ఇవాళ ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో అచ్చయిన "ముస్తఫా మరణం" కథ బ్లాగులో ప్రచురిస్తే బాగుంటుందని చాలా మంది మిత్రులు సూచించారు. వారి సూచన మేరకు ఈ కథ ఇక్కడ...
“ఆ గదిలోకి మాత్రం తొంగి అయినా చూడద్దు, బేటా!!” అని కేకేస్తున్న ఫాతిమా ఫుప్మా(అత్తయ్య) గొంతే వినిపిస్తోంది ఎప్పటిదో గతంలోంచి!
“అబ్బాజాన్ కి పదో రోజు చేస్తున్నాం,” అని మునీర్ భాయ్ మూడు రోజుల క్రిందట ఫోన్ చేసినప్పటి నించీ ఆ కేక ఆ గతంలోంచి ఎన్ని సార్లు వినిపించిందో లెక్క లేదు.
ఇవాళ పొద్దున ఫస్ట్ బస్సు అందుకుని, మధ్యాన్నం కల్లా వూళ్ళో వుంటే, పదో రోజుకి అందుకున్నట్టూ వుంటుంది, మునీర్ భాయ్ తో, ఫాతిమా ఫుప్మా తో, గోరీమాతో, అందరితో కాసేపు మాట్లాడినట్టూ వుంటుందని వూరికి బయలుదేరాను. మాట్లాడాలి, చాలా మాట్లాడాలి, ముఖ్యంగా ఆ గది గురించి!
ఇప్పుడు మునీర్ భాయ్ అబ్బా ముస్తఫా కన్ను మూసాక, ఆ గది ఏమవుతుంది? అతని వారసత్వంగా ఆ గది, ఆ పరంపరని మునీర్ అందుకుంటాడా? అసలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా మునీర్ భాయ్ తండ్రి మరణాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నాడో నాకు అర్ధం కాలేదు. తండ్రి వుండగానే అతిపెద్దదయిన ఆ కుటుంబ భారాన్నంతా తన వొంటరి భుజాల మీద మోసిన మునీర్ భాయ్ ఇప్పుడేం చేస్తాడు? ముస్తఫా దారిన బయలుదేరిన వందలాది భక్తజనం ఇప్పుడు ఏం చేస్తారు?
చాలా ప్రశ్నలు వున్నాయి, కానీ, నా ప్రశ్నలన్నీ ఆ గదితో మొదలయ్యే, చివరికి అక్కడే అంతమవుతున్నాయి.
చూస్తూ చూస్తూ వుండగానే అనేక రంగులు మారిన అతి సంక్లిష్టమయిన పెయింటింగ్ ముస్తఫా జీవితం. ఆ పెయింటింగ్ వొక కన్నుకే వివిధ సందర్భాల్లో వివిధ రంగుల్లో కనిపిస్తుంది. ఏ రంగు నిజంగా ముస్తఫా జీవితాన్ని ఆవిష్కరిస్తుందో? నా మటుకు నాకు అది సందిగ్ధ వర్ణ సమ్మేళనం.
అసలు బాబా ముస్తఫాకి మరణమే లేదని కదా వూరంతా అనుకుంది. అట్లా అని గుడ్డిగా నమ్మేసే అతార్కిక స్థితికి వచ్చేసింది జనమంతా అతని కథలు విని, అతని మాటల మార్మికలోకంలో పడి! వూరంతా చెప్పే కథలు, చుట్టూరా వూళ్ళన్నీ పాక్కుంటూ వెళ్ళిపోయిన కథలు అటు వినీ ఇటు వినీ “నిజమేనేమో, ముస్తఫా దరిదాపుల్లోకి కూడా మరణం రాదు పో” అని నమ్మే స్థితికి నన్ను నేనూ తోసుకుంటూ వెళ్లిపోయాను.
ప్రళయం అనేది పెను ఉప్పెనలా వస్తే, ముస్తఫా ఆ ఉప్పెన తల మీద నాట్యం చేస్తాడని, అది నిప్పుల రూపంలో వస్తే, అతను ఆ నిప్పులతో ఆడుకుంటాడని గట్టి నమ్మకం ఏర్పడిపోయింది వూళ్ళో! ఆ నమ్మకాలలో నాకేమీ నమ్మకం లేదు. మౌలానా అంటే నాకు మునీర్ భాయ్ తండ్రి. ఫాతిమా అత్త భర్త. నాతో కలిసి ఆడుకున్న మునాఫ్, ముజఫర్, ముంతాజ్, మోమిన్, మహమూదాల తండ్రి. అన్నిటికీ మించి, నేను అమితంగా ఇష్టపడే గోరీమా కొంతకాలం పాటు అమితంగా గౌరవించిన వ్యక్తి. గోరీమా మాటల్లో చెప్పాలంటే, “దీని మాలుమాత్ (ఇస్లాం చదువు) వున్నవాడు. భక్తి అంటే ఏమిటో నిజంగా అర్థమయిన వాడు.”
కానీ, చివరికి ఈ హోదాలేవీ అతను మిగుల్చుకోలేదు. అన్నిటిని విదుల్చుకుని వెళ్లిపోయాడు, ఆ చీకటి గదిలోకి!
అబ్బా చనిపోయాడని మునీర్ భాయ్ చెప్పినప్పుడు – నేను కాస్త సందిగ్ధంలో పడ్డాను, వెళ్లగలనా లేదా! వెళ్ళినా, దాదాపూ నా కుటుంబంలాంటి మునీర్ కుటుంబాన్ని చూడగలనా? ఎందుకో, ముస్తఫా చివరి చూపుకి వెళ్ళి రావాలని లోపల్లోపల అనిపించింది, కానీ, అంత కంటే ఎక్కువ మునీర్ భాయ్ తండ్రి పోయాడని, వాడిని కనీసం చూడాలని అనిపించింది. కానీ, మృత్యు ముఖాన్ని నేరుగా చూసే ధైర్యమేదో నా లోపల లేదు.
మునీర్ నా జీగ్రీ దోస్తు. చిన్నప్పుడు వూళ్ళో మా ఇళ్ళు దూరం అనే మాటే కానీ, రోజులో ఎక్కువ భాగం ఇద్దరం కలిసే వుండే వాళ్ళం, వొకటే క్లాసు కూడా కావడంతో కలిసే చదివే వాళ్ళం కూడా. ‘మీరిద్దరూ కవలలేమిట్రా?” అని అందరూ సరదాగా కాసేపు, కచ్చగా కాసేపు అనే వాళ్ళు. నేను వూరు మారాను కానీ, వాడితో స్నేహంలో ఏమీ మార్పు లేదు, కాకపోతే, ఇద్దరి మధ్యా ఇప్పుడు సమాచారం అంత వేగంగా బట్వాడా కావడం లేదు, అంతే!
ఒక సాయంత్రం నేను ముస్తఫా గది అరుగు చివరకు కూర్చొని, ఆ తెల్ల కర్టెను మెల్లిగా లాగుతున్నప్పుడు, మోమిన్ చూసింది, వెంటనే, “అమ్మీ,” అని వొక్క కేక వేసి, “అమ్మీ, అఫూ భాయ్ అబ్బాజాన్ గదిలోకి వెళ్తున్నాడమ్మీ?” అంది. లోపలేక్కడో వున్న ఫాతిమా ఫుప్మా వొక్క పరుగున వచ్చి నన్ను లాక్కుపోయింది. “వద్దురా బాబూ, వద్దు! మామయ్య చంపేస్తాడు చూస్తే..” అని సముదాయించింది.
