(ఇది నిన్న ఆంధ్రజ్యోతి సాహిత్య పేజీ "వివిధ"లో అచ్చయిన వ్యాసం)
అక్బర్ బేగమ్....తొలి ఆధునిక ముస్లిం కవయిత్రి ?
1850 నుంచి 1910 - తెలుగు సాహిత్య సాంస్కృతిక చరిత్రలో వొక మేలు మలుపు. కొత్త రూపం దిద్దుకుంటున్న సంప్రదాయాలు, ఇంకా పూర్తిగా ప్రసరించని ఆధునికతల మధ్య వొక సందిగ్ధ ఉదయ సంధ్య.
సాంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేస్తూ కొంత, విచ్ఛిన్నం చేయకుండా కొంత, కొత్త భావనల్ని ప్రవేశపెట్టే ప్రయత్నం ఈ కాలంలో జరిగింది. ఒక భావనగా ఆధునికత – ఈ మార్పులన్నిటికీ మూల బిందువు. ఆధునికత ని ఎలా అర్థం చేసుకోవాలన్న విషయంలో ఇప్పుడు కొన్ని కొత్త దారులు తెరుచుకుంటున్నాయి. ఆధునికత అనేది విశ్వజనీన భావన కాదన్నది బలంగా వినిపిస్తున్న వాదన. స్థానిక ఆధునికత అనేది పాశ్చాత్య ఆధునిక భావనకి, వలస ఆధునికతకీ ఎంత భిన్నంగా వుంటుందో కొత్త ఆధారాలు కూడా దొరుకుతున్నాయి. అయితే, తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణంలో ఈ కొత్త భావన ఎలాంటి పాత్ర పోషించబోతుందో ఇంకా మనకి స్పష్టంగా రూపు కట్టడం లేదు. ముఖ్యంగా, 1900 తరవాత ఆధునిక సాహిత్యంలో ప్రధాన పాత్ర పోషించిన కథ, కవిత లేదా పద్యం, వ్యాసం, పత్రికా రచన లాంటి సాహిత్య రూపాల మీద ప్రత్యేకించి కొంత దృష్టి పెట్టాల్సిన అవసరం వుందని ఈ కొత్త ఆధారాలు నొక్కి చెబ్తున్నాయి. ఇప్పటికే, ఆధునిక కథకి సంబంధించినంత వరకూ, భండారు అచ్చమాంబ కథల గురించి కొంత చర్చ మొదలయ్యింది. అచ్చమాంబ కృషిని సాహిత్య దృష్టితో మాత్రమే కాకుండా, స్త్రీల చరిత్ర నిర్మాణంలో భాగంగా చూడాలని పరిశోధకులు గుర్తిస్తున్నారు. ఈ చర్చని విస్తరిస్తూ, 1904 లో “హిందూ సుందరి” పత్రికలో అక్బర్ బేగమ్ అనే వొక ముస్లిం తెలుగు కవయిత్రి ప్రచురించిన పద్యాన్ని అప్పటి చారిత్రక నేపధ్యం నుంచి పరిచయం చెయ్యడం ఈ వ్యాసం ఉద్దేశం.
ఆధునికత కేవలం సాహిత్య భావన కాదు, అది వివిధ స్థాయిలలో ఆచరణలోకి అనువాదమయ్యేటప్పుడు వొక సామాజిక భావనగా తనదయిన బహిరంగ ఆవరణ (పబ్లిక్ స్ఫియర్ లేదా పబ్లిక్ స్పేస్) ని సృష్టించుకుంటుంది. పత్రికల ఏర్పాటు – వాటిలో పాఠకులకు తగినంత చోటు, విద్యా సంస్థల ప్రారంభం, గ్రంథాలయోద్యమం వ్యాప్తి, టౌన్ హాళ్ళ వంటి పబ్లిక్ సంఘాల నిర్మాణం, చర్చా వేదికలు, ప్రకటనలు, కరపత్రాలు – ఇవన్నీ ఇందులో భాగమే. మనకు తెలిసిన ఈ ఆధునిక చరిత్రలో స్త్రీల స్థితిగతుల ప్రస్తావనకి లోటు లేదు. కానీ, స్త్రీలకి సంబంధించిన ఈ కొత్త భావనలూ, ఉద్యమాలూ, సంఘాలు కూడా పురుషుల ఔదార్యం, స్పూర్తి వల్ల మాత్రమే జరిగినట్టు చదువుతూ వుంటాం. ఇలాంటి రంగాలలో అధికారిక చరిత్ర విస్మరించిన కొన్ని కోణాల లోతుల్లోకి వెళ్తే, ఆధునిక భావాల నిర్మాణంలో స్త్రీల పాత్ర నిర్లక్ష్యానికి గురయ్యిందని అర్థమవుతుంది. మనకి తెలిసిన చరిత్రకి భిన్నంగా, స్త్రీలు సంఘాలుగా ఏర్పడడం, చర్చా వేదికలు నిర్వహించడం, స్త్రీ విద్య లాంటి భావనల్ని మారుమూల పల్లెలకి తీసుకు వెళ్ళడం మొదలయినవి స్త్రీల వైపు నించి విస్తృత స్థాయిలో జరిగాయని కూడా అర్థమవుతుంది. “స్త్రీల కొరకు స్త్రీలు నిర్వహించిన” తొలి ఆదునిక పత్రికా ప్రయోగం “హిందూ సుందరి” సంపాదకీయాలు చదువుతున్నప్పుడు ఈ చర్చలు చాలా సందర్భాలలో ఉద్వేగభరితంగా కూడా జరిగాయని తెలుస్తుంది.
