వూరో వాడో తేల్చుకోవాలని
మీరంతా శపథాలు చేస్తున్నారు గాని
వున్న వూరూ కన్న వాడా
తల్లి పేగూ నెర్రెల నేలా తెంపుకొని
దేహాన్ని దాచలేని పైమీది బట్టతో
దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న
ఆకలి విగ్రహాల వూరేగింపు చూడు
రక్త మాంసాలు వెలి వేసిన
మనిషి నీడ ఇక్కడే చూడు
- అఫ్సర్, ఊరిచివర
మీరంతా శపథాలు చేస్తున్నారు గాని
వున్న వూరూ కన్న వాడా
తల్లి పేగూ నెర్రెల నేలా తెంపుకొని
దేహాన్ని దాచలేని పైమీది బట్టతో
దేశాన్ని విడిచి వెళ్ళిపోతున్న
ఆకలి విగ్రహాల వూరేగింపు చూడు
రక్త మాంసాలు వెలి వేసిన
మనిషి నీడ ఇక్కడే చూడు
- అఫ్సర్, ఊరిచివర
1
తెలుగు సాహిత్యం ఇప్పుడు వొక కొత్త కాల్పనికత వైపు ప్రయాణిస్తోంది. గత పదేళ్ళ కవిత్వాన్నీ, కథల్నీ దగ్గిరగా గమనిస్తున్న పాఠకులకు ఈ సంగతి బోధపడ్తుంది. ముఖ్యంగా కథకులు ఇంతకు ముందు కన్నా భిన్నమయిన కాల్పనికత దిశగా కథనీ, కథా సంస్కృతిని తీసుకు వెళ్తున్నారు. కాని, ఇక్కడొక వైరుద్ధ్యాన్ని గురించి చెప్పుకోక తప్పదు: అది నగర కేంద్రిత సాహిత్య సంసృతికీ, పల్లె-కేంద్రిత సాహిత్య సంస్కృతికీ వ్యత్యాసం. నగర కథకులు వొక విధమయిన కాల్పనికత నీ, పల్లె నించి వస్తున్న కథకులు దానికి భిన్నమయిన కాల్పనికత ని చిత్రిస్తున్నారు. అది ఏ విధంగా భిన్నమయ్యిందో నిరూపించడానికి సీమ కథలు, అందునా అనంతపురం కథలు- మరీ ముఖ్యంగా బండి నారాయణ స్వామి కథలు దాఖలా.
"పరుగు" నారాయణస్వామి మొదటి కథ అని నాకు తెలియదు. ఆ కథ అచ్చయినప్పుడు నారాయణ స్వామి పేరు పెద్దగా వినిపించలేదు, నేను విన్నంత మటుకూ. స్వామి అంటే "చంకీ దండ" జ్ఞాపకమే! ఆ కథ వచ్చినప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో వుండడం, ఈ కథకి బహుమతి ఇచ్చే ముందు స్మైల్ గారు ఈ కథని తనే చదివి, వినిపించడమూ మరచిపోలేని అనుభవం. కథ చదవడంలో స్మైల్ ప్రత్యేకమయిన పద్ధతి వల్లనే కాకుండా, వొక కొత్త రకం కథ చదువుతున్నామన్న తృప్తిని మిగిల్చిన కథ ఇది. కథ చెప్పే తీరులో స్వామి వొక కొత్త కాల్పనికుడిగా ఇప్పుడు కనబరుస్తున్న పరిణతికి సాక్ష్యాలు ఆ కథలోనే కనిపిస్తాయి. కాని, కథ చదివాక స్మైల్ గారి వొక మాట నాకు గుర్తుండి పోయింది ఇప్పటికీ- "ఇతనెక్కడో అనంతపురం నించి రాస్తున్నాడయ్యా ఈ కథని!"- అని.
