నిడదవోలు మాలతి - ఓటమి ఎరుగని కలం. ఆ మాటకొస్తే కలం కాలం నించి ఇప్పటి కీబోర్డు కాలం దాకా విరామమెరుగని కలం. రాత నుంచి కంప్యూటరు దాకా ఎంతో ఓపికగా, శ్రద్ధగా రూపాంతరం పొందడమే కాకుండా, రచనా స్వభావాన్ని కూడా కాలానుగుణంగా మార్చుకున్న మాలతి గారు అటు ఆంధ్రా, ఇటు అమెరికా తెలుగు జీవితాల మధ్య సామ్యాలనూ, సామరస్యాలనూ వెతికే ప్రయత్నం చేశారు. స్వీయ రచనల్లోనూ, అనువాదాల్లోనూ వొక నిష్టతో, నియమంతో పని చేస్తున్నారు. వయసూ, బతుకు బాధలతో నిమిత్తం లేకుండా ఎత్తిన కలం...(టచ్ చేసిన కీబోర్డు అనాలా?!) వదలకుండా, అన్ని అవరోధాలనీ జయించి రచయితగా తన ఉనికిని సదా కాపాడుకుంటున్నారు. అచ్చు లోకంలోనే కాకుండా, అంతర్జాల లోకంలో కూడా సుపరిచితమయిన పేరు నిడదవోలు మాలతి.
1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
వచ్చింది. అయితే అది అమెరికా రావడంవల్ల మాత్రమే కాకపోవచ్చు. సాధారణంగా జీవితంలో జరిగే అనేకసంఘటనలలో అమెరికా రావడం ఒకటి. అమెరికా రావడంవల్ల మరొక సంస్కృతిగురించి సవిస్తరంగా ఆలోచించుకోడానికి అవకాశం కలిగింది. విదేశీ సంస్కృతి, మనస్తత్త్వాలవిషయంలో అవగాహన మెరుగు పడిందనుకుంటాను ఇక్కడికి వచ్చేక.
2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
ఆమార్పు నేను అమెరికా వచ్చినతరవాత రాసిన కథలన్నిటిలోనూ కనిపిస్తుంది. ప్రధానంగా, ఏ సంస్కృతిలో కానీ వారి నైతికవిలువలు వారున్న వాతావరణం, సామాజికపరిస్థితులు ప్రాతిపదికగా ఏర్పడతాయి. వారి ఆలోచనాధోరణి వారి సామాజికచరిత్రలోనుండీ ఉదయిస్తుంది కనక ఈ రెండు సంస్కృతులలోనూ గల వైవిధ్యమూ, అంతర్గతంగా గల సామ్యాలూ ఎత్తి చూపుతూ రాయడానికి ప్రయత్నించేను,
నా ఈ అవగాహనకి మంచి ఉదాహరణ - రంగుతోలు కథ. మనకి రంగు కేవలం అందానికి సంబంధించినది అయితే, అమెరికాలో తొక్కరంగు జాతికి సంబంధించినది. ఇక్కడ “నల్లవాడు” అన్నపదంలో వాళ్ళ ఆర్థిక, సామాజిక, చారిత్ర్యక ఛాయలెన్నో ఉన్నాయి. దానితోపాటు, గత 50 ఏళ్ళుగా జరుగుతున్న సివిల్ లిబర్టీస్ ఉద్యమంమూలంగా, తొక్క రంగులో గల నెగిటివ్ ఇమేజిని తొలగించే ప్రయత్నం కూడా ఉంది. ఇది ఎత్తిచూపడానికి ప్రయత్నించాను రంగుతోలు కథలో.
అలాగే, కొత్తసీసా పాతసారా కథలో ఉమ్మడికుటుంబాలలో అనూచానంగా వస్తున్న జీవనసరళి అమెరికాగడ్డమీద ఎలాటి మార్పులకి (metamorphosis) లోనవుతుందో చిత్రించాను. అంతేకాదు. మనవారి ఈ ప్రవర్తనా, పరివర్తనా కూడా అమెరికనులు ఎలా అర్థం చేసుకుంటారో కూడా చూపించడానికి ప్రయత్నించేను.
