సైగల్ పాట
కిటికీ తెరల కుచ్చుల్ని
పట్టుకు జీరాడుతుంది దిగులుగా నీ పాట
చిరుగాలి రెక్కల మీద
చిర్నవ్వు కదలికల కలల వీణ

చిగురాకు కొనపై
మంచుబిందువు మరణవేదన
కాలం క్రూర శాసనానికి
కునారిల్లుతున్న కూజితం

స్రవించే స్వరపేటికని
నిర్దాక్షిణ్యంగా తెంపేసి
కాలం మెడలో హారంగా అలంకరిస్తుంది జీవితం
సజీవ వేదనా స్రవంతిగా
ప్రవహిస్తూనే వుంటుంది నీ పాట.

వీణ తీగల మీద కదలాడే వేళ్ళు
మెల్లిగా తెగిపోతాయి.
వేగంగా వీచే గాలిలోకి
భళ్ళున కూలిపోతుంది చెట్టు.

బాధని స్వరాల సరంగా కూర్చి
లోకాన్ని ఊహల తోటల్లోకి నడిపించి
తను మాత్రం
కాలగర్భంలో వొత్తిగిలి పడుకుంటుంది.

దిక్కుల్ని ధ్వనులతో బంధించి
వెన్నెల ధనస్సు సంధించి
చీకట్లను ధ్వంసం చేసి
కాంతి శిఖరాగ్రాన సిందూరమయి
పలకరిస్తాడు.

అతనే వినిపించకపోయినా
అతని పాట వినిపిస్తుంది
మెల్లిగా కదిలి
తుపానయి చుట్టుముడుతుంది జ్ఞాపకంలా.

నడుస్తున్న నిన్ను వెంటాడి వేధిస్తుంది
రాత్రిలోంచి రాలి పడ్డ స్వప్నంలా.

("రక్తస్పర్శ" 1985)

ఇవాళ సైగల్ స్మృతిని మళ్ళీ తట్టి లేపిన చిత్రశిల్పి, మిత్రుడు అన్వర్ భాయికి కృతజ్ఞతలతో
Category: 10 comments

10 comments:

koduri vijayakumar said...

పైకి కనిపించని లోలోపలి గాయాలని ఒక మాయా దర్పణం లో చూపించినట్టు చాలా బాగుంది...రక్త స్పర్శ లోంచి ఈ పద్యాన్ని ఈవేళ మళ్ళీ అంతర్జాల తెర మీద పెట్టినందుకు కృతజ్ఞతలు...! సున్నితమైన భావాలను సరళమైన మాటలతో వ్యక్తీకరించిన ఇలాంటి పద్యాలని ఎక్కువగా రాయవలసిన సందర్భం లోకి ప్రవేశించాము అనిపిస్తోంది...

Afsar said...

@విజయ్: మీ వ్యాఖ్య బాగుంది. మంచి ఆలోచన. "సున్నితమయిన భావాలను సరళమయిన మాటలతో..." రాయాలన్నది మంచి ఆదర్శం. కానీ, కొన్ని అస్తిమిత క్షణాలు వుంటాయి, అవి అంత సరళంగా వుండవు. అప్పుడు భాష కూడా సరళ రేఖలా వుండదు, కుండ నీళ్ళు, కూజా నీళ్లలాగా. అప్పుడేం చేస్తాం? సెలయేటిలో దూకి ఎటో వెళ్లిపోవడమే!అది తిరిగే వక్ర రేఖలన్నీ మనమూ తిరగడమే!

rohith said...

Enni rojula tarvaata mee kavitvam chadavatam....yepudo marchipoyina toli vupiri ni ippudu peelchinattu anpistondi. ThanQ very much sir :-)

కెక్యూబ్ వర్మ said...

ఇన్నినాళ్ళ తరువాత కూడా చూరంటిన జ్నాపకంలా అలా సజీవంగా సంవేదనగా వున్న నివాళి గీతం...మరోసారి పంచుకున్నందుకు ధన్యవదాలు సార్...

Raghothama Rao C said...

క్యా బాత్ హై!

పాతికేండ్ల క్రితం నాటి కవిత. సైగల్ పాటలాగే విచిత్రసౌందర్యంతో పలుకుతోంది. కొన్ని పదబంధాలు భలే ఉన్నాయి.

ఎనభైలనాటి రచనాశైలిని మళ్ళీ గుర్తుకు తెచ్చినందుకు అఫ్సర్ గారికి వీరతాడు...ఒక్కటి మాత్రమే...అని సవినయంగా మనవి చేస్తూ...

ఎక్ బంగలా బనే న్యారా :)

వాసుదేవ్ said...

కవిత చదవటం పూర్తయ్యాక మళ్ళీ పేరు చూశాను...నేనింతకుయ్ముందు రక్తస్పర్శ చదవలేదు. చాలా డిఫరెంట్ భాష. విజయకూమార్ గార్కి మీరిచ్చిన జవాబులో నాకూ జవాబు దొరికింది.అన్ని భావాలకి ఒకే భాష ఉండె అవకాశం లేదు. కాని......ఎందుకో ఇలాంటివే ఎక్కువ ఉంటె బావుణ్ణనిపించే భాష.సంక్లిష్టత లేని పద పేర్పిడి."..దిల్ హీ టూట గయా" కేవలం అతను మాత్రమే అలా తుంచగలడు.

Afsar said...

@రోహిత్: అవును, కవిత్వానికి మనసు ఖాళీ లేదు. అన్నట్టూ, మీరు రాసిన ఆ వాక్యం బాగుంది. కొత్త కవిత్వం చదివినప్పుడల్లా కొత్త ఊపిరి అందినట్టే వుంటుంది.
@వర్మ: "చూరంటిన జ్నాపకంలా" - అదే కవిత్వ పంక్తి!

@రఘువరా, మీ మాట కొండంత బలం...సైగల్ ని తలచుకుంటేనే, వొక గోర్వెచ్చని కన్నీటి స్పర్శ.

@వాసు, పాటలో ఆ పదాల్ని అట్లా తుంచడం, నిజమే, అది సైగల్ కే చాతవ్వు. అందులో కవిత్వ వాక్య రహస్యం కూడా వినిపిస్తోంది నాకు.

dhaathri said...

"ulfat కా దియా హమ్్నే ఇస్ దిల్ మే సజాయ థా ఉమ్మీద్ కే ఫూలోంసే ఇస్ ఘర్ కో సజాయా థా అరె సాథీ చూట్ గయా హం జీకే క్యా కరేంగే" అఫ్సర్ సైగల్ ఒక పాటగాడే ఐతే ఇంతలా గుర్తుండే వాడు కాడు సైగల్ హృదయాన్ని మెలిపెట్టే జీవనాదం ఉన్న స్వరం అతనిది అందుకే ఇలా చిరస్థాయిగా .... మీ కవితకన్న మెలోని అతని పట్ల ఆరాధన ముగ్ధుల్ని చేస్తుంది ఎవరినైనా.... సరళంగా చెప్పగలగడమన్నది చాలా కష్టం..థాంక్స్ ...ప్రేమతో ...జగతి

'Padmarpita' said...

ఒక మంచికవితని మాతో పంచుకున్నందు థ్యాంక్సండి... రక్తస్పర్శకు లింక్ ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో!

PADMAPv. PADMAPV said...

Sygalpatta,meekavitwam..venellakamthullu.APPATIKI!sweetsmileAfsarji

Web Statistics