్నిస్తాయి. అయితే, ఆయా సాహిత్య ప్రక్రియల సంవేదనాత్మకత స్వభావాన్ని బట్టి ఈ చట్రం ఎదుర్కొనే ప్రశ్నలు వుంటాయి. కవిత్వం వొక విధమయిన సజీవ సంవేదనాత్మకతని ప్రతిబింబిస్తుందని ప్రసిద్ధ స్త్రీవాద కవయిత్రి ఎడ్రియన్ రిచ్ వొక సందర్భంలో అంటుంది. ముఖ్యంగా సాహిత్యంలో పూర్వ నిర్ధారిత సంప్రదాయ రాజకీయ సంస్కృతి చట్రం ఎలాంటి పాత్ర పోషిస్తుందో విశ్లేషిస్తూ, ఆమె ఇలా అంటుంది: In a political culture of managed spectacles and passive spectators, poetry appears as a rift, a peculiar lapse, in the prevailing mode.
రాజకీయ సంస్కృతి అనే భావనని ఆమె చాలా విస్తృతార్థంలో వాడినట్టు ఇక్కడ వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆ సంస్కృతిలో సంప్రదాయం పాత్రని ఇక్కడ ప్రత్యేకించి గమనించాలి. అందునా, స్త్రీ సమస్యలకి సంబంధించి ఈ సంప్రదాయిక నిర్మాణం బలంగా పని చేస్తుంది. అందుకే, తెలుగు నాట స్త్రీల సమస్యలకి సంబంధించి సంస్కర్తలు అయినా, సాహిత్య వేత్తలు అయినా కొంత అదనపు శక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి వొక ఉదాహరణ “హిందూ సుందరి” పత్రిక నిర్వహణ. ఈ పత్రికలో వచన రచనలన్నీ వొక ఎత్తు, కవిత్వం వొక ఎత్తు. కవిత్వంలో వుండే వొక సహజమయిన భావ తీవ్రత, ఆవేశం ఆ ప్రక్రియని వొక peculiar lapse గా మార్చుతుంది. ఇలాంటి సన్నివేశంలో స్త్రీగా రాయడం, అందులోనూ భావ తీవ్రత మూలమయిన కవిత్వ ప్రక్రియలో ఆ స్త్రీ తన ఆలోచనని వ్యక్తం చెయ్యడం అనేక వొత్తిళ్ల మధ్య సంఘర్షణ పడడమే. దీనికి తోడు, ఆ కవయిత్రి ముస్లిం సమాజం నించి వచ్చినప్పుడు, తన తల్లి భాషలో కాకుండా, స్థానిక భాషలో రాయడం ఎంత సంఘర్షణో ఊహించుకోవచ్చు. ఆయా భాషల చట్రాలు కూడా ఆమె మీద గట్టిగానే వొత్తిడి పెడతాయి. వీటిని దాటుకొచ్చి వొక సాహంకార పద్యంగా నిలబడిన వ్యక్తి అక్బర్ బేగమ్.
ఎవరీ అక్బర్ బేగమ్?
తొలి ఆధునికులలో సుప్రసిద్ధుడయిన కవి ఉమర్ అలీ షా భార్య అక్బర్ బేగమ్. తన విశిష్ట కావ్యం “సూఫీ వేదాంత దర్శము” ఆయన తన భార్య అక్బరాంబ కి అంకితమిస్తూ, అక్బరాంబ గొప్ప పండితురాలని, తన కావ్యాలన్నిటికీ ఆమె మొదటి పఠిత, విమర్శకురా లనీ అంటారు ఉమర్ అలీ షా కవి. వ్యక్తిగా, పండితురాలిగా ఆయనపైన అక్బర్ బేగమ్ గాఢమయిన ప్రభావం కలిగించిందని ఈ అంకిత పద్యాల్ని బట్టి తెలుస్తుంది. అక్బర్ బేగమ్ చనిపోయిన తరవాత ఉమర్ అలీ షా కవి కూడా దాదాపూ వొక విధమయిన మౌనంలోకి వెళ్ళిపోయారు. 1935 లో ఆమె డిల్లీలో కన్నుమూసినప్పుడు ఆమె మృతికి సంతాప సూచకంగా డిల్లీ శాసన సభకి ఆ రోజు సెలవు ప్రకటించారు.ఒక వైపు క్రియాశీల రాజకీయవేత్తగా అప్పుడే జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న ఉమర్ అలీ షా ఈ అనూహ్యమయిన మరణ విషాదాన్ని తట్టుకోలేక, లోలోపలే బాధని దిగమింగుకుంటూ, అస్వస్థులయ్యారు. ఆ తరవాతి కాలంలో ఆయన మెదడు నరాలు చిట్లి, కన్ను మూశారు.
తమ ఇద్దరి అనుబంధంతో పాటు, అక్బర్ బేగమ్ కుటుంబ చరిత్రని కూడా ఉమర్ అలీ షా ఈ పద్యాల్లో కొంత రాశారు.
ఏను రచించినట్టి కృతులెన్నిటనో వినె తల్లి; తండ్రి నా
నా నవనాటక ప్రకరణంబులు నాడగ జూచినారు; ఢి
ల్లీ నగరాంగ్ల భారత మహీధవ శాసన సభ్య సత్పదం
బానగ గాంచి “అగ్బ”రమరాలయమేగే వెలుంగు చుక్కయై.