నిజానికి వాళ్ళ ఇంట్లో నాకు ఎప్పుడూ ఎలాంటి నిషేధాలూ, ఆంక్షలూ లేవు. అట్లాంటిది ఆ మాట వొకటికి రెండు సార్లు విన్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంతకంటే ఎక్కువగా, అది నా లోపల వొక కుతూహలాన్ని తవ్వుకుంటూ వెళ్లిపోయింది.
ఇంతకీ ఏం వుంది ఆ గదిలో? మునీర్ భాయిది చిన్న ఇల్లు, చాలా పాతకాలం ఇల్లు కూడా. అట్లాంటిది వొక గది వాళ్ళ అబ్బా జాన్ ముస్తఫా కోసం విడిగా వుంచడం వల్ల తూనీగ రెక్కల మా కాళ్ళకి సంకెళ్లు వేసినట్టయింది. మూడు గదుల ఇంట్లో వొక గది అట్లా ఇచ్చేస్తే, ఇక మిగిలేది రెండు గదులు. ఆ రెండు గదుల్లో అర డజను మంది వుండడం అంటే, వొకళ్లనొకళ్లు రాసుకుంటూ పూసుకుంటూ తిరగడం, కోపం వస్తే తిట్టుకోవడం..అంతే! మా ఆట పాటలు బంద్. మా దూకుడు బంద్. ఫలితంగా, మునీర్ భాయ్ తో పాటు నేనూ వాడి చెల్లెళ్ళు, తమ్ముళ్ళమంతా బయటికెళ్ళి చెట్ల కిందా, రోడ్ల మీదా ఆడుకునే అలవాటు పట్టడానికి చాలా కాలం అయ్యింది.
అప్పుడే మాకు బయటి ప్రపంచం కాస్త అర్ధమవ్వడం కూడా మొదలయ్యింది. ఈ బయటి ప్రపంచంలో ముస్తఫా బాబాగా మారడమూ అర్థమవుతోంది. చూస్తూ చూస్తూ వుండగానే, ముస్తఫా ఆ గదిలోకి పూర్తిగా బదిలీ అయిపోవడమూ, అదే అతని ప్రపంచపు తుదీ మొదలుగా మారడమూ జరిగిపోయాయి.
ముస్తఫా గది నాకు అంతుపట్టని మిస్టరీ. ఆ గది రహస్యం చేదించాలన్న వీరోచిత స్వప్నమేదో ఆ రోజుల్లో నన్ను నిద్రపోనిచ్చేది కాదు. పైగా, అందరూ ఆ గదిలోకి మా పిల్లల ఎంట్రీని నిషేధించేసరికి ఆ ఆసక్తి ఇంకా పెరుగుతూ పోయింది నాలో!
అదే సమయంలో గోరీమా మాకు ఖురాన్ పాఠాలు మొదలు పెట్టింది. పదకొండేళ్లు నిండేసరికి ఖురాన్ పూర్తి చేసేయ్యాలన్నది అక్కడ మా అన్ని ముస్లిం కుటుంబాలలో ఆనవాయితీ. అరబ్బీ మొదటి పుస్తకం “అలీఫ్ లామ్ మీమ్” అయిపోయిన వెంటనే, “బచ్చే, నువ్వు ఈ శుక్రవారం నమాజ్ తరవాత ఇంటికి రా. బెల్లం ఫాతెహా చదివించి నీకు ఖురాన్ షరీఫ్ షురూ చేస్తా” అని ముందే గోరీమా ప్రకటించెయ్యడంతో ఇంకో కొత్త ఉత్సాహం మనసులో-
మొదటి అరబ్బీ వాచకం చదివాక అరబ్బీ అంటే అల్లం మురబ్బా అయిపోయింది నాకు. ఓహ్, ఈ అల్లం మురబ్బా కథ కూడా వొకటి చెప్పాలి తరవాత- పొద్దున్నే చాయ్ కి ముందు మీరా సాయిబు అల్లం మురబ్బా తినకపోతే, మాకు తెల్లారినట్టే వుండేది కాదు. అసలు ఖురాన్ చదవడానికి ముందే, కొన్ని ఖురాన్ సూరాలు మా చేత బట్టీ కొట్టించింది గోరీమా. అరబ్బీ మురబ్బాలంత తేలికగా ఆ ఖురాన్ సూరాలు నోటి మీంచి ప్రవహించుకుంటూ వెళ్ళిపోయేవి. నిజానికి ప్రతి శుక్రవారం నమాజ్ లో మసీదులో మౌలానా నోటి వెంట అరబ్బీ వాక్యాలు వినడం కూడా బాగుండేది. జగ్ నే కీ రాత్ (జాగారం) చేసే రోజుల్లో కేవలం అతని కంఠస్వరంలో అరబ్బీ వినడం కోసం రాత్రంతా మసీదులో వుండేవాళ్లం.
కానీ, ఇవన్నీ చూస్తూ చూస్తూ వుండగానే అన్నీ మారిపోయాయి. ముస్తఫా గొంతు మారిపోయింది. తీరు మారిపోయింది. వొక కొత్త మనిషి అతని శరీరంలోంచి దూసుకుంటూ వచ్చినట్టనిపిస్తోంది.
మసీదు బయట ముస్తఫా నిర్మించిన కొత్త లోకంలో మాకు చోటు లేకుండా పోయింది, ఆ గదితో సహా.
“ఆ గదిలోకి మీరు వెళ్లకపోవడమే మంచిది రా! మీ సోబత్ పైనున్న అల్లాహ్ తోనే కానీ, కింద తిష్ట వేసిన ఈ షైతాన్ తో కాదు!” అని వొక రోజు పని కట్టుకుని గోరీమా చెప్పినప్పుడు, ఆ గదిలోకి వెళ్ళి తీరాల్సిందే అని ఖాయం చేసుకున్నాం మేం నలుగురయిదుగురం!
2
ఏముంది ఆ గదిలో?
ఇదే, ఇదే ... మా అన్వేషణ అప్పట్లో.
ఆ గదిలోని రహస్యాల శోధన కోసం అప్పటి మా చిన్ని ప్రపంచం వూహించగలిగిన అన్ని వూహా లోకాలూ చుట్టి వచ్చేవాళ్లం. ఆ తెల్లటి తెర తొలగించుకుని లోపలికి అడుగు పెడితే, ఏమేం చూడవచ్చు? ఫాతిమా అత్తయ్య ప్రతి రాత్రీ ఆ తెరని శుభ్రంగా కడిగి, ఉతికి, మళ్ళీ తెల్లారేటప్పటికి ఆ తెరని వేలాడదీసేది.
“ఎందుకు పుఫ్మా?’ అని దాదాపూ రోజూ అడిగే వాణ్ని.
“చాదస్తం చుట్టుకుంది రా...చాదస్తం...షైతాన్ నెత్తి మీద కూర్చుంటే, లోకం అంతా అష్టవంకర్లుగా కనిపిస్తుంది. అట్లుంది మీ మామయ్య వ్యవహారం?” అనేది.
