స్కైబాబా కొత్త కథా సంపుటి "అధూరే" కి ముందు మాట ఇది. "ఆంధ్రజ్యోతి" సాహిత్య అనుబంధం "వివిధ"లో కూడా ఇది అచ్చయ్యింది.
There is always the other side, always.
-Jean Rhys
సాధారణ తెలుగు కథ నించి తెలంగాణ కథని విడిగా ఎట్లా నిర్వచించుకోవాలనే సాంప్రదాయ విమర్శకుల సందిగ్థం తేలక ముందే, తెలంగాణ ముస్లిం కథకులు మరో కొత్త సవాలు మన ముందుకు తీసుకువస్తున్నారు. ఇప్పుడు ఇక తెలంగాణ కథని మాత్రమే కాకుండా, తెలంగాణ ముస్లిం కథని కూడా ఎట్లా విడిగా నిర్వచించుకోవాలో తేల్చుకోవాల్సిన అవసరం వస్తోంది. ఇది ఇప్పుడిప్పుడే తేలే సంగతి కాకపోవచ్చు, కానీ, ఈ చర్చ మొదలు కావాల్సిన అవసరం వుందని ఇటీవలి తెలంగాణ ముస్లిం కథలు వొత్తిడి పెడ్తున్నాయన్నది నిజం. అయితే, తెలంగాణ కథని నిర్వచించడం కంటే, తెలంగాణ ముస్లిం కథని నిర్వచించడం కష్ట తరం అన్న విషయాన్ని ముందుగా మనం గుర్తించాలి. తన లెజిటిమసీ కోసం తెలంగాణ కథకుల కంటే, తెలంగాణ ముస్లిం కథకులు ఎక్కువ సవాళ్లని ఎదుర్కోవాల్సి వుంటుందన్న సాహిత్య సామాజిక సాంస్కృతిక చేదు వాస్తవికతని కూడా మనం గుర్తించాలి.
ఈ సంపుటిలోని కథల్ని పునకథనం చేసి, వాటిని చేతులారా ఖననం చెయ్యడం కంటే - ఈ కథల రక్తమాంసాల్లోంచి, స్కై బాబా మౌలికంగా ప్రతిపాదిస్తున్న ముస్లిం సాంస్కృతిక చర్చకి తలుపు తీసే ప్రయత్నం ఈ నాలుగు మాటలు. ముఖ్యంగా, మూడు ప్రధానమయిన అంశాల చుట్టూ ఈ చర్చ జరగాల్సి వుంది. అందులో మొదటిది: మెజారిటీ సాహిత్యం అంటూ వొకటి వున్నప్పుడు అది నిర్మించి పెట్టిన మూసల్లో మైనారిటీ భావన ప్రతిఫలనాలు ఎట్లా సాహిత్యమవుతాయి? వాటి ప్రాతినిధ్యాన్ని ఎట్లా చూడాలి? ; రెండోది: వొక స్థానిక అంశంగా తెలంగాణ, అందులో ముస్లింల పాత్ర,; మూడోది: కథా వస్తువు- శిల్ప పరిధుల్లో ఆ రెండు అంశాలు ఎట్లా కలిసి పనిచేస్తాయి? కథా వస్తువులోనూ, శిల్పంలోనూ స్కైబాబా ఈ కథల్లో చేస్తున్న ప్రయత్నానికి ఈ మూడు అంశాల చుట్టరికం వుంది.
వాస్తవానికి సాహిత్య సంస్కృతిలో మెజారిటీ- మైనారిటీ అన్న భావన ఎలా పనిచేస్తుందో, దాని కదలికలు ఏమిటో ఇంకా మనకి వొక పూర్తి అవగాహన ఏర్పడలేదు. అసలు ఆ సామాజిక భావన సాహిత్యంలో నిజంగా పనిచేస్తుందా అన్న “సత్సంశయాలు” కూడా దురదృష్టవశాత్తూ కొందరిలో వున్నాయి. ఈ సత్సంశయాల మబ్బులు తొలగితే తప్ప, మెజారిటీ-మైనారిటీ అన్న భావన ఆచూకీ దొరకదు. సంవాద రూపంలో (discourse level) తెలుగు ముస్లిం రచయితలు తరవాతి దశలో మైనారిటీ అన్న “అధికారిక” భాషని వదిలించుకునే ప్రయత్నం చేసినా, సాంస్కృతిక రూపంగా మైనారిటీ అనే భావన పని చెయ్యక మానదు. సామాజికంగానే కాదు, సాంస్కృతికంగా కూడా అనేక విధాన నిర్ణయాలు ఈ చట్రంలోనే పని చేస్తాయి కనక. ఈ మైనారిటీ సాంస్కృతికత అనేది ఎట్లా నిర్మించబడుతుందో, ఎట్లా కొనసాగించబడుతుందో స్కైబాబా కథలకి ప్రధాన నేపధ్యం.