1902 తరవాత మొసలికంటి రామాబాయి (ఈమె, ఈమె భర్త సత్తిరాజు సీతారామయ్య ఇప్పటి ప్రసిద్ధ చిత్రకారులు “బాపు” పూర్వీకులని అంటున్నారు) అనే వొక మహిళ సంపాదకత్వంలో వెలువడిన “హిందూ సుందరి” పత్రికలోని స్త్రీల రచనలని ఈ చారిత్రక నేపథ్యం నించి తిరిగి పరిశీలించాల్సిన అవసరం వుంది. ఈ పత్రికలో సంఖ్యానేకంగా వెలువడిన స్త్రీల రచనలు ఆధునికత అనే భావన చుట్టూ వాళ్ళు స్వతంత్రంగా నిర్మించిన కొత్త ఆలోచనా వ్యవస్థ గా చూడవచ్చు. ఇవి విడివిడిగా ఆయా రచయిత్రులు తమ తమ వ్యక్తిగత పరిధుల్లోనే చేసినప్పటికీ, కొన్ని ప్రయత్నాలు స్థానికంగా సంఘ నిర్మాణం దాకా వెళ్ళినా, అచ్చు సంస్కృతి లోకి ప్రవేశించడం వల్లా, వొక పత్రిక దానికి వేదిక అవ్వడం వల్లా వాటికి వొక సమష్టి బహిరంగ రూపం దక్కింది. స్త్రీ విద్యా కేంద్రంగా నిర్మితమయిన ఈ భావాల వ్యవస్థ సంప్రదాయాన్ని పూర్తిగా నిరాకరించలేదు, అట్లా అని పూర్తిగా అంగీకరించ లేదు కూడా. సాంప్రదాయ భావనల్ని తిరగదోడి, వాటి అసలు ఉద్దేశాలను పునర్నిర్మించే ప్రయత్నం ఈ రచనల్లో గట్టిగా కనిపిస్తుంది. దీనికి అప్పటి హిందూ భావనల పునర్నిర్మాణ ప్రక్రియతో సంబంధం వుంది. ఇది హిందూ పునరుద్ధరణ ప్రక్రియ కాదన్నది మనం స్పష్టంగా గుర్తించాలి.
అయితే, ఈ పరిధిలో కథ, వ్యాసం, పత్రికా రచన లాంటి వచన ప్రక్రియలు చేసే పనికీ, కవిత్వం లేదా పద్యం లాంటి ప్రక్రియలో జరిగే పనికీ చాలా వ్యత్యాసం వుంటుంది. సాహిత్యంలో వ్యక్తమయ్యే స్పందనలు అనుదిన జీవితంతో ముడిపడి వుండేవే అయినప్పటికీ, అనుదిన జీవన సంస్కృతికి వుండే చట్రాన్ని కూడా అవి ఉద్వేగంగా ప్రశ్నిస్తాయి. అయితే, ఆయా సాహిత్య ప్రక్రియల సంవేదనాత్మకత స్వభావాన్ని బట్టి ఈ చట్రం ఎదుర్కొనే ప్రశ్నలు వుంటాయి. కవిత్వం వొక విధమయిన సజీవ సంవేదనాత్మకతని ప్రతిబింబిస్తుందని ప్రసిద్ధ స్త్రీవాద కవయిత్రి ఎడ్రియన్ రిచ్ వొక సందర్భంలో అంటుంది. ముఖ్యంగా సాహిత్యంలో పూర్వ నిర్ధారిత సంప్రదాయ రాజకీయ సంస్కృతి చట్రం ఎలాంటి పాత్ర పోషిస్తుందో విశ్లేషిస్తూ, ఆమె ఇలా అంటుంది: In a political culture of managed spectacles and passive spectators, poetry appears as a rift, a peculiar lapse, in the prevailing mode.
