ముస్లిం సాహిత్య విమర్శ - ఎటు వైపు?!

అక్షర సాంకేతికైకమౌ విద్యల

నెల్ల వారును నభ్యసింప గలరు

అవి కృతకంబులు, నధ్యాత్మ విదులయిన

సాధకునకు ప్రపంచకమె చదువు.

మేఘాల రేఖలు మెరపుల చలనంబు

కడలిని సిగారు సుడులు నిసుక

నేల గాలికిగ్రాలు చాలును సెలయేళ్ళ

వాలును నిజమయిన వ్రాతలనగ...



1939లో "బ్రహ్మర్షి" ఉమర్ అలీ షా కవి తన "సూఫీ వేదాంత దర్శము" అనే దీర్ఘ కావ్యంలో ఆ పద్యం రాసినప్పుడు సూఫీ తత్వం గురించి ఇప్పుడున్నంత చర్చ లేదు. కాని, ఆశ్చర్యంగా ఈ దీర్ఘ కావ్యం సూఫీ వేదాంత దర్శనం దగ్గిరే ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళి, లోతయిన సాహిత్య విమర్శ కూడా చేస్తుంది. కావ్యం పుట్టుక, కవిలోనూ, పాఠకుడిలోనూ అది కలిగించే రస స్పందనల్ని గురించి చాలా మంది విమర్శకులు అనేక విధాల వ్యాఖ్యానించారు. కాని, ఉమర్ అలీ షా వాటన్నిటికీ భిన్నంగా "మతాంతర మహా పరివర్తన"తో నిండిన సాహిత్య విమర్శ తత్వాన్ని ప్రతిపాదించారు. సాహిత్య విమర్శకి సూఫీ భావనలు ఏ విధంగా దోహదం అవుతాయో కవితాత్మకంగా వివరించారు. 1990ల తరవాత తెలుగు ముస్లిం సాహిత్యంలో తిరిగి సూఫీ తత్వచాయలు కనిపించడం మొదలెట్టాయి.అయితే, కాలం మారింది, భావనలూ మారాయి. విమర్శ విధానమూ మారింది. ముస్లిం సాహిత్యం, ముస్లిం సాహిత్య విమర్శ ఈ రెండు రంగాలలో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు చాలా సంక్లిష్టమయినవి. ముస్లిం సాహిత్య విమర్శని వొక ప్రత్యేక రంగంగా గుర్తించాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడుతోంది. ముస్లిం సాహిత్య విమర్శకి సంబంధించిన భావనల చరిత్ర అన్వేషణ

కూడా ఇప్పుడు జరగాల్సి వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ అంటే, సూఫీ భావనల నేపధ్యం మాత్రమే కాకపోవచ్చు. కాని,స్థానిక ముస్లింల భావ చైతన్యంలో అదొక ప్రధాన సాధనం. పైన పేర్కొన్న పద్యంలో మూడు కీలక పదాలు ఈ సూఫీ భావనకి ముఖ్యం. అవి 1. కృతకమయిన అక్షర సాంకేతికత 2. ప్రపంచక చదువు 3. నిజమయిన వ్రాత.

సూఫీలు సమకాలీన వ్యవస్థల్లోని అన్ని రకాల కృతిమత్వాల మీదా నిరసన ప్రకటించారు. ఈ విషయంలో వాళ్ళు మన భక్తి ఉద్యమ తాత్వికతకి దగ్గిరగా వస్తారు. చాలా సందర్భాల్లో బసవన్నకీ, అక్క మహాదేవికీ, అన్నమయకీ, భక్త రామదాసుకీ వీళ్ళు ఆత్మ బంధువులు. భక్తిని ఇహ పర ఐక్యతకి సాధనంగా భావిస్తూనే, ఇహంవైపు, భౌతికమయిన శరీర ప్రతీకలవైపు మొగ్గు చూపించడం ద్వారా భక్తిని భూమార్గం పట్టించాలన్న పట్టింపు సూఫీ-భక్తి సంప్రదాయాల వారసత్వంగా కనిపిస్తుంది. తెలుగు నాట పల్లె ముస్లింల జీవన ఆధ్యాత్మిక సరళిని సమీపంగా చూసిన అనుభవం వున్న వారికి ఈ సామరస్య సారస్యం బోధపడుతుంది.