పరమ పవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం
భరిత రసాత్మక ప్రకృతి వడ్డికిబారెడు ప్రేమమూర్తి సుం
దర సముపాసితం బయిన ధర్మపదంబును సంతరించి యీ
శ్వరునెద నగ్బరాంబ కడు ప్రార్ధన సేయుచు నెల్ల వేళలన్.
ఉమర్ అలీ షా గారి ఈ అంకిత పద్యాలు తప్ప, ఈ కవయిత్రి గురించి ఇంతకు మించి సమాచారం ఏదీ దొరకడం లేదు. “హిందూ సుందరి” లో ప్రచురితమయిన పద్యం కూడా చివరలో “సశేషం” అని వుంది. తరవాతి సంచికలలో ఆ పద్యం రెండో భాగం కూడా లభ్యం కావడం లేదు. అయితే, 1915 తరవాత ఉమర్ అలీ షా సూఫీ గురువుగా ప్రసిద్ధులవ్వడంతో, ఆయనతో పాటు అక్బర్ బేగమ్ సూఫీ ప్రచారంలో విరామమెరుగక పర్యటించేవారని, ఉమర్ అలీ షా శిష్యులలో చెప్పుకోదగిన సంఖ్యలో మహిళలు కూడా వుండడం వల్ల వారి కోసం ఆమె ఎక్కువ సమయం వెచ్చించే వారని ఉమర్ అలీ షా గారి ఇతర రచనల ద్వారా తెలుస్తోంది.
అక్బర్ బేగమ్ కూడా తన పద్యం లో ప్రవర చెప్పుకునే కావ్యగానం ఆరంభిస్తుంది. “నేను మహమ్మదీయ కాంతనయిననూ మజ్జననియును అత్తమామగార్లు కళ్యాణగుణ గణాలంకార విద్యా కాంతార విహార చేతస్కులై, జగద్ధిత కీర్తి బ్రవర్తింపుటం జేసి, తదీయ సహవాస వాసన నా మంద బుద్ధికి సోకి, భ్రమర కీట న్యాయానుసారము నొక్క తృటిలో నీ మహత్తర నీతి కథా చరిత” రాస్తున్నట్టు చెప్పుకుంది. ఈ పద్యంలో ఆమె తల్లి శిలార్ బీబీ జీవితంలోని వొక ముఖ్యమయిన ఘట్టాన్ని మాత్రమే అక్బర్ బేగమ్ వివరించింది. పద్యం నడకని బట్టి చూస్తే ఆమె వొక దీర్ఘ ఆత్మకథాత్మక కావ్యం రాయాలని మొదలు పెట్టినట్టుగా వుంది. ఈ పద్యంలో ఆమె శిలార్ బీబీ అత్తవారింటికి రావడం, అక్కడ ఆమె అనుసరిస్తున్న కొత్త ఆచార పద్ధతులతో, తన సూఫీ చదువూ, కొత్త సంస్కారం వల్ల (“ యీ జెష్ట మంత్రంబులెక్కడో నేర్చి/ దెయ్యాల ప్రార్ధించు”) ఆమె గర్విలా కనిపిస్తుంది అక్కడి వాళ్ళకి- అప్పుడు భర్త ఆమెని “కోపంబుతో ముండరండా అనుచు” కర్రలతో మొత్తుతుంటాడు. “ఇట్లనేక విధముల బాధలనుభవించి/ నోర్చి” కాలం గడుపుతూ వుంటుంది శిలార్ బీబీ. చివరికి వొక అగ్ని పరీక్ష లాంటిది ఆమె కూడా ఎదుర్కొంటుంది. ఆ అగ్ని పరీక్షలో ఆమె నెగ్గుతుంది. అందరూ ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించడం మొదలెడ్తారు. పతివ్రతగా వుంటూనే, తనదయిన వ్యక్తిత్వ ముద్రతో ఆమె ప్రవర్తిస్తుంది. ఈ కథ నిజానికి ఇప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కానీ, వొక స్త్రీ, అందునా ముస్లిం స్త్రీ ఈ మాత్రం తన కథని చెప్పడం విశేషంగానే భావించాలి.
ఈ పద్యం ప్రవరలో ఆమె ప్రస్తావించినట్టు ఆమె మామ గారు, ఉమర్ అలీ షా కవి తండ్రి మహర్షి మొహియుద్దీన్ బాషా ఆధ్యాత్మిక విద్యా పీఠాధిపతి. ఆయన ప్రధానంగా తెలుగులో సూఫీ తత్వాలు కూర్చారు. అయితే అవి కేవలం ఆయన భక్తులకు మాత్రమే పరిమితం. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఉమర్ అలీ షా కవి కూడా చాలా కాలం పాటు ఆశు సంప్రదాయంలోనే వుండిపోయారు. ఉమర్ అలీ షా ఖండికలు 1905 వరకూ అచ్చు రూపం దాల్చిన దాఖలాలు లేవు. అయితే, అప్పటికే ఆయన పద్యాలు మౌఖిక రూపంలో బాగా ప్రాచుర్యంలో వుండేవి. వొక సూఫీ తత్వవేత్తగా ఆయన రూపాంతరం చెందుతున్నారు. లిఖిత సంస్కృతి చరిత్ర నించి చూస్తే, 1904లో “హిందూ సుందరి” పత్రికలో “అపూర్వ పతివ్రతా చరిత్రము” అనే శీర్షికతో వెలువడిన అక్బర్ బేగమ్ పద్యమే అచ్చు రూపం దాల్చిన తొలి తెలుగు ముస్లిం పద్యమే కాక, అచ్చు సంస్కృతీ, ఆధునికతా, పబ్లిక్ స్పేస్ ల కొత్త మేధో వాతావరణంలోకి ప్రవేశించిన తొలి ముస్లిం రచన కూడా అవుతుంది.
అక్బర్ బేగమ్ పద్యం సమకాలీన సాహిత్యం పట్ల ఆమెకి వున్న లోతయిన అవగాహనని చెబుతుంది. ఆమె ఉద్దేశపూర్వకంగా రెండు రకాల సామాన్యీకరణ వ్యూహాల్ని వినియోగించుకున్నట్టు కనిపిస్తుంది. మొదటి వ్యూహం: సాహిత్య వస్తువుని పూర్వ గాథల నించి విముక్తం చెయ్యడం, రెండు: భాషలో సామాన్య భాషని వాడడం. ఈ పద్యంలో ఆమె ద్విపద, ఉత్పల మాల, సీసం, తేటగీతి వృత్తాలని వుపయోగించింది. కానీ, సంప్రదాయ పద్యంలో వుండే సంస్కృత ప్రభావాన్ని వదిలించుకొని, వాడుక తెలుగుని వాడాలన్న పట్టుదల ఈ పద్య పాదాల్లో కనిపిస్తుంది. స్త్రీల పట్ల పురుషులు ఎట్లాంటి తిట్టు పదాలు వాడతారో ఈ సామాన్యీకరణ వ్యూహంలో వొక భాగమే. అదే విధంగా, మొహియుద్దీన్ బాషా లాంటి సూఫీ తత్వ కవులు భక్తి కవిత్వంలో ప్రవేశపెట్టిన సామాన్యీకరణని, నిరలంకారతని ఆమె వారసత్వంగా పుణికి పుచ్చుకున్నట్టు ఈ పద్యాల్ని బట్టి తెలుస్తుంది. తరవాతి కాలంలో ఉమర్ అలీ షా సూఫీ విశ్వ విజ్ఞాన పీఠంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి వీలుగా ఆమె ఈ పద్యాలలో ఆశు సంప్రదాయ రూపం వైపు మొగ్గు చూపించింది. అయితే, ఈ రూప పరమయిన అంశాలన్నీ ఆమె “ఆధునిక మహిళ” అనే భావన పట్ల ఆమె ఆలోచనలోని భిన్నత్వం వల్ల సాధ్యమయ్యాయి.
సంప్రదాయ కథనం- ఆత్మకథనం
“హిందూ సుందరి” పత్రిక ప్రధానంగా స్త్రీ విద్య మీద, స్త్రీ కేంద్రంగా సంఘంలో రావాల్సిన మార్పుల మీదా దృష్టి పెట్టింది. అప్పటి ముస్లిం స్త్రీలు చదువు ప్రాధాన్యాయాన్ని గుర్తిస్తున్నారనడానికి అక్బర్ బేగమ్ పద్యం వొక ఉదాహరణ. విద్య ద్వారా మాత్రమే స్త్రీల స్థితిలో మార్పు వస్తుందన్న లక్ష్యంతో ఈ పత్రిక సంపాదకులు కేవలం స్త్రీలు రాసిన వ్యాసాలను ప్రచురించడం మొదలు పెట్టారు. వూరూరా విద్యావంతులయిన స్త్రీలతో రాయించడం ఈ పత్రిక ప్రధానంగా చేసిన పని. ఇలా చేయడం ద్వారా “మన దేశ స్త్రీలు భయముడిగి, ఇతర దేశపు స్త్రీల వలె తామే వొక పత్రికా భారం వహించే” స్థితికి రావాలన్నది వారి ఆకాంక్షగా ప్రకటించుకున్నారు. అందులో భాగంగా విద్యావంతులయిన స్త్రీలను తామే సంప్రదించి వారి చేత రాయించడం మొదలు పెట్టారు. స్త్రీ తన ఔన్నత్యాన్ని తానే నిబ్బరంగా ప్రకటించుకోవడం ఈ రచనల ఉద్దేశంగా కూడా వారు చెప్పుకున్నారు. ఆ క్రమంలో స్త్రీల వున్నత స్థితిని చెప్పే కొన్ని సంప్రదాయ భావనల్ని విమర్శనాత్మక దృష్టితో స్వీకరించారు. వాటిలో వొకటి: పతివ్రతా భావన. ఈ భావనని స్త్రీ విద్యా దృక్పథం నించి సవరించి చూడడం ఈ కథల్లో ప్రత్యేకత. అయినప్పటికీ, ఈ కథలు చాలా మటుకు పురాణాల నించి తీసుకున్నవే; సంప్రదాయ కథన పద్ధతిని అనుసరించినవే. 19 వ శతాబ్దిలో పాశ్చాత్య ఆధునికతకి ప్రతివాదంగా నిలబడిన “నియో క్లాసికల్ హిందూయిజం” ధోరణి ఇందులో కనిపిస్తుంది. “హిందూ” అనే అస్తిత్వాన్ని నిరాకరించకుండా, అందులో వున్న భావనలకి ఆధునిక రూపం ఇవ్వడం సాహిత్యపరంగా ఈ దశలో బలమయిన ధోరణి.
దీనికి భిన్నంగా, మూడు కొత్త ప్రత్యామ్నాయాలని అక్బర్ బేగమ్ తన పద్యంలో చూపించింది. వొకటి: కేవల “హిందూ”అస్తిత్వం నించి స్త్రీ విద్యని విడదీయడం; రెండు: ఆధునిక భావాల్ని ముఖ్యంగా స్త్రీ నైతికతని స్త్రీ కోణం నించి మాత్రమే చూడడం; మూడు: సాంప్రదాయ కథన పద్ధతిని నిరాకరించి ఆత్మ కథన పద్ధతిని స్వీకరించడం. ఈ మూడు కారణాల వల్ల “హిందూ సుందరి” పత్రికలో ప్రచురితమయిన ఇతర రచనల కంటే అక్బర్ బేగమ్ రచన చదివిన వెంటనే భిన్నంగా అనిపిస్తుంది. “పూర్వ పతివ్రతామహాత్మ్య యశస్సంపద లనేకములు విని వారయోని సంభూతుల వలె దలంచి హాశ్చర్యాంతఃకరణులై సంతసించుటయే గాని మనవలెనే జన్మించిన వారల” కథలు చెప్పాలని తన ప్రయత్నాన్ని చెప్పుకుంది ఆమె. కథని సాధారణీకరించాలన్న ఆమె మౌలికమయిన ఆలోచనే, మిగిలిన భిన్నత్వాలకు దారి తీసింది. తల్లి శిలార్ బీబీ కథనే ఆమె వస్తువుగా తీసుకోవడం వల్ల ఆ ఆత్మకథనాత్మక లక్షణం మిగిలిన రెండు అంశాలు- ‘హిందూ” అస్తిత్వ ప్రభావం నుంచి బయట పడడం, స్త్రీ నైతికతకి కొత్త కోణం- సాధ్యమయ్యాయి. ఆ విధంగా ఆత్మకథాత్మకత ఈ పద్యానికి కేంద్ర బిందువు అయ్యింది.
స్థానిక ఆధునికతలో ఆత్మకథాత్మకత వల్ల సాధ్యపడే అన్ని సాంస్కృతిక లక్షణాలను ఈ పద్యం పుణికిపుచ్చుకుంది. అలాగే, సూఫీ తత్వం అనేది అనుదిన జీవితంలో లీనమవుతున్న క్రమాన్ని కూడా ఈ పద్యంలో అర్థం చేసుకోవచ్చు. శిలార్ బీబీ జీవన విలువలు సూఫీ స్థానికతలోంచి ఎలా రూపు దిద్దుకున్నాయో, అవి తొలినాళ్ళలో ఎలాంటి అపోహల్ని సృష్టించాయో చెప్పడం, అవి ఆమెని కుటుంబ హింసకి ఎలా గురి చేసాయో చెప్పడం ఈ పద్యంలో అక్బర్ బేగమ్ సాధించిన ఇతర విజయాలు. నైతికతకి సంబంధించినంత వరకూ కేవలం పురుష దృక్కోణం నుంచి ఆమె వ్యక్తిత్వం పైన తీర్పు చెప్పలేమన్న ఆలోచన బీజప్రాయంగా అయినా ఈ పద్యంలో కనిపిస్తుంది. మైనారిటీ సాంస్కృతిక స్వరం ప్రకాశంగా వినిపించడంలో ఆత్మకథాత్మకత ఎలాంటి సాధనంగా ఉపయోగపడుతుందో, ఆ ఆత్మకథాత్మకత సామూహిక కథగా ఎలా రూపు దిద్దుకుంటుందో ఈ పద్యం నిరూపిస్తుంది. ఆధునిక తెలుగు సాంస్కృతికతా వికాసంలో తొలి మెరుపై మెరిసిన నెలవంక ఈ పద్యం.