రాజకీయ సంస్కృతి అనే భావనని ఆమె చాలా విస్తృతార్థంలో వాడినట్టు ఇక్కడ వేరే చెప్పక్కర్లేదు. అయితే ఆ సంస్కృతిలో సంప్రదాయం పాత్రని ఇక్కడ ప్రత్యేకించి గమనించాలి. అందునా, స్త్రీ సమస్యలకి సంబంధించి ఈ సంప్రదాయిక నిర్మాణం బలంగా పని చేస్తుంది. అందుకే, తెలుగు నాట స్త్రీల సమస్యలకి సంబంధించి సంస్కర్తలు అయినా, సాహిత్య వేత్తలు అయినా కొంత అదనపు శక్తిని ఉద్దేశపూర్వకంగా ప్రయోగించాల్సి వచ్చింది. దీనికి వొక ఉదాహరణ “హిందూ సుందరి” పత్రిక నిర్వహణ. ఈ పత్రికలో వచన రచనలన్నీ వొక ఎత్తు, కవిత్వం వొక ఎత్తు. కవిత్వంలో వుండే వొక సహజమయిన భావ తీవ్రత, ఆవేశం ఆ ప్రక్రియని వొక peculiar lapse గా మార్చుతుంది. ఇలాంటి సన్నివేశంలో స్త్రీగా రాయడం, అందులోనూ భావ తీవ్రత మూలమయిన కవిత్వ ప్రక్రియలో ఆ స్త్రీ తన ఆలోచనని వ్యక్తం చెయ్యడం అనేక వొత్తిళ్ల మధ్య సంఘర్షణ పడడమే. దీనికి తోడు, ఆ కవయిత్రి ముస్లిం సమాజం నించి వచ్చినప్పుడు, తన తల్లి భాషలో కాకుండా, స్థానిక భాషలో రాయడం ఎంత సంఘర్షణో ఊహించుకోవచ్చు. ఆయా భాషల చట్రాలు కూడా ఆమె మీద గట్టిగానే వొత్తిడి పెడతాయి. వీటిని దాటుకొచ్చి వొక సాహంకార పద్యంగా నిలబడిన వ్యక్తి అక్బర్ బేగమ్.
ఎవరీ అక్బర్ బేగమ్?
తొలి ఆధునికులలో సుప్రసిద్ధుడయిన కవి ఉమర్ అలీ షా భార్య అక్బర్ బేగమ్. తన విశిష్ట కావ్యం “సూఫీ వేదాంత దర్శము” ఆయన తన భార్య అక్బరాంబ కి అంకితమిస్తూ, అక్బరాంబ గొప్ప పండితురాలని, తన కావ్యాలన్నిటికీ ఆమె మొదటి పఠిత, విమర్శకురా లనీ అంటారు ఉమర్ అలీ షా కవి. వ్యక్తిగా, పండితురాలిగా ఆయనపైన అక్బర్ బేగమ్ గాఢమయిన ప్రభావం కలిగించిందని ఈ అంకిత పద్యాల్ని బట్టి తెలుస్తుంది. అక్బర్ బేగమ్ చనిపోయిన తరవాత ఉమర్ అలీ షా కవి కూడా దాదాపూ వొక విధమయిన మౌనంలోకి వెళ్ళిపోయారు. 1935 లో ఆమె డిల్లీలో కన్నుమూసినప్పుడు ఆమె మృతికి సంతాప సూచకంగా డిల్లీ శాసన సభకి ఆ రోజు సెలవు ప్రకటించారు.ఒక వైపు క్రియాశీల రాజకీయవేత్తగా అప్పుడే జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకట్టుకుంటున్న ఉమర్ అలీ షా ఈ అనూహ్యమయిన మరణ విషాదాన్ని తట్టుకోలేక, లోలోపలే బాధని దిగమింగుకుంటూ, అస్వస్థులయ్యారు. ఆ తరవాతి కాలంలో ఆయన మెదడు నరాలు చిట్లి, కన్ను మూశారు.
తమ ఇద్దరి అనుబంధంతో పాటు, అక్బర్ బేగమ్ కుటుంబ చరిత్రని కూడా ఉమర్ అలీ షా ఈ పద్యాల్లో కొంత రాశారు.
ఏను రచించినట్టి కృతులెన్నిటనో వినె తల్లి; తండ్రి నా
నా నవనాటక ప్రకరణంబులు నాడగ జూచినారు; ఢి
ల్లీ నగరాంగ్ల భారత మహీధవ శాసన సభ్య సత్పదం
బానగ గాంచి “అగ్బ”రమరాలయమేగే వెలుంగు చుక్కయై.
పరమ పవిత్ర యీ వెలది పండితురాలు నితాంత సత్యసం
భరిత రసాత్మక ప్రకృతి వడ్డికిబారెడు ప్రేమమూర్తి సుం
దర సముపాసితం బయిన ధర్మపదంబును సంతరించి యీ
శ్వరునెద నగ్బరాంబ కడు ప్రార్ధన సేయుచు నెల్ల వేళలన్.
