Sunday, July 31, 2011

మెటమార్ఫసిస్

(సాక్షి ఇవాళ సాహిత్య పేజీలో 'మన కవిత్వం- దశ, దిశ" అనే అంశం మీద కొందరి అభిప్రాయాలు ప్రచురించింది. అందులో నా అభిప్రాయం ఇది. మిగిలిన అభిప్రాయాల కోసం చూడండి, సాక్షి

తెలుగు సమాజం అనూహ్యమైన మార్పుల ఉద్రిక్తతలో ఉన్న ఈ సమ యంలోనే వచన కవిత్వం కొత్త రూపంలోకి వలసపోతోంది. ఈ రూపాన్ని ఎట్లా నిర్వచించగలమో ఇంకా తెలియదు. వచనం అనే పూర్వపు పదం ఇప్పుడు అవసరమే లేదు. ఇది అచ్చంగా కవిత్వమే. కొన్ని కొత్త రూప లక్షణాల గురించి మాట్లాడాల్పి వస్తే, ఈ కొత్త రూపం మాటల బరువు తగ్గించుకుంటోంది. సంభాషణల్లోని సజీవమయిన భాషని దగ్గరకు తీసుకుంటోంది. కథనాత్మక నడకని అనుసరిస్తోంది. పదచిత్రాలని పదాల్లో కాకుండా ఆలోచనల్లోకి అనువదిస్తోంది. కవిత్వం ఆవేశాత్మక రూపమని అనుకుంటాం. కాదూ, అది ఆలోచనాత్మక రూప మని కొత్త కవిత్వం చెబుతోంది. తెలంగాణ నించే వచ్చే కొత్త కవిత్వం ముఖ్యంగా ఈ దిశగా వెళుతోంది.

- అఫ్సర్

Saturday, July 30, 2011

అమెరికన్ కవిత్వంలో ఒక దక్కన్ కెరటం!




“దక్కన్” అన్న మూడక్షరాలు వినగానే కాజిం అలి హృదయం పసిపిల్లాడిలా కేరింతలు కొట్టింది, అతని హైదరాబాదీ బాల్య జ్ఞాపకాలు గుర్తుకొచ్చి.

వొక ఆదివారం మధ్యాన్నం ఆస్టిన్ లోని “బార్న్స్ అండ్ నోబల్స్” పుస్తకాల షాపులో నాకు ఎంతో ఇష్టమయిన కొబ్బరి ముక్కలు తురిమిన కాఫీ తాగుతూ మొదటి సారి కాజిం అలి కవిత్వం చదివాను. ఆ కాఫీ రుచికీ, కాజిం అలి కవిత్వానికి కాస్త చుట్టరికం వుంది. కొబ్బరి ముక్కా, కాఫీ రెండూ భిన్నమయిన రుచులు. కొబ్బరి ముక్క అనగానె నాకు మా ఖమ్మంలో పెద్ద కొండ మీద కొలువైన నరసిం హ స్వామి , ఆ గుడికి కొబ్బరి ముక్కల ప్రసాదం కోసం వెళ్తూండే నా బాల్యం గుర్తొస్తాయి, కాఫీ అంటే నాకు అమెరికా. ఇక్కడికి రాక ముందు నాకు కాఫీ అలవాటు లేదు. ఈ భిన్నమయిన రుచుల కలయిక నాలుక మీద ఆడుతూండగా , కాజిం అలి కవిత్వం చదివాను.



2007 అమెరికన్ కవిత్వ సంపుటంలో మొదటి పుటలో కాజిం అలి కవిత్వం కనిపించింది. ఆ కవిత హిందూ-ముస్లిం ప్రతీకల సమాహారం. దక్కన్ ఇండియా- అమెరికన్ అనుభవాల మేలు కలయిక, అచ్చం నేను తాగే కొబ్బరి కాఫి లాగా.