(అక్బర్ బేగమ్ పద్యం సేకరించి పంపడమే కాకుండా, నేను ఈ వ్యాసం రాసేంత వరకు పట్టు వదలని మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ కి, ఉమర్ అలీ షా కవి రచనలన్నీ దూరభారం లెక్క చేయక పంపిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి కృతజ్ఞతలు. ఈ వ్యాసకర్త అక్బర్ బేగమ్ గురించి మాత్రమే కాకుండా 1850-1910 ప్రాంతాలలో తెలుగులో రచనలు చేసిన ముస్లిం సాహిత్య వేత్తల గురించి, అప్పటి సూఫీ ధోరణుల గురించి ఇంకా పరిశోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిసిన వారు afsartelugu@gmail.com కి పంపవలసిందిగా మనవి.)


*
Category: 7 comments

అమ్మ పేరు




అమ్మని ఆ నేల పొత్తిళ్లలో నిద్రపుచ్చుతున్నంత సేపూ
కురుస్తూనే వుంది వాన.

చర్చి నించి శ్మశానం దాకా.

మా కాళ్ళ కింది బురద నీళ్ళు
వొక శూన్యాన్ని చప్పుడు చేస్తున్నాయి.


పాస్టర్ పిలిచినప్పుడు చెయ్యెత్తి నిలబడ్డాను
"మరణంతో ఆగిపోతుంది ఈ దేహం చెయ్యాల్సిన పని.
ఇక మొదలు ఆత్మ యానం...."


తీరా వెనక్కి తిరుగుతున్నప్పుడు రానే వచ్చాడు సూరీడు.
వెనక్కి తిరుగుతున్న నా వేపు తీక్షణంగా చూశాడు,

వెనక్కి తిరిగాను
అమ్మని అక్కడే వదిలేసి.


ఇంటికి వెళ్తున్న దారినిండా గతుకులు
ఎప్పుడూ అది గతుకుల దారే.

నెమ్మదించినా నా అడుగులు,
క్షణం నిలవదుగా, ఈ కాలం!

పోయిన వాళ్ళ పేర్ల మధ్య నా సంచారం

అమ్మ పేరు
నా తల కింద రాతి తలగడ.


మూలం: Natasha Trethewey

ఇది స్వేచ్ఛానువాదం
Category: 9 comments
Category: 0 comments

ఊరికే!


ఓ కల నిండా
కలిసి ప్రయాణం

నగరం మురికి కాల్వ
ముక్కు మూసుకుంటూ
చెయ్యూపింది

ఆకాశం వో షాండ్లియర్.

గంటలు మోగిస్తూ
వెన్నెల్లో ఎడ్ల బండి


ఇంకే లోకమూ తెలియనివ్వని
సహయాత్ర

ఓ ఆకాశం నిండా
కలల ప్రయాణం

ఇప్పుడూ
ఎప్పుడూ.


(1996, "వలస" నించి)

నిస్సందేహంగా ఇది ప్రేమ కవితే!
Category: 7 comments

'రాలేదు'లో అఫ్సర్!

వార్త ఆదివారం అనుబంధంలో నిన్న ప్రముఖ కవి, విమర్శకుడు దర్భశయనం శ్రీనివాస రావు గారు "ఊరి చివర" కవితలో "రాలేదు" అనే వొక కవితపై చేసిన విశ్లేషణ.

ఈ వ్యాసాన్ని స్కాన్ చేసి పంపిన కవిమిత్రుడు కుమార్ వర్మ గారికి ధన్యవాదాలు.

Category: 5 comments

అంతకన్నా...

సర్లే, పోనీలే అనగలనా,

దాని నునుపైన దేహమ్మీద చెయ్యి వెయ్యకుండా.

దాని చేతిలో చెయ్యేసి,

తన గోర్వెచ్చనితనాన్ని నాలోకి వొంపుకోకుండా.

(మిగతా కవిత చదవండి ఆవకాయలో...)
Category: 1 comments

ఆమె నిశ్శబ్దంగా వెళ్లిపోయింది!





నాకు బీథోవెన్ సంగీతంలోని ప్రశాంత బీభత్సం ఇష్టం. అట్లాగే, భాషలోంచి నిశ్శబ్దంగా నవ్వుకుంటూ వెళ్లిపోయే “ఐరనీ” అంటే పిచ్చి. ఈ రెండూ వొక చోట కలిసినప్పుడు, ఆ కలయిక కవిత్వమయినప్పుడు నా లోపలి ఖాళీలన్నీ పగలబడి నవ్వుకుంటాయి. రుద్ర తాండవమే చేస్తాయి. పోలిష్ కవయిత్రి విశ్వావ సింబోర్ స్కా కవిత్వం నా లోపలి ఆ “ఐరనీ” రుద్ర తాండవ వేదిక. ఇవాళ్టి పొద్దుటి నిద్రలో ఆమె కన్ను మూసిందని తెలిసినప్పుడు, ఎందుకో ఆ మృత్యువు నాకు దేజావూలా, వొకానొక పూర్వస్మృతిలాగా అనిపించింది.

