అమెరికా పంట పొలాల నించి ఒక కవిత్వ లేఖ....!
" ఆ వూరు మీకు బాగా నచ్చుతుంది, కవిత్వం మాటెలా వున్నా?!" అన్నాడు మిత్రుడు స్టీవ్ పెడ్రో -మాడిసన్ లో కారు స్టార్టు చేశాక. స్టీవ్ పెడ్రో మంచి కవిత్వం రాస్తాడు. అంతకంటే ముఖ్యంగా అతని ఆలోచనలు చాలా బలంగా వుంటాయి.ఎంత మెత్తగా మాట్లాడతాడో అంత బలమయిన వాక్యాలు సంధిస్తాడు. మాడిసన్ కి నలభై అయిదు నిమిషాల దూరంలో వున్న ఎరీనా అనే వూళ్ళో డానియల్ స్మిత్ అనే కవి ఇంట్లో, వాళ్ళ విశాలమయిన పంట పొలాల మధ్య జరుగుతున్న విస్కాన్సిన్ కవిత్వ పండగ మా గమ్యం. 2002లో నేను మాడిసన్ వచ్చాక వరసగా నాకు రెండు సార్లు విస్కాన్సిన్ కవిత్వ పండగల్లో పాల్గొనమని ఆహ్వానం వచ్చింది. కాని, వేరే అకడమిక్ సదస్సులకు వెళ్ళాల్సి రావడంతో ఆ రెండు సార్లు నేను వెళ్ళలేకపోయాను. ఈ సారి వచ్చి తీరాలి అని పట్టుబట్టడమే కాకుండా, దగ్గిరుండి తీసుకు రమ్మని మరో మాడిసన్ కవి స్టీవ్ కు పురమాయించారు డానియల్ స్మిత్.

మొక్కజొన్న తోటల మధ్య, ముసురుకుంటున్న చీకట్ల మధ్య, అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇండ్ల మధ్య ఎరీన ఒక ఆకుపచ్చ లోయలో వున్నట్టుగా వుంది. స్టీవ్ అమెరికా వ్యవసాయం, చదువుల కబుర్లు చెబుతున్నాడు దారి పొడవునా. మధ్యలో వుండీ వుండీ తన మిల్వాకీ బాల్యాన్ని గురించి చెబుతున్నాడు. ఆ కబుర్ల మధ్య ఎరీన ఇట్టే వచ్చేసింది. మేము డానియల్ స్మిత్ ఇంటికి చేరేసరికి కవిత్వ పండగ అప్పటికే మొదలయ్యింది. డెబ్బయేళ్ళ జె.డి. వైట్ కవిత్వం చదువుతున్నారు. ఆయన కవిత్వం హైకూల మాదిరిగా వుంటుంది. కానీ, చాలా లోతయిన భావాలు.

జేడీ అని అందరూ ఆప్యాయంగా పిలుస్తారు ఆయన్ని. "అమ్మమ్మ అంటుంది కదా?!" అనే శీర్షికతో ఆయన వొక తరం వెనక సంగతుల్ని, వర్తమానానికి మెలేసి చెప్పిన కవితలు కొంత వ్యంగ్యం, కొంత నేటివ్ ఇండియన్ విషాదమూ కలిసి వుంటాయి. ఆయన కవిత్వంలో మామూలు మనుషుల్లో వుండే కవితాత్మని వెతికి పట్టుకోవాలన్న తపన కనిపిస్తుంది.

ఆయన చదవడం అవ్వగానే స్టీవ్ తో వచ్చిన నన్ను గుర్తు పట్టి, డానియల్, ఆయన భార్య చెరిల్ మా దగ్గిరకి వచ్చి "ముందు భోంచెయ్యండి. ఈ కవిత్వంతో అర్ధ రాత్రి దాటిపోతుంది" అంటూ మమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకు వెళ్లారు. భోం చేసుకుని, వచ్చేసరికి మేగన్ జాన్సన్ అనే కొత్త తరం కవయిత్రి కవిత్వం చదువుతోంది. జేడీ కవిత్వం రెండు తరాల కిందటి అమెరికన్ కవిత్వానికి ప్రతినిధి అయితే, మేగన్ కవిత్వం ఈ తరానికి ప్రతినిధి అనుకోవచ్చు. పాప్యులర్ కల్చర్ కి సంబంధించిన ప్రతీకలూ, పదచిత్రాలు వాడుతూ, వాటి విరోధాభాసని చెప్పడంలో మేగన్ దిట్ట. కవిత్వ వాక్యాలతో, మీడియాలోని ప్రకటనల వాక్యాలతో ఆడుకోవడం ఆమెకి సరదా.