మౌఖిక సాహిత్య విమర్శ ఇప్పుడు అనివార్యంగా చర్చలోకి వస్తోంది కాబట్టి, మొహర్రం గీతాల గురించి తూమాటి దోణప్ప గారి వ్యాసంలోని ఈ వాక్యాలు పరిశీలించదగినవి.

"పల్లె పట్టులలో ముస్లింలు ముక్కాలు మువ్వీసము నిరుపేదలు. వీరిలో చాలా మందికి చదువు రాదు. ...ఇందులో ఉరుదూ నేర్చిన వారు ఉడ్డా ముగ్గురు. అరబ్బీ నెరిగిన వారు అసలే అరుదు. పట్టింపు కలవారు కొందరు ఉరుదూ భాషామయ గీతికలను తెలుగులో రాసికొని, కొరాను సమీప భాషలో పాడితిమని తృప్తి పడుదురు. వట్టి అట్టహాసంలేల అని మరికొందరు ప్రాంతీయ భాషలో పాడి, తమ దుక్ఖమును ప్రకటింతురు." (దోణప్ప)

భావనల వ్యాప్తిలో భాషకి అంత ప్రాముఖ్యం లేదని దీన్ని బట్టి అర్ధం అవుతుంది. వ్యక్తీకరణ అనేది భాషని మించిన ప్రక్రియ అనీ దీని భావం. ఇప్పుడు తెలుగు ముస్లింలు రాస్తున్న ఆధునిక కవిత్వానికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే, అందులో ఏది 'కృతకం' ? ఏది 'నిజమయిన వ్రాతా? ఏది 'ప్రపంచకం చదువు ' అన్నది ప్రశ్న. ఈ మూడు లక్షణాలు ఆయా కాలాల సాహిత్యంలో ఏ విధంగా నిలబడుతున్నాయో తరచి చూడవలసిన/ చూపించవలసిన బాధ్యత విమర్శ రంగానిది. ముస్లిం సాహిత్య విమర్శ రంగంలో ఇప్పుడు ఈ పని అంత సజావుగా సాగడం లేదనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం సాహిత్య విమర్శ పరిధులని ముస్లిం సాహిత్య విమర్శకులు సరిగా గుర్తించకపోవడం. ఈ విషయం లోనారసి వివరించే ముందు మనం కొంత వెనక్కి వెళ్ళాలి.

1



తెలుగు సాహిత్య రంగంలో "ముస్లిం సాహిత్యం " అనే వొక ప్రత్యేక ఉనికి సంబంధిత పదం వాడుక 1990ల తరవాతనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు ముందు అనేక మంది ముస్లింలు అనేక సాహిత్య ప్రక్రియల్లో విశేషమయిన కృషి చేశారు. ఉమర్ అలీ షా మొదలుకొని ఇప్పటికీ రాస్తున్న పూర్వపు చాలా మంది ప్రముఖ ముస్లిం రచయితలకు సాహిత్య రంగంలొ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, 'ముస్లిం' అనే గుర్తింపు లేదా ఉనికి సమస్యని ఆ రచయితలు ఎదుర్కోలేదు. జాతీయోద్యమం నించి విప్లవోద్యమం దాకా ఇలాంటి ధోరణినే గమనించవచ్చు.ఉనికి ఉద్యమాలు ప్రధానంగ 1985 తరవాత వచ్చినవే కనుక ఈ విషయం దళిత, స్త్రీ వాదాలకు కూడా వర్తిస్తుంది.