అతి తేలికయిన మాటలతో బతుకు చిక్కు ముడులు విప్పుకుంటూ వెళ్ళిన సింబోర్ స్కా అంతకంటే తేలికగా నిద్రలోంచి ఇంకో నిద్రలోకి వెళ్లిపోయింది. పెద్ద పెద్ద మాటలూ, వస్తువులూ అక్కర్లేదు కవిత్వానికి – రోజువారీ బతుకులోంచి ఎంతో కొంత అరువు తెచ్చుకొని, వాటినే లోతయిన ఆలోచనలతో నింపితే చాలు అనుకున్న నిశ్శబ్ద కవయిత్రి.

ఈ అనువాదాలు ఆమె స్మృతికి వొక నిస్సహాయ నివాళి -

ఆమె కవితల్లోంచి కొన్ని పంక్తులు మాత్రమే.
పూర్తి అనువాదాలు తరవాత వీలు వెంబడి.



మూడు మరీ అడ్డగోలు మాటలు

భవిష్యత్తు అన్న పదం పలకబోతానా,
దాని మొదటి అక్షరం గతంలోకి జారిపోతుంది అప్పటికే.

నిశ్శబ్దం అనబోతానా,
దాన్ని కుప్పకూల్చేస్తాను.

“ఏమీ లేదు,” అన బోతానా,
అసలే అస్తిత్వరాహిత్యమూ పట్టి నిలపలేని
దేన్నో వొకదాన్ని చేసి అక్కడ పెట్టేస్తాను.


మరణం, అతిశయోక్తులు లేకుండా

అబ్బే, దానికి నీ జోకులేవీ ఎక్కవు
నీ చుక్కలూ, నీ వంతెనలూ ఏవీ ఏవీ తెలీవు

అల్లికలూ, తవ్వకాలూ, అరక పట్టడమూ
నౌకల్ని తయారు చెయ్యడమూ, పోనీ, కేకులు చెయ్యడమూ
అబ్బే, అవేవీ దానికి చాత కావు.

-
సరే, దాని పనులయినా అది సరిగ్గా చేసుకుంటుందా అంటే
అదీ లేదు.

శుభ్రంగా సమాధి తవ్వుకోవడం
శవపేటిక చేసుకోవడమూ
ఆనక అన్నీ నీటుగా సర్దుకోవడమూ
అదీ రాదు.


కొన్ని సాధ్యాలు

నాకు సినిమాలు కావాలి
పిల్లులు కావాలి

ఆ నది వొడ్డున మహా వృక్షాలు కావాలి
దాస్తావస్కీకి బదులు డికెన్స్ కావాలి

నాకు ఆకుపచ్చ రంగు కావాలి
నాకు మినహాయింపులు కావాలి
తెల్లారకట్ట వెళ్లిపోవడం కావాలి
Category: 10 comments

ముస్తఫా మరణం

ఇవాళ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయిన "ముస్తఫా మరణం" కథ బ్లాగులో ప్రచురిస్తే బాగుంటుందని చాలా మంది మిత్రులు సూచించారు. వారి సూచన మేరకు ఈ కథ ఇక్కడ...