ఉమర్ అలీ షా గారి ఈ అంకిత పద్యాలు తప్ప, ఈ కవయిత్రి గురించి ఇంతకు మించి సమాచారం ఏదీ దొరకడం లేదు. “హిందూ సుందరి” లో ప్రచురితమయిన పద్యం కూడా చివరలో “సశేషం” అని వుంది. తరవాతి సంచికలలో ఆ పద్యం రెండో భాగం కూడా లభ్యం కావడం లేదు. అయితే, 1915 తరవాత ఉమర్ అలీ షా సూఫీ గురువుగా ప్రసిద్ధులవ్వడంతో, ఆయనతో పాటు అక్బర్ బేగమ్ సూఫీ ప్రచారంలో విరామమెరుగక పర్యటించేవారని, ఉమర్ అలీ షా శిష్యులలో చెప్పుకోదగిన సంఖ్యలో మహిళలు కూడా వుండడం వల్ల వారి కోసం ఆమె ఎక్కువ సమయం వెచ్చించే వారని ఉమర్ అలీ షా గారి ఇతర రచనల ద్వారా తెలుస్తోంది.
అక్బర్ బేగమ్ కూడా తన పద్యం లో ప్రవర చెప్పుకునే కావ్యగానం ఆరంభిస్తుంది. “నేను మహమ్మదీయ కాంతనయిననూ మజ్జననియును అత్తమామగార్లు కళ్యాణగుణ గణాలంకార విద్యా కాంతార విహార చేతస్కులై, జగద్ధిత కీర్తి బ్రవర్తింపుటం జేసి, తదీయ సహవాస వాసన నా మంద బుద్ధికి సోకి, భ్రమర కీట న్యాయానుసారము నొక్క తృటిలో నీ మహత్తర నీతి కథా చరిత” రాస్తున్నట్టు చెప్పుకుంది. ఈ పద్యంలో ఆమె తల్లి శిలార్ బీబీ జీవితంలోని వొక ముఖ్యమయిన ఘట్టాన్ని మాత్రమే అక్బర్ బేగమ్ వివరించింది. పద్యం నడకని బట్టి చూస్తే ఆమె వొక దీర్ఘ ఆత్మకథాత్మక కావ్యం రాయాలని మొదలు పెట్టినట్టుగా వుంది. ఈ పద్యంలో ఆమె శిలార్ బీబీ అత్తవారింటికి రావడం, అక్కడ ఆమె అనుసరిస్తున్న కొత్త ఆచార పద్ధతులతో, తన సూఫీ చదువూ, కొత్త సంస్కారం వల్ల (“ యీ జెష్ట మంత్రంబులెక్కడో నేర్చి/ దెయ్యాల ప్రార్ధించు”) ఆమె గర్విలా కనిపిస్తుంది అక్కడి వాళ్ళకి- అప్పుడు భర్త ఆమెని “కోపంబుతో ముండరండా అనుచు” కర్రలతో మొత్తుతుంటాడు. “ఇట్లనేక విధముల బాధలనుభవించి/ నోర్చి” కాలం గడుపుతూ వుంటుంది శిలార్ బీబీ. చివరికి వొక అగ్ని పరీక్ష లాంటిది ఆమె కూడా ఎదుర్కొంటుంది. ఆ అగ్ని పరీక్షలో ఆమె నెగ్గుతుంది. అందరూ ఆమె వ్యక్తిత్వాన్ని గౌరవించడం మొదలెడ్తారు. పతివ్రతగా వుంటూనే, తనదయిన వ్యక్తిత్వ ముద్రతో ఆమె ప్రవర్తిస్తుంది. ఈ కథ నిజానికి ఇప్పుడు అంత ఆసక్తికరంగా అనిపించకపోవచ్చు. కానీ, వొక స్త్రీ, అందునా ముస్లిం స్త్రీ ఈ మాత్రం తన కథని చెప్పడం విశేషంగానే భావించాలి.
