1
యెవ్వరికీ చెప్పలేదు
కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా !
2
పొద్దున్న నిద్రమొఖంతో మబ్బు కళ్ళతో
దాని ఆకుల్లోకి తీక్షణంగా చూసి
దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
పొద్దుటా, మధ్యాన్నం, రాత్రి పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?!
3
దాని లేలేత వగరు ఆకుల్ని అప్పుడప్పుడూ నవుల్తూ
దాంతో మాట్లాడ్తున్నట్టొ, పోట్లాడ్తున్నట్టో
అన్ని వయసుల యేడేసి రంగుల్లో దాంతో ఆడ్తూనో,
రాయని ప్రేమ లేఖల్ని దాని జడ పాయల్లో దాస్తూనో దాపరికాలు లేవు యిక్కడికొచ్చాక.
పరాయి క్షణాల్లేవు యీ గడియారంలో.
4
యెవ్వరికీ చెప్పనయితే లేదు
కాని యిక్కడ నేను కూర్చున్న చోటే
యీ అరుగు మీద జీవితాన్ని గురించి
బేఫికర్ గా బేఖాతర్ చేస్తూ
రాత్రిని పగల్లాగా, పగటిని రాత్రిలాగా మార్చి మార్చి చూసుకొని లేనిపోని తకరార్లు పడి,
ఆరునూర్లయ్యి ఆరు కాలాల వర్ణ వివర్ణ దృశ్యాలన్నీ మారి
చివరికి యెవరికెవరు మారామో తెలీదు కానీ
యిప్పుడీ క్షణం ఆ చెట్టు వొక అజ్నబీ!
వొక జ్నాపిక : “ ఈ జాంచెట్టుని పెళ్ళగించి, ఇంకో చోట నాటగలవా?” - అని అడుగుతుంది సయీద్ అఖ్తర్ మీర్జా సినిమా ‘నసీమ్ ‘( 1995) లో వొక ప్రధాన పాత్ర. ఆ జామ చెట్టు భారతీయ ముస్లిం అస్తిత్వానికి వొక ప్రతీక.
యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం!
యింతే! ఆ క్షణానికి గెల్చిన అప్పటి ఆటలు ఇప్పుడు వోడిపోతాం.
1
బయటి కన్ను మూసుకున్నప్పుడు లోపలి కన్ను వెలిగించుకొని
లోపలి కన్ను మసకేసినప్పుడు బయటి కన్ను దీపం పెట్టుకొని
వొళ్ళంతా తడుముకొని వెతుక్కున్నట్టు చెట్టు
నన్ను నిలువెల్లా జల్లెడ పడ్తుంది,
నన్ను యెట్లయినా నన్నుగా రాల్చాలని!
2
అననైతే అన్లేదు గాని యిన్నాళ్ళ యిన్నేళ్ళ నిశ్శబ్దం తరవాత వొక చెట్టూ వొక నిలువెత్తు మనిషీ కుప్ప కూలిపోతున్నట్టే వుంది కళ్ళ ముందర!
3
వెతుక్కుంటూ వెళ్తే యిప్పుడిక్కడ ఏమీ లేదు కాని వొక మిగుల పండిన జాంపండు వాసన వొంటికంతా అంటుకున్న నిప్పు.
4
మాగన్నుగా నిద్దరోతున్న లోపటి వొళ్ళు
దాని గడ్డ కట్టిన నిద్రా హిమవత్పర్వత లోఅరణ్యం
నిప్పు గుండం.
5
నిద్ర మీంచి నిప్పుల నడక వొకే వొక్క మెలకువ యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం! 2006
*
నిడదవోలు మాలతి కి మొల్ల పురస్కార ప్రదానం
-
ఏడు శతాబ్దాల నాటి రచయిత్రి మొల్ల. ఏడు వసంతాల సాహిత్య సౌరభం మాలతి గారు. ఈ
ఇద్దరినీ, మరెందరో సాహిత్య విమర్శకులను, అభిమానులను కలుపుతున్న సాంకేతిక జూమ్
స...
1 year ago
0 comments:
Post a Comment