-కొండముది సాయికిరణ్ కుమార్అడపాదడపా అంతర్జాలంలో చదవటమే అఫ్సర్ గారి కవిత్వాన్ని. అక్కడక్కడ, ఆయనని మాటల్లో దించి సందేహాలకు సమాధానాలు వెతుక్కునేవాడిని ఆయన వ్యాసాల్లో. అంతకు మించి ఆయనతో ఎటువంటి పరిచయం లేదు. అంతర్జాలంలో సాహితీ సహవాసానికి, ఆ మాత్రం పరిచయం సరిపోతుందేమో కదా! “ఊరి చివర” ఉప్పెనలా పొంగిన అఫ్సర్ గారి కవిత్వంపై నా అభిప్రాయమే ఈ వ్యాసం.
ఇప్పటి రోజుల్లో, ఊరు చివర అనగానే నిజంగా నిస్తేజమై స్ఫురించే ఒకానొక చిత్రమే ఈ “ఊరు చివర” కూడా. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కాదు, మనను చుట్టుముట్టిన ప్రపంచాన్ని నిజాయితీగా ఆవిష్కరింపచేసే ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తుంది ఇందులో. సామాన్యంగా కవిత్వంలో సామాజికతను చొరబెట్టాలని కొందరు చేసే ప్రయత్నంలో, పడికట్టు పదాల విన్యాసమే కనిపిస్తుంది. ఆ విన్యాసాల సంరంభంలో ఊళ్ళు తగలబడతాయి, ఆకాశాలు విరిగిపడతాయి, చేతులు నరకబడతాయి, అలానే కవిత్వమూ కూలబడుతుంది. ఈ విన్యాసాలకు దాదాపు అతీతంగా, ఊరు చివర నిలువెత్తు “నిశ్శబ్దంలో” నిలుస్తుంది అఫ్సర్ గారి కవిత్వం.
ఈ పుస్తకం చదవాలంటే, ఊరి చివర నుంచి ఊళ్ళోకి ప్రవేశించాలి. వరుసబెట్టి, మూడు సార్లు చదివిన తర్వాత నేను తీర్మానించిన విషయం ఇది ) మీకు అర్ధమైన విషయం కరెక్టే… ఈ పుస్తకం చివరి నుంచి ఓసారి, మొదటి నుంచి ఓసారి చదివి చూడండి.
జండాలో జాతీయ గీతాలో
పార్టీలో రాజ్యాంగాలో రాజ్యాలో
వోటు హక్కులో ఎన్నయినా వుండనీ
గుప్పెడు మెతుకులే రాజ్యాంగం మాకు
గుక్కెడు నీళ్ళే జాతీయ గీతం మాకు
ఈ సంకలనంలో కవి ఆవిష్కరింపబోయే విషయం ఇక్కడే చూచాయగా తెలుస్తుంది. అందమైన నిశ్శబ్దంలో అలరించే పాలపిట్టల పకపకల కోసం
“ఊరి చివర”కు వెళ్ళొద్దు. ఎవరు వెళతారో “చివరికి” కవి మాటల్లోనే చూస్తే బాగుంటుంది :
ఎవరొస్తారో
ఈ వూరి చివరకి!
ఆకాశం కూడా వేలు విడిచిన
దిక్కులేని దేహం కొసకి.
మాటలన్నీ రాలిపోయి
మోడై నిలిచిన చెట్టు కొసకి.
వొళ్ళంతా పిడచకట్టి
పగిలిపోయిన చెరువు వొడ్డుకి
వొక్క దేహమే వెయ్యి ముక్కలయిన
శకలాల ఎముకల కలలతోపుకి.
ఎవ్వరొస్తారో ఈ వూరి చివరకి?
చివరికి వచ్చింది “ఎవరికైనా, ప్రేమతోనే” కవి చెబుతున్న విషయం, ముఖ్యంగా మన అంతర్జాల కవి మిత్రులకు కనువిప్పు కావాల్సిందే :
నడుస్తొందే, వొక సంతలో!