3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఈప్రశ్నకి కూడా సమాధానం పైజవాబులో కొంతవరకూ ఉంది. నాకథల్లో అక్కడా, ఇక్కడా కూడా నాచుట్టూ ఉన్న సమాజంలో మనుషుల తత్త్వాలని, నిత్యజీవితంలో ఎదుర్కొనే సమస్యలనీ, ఆ సమస్యలని పరిష్కరించుకునే తీరులో వైవిధ్యాన్నీ పరిశీలించి ఆవిష్కరించడానికే ప్రయత్నించాను. ప్రయత్నిస్తున్నాను. ఏపరిస్థితుల్లో ఎవరు ఎలా ప్రవర్తిస్తారు, ఆ ప్రవర్తనకి కారణభూతమయిన పరిస్థితులు ఏమిటి అనే నేను సదా ఆలోచిస్తుంటాను. అంచేత అమెరికా వచ్చినతరవాత నా మొట్టమొదటి కార్యక్రమం అమెరికా, ఆంధ్రా - ఈ రెండుసంస్కృతులలో గల వ్యత్యాసాలూ, సామ్యాలూ, వాటికి సంబంధించిన తాత్త్విక చింతనా - ఇవి పరిశీలించి చూసుకోడమే అయింది. అది కొంతైనా అర్థమయిన తరవాతే కథలు రాయడం మొదలు పెట్టేను. అమెరికన్ సమాజంలో, సంస్కృతిలో నాకు అర్థమయినవిషయాలే నాకథల్లో కూడా ఆవిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాను. ఇతివృత్తం దృష్ట్యా ఇది ఒక మార్పు.
రెండో మార్పు శైలిలో. కొందరు స్నేహితులు ఎత్తి చూపినతరవాతే నేను పరిశీలించి చూచుకొన్నాను. మొదట భాష చూడండి. మనదేశంలో ఉన్నప్పుడు రాసినకథల్లో సంస్కృత సమాసాలు ఎక్కువ. ఆ పద్ధతిలో నారచన సాగిస్తే, ఇప్పుడు నాకథల్లో ఇంగ్లీషు ఎక్కువ ఉండాలి న్యాయానికి. కానీ అలా జరగలేదు. ఇక్కడికి వచ్చేక పూర్వంకంటె మంచి తెలుగులో రాయాలన్న తపన నాకు ఎక్కువయింది. నిజానికి ఇంగ్లీషు మాటలు ఇప్పటికంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసినకథల్లోనే ఎక్కువ.
శైలిలో మరొక అంశం వ్యంగ్యం. ఇండియాలో ఉన్నప్పుడు నాకథల్లో హాస్యం ఉంది కానీ వ్యంగ్యం లేదు. అది ఈమధ్య ఎక్కువగానే ఉంటోంది నాకథల్లో.
మూడోది రచన పట్ల నాదృష్టి. ఇండియాలో ఉన్నప్పుడు రచయితగా నాస్థాయి ఏమిటి అన్న స్పృహ నాకు ఉండేది కాదు. రాయాలనిపించింది రాయడం, పత్రికలకి పంపడంతో నా పని అయిపోయేది. ఇప్పుడు ఎవరు నన్ను రచయితగా గుర్తించడం లేదు? ఎందుచేత? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దానికి కారణాలు అనేకం. నా పరిస్థితులూ, జీవితంలో, సమాజంలో, సాహిత్యంలో వచ్చినమార్పులూ - అన్నీ కలిసి నాలో ఇలాటి ఆలోచనలు కలిగిస్తున్నాయేమో. వయసు కూడా ఒక కారణం కావచ్చు. జీవితంలో చరమదశకి చేరుకున్నాక, “నేను నా జీవితంలో సాధించినదేమిటి?” అన్న ప్రశ్న రావడం సహజం కదా.
4. అమెరికాలో వున్న తెలుగురచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగురచయితగా నాకు రెండు శాఖలున్నాయి. 1. స్వీయరచనలు, 2. అనువాదాలు.
స్వీయరచనల్లో తెలుగులో నేను రాసిన తెలుగుకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. ఇంగ్లీషుఅనువాదాల్లో నారచనలతోపాటు ఇతర రచయితలకథలూ, పరిశీలనాత్మకవ్యాసాలూ ఉన్నాయి. విశేషంగా కాకపోయినా కొన్ని కవితలు కూడా రాశాను. నాకృషి ఇంత విస్తృతంగా ఉండగా, ఈనాటి రచయితలు “మాలతి అనువాదాలు చేస్తోంది” అని నా మొత్తం వ్యాపకాలని ఒక్క వాక్యానికి కుదించేయడం నాకు అయోమయంగా ఉంది.