కాజిం అలి హిందూ ధర్మ గ్రంధాలు శ్రద్ధగా చదువుకున్నాడు, పుట్టి పెరిగిన దక్కను ఇస్లాం వాతావరణం అతని జీవితంలో విడదీయలేని భాగం. రోజూ యోగాతో మొదలయ్యే ఇతని దినచర్య కవిత్వ పాఠాలతో కొనసాగి, కవిత్వ రచనతో ముగుస్తుంది. సూఫీ తాత్వికత తన జీవితాన్ని నడిపించే సూత్రం అని నమ్ముతాడు కాజిం. అతని కుటుంబ చరిత్ర వొక విధంగా దక్షిణ భారత ఇస్లాం చరిత్ర. వెల్లూరు నించి అతని కుటుంబ ప్రస్థానం మొదలయ్యింది. కాజిం బాల్యం హైదరబాద్ పాత బస్తీలో గడిచింది. తన కవిత్వంలో కనిపించే మత ప్రతీకల్లో ఆ హైదరాబాదీ బాల్యపు పునాదులు వుంటాయంటాడు కాజిం. కాజిం ఇప్పటి దాకా రెండు కవిత్వ పుస్తకాలు అచ్చులో చూసుకున్నాడు: వొకటి, “ఫార్ మాస్క్” (దూరపు మసీదు), రెండు: “ఫార్టియత్ డె” (నలభయ్యొ రోజు).

అమెరికాలోని వొక ప్రసిద్ధ కాలేజిలో కవిత్వ పాఠాలు చెప్పే కాజిం అలికి కొంచెం తెలుగు వచ్చు. “తెలుగులో కవిత్వం బాగుందని విన్నాను. యేనాడయినా ఆ కవిత్వం చదవాలని అనుకుంటున్నా” అంటాడు కాజిం.

గ్యాలరి

వొక ఎడారి దాకా వచ్చావు నువ్వు
వొక్క అక్షరమ్ముక్కా లేకుండా
దెయ్యం పట్టినట్టు
ఆకలితొ మాడిపోడానికేగా?

వయొలిన్ మీద సూర్యుడి చెయ్యి
అనంతమయిన దిగంతాన్ని చెక్కుతూ వుంది.

కౌపీన వస్త్రాలు ఎకరాల కొద్దీ
నీలి ధూళీ దూసరితమయిన ఆకాశం నెత్తిన
యెవరో వొక అపరిచిత యువకుడు నీ పక్కన.

విలియం బ్లేక్ కి కలల చిత్రాలు గియ్యడం
నేర్పిన మనిషిలోకి తొంగి చూస్తూ.

బహుశా నువ్వు అనుకుంటూ వుంటావు:
ఆ స్పర్శకి నేను సిద్ధమే.
అతనికి దొరికిపోవడానికీ సిద్ధమే”

బహుశా అతనూ అనుకుంటూ వుంటాడు:
ఇంత మిట్ట మధ్యాన్నం
ఇలా తప్పిపోయానేమిటి?
మరీ అంతూ పంతూ లేకుండా?!”

నీకెప్పుడు తెలుస్తుందో?
ఈ రాత్రి: ఈ చప్పుళ్ళు

వూదా వెతుకులాటలు
వయొలిన్ ఆకలి కడుపు మార్మోగి పోతుంది.

నాలుగు తీగలతొ
బట్ట బయలయ్యే గాయం – సంగీతం.

వొక ఆకలి సైన్యం
రాగాలుగా వణికి పోతుంది.

ఆకలితో
మాడిపోడానికేగా కదా
వచ్చావు, ఈ ఎడారికి!

Friday, July 29, 2011

బచ్ పనా...




ఇన్నిన్ని దుఖాల మధ్య

వొక్క సంతోషపు తునకా

లేదు, లేదనేనా ?



రాత్రి చుట్టపు చూపు కలల్లోనూ

ద్రోహాల వంచనల మోసాల కథల క్లిప్పింగ్స్.

వొక్క స్నేహరాహిత్యం మాత్రమేనా వేల వర్ణాల మాయ?!


కాసింత ప్రేమ ఎప్పుడూ తెలుపు నలుపుల నిర్మోహ చిత్రమేనా?

అప్పుడప్పుడూ
ఆ చిన్నప్పటి తలుపు తీసి
పద,
వెళ్దాం బచ్ పన్..ఆ ప్రాచీన దేశంలోకి!పూర్వ దేహంలోకి!


బచ్ పనా...ఎవరూ ఎల్ల కాలమూ అక్కడే ఆగిపోరు, నిజమే.
వెళ్లిపోవాలి ముందుకే ...అదీ నిజమే.