అయితే, ముస్లిం రచయితల పరిస్తితి దళిత, స్త్రీ వాదాలకి భిన్నమయినది. అంతకు ముందు నించీ రాస్తూ వచ్చిన తెలుగు ముస్లిం రచయితలకు 'ముస్లిం' అనే ముద్ర లేకపోయినప్పటికీ, ఆ రచయితలు చాలా మంది ఉర్దు సాహిత్యం వల్ల ప్రభావితులు.ఇస్లామిక్ సాహిత్య అధ్యయనంలో పెరిగినవాళ్ళు. తెలుగు సాహిత్య పఠనం వల్ల అదనంగా వారి అవగాహన విస్తరించింది. ఏదో వొక రూపంలో తెలుగులో ఈ రచయితల రచనల మీద ఆ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఆ విధంగా ముస్లిం భావన/ఉర్దూ సాహిత్య ప్రభావాలు తెలుగు సాహిత్యంలో 1990ల పూర్వం నించీ వున్నాయి. ఈ ప్రభావం ముస్లిం రచయితల మీద ఎంత వుందో , ముస్లిమేతర రచయితల మీదా అంతే వుంది. దీనికి స్పష్టమయిన వుదాహరణ గురజాడ కథలే.



కాని, సాహిత్య విమర్శ రంగాన్ని ఈ 'ముస్లిం' భావన ఎంత వరకు ప్రభావితం చేసిందన్నది ప్రశ్న. ఉమర్ అలీ షాలో కొంత స్పష్టంగా కనిపించే ఈ భావన దేశ విభజన తరవాత ఉర్దూ, ముస్లిం సంస్కృతులకు ఇతర గుర్తింపు ఆపాదింపబడింది. దీనికి సంబంధించిన సంఘర్షణ కవిరాజ మూర్తి, నెల్లూరి కేశవ స్వామి లాంటి రచయితల్లో కనిపిస్తుంది. విమర్శ రంగానికి వస్తే, సదాశివ గారి విమర్శ వ్యాసాల్ని ఈ నేపధ్యం నించి చూడాల్సి వుంది. అభ్యుదయోద్యమం నించి వచ్చిన కౌముది లాంటి వారు తమ విమర్శ పరిభాషలో ఆ ఉర్దూ సాహిత్య సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయినట్టుగా కనిపిస్తారు. దాశరధి, నారాయణ రెడ్డి, శేషేంద్ర, ఖాసిం ఖాన్,బిరుదు రాజు రామరాజు, కే.వి.గోపాల కృష్నా రావు, మొహమ్మద్ అలి, కాళోజి లాంటి వారి నించి ఇప్పటికీ విమర్శ రంగంలో వున్న ఖాదర్ మొహినుద్దిన్ లాంటి వారి విమర్శ పరిభాషపైన ఉర్దూ/ముస్లిం సంస్కృతుల ప్రభావం వుంది.

తెలంగాణా నించి వచ్చిన ప్రతి విమర్శకుడి పైనా, పరిశోధకుడి పైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొంత ఉర్దూ/ముస్లిం సంస్కృతి చాయ కనిపించడంలో ఆశ్చర్యం యేమీ లేదు. అయితే, అదంతా "ముస్లిం సాహిత్య విమర్శ" అని నిర్ధారించడానికి అవకాశం లేదు. కాని, ముస్లిం సంస్కృతికి సంబంధించిన అంశాలు తెలుగు సాహిత్య విమర్శకి కొత్త కాదు అని చెప్పడానికి మాత్రం ఉపయోగ పడతాయి. కాని, "ముస్లిం" అనే గుర్తింపు వచ్చాక విమర్శ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాము.