భవిష్యత్తుమాటకొస్తే, నాకు భవిష్యత్తు అమెరికాలోనూ లేదు, ఇండియాలోనూ కూడా ఉన్నట్టు కనిపించడంలేదు.
అంతర్జాలంలో నా వెబ్ సైట్, http://thulika.net, నా బ్లాగు http://tethulika.wordpress.com
నాకు గర్వకారణం కావాలి. మొదట, తూలిక.నెట్ గురించి చెప్తాను. ఈ సైటులో నాధ్యేయం ఉత్తమ తెలుగుకథలని అనువదించి తద్ద్వారా మనసంస్కృతిని విదేశీ పాఠకులకి తెలియజేడం. ఈ కారణంగానే తూలిక.నెట్ కొన్ని యూనివర్శిటీ సైటులదృష్టిని ఆకర్షించింది. ఉదా. http://www.intute.ac.uk/cgi-bin/search.pl?term1=thulika.net&submit=Search&limit=0&subject=All (Great Britain). కొన్ని ప్రముఖ సైట్స్ నా వ్యాసాలని వారి సైట్లలో మునర్ముద్రించుకున్నారు.
ఉదా. www.driftline.org. (University of Iowa, Bowling Green, Iowa),
http://www.india-forum.com/forums/
ఇలాటి గుర్తింపులవల్ల నాతరవాత తూలిక.నెట్ భవిష్యత్తు ఏమిటి అన్న ఆలోచన నాకు అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది. నాకు సన్నిహితురాలు, వర్థమాన రచయిత్రి అయిన వి. బి. సౌమ్యని (పుస్తకం.నెట్), అడిగితే, తాను ఆ బాధ్యత స్వీకరించడానికి అంగీకరించింది. ఇది నాకు కొంత సాంత్వన కలిగించినవిషయం. మరి ఆమెచేతిలో తూలిక ఎలా రూపు దిద్దుకుంటుందో మీరే చూసుకోవాలి.
తూలిక.నెట్ నేను ఒక్కదాన్నీ చేపట్టిన కార్యక్రమం. అమెరికాలో తెలుగు సాహిత్యానికి విస్తృతంగా సేవ చేస్తున్నాం అని చెప్పుకుంటున్న వివిధ సాహిత్యసంస్థలు ఈ నా ప్రయత్నానికి తగిన మద్దతు ఇచ్చి, విజయవంతం చేసి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు.
ఎందుకంటే, ఈనాడు సాహిత్యక్షేత్రం కూడా ఒక వ్యాపారమే. అన్ని వ్యాపారాలలోలాగే సాహిత్యంలో కూడా అవే నీతులకి ప్రాముఖ్యత. అంటే - p.r. work , people skills, పెట్టుబడిదారీ ధోరణీ (చందాలూ, రిజిస్ట్రేషను ఫీజులూ, నానా సంస్థల పెత్తందారులతో భేటీ) లాటివి. నావ్యక్తిత్వంలో ఆ పోకడలు లేవు. నాకు ఆ సామాజికస్థాయి కూడా లేదు. ఈ సాహిత్య ప్రముఖుల ఎజెండాలలో, ఇజాలజాలంలో పడి కొట్టుకుపోయే బలం కూడా లేదు.
అంతకంటే ప్రబలకారణం - కొందరు సాహిత్య ప్రముఖులకి, ముఖ్యంగా అమెరికా తెలుగు సాహితీ ప్రముఖులకి, నేను నావ్యక్తిగత జీవితంలో తీసుకున్న నిర్ణయాలు బాధాకరం అయేయి అనుకుంటాను. అంచేత కూడా వీరిదృష్టికి కూడా నేను ఆనలేదు. అపార్థం చేసుకోకండి. నానా సంఘాలూ, సంస్థలూ నన్ను వారిసభలకి పిలిపించి దుశ్శాలువాలు కప్పాలనీ, విశిష్టసేవా పురస్కారాలు నాకు ఇవ్వాలనీ నేను కోరడం లేదు.
