కొత్త తరం వస్తేనే అమెరికా తెలుగుకి కొత్త వెలుగు...విష్ణుభొట్ల లక్ష్మన్న!




1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?

అమెరికా రావటం మాత్రమే కాకుండా "అమెరికా నా దేశం" అని విశ్వసించి ఇక్కడ జీవితం గడిపే అందరి తెలుగువారి జీవితాల్లో జీవితం పట్ల మార్పు వస్తుంది!
ప్రతి వ్యక్తికి కొత్తవి, గొప్పవి అయిన అనుభవాలు కలిగినప్పుడల్లా జీవితం పట్ల దృష్టి మారుతూనే ఉంటుంది. నా విషయంలో కూడా అంతే! అమెరికా రాక ముందు ఎనిమిదేళ్ళు ముంబాయిలో గడిపిన నా జీవితం కొన్ని మార్పులకు గురి కావటం ఒక అధ్యాయం అనుకుంటే అమెరికా జీవితం మరొక పెద్ద అధ్యాయం. అయితే మామూలుగా మనకి పరిచయమైన ఒక సమాజంలోని అనుభవాల వల్ల జీవితం పట్ల కలిగే మార్పుల కన్నా మరొక దేశం రావటం, పరిచయం లేని ఒక కొత్త సంస్కృతి పరిచయం కావటం వల్ల కలిగే అనుభవాలు తప్పకుండా జీవిత గమనాన్ని మారుస్తాయి. ఈ మార్పు ఒక్కొక్క వ్యక్తికి ఒక్కోలా ఉండొచ్చు.
రచయితకి తన రచనల్లో ప్రేరణకి జీవితమే ముడి సరుకు అయినప్పుడు అమెరికా జీవితం ఎంతో పెద్ద ముడి సరుకు. ఇది అమెరికా పెద్ద దేశం, ఒక సూపర్ పవర్ కావటం వల్లనే కాదు. ఇక్కడి జీవితం ఎంతో వైవిధ్యమైనది. అనేక సంస్కృతుల కలబోత ఇక్కడి జీవితం. నిశిత దృష్టితో చూడగలిగే వారికి చెప్పాలనుకునే విశేషాలు ఎన్నో! అందరికీ తేలికగా కనపడే వస్తుపరమైన ఇక్కడి సమాజం వెనుక పైపైకి బులబులాగ్గా కనపడని జీవితం - అందుకు సంబంధించిన ఎన్నో మానవతా విలువలు ఈ సంస్కృతిలో దాగి ఉన్నాయి. ఒక తెలుగువాడిగా ఇతర తెలుగు వారితో మాత్రమే పరిచయాలు పెంచుకొని చూస్తే అమెరికా జీవితాన్ని విశాలంగా చూడలేము. అటువంటి విశాలమైన జీవితాన్ని చూడటం కోసం నేను ప్రత్యేకంగా కొన్ని ప్రయత్నాలు చేసాను. ఆ ప్రయత్నాల వల్లే జీవితం పట్ల నా దృష్టి మారిందని నేను అనుకుంటాను.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తం అయ్యింది? ఒకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా?

మొదటి విషయం. నేను ఎక్కువగా రాసిన వ్యక్తిని కాదు. నా రచనలు వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఐతే గత పాతికేళ్ళుగా అమెరికాలో గడిపిన జీవితం వల్ల నా అనుభవాలు అమెరికన్ తెలుగు మిత్రుల అనుభవాల్లాగే వైవిధ్యం ఉన్నవి. అందుకు తోడు అమెరికా నుంచి మూడేళ్ళ కోసం వృత్తి రీత్యా కుటుంబంతో కలిసి ఫ్రాన్స్ బదిలీ అవటం వల్ల పాశ్చాత్య జీవితాన్ని కొంచెం లోతుగా చూసే అవకాశం వచ్చింది. అవి నా రచనల్లో ఒకటీ, రెండు చోట్ల అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేసాను.