మిగిలిన అస్తిత్వాల కంటే ముస్లిం అస్తిత్వానికి కొంత అదనపు చరిత్ర వుంది. అంతర్జాతీయ స్థాయిలోనూ, జాతీయ స్థాయిలోనూ అది ఇస్లామిక్ అస్తిత్వ సమస్య అయితే, ప్రాంతీయ స్థాయిలో అంటే తెలుగు రాజకీయాల పరిధిలో అది తెలంగాణ అస్తిత్వంతో , ఆ పైన తెలంగాణ ముస్లిం రాజకీయ వునికితో, కొంత గత అధికార రాజకీయాలతో ముడిపడిన అస్తిత్వ సమస్య. ఇది మూడంచెల అణచివేత కింద నలుగుతున్న అస్తిత్వం. ముస్లిం లకి సంబంధించిన ఏ చర్చ అయినా, ఇలాంటి మూడంచెల అణచివేత సవాళ్లని ఎదుర్కొక తప్పడం లేదు. సమకాలీన రాజకీయ చర్చల్లో, సాంస్కృతిక సంవాదాల్లో ముస్లింలు ఇప్పటికీ అన్ని విధాలా పరాయీ వాళ్ళే. ముఖ్యంగా, తెలుగు సాహిత్య సాంస్కృతికతలో ఇంకా వాళ్ళ వాటా వాళ్ళకి దక్కనిచ్చే స్థితి లేనే లేదు. తెలంగాణ ముస్లిం కథకులు – ఈ పుస్తకం విషయానికి వస్తే స్కైబాబా లాంటి వొక తెలంగాణా ముస్లిం రచయిత - సంప్రదాయ తెలుగు కథావిమర్శ ప్రమాణాల బెంచ్ మార్కు దృష్ట్యా చూస్తే, తనని తాను వొక మంచి వచన రచయితగానో, కథకుడిగానో నిలబెట్టుకోవడానికీ ఇప్పుడున్న పరిస్తితుల్లో నరక యాతన పడాల్సిందే- దీనికి బలమయిన కారణం మొత్తంగా తెలంగాణా కథా సాహిత్యమే అనుభవిస్తున్న రెండు రకాల పీడన: సాహిత్య సాంస్కృతిక చరిత్ర, కథా శిల్పం పేరిట కనిపించని సంకెలల అధిక బరువు. ఈ రెండు రకాల బరువుల కింద నలిగిపోతూ తెలంగాణ ముస్లిం కథ ఇంకా తన సాహిత్య ఉనికికి తగ్గట్టుగా విమర్శ సాధనాలు సమకూర్చుకోవాల్సి వుంది. ఈ రెండు రకాల పీడనల్ని శక్తి మేరా వుపయోగించే ప్రధాన స్రవంతి – అలాంటిది వొకటి వుందని భ్రమింపజేసే- తెలుగు కథా సాంస్కృతికత స్కైబాబా కథలకి అంత తేలికగా రాజముద్ర వెయ్యదన్నది నిజం. బహుశా, ఇది స్కై బాబా వొక్కడి సమస్య కాదు, ఎక్కువగా తెలంగాణ కథకులకు, అంత కంటే మరీ ఎక్కువగా తెలంగాణా ముస్లిం కథకులకు వర్తించే విషయం.
ఈ నేపధ్యంలో స్కై బాబా కథా సంకలనం “అధూరే” వొక సాంస్కృతిక అస్తిత్వ ఘోష. సొంత గొంతు కోసం గొంతు చించుకునే ప్రయత్నం. ప్రధాన స్రవంతి రాజకీయ శిబిరాల పద్మవ్యూహంలోంచి సజీవంగా/ సశరీరంగా బయట పడాలన్న తీవ్ర వాంఛతో పెగలివస్తున్న కేక. ఆ కేక చరిత్రని వెతుక్కుంటూ, స్కైబాబా కథల్ని దగ్గిర పెట్టుకున్నప్పుడు, తెలంగాణా ముస్లిం కథ గురించి- కొంత దూరంగా -భవిష్యత్తులోకి ఆలోచించే ప్రయత్నం కూడా అవసరమే.