నేను ఏధ్యేయంతో తూలిక.నెట్ స్థాపించేనో ఆ ధ్యేయాన్ని బలపరచడానికి మన తెలుగుసంఘాలూ, సాహిత్యాధినేతలూ (నేను తెలుగుకి ఎంతో గొప్పసేవ చేస్తున్నానని నామొహంమీద పొగిడేవాళ్ళతో సహా) ఈ సైటుకి ప్రత్యేకించి ఇస్తున్న మద్దతు ఇదీ అని చెప్పడానికి నాకేమీ కనిపించడం లేదు అని అంటున్నాను. ఆ సంఘాల ప్రత్యేకసంచికలలో ప్రచురించే వ్యాసాలూ, సాహిత్య సభల్లో ఇచ్చే ఉపన్యాసాలూ చూస్తే మీకే అర్థమవుతుంది ఈమాటల్లో యథార్థం.
పోతే, తెలుగు తూలిక విషయం - నేను 2007 డిసెంబరులో మొదలు పెట్టేను. ఈ బ్లాగుద్వారా ఈనాటి యువతరం పాఠకులతో నాకు మంచి పరిచయం ఏర్పడింది. వారికి నేనెవరో, నా బతుకేమిటో తెలియదు. నన్ను కేవలం మరొక బ్లాగరుగా మాత్రమే గుర్తించి, నాకథలనీ, కబుర్లనీ, వ్యాసాలనీ చదివి, నాసాహిత్యాన్ని నిష్కల్మషంగా ఆదరిస్తున్నారు. తెలుగు తూలిక చదివే పాఠకులలో బ్లాగరులు కానివారు కూడా చాలామందే ఉన్నారు. వీళ్ళంతా ఈనాటి పాఠకులు కనక వారి ఆదరణ నాకొక ప్రత్యేకగౌరవంగానే భావిస్తున్నాను.
తెలుగుతూలికద్వారా కూడా నేను ఇంతకుమించి చెయ్యగలిగింది ఏమీ లేదు కానీ ప్రస్తుతం జరుగుతున్న సంరంభంలో నాకు రవంత నిరాశ కలిగిస్తున్నది నేను చర్చలకి పెట్టిన అంశాలలో పాల్గొనేవారు ఎక్కువమంది లేకపోవడం. ఎందుచేతో తెలీదు మరి.
చివరిమాటగా బ్లాగ్ రచనలగురించి - బ్లాగులలో ప్రచురించేరచనలకి సాహిత్యస్థానం ఉందా లేదా అన్నవిషయంలో - నా అభిప్రాయం చెప్తాను. సూక్ష్మంగా చూస్తే, బ్లాగులలో రెండు రకాల సాహిత్యం కనిపిస్తోంది. మొదటిది - నలుగురు కూడి మాటలాడుకునేవేళ తమ సహజధోరణిలో చెప్పుకునే కబుర్లలాటివి. దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు. రెండోరకంలో చేర్చదగ్గవి శిష్టజనవ్యావహారికంలో, ఎకెడమీకానికి బెత్తెడు ఎడంగా వస్తున్న కవితలూ, కథలూ, సాహిత్యచర్చలు. ఉదాహరణకి, భైరవభట్ల కామేశ్వరరావు, పి. సత్యవతి, మీరు, కల్పన - మీబ్లాగుల్లో కనిపించే రచనలు. (ఇక్కడ తెలుగు తూలిక కూడా చేర్చవచ్చుననుకుంటాను). ఈ రచనలు కేవలం బ్లాగుల్లోనే కనిపించినా వీటికి సాహిత్యవిలువ లోపం ఏమీ లేదు. అలాగే పుస్తకాలగురించి వి. బి. సౌమ్య, అనేక సాంకేతికవిషయాలు వివరిస్తున్న వీవెన్ ... ఇలా ఎందరో ఎంతో మంచి విషయాలు అందిస్తున్నారు. వీరి రచనలు ఏ పత్రికలలో రచనలకీ తీసిపోవు.
అసలు బాధ ఏమిటంటే, మనకి వ్యక్తిపూజలే కానీ వస్తునిష్ఠ లేదు. రచయితపేరుని బట్టి, అది అచ్చయిన పత్రికపేరుని బట్టీ రచనవిలువ నిర్ణయించడం మన రాచరికపుసంప్రదాయమేమో మరి. ఏమైనా, రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
10 comments:
ఇంటర్నెట్/ జాలంలో మాలతి గారన్నట్టు "రచనని మాత్రమే రచనగా తీసుకుని విశ్లేషిస్తే, మన సాహిత్యం మెరుగు పడే అవకాశం ఉంది" అన్నది అక్షర సత్యం. అమెరికా ఐనా ఆంధ్రా ఐనా "సాహిత్య సంఘాలు" కొన్ని ఎజండాలు/ ఈజమ్స్ ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి. ఇక్కడ నెట్లో కూడ అది తప్పదు.
