అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!

పరిచయాలు అక్కర్లేని మన వాడు...అక్కడెక్కడి నించో...!



చిత్రంగా మనం గదులు కట్టుకున్నట్టే
నదులకూ తాళాలు వేస్తాం కదా,
అన్నాడు అఫ్సర్ అప్పుడెప్పుడో పదిహేనేళ్ళ క్రితం తెనాలి ప్రయాణంలో....కృష్ణా నదిలో విజయవాడ నుంచి చెన్నై వెళ్ళే బకింగ్ హామ్ ప్రధాన కాల్వపై దుగ్గిరాల దగ్గిర లాకులను చూసి.
“ఆ తాళాల సందుల్లోంచి
నురగలు కక్కుతున్న నీళ్ళలో “ కన్నీళ్లను కూడా చూశాడు తను.

అందుకే, గదుల గోడల్ని కూల్చేసి, ఇప్పుడు ప్రపంచం సరిహద్దుల్ని చిత్రంగా చెరిపేస్తున్నాడు అఫ్సర్. అచ్చమయిన తెలుగు బిడ్డడిగా పరదేశంలో మన మాతృభాషకి సమున్నత పట్టం కట్టాడు. మన భాషా సౌరభాల్ని దశదిశలా వ్యాపింపజేస్తున్నాడు. అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీలో ఆచార్యునిగా తనవైన విజయ బావుటాల్ని ఎగరేస్తున్నాడు. చిన్నప్పుడు సంప్రదాయ బద్ధంగా అరబ్బీ, ఉర్దూ చదువుతూ ఆంగ్లంలో కవితలల్లుతూ తెలుగులోకి ట్రాన్స్ లేటయిన అఫ్సర్ ఇప్పుడు ఆసియన్ స్టడీస్ అధ్యాపకునిగా తెలుగు పలుకుబడికి అమెరికాలో పీఠం వెయ్యడం ఎంత గర్వకారణం!
సీనియర్ జర్నలిస్టుగా ఎప్పుడూ చెరో పక్క ఇద్దరు సహచరుల భుజాల మీద చెయ్యేసి, బెజవాడ వీధుల్లో నవ్వుతూ అలపురాని కబుర్లెన్నో చెప్పిన అఫ్సర్ ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరుస్తూ సప్తసముద్రాలూ దాటేశాడు. కవిగా మనకెంత దగ్గిరవాడో దూరమెళ్లినా స్నేహితుడిగా అంత ఆత్మీయుడు. సున్నిత మనస్కుడు. చలించే, చెమ్మగిలే గుణాలే అఫ్సర్ ని తాజాతాజాగా రీఛార్జ్ చేసే సాధనాలు. అల్లకల్లోల అంతర్లోకాలను చుట్టేసి ప్రతిభావంతంగా అనుభూతులను అక్షరబద్ధం చేసే అఫ్సర్ నిజానికి పరిచయం అక్కర్లేని కవి, సాహితీ విమర్శకుడు. ఇప్పుడేం చేస్తున్నారో తెలియని ఏ నలుగురి కోసమో ఈ కాస్తా...

నిరంతర అధ్యయనశీలిగా, అంతర్జాతీయస్థాయి పరిశోధకునిగా, భాషావేత్తగా, వచన రచననూ కవితామయం చేసి అందంగా మనతో చదివించే అఫ్సర్ ఏకంగా టెక్సాస్ విశ్వవిద్యాలయంలో ఆప్షనల్ గా అవకాశమివ్వని ద్వితీయ భాషగా తెలుగుని కంపల్సరీ బోధనకు ప్రవేశపెట్టి వినుతికెక్కాడు. విస్తృత సాహితీ సేద్యం చేసే అఫ్సర్ ఏ అనుభవాన్నయినా కవిత్వంగా మలచుకునే పదసంపన్నుడు. ఎక్కడున్నా అస్తిత్వ అన్వేషణే వస్తువుగా ఆయన కవిత అలా అలా సాగిపోతూనే .....మనకి మరో “విశ్వకవి”ని చూపుతుందేమో వేచి చూద్దాం. బెజవాడ బుక్ ఫెస్టివల్ గుర్తుకు రాగానే ఏదో కోల్పోతున్న వెలితి భావనతో ఆంధ్ర భూమి “మెరుపు” కోసం ప్రత్యేకంగా తన అనుభూతుల్ని అక్షరీకరించాడు మన అఫ్సర్!
- పాషా, ఆంధ్ర భూమి "మెరుపు", జనవరి 1, 2012.


