అమెరికా తెలుగు పండగ..."ఇండియానా"నా? ఇండియానా?


(ప్రముఖ డాక్టర్ ఉమా ఇయుణ్ణి సమగ్ర రచనల ఆవిష్కరణ - ఫొటో సౌజన్యం: న.చ.కి)

కొత్త ప్రదేశాలు కొత్త పరిచయాల్లాంటివి

కొత్త పరిచయాలు కొత్త ప్రదేశాల్లాంటివి.

ఆకాశ వీధుల్లోంచి ఇండియానా పొలిస్ ని చూడగానే ఆ చెట్ల మీద అన్నేసి రంగులు చూసి భలే ముచ్చటేసింది!
అంతకు మించి గొప్ప సాహిత్య వాతావరణమేమీ వుండకపోవచ్చు లే అనుకున్నాను అక్కడి ఎయిర్పోర్టు లో దిగగానే! కానీ, రెండు రోజులపాటు చాలా ఉత్సాహంగా జరిగాయి ఈ సాహిత్య సభలు. వంగూరి ఫౌండేషన్, గ్రేట్ ఇండియానా పొలీస్ తెలుగు అసోసియేషన్ (గీత) వారు చేసిన ఏర్పాట్లు, అతిధి మర్యాదలు, సందడి ఒక కుటుంబ పండగలాగా అనిపించాయి. సాహిత్య సభలు ఇలాగే కనువిందుగా, మన్ పసందుగా, వీనుల విందుగా జరిగితే వాటికి ప్రేక్షకుల కరవు అనే సమస్యే వుండదు.


వ్యక్తిగతంగా నాకు - యార్లగడ్డ ప్రసంగం వినడం ఇదే మొదటి సారి.అక్కిరాజు సుందరరామకృష్ణ గారి తెంగ్లీషు పద్యాలు ఇంకా చెవుల్లో రింగుమంటున్నాయి. బీయెస్ రాములుని చాలా కాలం తరవాత చూడడం బాగుంది. నచకీనీ, కాలాస్త్రిని కలవడం గొప్ప అనుభవం. వాళ్ళిద్దరితోనూ సన్నిహితంగా గడపడం బాగుంది. ఇక బ్లాగులోనో, ఏమైలులోనో, ఫోనులోనో తప్ప ముఖాముఖీ చూడని "కొత్త పాళీ" నారాయణ స్వామి తో కలవడం, కబుర్లూ, జోకులూ బాగున్నాయి. సాహిత్యమే కాకుండా సామాజిక రంగంలోనూ యెమయినా చేయాలన్న తపన వున్న ఉమా ఇయున్ని, అమెరికా ఇల్లాలి ముచ్చట్లు చెప్పిన శ్యామల దశిక, క్రైస్తవ కీర్తనల గురించి సుధా నిట్టల గార్ల సాహిత్య కృషిని తెలుసుకోవడం బాగుంది. ఒక మౌనిలా వుంటూనే తన ఆహ్లాదకరమయిన వ్యక్తిత్వంతో "భలే" అనిపించిన పప్పు రామారావు గారిని కలవడం బాగుంది. శొంఠి శారదా పూర్ణ, మంధా భానుమతి గారు రామారావు గారి సతీమణి సూర్యకాంతం గారిని తలచుకోవడం బాగుంది. సూర్యకాంతం గారి కథ గుర్తొచ్చి ఇప్పటికీ నవ్వొస్తుంది.

ద్వాదశి శర్మగారు సభా నిర్వహణలో హెడ్మాస్టర్ లాగా అనిపిస్తూనే, కడుపుబ్బ నవ్వించారు.

శివప్రసాద్ కుంపట్ల గారు వెయ్యేళ్ల సాహిత్య చరిత్రని నాలుగేసి పాదాల పద్యాలలోకి కుదించారు.

దేవరాజు మోహన్ గారు రాజునీ రాణినీ కాదు కాదంటూనే నవ్వుల పూలు రువ్వారు. వంశీ రామరాజు కొన్ని కొత్త మెళకువలు నేర్పే ప్రయత్నం చేశారు.

ఇక మా టెక్సాస్ నివాసి వంగూరి చిట్టెన్ రాజు సంగతి చెప్పకరలేదు. నోరు విప్పితే జోకు! కామేశ్వర రావు, సురేఖల పాటల సంగతి చెప్పేదేముంది?

మొత్తం మీద సభల్లో జరిగిన హడావుడి చూస్తే, ప్రసంగాలు వింటే తెలుగు సాహిత్యంలో అంతర్జాల వాదం వొకటి రాబోతోందా అన్న సందేహ బాధ మొదలయ్యింది. అందరూ అంతర్జాలం గురించి, బ్లాగుల గురించి విపరీతమయిన ఆసక్తి చూపించారు. త్వరలో కొన్ని కొత్త బ్లాగులకి నాంది జరిగినా ఆశ్చర్యం లేదు. అంతర్జాలం వొక ఇంద్ర జాలం అన్నారు ఉమ గారు. కాదు మాయాజాలం అన్నారు ఇంకెవరో! సాలెగూడు అన్నారు నాసీ. కాదు, కాదు "మార్జాలమ్" అన్నారు శివప్రసాద్!

నిర్వాహకులు చింతల రాము, అజయ్ పొనుగోటి, శేఖర్ కృష్ణమనేని, వినోద్ సాధు సరదాగా అటూ ఇటూ తిరుగుతూనే చాలా పనులు చక్కదిద్దారు. కవులనీ రచయితలనీ నిజంగానే కంటికి రెప్పల్లా చూసుకున్నారు. ఏ మాటకామాటే చెప్పుకోవాలి, అద్భుతమయిన టిఫినీలు, తెలుగు భోజనాలూ పెట్టారు.

ఈ సాహిత్య ఉత్సవాన్ని గురించి కొత్త పాళీ, కాలాస్త్రి, న.చ.కి మరిన్ని కబుర్లు రాయబోతున్నారు, కనుక వాటి కోసం నేనూ ఎదురుచూస్తున్నా.

తా.క: దేవరాజు మోహన్ గారు ఇచ్చిన వేటూరి పాటల సీడీ వింటూ ఈ కబుర్లు మీకు రాస్తున్నా.

6 comments:

jaggampeta said...

bavvundhi

cbrao said...

ఛాయాచిత్ర విశేషమేమిటి? ఏదైనా పుస్తకావిష్కరణ?

కొత్త పాళీ said...

బాగుంది అఫ్సర్.
@cbrao .. ఇండియనాపొలిస్ లో గడిచిన వారాంతం ఏడవ అమెరికాతెలుగు సాహిత్య సదస్సు జరిగింది. ఆ సందర్భంగా కొన్ని పుస్తకాలని ఆవిష్కరించారు.

Unknown said...

సదస్సుని బాగా క్రోడీకరించారు, అఫ్సర్ గారూ! "నేనూ వ్రాద్దామా వద్దా?" అన్న మీమాంసలో ఉన్న నాకు మీ టపా చివరి లైను ద్వారా "గీత"బోధ చేసారు! :-)

శరత్ కాలమ్ said...

ఇలాంటి సభలు మా చికాగోలో కూడా ఏర్పటు చేస్తే బావుండును.

శ్రీ said...

అపుడే మీరూ,కొత్తపాళీ గారు రాసేసారు.

ఇక నేనూ వ్రాయడం మొదలుపెట్టాలి.

Web Statistics