అప్పుడు - ఆ 80'ల లో - అనంతపురం గురించి నాకు పెద్దగా తెలీదు. అక్కడి కథకుల పేర్లు కూడా తక్కువ తెలుసు. ఒక పదేళ్ళ తరవాత చూస్తే తెలుగు కథాపటం మీద కొత్త కేంద్రంలా మెరుస్తూ నిలబడింది అనంతపురం. ఇంకో పదేళ్ళ తరవాత ఆ కథాకేంద్రంలో నిలబడి వ్యక్తిగతంగా ఆ కథకులు చెబ్తున్న అనుభవాల్ని అర్ధం చేసుకునే అవకాశమూ దొరికింది నాకు. అప్పుడే కథల్లో చదువుతూ వచ్చిన నిజ జీవన దృశ్యాన్ని కళ్ళారా చూశాను. నిజానికి ఈ కాలపు ఏ కవి కయినా,కథకుడికయినా కనీసం కొంత కాలం అనంతపురం జనంలో బతికి, అక్కడి నాలుగు మెతుకులు తిని, ఆ నీళ్ళు తాగితే తప్ప బతుకు పూర్తి రూపం తెలీదు. దప్పిక ఎలా వుంటుందో, దప్పిక వేస్తున్నప్పుడు గుక్కెడు నీళ్ళు దొరక్కపోతే ఎలా వుంటుందో తెలుస్తుంది. అప్పుడు నెత్తురు మండవచ్చు, చచ్చిపోవచ్చు కూడా. ఆ రెండు స్థితులూ ఏక కాలంలోనే కలగ వచ్చు.
ఒక స్థలం, వొక కాలం, వొక జీవన స్థితి కథకుడి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో చెప్పడానికి ఇప్పటి కథల్లో అనేక వుదాహరణలు దొరుకుతాయి. తెలుగు కథకుడికి కాల్పనికతకి బదులు స్థానికత బలమయిన శిల్ప సాధనం అని నేను గత కొంత కాలంగా వాదిస్తూ వున్నాను. ("కథ-స్థానికత" లో స్థానికతకి సంబంధించిన భిన్న కోణాల్ని వెతికే ప్రయత్నం చూడ వచ్చు). గతంలో మాదిరిగా స్థానికత కేవలం వస్తువులో ఒక భాగం కాదు ఈ దశాబ్దంలో- వస్తువు వస్తు నిర్దేశమే కాకుండా, శిల్ప నిర్దేశం కూడా చేస్తోంది ఇప్పుడు. రచయిత పుట్టి పెరిగిన భాష రచయిత దృక్కోణాన్ని నిర్మిస్తుంది. అందుకే, రచయిత స్థానికత- తెలంగాణా, రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర, ప్రవాసాంధ్ర ఏదయినా కావచ్చు- అది ఇప్పుడు కథనశిల్పంలో ముఖ్యమయిన పాత్ర అవుతోంది. ఇటీవల అత్యాధునిక/ మాంత్రిక వాస్తవికతల నేపధ్యంలో కాల్పనిక వాస్తవికత వొక ప్రధానమయిన అంశంగా చర్చలోకి రావడం చూస్తున్నాం. (ఉదాహరణకి: బి. తిరుపతి రావు ఇటీవలి వ్యాసం).తెలుగు కథకుడి కాల్పనికత స్థానికీకరించబడుతున్న సాహిత్య పరిణామాన్ని తిరుపతి రావు లాంటి విమర్శకులు గమనించకపోవడం కొంత ఆశ్చర్యంగానే అనిపిస్తోంది నాకు. తెలుగు కథకుడి కొత్త కాల్పనికతని రుజువు చెయ్యడానికి స్వామి కథ "రంకె"ని ఉదాహరణగా చూపిస్తూ, స్థానికత - కాల్పనికతల కొత్త బాంధవ్యాన్ని చర్చించవచ్చు. ఇదే సందర్భంలో నగర కేంద్రిత/ పల్లె కేంద్రిత కథకుల వూహలు భిన్నంగా ఎలా వుండవచ్చో కూడా మనం గమనించవచ్చు.