అన్నీ తెగనమ్ముకున్న
అన్నీ ఎక్కడికక్కడ దిగవిడిచిన
మార్కెట్ సరుకుల సమూహం.
నేపథ్యాల రణగొణ ధ్వనులెందుకులే,
పద్యాల మధ్య
రాజకీయ నినాదాల హోరెందుకులే,
అన్నీ మర్చిపోయిన జాతికి
నీతివాక్యాల ముక్తాయింపులెందుకులే
…..
…..
నువ్వేమిటో
నీ పద్యమే చెబుతుంది!
తెగిన నీ పద్య పాదానికి
కట్టు కట్టలేను, క్షమించు,
…..
…..
మళ్ళీ రాయ్
పిచ్చి గీతల మధ్య అ ఆలు వెతుక్కో
అప్పటికీ నీకు నువ్వు దొరక్కపోతే
ఓ పిల్లాడి చేతిలో
బొమ్మవై పో!
వాడి ఆటలో కాసింత ఆనందపు తుంకవై పో!
అప్పుడింక కొత్త మాట రాయ్!
హిందిలో “ఓ ఆ రహా హై, ఖానా ఖానే కే లియే” అనేది శుద్ధ వచనం. అదే వాక్యాన్ని, నేను విన్న కొందరు హిందీ కవులు “ఆ రహా హై ఓ, ఖానే కే లియే ఖానా” అంటారు అదేదో విరగదీసే కవిత్వం చెబుతున్నట్లు. అలా ఉన్నాయి ఓ రెండు వాక్యాలు ఈ కవితలో (నడుస్తోందే, వొక సంతలో!….పరిగెత్తుతోంది వొక సంతలో!…). అవి సిల్లీ విషయాలైనా, నా అభిప్రాయం చెప్పాలనిపించేసింది, చెబుతున్నాను.
ఇలా అనుకున్నానో లేదో, ఆశ్చర్యం గొలిపుతూ “ఇఖ్ రా!”
లోకం
నాకు వంకరగా కనిపిస్తుందనే కదా
నువ్వెప్పుడూ అంటావ్
లోకం కాదు
నేనే వంకరగా వున్నానని కదా, నీ అర్ధం!
…..
…..
ఇంతకీ
ప్రశ్నని మించిన వక్రరేఖ
ఏదీ ఇంకోటి చూపించు.
అంటూ… మొహంలో మొహం పెట్టి అఫ్సర్ గారు ప్రశ్నిస్తూ వ్రాసిన ఈ కవిత, నా వరకూ శివారెడ్డి మార్కు అద్భుతమైన కవిత! అఫ్సర్ గారి బెంచ్ మార్క్ ప్రకారం ఓ సాథారణ కవిత. అన్నట్లు, ఏ సందర్భంలో ఈ కవిత పెల్లుబికిందో చెప్పనవసరంలేదు అనిపించింది. ఎందుకంటే, ఇప్పటి కాలమాన పరిస్థితుల మధ్య ఎప్పటికీ అన్వయించుకోగల కవిత ఇది. ఇటువంటి, అఫ్సర్ మార్కు సాథారణ కవితలు అక్కడక్కడ కనిపించాయనే చెప్పక తప్పదు.
కరెక్టుగా చివరి నుంచి నాలుగో కవిత “నాలుగు మెతుకులు”
బయట విరగ్గాస్తున్న ఎండకి
లోపటి చీకటి తెలుస్తుందో లేదో!
కాసేపు
గొంతుక
వ్యాహ్యాళికెళ్తుంది మౌనంలోకి
గాలి కోసం
కాసింత వూపిరి కోసం
…..
…..
ఒక్కోసారి నువ్వూ నేనూ
రెండు అలల కేకలం
మరోసారి
నిద్ర పొరల కింద వొత్తిగిలిన కలలం.
…..
…..