మొదటి ఉదాహరణ: ఈ ఆలోచనలతో మిత్రులతో కలిసి పన్నెండేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ-పత్రిక "ఈమాట". ఈ ఈ-పత్రిక ఒక ధ్యేయం అమెరికాలో తెలుగు రచయితలు ఇక్కడి జీవితంపై తమ అభిప్రాయాలను సాహిత్యపరంగా ఎలా ప్రకటిస్తారో తెలుసుకోవాలన్న తపన. ఈ విషయమై నేను స్వయంగా ఎక్కువ రచనలు చెయ్యకపోవచ్చు కాని, నా మిత్రులతో పాటు నా ఉత్సాహం మాత్రం ఈ దిశలోనే ఉండేది. ఉంది. అప్పుడప్పుడు నేను రాసిన కొన్ని ఈమాటలోని నా రచనలు ఈ అంశాన్ని స్పృశించాయనే అనుకొంటున్నా.

రెండవ ఉదాహరణ: "నా ఫ్రాన్స్ అనుభవాలు" అన్న పేరుతో కొంచెం విపులంగానే నా ఒక్క అనుభవాలే కాక నా భార్యా పిల్లలు కలిపి పొందిన అనుభవాలను అమెరికాలో ఒక వెబ్ పత్రికలో ప్రచురించారు. కొన్ని మార్పులతో అవే అనుభవాలను "ఆల్ప్స్ అంచున మూడేళ్ళు" అన్న పేరుతో ఆంధ్రాలో ఒక ప్రముఖ పత్రికలో ప్రచురించబడ్దది. ఇక్కడ ముఖ్యాంశం ఏమిటంటే అంధ్రదేశంలో పుట్టి పెరిగిన నా వంటి ఒక తెలుగువాడు ఇరవై సంవత్సరాలు అమెరికాలో జీవితం గడిపి ఫ్రాన్స్ లో ఉన్న జీవితాన్ని ఎలా చూస్తాడో తెలుగులో చెప్ప ప్రయత్నించాను. చిత్రమైన విషయం ఏమిటంటే అమెరికా జీవితపు మూలాలు నాకు నా ఫ్రాన్స్ జీవితంలో అనుభవం అవటం ఎక్కువైంది. ఇవి చదువుదామనుకున్న వారు ఈ లింక్ నొక్కండి.
(http://www.eemaata.com/em/issues/200709/1142.html?allinonepage=1).

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు మీరు ఆంధ్రాలో ఉండగా చేసిన రచనకి ఏ విధంగా భిన్నమైనవి?

నేను ఆంధ్రాలో ఉండగా ఏమీ రచనలు చెయ్యలేదు. కాకపోతే అక్కడ విసృతంగా పుస్తకాలు చదివేవాడిని. ఇతరులతో చర్చించేవాడిని. నిజానికి అమెరికా వచ్చాకే తెలుగులో రాయాలని (వేరే భాషలు, సంస్కృతుల పరిచయాలు కలిగినప్పుడు వారు తమ తమ భాషలను, సంస్కృతులను నిలుపుకోటానికి చేసే ప్రయత్నాలు నాకు ఈ దిశగా ప్రేరకాలు) బలమైన కోరిక మొదలైంది.
23 ఏళ్ళ వయస్సులో ఆంధ్రదేశాన్ని వదలటం జరిగింది. అప్పటి దాకా చదువులు, పరీక్షలతోనే కాలం సరిపోయింది. సాహిత్యం పట్ల మక్కువ ఉన్నా రచనా వ్యాసాంగాన్ని మాత్రం మొదలెట్టలేదు. అసలు తెలుగులో రాయాలని అప్పట్లో నాకు అనిపించలేదు. తెలుగు భాష విలువ కూడా అప్పటి వరకు అందరి కుర్రకారు లాగే నాకూ తెలియ లేదు.

4. అమెరికాలో ఉన్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలేమిటి?

