తెలంగాణా కథ గురించి మళ్ళీ...!


ప్రాంతం/ ప్రాంతీయత తెలుగు కథకి ఇవాళ కొత్త అంశాలు కావు. తెలుగు కథ పుట్టినప్పటి నించీ "ప్రాంతం" ఆ కథకి పునాది. ప్రాంతం నేపధ్యం లేకుండా తెలుగు కథ ఏ నాడూ లేదు. కాని, ప్రాంతాన్ని వొక దృక్పథాంశంగా తీసుకోవడం గత మూడు దశాబ్దాలుగా తెలుగు కథా నిర్మాణంలో, కథా సాహిత్య విమర్శలో కనిపిస్తున్న మార్పు. ఈ మార్పుని మరింత నిర్దిష్టంగా నిర్వచించడానికీ, లేదా, వివరించడానికీ "ప్రాంతం" "ప్రాంతీయ వాదం" అనే రెండు భావనల్ని చర్చించి, ఈ కొత్త "ప్రాంతీయ వాద" చర్చలో తెలంగాణా కథ స్థానాన్ని అంచనా వెయ్యడం ఈ వ్యాసం వుద్దేశం. అయితే, ప్రాంతీయ వాదం అనే భావనకి ఇంతకు ముందే తెలుగు సాహిత్య, సామాజిక రంగాలలో వొక చట్రం నిర్మితమయి వుంది కాబట్టి, ఆ పదానికి బదులు "స్థానికత" అని కొంత విస్తృతార్ధంలో వుపయోగించాల్సిన అవసరం వుంది.
ఇవాళ ప్రాంతం పేరుతో తెలుగు కథకులు చర్చలోకి తీసుకు వస్తున్న అంశాలు అవి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, కొత్తగా ప్రపంచీకరణ పేరిట వస్తున్న ఆర్ధిక, మార్కెట్, అంతర్జాతీయ రాజకీయ ప్రేరిత భావనల్ని యెదుర్కోవాలన్న ప్రతిఘటన వాంచ స్థానిక కథకులలో కనిపిస్తోంది. తెలుగు కథ ఇప్పటి దాకా సాగించిన నూరెళ్ళ ప్రయాణానికి, ఇప్పుడు రెండో వందలో సాగించబోతున్న కొత్త ప్రయాణానికి కొత్త పునాది మరీ ముఖ్యంగా ఈ పదేళ్ళ కథల్లో వుంది. ప్రాంతీయ అసమానత అనే అంశమే ఈ కొత్త శతాబ్ది ప్రయాణానికి కెంద్ర బిందువు అయినప్పటికీ, తెలుగు కథ ఆ పరిమితిని దాటి, "స్థానికత"ని బలంగా తీర్చి దిద్ది, ప్రపంచీకరణని సవాలు చేయబోతున్నదని ఈ వ్యాసంలో నా ప్రధానమయిన వాదన. అసమానత అనే భావనని కొత్త సందర్భం నించి అర్ధం చేసుకొవాల్సిన అవసరం వుంది. ప్రాంతీయ అసమానత అనేది ప్రాంతానికి మాత్రమే పరిమితంకాదు, ఆ ప్రాంతంలో వుండే ఇతర అసమనాతల్ని కూడా సమంగా చూడక తప్పదు. తెలంగాణలో దళిత స్త్రీవాదులు, ముస్లిం రచయితల కథల్లో ఈ కొత్త అసమానతల కోణాలు మనం చూడ వచ్చు.
ప్రాంతం నించి ప్రాంతీయ అసమానతల్ని ప్రతిబింబించేంత దూరం దాకా సాగిన తెలుగు కథా ప్రయాణం కూడా చిన్నదేమీ కాదు. మొదటి తెలుగు కథ ఎవరు రాశారన్న వివాదం కొంచెం పక్కన పెడితే, ఆధునిక తెలుగు కథకి వొక నిర్దిష్టమయిన ఆకృతినీ, చెలామణినీ తీసుకు వచ్చిన గురజాడ వొక ప్రాంతాన్ని ఎన్ని కోణాల నించి చూపించ వచ్చో అన్ని కోణాల్నీ కథల్లో చూపించాడు. వొక నిర్దిష్టమయిన స్థలాన్ని, కాలాన్ని, సమూహాల్ని