2



ముస్లిం సాహిత్య విమర్శ అని ఇవాళ వాడుకలో వున్న ధోరణికి నిర్దిష్టమయిన ఉనికి రాజకీయాలు వున్నాయి. 1990ల తరవాత ముస్లింలు రాస్తూ వస్తున్న సాహిత్యంలో ముస్లిం ఉనికి అంతకు ముందు వున్న అమూర్త ముస్లిం ఉనికికి భిన్నమయింది. దానికి తగినట్టుగానే, కొత్త ప్రశ్నలకి సమాధానంగా ముస్లిం సాహిత్య విమర్శ కొత్త గీటురాళ్ళని ఏర్పరుచుకుంది. అందులో మొదటిది: ముస్లిం ఉనికిని బాబ్రీ మసీదు అనంతర పరిణామాల నించి తిరిగి నిర్వచించుకోవడం. రెండు: సాంప్రదాయంపైన ధ్వజమెత్తడం. మూడు: తమ గుర్తింపు బహిరంగ ప్రకటనకి సాహిత్యంలో ఉర్దూ/ముస్లిం పరిభాషని వినియోగించడం. ఇప్పుడు ముస్లిం సాహిత్య విమర్శ అనగానే కొన్ని పడికట్టు రాళ్ళు కూడా స్థిరపడి పోయాయి.

ఈ వ్యాస రచయితతో సహా ఖాదర్ మొహినుద్దీన్, కరీముల్లా, ఖాజ, స్కై బాబా, దిలావర్,ఖదీర్ బాబు, ఉష యస్ డాని, షమీవుల్లా లాంటి వారు ఈ కొత్త ఉనికి నేపధ్యంలోనే ముస్లిం సాహిత్య విమర్శ చేస్తున్నారు. నాన్-ముస్లిం వర్గాల నించి ముస్లిం సాహిత్యం మీద విమర్శ రాస్తున్న వారు కూడా ఈ ఉనికి రాజకీయాలను విస్మరించలేని స్తితి వుంది. గుడిపాటి, సుంకిరెడ్డి, కాసుల ప్రతాప రెడ్డి, సురేంద్ర రాజు లాంటి వారు ముస్లిం సాహిత్య విమర్శకి అందించిన దోహదాన్ని ఈ సందర్భంగా విడిగా చెప్పుకోవాలి. విషాదం ఏమిటంటే, ఆది నుంచీ ముస్లిం సాహిత్యకారుల మద్దతుతో బలపడుతూ వచ్చిన దళిత సాహిత్యకారులు ముస్లిం సాహిత్యం గురించి కనీసం ప్రస్తావనలు చెయ్యకపోవడం. ఉనికి ఉద్యమాలు బలపడడానికి దళిత-ముస్లిం సాహిత్యకారుల మధ్య అయిక్యత బలపడాల్సిన అవసరమూ వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ ఇప్పుడు ఏ స్తితిలో వుందంటే, అసలు సృజనాత్మకమయిన సాహిత్యం వెనక్కి పట్టి, ప్రతి వొక్కరూ ఏదో వొక స్తాయిలో విమర్శ వ్యాసాల సుడిగాలిలో చిక్కుకుపోయారు. ఈ పరిణామం దళిత/ స్త్రీ వాదాల సాహిత్య చరిత్రకి భిన్నమయిన నడక. దళిత/స్త్రీ వాదాల విషయంలో సాహిత్య విమర్శ వాటి వాటి సృజనాత్మక సాహిత్యానికి అనుబంధంగా సాగి, ఆ ఉద్యమాలకు వూపునిచ్చింది. దానికి భిన్నంగా ఇప్పటి ముస్లిం సాహిత్య విమర్శ ముస్లింల సాహిత్య సృష్టిని నీరుకారుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ దిశలో ముస్లిం సాహిత్య విమర్శ పురోగమించాల్సిన అవసరం ఇప్పుడు వుంది. ఈ వ్యక్తి కేంద్రిత సాహిత్య విమర్శ కూడా ఇప్పుడు వెనక పట్టి, అటు విమర్శా, ఇటు సృజనాత్మక సాహిత్యం కూడా మందగించాయి.