“ఆ గదిలోకి మాత్రం తొంగి అయినా చూడద్దు, బేటా!!” అని కేకేస్తున్న ఫాతిమా ఫుప్మా(అత్తయ్య) గొంతే వినిపిస్తోంది ఎప్పటిదో గతంలోంచి!
“అబ్బాజాన్ కి పదో రోజు చేస్తున్నాం,” అని మునీర్ భాయ్ మూడు రోజుల క్రిందట ఫోన్ చేసినప్పటి నించీ ఆ కేక ఆ గతంలోంచి ఎన్ని సార్లు వినిపించిందో లెక్క లేదు.
ఇవాళ పొద్దున ఫస్ట్ బస్సు అందుకుని, మధ్యాన్నం కల్లా వూళ్ళో వుంటే, పదో రోజుకి అందుకున్నట్టూ వుంటుంది, మునీర్ భాయ్ తో, ఫాతిమా ఫుప్మా తో, గోరీమాతో, అందరితో కాసేపు మాట్లాడినట్టూ వుంటుందని వూరికి బయలుదేరాను. మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, ముఖ్యంగా ఆ గది గురించి!
ఇప్పుడు మునీర్ భాయ్ అబ్బా ముస్తఫా కన్ను మూసాక, ఆ గది ఏమవుతుంది? అతని వారసత్వంగా ఆ గది, ఆ పరంపరని మునీర్ అందుకుంటాడా? అసలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా మునీర్ భాయ్ తండ్రి మరణాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నాడో నాకు అర్ధం కాలేదు. తండ్రి వుండగానే అతిపెద్దదయిన ఆ కుటుంబ భారాన్నంతా తన వొంటరి భుజాల మీద మోసిన మునీర్ భాయ్ ఇప్పుడేం చేస్తాడు? ముస్తఫా దారిన బయలుదేరిన వందలాది భక్తజనం ఇప్పుడు ఏం చేస్తారు?
చాలా ప్రశ్నలు వున్నాయి, కానీ, నా ప్రశ్నలన్నీ ఆ గదితో మొదలయ్యే, చివరికి అక్కడే అంతమవుతున్నాయి.
చూస్తూ చూస్తూ వుండగానే అనేక రంగులు మారిన అతి సంక్లిష్టమయిన పెయింటింగ్ ముస్తఫా జీవితం. ఆ పెయింటింగ్ వొక కన్నుకే వివిధ సందర్భాల్లో వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఏ రంగు నిజంగా ముస్తఫా జీవితాన్ని ఆవిష్కరిస్తుందో? నా మటుకు నాకు అది సందిగ్ధ వర్ణ సమ్మేళనం.
అసలు బాబా ముస్తఫాకి మరణమే లేదని కదా వూరంతా అనుకుంది. అట్లా అని గుడ్డిగా నమ్మేసే అతార్కిక స్థితికి వచ్చేసింది జనమంతా అతని కథలు విని, అతని మాటల మార్మికలోకంలో పడి! వూరంతా చెప్పే కథలు, చుట్టూరా వూళ్ళన్నీ పాక్కుంటూ వెళ్ళిపోయిన కథలు అటు వినీ ఇటు వినీ “నిజమేనేమో, ముస్తఫా దరిదాపుల్లోకి కూడా మరణం రాదు పో” అని నమ్మే స్థితికి నన్ను నేనూ తోసుకుంటూ వెళ్లిపోయాను.
ప్రళయం అనేది పెను ఉప్పెనలా వస్తే, ముస్తఫా ఆ ఉప్పెన తల మీద నాట్యం చేస్తాడని, అది నిప్పుల రూపంలో వస్తే, అతను ఆ నిప్పులతో ఆడుకుంటాడని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది వూళ్ళో! ఆ నమ్మకాలలో నాకేమీ నమ్మకం లేదు. మౌలానా అంటే నాకు మునీర్ భాయ్ తండ్రి. ఫాతిమా అత్త భర్త. నాతో కలిసి ఆడుకున్న మునాఫ్, ముజఫర్, ముంతాజ్, మోమిన్, మహమూదాల తండ్రి. అన్నిటికీ మించి, నేను అమితంగా ఇష్టపడే గోరీమా కొంతకాలం పాటు అమితంగా గౌరవించిన వ్యక్తి. గోరీమా మాటల్లో చెప్పాలంటే, “దీని మాలుమాత్ (ఇస్లాం చదువు) వున్నవాడు. భక్తి అంటే ఏమిటో నిజంగా అర్థమయిన వాడు.”
కానీ, చివరికి ఈ హోదాలేవీ అతను మిగుల్చుకోలేదు. అన్నిటిని విదుల్చుకుని వెళ్లిపోయాడు, ఆ చీకటి గదిలోకి!
అబ్బా చనిపోయాడని మునీర్ భాయ్ చెప్పినప్పుడు – నేను కాస్త సందిగ్ధంలో పడ్డాను, వెళ్లగలనా లేదా! వెళ్ళినా, దాదాపూ నా కుటుంబంలాంటి మునీర్ కుటుంబాన్ని చూడగలనా? ఎందుకో, ముస్తఫా చివరి చూపుకి వెళ్ళి రావాలని లోపల్లోపల అనిపించింది, కానీ, అంత కంటే ఎక్కువ మునీర్ భాయ్ తండ్రి పోయాడని, వాడిని కనీసం చూడాలని అనిపించింది. కానీ, మృత్యు ముఖాన్ని నేరుగా చూసే ధైర్యమేదో నా లోపల లేదు.
మునీర్ నా జీగ్రీ దోస్తు. చిన్నప్పుడు వూళ్ళో మా ఇళ్ళు దూరం అనే మాటే కానీ, రోజులో ఎక్కువ భాగం ఇద్దరం కలిసే వుండే వాళ్ళం, వొకటే క్లాసు కూడా కావడంతో కలిసే చదివే వాళ్ళం కూడా. ‘మీరిద్దరూ కవలలేమిట్రా?” అని అందరూ సరదాగా కాసేపు, కచ్చగా కాసేపు అనే వాళ్ళు. నేను వూరు మారాను కానీ, వాడితో స్నేహంలో ఏమీ మార్పు లేదు, కాకపోతే, ఇద్దరి మధ్యా ఇప్పుడు సమాచారం అంత వేగంగా బట్వాడా కావడం లేదు, అంతే!
ఒక సాయంత్రం నేను ముస్తఫా గది అరుగు చివరకు కూర్చొని, ఆ తెల్ల కర్టెను మెల్లిగా లాగుతున్నప్పుడు, మోమిన్ చూసింది, వెంటనే, “అమ్మీ,” అని వొక్క కేక వేసి, “అమ్మీ, అఫూ భాయ్ అబ్బాజాన్ గదిలోకి వెళ్తున్నాడమ్మీ?” అంది. లోపలేక్కడో వున్న ఫాతిమా ఫుప్మా వొక్క పరుగున వచ్చి నన్ను లాక్కుపోయింది. “వద్దురా బాబూ, వద్దు! మామయ్య చంపేస్తాడు చూస్తే..” అని సముదాయించింది.
నిజానికి వాళ్ళ ఇంట్లో నాకు ఎప్పుడూ ఎలాంటి నిషేధాలూ, ఆంక్షలూ లేవు. అట్లాంటిది ఆ మాట వొకటికి రెండు సార్లు విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతకంటే ఎక్కువగా, అది నా లోపల వొక కుతూహలాన్ని తవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఇంతకీ ఏం వుంది ఆ గదిలో? మునీర్ భాయిది చిన్న ఇల్లు, చాలా పాతకాలం ఇల్లు కూడా. అట్లాంటిది వొక గది వాళ్ళ అబ్బా జాన్ ముస్తఫా కోసం విడిగా వుంచడం వల్ల తూనీగ రెక్కల మా కాళ్ళకి సంకెళ్లు వేసినట్టయింది. మూడు గదుల ఇంట్లో వొక గది అట్లా ఇచ్చేస్తే, ఇక మిగిలేది రెండు గదులు. ఆ రెండు గదుల్లో అర డజను మంది వుండడం అంటే, వొకళ్లనొకళ్లు రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం, కోపం వస్తే తిట్టుకోవడం..అంతే! మా ఆట పాటలు బంద్. మా దూకుడు బంద్. ఫలితంగా, మునీర్ భాయ్ తో పాటు నేనూ వాడి చెల్లెళ్ళు, తమ్ముళ్ళమంతా బయటికెళ్ళి చెట్ల కిందా, రోడ్ల మీదా ఆడుకునే అలవాటు పట్టడానికి చాలా కాలం అయ్యింది.
అప్పుడే మాకు బయటి ప్రపంచం కాస్త అర్ధమవ్వడం కూడా మొదలయ్యింది. ఈ బయటి ప్రపంచంలో ముస్తఫా బాబాగా మారడమూ అర్థమవుతోంది. చూస్తూ చూస్తూ వుండగానే, ముస్తఫా ఆ గదిలోకి పూర్తిగా బదిలీ అయిపోవడమూ, అదే అతని ప్రపంచపు తుదీ మొదలుగా మారడమూ జరిగిపోయాయి.
ముస్తఫా గది నాకు అంతుపట్టని మిస్టరీ. ఆ గది రహస్యం చేదించాలన్న వీరోచిత స్వప్నమేదో ఆ రోజుల్లో నన్ను నిద్రపోనిచ్చేది కాదు. పైగా, అందరూ ఆ గదిలోకి మా పిల్లల ఎంట్రీని నిషేధించేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతూ పోయింది నాలో!
అదే సమయంలో గోరీమా మాకు ఖురాన్ పాఠాలు మొదలు పెట్టింది. పదకొండేళ్లు నిండేసరికి ఖురాన్ పూర్తి చేసేయ్యాలన్నది అక్కడ మా అన్ని ముస్లిం కుటుంబాలలో ఆనవాయితీ. అరబ్బీ మొదటి పుస్తకం “అలీఫ్ లామ్ మీమ్” అయిపోయిన వెంటనే, “బచ్చే, నువ్వు ఈ శుక్రవారం నమాజ్ తరవాత ఇంటికి రా. బెల్లం ఫాతెహా చదివించి నీకు ఖురాన్ షరీఫ్ షురూ చేస్తా” అని ముందే గోరీమా ప్రకటించెయ్యడంతో ఇంకో కొత్త ఉత్సాహం మనసులో-
మొదటి అరబ్బీ వాచకం చదివాక అరబ్బీ అంటే అల్లం మురబ్బా అయిపోయింది నాకు. ఓహ్, ఈ అల్లం మురబ్బా కథ కూడా వొకటి చెప్పాలి తరవాత- పొద్దున్నే చాయ్ కి ముందు మీరా సాయిబు అల్లం మురబ్బా తినకపోతే, మాకు తెల్లారినట్టే వుండేది కాదు. అసలు ఖురాన్ చదవడానికి ముందే, కొన్ని ఖురాన్ సూరాలు మా చేత బట్టీ కొట్టించింది గోరీమా. అరబ్బీ మురబ్బాలంత తేలికగా ఆ ఖురాన్ సూరాలు నోటి మీంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయేవి. నిజానికి ప్రతి శుక్రవారం నమాజ్ లో మసీదులో మౌలానా నోటి వెంట అరబ్బీ వాక్యాలు వినడం కూడా బాగుండేది. జగ్ నే కీ రాత్ (జాగారం) చేసే రోజుల్లో కేవలం అతని కంఠస్వరంలో అరబ్బీ వినడం కోసం రాత్రంతా మసీదులో వుండేవాళ్లం.
కానీ, ఇవన్నీ చూస్తూ చూస్తూ వుండగానే అన్నీ మారిపోయాయి. ముస్తఫా గొంతు మారిపోయింది. తీరు మారిపోయింది. వొక కొత్త మనిషి అతని శరీరంలోంచి దూసుకుంటూ వచ్చినట్టనిపిస్తోంది.
మసీదు బయట ముస్తఫా నిర్మించిన కొత్త లోకంలో మాకు చోటు లేకుండా పోయింది, ఆ గదితో సహా.
“ఆ గదిలోకి మీరు వెళ్లకపోవడమే మంచిది రా! మీ సోబత్ పైనున్న అల్లాహ్ తోనే కానీ, కింద తిష్ట వేసిన ఈ షైతాన్ తో కాదు!” అని వొక రోజు పని కట్టుకుని గోరీమా చెప్పినప్పుడు, ఆ గదిలోకి వెళ్ళి తీరాల్సిందే అని ఖాయం చేసుకున్నాం మేం నలుగురయిదుగురం!