ఈ నాలుగు మెతుకులూ
దాచి వుంచు
ఏ దూరాల నించో వచ్చే
ఆ దిగులు బావి
ఖాళీ కడుపు కోసం!
ఈ “నాలుగు మెతుకులతో” చిక్కటి కవిత్వం కోసం అలమటించేవారికి పంచభక్ష్య పరమాన్నం వండి వడ్డించారు అఫ్సర్ గారు. చాలా అద్భుతమైన కవిత్వం. ఇలా తేరుకునే లోపే…”థియేటర్ స్క్వేర్” లోకి ఆహ్వానిస్తారు కవి.
ఒక నిశ్శబ్దంలోకి అందరూ
మౌనంగా
తెరమీద
ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా…
…..
…..
ఎవరి జీవితం వాళ్ళకి చేదు
అవతలి బతుకు
కాసేపు అద్దం
తెలియని అర్ధానికి
…..
…..
చెప్పుకుంటూ పోతే, చాలా కవితలున్నాయి. ఇవన్నీ ఒకరు చెబితే వినటం కన్నా, చదివి తీరాల్సిన అనుభూతులు ఒక్కో కవిత. కంట తడిపెట్టించేవి కొన్నైతే, కలకలం రేపేవి కొన్ని.జి.వి.ఎన్ మూర్తిగారు “ఈనాడు”లో చెప్పినట్లు, మన లోతులని మనమే తడుముకునేట్లు చేసే కవిత్వం ఇది.
అనుమానితుడి ఆత్మకథనం (నాకెందుకో మా అన్నాజీ ఇక్బాల్ చంద్ గారి “ఆరో వర్ణం” కవిత గుర్తుకొచ్చింది. “ఆరో వర్ణం”లోని క్లుప్తత మాత్రం ఈ కవితలో లేదు. అయినా బాగుంది, అది వేరే విషయం.)
జటిలమైన కొన్ని అనుభూతులుంటాయి. అందులోనూ పరభాషా కవిత్వంలో, అక్కడి మహాకవులు వ్రాసినవి. సామాన్య భాషకు, సామాన్య కవులకు ఆ అనుభూతులు అందవు. అటువంటి అనుభూతులు కూడా అలవోకగా, తనదైన శైలిలో కవిత్వమై పారిస్తారు అఫ్సర్ గారు “సరిగంగ స్నానం” అనే కవితలో. అది అనువాదమని ఆయన చెబితే గానీ, బహుశా మనం తెలుసుకోలేమేమో!
అద్భుతమైన ఉద్వేగాన్ని మిగిల్చినా, శివారెడ్డిని మించిన పద ప్రయోగాలు చేసారు అఫ్సర్ గారు. అంతకు మించి అభిప్రాయాన్ని చెబితే, “ఊరి చివర”కు ద్రోహం చేసినట్లౌతుంది కాబట్టి, ఇక్కడితో విరమిస్తా.
అన్నట్లు, అఫ్సర్ గారికి నాదో మనవి. కవిత్వం గురించి అంతర్జాలంలో చాలానే భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమలు తొలగించాలంటే, “ఊరి చివర” లోని కవిత్వం అందుబాటులో ఉండాలి. వీలువెంట, ఈ కవితలని అంతర్జాలంలో కూడా ఆవిష్కరిస్తే బాగుంటుంది.
మరో చివరి మాట. ఈ పుస్తకాన్ని చివరిని నుంచి చదవమని చెప్పటానికి ఉన్న మరో ముఖ్యమైన కారణం – గుడిపాటి గారు, ఎన్. వేణుగోపాల్ గారు వ్రాసిన ఆప్త వాక్యాలు. ముందుగా అవి చదివితే, వారి మాటలు దురభిమానంగా పాఠకులు అనుమానించే అవకాశం ఉంటుంది. మొత్తం కవితలు చదివాక, వారి ఆప్తవాక్యాలు ఎంత నిజమనేది తెలుస్తుంది.
http://amtaryaanam.blogspot.com/
0 comments:
Post a Comment