ఏమీ చెప్పదు!




















1

మరణ వాంగ్మూలం ఏమీ చెప్పదు.

వొక అందమయిన దృశ్యాన్ని చూసినట్టు, మరణాన్నీ, ఆత్మహత్యని అందంగా స్వప్నించాలా? నువ్వు ఏ భాషలో ఎవరితో మాట్లాడుతున్నావు, ఆత్మహత్యాగ్రహ తీవ్రవాదీ! నీ రంగు నీ కోపానికి కొత్త ముసుగు వేస్తుందిలే!

విమానాలు నీకు ఆటబొమ్మలు

సరదాగా కాసేపు క్షుద్రంగా విహరించి, అవతల పడేస్తావ్. మేడలు వొట్టి పేకమేడలు. సాయంత్రానికి అసహనమో, విసుగో పుట్టుకొచ్చి, పరాకుగా కూల్చేస్తావ్.

ఇంకా ఎన్ని క్షుద్ర సరదాలు కనిపెడ్తావో కదా, నీ అంతులేని క్రీడా వినోద మోహం తీరక!

2

మరణాలు కొత్త కాదులే నాకు,
కానీ, మరణం వినోద క్రీడ అయితే అది విడ్డూరమే నాకు! నీకు చావు సరదా అవునో కాదో నాకు ఇంకా తెలీదు కాని, ఎగసెగసిపడే నీ తెల్ల చర్మపు తగరపు అలల కింద నువ్వు వినోద క్రీడనే కలగన్నావని శంకించగలను నిశ్శంకగా!

ఎందుకో తెలీదు గాని, నీ ఆత్మహత్యాగ్రహ ప్రకటనలో
మేలుకున్న ధనవిలాస కేళీ మానసమే చూస్తున్నా.

3

చావులూ,ఆకలి చావులూ తెలుసు నాకు.

కన్నీళ్ళూ, వాటి చివర జీవన్మరణాల అనుక్షణికాల తాడుకి వేళ్ళాడే బతుకు దప్పికలు తెలుసు నాకు. కణ కణ మండే ఉద్యమ రక్త కాసారాల్లోకి దేహాల్ని చితుకల్లా విసిరేస్తున్న ప్రాణాలూ తెలుసు నాకు.

అడవుల గుండెల్లో కొలువై, అణగిపోయిన గొంతుల్లో కాసింత నీటి చుక్క పోయడానికి, కాలిపోయిన దేహాలూ తెలుసు నాకు.
4

తెలియనిదల్లా
నువ్వూ, నీ ఈ కొత్త చావు బొమ్మ!

*

0 comments:

Web Statistics