2
ఏముంది ఆ గదిలో?
ఇదే, ఇదే ... మా అన్వేషణ అప్పట్లో.
ఆ గదిలోని రహస్యాల శోధన కోసం అప్పటి మా చిన్ని ప్రపంచం వూహించగలిగిన అన్ని వూహా లోకాలూ చుట్టి వచ్చేవాళ్లం. ఆ తెల్లటి తెర తొలగించుకుని లోపలికి అడుగు పెడితే, ఏమేం చూడవచ్చు? ఫాతిమా అత్తయ్య ప్రతి రాత్రీ ఆ తెరని శుభ్రంగా కడిగి, ఉతికి, మళ్ళీ తెల్లారేటప్పటికి ఆ తెరని వేలాడదీసేది.
“ఎందుకు పుఫ్మా?’ అని దాదాపూ రోజూ అడిగే వాణ్ని.
“చాదస్తం చుట్టుకుంది రా...చాదస్తం...షైతాన్ నెత్తి మీద కూర్చుంటే, లోకం అంతా అష్టవంకర్లుగా కనిపిస్తుంది. అట్లుంది మీ మామయ్య వ్యవహారం?” అనేది.
మునీర్ నా కంటే రెండు మూడేళ్లు పెద్ద అయినా, వాడికి కూడా ఆ వ్యవహారం ఏదో అంత ఖరాగా అర్ధమయ్యేది కాదు. కానీ, వాడి మాటల్లో కూడా వొక రకమయిన అయిష్టత వినిపించేది. ఆ ఇంట్లో తలకొక ఆలోచన అన్నట్టుగా మారిపోయింది.
ఆ గది చుట్టూ మా ఆలోచనలు ఎంతగా కమ్ముకుని వుండేవంటే, చాలా కాలం పాటు ఆ గది నా కలల్లోకి వచ్చేది. ముస్తఫా స్వయంగా ఆ గదిలోకి మమ్మల్ని తీసుకు వెళ్ళి, అక్కడి వింత వింతలన్నీ చూపిస్తున్నట్టు, మేం కళ్ళప్పగించి వింటున్నట్టు, అక్కడి విచిత్ర వస్తు సముదాయాన్నంతా చేతులతో తాకి తాకి చూస్తున్నట్టు కలలు కనే వాళ్ళం, ఆ కలల్ని వొకరికొకరం చెప్పుకునే వాళ్ళం. మునీర్ భాయ్ అవన్నీ విని, “మీకు ఆ పిచ్చి బాగా పట్టుకుందిలే.. అస్సల ఆ గదిలో ఏమీ లేదురా బాబూ!’ అనే వాడు.
“నువ్వు లోపల చూశావా?”
“లేదు...ఎవరినీ లోపలికి రానివ్వడు అబ్బా,” అనే వాడు మునీర్.
“మరి, నీకేం తెలుసు?’
“ఏమీ తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు!” అనేసి అక్కడి నించి వెళ్లిపోయే వాడు మునీర్ భాయ్. గోరీమాని మొదటి సారి ఈ విషయం అడిగినప్పుడు, “ముస్తఫా కి జ్ఞానం మరీ ఎక్కువయి ఏడుస్తున్నాడురా! లేనిపోని ఆశలు, కోరికలు పెంచుకొని వట్టి వూహల్లో బతుకుతూ పోతున్నాడు. ఇట్లాంటి వాటిని అల్లాహ్ అస్సల క్షమించడు,” అని ఆ రోజు ఖురాన్ లో వున్న అల్-బఖ్రా సూరాలు మా చేత బట్టీ కొట్టించింది. అయితే, గోరీమాలో వున్న గొప్ప తనం ఏమిటంటే, కేవలం బట్టీ కొట్టించి, వూరుకోదు. వాటి అర్థాలు విడమర్చి చెప్తుంది. అయినా, ఆమె చెప్పిన అర్థాలకు మించిన అద్భుత లోకమేదో ఆ గదిలో వుందని మా నమ్మకం.
మాకు తెలియని, అస్సలు అర్థం కానిదేదో అక్కడ గుప్తనిధిలా వుందని అనిపించడం మొదలయ్యింది. అప్పుడే కాస్త కాస్త లోకం అర్థమవుతున్న మునీర్ భాయ్ కి ఈ సంగతులు కొంచెం స్పష్టంగా వున్నట్టున్నాయి, అతను పైకి చెప్పకపోయినా!
ఈ ఉత్కంఠలోంచి మేం తేరుకోక ముందే, ముస్తఫా ఇల్లు తీర్థక్షేత్రంగా మారింది. నెమ్మదిగా పదుల సంఖ్యలో మొదలయిన జనాలు కొద్ది కాలంలోనే వందల్లోకి చేరుకున్నారు. వొక రెండు నెలల తరవాత ముస్తఫా వాళ్ళు ఇప్పుడు వున్న ఇంటికి కొద్ది అడుగుల దూరంలో ఇంకో చిన్న గది కట్టించారు భక్తులెవరో! వొక తెల్లారుఝాము మేం లేచేసరికి, ముస్తఫా బాబా సామగ్రి అంతా ఆ గదిలోకి మారింది. ఆ కొత్త గది ఎదురుగుండా చెట్టు మీద ఆకుపచ్చ జెండా వొకటి రెపరెపలాడడం మొదలెట్టింది.
“ఇదేం పోయే కాలం!” అనుకుంటూ, ఫాతిమా అత్త ఆ రోజు నెత్తీ నోరూ కొట్టుకోవడం చూశాను నేను! “ముస్తఫా ఏం చేస్తున్నాడో వానికే తెలియదు,” అనేసి ఆ తరవాత ముస్తఫా విషయంలో ఇంకేం మాట్లాడినా అనవసరం అన్నట్టు మౌనంలోకి వెళ్లిపోయింది గోరీమా.
కానీ, నా లోపల మౌనానికి చోటు లేదు. వొక అవిశ్రాంత సముద్రమేదో ఘూర్ణిల్లుతున్నట్టు, కొన్ని నల్ల మబ్బుల గుంపులు శరవేగంగా కురవబోతునట్టు లోపల వొక అశాంతి. జరగకూడనిది ఏదో జరుగుతున్నట్టు, అది వూరిని ఉప్పెనలా ముంచేస్తున్నట్టు వొక అనిర్వచనీయ భయం.
ఇవన్నీ జరుగుతూండగానే, నాన్నగారికి ఇంకో వూరు బదిలీ అయింది. ఆ వూరికి దగ్గిరగానే వున్న పట్నం చేరుకున్నాం వో ఎండాకాలం! ఆ తరవాత వూరు కేవలం వొక జ్నాపకం, మునీర్ వొక చిన్ననాటి దోస్తు మాత్రమే. కానీ, ఆ గది మాత్రమే నా మనసు మూలల్లో వుండిపోయింది. ఆ గది తలుపు మీద వేలాడుతున్న తెల్లటి తెర, గది ముందు చెట్టు మీద పెద్ద జెండా అప్పుడప్పుడూ కళ్ల ముందు రెపరెపలాడడం మానలేదు.
ముస్తఫా బాబా గురించి అప్పుడప్పుడూ ఎవరి మాటల్లోనో వినడం మాత్రమే. ఎప్పుడయినా మునీర్ ఫోన్ చేస్తాడు, వూళ్ళో సంగతులు చెప్తాడు, తన తండ్రి గురించి తప్ప. తండ్రి పాత్రని క్రమంగా చెరిపివేయాలన్న వాడి ప్రయత్నం నేను వూళ్ళో వుండగానే కొంత చూశాను. మేం పట్నం వచ్చాక అతను అసలు తండ్రి వూసే ఎత్తకపోవడం చాలా సహజంగానే అనిపించేది నాకు, ఇతరుల నించి విన్న మాటల్ని బట్టి కూడా!
మునీర్ దృష్టిలో ఆ గది వొక శత్రువు.
వొక చీకటి గుహ.
అజ్ఞానమో, విపరీత జ్ఞానమో ముప్పిరిగొన్న అదేదో వొక వలయం.
ఇంతకూ ముస్తఫా ఆ గదిలో ఏం చేసేవాడు? వొకటి మాత్రం నిజం- ఆ గది వొక్కటే అతని బాహ్య అంతర్లోకాల మధ్య వాకిలి. ఆ తరవాత అతనికి కుటుంబం లేదు, బాధ్యతలు లేవు, మసీదు లేదు, ఇల్లు లేదు. భార్యా పిల్లలు ఎవరూ లేరు. తన కోసం వచ్చే భక్త జనం తప్ప. వాళ్ళు చేసే వ్రతాలూ పూజలు తప్ప. వాళ్ళ కోసం తను ఆ గదిలో దేవుడితో చేసే సంభాషణలు తప్ప!
ప్రతి సారీ భక్తులు రాగానే, వాళ్ళ విన్నపాలు విన్న వెంటనే, ముస్తఫా ఆ గదిలోకి తను వొక్కడే వెళ్ళి, వొక అర గంట తరవాత బయటికి ప్రత్యక్షమయ్యే వాడు. ఆ వ్యవధిలో ముస్తఫా బాబా గురించి రకరకాల కరామత్ కథలు భక్త జనాన్ని ఆవహించేవి.
ముస్తఫా కోసం భజనలూ పూజలూ రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలంలో గోరీమా ఎన్ని సార్లు హెచ్చరింఛిందో తెలియదు, “ముస్తఫా, ఆఖరి రోజున దేవుడి దగ్గిర సమాధానం చెప్పుకోవడానికి నీ దగ్గిర వొక్క వాక్యం కూడా వుండదు. నువ్వు చేస్తున్నది తప్పు. అది ఏ ఇస్లాంలోనూ ఎవరూ చెప్పలేదు. నువ్వు తరగని పాపం మూటగట్టుకుంటున్నావ్?” అని.
కానీ, ముస్తఫా వింటే కదా! కానీ, వొక్కటే మంచి విషయం ఏమిటంటే, ముస్తఫా డబ్బు మనిషి కాదు. అతను తను చేస్తున్న పని నిజంగా ఆధ్యాత్మికంగా వున్నతమయిందనీ, పవిత్రమయిందనే భావనలోనే వున్నాడు.
అది ఇంకో రకంగా కుటుంబానికి నష్టం. ముస్తఫా బాబాగా రూపాంతరం అయ్యాక కుటుంబభారం అంతా అతని తలపైన వొక్కసారిగా పడింది. అంత పెద్ద కుటుంబం మోయలేక అస్తవ్యస్తమవుతూ, మునీర్ నరక యాతనలో పడ్డాడు. మొత్తంగా కుటుంబం అంతా ముస్తఫా దారిని అసహ్యించుకునే పరిస్తితి కూడా వచ్చేసింది. “అసలు ఇబాదత్ (భక్తి) అంటే ఏమిటి? కుటుంబాన్ని దిక్కు లేకుండా చెయ్యడమా?” అని గోరీమా వొకటికి పది సార్లు ముస్తఫాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, కానీ, “ఇప్పటికీ ఇదే నా దారి. నా దారిన నన్ను వెళ్లనివ్వండి,” అంటూ తన గదిలోకి నిష్క్రమించే వాడు ముస్తఫా.
ఆ గదిలోకి అంతర్ధానం కాక ముందు ముస్తఫా అయిదు పూటలా నమాజ్ చదివే వాడు. అతని నుదుటి మీద ఆ నల్ల మచ్చ దేవుడి సంతకంలా వుండేది, అతని నిష్టకి గుర్తుగా.
రంజాన్ నెల వచ్చిందంటే మసీదులో ముస్తఫా ప్రసంగం కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. అతని స్వరంలో ఆ ఖురాన్ సూరాలు వీనుల విందుగా వుండేవి. ఖురాన్ చదవని బతుకేం బతుకు అనిపించేది. గోరీమాకి కూడా ఆ రోజుల్లో ముస్తఫా అంటే గొప్ప గురి. ఇక వూళ్ళో ముస్తఫా మాటకి తిరుగు లేదు. వున్నట్టుండి, ముస్తఫా వొక తీవ్ర ఆధ్యాత్మిక చింతనలో పడిపోయి, కొన్ని సార్లు కాలం అనే స్పృహ లేకుండా, బతకడం మొదలెట్టాడు. అదే అతని మార్గంగా స్థిరపడిపోయింది ఆ తరవాత – “ముస్తఫా వొక మూర్ఖమయిన దారిలో అదే భక్తి అనుకోని దారి తప్పిపోయాడు. ఇక మనం చెయ్యగలిగేదేమీ లేదు!” అని గోరీమా వో రోజు అంది కూడా. కానీ, ఈ దారిలో ముస్తఫా చేస్తున్నదేమిటో నాకు ఏ నాడూ బోధపడలేదు.
ఆ గదిలో ముస్తఫా వొక విధంగా తనని తాను సజీవ సమాధి చేసుకుంటున్నాడా అని కూడా అనిపించింది.
కానీ, ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కునే వీలు లేకుండా మేము వూరు మారిపోయాం, అప్పుడప్పుడూ మునీర్ కబుర్లు అతని ఫోన్ ద్వారానో, వేరే స్నేహితుల ద్వారానో అక్కడి సంగతులు తెలియడం తప్ప.
ఫోన్ లో మాట్లాడిన వొకటి రెండు ముక్కల్ని బట్టి మునీర్ భాయిని అర్థం చేసుకోవడం కష్టమే. ఇప్పుడు ఆ తండ్రి మరణాన్ని మునీర్ ఎట్లా అర్థం చేసుకున్నాడో నాకు ఇంకా సందిగ్ధం గానే వుంది. ముస్తఫా రహస్య గది గురించి వున్న సందిగ్ధంలాంటిదే ఇది కూడా!
నేను బస్సు దిగేసరికి మునీర్ నా కోసం బస్ స్టాపు దగ్గిర ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు.