అట్లా అని ఎంతదూరమో వెళ్లరులే,

వొక మోహం నించి ఇంకో నిర్మోహంలోకి,

వొక లిప్త ఉత్సాహంలోంచి ఇంకో నిర్లిప్తతలోకి.


అయినా సరే, వెళ్ళి రావాలి ఆ మంత్ర నగరికి
ఇన్ని వాస్తవ స్వప్నాల నడుమ

వొక లేత గులాబీ కల - బచ్ పనాలోకి.


మళ్ళీ మళ్ళీ కొత్తగా అనిపిస్తుందా,

అక్కడే ఆగిపోదామనీ, కాసేపు గడ్డకట్టిపోదామని.



ఇంకో నిజం కూడా ఇంతలోనే చెప్పనీ,

ఇంతకూ- ఆ వొక్క కల మాత్రం ఎవరి సొంతం?!
అందులో లేతదనం ఎంత కల?!

Saturday, July 23, 2011

Not Home Yet!




చికాగో విశ్వవిద్యాలయంలో ఇస్లాం మీద పరిశోధన చేస్తున్న ఎలిజబెత్ లొస్ట్ ఈ ఏడాది మాడిసన్ లో తెలుగు కూడా నేర్చుకుంది. "నాన్న రాలేదు" అనే కవితని ఆమె ఇంగ్లీషులోకి అనువాదం చేసి, మాడిసన్ లో జరిగిన దక్షిణాసియా సాంస్కృతిక ఉత్సవంలో అద్భుతమయిన కరతాళ ధ్వనుల మధ్య వినిపించింది. ఈ కవితని ఆమె తెలుగులో, నేను ఇంగ్లీషులో చదివాం.


Nanna [Father] has not come home yet
And yet ... And yet ...
He has not come home yet


This city is burning beneath my eyes
This city is burning under my feet


Nanna has not come home yet

Again and again she turns back,
Conversing with the clock on the wall, Amma [Mother]


She stares at the hands on the clock.
Eight ... Nine ... Ten

Nanna has not come home yet


Amma might be counting seconds,
Or counting the bodies
Seen on the TV. I don’t know.

Come, Nanna!

Right now, the smell of roasting rotis
Right now, ground tomato, chilli, chutney
Hunger is screaming, Nanna.

Without your coming, Amma won’t let me touch
A grain of rice.
Come quickly, Nanna!

Amma is glued to the back door
Right now it’s been a long time
Since you said you’d just go and come.
Nanna has not come home yet.

“Amma! I’m hungry!”

“The city’s burning, you know?!
There’s always so much hunger!
Just kill me, cut me up, and eat me.”
Yelling this, she then muttered...

“It’s not finished yet.
It hasn’t burned yet.
Dead bodies heaped in piles,
Blankets of flame still burning,
They are still burning ... since ‘47 ... ”

Nanna didn’t come home that night
This night neither.

Friday, July 22, 2011

నా పేరు ...




నమ్మరా బాబూ నమ్మరా నన్ను ఈ పాస్పోర్టు సాక్షిగా ఇందులో వున్న నా అయిదారేళ్ల కిందటి నెరవని నా మీసాల నా తలవెంట్రుకల సాక్షిగా నమ్మరా, నేనేరా అది!

సరిహద్దులు లేవు లేవు నాకు అని రొమ్మిరుచుకుని అక్షరాలిరుచుకుని భాషలకతీతమే నేనని పలుకుల కులుకులన్నీ తీర్చుకుని నడుస్తూ పరిగెత్తుతూ వుంటా ఎయిర్ పోర్టుల గాజు అద్దాలు పగలవు నేనెంత ఘాట్టిగా కొండని ఢీ కొట్టినా.

నమ్మరా నన్ను నమ్మరా నా పేరు చివర మహమ్మదో అహమ్మదో షేకో సయ్యదో ఖానో వున్నా నేను మంచి బాలుణ్ణిరా. కాగితం తుపాకీని చూసినా మూర్ఛపోయే అమాయకుణ్ణిరా నమ్మరా నన్ను నమ్మరా.