ఈ పద్యం ప్రవరలో ఆమె ప్రస్తావించినట్టు ఆమె మామ గారు, ఉమర్ అలీ షా కవి తండ్రి మహర్షి మొహియుద్దీన్ బాషా ఆధ్యాత్మిక విద్యా పీఠాధిపతి. ఆయన ప్రధానంగా తెలుగులో సూఫీ తత్వాలు కూర్చారు. అయితే అవి కేవలం ఆయన భక్తులకు మాత్రమే పరిమితం. ఆ వారసత్వం నుంచి వచ్చిన ఉమర్ అలీ షా కవి కూడా చాలా కాలం పాటు ఆశు సంప్రదాయంలోనే వుండిపోయారు. ఉమర్ అలీ షా ఖండికలు 1905 వరకూ అచ్చు రూపం దాల్చిన దాఖలాలు లేవు. అయితే, అప్పటికే ఆయన పద్యాలు మౌఖిక రూపంలో బాగా ప్రాచుర్యంలో వుండేవి. వొక సూఫీ తత్వవేత్తగా ఆయన రూపాంతరం చెందుతున్నారు. లిఖిత సంస్కృతి చరిత్ర నించి చూస్తే, 1904లో “హిందూ సుందరి” పత్రికలో “అపూర్వ పతివ్రతా చరిత్రము” అనే శీర్షికతో వెలువడిన అక్బర్ బేగమ్ పద్యమే అచ్చు రూపం దాల్చిన తొలి తెలుగు ముస్లిం పద్యమే కాక, అచ్చు సంస్కృతీ, ఆధునికతా, పబ్లిక్ స్పేస్ ల కొత్త మేధో వాతావరణంలోకి ప్రవేశించిన తొలి ముస్లిం రచన కూడా అవుతుంది.
అక్బర్ బేగమ్ పద్యం సమకాలీన సాహిత్యం పట్ల ఆమెకి వున్న లోతయిన అవగాహనని చెబుతుంది. ఆమె ఉద్దేశపూర్వకంగా రెండు రకాల సామాన్యీకరణ వ్యూహాల్ని వినియోగించుకున్నట్టు కనిపిస్తుంది. మొదటి వ్యూహం: సాహిత్య వస్తువుని పూర్వ గాథల నించి విముక్తం చెయ్యడం, రెండు: భాషలో సామాన్య భాషని వాడడం. ఈ పద్యంలో ఆమె ద్విపద, ఉత్పల మాల, సీసం, తేటగీతి వృత్తాలని వుపయోగించింది. కానీ, సంప్రదాయ పద్యంలో వుండే సంస్కృత ప్రభావాన్ని వదిలించుకొని, వాడుక తెలుగుని వాడాలన్న పట్టుదల ఈ పద్య పాదాల్లో కనిపిస్తుంది. స్త్రీల పట్ల పురుషులు ఎట్లాంటి తిట్టు పదాలు వాడతారో ఈ సామాన్యీకరణ వ్యూహంలో వొక భాగమే. అదే విధంగా, మొహియుద్దీన్ బాషా లాంటి సూఫీ తత్వ కవులు భక్తి కవిత్వంలో ప్రవేశపెట్టిన సామాన్యీకరణని, నిరలంకారతని ఆమె వారసత్వంగా పుణికి పుచ్చుకున్నట్టు ఈ పద్యాల్ని బట్టి తెలుస్తుంది. తరవాతి కాలంలో ఉమర్ అలీ షా సూఫీ విశ్వ విజ్ఞాన పీఠంలో క్రియాశీలక పాత్ర నిర్వహించడానికి వీలుగా ఆమె ఈ పద్యాలలో ఆశు సంప్రదాయ రూపం వైపు మొగ్గు చూపించింది. అయితే, ఈ రూప పరమయిన అంశాలన్నీ ఆమె “ఆధునిక మహిళ” అనే భావన పట్ల ఆమె ఆలోచనలోని భిన్నత్వం వల్ల సాధ్యమయ్యాయి.
సంప్రదాయ కథనం- ఆత్మకథనం
“హిందూ సుందరి” పత్రిక ప్రధానంగా స్త్రీ విద్య మీద, స్త్రీ కేంద్రంగా సంఘంలో రావాల్సిన మార్పుల మీదా దృష్టి పెట్టింది. అప్పటి ముస్లిం స్త్రీలు చదువు ప్రాధాన్యాయాన్ని గుర్తిస్తున్నారనడానికి అక్బర్ బేగమ్ పద్యం వొక ఉదాహరణ. విద్య ద్వారా మాత్రమే స్త్రీల స్థితిలో మార్పు వస్తుందన్న లక్ష్యంతో ఈ పత్రిక సంపాదకులు కేవలం స్త్రీలు రాసిన వ్యాసాలను ప్రచురించడం మొదలు పెట్టారు. వూరూరా విద్యావంతులయిన స్త్రీలతో రాయించడం ఈ పత్రిక ప్రధానంగా చేసిన పని. ఇలా చేయడం ద్వారా “మన దేశ స్త్రీలు భయముడిగి, ఇతర దేశపు స్త్రీల వలె తామే వొక పత్రికా భారం వహించే” స్థితికి రావాలన్నది వారి ఆకాంక్షగా ప్రకటించుకున్నారు. అందులో భాగంగా విద్యావంతులయిన స్త్రీలను తామే సంప్రదించి వారి చేత రాయించడం మొదలు పెట్టారు. స్త్రీ తన ఔన్నత్యాన్ని తానే నిబ్బరంగా ప్రకటించుకోవడం ఈ రచనల ఉద్దేశంగా కూడా వారు చెప్పుకున్నారు. ఆ క్రమంలో స్త్రీల వున్నత స్థితిని చెప్పే కొన్ని సంప్రదాయ భావనల్ని విమర్శనాత్మక దృష్టితో స్వీకరించారు. వాటిలో వొకటి: పతివ్రతా భావన. ఈ భావనని స్త్రీ విద్యా దృక్పథం నించి సవరించి చూడడం ఈ కథల్లో ప్రత్యేకత. అయినప్పటికీ, ఈ కథలు చాలా మటుకు పురాణాల నించి తీసుకున్నవే; సంప్రదాయ కథన పద్ధతిని అనుసరించినవే. 19 వ శతాబ్దిలో పాశ్చాత్య ఆధునికతకి ప్రతివాదంగా నిలబడిన “నియో క్లాసికల్ హిందూయిజం” ధోరణి ఇందులో కనిపిస్తుంది. “హిందూ” అనే అస్తిత్వాన్ని నిరాకరించకుండా, అందులో వున్న భావనలకి ఆధునిక రూపం ఇవ్వడం సాహిత్యపరంగా ఈ దశలో బలమయిన ధోరణి.