*
దృక్పథం వున్న ప్రతి రచయితా తన రచనలో కాలాన్ని పునర్నిర్మించుకుంటాడు. గతంలోకి వెళ్ళే ముందు ఆ గతం తన వర్తమానంలో, తన భవిష్యత్తులో ఎట్లా రూపాంతరం చెందుతుందో తరచి చూసుకుంటాడు. ఈ ధోరణి మైనారిటీ సాహిత్యంలో బలంగా కనిపిస్తుంది. మైనారిటీ సాహిత్యం అంటే కేవలం ముస్లిం సాహిత్యమే కాదు, ప్రధాన స్రవంతి-కేంద్రిత సాహిత్యంలో వోదగని ప్రతి ధోరణీ – ముఖ్యంగా స్త్రీ, దళిత, స్థానిక – సాహిత్యం కూడా. ఈ ధోరణి రచయితలు కాలాన్ని దర్శించే తీరు వాళ్ళు ఆధునికతని ఎట్లా నిర్వచించుకుంటారన్న పునాది మీద ఆధారపడి వుంటుంది. ఆధునికత చర్చలో కాలం పాత్రని తిరిగి నిర్వచిస్తూ, రచయితకి అది చరిత్రని సొంతం చేసుకునే (historical reclamation) ప్రక్రి య అంటాడు వాల్టర్ బెంజమిన్ “Thesis on the Philosophy of History” అనే ప్రసిద్ధ వ్యాసంలో(1968).
వర్తమానంలో నిలబడి గతాన్ని, అది సృష్టించే మిధ్యావాస్తవికతని గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తాడు ఈ చారిత్రక స్పృహ వున్న రచయిత. తన కాలంలో వున్న అన్ని గత వ్యక్తీకరణల్ని/ వాటి వర్తమాన వక్రీకరణల్ని విమర్శించడం ద్వారా మైనారిటీ రచయిత ఇంకో వర్తమానం నిర్మిస్తాడు. స్థానిక అస్తిత్వ పునర్నిర్మాణంలో ఇది చాలా అవసరమయిన సైద్ధాంతిక సాధనం. స్థానికతని సాహిత్యంలో బలమయిన భావనగా నిలబెడ్తున్న ఇప్పటి తెలంగాణ రచయితలు ముఖ్యంగా చేస్తున్న పని కూడా ఇదే. అయితే చరిత్ర మీద వున్నంత దృష్టి మనకి ఆ చరిత్రలో అంతర్భాగంగా పని చేసే ఈ కొత్త వాస్తవికత మీద కూడా వుంటే తెలంగాణ సాహిత్యం తొవ్వలే మారిపోతాయి.
చాలా మంది తెలంగాణ కథకుల మాదిరిగానే, స్కైబాబా కథా గతం , వర్తమానం కేవలం గత, వర్తమాన సమస్య కాదు, కేవలం సాహిత్య సమస్యా కాదు. ఈ సమస్య లోతుల్లోకి వెళ్లడానికి కొంత గతంలోకి వెళ్ళక తప్పదు. కొన్ని అసాహిత్య/ సాహిత్యేతర విషయాలూ చర్చించక తప్పదు. ఆ గతంలో తెలంగాణ కథ ఏమిటో, అందులో తెలంగాణ ముస్లిం ఎవరో కొంత వెతుక్కోవాలి.