భయపెట్టే నీ స్కాను కన్నుల గుండా నడిచెళ్లిన ప్రతిసారీ నా శల్యపరీక్ష లో సిగ్గుతో పది ముక్కలయి నా టికేటు మీద మూడు ఎస్సులు నా నిజాయితీనీ నా నీతినీ నా శీలాన్ని శంకించినా నమ్మరా నన్ను నమ్మరా

దేశాలు లేని వాణ్ణి రా
కన్న దేశమే తన్ని తరిమేసిన వాణ్ణిరా

తల్లీ తండ్రీ తాతా ముత్తాతా అందరికి అందరూ వున్నా
వొంటి మీది చొక్కా మాత్రమే మిగిలిన వాణ్ణిరా

నమ్మరా నన్ను నమ్మరా
నేనొట్టి ఆవారానిరా
నేనొట్టి పాగల్ గాణ్ణిరా

నిజమేరా
నన్ను చంపి పాతరేసినా
నా శవాన్ని ఎవ్వరూ మాదే మాదే అని పరిగెత్తుకు రారురా.

చచ్చి కూడా సాధిస్తాను రా
నమ్మరా నన్ను నమ్మరా

నా శవం కూడా నీకు మోయలేని భారం రా.

ఈ ఎయిర్పోర్టు దాటాక
ఎవరూ నా మొహం కూడా చూడరు రా.

నమ్మరా నన్ను నమ్మరా.

(ఇది ఎయిర్పోర్టులలో ప్రతి ముస్లిం పాడుకోవాల్సిన ఆత్మ శోక గీతం)

Tuesday, July 19, 2011

దాశరథి యాది.."నమస్తే తెలంగాణ"లో !

(ఆవకాయలో వచ్చిన దాశరథి గారి స్మృతులని ఇవాళ నమస్తే తెలంగాణ సాహిత్య పేజీ "చెలమ"లో తిరిగి ప్రచురించారు. మిత్రుడు అల్లం నారాయణకి షుక్రియా. ఈ రచనకి వేసిన బొమ్మ నాకు నచ్చింది.




‘అవును, మంచి కవిత్వం రాయాలంటే నువ్వు మంచి ప్రకృతిలో వుండాలి. కాస్త నీళ్ళూ, కాసిని చెట్లూ, కొన్ని పక్షులూ.. వీటితో నీకు దోస్తీ కుదరాలి’. తరవాత చాలా వుత్తరాల్లో /సంభాషణల్లో ఆయన మున్నేరు గురించే రాసే వారు/ చెప్పేవారు. ‘ ఈ మధ్య వెళ్ళావా?లేదా?’ అని గుచ్చి గుచ్చి అడిగే వారు. ‘ ఈ మున్నేరు లేకపోతే నాకు కవిత్వమే తెలియదు ’ అన్నారు ఒక వొకసారి! ఆ రోజుల్లో ఎందుకో , నాకు అటు వెళ్ళాలని అనిపించేది కాదు.

అక్కడ పక్కనే శ్మశాన వాటిక వుండేది. నేను వెళ్ళిన రెండు మూడు సార్లు అక్కడ శవాలు తగలబెట్టడం చూశాను. బహుశా , అది నా మనసులో నాటుకుపోయి ఉండాలి. ఆయన తన చిన్నప్పటి మున్నేరు అలాగే వుందని ఎప్పుడూ అలా అడుగుతూ వుంటారులే అని వూరుకున్నాకానీ, దాశరథి గారు చనిపోయారని తెలిసి నాన్నగారు హడావుడిగా బ్యాగ్‌సర్దుకుని కన్నీళ్ళ పర్యంతం అవుతూ హైద్రాబాద్ వెళ్ళిన సాయంత్రం నేను మున్నేరు వొడ్డుకి వెళ్ళాను. ఆ సాయంత్రం మున్నేరు అలసిపోయిన తల్లిలా ప్రశాంతంగా పడుకుని వుంది. దాని గలగలలు నాకు వినిపించక కాసేపటికి వెనక్కి మళ్ళాను!

- మళ్ళీ ఎప్పుడూ నేను మున్నేరు దాకా వెళ్లనే లేదు!

(మిగతా ఆవకాయ లో చదవండి )

Sunday, July 17, 2011

కాస్త అలా లోపలికి వెళ్లొద్దామా?