జాలంలో "చర్చ" కు ఎక్కువ మంది ఆసక్తి చూపించడకపోవడానికి కారణం బహుశ "కంప్యుటర్" తో పరిచయం ఉండి, "పాతకాలం" సాహిత్యాన్ని క్షుణ్ణంగా చదివి, చర్చలో పాల్గొనే "ఆసక్తి, జిజ్ఞాస" ఉన్న చదువరులు తక్కువే!
ఆఫ్లైన్లో "ప్రముఖ రచయితలు / రచయిత్రులు" ఎంతమది "ఆన్లైన్"లో అందుబాటులో ఉన్నారు?
అది గమనిస్తే, నేటి "నెట్" తెలుగులో మన తెలుగు సాహిత్యం గురించి తెలుస్తుంది. వారి మాటల్లోనే అమెరికాలకు వెళ్ళిన తరువాత వారి సాహిత్యంలో "తెలుగుతనం" పెరిగింది. (ఇంగ్లిష్ తగ్గింది అని వారే అన్నారు).
మాలతి గారు బ్లాగర్లకు దగ్గిరయ్యారు. అలగే కలం నుంచి కంప్యుటర్ కీ బోర్డ్ కి కూడా.
"జాలంలో తెలుగు సాహిత్యం" ఒక ప్రత్యేకతనుసంతరించుకుంటూ,మరొక కొత్త అధ్యాయన్ని మొదలుపెట్టింది.
ని.మాలతి గారే దానికి నిలువెత్తు సాక్షం.
"దీన్ని సుమారుగా జానపదవాఙ్మయంతో పోల్చవచ్చు"
తెలుగు బ్లాగుల్లో పుడుతున్న రచనల సాహిత్య స్థానాన్ని గురించి పైవాక్యం చాలా విలువైన వ్యాఖ్య. నెట్టుమొదలైన తొలిరోజుల్నించీ తెలుగువారి కబుర్లు జాలంలో నడుస్తున్నా, ఆ కబుర్లకి ఒక నిర్దిష్టమైన జానపద సాహిత్య రూపం వచ్చినది బ్లాగులతోనే అని నాకనిపిస్తున్నది. సమకాలీన పోకడలని అధ్యయనం చేసేవారెవరైనా ఈ అంశాన్ని ఇంకొంచెం లోతుగా శోధిస్తే బాగుంటుంది.
మాలతిగారు, ఎప్పటిలానే మీ సహజ సునిశిత దృష్టితో పట్టించుకోవలసిన సత్యాల్ని ఆవిష్కరించారు. ఓపిగ్గా పంచుకున్నందుకు నెనర్లు.
మీ ఆంగ్ల అనువాదాలకి రావలసిన గుర్తింపు వస్తున్నది. ఇంకాకూడా వస్తుందని నా నమ్మకం.
Congratulations!
మాలతి గారు కొన్ని విషయాలు చక్కగా మొహాన్నే చెప్తారు. ఇది నాకు చాలా నచ్చుతుంది. (ఇంటర్వ్యూలో చివరి పేరా గ్రాఫ్ గురించి)
ఆమె ఆంగ్ల అనువాదాలకు ఎంతో ప్రాచుర్యం లభించాల్సి ఉందన్న మాట నిజమే! కానీ ఇందుకు విరుద్ధంగా ......ఇక్కడ హైద్రాబాదులో ఒక సంస్థ మాలతి గారికి అభినందన సభ లాంటిది ఏర్పాటు చేసినపుడు అందరూ(అంతా సాహిత్యకారులే, ప్రముఖులే) కేవలం ఆమె ఆంగ్లానువాదాల గురించే మాట్లాడారు తప్ప ఒక్కరు కూడా మాలతి గారి అపూర్వ తెలుగు సాహిత్య సృష్టి గురించి ఎత్తిన పాపాన పోలేదు. ఒకాయన అయితే ముందు రోజు రాత్రి ఆమె బ్లాగు చదివి మాలతి సాహిత్యం పై ప్రసంగించే సాహసానికి పూనుకున్నాడు.