దాదాపు ముప్పయి మంది వివిధ వయస్కుల అమెరికా కవులు ఈ పండగ (జూలై 9,10)లో కవిత్వం చదివారు. ఒక విధంగా అమెరికాలోని మూడు తరాల కవుల్ని ఇక్కడ కలుసుకునీ, రెండు రోజుల పాటు వాళ్ళతో దగ్గిరగా గడిపి, ఒకరి మీద ఒకరు చలోక్తులు విసురుకునే దాకా వెళ్ళడానికి అవకాశం ఇచ్చిన పండగ ఇది. ఈ ముప్పయి మంది లో కనీసం సగం మందికి నేను వివిధ కవిత్వ సమ్మేళనాల ద్వారా కొంచెం తెలుసు. నేను రెండు తెలుగు అనువాద కవితలూ, రెండు ఇంగ్లీషు కవితలూ వినిపించాను. ఇంకా రెండు కవితలయినా చదవాలని పట్టుబట్టారు కాని, నేను ఆ నాలుగు కవితలే తెచ్చాను. మరునాడు నాతో కొద్దిసేపు సంభాషణ కార్యక్రమం పెట్టారు. తెలుగు భాష నించి తెలుగులో వస్తున్న దళిత, ముస్లిం, ప్రాంతీయ కవిత్వాల దాకా క్లుప్తంగా చెప్పాను. ఆ తరవాత కొన్ని ప్రశ్నలూ, సమాధానాలు! చూస్తూండగానే మధ్యాన్నం అయిపోయింది.

పొలాల మధ్య కలకలం!
సాధారణంగా అమెరికాలో కవిత్వ పండగలయినా, కవిత్వ పఠనాలయినా ఏ పుస్తకాల షాపుల్లోనో, యూనివర్సిటీలలోనో, లైబ్రరీలలోనో, పెద్ద పెద్ద హోటళ్ళలోనో పెట్టడం ఆనవాయితీ. అమెరికా వచ్చిన తరవాత ప్రతీ ఏటా ఎక్కడో ఒక చోట ఇతర అమెరికన్ కవులతో పాటు కవిత్వం చదవడానికి రమ్మని నాకు ఆహ్వానాలు అందూతూనే వున్నాయి. మాడిసన్ లో వుండగా - బార్డర్స్ పుస్తకాల షాపులో ఒక సారి,విస్కాన్సిన్ యూనివర్సిటీలో మూడు సార్లు, మాడిసన్ లైబ్రరీలో వొక సారి, అతి ప్రాచీనమయిన కఫే మాంట్ మాత్రే అనే హోటల్లో రెండు సార్లు కవిత్వం చదివాను. మాడిసన్ లో కాపిటల్ భవనం బయట ఆరు బయలులో జరిగిన "యుద్ధ వ్యతిరేక కవి సమ్మేళనం" మరచిపోలేని అనుభూతి.

కాని,ఈ సారి విస్కాన్సిన్ పంట పొలాల మధ్య జరిగిన ఈ కవిత్వ పండగ కేవలం కవిత్వానికి సంబంధించిన విషయమే కాదు. "ప్రధాన స్రవంతి సంస్కృతి " పేరిట అమెరికాలో పెచ్చు మీరుతున్న నగర కేంద్రిత ధోరణుల మీద ఒక నిరసన ప్రకటన. పెద్ద హోటళ్ళలోనో, యూనివర్సిటీ హాళ్ళలోనో, పెద్ద పెద్ద పుస్తకాల షాపులలోనో కాకుండా రైతు జీవితానికి కేంద్రమైన ఒక "బారన్" లో, పంట పొలాల మధ్య ఈ కవిత్వ పండగ చేశారు. రైతుల సంప్రదాయ పనిముట్లు, గడ్డి మోపులు, పాతకాలపు ట్రాక్టరు నేపధ్యంగా వున్న వేదిక మీద కవులు కవిత్వం చదివారు. చాలా మంది కవితలకి అమెరికా పల్లె బతుకు వొక అంతస్సూత్రంగా వినిపించింది. పాప్యులర్ కల్చర్ మీద ఆగ్రహం, మూలన పడి పోతున్న అనుబంధాల మీద ప్రేమా, అల్ప సంఖ్యాకుల్ని అణచివేస్తున్న రాజకీయ వ్యవస్థ మీద నిరసనా చాలా కవితల్లో కనిపించాయి. ఆశ్చర్యంగా ఈ పండగలో చదివే కవిత్వం ఇలాగే వుండాలి అని నిర్వాహకులు ఎవరికీ చెప్పలేదు. ఒక అప్రకటిత భావస్వామ్యం అందరి కవుల్లోనూ కనిపించడం విశేషమే!