అతని ఉత్తరం రాలేదు
ఆమె చిరునవ్వు చూడలేదు
వాడి ఏడుపు వినలేదు
ఇవాళ వొక్క వాన చుక్కయినా రాలలేదు

- పోనీ, ఎవరూ వొక అసహనపు చూపు రాల్చలేదు

2
ఇలా వుండనీ కొన్ని క్షణాలు
ఎవరూ రాని ఏమీ జరగని వెలితి క్షణాలు

- నిన్ను నీలోకి కాసేపు వొంపే క్షణాలు

3

గది లోపల నా లోపల
ఎక్కడెక్కడి నించో శరీరపు లోచర్మపు లోలోపల నించి

పాడుతూనే వున్నాడు నస్రత్ ఫతే అలీ ఖాన్
- పదం మూలం తెలియక క్షోభిస్తున్న కవిలాగా.

4
కిటికీ బయట చెట్ల ఆకుల్లో
కార్డినాల్ పక్షులు కాషాయెరుపులో.

- ఈ క్షణపు నిశ్శబ్దపు అందానికి ఏదో వొక రంగు

5

నా కంటి రెప్పల మీద

వొక నీరెండ తునక రెక్క విప్పిన చప్పుడు

- ఈ వొంటరి క్షణపు నిరీహకి ఏదో వొక శబ్దం!


6

లోయలూ శిఖరాలూ నీ లోపలే.
ఆకాశాలూ అరణ్యాలూ నీలోనే.

- ఆరుబయలు నువ్వు దాచేసిన ప్రతిబింబం.


(ఈ ఆరు పదాలూ మా జావేద్ కోసం...)

painting: Mandira Bhaduri

Thursday, July 14, 2011

అనేక ముంబైల కన్నీళ్ళ తరవాత...




నాన్న ఇంకా ఇంటికి రాలేదు
ఇంకా...ఇంకా...
ఇంకా రాలేదు.

ఈ నగరం నా కళ్ల కింద
నా కాళ్ళ కింద మంట

నాన్న ఇంకా ఇంటికి రాలేదు


చీటికి మాటికి వెనక్కి తిరిగి
గోడ మీది గడియారంతో మాట్లాడుతోంది అమ్మ

దాని ముళ్లలోకి మిర్రి మిర్రి చూస్తుంది
ఎనిమిది...తొమ్మిది...పది...

నాన్న ఇంకా రాలేదు.

అమ్మ క్షణాల్ని లెక్కపెడుతుందో
టీవీలో చూస్తున్న
శవాల్ని లెక్కపెడుతుందో తెలీదు.

వచ్చేయ్ నాన్నా!


ఇప్పుడే కాల్చిన రొట్టెల వాసన
ఇప్పుడే నూరిన గోంగూర పచ్చడి
ఆకలి జమాయించేస్తోంది నాన్నా,

నువ్వు రాకుండా ముద్ద ముట్టనివ్వదు అమ్మ.

తొరగా వచ్చేయ్ నాన్నా!


అమ్మ వీపు తలుపుకి అతుక్కుపోతోంది

ఇప్పుడే ఇదిగో
అనేసి వెళ్ళి చాలా సేపయ్యింది కదా,

నాన్న ఇంటికి రాలేదు.


"అమ్మా! ఆకలే!"

'వూరెలా వుందో తెలుసా?
ఎప్పుడూ ఆకలి ఆకలి
నన్నూ చంపి కొరుక్కుని తిన్రా..."

కేకేసి, ఆ తరవాత అమ్మ ఇలా గొణుక్కుంది

"ఇంకా కాలేదు
ఇంకా కాలలేదు
కుప్పలుగా పోసిన శవాలు
మంటల దుప్పట్లు ఇంకా ఆరలేదు ఆరలేదు
కాల్తూనే వున్నాయి....47 నించీ..."


నాన్న ఇంటికి రాలేదు ఆ రాత్రి
ఈ రాత్రికి కూడా!

(ఈ కవిత "రాలేదు" శీర్షికన 'ఊరి చివర" లో వుంది. ఇప్పుడు మళ్ళీ ఇలా అదే కవిత చదువుకోవాల్సి వస్తున్నందుకు దిగులుగా..)