ముస్లిం సాహిత్య విమర్శ ముఖ్యంగా మూడు పాయలలో ప్రవహించడానికి అవకాశం వుంది.

ఒకటి: పూర్వ సాహిత్యంలో ముస్లిం సందర్భాల విశ్లేషణ. - కే.వి. గోపాల కృష్ణా రావు, బిరుదురాజు రామరాజు, సదాశివ లాంటి వారు చూపించిన మార్గం ఇప్పటికే వుంది. దీని కోసం అవసరం అయితే ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకోవడం చారిత్రక అవసరం. మంచి సాహిత్య విమర్శకి కేవలం రాజకీయ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. ఆయా సంస్కృతులకి మూలమయిన భాషల పరిజ్ఞానం అవసరం.

రెండు: వర్తమాన జీవితంలో ముస్లిం సమూహాల సాంస్కృతిక అంశాల శోధన, వాటికి సాహిత్యంతో అనుసంధానం. ముస్లిం చరిత్ర, సాంస్కృతిక రంగాల అధ్యయనం పైకి దృష్టి సారించాలి. మన దేశంలోనూ, ఇతర ముస్లిం దేశాల్లోనూ ముస్లిం మేధావులు సాంస్కృతిక అధ్యయన రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చరిత్ర రంగంలోనూ, తాత్విక రంగంలోనూ. కనీసం వాటి అవగాహన ముస్లిం సాహిత్య విమర్శకులకు వుండాలి.



మూడు: సృజనాత్మక ముస్లిం రచయితలని నీరసపరిచే, పెడతోవన పట్టించే వ్యక్తి -కేంద్రిత రాజకీయ విమర్శల నించి బయట పడడం. వ్యక్తులు, వ్యక్తి కేంద్రిత ఉనికి రాజకీయాల వల్ల వ్యక్తులు కొంత కాలం పెత్తనం చెయ్యవచ్చు. కాని, మొత్తంగా ఆ సాహిత్య చరిత్ర తుడుచుకుపోతుంది. కొత్త తరం సాహిత్యంలోకి రాకుండా పోతుంది. ముస్లిం సాహిత్య విమర్శ అంటూ నిలబడాలంటే, ముందు ముస్లిం రచయితలు అంటూ కొందరు "నిజమయిన వ్రాతలు" రాయాలి. సృజనాత్మక సాహిత్యం పునాదిగా విమర్శ అభివృద్ధి చెందాలి. లేకపోతే, గాలిలో కత్తులు దూయడం అవుతుంది.

("పాలపిట్ట" మాస పత్రికలో "కాలి బాట" శీర్షిక నించి)

7 comments:

గన్నవరపు నరసింహమూర్తి said...

అఫ్సర్ గారూ మీ వ్యాసం చాలా బాగుంది. ఉమర్ ఆలీషా వారి పద్యాలు కొన్ని చదివా. చాలా బాగున్నాయి.హరికధా పితామహులైన శ్రీమదజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసు గారు ఉర్దూ,ఆరబిక్,పారశిక భాషల నభ్యసించి ఉమర్ ఖయ్యం వ్రాసిన రుబైయాట్స్ ని తెలుగులోను,సంస్కృతములోను అనువదించారు. భావాలకు,భాషకు,భక్తికి,రక్తికి, ప్రతిబంధకాలు ఉండవు.
నరసింహ మూర్తి.

Afsar said...

మూర్తి గారు:
మీ మంచి మాటకి ధన్యవాదాలు. అవును, ఆదిభట్ల గారి ఆ ఉమర్ ఖయ్యాం గురించి తెలుసు. దాని మీద వొక వివరణాత్మక వ్యాసం రావాల్సి వుంది.

అరబిక్, ఫారసీ భాషలతో వొకప్పుడు మన వాళ్ళకి మంచి అనుబంధం వుండేది. ఇప్పుడు దాన్ని ఇంగ్లీషు మింగేసింది.

