అమెరికా తెలుగుదనం నేర్పిన పాఠాలే నా రచనలు: "కొత్త పాళీ" నారాయణస్వామి
“అమెరికా వచ్చాకే నాకు ఇండియా అర్ధమయింది” అంటారు ఏకె రామానుజన్ వొక సందర్భంలో! చిత్రకారుడు చిత్ర రచన చేస్తున్నప్పుడు వొక దృశ్యం గీశాక, వొకడుగు వెనక్కి వేసి సాలోచనగా తన బొమ్మ వైపు పరికిస్తాడు. వొక దూరాన్ని వూహించుకొని తనని తాను “ఆబ్జెక్టివ్” గా చూసుకుంటాడు. రామానుజన్ చేబ్తోంది కూడా అదే! ఎంతో కొంత దూరం అయితే తప్ప/ దేనికీ దగ్గిర కాలేమని నేను వొక కవితలో రాసినట్టు గుర్తు. ఆ దూరం అనుభవంలోకి వచ్చి కలం పట్టిన రచయిత నారాయణ స్వామి. “రంగుటద్దాల కిటికీ” ఆయన తాజా పుస్తకమే కావచ్చు, కానీ, రచయితగా నారాయణస్వామి అనేక సంవత్సరాలుగా పాఠకులకి సుపరిచితులే. “తుపాకి” నారాయణస్వామి గా కూడా ఆయన ప్రసిద్ధుడు. రాత కన్నా ఎక్కువ చదువు, చదువు కన్నా ఎక్కువ పరిశీలనా, పరిశీలన కన్నా ఎక్కువ అవగాహనా, అవగాహన కన్నా ఎక్కువ చురుకుదనమూ ...అన్నీ వెరసి నారాయణ స్వామి! మిత్రులకి “నాసి”, బ్లాగ్మిత్రులకి “కొత్త పాళీ”, సాహిత్య మిత్రులకి నారాయణ స్వామి..ఏ పేరున పిలిచినా అది వొక్కటే రూపం! నచ్చినా నచ్చకపోయినా వెంటనే స్పందించే సహృదయం...నిరాశలో ఆశనీ, దురాశలో దుఖాన్నీ తలపించే స్నేహం...బతుకు తీపీ, కష్టాల వగరూ, ఆలోచన విగరూ ... అన్నిటికీ మధ్య వొక సమతూకాన్నీ సాధించాలన్న తపన నారాయణస్వామి! సంగీత సాహిత్య నృత్య సమలంకృత ప్రతిభ.... ఆయన సొంతం! ఇటీవల “పాలపిట్ట” మాసపత్రికలో “ఆవలి తీరం” శీర్షిక కింద అమెరికా తెలుగు అనుభవాలని రికార్డు చేస్తున్న రన్నింగ్ కామెంటేటర్ ఆయన.
1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
కచ్చితంగా. అసలు నాకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడినదే అమెరికా వచ్చినాక అనుకుంటాను. వరంగల్లో కాలేజి చదువుమూలంగా నా ఆలోచనలకి కొంత ఎరుపు రంగు అంటుకుంది. సాహిత్యం వల్ల కేవలం వినోదమేకాక, అంతకు మించిన ప్రయోజనం కూడా ఉంటుంది అనే ఆలోచన పరిచయమయింది. కానీ విస్తృతంగా చదవడం మొదలు పెట్టింది అమెరికా వచ్చినాకనే. ఆ లెక్కన, ఆంగ్ల సాహిత్యాన్నీ, ప్రపంచ సాహిత్యాన్నీ, తెలుగు సాహిత్యాన్నీ ఒక్కమాటే చదివాను నేను. సాహిత్యంలో ప్రపంచాన్ని చూడ్డం, ప్రపంచంలో సాహిత్యపు ముద్రలు చూడ్డం అమెరికా జీవితంలోనే అలవాటయింది నాకు. అమెరికా వచ్చేదాకా అసలు నాకు జీవితంపట్ల ఒక అవగాహన కానీ ఒక దృక్పథంగానీ ఏర్పడిన గుర్తులేదు. ఈ విషయంలో అమెరికా ఏదో పెద్ద దోహదం చేసిందని కాదు నా ఉద్దేశం. కొత్త దేశంలో కొత్తతరహా జీవితం మొదలయేప్పటికి కొన్ని కొన్ని అనుభవాలు, తద్వారా నేర్చుకున్న గుణపాఠాలు తప్పనిసరి. అటుపైన, విశ్వవిద్యాలయ వాతావరణంలో, liberal intellectualsతో ప్రపంచవ్యాప్తంగా అనుభవాలు గడించినవారితో సుదీర్ఘ స్నేహాలు నా ఆలోచనా పరిధిని చాలా విస్తృతం చేశాయి.