మునీర్ నా కంటే రెండు మూడేళ్లు పెద్ద అయినా, వాడికి కూడా ఆ వ్యవహారం ఏదో అంత ఖరాగా అర్ధమయ్యేది కాదు. కానీ, వాడి మాటల్లో కూడా వొక రకమయిన అయిష్టత వినిపించేది. ఆ ఇంట్లో తలకొక ఆలోచన అన్నట్టుగా మారిపోయింది.
ఆ గది చుట్టూ మా ఆలోచనలు ఎంతగా కమ్ముకుని వుండేవంటే, చాలా కాలం పాటు ఆ గది నా కలల్లోకి వచ్చేది. ముస్తఫా స్వయంగా ఆ గదిలోకి మమ్మల్ని తీసుకు వెళ్ళి, అక్కడి వింత వింతలన్నీ చూపిస్తున్నట్టు, మేం కళ్ళప్పగించి వింటున్నట్టు, అక్కడి విచిత్ర వస్తు సముదాయాన్నంతా చేతులతో తాకి తాకి చూస్తున్నట్టు కలలు కనే వాళ్ళం, ఆ కలల్ని వొకరికొకరం చెప్పుకునే వాళ్ళం. మునీర్ భాయ్ అవన్నీ విని, “మీకు ఆ పిచ్చి బాగా పట్టుకుందిలే.. అస్సల ఆ గదిలో ఏమీ లేదురా బాబూ!’ అనే వాడు.
“నువ్వు లోపల చూశావా?”
“లేదు...ఎవరినీ లోపలికి రానివ్వడు అబ్బా,” అనే వాడు మునీర్.
“మరి, నీకేం తెలుసు?’
“ఏమీ తెలియదు. నాకు తెలుసుకోవాలని కూడా లేదు!” అనేసి అక్కడి నించి వెళ్లిపోయే వాడు మునీర్ భాయ్. గోరీమాని మొదటి సారి ఈ విషయం అడిగినప్పుడు, “ముస్తఫా కి జ్ఞానం మరీ ఎక్కువయి ఏడుస్తున్నాడురా! లేనిపోని ఆశలు, కోరికలు పెంచుకొని వట్టి వూహల్లో బతుకుతూ పోతున్నాడు. ఇట్లాంటి వాటిని అల్లాహ్ అస్సల క్షమించడు,” అని ఆ రోజు ఖురాన్ లో వున్న అల్-బఖ్రా సూరాలు మా చేత బట్టీ కొట్టించింది. అయితే, గోరీమాలో వున్న గొప్ప తనం ఏమిటంటే, కేవలం బట్టీ కొట్టించి, వూరుకోదు. వాటి అర్థాలు విడమర్చి చెప్తుంది. అయినా, ఆమె చెప్పిన అర్థాలకు మించిన అద్భుత లోకమేదో ఆ గదిలో వుందని మా నమ్మకం.
మాకు తెలియని, అస్సలు అర్థం కానిదేదో అక్కడ గుప్తనిధిలా వుందని అనిపించడం మొదలయ్యింది. అప్పుడే కాస్త కాస్త లోకం అర్థమవుతున్న మునీర్ భాయ్ కి ఈ సంగతులు కొంచెం స్పష్టంగా వున్నట్టున్నాయి, అతను పైకి చెప్పకపోయినా!
ఈ ఉత్కంఠలోంచి మేం తేరుకోక ముందే, ముస్తఫా ఇల్లు తీర్థక్షేత్రంగా మారింది. నెమ్మదిగా పదుల సంఖ్యలో మొదలయిన జనాలు కొద్ది కాలంలోనే వందల్లోకి చేరుకున్నారు. వొక రెండు నెలల తరవాత ముస్తఫా వాళ్ళు ఇప్పుడు వున్న ఇంటికి కొద్ది అడుగుల దూరంలో ఇంకో చిన్న గది కట్టించారు భక్తులెవరో! వొక తెల్లారుఝాము మేం లేచేసరికి, ముస్తఫా బాబా సామగ్రి అంతా ఆ గదిలోకి మారింది. ఆ కొత్త గది ఎదురుగుండా చెట్టు మీద ఆకుపచ్చ జెండా వొకటి రెపరెపలాడడం మొదలెట్టింది.
“ఇదేం పోయే కాలం!” అనుకుంటూ, ఫాతిమా అత్త ఆ రోజు నెత్తీ నోరూ కొట్టుకోవడం చూశాను నేను! “ముస్తఫా ఏం చేస్తున్నాడో వానికే తెలియదు,” అనేసి ఆ తరవాత ముస్తఫా విషయంలో ఇంకేం మాట్లాడినా అనవసరం అన్నట్టు మౌనంలోకి వెళ్లిపోయింది గోరీమా.
కానీ, నా లోపల మౌనానికి చోటు లేదు. వొక అవిశ్రాంత సముద్రమేదో ఘూర్ణిల్లుతున్నట్టు, కొన్ని నల్ల మబ్బుల గుంపులు శరవేగంగా కురవబోతునట్టు లోపల వొక అశాంతి. జరగకూడనిది ఏదో జరుగుతున్నట్టు, అది వూరిని ఉప్పెనలా ముంచేస్తున్నట్టు వొక అనిర్వచనీయ భయం.
ఇవన్నీ జరుగుతూండగానే, నాన్నగారికి ఇంకో వూరు బదిలీ అయింది. ఆ వూరికి దగ్గిరగానే వున్న పట్నం చేరుకున్నాం వో ఎండాకాలం! ఆ తరవాత వూరు కేవలం వొక జ్నాపకం, మునీర్ వొక చిన్ననాటి దోస్తు మాత్రమే. కానీ, ఆ గది మాత్రమే నా మనసు మూలల్లో వుండిపోయింది. ఆ గది తలుపు మీద వేలాడుతున్న తెల్లటి తెర, గది ముందు చెట్టు మీద పెద్ద జెండా అప్పుడప్పుడూ కళ్ల ముందు రెపరెపలాడడం మానలేదు.
ముస్తఫా బాబా గురించి అప్పుడప్పుడూ ఎవరి మాటల్లోనో వినడం మాత్రమే. ఎప్పుడయినా మునీర్ ఫోన్ చేస్తాడు, వూళ్ళో సంగతులు చెప్తాడు, తన తండ్రి గురించి తప్ప. తండ్రి పాత్రని క్రమంగా చెరిపివేయాలన్న వాడి ప్రయత్నం నేను వూళ్ళో వుండగానే కొంత చూశాను. మేం పట్నం వచ్చాక అతను అసలు తండ్రి వూసే ఎత్తకపోవడం చాలా సహజంగానే అనిపించేది నాకు, ఇతరుల నించి విన్న మాటల్ని బట్టి కూడా!
మునీర్ దృష్టిలో ఆ గది వొక శత్రువు.
వొక చీకటి గుహ.
అజ్ఞానమో, విపరీత జ్ఞానమో ముప్పిరిగొన్న అదేదో వొక వలయం.