అక్షరాలు అలలై..ఎగసిపడింది కృష్ణమ్మ!




బెజవాడ అంటే బ్లేజ్ లాంటి ఎండలూ కాదు, లీలా మహల్ సినిమా కాదు, బీసెంట్ రోడ్డు షాపింగూ కాదు. చివరికి కృష్ణవేణి నడుమ్మీద వడ్డాణం లాంటి ప్రకాశం బ్యారేజి కూడా కాదు ఆ మాటకొస్తే!

బెజవాడ అంటే పుస్తకాలు, పుస్తకాలు, పుస్తకాలు. అంతే!

అటు అలంకార్ సెంటరు నుంచి ఇటు ఏలూరు రోడ్డు దాకా విస్తరించిన పుస్తకాల రోడ్డు. ఏం వున్నా, లేకపోయినా కానీ, ఆ పుస్తకాలూ, ఆ పుస్తకాల రోడ్డు లేని బెజవాడని అస్సలు వూహించలేను.

ఆ బీసెంటు రోడ్డుకీ, ఏలూరు రోడ్డుకీ, మోడర్న్ కేఫ్ కీ, ఇంకా కొన్ని అడుగులు వేస్తే, ఆకాశవాణికీ, ఆంధ్రజ్యోతి ఆఫీసుకీ మధ్య వొక లాంగ్ వాక్ కి వెళ్తే, వొకరిద్దరు గొప్ప రచయితలయినా వెతక్కపోయినా తామే గంధర్వుల్లా ఎదురు కావచ్చు. కొన్ని అపురూపమయిన క్షణాలు మీ గుండె జేబుల్లోకి అనుకోకుండా రాలిపడ వచ్చు.
కానీ, ఇప్పుడు ఈ దృశ్యం మారిపోయింది, ఈ ఇరవయ్ మూడేళ్లుగా -

ప్రతి జనవరి నెలా వొక సాయంకాలం అలా స్టేడియం గ్రౌండ్స్ దాకా నడిచి వెళ్తే, ఆ అందమయిన దృశ్యాలన్నీ ఇప్పుడు వొకే దృశ్యం – అదే, పుస్తకాల పండగ-లో కలగలసిపోయి అనేక దీపకాంతుల దర్శనం వొక్కసారిగా అయ్యి, కళ్ళూ మనసూ జిగేల్మంటాయ్!

ఈ ఇరవై మూడేళ్లలో అన్నీ మారిపోయాయి. మనుషులు మారినట్టే, వీధులు మారిపోయినట్టే పుస్తకాలు మారిపోయాయ్! పుస్తకాల ముఖచిత్రాలు మారాయి, ధరలు మూడింతలు అయ్యాయి. పుస్తకం నల్ల పూస కాలేదు కానీ, పుస్తకం కొనాలంటే జేబు తడుముకునే పరిస్తితి వచ్చింది. ఎంతో ఇష్టపడి చదవాల్సిన పుస్తకం ధర బరువు వల్ల భారంగా మారుతోంది...అయినా, పుస్తకాలు కొనే అలవాటు తగ్గలేదు ఇప్పటికీ! దానికి కొండ గుర్తు: వొకప్పుడు పుస్తకాల పండక్కి వెళ్తే, వొక గంటలో రెండు రౌండ్లు కొట్టి చక్కా ఇంటికొచ్చేసేవాళ్లం. ఇప్పుడో? అది వొక పూట పని, సాలోచనగా అనుకుంటే వొక రోజు పని.