"నిజానికి ఇది ఆశ్చర్యమేమీ కాదు. చాలా మంది ఈ తరం కవులు ఏదో ఒక రూపంలో ఇలాంటి బాధనే వ్యక్తం చేస్తున్నారు. పోస్టు మోడ్రనిజం పేరిట నిజ జీవితాన్ని మరుగు పరిచే భ్రమల్ని ఈ కవులు బద్దలు కొడుతున్నారు. అసలు జీవితంలోకి వెళ్ళి, నిజ ప్రతీకల్ని, పద చిత్రాల్ని వెతుక్కుంటున్నారు." అని ఈ పండగ నిర్వాహకులు మైకేల్ థియూన్, ఆస్టిన్ స్మిత్ అంటారు. "పట్టణాలూ, నగరాల కవులు కవిత్వ వాక్యాల్ని అమ్మేశారు. వాళ్ళే దారుణంగా అమ్ముడు పోయారు. వాళ్ళ కవిత్వాలు ప్లాస్టిక్ సరుకులు మాత్రమే." అంటారు వాళ్ళు. అట్లా అని ఇక్కడ చదివిన వాళ్ళెవరూ కేవలం "నినాద" కవిత్వం చదవలేదు. (ఆ మాటకొస్తే, నినాద కవిత్వం అనేది వొకటి వుందని నేను అనుకోవడం లేదు. వుందల్లా కవిత్వం/అకవిత్వం మాత్రమే). ఒక వ్యక్తిగా కవికీ, అతని చుట్టూ వున్న లోకానికి ఎలాంటి బంధం వుండాలో, అలాంటి బంధం తెగిపోతున్నందుకు పడే ఆక్రోశం నినాదం అయితే, దాన్ని కవిత్వంగా ఒప్పుకోడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఈ పండగలో చదివిన ముప్పయి మంది కవులూ ముప్పయి భిన్న వ్యక్తిగత కోణాల నించి తమ చుట్టూ వున్న లోకాన్ని వ్యాఖ్యానించారు. ఇందులో కొంత మంది కవులు స్వయంగా రైతులు. కొంత మంది యూనివర్సిటీలలో పాఠాలు చెప్పే వాళ్ళు. కొంత మంది వ్యవసాయ ఫారంలలో పనిచేసే వాళ్ళు. కొంత మంది యువకులు, కొంత మంది నడి వయస్కులు, కొంత మంది ముసలి తనం ముసురుకొస్తున్న వాళ్ళు. కాని, వీళ్ళ గుండెలు చాలా తడిగా వున్నాయి, గొంతుల్లో నిప్పుల సెగలున్నాయి. వీళ్ళ గొంతులు వింటున్నప్పుడు వీళ్ళు కవిత్వం వూరికినే రాయడం లేదని వెంటనే తెలిసిపోతుంది.