2
తెలుగు కథకుడి కాల్పనికత యాంత్రికం కాదని చెప్పడానికి స్వామి కథ బలమయిన వుదాహరణ. మొదటి విషయం: "రంకె"లో కథ కొత్త కథ కాదు. కాని, కథకుడి కాల్పనిక బలం వల్ల ఇలాంటి కథ కొత్తగా, ఇప్పుడే మొదటి సారి చదువుతున్నామన్న స్పృహ కలుగుతుంది. స్వామి ఈ కథ రాసే సమయానికి సీమ/అనంతపురం రైతుల ఆత్మ హత్యలు కథల్లో, కవిత్వంలో “అరిగిపోయిన” ఇతివృత్తాలు అవుతున్నాయి. “రంకె” ఇతివృత్త పరిధిలో స్వామి చెబ్తున్న కొత్త సంగతులు వున్నప్పటికీ,ఆ పాత కథని కొత్తగా వూహించుకుంటే తప్ప స్వామి లోని సృజనాత్మకతకి తృప్తి లేదు. ఎక్కడో వొక చోట తృప్తి పడి, కథ నడిపించి వుంటే, ఈ కథ కొత్త పాఠకుడిని చేరుకొని వుండేది కాదు. ఈ కథ వెనక పాలపిట్ట వారు ముగ్గురు పాఠకుల ప్రతిస్పందనల్ని అచ్చేశారు. ఈ మూడు ప్రతిస్పందనలూ మూడు భిన్నమయిన పఠనాలు మాత్రమే కాదు, మూడు భిన్నమయిన స్థానికతలు కూడా. కొత్త పాఠకులు అనే పదం వాడుతున్నప్పుడు నేను ఈ ముగ్గురిని కూడా లెక్కలోకి తీసుకుంటున్నా. అనంతపురం పల్లె బతుకుని దగ్గిరగా చూసిన వ్యక్తిగా, నాలుగో పాఠక కోణాన్ని వెతుక్కోడానికి ఇక్కడ ప్రయత్నిస్తున్నా.
"పట్టణ మధ్య తరగతి పశ్చాత్తాప" దృష్టిని వదిలించుకొని, స్వామి ఈ కథలోకి అడుగు పెడ్తాడు. అందుకే, కథ చివరి సంఘటనతో మొదటికొస్తుంది. ఒక వూహాత్మక సన్నివేశంతో మొదలవుతుంది. ఈ విధమయిన కాల్పనికత యాంత్రికతని సవాల్ చెయ్యడమే అని విడిగా చెప్పక్కరలేదు.
గుత్తి రామక్రిష్ణ గారి నించి స్వామి దాకా తర తరాలుగా 'అనంత ' రచయిత కరవు కథ చెబ్తూనే వున్నాడు. అనంత రైతు నిస్సహాయతనీ, రాజకీయార్ధిక వ్యవస్థ రైతుని ఆత్మహత్యల వైపు తోసుకు వెళ్తున్న స్థితినీ చెబ్తూనే వున్నాడు. అదే కథని స్వామి ఇప్పుడు ఎలా చెప్పబోతున్నాడో,ఆ వాస్తవిక దృశ్యాన్ని కథలోని "కాల్పనిక"లోకంలోకి ఎలా పునసృష్టిస్తున్నాడో, దానికి ఎలాంటి శిల్ప సాధనాల్ని సమకూర్చుకుంటున్నాడో గమనిస్తే, కథకుడి యాత్ర అర్ధమవుతుంది.
ఒక కథ పరిధిలో సమగ్రతని ఆశించడం అసాధ్యం. కథ వొక ఆనుభవిక పార్శ్వాన్ని ప్రభావాత్మకంగా చెప్పగలిగితే చాలు. "రంకె " కథలో వొక సమగ్ర జీవన దృశ్యాన్ని ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తుంది. అనంత రైతు జీవితం చుట్టూరా అనేక అంశాలు పీటముడి వేసుకొని వున్నాయి. ప్రాకృతికమయిన ఎగుడు దిగుళ్ళు, వ్యవస్థ సృష్టించిన సమస్యలు కలగలసి వున్నాయి.