2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
తుపాకి, ఇండియన్ వేల్యూస్, వీరిగాడి వలస, లోకస్ట్వాక్ కార్నర్లో - ఈ నాలుగు కథల్లో అమెరికను ఇమిగ్రంటు జీవితాల్లోని నాలుగు విభిన్న కోణాల్ని చిత్రించగలిగానని అనుకూంటున్నాను. నా కథల్ని గురించి విడిగా మాట్లాడ్డం, రాయడం నాకు ఇష్టం ఉండదు. చెప్పాల్సిన విషయమేదో కథలోనే ఉంది అని నా ఉద్దేశం. మనల్ని మనం సాధారణంగా ఏదో ఒక పరిధిలో నిర్వచించుకుంటూ ఉంటాం. మనిషి తనని కట్టిపడేసి ఉంచే పరిధుల్ని అధిగమించాలని ఒక రచయితగా నా ఆశ. అమెరికాలో జరిగినట్టు రాసిన నా కథల్లో ఇటువంటి పురోగమనాన్ని చిత్రించడానికి ప్రయత్నించాను. వీరిగాడి వలస కథలో ప్రధానపాత్ర రాఘవరావు సుమారు అరవయ్యేళ్ళ వాడు, రిటైరైనాడు, భార్య మరణించింది, అమెరికాలో కొడుకూ కోడలు దగ్గర వచ్చి ఉన్నాడు. ఆయన ఆలోచనలు కానీ, తీరుతెన్నులు కానీ సాధారణ భారతీయ తండ్రుల్లా ఉండవు. ఈ మధ్య రాసిన నీవేనా ననుతలచినది కథలో సహాయపాత్రగా ఉన్న మాధవి - కథానాయకుడు తేజా తల్లి - ఈమెకూడా విలక్షణమైన పాత్ర. సాధారణంగా అమెరికను భారతీయకథల్లో కనిపించే భారతీయ తల్లిలా ఉండదు. ఇలా, కథల్లో పాత్రలూ ఇతివృత్తాలూ భారతీయమే అయినా, కొన్ని కోణాల్లో ఆ పరిధినిదాటిన ఒక ఔన్నత్యాన్ని చిత్రించేందుకు ప్రయత్నిస్తున్నాను.

3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
అమెరికా రాకముందు నేను రచనలు చెయ్యలేదు. అసలు అమెరికా రాకపోతే రాయాలి అనే ఆలోచన నాకు బలంగా తోచి ఉండకపోవచ్చు. అంటే అదేదో అమెరికా గొప్పతనం కాదు, మాతృభూమిని, సుపరిచితమైన భాషనీ సంస్కృతినీ వదిలి వచ్చిన ఒక వలస ఫీలింగ్. ఆంధ్ర వదిలి కాన్పూరులో ఉండగా మొదటిసారి ఈ రచన తృష్ణ కలిగింది. అమెరికా వచ్చాక అది కచ్చితంగా తీరనిదాహంగా పరిణమించింది.

4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
నేను రాసిన మొదటి కథ "ఓరి భగవంతుడా" - ఇది అమెరికా వచ్చినాక రాసినదే. కానీ ఇందులో అమెరికా నేపథ్యం ఏమీలేదు. ఈ కథ ఇండియాలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జరుగుతుంది. కొకు కథల మత్తులో, ముఖ్యంగా ప్రేమించిన మనిషి అనే పెద్ద కథ చదివిన మత్తులో రాశాను దీన్ని. ఒక మధ్యతరగతి యువకుడు (పదహారు పదిహేడేళ్ళ వాడు) తనని ఆకర్షించిన ఇద్దరు అమ్మాయిల పట్ల - ఒకామె తన ఆర్ధిక స్థాయికి చెందిన పొరుగింటి వారమ్మాయి, రెండో ఆమె తన ఇంట్లో పని మనిషి - విభిన్నంగా ఎట్లా ప్రవర్తిస్తాడు అనే ప్రశ్న ఈ కథకి కీలకం. పరుగుపందెంలో పాల్గొనబోయే ముందు కండరాల్ని సాగదీసుకున్నట్టు, నా రచనాశక్తిని సాగదీసుకోడానికి ఈ కథ రాశానని అనుకోవచ్చు.
నే రాసిన రెండో కథ తుపాకి. దాన్ని గురించి ఇప్పటికే చాలా మాట్లాడుకున్నాం.