3
ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. ఇంకా నా మనసు నిండా ఆ గది వొక్కటే ఆవహించి వున్న మాట నిజం.
“ఇక్కడ చాయ్ తాగి పోదాం” అని తనే అన్నాడు.
బస్ స్టాప్ దగ్గిర టీ కొట్టులో రాజు నన్ను గుర్తు పట్టి, “ఎట్లున్నవ్ సారూ?” అని అడిగాడు.
“మంచిగే!” అని టీ తీసుకొని, నేనూ, మునీర్ చెట్టు కింద నిలబడి టీ తాగాం. టీ తాగుతున్నంతసేపూ మునీర్ మా ఇంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు తప్ప తన ఇంటి విషయాలేమీ చెప్పలేదు. నాకు కూడా వెంటనే అడగాలని అనిపించలేదు. నడుస్తూన్నప్పుడు అడుగుదాంలే అనుకున్నా.
మునీర్ అసలే మౌని. ఇప్పుడు ఇంకా ఘోర మౌనిగా మారినట్టు వాడి తీరుని బట్టి అర్థమయింది. మనిషి ముఖం బాగా అలసిపోయినట్టు పీక్కుపోయి వుంది. తలలో సగం వెంట్రుకలు నెరిసిపోయాయి. శరీరం బలహీనంగా వుంది. అన్ని విధాలుగా అలసిపోయాడా అనిపించింది. ముస్తఫా బాబాగా మారి, మనిషిగా ఎంత విఫలమయ్యాడో ప్రత్యక్ష సాక్ష్యంగా వున్నాడు మునీర్. కుటుంబం బరువు మోసీ మోసీ మునీర్ వీపు నిజంగానే బాగా వంగిపోయినట్టుగా అనిపించింది.
ముస్తఫా మరణం గురించి ఎక్కడ మొదలెడదామా అనుకుంటూ వుండగానే, వాళ్ళ ఇంటి దాకా వచ్చేశాం. ఫాతిమా అత్త, మునీర్ తమ్ముళ్లూ చెల్లెళ్లూ నన్ను చూడగానే కాస్త సంతోషం వ్యక్తం చేశారు.
గోరీమా కూడా అక్కడే వుంది. నన్ను చూడగానే దగ్గిరకి తీసుకుని నా తల నిమిరింది. చాలా కాలం తరవాత గోరీమాని చూడడం నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. ఆమె మొహంలో అదే ప్రశాంతత.
నేను ముందు వసారాలో కూర్చొని వున్నా, ఆ ముందు ముస్తఫా గది కోసం వెతుకుతూ.
మధ్యాన్నం ఆ పదోరోజు ఆచారాలన్నీ ముగిశాక, వున్న కొద్ది మంది చుట్టాలూ వెళ్లిపోయాక, కాసేపు కుర్చీలోనే వో కునుకు తీశాడు మునీర్.
అట్లా కునుకు తీస్తున్న మునీర్ ముఖంలోకి చూస్తూ వుండి పోయాను.
అతనిలో వొక అశాంతీ వుంది, వొక ప్రశాంతతా వుంది.
అతని మొహంలో వొక విషాదమూ వుంది, అదే ముఖమ్మీద వొక ఉపశమన రేఖ కూడా సన్నగా కదులుతోంది.
నాకు కర్బలా యోధుడిలా కనిపిస్తాడు మునీర్ వొక్కో సారి! ఆ యుద్ధ క్షేత్రంలో కనీసం కొంత మంది అయినా మిగిలారు అప్పటి యోధులకు - కానీ, ఈ కర్బలా మైదానంలో అతనెప్పుడూ వొంటరి యోధుడే అనిపిస్తాడు. ఎన్ని యుద్ధాలు కలిస్తే వొక జీవితం! ఆధ్యాత్మికత గొప్ప శాంతి కావచ్చు, గొప్ప యుద్ధమూ కావచ్చు.
కానీ, జీవితం మాత్రం అనేక యుద్ధాల గందరగోళమే! అన్ని యుద్ధాలు చెయ్యలేకనే, ఆధ్యాత్మికత అనే వొకే వొక్క యుద్ధంలో మునిగిపోయాడా ముస్తఫా? ఏమో? ముస్తఫా యుద్ధం ఏమిటో నాకు తెలియదు. మునీర్ కీ తెలియదు, గోరీమాని అడిగితే వొక సారి “ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు,” అని వొక వాక్యంలో తేల్చేసింది. అవునా? అల్లా ఏడు ఆకాశాలు అన్నాడే కానీ, ఏడు నేలలు అని ఎక్కడయినా అన్నాడా? తెలియదు. చాలా విషయాలు తెలియవు.
ముస్తఫా వొక తేలికపాటి స్వర్గాన్ని ఇక్కడ జనం కోసం నిర్మించి పెట్టాడు. ఆ కొద్ది పాటి స్వర్గమే చాలు అనుకుని, ముస్తఫా లోనే ఆ దేవుడినీ వూహించుకున్నారు జనం! కానీ, తన వాళ్ళందరికీ ముస్తఫా కేవలం షైతాన్! ఈ తేడా ఎక్కడుంది? నా ఆలోచనల్ని తెంపుతూ, “అలా బయటికెళ్దామా కాసేపు?” అన్నాడు మునీర్ అప్పుడే కన్ను తెరుస్తూ.
“చాయ్ తాగి పోరాదా?” అని మేం సరే అనేలోపే రెండు గ్లాసులు మా ముందు పెట్టింది ఫాతిమా అత్తయ్య.
ఆమె కళ్ళు ఎప్పుడూ ప్రశాంతమయిన రెండు నదులు. కానీ, ఆ నదిలో రాయి విసిరితే, ఆ రాయిని కడుపులోకి లాక్కు వెళ్తుంది ఆ నది. కానీ, వొక్కటంటే వొక్క చిన్నవలయం కూడా కనిపించదు. ఏ స్థితినయినా వొకే వొక్క నిర్మమకారంతో స్వీకరించే నిరాడంబరమయిన నిర్మలమయిన కళ్ళు ఆమెవి.
అన్నేళ్లు తనతో కలిసి వుండి, ఇంత మంది పిల్లలకు కలిసి జన్మ ఇచ్చిన భర్త శరీరం చల్లబడిపోయిన క్షణాన ఆమె ఎలా వుండింది? అందరిలా గుండెలు పగిలిపోయేలా, నేలకి చేతులు బాదుకొనీ బాదుకొనీ ఏడుస్తూ వుండిపోయిందా? అలా జరిగి వుండకపోవచ్చు. ఆమె వొక మూలలో ఆరిపోయిన దీపంలా ముడుచుకు కూర్చోనిందా? ఏమో..అలా కూడా వూహించలేను. ఇంకెలానూ, ఎలానూ వూహించలేను!?
మునీర్ చాయ్ కానిచ్చేసి, “పద బయటికెళ్దాం,” అన్నాడు.
“ఒరేయ్, అడుగుదాం అనుకుంటూ, నువ్వేం అనుకుంటావో అని సందేహిస్తున్నా. అబ్బా మరణం గురించి బయటి జనాలకి చెప్పలేదా?”
“వూళ్ళో తెలుసు. బయట వూళ్లలో తెలియదు. కావాలనే చెప్పలేదు.”
“ఎందుకు?”
“ఇదంతా మాకిష్టం లేదు. నీకు తెలుసుగా. నేను, అమ్మా, గోరీమా మొదటి నుంచీ వీటన్నిటికి దూరమే.”
“అవును, నాకు తెలుసనుకో. ఫుప్మాకి అస్సలు ఇష్టం లేదు ఈ దారి.”
“అసలు ఇది దారి కూడా కాదు నన్నడిగితే! వొక దారి మళ్లింపు. దేవుడు వొక ముసుగు. భక్తి వొక వంచన!”
“అర్థమయ్యింది. కానీ, ఆ మనిషి పోయినప్పుడు ఆ విషయం అనవసరం కదా!”
“ఎందుకో...ఇదంతా మా లోపల చాలా అసహనాన్ని కలిగించింది. కొన్నేళ్ళ నివురు పేరుకుపోయిన నిప్పు. తట్టుకోలేని స్థితి కూడా వచ్చేసింది.”
అంత కంటే ఎక్కువగా వాడి చేత మాట్లాడించడం నాకు ఇష్టం లేకపోయింది. నిజానికి, ఈ విషయంలో వాళ్ళంతా ఎలా ఫీలవుతున్నారో నాకు తెలియని విషయం అయితే కాదు కదా!
“మరి, ఆ గది?”
“చూస్తావా? చూపిస్తా. పద!”