పుట్టిన వెంటనే వలస వాద ఆధునికత చేత అపహరించబడిన శిశువు తెలుగు కథ. తెలుగు కథ పుట్టుకా పెరుగుదలా అంతా ఆ తరవాత వలస వాద పెంపుడు వారసత్వాల నించి మాత్రమే చూస్తూ వచ్చాం. ఆధునిక కథకి జన్మస్థలం కోస్తా తీరం వెంట చూపిస్తూ, ఆ స్థానికతలోని వలసవాద, లేదా ఆంగ్ల –కేంద్రిత మూలాల్లో తెలుగు కథని చరిత్రీకరించడంలోనే ఈ వారసత్వం దారి మళ్ళింది. తెల్ల వాళ్ళ పాద ధూళితో పావనం అయితే కానీ, మనకి సాంస్కృతిక చరిత్రా లేదు, సాహిత్య చరిత్రా లేకపోయింది. తెలుగు కథ ఇంగ్లీషు మూలాల్లోంచి పుట్టలేదనీ, దాని అసలు మూలం మన ఆదిమ సాహిత్య చరిత్రలో వుందని ఇప్పటికీ గుర్తించలేని స్థితిలోనే వున్నాం. దానికి ప్రధాన కారణం: బ్రిటిష్ ఆంధ్రా కథ వలసవాద ఆలోచనల్లోంచి, శిల్పంలోంచి నేరుగా దిగుమతి అయిన సరుకు.
అలాంటి దిగుమతిని సరుకుని ధిక్కరించడంతో మొదలయ్యింది తెలంగాణ కథా చరిత్ర . ఇటీవలి కాలంలో ముస్లిం రచయితలు తిరిగి ఆ చరిత్రలోకి ప్రయాణిస్తూ, ఆ సాంస్కృతిక వాస్తవికతని ఆవిష్కరిస్తూ వుండడంతో ఈ ధిక్కారానికి శక్తి తొడయ్యింది. ఉర్దూ అనేది రాజభాష కాదనీ, అది ప్రజల భాష అన్న గుర్తింపు కలిగించడం ద్వారా మాత్రమే ఈ సాంస్కృతిక చరిత్రకి న్యాయం జరుగుతుంది. ఈ చరిత్ర పునర్నిర్మాణం ప్రక్రియలో భాగంగానే స్కైబాబా గాని, ఇతర తెలంగాణ ముస్లిం రచయితలు గాని ఉర్దూ పదాల ద్వారా ఇప్పటి దాకా అస్పృశ్యంగా మిగిలిపోయిన ముస్లిం సాంస్కృతిక భావనలని తిరిగి వెతుక్కుంటున్నారు. తమ జీవితాల్లోని ఈ ముస్లింతనాన్ని ఆవిష్కరించే ముందు దానిని కప్పేస్తున్న/ లేదా ఇతరేతర సాధనాలతో దానిని అవాస్తవీకరిస్తున్న చరిత్రని reclaim చేసుకోవాల్సిన అవసరం ముస్లిం రచయితలకు వుంది. స్కైబాబా కథల్లో ఈ అవసరం భాషతో మొదలై, సామాజిక ఉద్యమాల పునర్ నిర్వచనం దాకా కొనసాగుతుంది. తెలుగు కథల్ని ఉర్దూ పదాల మాలిన్యం నించి కాపాడాలనుకునే వృధా ప్రయత్నంలో సంస్కృత దాస్యానికయినా వెనకాడని నవీన సాంప్రదాయ వాదులకి ఈ కథలు చదివీ చదవక ముందే వొక పెద్ద సవాల్ అవుతాయి; ఈ “తెలుగుర్దూ” భాష లేదంటే తురకం వినినంతనే మన conditioned చెవులకి అపచారమనిపిస్తుంది. అధికారిక భాష అనేది మన ఆలోచనల్ని ఎట్లాంటి చట్రాల్లో బంధించి పెడుతుందో, అట్లాంటి చట్రాల్ని పగలగొట్టే పనితో ఈ కథకుడి యాత్ర మొదలవుతుంది.
*
ఈ కథల సంపుటికి స్కై పెట్టుకున్న పేరు “అధూరే” అంటే “పూర్తి కానివి” అని అర్థం. పేరుకి తగ్గట్టుగానే, ఈ సంపుటిలో చాలా మటుకు కథలు జీవితాన్ని అంటిపెట్టుకుని వుండే వొక పూర్తికాని తనాన్ని చెప్పుకుంటూ వెళ్తాయి. ఈ కథల్లోని కొన్ని జీవితానుభవాలు నిజంగా పూర్తయ్యాయా అన్న సందేహంలో ‘ముగుస్తాయి.’ ఒక ముగింపు రాహిత్యం ప్రతి కథనీ, ఆ కథలోని పాత్రల్నీ, వాటి అనుభవాల్నీ వెంటాడుతుంది. కథలన్నీ చదివాక రచయిత ఈ కథలు చెప్పడానికి వాడిన రెండు భాషలు కూడా ఆ అనుభవాల భాషని విప్పలేకపోయాయన్న క్షోభ మనకి మిగుల్తుంది. కథ మళ్ళీ మొదటికి – అంటే భాషకి- వచ్చినట్టు మనకి అర్థమవుతుంది. ఈ కథలు తెలుగు కథ స్థాయి నించి తెలంగాణ కథకీ, అటు తరవాత తెలంగాణ ముస్లిం కథకీ పరిణతి చెండానికి వెనక ఈ రెండు అంశాలు – సాధారణ భాష, అనుభవ వాహిక- బలమయిన పునాదులు. ఈ పునాదులు రెండూ అసంపూర్ణంగా మిగిలి వున్నాయన్న అస్తిత్వ క్షోభని శీర్షికే చెబ్తుంది.