5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
ఇది ఒక్క పేరాలో ఇమిడే ప్రశ్న కాదు. కానీ అడిగినందుకు నెనర్లు. దీనికి ఇంకా విపులంగా సమాధానమివ్వాలని ఉంది. రాస్తాను త్వరలో. టూకీగా కొన్ని మాటలు: తెలుగు వల్సవారు రాసినదంతా డయాస్పోరా సాహిత్యమే. కాదని ఎవరూ అనలేరు. అందులో కొన్ని విషయాలే ఎక్కువగా ఉన్నాయి, మిగతా విషయాలు లేవూ అంటే - అంతే మరి, మన వలసవారికి ఆ విషయాలే ఇప్పటికీ ఇంకా ముఖ్యమైన విషయాల్లాగా కనిపిస్తున్నాయి అన్న మాట - మాతృదేశాన్ని గురించి నాస్టాల్జియా, నివాసం ఉన్న దేశ సంస్కృతిని గురించి కొంచెం ఎగతాళి, లేదా ఇదే గొప్పది అనుకునే ఒక అభిమానం, పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, రెండు సంస్కృతుల భేదాలు - ఇంకా ఇల్లాంటివి .. ప్రస్తుతానికి ఇంకా ఇవే మనవారికి ఇంపార్టెంట్ ప్రశ్నలు, ఇతివృత్తాలు. అందుకే అవే మన సాహిత్యాన్ని నింపుతున్నాయి. ఈ విషయాలకి పరిమితమైనందువల్ల మనవాళ్ళు రాస్తున్నది డయాస్పోరా సాహిత్యం కాదు అనే వాదనకి అర్ధం లేదు. ఈ సాహిత్యం కొత్త పుంతలు తొక్కాలి అంటే వలస సామాజిక స్పృహలో కొత్త ప్రశ్నలు ఉదయించాలి, దానికి కొత్త అనుభవాలు రావాలి - ఉదా. ఒక తెలుగు కుటుంబపు అబ్బాయి ఇరాకులోనో ఆఫ్ఘనిస్తానులోనో సైనికుడిగా పనిచేస్తే? తమాషాగా, ఈ విషయంలో నిజజీవిత అనుభవాలకంటే సాహిత్యం వెనకబడి ఉన్నదని నా అనుమానం.

6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
అమెరికను - ఇండియను అనే లేబుల్సుని అధిగమించి ఒక విశ్వమానవుడి ప్రతీకతో రచనలు చెయ్యాలని ఆశ. దానికి ముందు ఇప్పుడు ఇక్కడ అమెరికాలో భారతీయ వలససమాజం ఎలా మసలుతున్నదో అని విపరీతమైన ఆసక్తి. దాన్ని కొంతవరకైనా నా రచనలో పట్టుకోవాలని పట్టుదల.

12 comments:

ఇందు said...

నైస్ ఇంటర్వూ.బ్లాగ్లోకంలోకి కొత్తగ వచ్చిన నాకు 'కొత్త పాళీ' గారి గురించి ఎక్కువ తెలీదు.మీ ద్వారా వారిగురించి తెలుసుకునే అవకాసం లభించింది.ధన్యవాదాలు.

భాను said...

ఇందు గలడందు లేదని సందేహము వలదు, కొత్తపాళి గారు ఎందెందు వెదికిన అందందే గలడు...బ్లాగ్వర్యులు... సాహిత్యం, సంగీతం ,నాట్యం , అన్ని రంగాల్లో ప్రసిద్దులు .....వారి గురించి ఇంకా తెలుసుకొనే అవకాశం కల్పించిన మీకు ధన్యవాదాలు

ఆ.సౌమ్య said...