అమెరికా జీవితాన్ని తెలుపుతూ వచ్చే రచనలు చెయ్యాలని ఒక పెద్ద తాపత్రయం. అందుకు ఒక ముఖ్య కారణం ఇప్పటి వరకూ ఈ విషయంలొ చెప్పుకో తగ్గ రచనలు రాసిలోనూ వాసిలోనూ రాలేదనే చెప్పాలి. అలా అని ఈ దిశగా పెద్ద ప్రయత్నాలు జరగలేదని కాదు. అయినా తగినంతగా అమెరికా తెలుగు సాహిత్యం పెరగలేదనే చెప్పాలి. అంతో, ఇంతో రాయగలిగిన వ్యక్తులు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. ఎక్కువగా యువ రచయితలు, రచయిత్రులు కనపట్టం లేదు. ఎప్పుడైనా సాహితీ సదస్సులకి వెడితే కనపడేవి తెలిసిన ఈ కొన్ని మొహాలు మాత్రమే!

అసలు ప్రశ్న! అమెరికా తెలుగు రచయిత ఎవరు? అమెరికాలో ఉండి ఏ విషయం మీద అయినా తెలుగులో రచనలు చేసేవారు అని అర్ధం చెప్పుకుంటే భవిష్యత్తు గురించి నా అలోచనలు ఇలా
ఉన్నాయి. అమెరికాలో తెలుగులో రచనలు చేస్తున్నవారు రెండు రకాలు. చాలా కాలం క్రితమే, అంటే
దాదాపు పదేళ్ళ క్రితమే, అమెరికా వలస వచ్చి కుటుంబంగా ఇక్కడ స్థిరపడిన తెలుగు
రచయితలు చాలా కాలంగా తెలుగులో రచనలు చేస్తున్నారు. వీరి సంఖ్య ఎక్కువ లేకపోయినా (నా
ఉద్దేశ్యంలో వీరి సంఖ్య 30, 40 కి మించదు) క్రమం తప్పకుండా వీరి రచనలు ఈ-పత్రికలు,
బ్లాగులు మాత్రమే కాక అచ్చు మాధ్యమంలో ప్రచురించబడే సావనీర్లు, అమెరికా తెలుగు
సాంస్కృతిక సంఘాల ప్రచురణల్లో కనపడతాయి. ఇక రెండో వర్గం కొత్తగా వలస వచ్చిన,
వస్తున్న యువతరం. వీరిలో కొన్ని పేర్లు నాకు పరిచయమైనా వీరి సంఖ్య ఎక్కువగా
ఉన్నట్టు తోచదు. నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20, 30
సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే. వీరి ఆలోచనలు పాతతరం కన్న కొత్తగా
ఉండటమే కాకుండా పాతతరం అలవాటు పడ్డ ధోరణి మూసలోంచి బయటకు లాగగలిగే శక్తి
ఉన్నది ఈ యువతరానికి. వ్యక్తిగా, ఒక తెలుగు రచయితగా ఈ యువతని ప్రోత్సాహపరిస్తే భవిష్యత్తు బాగుంటుంది అని తోస్తుంది నాకు.
మరి ఇది సాధించటం ఎలా? సాహిత్య సభల వల్ల, సత్కారాల వల్ల ఇది సాధ్యం అవుతుందని నేను అనుకోను. అలాగే ఈ-పత్రికలు, బ్లాగులు మొదలైన అంతర్జాల మాధ్యమాలు ఇందుకు సాయపడచ్చేమో గాని ఈ విషయంలో దిశానిర్ధారణ చేయ్యగలవని నేను అనుకోను. ఈ విషయంలో మిత్రుల ఆలోచనలు, సూచనలు తెలుసుకోటం మంచిది.

3 comments:

కొత్త పాళీ said...

"నిజానికి అమెరికా తెలుగు రచయితల భవిష్యత్తు నిర్ణయించేది ఈ 20, 30 సంవత్సరాల వయస్సులో ఉన్న ఈ యువతరం మాత్రమే."

నిజం. వీళ్ళతోపాటు ఇక్కడ పుట్టిపెరిగిన మన పిల్లలు కూడా, తెలుగులో రాయకపోయినా, వారి జీవితాల్ని రికార్డు చేసుకోవడం జరగాలి.

శ్రీ said...

యువ రచయితలకి వర్క్ షాప్స్ పెడితే బాగుంటుందేమో ?

లలిత (తెలుగు4కిడ్స్) said...