చాలామందికి మాలతి గారు తెలుగు కథలూ, నవలికలూ రాశారని కూడా తెలీదట. ఆ సభలో ఇది నాకు చాలా నిరాశ కలిగించిన విషయం! నా మట్టుకు నేను మాలతి గారు కొత్త కథ ఎప్పుడు రాస్తారా అని చూస్తాను. ఆ ఫ్లో లో నాకు కుటుంబ రావు కనిపిస్తారని ఇంతకు ముందే మాలతి గారితో అంటే "నీ అభిమానం లెద్దూ"అని కొట్టి పడేశారు. :-(
మాలతి గారు చక్కగా నిర్భయంగా కొన్ని కుండలు బద్దలు కొట్టారు. అయినా సరే, చాలా మంది కళ్ళు మూసుకొని వాటిని విననట్లు గా, చదవనట్లు గా, తెలియనట్లు గా వెళ్లిపోతుంటారు. ఆమె చెప్పినట్లు తనకు తోచింది, తనకు అర్థమైంది తన మానాన రాసుకుంటూ పోవడమే తప్ప ఎవరితో మాట్లాడి ఏ పని చేయించుకోవాలో ఆమెకు తెలియదని మరో సారి సుజాత మాటల ద్వారా కూడా తెలిసింది.
మాలతి గారి కథలు ఒక ఎత్తు, ఆమె రచయతల గురించి రాసిన విశ్లేషణాత్మకమైన వ్యాసాలు మరో ఎత్తు. ఒక్కో వ్యాసం ఒక్కో పి హెచ్ డి లా వుంటుంది.
కొందరికి అంతే రావాల్సినంత గుర్తింపు రాదు, కారణాలు ఏవైనా...అందులో కూడా మాలతి గారు ముందు వుంటారు:)
సాహిత్యాన్ని చట్రాలలోనించీ కాకుండా తెరిచిన మనసుతో చూడ్డం అలవాటుచేసుకుంటే "apprieciate చెయ్యడం అలవడుతుంది.కొందరికెక్కువ గుర్తింపు రావడం కొందర్ని గుర్తించక పోవడం అన్నది ఏ చట్రం లో చూసే వాళ్ళెక్కువగా వుంటే వాళ్ళు అలాంటి వాళ్ళని వెతికి పట్టుకుంటారన్నమాట.మాలతిగారి లాంటి evergreen రచయితకి ఇంకొకరి గుర్తింపులక్కర్లేదు.సాహిత్యంలో ఆవిడ స్థానం ఆవిడదే..ఆంధ్ర దేశంలో పుస్తకాలు చదివే వాళ్ళు తక్కువ.కొని చదివే వాళ్ళు మరీ తక్కువ.తనకి నచ్చిన పుస్తకం ఇంకొకరికి పరిచయం చేసే వాళ్ళు తక్కువ.అందువల్లనే ఆమె అంత కృషితో ప్రచురించిన ఇంగ్లీష్ సంకలనాలు ప్రచారం పొందడం లేదు.ఆ పుస్తకాలపై సమీక్షలు అంతర్జాలంలో నయినా వెలువడాలని నా కోరిక.
ఈ మధ్య ఒకబ్లాగర్ గారికి పోచికోలు కబుర్లుగా, పనికి మాలిన చెత్తగా,ఒకరి వీపు ఒకరు గోక్కోవడంగా కనపడ్డ "బ్లాగర్ల సరదా కబుర్లు" మాలతి గారికి జానపద సాహిత్యంలా కనపడ్డాయి. చూసే దృక్కోణంలోనే మనుషుల వ్యక్తిత్వం ఆవిష్కృతమవుతుందనడానికి ఇంతకంటే రుజువక్కర్లేదు .
మీతో నా ఆలోచనలు పంచుకోడానికి ఈ అవకాశం కల్పించిన అఫ్సర్ గారికీ, వ్యాఖ్యాతలకీ ధన్యవాదాలు. అఫ్సర్ గారూ, మీరు నాగురించి చెప్పిన నాలుగు మాటలు కూడా నాకెంతో ఆనందాన్ని కలిగించేయి. ధన్యవాదాలు.