ఐదవ ప్రశ్న, దానికి సమాధానం చాలా బావున్నాయి. కొత్తపాళీ గారి గురించి మరింత విపులంగా తెలిసింది, సంతోషం.

జ్యోతి said...

కొత్తపాళీగారి గురించి మరికొన్ని విషయాలు తెలిసాయి. కాని... కొత్తపాళీగారు ఎప్పుడో ఒకప్పుడు కాకుండా తరచూ కధలు గట్రా రాయాలని కోరుతున్నామధ్యక్షా!!

మాలతి said...

కొంచెం పరిచయం ఉన్న వ్యక్తిని గురించి మరికొంచెం తెలుసుకున్నాను. అఫ్సర్ గారిలాటి ప్రముఖులు ఇలాటి మంచి విషయాలు చెప్పించగలరు. బాగుంది. జ్యోతిగారు చెప్పినట్టు కొత్తపాళీ ఇంకా ఇంకా కథలు రాయాలి.

Kalpana Rentala said...

కొత్తపాళీ గారు,

మీ సమాధానాలు బావున్నాయి. ఇంటర్వ్యూల్లో క్లుప్తత అక్కర్లేదేమో...ఇంకా విపులంగా మాట్లాడినా బావుంటుంది.

డయాస్పోరా సాహిత్యం గురించి మనం ఇంకా చర్చించాలి. కానీ ఎప్పటికప్పుడు ఇది డయాస్పోరా, ఇది కాదు అన్న దగ్గరే మానందరి చర్చలు ఆగిపోతున్నాయి కారణాలు ఏమైనా సరే...

మీ కథల గురించి మరో ఇంటర్వ్యూలో నైనా ఇంకాస్త వివరం గా చెప్పగలరు

teresa said...

avunu, kottapaaLee marinni kathalu raayaali.
Afsar garu, kottapaLee parichayaaniki dhanyavaadaalu :)

(Plese forgive my tenglish.)

మాలా కుమార్ said...

కొత్తపాళి గారంటే ఒక బ్లాగర్ గా , కొత్తగా బ్లాగ్ వ్రాసేవారి కి మార్గదర్షకులుగా నే తెలిసిన నాకు , మరిన్ని విషయాలు తెలిసాయి . ధన్యవాదాలు .

ఉమ said...

నాసి గారు
క్లుప్తంగానే వున్నా ఇంటర్వ్యూ బావుంది. ఇంకా విపులంగా తెలుసుకోవాలనే ఆసక్తి కలిగించింది . నిజానికి నేను మీ దగ్గరకు వచ్చినపుడు గానీ, మీరు ఇండియా వచ్చినపుడు గాని ఇటువంటి అవకాసం కలిగించుకోలేక పోయాను. అఫ్సర్ అక్షరం వల్ల కొంత అయిన సాధ్యం అయింది. మీ కథలను అర్ధం చేసుకోవడానికి మీ ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది.
-ఉమ , తిరుపతి

Srujana Ramanujan said...

Nice to share the interview...

I second Sowmya

తృష్ణ said...

బాగుందండీ ఇంటర్వ్యూ. కొత్తపాళీగారు మరిన్ని కధలు త్వర త్వరగా రాసేసి, మరో కధా సంపుటిని విడుదల చేయాలని పాఠకుల మనవి.

Krishna said...

నాసీ, నీ పుస్తకమే కాదు, నీ ఇంటర్వూ కూడా చాలా బాగుంది. మా అమ్మగారు ఇండియా కి తిరిగివెళ్ళే లోపు నీ పుస్తకాన్ని పూర్తిగా చదివేసి, చాలా బాగుందని చెప్పారు. ముఖ్యంగా కథనం చాలా బాగుందని మెచ్చుకున్నారు. ఇక్కడ ఉన్నప్పుడు ఎక్కడైనా గుళ్ళోనో కచ్చేరీల్లోనో కనపడితే అమ్మకి పరిచయం చేద్దామనుకున్నాను, అవ్వలేదు.

నువ్వు ఇంకా ఇల్లాంటి కథలు, పుస్తకాలు మరెన్నో వ్రాయలని, ప్రచురించాలని కొరుతూ - కృష్ణ

Web Statistics