ఇంతకూ ముస్తఫా ఆ గదిలో ఏం చేసేవాడు? వొకటి మాత్రం నిజం- ఆ గది వొక్కటే అతని బాహ్య అంతర్లోకాల మధ్య వాకిలి. ఆ తరవాత అతనికి కుటుంబం లేదు, బాధ్యతలు లేవు, మసీదు లేదు, ఇల్లు లేదు. భార్యా పిల్లలు ఎవరూ లేరు. తన కోసం వచ్చే భక్త జనం తప్ప. వాళ్ళు చేసే వ్రతాలూ పూజలు తప్ప. వాళ్ళ కోసం తను ఆ గదిలో దేవుడితో చేసే సంభాషణలు తప్ప!
ప్రతి సారీ భక్తులు రాగానే, వాళ్ళ విన్నపాలు విన్న వెంటనే, ముస్తఫా ఆ గదిలోకి తను వొక్కడే వెళ్ళి, వొక అర గంట తరవాత బయటికి ప్రత్యక్షమయ్యే వాడు. ఆ వ్యవధిలో ముస్తఫా బాబా గురించి రకరకాల కరామత్ కథలు భక్త జనాన్ని ఆవహించేవి.
ముస్తఫా కోసం భజనలూ పూజలూ రోజు రోజుకూ పెరిగిపోతున్న కాలంలో గోరీమా ఎన్ని సార్లు హెచ్చరింఛిందో తెలియదు, “ముస్తఫా, ఆఖరి రోజున దేవుడి దగ్గిర సమాధానం చెప్పుకోవడానికి నీ దగ్గిర వొక్క వాక్యం కూడా వుండదు. నువ్వు చేస్తున్నది తప్పు. అది ఏ ఇస్లాంలోనూ ఎవరూ చెప్పలేదు. నువ్వు తరగని పాపం మూటగట్టుకుంటున్నావ్?” అని.
కానీ, ముస్తఫా వింటే కదా! కానీ, వొక్కటే మంచి విషయం ఏమిటంటే, ముస్తఫా డబ్బు మనిషి కాదు. అతను తను చేస్తున్న పని నిజంగా ఆధ్యాత్మికంగా వున్నతమయిందనీ, పవిత్రమయిందనే భావనలోనే వున్నాడు.
అది ఇంకో రకంగా కుటుంబానికి నష్టం. ముస్తఫా బాబాగా రూపాంతరం అయ్యాక కుటుంబభారం అంతా అతని తలపైన వొక్కసారిగా పడింది. అంత పెద్ద కుటుంబం మోయలేక అస్తవ్యస్తమవుతూ, మునీర్ నరక యాతనలో పడ్డాడు. మొత్తంగా కుటుంబం అంతా ముస్తఫా దారిని అసహ్యించుకునే పరిస్తితి కూడా వచ్చేసింది. “అసలు ఇబాదత్ (భక్తి) అంటే ఏమిటి? కుటుంబాన్ని దిక్కు లేకుండా చెయ్యడమా?” అని గోరీమా వొకటికి పది సార్లు ముస్తఫాకి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది, కానీ, “ఇప్పటికీ ఇదే నా దారి. నా దారిన నన్ను వెళ్లనివ్వండి,” అంటూ తన గదిలోకి నిష్క్రమించే వాడు ముస్తఫా.
ఆ గదిలోకి అంతర్ధానం కాక ముందు ముస్తఫా అయిదు పూటలా నమాజ్ చదివే వాడు. అతని నుదుటి మీద ఆ నల్ల మచ్చ దేవుడి సంతకంలా వుండేది, అతని నిష్టకి గుర్తుగా.
రంజాన్ నెల వచ్చిందంటే మసీదులో ముస్తఫా ప్రసంగం కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళం. అతని స్వరంలో ఆ ఖురాన్ సూరాలు వీనుల విందుగా వుండేవి. ఖురాన్ చదవని బతుకేం బతుకు అనిపించేది. గోరీమాకి కూడా ఆ రోజుల్లో ముస్తఫా అంటే గొప్ప గురి. ఇక వూళ్ళో ముస్తఫా మాటకి తిరుగు లేదు. వున్నట్టుండి, ముస్తఫా వొక తీవ్ర ఆధ్యాత్మిక చింతనలో పడిపోయి, కొన్ని సార్లు కాలం అనే స్పృహ లేకుండా, బతకడం మొదలెట్టాడు. అదే అతని మార్గంగా స్థిరపడిపోయింది ఆ తరవాత – “ముస్తఫా వొక మూర్ఖమయిన దారిలో అదే భక్తి అనుకోని దారి తప్పిపోయాడు. ఇక మనం చెయ్యగలిగేదేమీ లేదు!” అని గోరీమా వో రోజు అంది కూడా. కానీ, ఈ దారిలో ముస్తఫా చేస్తున్నదేమిటో నాకు ఏ నాడూ బోధపడలేదు.
ఆ గదిలో ముస్తఫా వొక విధంగా తనని తాను సజీవ సమాధి చేసుకుంటున్నాడా అని కూడా అనిపించింది.
కానీ, ఆ ప్రశ్నకి జవాబు వెతుక్కునే వీలు లేకుండా మేము వూరు మారిపోయాం, అప్పుడప్పుడూ మునీర్ కబుర్లు అతని ఫోన్ ద్వారానో, వేరే స్నేహితుల ద్వారానో అక్కడి సంగతులు తెలియడం తప్ప.
ఫోన్ లో మాట్లాడిన వొకటి రెండు ముక్కల్ని బట్టి మునీర్ భాయిని అర్థం చేసుకోవడం కష్టమే. ఇప్పుడు ఆ తండ్రి మరణాన్ని మునీర్ ఎట్లా అర్థం చేసుకున్నాడో నాకు ఇంకా సందిగ్ధం గానే వుంది. ముస్తఫా రహస్య గది గురించి వున్న సందిగ్ధంలాంటిదే ఇది కూడా!
నేను బస్సు దిగేసరికి మునీర్ నా కోసం బస్ స్టాపు దగ్గిర ఎదురుచూస్తూ నిలబడి వున్నాడు.
3
ఏం మాట్లాడాలో అర్థం కావడంలేదు. ఇంకా నా మనసు నిండా ఆ గది వొక్కటే ఆవహించి వున్న మాట నిజం.
“ఇక్కడ చాయ్ తాగి పోదాం” అని తనే అన్నాడు.
బస్ స్టాప్ దగ్గిర టీ కొట్టులో రాజు నన్ను గుర్తు పట్టి, “ఎట్లున్నవ్ సారూ?” అని అడిగాడు.
“మంచిగే!” అని టీ తీసుకొని, నేనూ, మునీర్ చెట్టు కింద నిలబడి టీ తాగాం. టీ తాగుతున్నంతసేపూ మునీర్ మా ఇంటి విషయాలు అడిగి తెలుసుకున్నాడు తప్ప తన ఇంటి విషయాలేమీ చెప్పలేదు. నాకు కూడా వెంటనే అడగాలని అనిపించలేదు. నడుస్తూన్నప్పుడు అడుగుదాంలే అనుకున్నా.