ఇంకా అక్షరాలు గుణించుకుని పదాలు పోగు చేసుకుని తెలుగుని మళ్ళీ భాషగా నేర్చుకుని నేర్పించే ప్రయత్నం చేస్తున్న మేము పాత తరం కాదు, యువకులం కాదు, సాహిత్య జీవితంలో ఇంకా పసి పాపలమే.
పాత తరం భావాలు కూడా కావేమో. రెండు తరాలకి మధ్య వారధులం అవ్వాలి ఆశతో ఉన్న వారము మేము.
నిజానికి మా ముందు తరం వారినుంచీ, మా తర్వాతి తరం వారి నుంచీ కూడా నేర్చుకుంటూ వచ్చే తరాల వారికి మాకు తెలిసినది అందించే ప్రయత్నం చేస్తున్నాం.
తెలుగుని మనం "భాష" గా నేర్చుకుంటున్నామా అన్నది నా అనుమానం.
చిన్న చిన్న వ్యాసాలను కూడా తెలుగులో పిల్లల కోసం రాయాల్సి వస్తే ఎంతో కష్టంగా ఉంటోంది నాకు.
తెలుగు చదవడం నేర్చినంతగా (అది కూడ చాలా ఎక్కువేమీ కాదు) "రాయడం" నేర్వలేదు నేను అన్నది మాత్రం నాకు అర్థం ఔతోంది.
workshop ఆలోచన మంచిదేనేమో.
కానీ ఏకంగా కథలతోనే మొదలు పెట్టడం కాక మెల్ల మెల్లగా రాయడం అభ్యాసం చేయిస్తే బాగుండ వచ్చు.
ఆంగ్లంలో రాసేటప్పుడు భాషా పరమైన అనుమానాలు ఉంటే ఎంతో సాయం దొరుకుతుంది.
తెలుగులో అన్నీ అనుమానాలే.
జవాబులు దొరకడం కష్టం. ఒకప్పుడు రచ్చబండలో "మేధస్సు", "మేథస్సు" లలో ఏది సరైన పదం అని అడిగితే చర్చ జరిగింది కానీ సరైన జవాబు దొరకలేదు.
తెలుగుపదం గుంపులోకి తొంగి చూసి కొనేళ్ళయ్యింది. అక్కడ ఎలాంటి కృషి జరుగుతోందో మరి.
vocabulary చాలా పెద్ద సమస్య నాకు.
ఒక పర్యాయ పదాల నిఘంటువు చూశాను. ఒక తెలుగు పదానికి మిగిలిన పర్యాయ పదాలు random గా వెతికితే అన్నీ సంస్కృత పదాలే.
workshp మొదలు పెడితే తెలిసిన మంచి నిఘంటువులు, వాటి వాడకం గురించి కూడా పరిచయం చేస్తే బావుంటుంది.
సాంకేతిక పదాల గురించి ఇక మాట్లాడాలంటే ఎక్కడ మొదలు పెట్టాలో కష్టం.
ఏమైనా అంటే ఆంగ్లంలో వెతికి అర్థం తెలుసుకుంతారు తెలుగులో ఎందుకు చెయ్యరు అంటారు.
ఎక్కడ వెతుక్కోవాలి? తెలుసనుకున్న వారిని అడుగుతాము. వారికేమో కోపం వస్తుంది.
non-fiction తెలుగులో (పిల్లల కోసం) రాయాలంటే చాలా కష్టంగా ఉంది. ప్రయత్నిస్తున్నాను.
ఈ విషయాల పై కూడా workshop దృష్టి పెడితే బావుంటుంది అని నా అభిప్రాయం.
ఇక్కడ నాలుగో తరగతిలో (బహుశా మన దగ్గరా, ఆంగ్లంలో ఇలాగే ఉండచ్చు) synonyms వాడడం, ఒకే పదం ఎక్కువ సార్లు వాడకుండా పద ప్రయోగాలు చెయ్యడం వంటివి నేర్పిస్తారు. రెండో తరగతిలో genre లు తెలిసిపోతాయి. తెలుగులో ఎలా ఉంది?
"మన బడి" గురించి చాలా వింటున్నాను. ఆ బడి పిల్లలు మరి మనం అనుకునే భావి తరాల రచయితలలో చేరతారేమో చూద్దాము.

Web Statistics