Painting: Mandira Bhaduri(University of Chicago)

Wednesday, July 13, 2011

కవిత్వం గీత దాటితే...!

(ఇది ఈ నెల "పాలపిట్ట"లో నా కాలమ్ 'కాలిబాట" నుంచి...)




కవిత్వానికి వొకే రూపం వుండదు. వొకే నడకా వుండదు. వుంటే అది ఏదో వొక దశలో కవిని వూపిరాడనివ్వదు, స్వయం ఖైదులాగా –

ఈ మధ్య కొన్ని కవితలు చదువుతున్నప్పుడు ఈ ఆలోచన చాలా బలంగా కదిలిస్తోంది. ఎప్పటికప్పుడు ఇది కవిత్వానికి కాలం కాదనో, అసలు కవిత్వం ఇప్పుడు ఎవరు చదువుతారులే అన్న నిరాశా ఈదురు గాలులు వీస్తునప్పుడు కూడా కవిత్వం తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంది, అలుపూ సొలుపూ అన్నది లేకుండా-

కవిత్వానికి వచన కవిత్వం అని పేరు పెట్టిన ముహూర్తం అంత బాగున్నట్టు లేదు. అది చాలా మందికి ఇప్పటికీ వొక విరోధాభాసలా కనిపిస్తోంది. ఆ మాటకొస్తే వచనం వొక దిక్కూ, కవిత్వం ఇంకో దిక్కూ. ఈ రెండీటీ మధ్యా రాజీ కుదిరేది లేదు అనే వాళ్ళు ఎక్కువగానే కనిపిస్తారు. కానీ, చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ బహిరంగ ప్రకటన ఎంత అసంబద్ధమో తెలుస్తుంది. కథల్లో కవిత్వం రాసే వాళ్ళని, ఆ మాటకొస్తే సాహిత్య విమర్శలో కూడా కవిత్వం రాసిన వాళ్ళని మనం చూశాం. కవిత్వంలో వచనం రాసే వాళ్ళ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ, అసలు కవిత్వాన్ని కవిత్వం అనుకోవడానికి ఏ ప్రమాణాలూ, కొలమానాలూ వున్నాయని అడిగితే ఎంత కవికయినా, వచన రచయితకయినా పొలమారుతుంది ఖాయంగా.

కాశీభట్ల వేణుగోపాల్ నో, రెడ్డి శాస్త్రీనో, చంద్రశేఖర రావునో, అప్పుడప్పుడూ రమణజీవినో, అప్పుడెప్పుడో నగ్నమునినో, త్రిపురనో, ఇంకా దూరం వెళ్ళి ....ఏ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారినో, బుచ్చి బాబు సరే సరే...అడిగితే వాళ్ళు వచనాన్ని ఎలా నిర్వచిస్తారో వినాలని వుంది నాకు.

ఇక కవిత్వంలో వచనం పండించే సేద్యగాళ్ళకి కొదువే లేదు. అదీ మంచి వచనమా అంటే అది వేరే కథ!
అసలు వచనం అని మనం అనుకుంటున్న దాన్ని గురించీ, కవిత్వం అని తీర్మానిస్తున్న రూపాన్ని గురించి అందరికీ ఎంతో కొంత అసంతృప్తి వుందన్నదే నేను చెప్పాలనుకున్నది! ఈ అసంతృప్తి ఘనీభవించినప్పుడు అటు వచన రచయితా, ఇటు కవీ వాటి వాటి చట్రాలని బద్దలు కొట్టి, ఇంకో కొత్త రూపంలోకి ప్రవేశిస్తున్నారు. ఈ కొత్త రూపాన్వేషణ వొక తాత్కాలికమయిన వెసులుబాటు మాత్రమే అనిపిస్తోంది నాకు. కథకులు “కవిత్వ” సీమల్లోకి చొరబడే సన్నివేశాలని కాసేపు పక్కన పెట్టి, కవులు వచనసీమల్లోకి పోలో మని దూసుకొస్తున్న కొన్ని సందర్భాలు కొన్ని ఇక్కడ మాట్లాడుకుందాం. అయితే, ఇక్కడ కవిత్వమూ, వచనమూ అనే సంప్రదాయిక చట్రాలతో విబేధించడం నా ఉద్దేశం.