మునీర్ అసలే మౌని. ఇప్పుడు ఇంకా ఘోర మౌనిగా మారినట్టు వాడి తీరుని బట్టి అర్థమయింది. మనిషి ముఖం బాగా అలసిపోయినట్టు పీక్కుపోయి వుంది. తలలో సగం వెంట్రుకలు నెరిసిపోయాయి. శరీరం బలహీనంగా వుంది. అన్ని విధాలుగా అలసిపోయాడా అనిపించింది. ముస్తఫా బాబాగా మారి, మనిషిగా ఎంత విఫలమయ్యాడో ప్రత్యక్ష సాక్ష్యంగా వున్నాడు మునీర్. కుటుంబం బరువు మోసీ మోసీ మునీర్ వీపు నిజంగానే బాగా వంగిపోయినట్టుగా అనిపించింది.
ముస్తఫా మరణం గురించి ఎక్కడ మొదలెడదామా అనుకుంటూ వుండగానే, వాళ్ళ ఇంటి దాకా వచ్చేశాం. ఫాతిమా అత్త, మునీర్ తమ్ముళ్లూ చెల్లెళ్లూ నన్ను చూడగానే కాస్త సంతోషం వ్యక్తం చేశారు.
గోరీమా కూడా అక్కడే వుంది. నన్ను చూడగానే దగ్గిరకి తీసుకుని నా తల నిమిరింది. చాలా కాలం తరవాత గోరీమాని చూడడం నాకు చాలా రిలీఫ్ గా అనిపించింది. ఆమె మొహంలో అదే ప్రశాంతత.
నేను ముందు వసారాలో కూర్చొని వున్నా, ఆ ముందు ముస్తఫా గది కోసం వెతుకుతూ.
మధ్యాన్నం ఆ పదోరోజు ఆచారాలన్నీ ముగిశాక, వున్న కొద్ది మంది చుట్టాలూ వెళ్లిపోయాక, కాసేపు కుర్చీలోనే వో కునుకు తీశాడు మునీర్.
అట్లా కునుకు తీస్తున్న మునీర్ ముఖంలోకి చూస్తూ వుండి పోయాను.
అతనిలో వొక అశాంతీ వుంది, వొక ప్రశాంతతా వుంది.
అతని మొహంలో వొక విషాదమూ వుంది, అదే ముఖమ్మీద వొక ఉపశమన రేఖ కూడా సన్నగా కదులుతోంది.
నాకు కర్బలా యోధుడిలా కనిపిస్తాడు మునీర్ వొక్కో సారి! ఆ యుద్ధ క్షేత్రంలో కనీసం కొంత మంది అయినా మిగిలారు అప్పటి యోధులకు - కానీ, ఈ కర్బలా మైదానంలో అతనెప్పుడూ వొంటరి యోధుడే అనిపిస్తాడు. ఎన్ని యుద్ధాలు కలిస్తే వొక జీవితం! ఆధ్యాత్మికత గొప్ప శాంతి కావచ్చు, గొప్ప యుద్ధమూ కావచ్చు.
కానీ, జీవితం మాత్రం అనేక యుద్ధాల గందరగోళమే! అన్ని యుద్ధాలు చెయ్యలేకనే, ఆధ్యాత్మికత అనే వొకే వొక్క యుద్ధంలో మునిగిపోయాడా ముస్తఫా? ఏమో? ముస్తఫా యుద్ధం ఏమిటో నాకు తెలియదు. మునీర్ కీ తెలియదు, గోరీమాని అడిగితే వొక సారి “ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు,” అని వొక వాక్యంలో తేల్చేసింది. అవునా? అల్లా ఏడు ఆకాశాలు అన్నాడే కానీ, ఏడు నేలలు అని ఎక్కడయినా అన్నాడా? తెలియదు. చాలా విషయాలు తెలియవు.
ముస్తఫా వొక తేలికపాటి స్వర్గాన్ని ఇక్కడ జనం కోసం నిర్మించి పెట్టాడు. ఆ కొద్ది పాటి స్వర్గమే చాలు అనుకుని, ముస్తఫా లోనే ఆ దేవుడినీ వూహించుకున్నారు జనం! కానీ, తన వాళ్ళందరికీ ముస్తఫా కేవలం షైతాన్! ఈ తేడా ఎక్కడుంది? నా ఆలోచనల్ని తెంపుతూ, “అలా బయటికెళ్దామా కాసేపు?” అన్నాడు మునీర్ అప్పుడే కన్ను తెరుస్తూ.
“చాయ్ తాగి పోరాదా?” అని మేం సరే అనేలోపే రెండు గ్లాసులు మా ముందు పెట్టింది ఫాతిమా అత్తయ్య.
ఆమె కళ్ళు ఎప్పుడూ ప్రశాంతమయిన రెండు నదులు. కానీ, ఆ నదిలో రాయి విసిరితే, ఆ రాయిని కడుపులోకి లాక్కు వెళ్తుంది ఆ నది. కానీ, వొక్కటంటే వొక్క చిన్నవలయం కూడా కనిపించదు. ఏ స్థితినయినా వొకే వొక్క నిర్మమకారంతో స్వీకరించే నిరాడంబరమయిన నిర్మలమయిన కళ్ళు ఆమెవి.
అన్నేళ్లు తనతో కలిసి వుండి, ఇంత మంది పిల్లలకు కలిసి జన్మ ఇచ్చిన భర్త శరీరం చల్లబడిపోయిన క్షణాన ఆమె ఎలా వుండింది? అందరిలా గుండెలు పగిలిపోయేలా, నేలకి చేతులు బాదుకొనీ బాదుకొనీ ఏడుస్తూ వుండిపోయిందా? అలా జరిగి వుండకపోవచ్చు. ఆమె వొక మూలలో ఆరిపోయిన దీపంలా ముడుచుకు కూర్చోనిందా? ఏమో..అలా కూడా వూహించలేను. ఇంకెలానూ, ఎలానూ వూహించలేను!?
మునీర్ చాయ్ కానిచ్చేసి, “పద బయటికెళ్దాం,” అన్నాడు.
“ఒరేయ్, అడుగుదాం అనుకుంటూ, నువ్వేం అనుకుంటావో అని సందేహిస్తున్నా. అబ్బా మరణం గురించి బయటి జనాలకి చెప్పలేదా?”
“వూళ్ళో తెలుసు. బయట వూళ్లలో తెలియదు. కావాలనే చెప్పలేదు.”
“ఎందుకు?”
“ఇదంతా మాకిష్టం లేదు. నీకు తెలుసుగా. నేను, అమ్మా, గోరీమా మొదటి నుంచీ వీటన్నిటికి దూరమే.”
“అవును, నాకు తెలుసనుకో. ఫుప్మాకి అస్సలు ఇష్టం లేదు ఈ దారి.”
“అసలు ఇది దారి కూడా కాదు నన్నడిగితే! వొక దారి మళ్లింపు. దేవుడు వొక ముసుగు. భక్తి వొక వంచన!”
“అర్థమయ్యింది. కానీ, ఆ మనిషి పోయినప్పుడు ఆ విషయం అనవసరం కదా!”
“ఎందుకో...ఇదంతా మా లోపల చాలా అసహనాన్ని కలిగించింది. కొన్నేళ్ళ నివురు పేరుకుపోయిన నిప్పు. తట్టుకోలేని స్థితి కూడా వచ్చేసింది.”
అంత కంటే ఎక్కువగా వాడి చేత మాట్లాడించడం నాకు ఇష్టం లేకపోయింది. నిజానికి, ఈ విషయంలో వాళ్ళంతా ఎలా ఫీలవుతున్నారో నాకు తెలియని విషయం అయితే కాదు కదా!