విస్కాన్సిన్ 'పోతన ' డానియల్

రాగానే పిలిచి అన్నం పెట్టాడని కాదు కానీ, వీళ్ళందరిలోకీ నాకు బాగా నచ్చిన కవి డానియల్ స్మిత్. చాలా నెమ్మదస్తుడు. ఎక్కువ మాట్లాడడు. కాని, మాట్లాడినప్పుడు మన సింగమనేని నారాయణతో మాట్లాడినట్టే వుంటుంది.తేడా వొక్కటే...నారాయణ గారి మాటలు అప్పుడప్పుడూ కొంచెం వామపక్షమై బరువెక్కుతాయి. కాని, డానియల్ మాట్లాడుతుంటే, ఇప్పుడే పొలం పని ముగించుకొచ్చి, కాసేపు దగ్గిర వాళ్ళ కబుర్లతో సేదతీర్చుకుందాం అన్నట్టుగా వుంటుంది. డానియల్ మంచి చదువరి. ఈ వారమే వేడి వేడిగా మార్కెట్ లోకి వచ్చిన సాహిత్య పుస్తకమయినా, పత్రికయినా అతని ఇల్లు చేరాల్సిందే. కాని, చదివాను కదా అని అన్నీ ఏకరువు పెట్టే మాటకారి కాదు అతను. బతుకంతా పొలం పనిలోనే అయిపోయింది డానియల్ కి. ఎప్పుడొ కానీ వొక చిన్న కవిత రాసుకునే వ్యవధి లేదు. రాసిన కొద్ది కవితలు కూడా వాళ్ళ నాన్న గురించీ, తన పొలం పని గురించీ, తన సంసారం గురించీ! అదే డానియల్ సొంత సంతకం అయ్యింది. "ఫాదర్ లాండ్" అనే పేరుతో ఈ పండగలో వొక రోజు రాత్రి ఆయన కవిత్వం చదివినప్పుడు అది వొక రైతు ఆత్మ చరిత్రలోంచి చింపుకొచ్చిన పేజీలా అనిపించింది. అది ఏ దేశం రైతు కథ అయినా కావచ్చు కదా అనుకున్నాం. ఒక రోజు సాయంత్రం ఆయన తన యాభయేళ్ళ రైతు జీవితం చిన్న చిన్న మాటల్లో చెబుతూంటే ముచ్చటేసింది. అసలు ఏ సాహిత్య నేపధ్యమూ లేని వొక రైతు బిడ్డ కవిత్వంలోకి వచ్చిన ఆ కథ ఈ కాలానికి అమెరికాలో మాత్రం వొక విశేషంగానే అనిపిస్తుంది.

"భాష దొరకాలి, వొక్క సారి భాష దొరికాక కవిత్వం దారి తేలిక అవుతుంది. నేను ఇంకా కొంత గతంలోనే బతుకుతున్నాను కాబట్టి నా భాషలో ఇంకా చాలా గతమే వుంది. ఆ గతం ఇప్పుడు చాలా అవసరం అనిపిస్తోంది. ఇప్పుడు అమెరికాలో ఆఘ మేఘాల మీద రాస్తున్న వాళ్ళు కొద్ది సేపు ఆ గతంలోకి వెళ్ళి రాక తప్పదు అనిపిస్తోంది. కొద్ది సేపు ఆగి ఆలోచించుకొని ముందుకు అడుగు వెయ్యాల్సిన స్థితి ఇప్పుడు కవిత్వంలోనే కాదు, అన్నిటా వుంది" అన్నారాయన. మా ఈ సంభాషణ జరుగుతున్న సమయంలోనే డానియల్ భార్య చెరిల్ మా కోసం మంచి కాఫీ తీసుకు వచ్చారు. "నిన్న మీరు కవిత్వం చదివిన తీరు బాగుంది. ఇంకా మీ దేశంలో కవులకి మౌఖిక బంధం వుందనుకుంటా. ఆ మౌఖికతలోని బలం మీ గొంతులో వినిపించింది." అంటూ మళ్ళీ మరో సారి అంతకు ముందు రాత్రి నేను చదివిన నాలుగు కవితలని మళ్ళీ చదివించుకున్నారు. "మౌఖికత" మీద ఈ కవుల మధ్య చాలా చర్చ జరగడం విన్నాను. అందరిలోకీ పెద్ద కవి జేడీ కూడా తన మాటల్లో "మౌఖిక " లక్షణాలే కవిత్వాన్ని బతికిస్తాయని అంటూ తన తరం నించి ఈ తరానికి వచ్చే సరికి మౌఖికత అరుదయిన దినుసు ఎలా అయ్యిందో చెప్పారు. చెరిల్ ఒక బడిలో టీచర్ గా పనిచేస్తారు. కవిత్వం రాయరు కాని బాగా చదువుతారు. 1930 ల అమెరికన్ కవయిత్రి లోరీన్ నైడెక్కర్ గురించి నేను కొంత పని చేస్తున్నానని తెలిసి ఆ ముగ్గురు పెద్ద వాళ్ళూ చాలా సంతోషించారు. "ఆమె వొక విస్మృత కవయిత్రి. మీరు ఏ కొంచెం ఆమె గురించి రాసినా అది అమెరికన్ కవిత్వానికి గొప్ప సేవ” అని డానియల్ అన్నారు. "ఈ జీవిత కాలంలో పూర్తి చేస్తానో లేదో చెప్పలేను గాని, అది ఇప్పుడు వొక ఆలోచన మాత్రమే" అని నేను అనగానే, " అయితే, మీరు ఆ పని పూర్తి చేసేంత దాకా మీ ఆయుష్షు పెరగాలి" అన్నారు జేడీ.