దీనికి భిన్నంగా, మూడు కొత్త ప్రత్యామ్నాయాలని అక్బర్ బేగమ్ తన పద్యంలో చూపించింది. వొకటి: కేవల “హిందూ”అస్తిత్వం నించి స్త్రీ విద్యని విడదీయడం; రెండు: ఆధునిక భావాల్ని ముఖ్యంగా స్త్రీ నైతికతని స్త్రీ కోణం నించి మాత్రమే చూడడం; మూడు: సాంప్రదాయ కథన పద్ధతిని నిరాకరించి ఆత్మ కథన పద్ధతిని స్వీకరించడం. ఈ మూడు కారణాల వల్ల “హిందూ సుందరి” పత్రికలో ప్రచురితమయిన ఇతర రచనల కంటే అక్బర్ బేగమ్ రచన చదివిన వెంటనే భిన్నంగా అనిపిస్తుంది. “పూర్వ పతివ్రతామహాత్మ్య యశస్సంపద లనేకములు విని వారయోని సంభూతుల వలె దలంచి హాశ్చర్యాంతఃకరణులై సంతసించుటయే గాని మనవలెనే జన్మించిన వారల” కథలు చెప్పాలని తన ప్రయత్నాన్ని చెప్పుకుంది ఆమె. కథని సాధారణీకరించాలన్న ఆమె మౌలికమయిన ఆలోచనే, మిగిలిన భిన్నత్వాలకు దారి తీసింది. తల్లి శిలార్ బీబీ కథనే ఆమె వస్తువుగా తీసుకోవడం వల్ల ఆ ఆత్మకథనాత్మక లక్షణం మిగిలిన రెండు అంశాలు- ‘హిందూ” అస్తిత్వ ప్రభావం నుంచి బయట పడడం, స్త్రీ నైతికతకి కొత్త కోణం- సాధ్యమయ్యాయి. ఆ విధంగా ఆత్మకథాత్మకత ఈ పద్యానికి కేంద్ర బిందువు అయ్యింది.
స్థానిక ఆధునికతలో ఆత్మకథాత్మకత వల్ల సాధ్యపడే అన్ని సాంస్కృతిక లక్షణాలను ఈ పద్యం పుణికిపుచ్చుకుంది. అలాగే, సూఫీ తత్వం అనేది అనుదిన జీవితంలో లీనమవుతున్న క్రమాన్ని కూడా ఈ పద్యంలో అర్థం చేసుకోవచ్చు. శిలార్ బీబీ జీవన విలువలు సూఫీ స్థానికతలోంచి ఎలా రూపు దిద్దుకున్నాయో, అవి తొలినాళ్ళలో ఎలాంటి అపోహల్ని సృష్టించాయో చెప్పడం, అవి ఆమెని కుటుంబ హింసకి ఎలా గురి చేసాయో చెప్పడం ఈ పద్యంలో అక్బర్ బేగమ్ సాధించిన ఇతర విజయాలు. నైతికతకి సంబంధించినంత వరకూ కేవలం పురుష దృక్కోణం నుంచి ఆమె వ్యక్తిత్వం పైన తీర్పు చెప్పలేమన్న ఆలోచన బీజప్రాయంగా అయినా ఈ పద్యంలో కనిపిస్తుంది. మైనారిటీ సాంస్కృతిక స్వరం ప్రకాశంగా వినిపించడంలో ఆత్మకథాత్మకత ఎలాంటి సాధనంగా ఉపయోగపడుతుందో, ఆ ఆత్మకథాత్మకత సామూహిక కథగా ఎలా రూపు దిద్దుకుంటుందో ఈ పద్యం నిరూపిస్తుంది. ఆధునిక తెలుగు సాంస్కృతికతా వికాసంలో తొలి మెరుపై మెరిసిన నెలవంక ఈ పద్యం.