“మరి, ఆ గది?”
“చూస్తావా? చూపిస్తా. పద!”
అంటూ, ఆ గది వున్న చోటుకీ, ఆ జెండా చెట్టు దగ్గిరకీ తీసుకువెళ్లాడు. అక్కడ గది లేదన్న విషయం నేను వచ్చిన మరుక్షణమే గుర్తించాను. కానీ, ఏమయినా పొరపడ్డానేమో అనుకుని వెంటనే ఏమీ అడగలేదు.
“ఇదే గది వున్న చోటు.” అని చూపించాడు. ఆ చూపించిన చోటున గతంలో వొక గది వున్న జాడ కనీసంగా అయినా లేదు. అంతా చదునుగా వుంది. “అది కూలగొట్టాం, అబ్బా పోయిన మర్నాడే!” అన్నాడు మునీర్.
“అవునా? అంత వెంటనేనా?”
“అవును. దానికి ఏ రకమయిన కొనసాగింపూ మాకు ఇష్టం లేకపోయింది. ఆ కథ అక్కడితో ముగించడం లోకానికి, మాకూ మంచిదని అనుకున్నాం.” అన్నాడు చాలా స్పష్టంగా మునీర్.
నేను అక్కడే వున్న వొక రాయి మీద కూర్చొని, కాసేపు ఆ గది వున్నట్టే వూహించుకున్నాను. నన్ను చిన్నప్పటి నించీ వెంటాడిన ఆ గది ఇప్పటికీ నాకు ఊహ! అంతే! ఆ కనిపించని గది చుట్టూరా ముస్తఫా నీడ ఏదో తారట్లాడుతున్నట్టుగా అనిపించింది నాకు.
“సర్లే...ఇక వెళ్దాం పద!” అన్నాడు మునీర్ చాలా మామూలుగా, నా ఆలోచనల్లో ఆ గది ఇంకా నిలబడే వుందన్న విషయం గుర్తించి కూడా గుర్తించనట్టు.
“ఆ గది ఎప్పటికీ నాకు చీకటి గుహ. దేవుడు వున్నాడని నేను గట్టిగా నమ్ముతాను, కానీ ఈ చీకటి గదుల్లోనో, విచిత్ర శక్తుల్లోనో, గుహల్లోనో వున్నాడని ఎవరు చెప్పినా నేను నమ్మను. దాన్ని కూల్చినప్పుడు నాకు ఆ చీకటి నించి విముక్తి దొరికింది,” అన్నాడు మునీర్ బయటికి వస్తూ.
“ఓ, ఈ కథ ఇలా ముగిసిందా?” అన్నాను పైకే.
“అవును, కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి,” అన్న మునీర్ వాక్యం ఆ రోజు నన్ను నిద్రపోనివ్వలేదు!
*
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
21 comments:
అఫ్సర్ గారు కధా చాలా బావుందండి. మీరు, కల్పన తరచూ అంటే కనీసం నెలకో కధైనా రాయాలని కోరుకుంటున్నాం ...
I agree with Jyoti garu. The story is good; thanks for facebook to read this story.
అఫ్సర్,
"ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు...."
అన్నది చాలా చక్కని సందేశం.
"ఆమె కళ్ళు ఎప్పుడూ ప్రశాంతమయిన రెండు నదులు. కానీ, ఆ నదిలో రాయి విసిరితే, ఆ రాయిని కడుపులోకి లాక్కు వెళ్తుంది ఆ నది. కానీ, వొక్కటంటే వొక్క చిన్నవలయం కూడా కనిపించదు. ఏ స్థితినయినా వొకే వొక్క నిర్మమకారంతో స్వీకరించే నిరాడంబరమయిన నిర్మలమయిన కళ్ళు ఆమెవి."...
ఫాతిమా వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన పదచిత్రాలివి.
"కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి"...
అన్న మునీర్ మాటల్లో, వెనకనున్న ఆవేదనతో పాటు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులకుకూడా అనువర్తించగల సత్యం దాగుంది ఇందులో.
మొత్తానికి మంచి కథ చదివేమన్న ఫీలింగు మిగిలింది చివరకి.
అభినందనలు.
సొదర కధా బాగుంది. పత్రికల్లొనె కాదు బ్లొగ్ లొ కూదా పెట్ట్ంది.
I am very happy Afsar garu for reading one of the sensible few recently.The reader will be taken in and carried along smoothly by the classical story telling style and by the empirical process of the narrator in the story. Finally I like the way his friend Muneer bearing the dislike for considerable long period is shown.
ఇది ఓ కథ అనేకంటే ఓ అందమైన కవిత అనే భావనే నాకు నచ్చింది. కథ ఆద్యంతమూ కవితా సాధనాలు కాళ్ళకి తగుల్తూనే ఉన్నయ్ "అతని నుదుటి మీద ఆ నల్ల మచ్చ దేవుడి సంతకంలా వుండేది, అతని నిష్టకి గుర్తుగా."...."ఏ స్థితినయినా వొకే వొక్క నిర్మమకారంతో స్వీకరించే నిరాడంబరమయిన నిర్మలమయిన కళ్ళు" ఇలాంటివి చాలానే ఉన్నాయి ఈ కథలో...నాకైతే గోరీమా కథకి సీక్వెల్ అనిపించింది..అవును మన మిత్రులందరూ చెప్తున్నట్టు తెలుగు కథకి మీ కంట్రిబ్యూషన్ చాలా అవసరం ఉంది...అభినందనలు
Afsar Garu Chaala manchi kadha chadivincharu..'అసలు ఆ ఇంటి పెద్ద కొడుకుగా మునీర్ భాయ్ తండ్రి మరణాన్ని ఎట్లా రిసీవ్ చేసుకున్నాడో నాకు అర్ధం కాలేదు'. Thandri marananni Koduku ela recieve chesukovatam enti ane prasna tho modalai, aa gadilo nijanga emundo thelusukovalanna aasakthi tho chadavatam apaleka poyanu. I agree with Vasudev garu, idi Kadha ane kanna manchi kavitha la undani. THank you so much Afsar ji. Kadha, Kadhanam chala bavunnai..
సాహిత్యం రాయటం లాగానే సాహిత్యం చదవటం కూడా ఒక రకమైన కళా ప్రక్రియ అని నేను భావిస్తాను. అటు వంటి ఆ కళా ప్రక్రియ కి దీనిని చదవటం చేత పరిపూర్ణత కలిగిందని నేను కచితంగా చెప్ప గలను. Marquez తన కథల్లో తీసుకునే లాంటి different క్యారెక్టర్ ని ఎంచుకొని...ఈ కథ లోskepticism సంగీతాన్ని వాయించిన రీతు అద్భుతం. చదివే కొద్ది కథ లో ని పాత్రల్లో మమేకం అయ్యేట్టు చేసే గొప్ప కథ.
నన్ను కూడా ఈ కథ రాత్రి కి నిద్ర పోనివ్వడు!
ThanQ sir
కథ పెద్దగయ్యే కొద్ది "కథ లోని నిజం" లో ఆ కథ చదవుతున్న పాటకునిలా నేను కూడా పెద్దగావ్వుతూ ఉన్నాను...అలాగే "నిజమైన నిజం" లో తెలియకుండానే నన్ను నేను దాహించుకుంటూ ఉన్నాను. ముఖ్యంగా...