తెలంగాణ ముస్లిం అనుభవాన్ని తర్జుమా చేయగలిగే శక్తి ఈ సాధారణ భాషకి వుందా? అన్న శంకతో ఈ కథా రచయిత బయలుదేరుతాడు. ఇప్పటికే ఏర్పడి వున్న తెలుగు సాహిత్య భాష ఎంత వరకూ తెలంగాణ భాష అన్న సందేహమూ ఇందులో కలిసి వుంది. ఆ సాహిత్య భాష వైఫల్యాన్ని చెప్పాలన్న తపన శీర్షికలో వుంది, తరవాతి కథల్లో వర్ణనల్లోనూ, పాత్రల సంభాషణల్లోనూ అది కొనసాగి, పఠితని కాసేపు సందిగ్ధంలో పడవేస్తుంది. ఆ సందిగ్ధత అలవాటు పడిన కొద్ది సేపటికి ఇందులోని ముస్లిం జీవితం సందిగ్ధత రెండో దశకి తీసుకు వెళ్తుంది. మొత్తంగా తెలుగు ముస్లిం సాహిత్యం ముందు వున్న పెద్ద సాంస్కృతిక సమస్య – ఈ సందిగ్ధతతో సహా తన పాఠక వర్గాన్ని ఎట్లా సృష్టించుకోవాలా అన్నది. తెలుగు కథలకు ఇప్పటికే ఏర్పడి వున్న పాఠక వర్గం కాక, అదనంగా కొత్త పాఠకులని అందుకోవడానికి ఈ కథలు వుపయోగపడతాయి.
కానీ, స్కై బాబా ఈ కథల్లో కొన్ని సాంస్కృతిక సంక్లిష్టతల్ని ఒక శిల్ప విధానంతో తేలికగానే నెగ్గుకొచ్చాడు. కథల్లోని ఒక వర్ణనా సారళ్యం, ఒక విధమయిన understatement వ్యూహం, సూటిగా అనుభవంలోకి తీసుకు వెళ్ళే నిర్మాణ సౌందర్యం, అన్నిటికీ మించి ఇంతకు ముందు ఎక్కడా చెప్పబడని తాజా తనం.... వుస్మానియా బిస్కట్ తో ఇరానీ చాయి తాగినట్టుగా అనిపిస్తాయి. మొదటి కథ నించి చివరి కథ దాకా వెళ్లడానికి పఠితకి కొంత వ్యవధి పట్టినా సరే, ముస్లిం అనుభవంలోని సాధారణ అంశాలు, వర్తమాన అంశాలుగా నిలిచే వాటిని కథావస్తువుగా తీసుకోవడం ద్వారా, ఆ అంశాలు ఎంతో కొంత ముస్లిమేతర సమూహాలకి కూడా సమస్యలే అయి వుండడం వల్ల ఇందులోని పాత్రలు మనకి పూర్తి అపరిచితంగా మిగిలిపోయే స్థితి నించి తప్పించుకున్నాయి. అందుకే, ఈ కథల్లోని వర్తమానం పఠితకి వొక తక్షణ వాస్తవికత. పైకి, నిర్దిష్ట ముస్లిం సమస్యలుగా కనిపించేవి – ముఖ్యంగా ముహబ్బత్ కథలో సౌందర్య భావన, “చోటి బహెన్” లో బుర్ఖా, ‘మజ్బూర్” కథలోని గరీబీ, కబూతర్ కథలో ఆడపిల్ల తల్లి వేదన - లాంటివి సాధారణ వర్తమాన అంశాలు. వాటితో మమేకం కావడానికి పఠితకి “ముస్లిం” అనుభవం గాని, ఆ భాష గాని ఆటంకం కావు. ఇక, “దస్తర్” “వతన్” లాంటి కథలు నిర్దిష్టంగా ముస్లిం అనుభవాలు. ఈ రెండు రకాల అనుభవాల మధ్య పఠితని నడిపించడంలో స్కైబాబా సఫలమయ్యాడు. ఆ నడకలోనే ఈ కథల్ని తెలంగాణ ముస్లిం కథగా మలిచిన నేర్పు కూడా వుంది. ఇక ‘జీవం” లాంటి కథలు కొంత ప్రయోగాత్మకత కూడా తోడయి, రచయితలోని అస్తిత్వ వేదనకి సంబంధించిన స్పష్టతని చెప్తాయి.