ఉదాహరణకి పసుపులేటి గీత ఈ మధ్య రాసిన “దేహం” అనే కవిత చూడండి. ఈ కవితలో గీత చాలా విషయాలు మాట్లాడింది. కొన్ని రాజకీయ స్థాయిలో, కొన్ని జెండర్ స్థాయిలో, కొన్ని భిన్న అస్తిత్వాల స్థాయిలో , ఈ కవితకి అనేక రూపాలున్నాయి. వాటన్నిటిని దేహం అనే బాహ్య రూపం కింద చెప్పుకుంటూ వెళ్లింది. ఆ మాటకొస్తే, దేహం బాహ్య రూపం కాదనుకోండి. ఈ కవిత నిస్సందేహంగా చాలా బలమయిన రాజకీయ ప్రకటన.

ఈ కవితని అలా వొకే పారాగ్రాఫ్ లాగా రాయకుండా మామూలు వచన కవితలాగా పాద విభజన చేసి వుంటే ఎలా వుంటుందా అని వొక సారి ఆలోచించాను. పాద విభజన వుండడమే కవిత్వ లక్షణం కాదని ఇప్పుడు నేను కొత్తగా చెప్పక్కర్లేదు కానీ, పాద విభజనని ఈ సందర్భంలో నిరాకరించవచ్చు అనే ఆలోచన కవికి ఎలా వచ్చి వుంటుందన్నది ఆసక్తికరమయిన ప్రశ్న.
ఎంత కాదనుకున్నా పాద విభజనకి వొక లయ వుంది. పాదాల్ని విభజించేటప్పుడు కవి తనకి తెలియకుండానే పఠిత పైన వొక ప్రభావాన్ని కలిగిస్తాడు. ఫలానా చోట కాస్త ఆగి చదవండి అనే సైన్ బోర్డు వేలాడదీస్తున్నాడు. అలా ఆగి చదవడానికి ఆలోచనతో సంబంధం లేదు, అది చాలా మటుకు ఆవేశాన్ని కట్టడి చేసే ప్రయత్నం.

వచనం చదివేటప్పుడు కూడా పఠిత కొన్ని సార్లు ఆగి చదవాలి. అలా ఆగి చదవడం అనేది కవిత్వంలో వొక మాదిరిగా, కథలో ఇంకో మాదిరిగా, విమర్శలో ఇంకో మాదిరిగా వుంటుంది. కథలో కానీ, విమర్శలో కానీ, అలా ఆగి చదవడం మీద రచయితకి అధికారం లేదు. కానీ, కవిత్వంలో కవి అలా ఆగి చదవడాన్ని నిర్దేశిస్తాడు. కవి నిర్దేశానికి వ్యతిరేకంగా పఠిత తన ఇష్టం వచ్చిన చోటల్లా ఆగితే, కవితలో పాద విభజన ప్రయోజనం దెబ్బ తింటుంది.

కానీ, కొత్త కవి పఠిత స్వేచ్చని నియంత్రించే నిరంకుసత్వాన్ని భరించలేడు/లేదు. దానికి మరో బలమయిన కారణం మామూలు వచనంలో మాదిరిగానే కొత్త కవిత్వంలో ఆలోచన రూపం మారింది. గీత కవిత లో ఆవేశం కంటే, ఆలోచన బలమయిన పాత్ర తీసుకుంది. కొన్ని ఆలోచనల యూనిట్లుగా కవిత నడక సాగుతుంది. ఇలాంటి వస్తువులు కవిత్వానికి పనికి రావనీ, ఆలోచనని ప్రోది చెయ్యడమే ఉద్దేశం అయితే వ్యాసం రాసుకోవచ్చని కొందరు వాదించ వచ్చు. నిజమే, వ్యాసం రాయడం ద్వారా గీత ఈ విషయం మీద ఇంత ప్రభావపూరితమయిన ప్రకటన చెయ్యగలదా అన్నది నా ప్రశ్న. ఇంకో చిన్న మాట: అసలు ఈ కవితలో దేహాన్ని కవితా రూపానికే ఆపాదించి ఇంకో సారి చదవండి. ఈ కవిత ఎందుకు ఇలా పారాగ్రాఫు లాగా మారిందో వొక క్లూ దొరకవచ్చు. కానీ, ఆ విధంగా చదవడం కవితలోని మూల భావానికి దెబ్బ కావచ్చు, అయినా, మన లోపలి పఠితని కట్టడి చెయ్యడం ఎవరి తరం?!