(అక్బర్ బేగమ్ పద్యం సేకరించి పంపడమే కాకుండా, నేను ఈ వ్యాసం రాసేంత వరకు పట్టు వదలని మిత్రుడు సంగిశెట్టి శ్రీనివాస్ కి, ఉమర్ అలీ షా కవి రచనలన్నీ దూరభారం లెక్క చేయక పంపిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికి కృతజ్ఞతలు. ఈ వ్యాసకర్త అక్బర్ బేగమ్ గురించి మాత్రమే కాకుండా 1850-1910 ప్రాంతాలలో తెలుగులో రచనలు చేసిన ముస్లిం సాహిత్య వేత్తల గురించి, అప్పటి సూఫీ ధోరణుల గురించి ఇంకా పరిశోధిస్తున్నారు. ఆ వివరాలు తెలిసిన వారు afsartelugu@gmail.com కి పంపవలసిందిగా మనవి.)
*
నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం
-
ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ
ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్
స...
1 year ago
7 comments:
Women play an important role in building enlightened families and great civilizations. They are the first teachers of mankind. That’s why women are given first place and it is said “Matru devo Bhava, pithru devo bhava, acharya devo bahava” . This article mainly focuses on Madam Akbar Bibiji, women of her time, their state and status in the society along with literary contributions. The first and last thing one needs to learn is- “truth”. Both the explorer and expounder of truth need courage. Such work is done by Madam Akbar Begumji. By doing lot of hard work and research, Dr. Afsar Mohammad excavated from past literature Madam Akbar Bibiji’s life events and her contributions into limelight. He really needs commendation for writing an article that educates people about a philosopher who touched the depths of knowledge- the truth .I Wish more new things add up to this work glorifying the new face of Madam Akbar Bibiji.
As a member of Shri Viswa Viznan Adyatmika Peetham (www.sriviswaviznanspiritual.org) it was very rewarding to read your article. While it was relatively well known of Smt. Dr. Umar Alisha Guruji through his literary, spiritual philosophy contributions and as a big proponent of women education and women freedom. Little is known of Smt. Akbar Begum Ji. This article is of great significance, given that she is the first Telugu Muslim poet to openly come out into mainstream media during a time where most women from conservative families did not receive formal education or openly went shopping in public markets.
It is also pertinent to reflect the virtues of the Peetathipathi’s and the Peetham’s activities for women empowerment and women education. Umar Alisha Rural Development Trust founded by Shri Dr. Umar Alisha II, the present peetathipathi has been coordinating various women empowerment and women education activities in rural villages of Andhra Pradesh for over a decade, with the main motto that if the mother in the family is educated, the whole family will be educated.
Thank you for bringing this into light, which would otherwise be buried in the dust of time. The contribution was also very well put into nice context, given that it is not easy to understand the true inner voice of the author through a poem that was written a century ago
"Initially it took some time for me to understand the article, but when I started slowly reading the article it has created me interest to know about the way the women were treated in those days and how well Smt. Akbar Begum has incorporated them in her poetry. I want to thank the author for giving us an opportunity to know more about Sri Umar Ali Sha Sathguru & Smt. Akbar Begum."
Thanks & Regards,
TSV Srinivas, New York
చాలా మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు. నేను ఈమధ్య అనువాదాలు చెయ్యడంలేదు వ్యక్తిగతకారణాలవల్ల. ఈవ్యాసం మీరు కానీ ఇంకెవరిచేతనైనా కానీ అనువాదం చేయించి నాకు ఇవ్వగలరా? నా thulika.net లో ప్రచురించాలని నా అభిలాష.
మాలతి
మాలతి గారు: చాలా థాంక్స్! ఎలా వున్నారు? నిన్న డల్లాస్ లో సాహిత్య సభకి వెళ్ళారా?
ఈ వ్యాసం గురించి: ఇది నిజానికి మొదట ఇంగ్లీష్ వ్యాసమే! ఇంగ్లీషులో Routledge journal of South Asian History and Culture వాళ్ళు అడిగితే రాశాను. అందులో వస్తుంది. కానీ, ఈ కవిత యథాతధంగా ఇంగ్లీషులోకి అనువాదం చేయాలని అనుకుంటున్నాను. అక్బర్ బేగమ్ గురించి ఇంకా కొంత వర్క్ చెయ్యాలి. ఆమె ప్రసంగాల కోసం చూస్తున్నా. అవి నేను వీలు వెంబడి తూలిక కి ఇస్తాను.
🌹🌹అగ్బరాంబవారు 🌹
సమ సమాజ స్థాపన జరిగి
స్వాతంత్ర్య భారతం ఏర్పడాలి అంటే స్త్రీ మూర్తులులో స్వేచ్చా
భావం పెరగాలి.