ఈ కథల్లోని పాత్రలు మన మధ్యనే వుండి, మనకి తెలియకుండా మిగిలిపోతున్న వాళ్ళు. అనేక కారణాల వల్ల మన స్మృతిలోంచి జారిపోతున్న వాళ్ళు. “ముస్లిం’ అనే వర్గీకరణ కింద నలిగిపోతున్న వాళ్ళు. మతపరమయిన ఉనికీ, గుర్తింపూ ముస్లింలకి మాత్రమే పరిమితం కాకపోయినా, మన పక్కన ముస్లిం వున్నాడంటే “అమ్మో” కాస్త భయపడాలనో, జాగ్రత్తగా వుండాలనో అన్నట్టుగా అధికార రాజకీయ వ్యవస్థ వొక అసహజమయిన భయాన్ని నిర్మించింది. మిగిలిన ఈ కుల, మత అస్తిత్వాల్లోనూ లేని సమస్య ముస్లిం అనే వర్గీకరణ కింద సృష్టించబడింది. “దావా’ కథలో స్కైబాబా రాజ్యం సాధారణ స్థాయిలో ఎట్లా ప్రవర్తిస్తుందో చెప్పాడు కానీ, అది ముస్లిం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుందో అన్న దాకా వెళ్ళలేదు. ఈ కథలో అట్లాంటి రాజకీయ కోణాలు అస్పృశ్యంగా వుండి పోయాయి. తనకి తెలియకుండానే, స్కైబాబా ఈ కథల్లో ముస్లిం సాంస్కృతికత మీద ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోంది. రోజు వారీ ముస్లిం బతుకు, అందులోని ‘దలిందరాగి’, ముస్లిం తల్లులూ, కొడుకులూ, కూతుళ్లూ, కొడళ్ళూ, మాయామయిపోతున్న ముస్లిం బహిరంగ సంస్కృతి, అనివార్యమవుతున్న వలసలూ వీటన్నిటి వెనకా వొక ముస్లిం అనుదిన సాంస్కృతిక వేదన వుంది. వొక విధంగా ముస్లిం ఫెమినిస్టు కోణాన్ని స్కై బాగా ప్రతిబింబించాడు. ఈ కథల్లో మిగతా వేరే కోణాలు వున్నప్పటికీ ఆ స్త్రీ స్వరంలోని తీవ్రతలో అవి కప్పడిపోయాయి. వొక పురుష రచయిత స్త్రీస్వరంతో అంత బలంగా మాట్లాడ్డం విశేషమే!
కానీ, మొత్తంగా ఈ కొత్త తరం ముస్లిం వేదనల పునాది ఇటీవలి మత రాజకీయాలలో వుందన్నది నా అభిప్రాయం. ఆ కోణం లోపించడం వల్ల ఈ కథలు ముస్లిం అనుభవపు అర్థ వలయాన్ని మాత్రమే చూపించినట్టయింది, ఆ రకంగా చూస్తే ఇందులో వున్న ముస్లిం అనుభవం ‘అధూరా”గా మిగిలిపోయిందనీ అనిపిస్తుంది. ఆ కోణం వైపు కూడా దృష్టి పెట్టి, ముస్లిం రాజకీయ కథలు కూడా రాసి, ఆ వలయాన్ని పూర్తి చెయ్యాల్సిన బాధ్యత స్కైబాబా వొక్కడి మీదే కాదు, తెలుగు-తెలంగాణ ముస్లిం రచయితలందరి మీదా వుంది.
*
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
2 comments:
Sodara Baga rasaaru.
Sodara Baga Rasaaru.
Post a Comment