అంటూ, ఆ గది వున్న చోటుకీ, ఆ జెండా చెట్టు దగ్గిరకీ తీసుకువెళ్లాడు. అక్కడ గది లేదన్న విషయం నేను వచ్చిన మరుక్షణమే గుర్తించాను. కానీ, ఏమయినా పొరపడ్డానేమో అనుకుని వెంటనే ఏమీ అడగలేదు.
“ఇదే గది వున్న చోటు.” అని చూపించాడు. ఆ చూపించిన చోటున గతంలో వొక గది వున్న జాడ కనీసంగా అయినా లేదు. అంతా చదునుగా వుంది. “అది కూలగొట్టాం, అబ్బా పోయిన మర్నాడే!” అన్నాడు మునీర్.
“అవునా? అంత వెంటనేనా?”
“అవును. దానికి ఏ రకమయిన కొనసాగింపూ మాకు ఇష్టం లేకపోయింది. ఆ కథ అక్కడితో ముగించడం లోకానికి, మాకూ మంచిదని అనుకున్నాం.” అన్నాడు చాలా స్పష్టంగా మునీర్.
నేను అక్కడే వున్న వొక రాయి మీద కూర్చొని, కాసేపు ఆ గది వున్నట్టే వూహించుకున్నాను. నన్ను చిన్నప్పటి నించీ వెంటాడిన ఆ గది ఇప్పటికీ నాకు ఊహ! అంతే! ఆ కనిపించని గది చుట్టూరా ముస్తఫా నీడ ఏదో తారట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు.
“సర్లే...ఇక వెళ్దాం పద!” అన్నాడు మునీర్ చాలా మామూలుగా, నా ఆలోచనల్లో ఆ గది ఇంకా నిలబడే వుందన్న విషయం గుర్తించి కూడా గుర్తించనట్టు.
“ఆ గది ఎప్పటికీ నాకు చీకటి గుహ. దేవుడు వున్నాడని నేను గట్టిగా నమ్ముతాను, కానీ ఈ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో వున్నాడని ఎవరు చెప్పినా నేను నమ్మను. దాన్ని కూల్చినప్పుడు నాకు ఆ చీకటి నించి విముక్తి దొరికింది,” అన్నాడు మునీర్ బయటికి వస్తూ.
“ఓ, ఈ కథ ఇలా ముగిసిందా?” అన్నాను పైకే.
“అవును, కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి,” అన్న మునీర్ వాక్యం ఆ రోజు నన్ను నిద్రపోనివ్వలేదు!
*
Category: 21 comments
Web Statistics