1
ఆకుపచ్చ నదిలోంచి ఒక మొక్కజొన్న కంకి
అయిదారు నెలల కడుపుతో తెల్లగా నవ్వింది
దారి పక్కన.
2
పద్యాలు ఎలా వుంటాయి?
ఒక్కటే ప్రశ్న దారి పొడవునా.
అప్పుకి పుట్టవు పదాలు.
కడుపు పండాలి రక్త మాంసాల కంకి.
3
కొన్ని పిట్టలూ కొందరు మనుషులూ కొన్ని మొక్కలూ
ఇవి లేని ఆకాశం నాకెందుకు?
అని గాలి చల్లగా గోల చేసింది.
4
నలుగురు కలిస్తే నాలుగు పద్యాలు
పద్యం ఎప్పుడూ వొంటరి కాదు.
5
కాయితమయినా ఇనప రేకు అయినా
మట్టి పొరయినా.
అన్నం పళ్ళెం పళ్ళెమే!
కడుపు నింపే కల దానికి తెలుసు!
6
పగలంతా దిక్కుల్ని ముద్దాడిన పిట్టలు
సాయంత్రం బారన్ కింద చేరాయి
కువకువలతో.
బారన్ మాటల గూడు.
7
బాధ తెలిసిన పదం పద్యం అంటే.
నొప్పి లేని చోట పై పూత దేనికి?
8
నెగడు మండుతూ నిప్పు పెదాలతో నవ్వుతూ
చీకటి అంతు చూస్తోంది
కవిత్వం వచనంతో ఆడుకుంటూ
సంభాషణల్ని ఎగదోస్తోంది.
ఈ రాత్రిని ఏ నెగడూ కరిగించలేదు.
9
పద్యం రాయడం
ఇంకా రావడం లేదని
కవి గొంతులోని పసి వాడి రోదన
ఏడ్వనీ,
ఎంత ఏడిస్తే అంత పద్యం!
10
తిరిగొస్తూ
అతను చొక్కా గాలికి ఇచ్చేశాడు
బైకు మీద తనే
దూసుకెళ్ళిపోయాడు మెత్తని చప్పుళ్ళ గాలిలా.
హోరు హోరు పద్యంలా.
అతని వైపు చూస్తూ చూస్తూ నేను
వెనక్కి.
వెనక్కి.
11
పొలానికీ ఆకాశానికీ మధ్య
మేం.
పద్యం వదిలి వెళ్ళిన నిశ్శబ్దం!
6 comments:
బాగుంది.
పదాల బుట్టల్లోంచి ఒక్కో పదాన్ని శ్రద్దగా ఏరి
సుతిమెత్తగా కూర్చి
ఒక్కో పదానికి ప్రాణం పోసినాట్టుగా...
ఇలా వ్రాయడం మీకే సొంతం!
చాల బాగుంది.
-రవి వీరెల్లి
రవీ, నాయుడూ:
మీ వ్యాఖ్యలకి ధన్యవాదాలు. పదాల ఎంపిక అనుభవాన్ని బట్టి వుంటుంది కదా!
<"ఆకుపచ్చ నదిలోంచి ఒక మొక్కజొన్న కంకి
అయిదారు నెలల కడుపుతో తెల్లగా నవ్వింది
దారి పక్కన">
అందుకే గామోలు మొక్కజొన్న 'పొట్ట' అంటారు
<"పద్యం రాయడం
ఇంకా రావడం లేదని
కవి గొంతులోని పసి వాడి రోదన
ఏడ్వనీ,
ఎంత ఏడిస్తే అంత పద్యం!">
చాలా రోజులనుంచి రోదిస్తున్నాను.. చూద్దాము ఎంత మంచి పద్యము వస్తుందో!!!
బాగున్నాయి అఫ్సర్ గారు.
ఎరీనా... సుతిమెత్తగా బావుంది. కవిత అనో, కవిత్వమనో అనకుండా, పద్యం అనడంలో అంతరార్ధం ఏమిటి?
రాజా:
మంచి మాటకి థాంక్స్
పద్యం...కవిత్వం..మంచి ప్రశ్న. తేడా నాకు ఇంకా స్పష్టంగా తెలియదు.
కాని, పద్యం అన్నప్పుడు అదొక సాహిత్య రూపం అనీ, కవిత్వం అన్నపుడు జీవితంలోని సున్నితత్వమో, మరో భావమో అనిపిస్తాయి.
ఈ కవితలోనే ఆ రెండు సందర్భాలూ మీరు గమనించవచ్చు.
Post a Comment