@ అనిల్, కథలమీద చర్చకి కంప్యూటర్ విజ్ఞానం వున్న, పాతకాలం సాహిత్యం క్షుణ్ణంగా చదివినవారే కానఖ్ఖర్లేదండీ. అసలు చర్చ అని పేరు పెట్టడం నాపొరపాటే. చిన్నా, పెద్దా అని కాక, అందరూ, కథ - ఈ ఒక్కకథనే - చదివినతరవాత తమకి కలిగిన స్పందన చెప్పడమే నాకు కావలసింది. చాలామంది సెమీ ఎకెడమీకుల్లాగే నేను కూడా ఆలోచన తక్కువై, చర్చ అని పేరు పెట్టేను. :). దానివెనక కారణం ఇదీ - ఒకే కథకి వేరు వేరు పాఠకులు వేరువేరుగా స్పందిస్తారు. ఒక పాత్రో, ఒక సన్నివేశమో, ఒకొకసారి ఒక్క వాక్యం మాత్రమే కావచ్చు వారికి నచ్చుతుంది. అది రచయిత ఊహించింది కాకపోవచ్చు. ఒకకథలో ఎవరిదృష్టిని ఏ అంశం ఆకట్టుకుంది, ఎవరు ఏ కథకి ఎలా స్పందించేరు అన్నవిషయాన్ని మరింత విశదంగా తెలుసుకోడానికి మాత్రమే ఇది. అంతేకానీ అక్కడ ఎవరు ఎంత ప్రతిభావంతంగా కథని విశ్లేషిస్తారు అని కాదు. అంచేత, దయచేసి, కథ చదివినవారందరూ తమ అభిప్రాయాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను.
పోతే, నాకథల్లో తెలుగుదనం ఇప్పుడు ఎక్కువయిందని కాదండీ. ఇంగ్లీషు మాటలు నాకథల్లో అప్పుడు ఎక్కువే కానీ ఈతరంవారి కథల్లో ఇంగ్లీషుతో పోలిస్తే నాకథల్లో చాలా చాలా తక్కువ. నిజానికి నాతెలుగు అప్పుడే ఎక్కువ బాగుండేది. అమెరికా వచ్చేక, నేను తెలుగు చాలా మర్చిపోయేనని, తిరిగి పునరుద్ధరించుకోడానకి ప్రయత్నిస్తున్నాననీ ఇక్కడ నేను చెప్పాలనుకున్నది.
@ మాధురి, ధన్యవాదాలు.
@ అఫ్సర్ గారి ప్రశ్నలకి జవాబులు రాస్తుంటే, జానపదసాహిత్యం పోలిక హఠాత్తుగా వచ్చేసింది. ఇప్పుడు నేను బాగా ఆలోచించి మరొక టపా రాయాలనుకుంటా.
రెండోది, అనువాదాలకి గుర్తింపు అంటే కూడా సరిగ్గా చెప్పలేదు నేను. తెలుగుకథలకి అనువాదాలు విస్తృతంగానే వచ్చినా, అవి దేశం దాటి పోవడం లేదు. అలాకాక, అమెరికాలోనూ, బ్రిటన్ లోనూ ఉన్న సాహిత్యసంఘాలు ఆ అనువాదాలని విదేశీయులదృష్టికి తెచ్చే ప్రయత్నం చెయ్యాలి అని నా అభిలాష.
@ సుజాత, హాహా. సరే. నేను నా కొట్టివేతని తుడిపివేసుకుంటున్నాను.
@ కల్పన, మళ్ళీ హాహ. నేను ఏఏవిషయాల్లో ముందువరసలో ఉన్నానో మరొకటి కూడా ఎత్తి చూపేవు.
@ సత్యవతిగారూ, ఆంధ్రదేశంలో చదివేవాళ్ళు తక్కువ -- ఈవరసలోవే పుస్తకాలు కొని చదువుతాం అంటూ దాచిపెట్టేసుకునేవారిని కూడా చేర్చాలండీ :).
@ వీలాంచల, చూసే కోణాన్నిబట్టి వ్యక్తిత్వాలు తెలుస్తాయి - అన్నది మంచి అవగాహన. పైన కొత్తపాళీతో అన్నట్టు, బ్లాగులకీ జానపదసాహిత్యానికీ గల సామ్యాలూ, వ్యత్యాసాలూ నేను కూడా మరొకసారి పరిశీలించుకోవాలి.
ఈ ముఖాముఖీ చిన్నదే అయినా, మంచి కోణాలు ఎత్తి చూపేరు మీరందరూ. అందుకు ధన్యవాదాలు మరొకసారి చెప్పుకుంటున్నాను.
- నిడదవోలు మాలతి
పైన నాజవాబులో దొర్లిన తప్పులు - మూడో జవాబు కొత్తపాళీని ఉద్దేశించి.
రెండోది. నీలాంచల - మొదటి అక్షరం వీ కాదు
క్షమాపణలు. - మాలతి
Post a Comment