కవిత్వం అంతా వొక ఎత్తు, కవిత్వం చదివాక రాత్రి కొండ కొమ్మున చలి నెగడు చుట్టూ చేరి అంత మందిమీ రాత్రి మూడు గంటల దాకా కబుర్లూ, కథలూ చెప్పుకోవడం ఇంకో గొప్ప అనుభూతి. వ్యక్తిగత జీవితాలూ, స్థానిక సంగతులూ, సాహిత్యం కబుర్లూ అన్నీ జమిలిగా అక్కడ కలిసిపోయాయి. అసలు నిజంగా పండగ హడావుడీ అంతా అక్కడే! కావలసినంత తిండీ, అనేక రకాల మద్యం, కావలసినన్ని కబుర్లూ!

వెనక్కి తిరిగి వస్తున్నప్పుడు ఎరీనా వైపు చూస్తే, కొంచెం దిగులుగా అనిపించింది.

"ఎరీనా మళ్ళీ మిమ్మల్ని పిలుస్తుంది. ఒక్క సారి ఇక్కడి గింజ నోట్లో పడ్డాక మీరూ/ మేమూ దాన్ని మరచిపోలేం" అన్నారు డానియల్ ఇతర ఎరీనా వాసులు మాకు వీడుకోలిస్తూ.

విస్కాన్సిన్ నుంచి *
జులై 19, 2010 ఆంధ్ర జ్యోతి "వివిధ" నించి

5 comments:

sunita said...

Interesting angle about America and its poetry.

sunita said...

please remove word verification.

కెక్యూబ్ వర్మ said...

మీ విస్కాన్సిన్ 'పోతన' డానియల్ కు మా అభినందనలు కూడా అందజేయగలరు..

కొత్త పాళీ said...

చాలా సంతోషం. అదృష్టవంతులు.
డేనియెల్ స్మిత్ గారిని గురించి తెల్సుకోవడం బాగుంది. నేను ఏనార్బర్లో ఉన్న రోజుల్లో వివిధ వృత్తుల్లో పని చేస్తూ, మంచి కవిత్వం, సంగీతం సృష్టించేవాళ్ళు పరిచయమవుతూ ఉండేవాళ్ళు.
తెలుగు సమకాలీన కవిత్వాన్ని సభలో పీట మీద కూచోబెట్టినందుకు అభినంఅనలు.

శరత్ కాలమ్ said...

మీ రచనల్లో వచనం కోసం నిన్న గాలిస్తుంటే ఇది కంటబడింది. ఇవాళ పూర్తయ్యింది. టైటిలే ఆహ్లాదంగా అనిపించింది. పల్లెలో మీరంతా సమావేశమవడం చక్కటి విషయం. ఇక్కడి పల్లెల గురించిన అవగాహన కొరకు మా కుటుంబాన్ని అప్పుడు వ్యవసాయ బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ లకు తీసుకువెళ్ళి గడుపుతూవుంటాను. అక్కడ మీరు చెప్పినట్టుగానే నెగళ్ళ ముందు చలికాచుకుంటూ కబుర్లు చెప్పుకోవడం చక్కటి అనుభూతులుగా మిగిలిపోయాయి. మీ టపా చదువుతుంటే మళ్ళీ ఆ రోజులు గుర్తుకువచ్చాయి.

Web Statistics