వంటింటికి వారిని పరిమితం చేయకుండా వారికి అన్ని విద్యలు నేర్పించాలి,
స్త్రీ మేధస్సుకు మరింత దైర్యం
స్ఫూర్తిని కలిగించి వారికి సమాజంలో ఉన్నత స్థానాన్ని కల్పించాలి.
దానికై స్త్రీ మూర్తులలో అత్యంత పుజానియమైన
పతివ్రత, దేవతల కోసం
కాలాన్ని సైతం మార్చిన తపోసంపన్నురాలు,త్రిమూర్తులకు మాతఅయిన ,అత్రి మహర్షి వారి భార్య అనసూయ దేవి గారి జీవిత విశేషాలను ఒక పుస్తక రూపంలో ఆవిష్కరణ చేస్తే నేటి సమాజంలోని మహిళలు అందరూ ఆమెను ఆదర్శంగా భావించి ,వారి భానిస భావ సంకెళ్ళ నుండి బయటపడే అవకాశం కలుగుతుంది.
భారత మాత ఒడిలో జన్మించిన ప్రతి ఇల్లాలు
స్ఫూర్తి నొందు అనసూయ దేవి కథను వ్రాయమని
కవి శేఖర ఉమరాలిష వారిని కోరిన మహా ఇల్లాలు,స్నేహ భావంతో ఎల్లపుడూ ఆలిషా వారిచే గౌరవింపబడిన వినయ విజ్ఞాన ,విద్యా సంపనురాలైన
వారి సతీమణి శ్రీమతి అక్బరాంబ గారు.
స్త్రీ పక్షం వహించి ఎన్నో రచనలు చేసిన ఆలీషా మహా కవి వ్రాసిన ప్రతి అక్షరాన్ని ఆమె వారి నోట విని మరిన్ని విషయాలను వారితో చర్చించేవారు.
పిఠాపురం మహారాణి గారికి అగ్బరంబ వారు మంచి స్నేహితురాలు.
అగ్బరంబా వారి 40 సంవత్సరాలు జీవిన విధానంలో అత్యంత ఆప్యాయతతో ప్రతి ఒకరి అందు అభిమానము కురిపించే వారు.
వీరు ప్రథమ సంతానంగా హుస్సేన్ షా వారు జన్మించి నప్పుడు జహంగీర్ అని ఆశీర్వదించారు.
గురుమాత అయిన అగ్భారంబ వారు ప్రతి రోజు ఖురాను చదువుతూ నమాజు ఆచరించే అగ్బారంబ గారు అనేక ధర్మ విషయాలు ఎరిగిన వారు.
కేవలం స్త్రీ ఇంటికి మాత్రమే పరిమితం అయ్యే ఆ రోజులలో
ఆలిషా వారు శాసన సభ భాద్యతలు స్వీకరించిన తరుణంలో ఈమె వారితో 1934 లో ఢిల్లీ వెళ్ళినారు.
ఢిల్లీ వెళ్లిన బహు కొన్ని మాసములలోనే అలిషా వారు
శాసన సభలో విధులు నిర్వహిస్తూ వుండగా అకస్మాత్తుగా అగ్బర్ బిబి గారు
దుర్ముఖి నామ సంవత్సరం
చైత్రమాసం పంచమి రోజున( 5-4-1935)
దివిని అలంకరించారు.
వీరు పరమపదించిన రోజు ఢిల్లీ శాసన సభ మూసివేయబడింది,
బ్రిటిష్ సామ్రాజ్య అధిపతులు వచ్చి వీరికి నివాళులు అర్పించారు.
ఇటువంటి గొప్ప గౌరవం అందుకున్న స్త్రీ మూర్తి గా
భారత చరిత లో వీరు స్థిర గౌరవనీయురాలు.
వీరు కోరిక మేరకు శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ షష్టమ పీఠాధిపతి అయిన ఉమరాలిష కవి గారిచే వ్రాయబడిన అనసూయ దేవి నాటకము తదుపరి కాలంలో ముద్రించబడి వీరికి అంకితం చేయబడింది.
🙏🙏🙏
ఎంతో చక్కని వ్యాసమండి... అగ్బరాంబ గారి కవియిత్రిత్వాన్ని సాహితీప్రపంచానికి మీ యొక్క విశేష పరిశోధన ద్వారా తెలియపరిచిన మీకు ధన్యవాదాలండి.. ������
"పరమపవిత్ర యీ వెలది" అని ఉమర్ ఆలీషా గారు చెప్పిన విషయానికి అక్షర రూప నిదర్శనాత్మక సత్పరిశోధనా నిబంధం.... ధన్యవాదాలండి
- యర్రంశెట్టి ఉమామహేశ్వరరావు, రాష్ట్రియ సంస్కృత విశ్వవిద్యాలయం, తిరుపతి
Post a Comment