కథ అయ్పోయ్యే సరికి "నిజమైన నిజం" లో నన్ను నేను సృష్టించు కోవటానికి కొంచం టైం పట్టింది.
Nice one!
the best story i read in recent times sir
wonderful kathanam
well knit plot
ముందుగా ఈ కథ గురించి ఎన్నో ఈ-లేఖలలో, ఫోన్లలో నన్ను ఉత్సాహపరచిన పాత మిత్రులకు, కేవలం ఈ కథ ద్వారానే పరిచయం అయిన కొత్త మిత్రులకి ధన్యవాదాలు. ప్రతీ కొత్త రచనా తన వెంట కొంత మంది కొత్త స్నేహితులని వెంట బెట్టుకు రావడం నిజంగా సంతోషం.
@జ్యోతి: నెలకో కథ! అసాధ్యం! ఈ కథ రాయడానికే నరాలు తెగిపోయాయి. అయినా, ఏం చెప్పగలం, ఎప్పుడు ఏం రాయగలమో?
@రామ గారు: ముఖపుస్తకం వల్ల కూడా కొంత ప్రయోజనం వున్నట్టే వుంది, కదా!
@మూర్తి గారు: మీరు ఉదాహరించిన ఆ వాక్యాలు ఈ కథకి ప్రాణం. ఇది నేను "రాజకీయ" కథే అనుకుంటున్నా.
@నసీర్ భాయ్: మీ ప్రోత్సాహానికి షుక్రియా
@వాసుదేవ్: ఇది కవిత్వంగా చదవాలన్న మీ కోరికలో ఈ కథ మీలో కలిగించిన భావతీవ్రతని చెప్తుంది. అయితే, ఈ కథలోని కవిత్వం అనిపించే వాక్యాలు నావి కావు, నిజ జీవితంలో ఆ పాత్రలకి ప్రేరణనిచ్చిన ముస్లిం స్త్రీల సంభాషణల నించి తీసుకున్నవి. ముస్లిం స్త్రీల భాష గురించి ఇంతవరకూ ఎవరూ మాట్లాడలేదు గాని, ఆ భాషలో సహజంగానే వొక కవిత్వ తీవ్రత వుంటుంది. భవిష్యత్తులో నేను ఇంకా కొన్ని కథలు రాయడమంటూ జరిగితే, ఆ భాషని ఇంకా బాగా తీసుకురావాలని అనుకుంటున్నా. ఆ రకంగా ఈ కథలో కవిగా నా ప్రమేయం తక్కువ. అందులో ఏదయినా అందమూ, పదునూ వుంటే, అది నాకు ఆ భాషని అరువిచ్చిన ఆ ముస్లిం స్త్రీలది మాత్రమే!
@అఫ్సర్ జహా: మీరు నా పేరు పెట్టుకొని నన్ను ఇరుకున పెట్టేస్తున్నారు! అది అమ్మాయిల పేరు అని చిన్నప్పుడు ముస్లిం అమ్మాయిలు "అఫ్సర్ ఏక్ లడ్కీ హై..." అనే పల్లవితో నా మీద పాటలు పాడేవాళ్లు వెక్కిరింతగా - అది గుర్తొచ్చి కాస్త నవ్వొచ్చింది ఇప్పుడు. మీ ప్రోత్సాహానికి షుక్రియా....
@రోహిత్: మీ వ్యాఖ్యల్లో వొక లోతయిన విమర్శకుడు కనిపిస్తాడు నాకు. సంతోషం అనిపించింది. ఈ కథలోని ఆ సంశయ వాదాన్ని మీరు చక్కగా గుర్తించారు.
@బాబా: షుక్రియా. కథనం అంటే వృత్తం వస్తువు అనే ఇతివృత్తం చుట్టూ తిరుగుతుంది కదా! ఈ కథన పద్ధతి ఈ కథకి బాగా నప్పిందనుకుంటా. ఇందాక రోహిత్ చెప్పినట్టు - ఆ మార్కెజ్ ఇప్పుడు కాస్త నడిపిస్తున్నాడు నాలోపలి భాషని!
కథలోని మార్మికత పాఠకులను ఆకట్టుకుంటుంది. కధనం బాగుంది. ఈ మధ్య వికిపీడియా కార్యక్రమాలలో నిమగ్నమయ్యాను. చూడండి దీప్తిధార. ఈ కధ మీ గురించి వికీపిడియాలో వ్రాయాలనే ప్రేరణ ఇచ్చింది.
For follow-up comments.
దేవుడు వొక ముసుగు. భక్తి వొక వంచన!”
భాద్యతలనుండి తప్పించుకుని ఆధ్యాత్మిక ముసుగుగులోను లేదా మహిమల వల వేసి జనం ని మభ్య పెట్టిన విషయం చదువుతునప్పుడు అప్రయత్నంగానే ఈ దేశంలో కొంత మంది బాబాలు గుర్తుకువచ్చారు .
“ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు,” అని వొక వాక్యంలో తేల్చేసింది.
నిజమేనండీ..ఈ మందిరాలు,మసీదులు,చర్చిలు.. ఇంకా ఇంకా ఏవీ అవసరం లేదు కదా!? .
“అవును, కొన్ని కథలకు మనమే బలవంతంగా ముగింపు ఇవ్వాలి,” అన్నది చాలా బాగుంది.
వెళ్లగలనా లేదా! వెళ్ళినా, దాదాపూ నా కుటుంబంలాంటి మునీర్ కుటుంబాన్ని చూడగలనా? స్నేహాన్నిపరిస్థితుల్లోను , బాధల్లోను చూసుకోవడం హృదయాన్ని పిండేసింది. చాలా మంచి కథని (కథకాదని తెలుస్తూనే ఉంది.) అందించి ఆలోచనలనలని రేకెత్తించారు.
అఫ్సర్ గారు,
'వాక్యం రసాత్మకం కావ్యం'. కాని, ఈ మద్య వస్తున్న కథల్లో మంచి వాక్యాలున్న కథ దొరకడం అరుదు.
మీ "ముస్తఫా మరణం" కథ చదివాక చాలా రోజుల తర్వాత కొన్ని మంచి వాక్యాలు చదివిన ఫీలింగ్ కలిగింది. ఈ కథలో మాటలు వెంటాడాయి, పాత్రలు ప్రశ్నించాయి, నిజాలు కొన్ని నిలదీశాయి. కథ ఉత్తుత్తినే చెప్పినట్టు కాకుండా నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు.
