నల్ల నినాదం అతని కవిత్వం!


















చాలా కాలంగా వెంటాడుతున్న కవి లాంగ్స్టన్ హ్యూ!

ఎప్పుడో 1902లో పుట్టి, ఏ 1967లోనో కన్నుమూసిన ఈ కవి ఇప్పుడు నా లోకంలో ఎలా కన్ను తెరుచుకున్నాడు?! అతని కవిత్వ పాదాల్లోని ఏ శక్తి నన్ను అటు వైపు జర జరా ఈడ్చుకెళ్ళింది? ఇటీవల హార్వర్డ్ విశ్వ విద్యాలయంలో హెన్రీ గేట్స్ అనే వొక నల్ల ప్రొఫెసర్ మీద పోలీసు దాడికి నిరసనగా "తోలు మందం" అనే శీర్షికతో (ఈ కవిత నా కొత్త సంపుటి "వూరి చివర" లో వుంది) కవిత రాసినప్పటి నించీ లాంగ్స్టన్ హ్యూ కవిత్వం రోజూ కొంత కొంత చదువుతున్నా. వొకే సారి అతన్ని అంతా చదవడం కష్టం. వొక్కో సారి వొక కవితలోని వొకే వొక్క పంక్తి చదివి పుస్తకం పక్కన పెట్టి, ఆలోచనల్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు అనేకం. ఇలా చదువుతూ చదువుతూ కొన్ని నెలలు గడిచి, ఈ పొద్దు చూస్తే ఫిబ్రవరి వొకటి: అతని పుట్టిన రోజు.

ఎవరికి కావాలి కవి పుట్టిన రోజు?!

ఒక తెల్ల దేశంలో నల్ల పుటక పుట్టిన వాడి పుట్టిన రోజు అసలే అక్కరలేదు. నల్ల నేత నాయకుడయినా సరే, ఆ కవి ఈ తెల్ల దేశానికి పరాయీ వాడే!

కాని, కొన్ని పుట్టిన రోజులు చరిత్రకి కావాలి. కొన్ని పుట్టిన రోజులు చరిత్ర వేగాన్ని పెంచుతాయి. హ్యూ అలా నల్ల చరిత్ర గతిని మార్చాడు. అతను కవి మాత్రమే కాదు, నల్ల జనం మౌఖిక కథల్ని వెలుగులోకి తెచ్చాడు. కవిత్వమే రాసినా, అన్ని పనులూ కవిత్వం వల్ల కావు అనుకున్నప్పుడు గొప్ప వచనం రాశాడు.

హ్యూ గురించి చాలా రాయాలి. ముఖ్యంగా ఇవాళ్టి దళిత చైతన్య స్రవంతిలో అతని స్మరణ చాలా అవసరం.

హ్యూ కవితల నించి కొన్ని మెరుపులు:


నీగ్రో భాషలో నది


నదులు ఎప్పటినించో తెలుసు నాకు:
అవి
ఈ లోకం కన్నా అతి పురాతనం
ఈ లోకపు మానవ నదులలో పారిన
మనిషి నెత్తుటి ప్రవాహం కన్నా పురాతనం

ఆ నదుల కన్నా లోతెక్కిన ఆత్మ నాది.



ఇంకా తెల్లారని పొద్దుట
యూఫ్రేటస్ లో స్నానమాడా
కాంగో దగ్గిర
వొక చిన్ని గూడు కట్టుకున్నా
సాయంత్రానికి అది నాకు జోల పాడింది.
నైలు వైపు దృష్టి సారించా
పిరమిడ్ల ఎత్తు ఆకాసమంత అయ్యింది.
న్యూ ఆర్లీన్స్కి లింకన్ వెళ్ళిన వేళ
మిస్సిసిపితొ కలిసి వో పాట అందుకున్నా.
ఆ సాయంత్రం దాని మురికి వొడి నిండా
బంగారపు రాసులు చూశా.



ఎప్పటివో ఆ చీకటి
నదులన్నీ తెలుసు
నాకు.

వాటి మల్లెనే
లోతెక్కింది నా ఆత్మ.



నా వాళ్ళు


భలే అందంగా వుంది రాత్రి
నా వాళ్ళ ముఖాల్లాగా.


భలే అందంగా వున్నాయి చుక్కలు
నా వాళ్ళ కళ్ళలాగా.

వారెవ్వా, సూర్యుడు కూడా
భలే బావున్నాడు
నా వాళ్ళ ఆత్మల్లాగా.


ఆత్మ హత్య చీటీ


ప్రశాంతమయిన
అతి చల్లని నదీ వదనం
అడిగింది
వొక ముద్దు కోసం!


కలల కాపరి


ఆ కలలన్నీ ఇలా పట్రా,
నా స్వాప్నికుడా!

నీ గుండె సంగీతాలన్నీ
ఇలా పట్రా కాస్త.

వాటన్నీటినీ
వొక నీలి మేఘ వస్త్రంలో చుట్టెస్తా,

ఈ లోకపు కర్కశ హస్తాలకి చిక్కకుండా. *

2 comments:

Padmapadmapv said...

Greatpoems..Ennichadivina...chadhavalany..Undhi

Padmapadmapv said...

Greatpoems..Ennichadivina..chadavalanyundhi

Web Statistics