రాష్ట్రంలో ఎన్నో చోట్ల పుస్తకాలు పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు. అన్ని చోట్లా అదే హడావుడి. దేశ విదేశాల పుస్తకాలు.కొత్త కొత్త పుస్తకాలు షాపులు. సాయంత్రపు సాహిత్య సాంస్కృతిక కచేరీల హోరు.

కానీ, అది బెజవాడకి మరీ లోకల్ పండగ. అసలు పుస్తకం అనే పదార్థానికి వొక రూపం ఇచ్చిన అమ్మ బెజవాడ. తెలుగు సంస్కృతిని వేలు పట్టి నడిపించిన పత్రికల బుడి బుడి నడకలు చూసిన బెజవాడ. ప్రసిద్ధ అక్షరజీవుల ఆత్మల్ని కలిపిన ఆధునిక బృందావని బెజవాడ. అట్లాంటి బెజవాడలో పుస్తకాల పండగ అంటే ....అది అందరి పండగ. బుద్ధిజీవుల హృదయస్పందనల్ని కలిపే పండగ. సహృదయ పఠితల మేధో సమాగమం.


కొన్ని సంధ్యల్లో ఇక్కడ వందనం చేద్దాం,
చేతులు గుండెల్లా జోడించి, మనసులోకి రెండు కళ్ళూ తెరిచి...

అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమయిన వాళ్ళకి,
చేతుల్లో పుస్తకాలుగా మాత్రమే మిగిలిపోయిన కీర్తి శేషులకి,
జీవితాలకి అక్షర రూపాన్నిచ్చిన సౌందర్య మూర్తులకి,
మనలోని నిరాకార ఆలోచనల్ని సాకారం చేసిన వాక్య శిల్పులకి,
దారి తప్పిపోతున్న మానవీయ అనుభూతులకు చిరునామాలయిన ఆ సుపథికులకి.

Category: 5 comments

5 comments:

SRRao said...

పుస్తక మహోత్సవం గురించి చక్కగా వర్ణించారు. ధన్యవాదాలు.
మీకు 2012 నూతన సంవత్సర ( ఆంగ్ల ) శుభాకాంక్షలతో.....
నూతనోత్సాహం ( శిరాకదంబం )

Kottapali said...

చాలా బావుంది

Rohith said...

నూతన సంవత్సర శుభాకాంక్షలు :)

మనం ఎక్కడ జీవిన్చామో, ఆ ప్రదేశం మన లోకం లో ఒక part గా మిగిలిపోతుంది. రహస్యం గా సీసా లో దాచిపెట్టిన ఆ ప్రదేశపు గుర్తు మనల్ని పలకరిస్తుంది...మనతో సంభాషిస్తుంది. మనల్ని తన సంగీతం లో nostalgic చేస్తుంది. మీ స్వరం లో ఆ భావం కనబడింది.


ThanQ Sir :)

కోడూరి విజయకుమార్ said...

పాషా గారి స్పందన చాలా ఆత్మీయనగా వుంది..

వాసుదేవ్ said...

"అక్షరాల్లో జీవిస్తున్న అపురూపమైన వాళ్ళకి" అందులో మీరూ ఉండడం....ఆ పుస్తకపండగలో కొన్ని అక్షరాల్లో దాక్కున మిమ్మల్ని బయటకి లాగ్గలిగాం...అయితే బెజవాడలో కాకుండా కాని వైజాగ్ లొ....అవును మీరన్నట్టు ఓ రోజంతా సరిపోలేదు ఆ గుళ్ళన్నీ తిరిగి అక్షరశిల్పుల్ని స్పృశించి బయటపడెసరికి...

Web Statistics