ఓ బెజవాడ అబ్బాయి అమెరికా కథ!



- యాళ్ళ అచ్యుత రామయ్య
అమెరికాలో స్థిరపడిన ఓ విజయవాడ అబ్బాయి ఆ రెండు సంస్కృతుల మధ్య వైరుధ్యాలను సమన్వయ పరుచుకుంటూ తను తెలుసుకున్న జీవిత సత్యాలను అందమైన కథలుగా మలచి తీసుకొచ్చిన పుస్తకమే రంగుటద్దాల కిటికీ. ఒక దశాబ్దకాలంలో ఎస్. నారాయణస్వామి రాసిన 21 కథల సంపుటి అది.

ఈ కథల్లో మంచి తెలుగు నుడికారం ఉంది. కథా వస్తువుకూ, నేపథ్యానికీ అనుగుణంగా శిల్పాన్నీ, భాషనీ, టోన్‌నీ, మూడ్‌నీ ఎన్నుకోవడం చూస్తే ప్రపంచదేశాల కథా సాహిత్యాన్ని ఈ రచయిత శ్రద్ధగా అధ్యయనం చేసి ఉంటాడనిపిస్తుంది. ఒక జనవరి శుక్రవారం లోకస్ట్‌వాక్ కార్నర్లో అనే కథ ఈ సంకలనానికి తలమానికం. దీనిలో చైతన్యస్రవంతి ధోరణిని రచయిత చాలా సమర్ధవంతంగా నిర్వహించారు. మంచి సందేశంతో కూడిన ఈ కథని చదువుతుంటే ఓ ఇరాన్ సినిమాచూసినంత భావోద్వేగానికి గురవుతాం.

వంగూరి ఫౌండేషన్ వారు నిర్వహించిన 1999 ఉగాది కథలపోటీలో మొదటి బహుమతి పొందిన తుపాకి కథ తుపాకితో ప్రారంభమై తుపాకితోనే ముగుస్తుంది. ఇలా ఆద్యంతాలను సమన్వయం చేయడంలోగాని కథా సందర్భానికి తగిన సీరియస్ వాతావరణాన్ని కల్పించడంలో గానీ ఈ రచయిత తీసుకున్న శ్రద్ధను వర్ధమాన రచయితలు గమనించాలి. ఈ కథ హృదయాన్నీ మెదడునీ ఏకకాలంలో కదిలిస్తుంది.

ఓరి భగవంతుడా ఇప్పుడేం దారి అనే కథలో శీర్షిక, కథనం, సంభాషణలు, ప్రారంభం, ముగింపు, అన్నిట్లో కనిపించే వ్యంగ్యధోరణి అద్భుతంగా ఉంది. అయితే ఇంతమంచి కథల మధ్య కథా ప్రక్రియలోకి ఏమాత్రం ఒదగని గల్పిక / స్కెచ్ లాంటివి (ఉదా: నిరసన, ఆదా ..) ఉంచడం వలన జీడిపప్పు ఉప్మాలో ఇసుక తగిలినట్లనిపిస్తుంది. ఈ చిన్న లోపాన్ని పక్కన పెడితే కథా శిల్పంపై రచయిత సాధించిన పట్టును, తనదైన ప్రత్యేక దృష్టికోణంతో జీవితాన్ని దర్శించిన తీరును ఆస్వాదించడానికి ఈ కథలను శ్రద్ధగా చదవండి.


(కొత్త పాళీ గా అంతర్జాల లోకంలో ప్రసిద్ధులయిన కథకులు నారాయణ స్వామి "ప్రముఖా"ముఖి ఈ శుక్రవారం "అక్షరం" లో చదవండి)
Category: 0 comments

0 comments:

Web Statistics