'కథ రాసేటప్పుడు కవిత్వపు నరాల్ని తెంపుకోవలసి వస్తుంది' అన్నారు. కాని, ఈ కథకున్న బలమైన కథానరాలలో మీరు కవిత్వపు రక్తాన్ని కూడా ఎక్కించినట్టు అనిపించింది. 'గదిలో ఏముంది?' అన్న ఉత్కంఠతో మొదలై, "చూస్తూ వుండగానే అనేక రంగులు మారిన అతి సంక్లిష్టమయిన పెయింటింగ్ ముస్తఫా జీవితం." అంటూ ముస్తఫా గురించి మరింత తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగిస్తూ, దాని చుట్టూ బలమైన సన్నివేశాలను చిత్రీకరిస్తూ, కథంతా ఎక్కడా సాగదీయకుండా, మూలవస్తువు నుండి దూరం చేయకుండా, నేపద్యానికి తగ్గ పదాలతో, నేపద్యంలో ఎక్కడా తేడా రాకుండా కథ నడిపించారు. మీ కవితల్లాగే ఈ కథలో కూడా మార్మికత ఉందనిపించింది. ఇందులో చాలా సన్నివేశాలు చదువుతున్నంత సేపు నన్ను ఆవాహనం చేసుకున్నాయి. కథలో ఉన్న మూలసూత్రమేదో చివరంటా చదివించి ఆలోచింపచేసింది. చాలా రోజుల తర్వాత వొక ప్రాణం వున్న కథ చదివిన ఫీలింగ్ కలిగింది. "మొదటి అరబ్బీ వాచకం చదివాక అరబ్బీ అంటే అల్లం మురబ్బా అయిపోయింది నాకు." అన్న మాటలు చిన్నప్పుడు తిన్న అల్లం మురబ్బా గుర్తు చేసి నోట్లో నీళ్ళు ఊరించాయి.
ఈ కథ లో గొరీమా పేరు కనపడగానే వెంటనే మీ "గొరీమా" కథ వెదికి మరో మారు చదివాను. గొరీమా నిజజీవితంలో ఉన్నారా? ఈ రెండు కథలు చదివాక మీ రాబోయే కథకు నేపద్యం ఏమయివుంటుందో ఊహించవచ్చేమో!
-రవి వీరెల్లి
అఫ్సర్, రచయితగా నిర్మమత్వంతో ఏ ఒక్క వైపో నిలవకుండా కథని నిర్వహించిన తీరు గొప్పగా ఉంది. చాలా కష్టమైన కథ. అయితే అంతకుమించిన కష్టం ముస్తాఫాని అర్థం చేసుకోవడం. ఎంత neutral గా ఉన్నా, తన జీగ్రీ దోస్తు మునీర్ కష్టం పట్ల సానుభూతి వల్ల, తను కర్బలా యోధుడిలా కనిపించడం వల్ల, అమితంగా ఇష్టపడే గోరీమా immense influence వల్ల ముస్తాఫాని, ఆయన plane లో మీరెవ్వరూ అర్థం చేసుకోలేదు. ముస్తాఫా నుదుటి మీద ఆ నల్ల మచ్చ దేవుడి సంతకంలా వుండేదని అర్థం చేసుకున్న మీరు కూడా, ఆధ్యాత్మికత కి 'విశాలం' అని మెరమెచ్చులకి పోయే నిర్వచనాలు ఇప్పించాలని ప్రయత్నించారు ("ఆధ్యాత్మికత అనేది మైదానం లాంటిది. దిగంతం కనిపించాలి. పైన ఆకాశమూ కింద నేలా కనిపించాలి. అంతే కానీ, అది ఇరుకు గది కాదు....").
అది 'ఇరుకు గది' కాదు, మార్మిక మందిరం. లౌకికత దాన్ని కూల్చేసింది, narrator అయిన మీరు, తెలిసో తెలియకో దానికి వత్తాసు పలుకుతున్నారు.
@రావు గారు: ధన్యవాదాలు. మార్మికతే ఈ కథకి వొక వస్తువు.
@వనజ వనమాలి గారు: థాంక్ యు. "కథ కాదని" తెలుస్తోందా? నిజమా?
@రవి వీరెల్లి: అవును, గోరీమా నిజజీవిత పాత్రే! ఆమె దగ్గిర నేను ఉర్దూ/ అరబ్బీ నేర్చుకున్నాను. వొక నవలకి సరిపడా కథ ఆమె జీవితంలో వుంది. కానీ, నవల రాయడం నా వల్ల అయ్యే పని కాదు, కాబట్టి ఆమె పాత్రని కథల్లోకి కుదిస్తున్నాను. రాయబోయే కథ గురించి: అది గోరీమా గురించి కాదు, మీ ఎవ్వరి వూహకీ అందని (ఆ మాటకొస్తే, ఇంకా నా ఊహాలోనే సరిగా చిత్రిక పట్టలేని...) కథ ఏదో నా లోపల సుడి తిరుగుతోంది. ఎదురుచూస్తున్నా, దాని బాహ్య రూపం కోసం!
@నరేశ్: మీ మంచి మాటకి షుక్రియా. ఈ కథని ముస్తఫా కోణం నించి ఎందుకు రాయలేదని మీరే కాదు, కేతు విశ్వనాథ రెడ్డి గారు, వసంత గారు కూడా అడిగారు. ముస్తఫా వొక పాత్రగా నా లోపలికి వచ్చి, వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. బహుశా, అతని "మార్మికత" తో నేను అంతగా ఏకీభవించలేకపోయానేమో! నా దృష్టిలో మనుషులకే కాదు, దేవుళ్ళకీ, ఆధ్యాత్మికతకి కూడా వొక నెట్ వర్క్ వుంటుంది. దేవుళ్ళని కూడా సంబంధాల్లోంచి మాత్రమే చూడాలి అనుకుంటా. ఆ రకంగా అది మానవ సంబంధాల వ్యవస్థ కంటే క్లిష్టమయింది. ఈ కథలో నేను మునీర్ స్నేహితుడిగానే మిగిలిపోయాను చివరి దాకా! అవును, మీరన్నట్టు ఎవరి పక్షమూ కచ్చితంగా తీసుకోలేకపోయాను. నా లోపలి ఉద్వేగం మునీర్ వైపే ఎక్కువగా తోసింది నన్ను. ఆ ఉద్వేగాన్ని నిరాకరించే శక్తి నాకు లేకపోయింది. ఇక, లౌకికత గురించి అంటారా, అది నాకు వేరే కథ!
" ఎంత neutral గా ఉన్నా, తన జీగ్రీ దోస్తు మునీర్ కష్టం పట్ల సానుభూతి వల్ల, తను కర్బలా యోధుడిలా కనిపించడం వల్ల, అమితంగా ఇష్టపడే గోరీమా immense influence వల్ల ముస్తాఫాని, ఆయన plane లో మీరెవ్వరూ అర్థం చేసుకోలేదు."
నరేష్ గారి పై వాఖ్యతో ఏకీభవిస్తున్నా. మీరు ఎవరి పక్షమూ తీసుకోలేదు అనడం కంటే మునీర్ పక్షము తీసుకున్నారు అనడమే సబబు.
ఎంతవారలైనా తటస్థంగా వుండటం, ఉద్వేగాన్ని నిరాకరించే శక్తి కలిగి వుండటం అసాధ్యమేమొ!
Kaddha..kaddhanam..bhagunai.
Afsarji..meethomaatladali..kuduruthunda?
అఫ్సర్ గారు, కథ చాలా బావుందని చెప్పడమంటే చిన్నమాటే అవుతుందేమో. ఎక్కడో చదివాను మీరు మొదట కథలే రాసేవారని... ఇది మాత్రం నేను చదివిన మీ మొదటి కథ! బలవంతపు ముగింపునివ్వాలి అన్న ఆ చివరి వాక్యం మనసుని కలవరపెట్టేసింది.
- స్వాతి సాయి యాకసిరి
Post a Comment