సన్నిహితంగా అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన చరిత్రనీ, సంస్కృతినీ సునిశితంగా అంచనా వేసే ఆధునిక ఆంథ్రొపాలజిస్టులకూ, ఇథ్నాగ్రాఫర్లకూ అవసరమయిన సమగ్ర సమాచారంతొ పాటు, ఆ స్థల కాలాల్లోని వివిధ సమూహాల భావోద్వేగాల చరిత్ర సమస్తం గురజాడ కథల్లో వుంటుంది. (ఉదాహరణకి: "దేవుళ్లారా! మీ పేరేమిటి?") వలస పాలనకీ, ప్రాంతీయ అధికార శక్తులకూ మధ్య స్థానిక జనం ఎంత రాపిడికి గురయ్యారో, ఆ రాపిడి లోంచి కొత్త అస్తిత్వాలు ఎలా పుట్టుకు వచ్చాయో ఆ కథల్లో చూడ వచ్చు. ప్రస్తుత తెలంగాణా కథా చర్చకి సంబంధించినంత వరకు కూడా ఈ కథలు ముఖ్యమయినవే. హైదరాబాద్ చరిత్ర, ముస్లిం సంస్కృతి, ఉర్దు ప్రభావాల గురించి ఇప్పటికింకా అపోహలు వున్నాయి.(ఉదాహరణకి: సెప్టెంబరు "ప్రాణహిత" వెబ్ పత్రికలో జాజుల గౌరి వ్యాసం చూడండి) తెలంగాణ స్థానిక చరిత్రలో ముస్లిం సంస్కృతి పాత్ర విడదీయలేనిది. దీనికి "పీర్ల పండగ" సూఫీ దర్గాలు వొక బాహ్య సంకేతం మాత్రమే. ఒక విశాల భావనగా ముస్లిం సంస్కృతి కట్టుదిట్టమయిన వొక సెక్యులర్ స్పేస్ ని నిర్మించింది. ఈ విషయం తెలంగాణ కథకుల కంటే వొక కళింగ కథకుడు గురజాడ ముందుగా సాహిత్యంలో రికార్డు చెయ్యడం మనం గమనించాలి. హిందూ జాతీయ వాదం, ముస్లిం వ్యతిరేక అంతర్జాతీయ వాదం వివిధ రూపాల్లో మన అస్తిత్వాల్ని ప్రభావితం చేస్తున్న సందర్భంలో తెలంగాణ స్థానికతలో, సామాజిక అసమానతల చర్చలో ఈ సెక్యులర్ భావనని తెలంగాణా కథకులు ఎలా అర్ధం చేసుకుంటున్నారో, తెలంగాణా బతుకులో సగ భాగమయిన ముస్లింలని కథల్లోకి ఎలా తీసుకువస్తున్నారో నిశితంగా చూడాల్సిన అవసరం గురజాడ కాలం కన్నా ఈ కాలంలోనే ఎక్కువ. ముస్లింలని సరిగా అర్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే, మనం మన చుట్టూ వున్న స్థానికతని సక్రమంగా అర్ధం చేసుకోగలం. ఈ స్థానిక జీవన విధానం అర్ధం కానంత కాలం మనకి ఇందులో వున్న అసమానతలు బోధపడవు. గత పదేళ్ళుగా తెలంగాణా కథని దగ్గిరగా పరిశీలిస్తే, మన కథకులు ఈ కొత్త అసమానతల వాస్తవికతకి సమీపంగా వస్తున్నారని ఆధారాలు దొరుకుతాయి. ముస్లిం సమూహాల స్థానిక వేదన 'వతన్ 'లో వుంది. దళిత స్త్రీల సంఘర్షణకి 'నల్లపొద్దు ' ఆ తర్వాత ఆ రచయిత్రులు రాస్తున్న కథనాల్లో వుంది. గని కార్మికుల బాధల్ని తవ్విపోసే కథలు వున్నాయి. చేతివృత్తుల వారి కడగండ్లని, వూరి జనం చెదిరిపోతున్న బతుకుల్ని రాసే కథకులు ఈ అయిదారేళ్ళలో పెరిగారు.