*

Monday, July 11, 2011

కొన్ని పంక్తులు ఇలా కూడా...




1

-ఈ పూటకి వాడి రొట్టి ముక్క గాలికి ఎగిరిపోతూ, వాడి వైపు కనీసం జాలిగా చూడలేదు
-ఆమెని అలా ఆ కరెంటు స్తంభం కింద సాయంత్రం కూడా చూశాను, ఇంకేం వెతుకుతూ వుందో తెలీదు గాని.
-సర్లే అని వెళ్ళిపోయిన పిల్లాడు రాత్రికి కూడా రాలేదు, భరించలేని సన్నివేశాల్లో అతను చిక్కుకోవడం వూహించలేను గాని, నిజం అంత కంటే భయంకరమేమో అన్న వూహ నన్ను నులిమేస్తోంది.

2

- వార్తా పత్రికలూ టీవీలూ సెల్ఫోన్లూ వదంతులూ చెవుల చుట్టూ జోరీగలూ లేని వొకానొక శుద్ధ పరిశుద్ధ క్షణమేదో అతను చెప్పలేదు, కానీ - అతని కవిత్వం నిండా వొక అమాయకత్వపు మాయ.

- విగ్రహాలూ విధ్వంసాలూ ఆత్మహత్యలూ హత్యలూ కరువులూ నిరుద్యోగాలూ ఆకలి కడుపులూ వీధుల మీద పోస్టర్లయి తిరుగుతున్న మనుషులూ వూరేగింపులవుతున్న అసహనాలూ చావు కేక వేస్తున్న పసితనాలూ- వొక్క అరక్షణం కూడా నేనొన్టరిని వొక్కణ్ణే నేనొక్కణ్ణే అని గావు కేక వెయ్యలేను.

3

దేశమూ మట్టి వాసనా నా నేనూ నేనయిన మీ అందరూ

ప్రేమించలేను దేన్నీ

విడిచీ పెట్టలేను దేన్నీ

సర్లే ఫో అని ముఖమ్మీద తలుపు కొట్టలేను ఎప్పుడూ.


కొన్ని ఎడ్పుల తరవాత

నేలని కొట్టుకునీ కొట్టుకునీ
మట్టికి అతుక్కుపోయిన శరీరమా, నువ్వేమయినా మాట్లాడు!

4

కొన్ని వాక్యాలకి వాక్యాలు ధార పోసానా,

వొక్క పదంలోనూ నేను విరిగిన అద్దాన్ని కాను.

5

ఛ..ఛ..

ఇంకేం రాస్తాం బే, కవిత్వం!

ముసుగు మీద

ముసుగు మీద

ముసుగు మీద ముసుగు.

Saturday, July 9, 2011

ఎప్పటిదో ఓ కవిత..."వెలుతురు భాష"!

కవిలె కట్టల్ని తిరగేయ్యడంలో, పాత కవితల్ని మళ్ళా చదూకోడంలో వొక ఆనందమూ, వొకానొక నాస్తాల్జియా తప్పక వున్నాయి. ప్రముఖ కవయిత్రి, ఇప్పటి "విహంగ" ఎడిటర్, చిరకాల మిత్రులు పుట్ల హేమలత గారు తమ పాత పుస్తకాల్నీ, కాయితాల్నీ వెతుక్కుంటూ ఈ కవితని బయటికి తీశారు. ఇది నేను 1993లో రాసిన కవిత.

ఈ కవిత నేను నా ఏ సంకలనంలోనూ పెట్టలేకపోయాను. చాలా కాలంగా ఈ కవిత దొరక్క, నా రచనల్ని వొక చోట పెట్టుకునే క్రమశిక్షణ లేకా!ఇన్నాళ్ల తరవాత ఈ "వెలుతురు భాష" వెతికి పెట్టిన హేమలత గారికి ధన్యవాదాలు.

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...