కథలోకి ఇంత సంక్లిష్టమయిన వాస్తవికతని ఎలా ప్రవేశ పెట్టాలన్నది రచయిత శక్తి మీద ఆధార పడి వుంటుంది. ఉదాహరణకి కరవు చుట్టూ నడిచే రాజకీయాలని స్వామి ఈ కథలోకి తీసుకు వచ్చిన శిల్ప పద్దతి. రాజకీయలు, వాటి ఎత్తుగడలూ తెలుగు కథల్లో వొక మూసలోకి దిగజారిపోయినప్పుడు వాటి వ్యక్తీకరణ తప్పనిసరిగా యాంత్రికమే అవుతుంది. స్వామి దీన్ని ఎలా అధిగమించి కథలోపలి కాల్పనిక వాస్తవికతలోకి తీసుకు వచ్చాడో సునిశితంగా గమనించాలి. రాజకీయాల్ని యథాతథంగా కథనం చెయ్యడం కాకుండా, అవి ఈ కథలోని జీవితాలతో పెనవేసుకుపోయిన తీరుని కూడా రచయిత వ్యాఖ్యానించాడు. గుత్తి రామకృష్ణ కథ "గంజి కరవు" నించి "రంకె " వరకూ ఇలాంటి రాజకీయ వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. కాని, స్వామి వ్యాఖ్యానంలో వినిపించే " ఐరనీ" స్వరంలో అనంత కథకులు ఈ 90ల లో సాధించిన శిల్ప విజయం వుంది.
3
ఈ కథలో శిల్ప పరంగా కాల్పనికత పోషించిన పాత్ర ఏమిటో నేను ఇక్కడ ప్రత్యేకించి చెప్పక్కరలేదు. కథ ఆది నించి అంతం దాకా కాల్పనికత ఆవహించి వుంటుంది. కాని,ఈ కాల్పనిక ఆవాహన వాస్తవికతకి అందమయిన/ సహేతుకమయిన కొనసాగింపు మాత్రమే. నగర కథకుల్లో మాదిరి ఈ వాస్తవికత విడిచి గాలిలో సాము చేసే కాల్పనికత కాదు. ఈ మధ్య నగర కాల్పనిక మాంత్రిక కథకులని ఉద్దేశించి నేను రాసిన ఈ నాలుగు ముక్కలతో ఇక ముగిస్తాను.
నాలుగు సగం చిక్కిపోయిన వూళ్ళు ఆరిపోతున్న చలి నెగడు ముందు కూర్చొని, కట్టెపుల్లల చేతుల్ని నిప్పుల మీదికి తోస్తున్నాయి, చెయ్యి కాల్తుందన్న భయం లేకుండా.
“ఎక్కడున్నాయి ఈ కాసిని కట్టెలయినా? పోనీ, ఈ నాలుగు చేతులయినా?” వొక ముసలి చెయ్యి నిట్టూరుస్తోంది, సగం ఖాళీ అయిన వూరు వైపు బలహీనంగా చూపు చాపి.
“వూరు సగం ఇళ్ళు, సగం వల్లకాడు. బతికి వున్న వాళ్ళు సగం శవాలు” ఇంకో గొంతు పిడచకట్టిన స్వరంతో మూల్గింది.
ఆ మూలుగు వినపడ్డదా, నగర కథకుడా! అద్భుత మాంత్రికుడా!
* *
ఆ మూలుగుని రంకె గా మార్చి వినిపిస్తున్న కథకుడు బండి నారాయణ స్వామి. ఈ రంకె నగర కథకులకి//విమర్శకులకి వినిపిస్తోందా అన్నది నా ప్రశ్న.
**
( పాల పిట్ట సాహిత్య మాస పత్రికలో కాలిబాట శీర్షికన వస్తున్న కాలమ్ నుంచి)
1 comments:
మీరు ఇంత విపులంగా చెప్పిన తరువాత తప్పక చదవాలనిపిస్తోంది. మంచి విశ్లేషణ అందించారు. థాంక్స్..
Post a Comment