ఆ ప్రతిబంధకాలు లేని వాతావరణమే నేనూ కోరుకునేది. కానీ, కాల క్రమంలో వొక భాషని ఇంకో భాష ఎందుకు మింగేస్తుందా అన్నది కూడా ముఖ్యం. అది మన ఆలోచనల్లో వస్తున్న తేడాని కూడా చేబ్తుంది. ఆ మాట కొస్తే, తెలుగులో తొలి కొరాన్ అనువాదం చిలుకూరి నారాయణ రావు గారు చేశారు. ఉమర్ అలీ షా మహాభారత రామాయణ కథల్ని ఆధునిక సందర్భానికి తగ్గట్టు తిరగ రాశారు. అలాంటి సౌమనస్యం ఇప్పుడు లోపిస్తోంది.

Unknown said...

షరీఫ్ వేంపల్లె..

ఆలోచింపజేసిన వ్యాసం. ధన్యవాదాలు.

Sivaramakrishna said...

చాలా మంచి విషయం చెప్పారు అఫ్సర్ గారు. చాలా మంచి కవిత్వం రాసిన ముస్లిం కవులు ఎందఱో ఉన్నారు. వారందరి గురించీ ఇంకా ప్రజలకి తెలియ వలసిన అవసరం ఉంది. మీరు చెప్పిన ముస్లిం కవి/విమర్శకుల్లో మీరు ప్రస్తావించని (బహుశా మరిచి ఉంటారు, అంతే) యాకూబ్ కూడా మంచి కవి, విమర్శకుడు కూడా.

కొత్త తెలంగాణా చరిత్ర said...

అఫ్సర్ భాయ్, నేటి ముస్లిం సాహిత్యకారుల ఉనికి రాజకీయాల వల్ల సాహిత్యసృజనలో కృత్రిమత్వం చోటు చేసుకుంటున్నది.సమగ్రమైన ముస్లిం జీవనసంస్కృతి,సాహిత్యాలను ఒకచోట క్రోడీకరించడం చేయాలికదా.మీ వ్యాసం చదివాక ఒక భరోసా లభించింది.ముస్లిం సాహిత్యాన్ని చదవడానికి ఒక ఇండెక్స్ అవసరం కూడా.తెలుగులో ఈ సాహిత్యానికి సమగ్రస్వరూపం యివ్వండి

కొత్త తెలంగాణా చరిత్ర said...

అఫ్సర్ భాయ్, నేటి ముస్లిం సాహిత్యకారుల ఉనికి రాజకీయాల వల్ల సాహిత్యసృజనలో కృత్రిమత్వం చోటు చేసుకుంటున్నది.సమగ్రమైన ముస్లిం జీవనసంస్కృతి,సాహిత్యాలను ఒకచోట క్రోడీకరించడం చేయాలికదా.మీ వ్యాసం చదివాక ఒక భరోసా లభించింది.ముస్లిం సాహిత్యాన్ని చదవడానికి ఒక ఇండెక్స్ అవసరం కూడా.తెలుగులో ఈ సాహిత్యానికి సమగ్రస్వరూపం యివ్వండి

కొత్త తెలంగాణా చరిత్ర said...

అఫ్సర్ భాయ్, నేటి ముస్లిం సాహిత్యకారుల ఉనికి రాజకీయాల వల్ల సాహిత్యసృజనలో కృత్రిమత్వం చోటు చేసుకుంటున్నది.సమగ్రమైన ముస్లిం జీవనసంస్కృతి,సాహిత్యాలను ఒకచోట క్రోడీకరించడం చేయాలికదా.మీ వ్యాసం చదివాక ఒక భరోసా లభించింది.ముస్లిం సాహిత్యాన్ని చదవడానికి ఒక ఇండెక్స్ అవసరం కూడా.తెలుగులో ఈ సాహిత్యానికి సమగ్రస్వరూపం యివ్వండి

Web Statistics