అలాగే, తెలంగాణాతో పాటు ప్రాంతీయ అసమానతకి గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా వున్నాయి. ముఖ్యంగా, రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. ఆ ప్రాంతాల పట్ల ఎలాంటి వైఖరి వుండాలన్నది కీలకమయిన అంశం; అక్కడి కథకులు ఎలాంటి స్థానికత గురించి మాట్లాడుతున్నారో, ఎలాంటి అసమానతల్ని గురించి మాట్లాడుతున్నారో, వాటికీ తెలంగాణా స్థానికతకి పొంతన కుదురుతుందో లేదో బేరీజు వేసుకుంటే, తెలంగాణా స్థానికత మరింత తేట పడుతుంది. అసమానతల సారూప్యాలూ, భిన్నత్వాలూ స్థానికతని నిర్వచించడంలో, అర్ధం చేసుకోవడంలో సాధనాలు అవుతాయి. కమ్ముకు వస్తున్న ప్రపంచీకరణ, మార్కెట్ యుగంలో స్థానికత కేవలం వొక ప్రాంతానికి, వొక కులానికీ, వొక మతానికీ, వొక వర్గానికీ సంబంధించిన సమస్య కాదు, అందరి/అన్ని ప్రాంతాల ఉనికి సమస్య. మార్కెట్ వ్యూహ రచనలో మొదటి బలి పీఠాలు మన వూళ్ళు. పట్టణీకరణ కేవలం బాహ్య ప్రపంచానికి పరిమితం కాదు, పొడుగాటి గోడల షాపింగ్ మాల్ బయట వీధిలోనే కాదు, మనస్తత్వాల్నీ మార్చేస్తుంది. మీడియా మాయాజాలం కేవలం కనువిందు కాదు, మన ఆలోచనల దిశ మార్చేస్తుంది. ఈ స్తితిని ఇప్పటికే తెలంగాణా కథకులు కథల్లోకి తీసుకు వస్తున్నారు. కాని, ఈ స్థితి ఎలాంటి అసమానతల్ని కొత్తగా నిర్మిస్తుందో కథకులు ఇంకా పట్టుకోలేక పోతున్నారు. ఈ కొత్త పరిస్థితిని బట్టి ఆలోచిస్తే, 'ప్రాంతం' 'ప్రాంతీయ వాదం' అనే భావనలకు ఇప్పటికే ఏర్పడి వున్న చట్రాల వల్ల, ఆ పదాలు నిర్దేశించిన భావాన్ని బట్వాడా చెయ్యలేకపోతున్నాయి. కొండొకచో, సంకుచిత రాజకీయ పరిమితులు కూడా కొందొకచో అడ్డుపడుతున్నాయి. కాబట్టి, కొత్త కథకులు కొత్త ప్రశ్నలకు వెతుక్కుంటున్న సమాధానాలకు 'స్థానికత ' సరయిన/ ప్రత్యామ్నాయ వాడుక అనుకోవచ్చు.
("పాల పిట్ట" మాస పత్రిక నించి)
*

2 comments:

subhashini poreddy said...

'palapitta' lo chadivanu sir...praanteeyavadam anekante 'stanikatha' anna padam pin pointed gaa...& balam gaa undi. kathaa vastuvu vistrutamai ...'more & more' about "small & small place" gaa maarindi...(corectena sir? naakila ardamyndi mari). inkaa mirannattu kothaga nirmitamavutunna asamaanatha lanu kathakulu pattukolekapotunnaru!! we hope 4 the better...

Afsar said...

అవును, సుభాషిణి గారూ:

మీరు ఆ వ్యాసం గుండెని పట్టుకున్నారు. నిజానికి ఈ వాదం నేను గత ఏడాది ప్రచురించిన "కథ-స్థానికత" అనే వ్యాస సంపుటిలో కూడా చేశాను. మీకు వీలున్నప్పుడు ఆ పుస్తకం కూడా చదవండి.

Web Statistics