కొన్ని నిమిషాలు





ఇప్పుడింక
అన్ని చావుల్నీ
రెండు నిమిషాలతోనే కొలుస్తున్నా

రెండు వందల మరణాలు రెండు నిమిషాల మౌనాలు


*

రెండు వందల తల్లుల పేగులు
పెనవేసుకుంటున్న మానవహారాల రాస్తాలు
ఎవరికెవరు క్షమాపణ చెప్పాలి?
ఈ రెండువందల ఖూన్లకి మాఫీ ఏది?
*
ఎప్పటికప్పుడు చావు కొత్త అద్దం తొడుక్కుంటోంది
చొక్కా మార్చినంత తేలిగ్గా
మాటల్ని విడిచేస్తోంది సర్కార్.
ఎవరి మాట ఎక్కడ కొలువు కుదురుతుందో
ఎక్కడ కొలువు తీరుతుందో
ఏ కొలువు మమ్మల్ని నిలువున్నా ముంచేస్తుందో
తెలియనే తెలియదు
అ..యి...నా...
రెండు నిమిషాల్లోకి
నీ/నా చావులన్నీ మడత పెట్టేస్తున్నా.

*
ఎవరి కంటి నెత్తురు
ఎవరి ఇంటి వెల్తురు
రోజూ వచ్చి పలకరించే చావు
ఎవరి అంపకాల రాయబారం?

అమ్మా,
ఈ నేల చీలిపోక తప్పదింక.
వొళ్ళు కూడా చిమిడిపోయిన అన్నం వాసనేస్తుంది.
దీని నెర్రెల నిండా ఆకలి గుహలు మొలుస్తున్నాయి.
ఎప్పటికప్పుడు చావు కొత్త అర్ధంతొడుక్కుంటోంది


*

కొన్ని నిమిషాలు నన్ను వెలివేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను శిలువేస్తాయి
కొన్ని నిమిషాలు నన్ను నీలోకి వొంపి
నీ శరీరపు వేడిని తాకి వస్తాయి.

బతుకు వొక వాంచ చావులానే.

చావు వొక గడ్డిపోచ బతుకులానే.

రెండీటి మధ్య
బహుశా రెండు క్షణాల దూరం

ఆ దూరాన్ని చెరిపి
నువ్వు జ్ఞాపకంలోకి జారిపోయావు చెప్పా పెట్టకుండా.

*

రెండు నిమిషాలు నీ జ్ఞాపకం.
ఆ తరవాత నువ్వు ప్రవహించే రాస్తా.
ఎప్పుడూ పేగులో సలిపే గాయం.

ఇప్పుడింక
ప్రతి చావునీ
రెండు నిమిషాలతోనే...
కొలుస్తున్నా.



(ఆస్టిన్ - టెక్సస్ లో తెలంగాణా సదస్సు తరవాత)*

1 comments:

కెక్యూబ్ వర్మ said...

chaalaa baagundi sir. chaavuni enta nirliptanga aahvaanistunnaamo chepparu.

Web Statistics