పక్కన
వొకే వొక కప్పులో మిగిలిపోయిన చాయ్
అతను తాగకుండానే మిగిలిపోయానే అని క్షోభిస్తూ.
మంచానికి అటూ ఇటూ
సగంలో మూతపడిన వొకట్రెండు పుస్తకాలు
రాత్రి ఆ కాస్త సేపూ మేలుకొని వుండి
అతనే చదివేసి వుంటే బాగుండు కదా అని లోచదువుకుంటూ.
హ్యాంగర్లకి
నిశ్శబ్దంగా వేలాడుతున్న మూడు నాలుగు చొక్కాలూ ప్యాంట్లూ
తిరిగొచ్చి ఆ దేహం
తనలో దూరుతుందా లేదా అన్న ప్రశ్నమొహాలతో -
నీ కోసం అంటూ
ఎప్పుడో వొక సారికిగాని మోగని గొంతుతో
చీకటి మొహంతో నిర్లక్ష్యంగా పడి వున్న సెల్.
ఇంకా
అతని శరీరపు అన్ని భాషలూ తెలిసిన కుర్చీ
అప్పుడప్పుడూ అతని వొంటరి తలని
తన కడుపులో దాచుకున్న టేబులు
అతని మణికట్టుని వదిలేసిన గడియారం
ఈ రాత్రికి అతను వేసుకొని తీరాల్సిన బీపీ టాబ్లెట్
కంప్యూటరు చుట్టూ పసుపు పచ్చ స్టీకి నోట్ల మీద
ఇదే ఆఖరి రోజు అని ముందే తెలియక
ఎవరూ చెప్పే వాళ్ళు లేక
అతను రాసుకున్న కొన్ని కలలూ కలలలాంటి పనులూ
అతని నిశ్శబ్దం చుట్టే తారట్లాడుతున్న అనేక అనాథ ఊహలూ
తన చివరి క్షణం
ఎలా వుండాలో అతనెప్పుడూ వూహించనే లేదు
ఇంత దట్టమయిన ఏకాంతంలో
అతనికంటూ వొక్క క్షణం ఎప్పుడూ దొరకనే లేదు.
దొరికి వుంటే,
ఏమో
ఈ ఏకాకి గదిని ఇంకాస్త శుభ్రంగా వూడ్చి పెట్టుకునే వాడేమో!
కనీసం
ఆ సగం తిన్న పండు మీదా
తన మీదా ఈగలు ముసురుకోకుండా అయినా చూసుకుని వుండే వాడు.
కానీ,
మరణానికి అంత తీరిక లేదు
అదీ ఏకాంతంతోనే విసిగి వుంది
విసిగి విసిగీ అదీ హడావుడిగానే వచ్చిందీ,
వెళ్లిపోయింది అతని తోడుగా.
ఇంకో కంటికి కూడా తెలీకుండా.
12 comments:
ఏకాంతం గాఢత,, మరణం, అప్పటివరకూ పనికొచ్చె పసుపు స్టిక్‌నోట్స్ తర్వాత ఎందుకూ పనికిరాకపోవడం.....తనని పూడ్చిపెట్టే క్షణాలకోసం ఆ గదిని ఊడ్చిపెట్టకపోవడం సమంజసమే......ఎప్పటిలానే బావుంది అఫ్సర్‌జీ......
మీ వాసుదేవ్
భలే ఉంది మాస్టారూ కవిత.
ఇద్దరు ఒంటరి గాళ్ళకి తోడు దొరికింది, పాపం ఇక్కడ మిగిలిన చొక్కా, పాంట్లు, చాయ్ లు ... ఒంటరిగా మిగిలిపోయాయ్!
గుండె గదులన్నీ మూసుకుపోయాయి...
ఈ కవితా పాదాల వెంట కళ్ళు నడుస్తూ వర్షిస్తూనే వున్నాయెందుకో...
కవికి నమస్కారమ్ చెప్పకుండా ఆగలేని వేళ్ళు అలా కలిసి అతుక్కుపోయాయి....
afsar is back...REMEMBERING old GOLDEN DAYS....!
అక్షరాలను ఆత్మలో గంగా స్నానాలు చేయిస్తారు అఫర్జి మీరు !సంజీవ్ దేవ్ వచనం తరువాత నన్నంతగా కలవర పెట్టేది ఎందుకో మీ సిరా వాసనే!ప్రతి రచనా చదివే అవకాశం లేక పోవచ్చు కానీ , కంట బడినప్పుడల్లా మీ పదాల అడుగుజా డలు నా చూపును ఏ అంచులు లేని లోకాలకో మోసుకుని పోతుంటాయి.ఎప్పటి లాగే ఈ కవితా ఒక మరణ యాతనను మనసు కంటికి చూపించింది.
అఫ్సర్ గారు,
చాలా బాగుంది. చదివిన తర్వాత చాలా సేపు అలా ఉండిపోయాను.
నా ఆఫీసు కుర్చీ, టేబులు, స్టికి నోట్స్ యాదికొచ్చి కలవరపెట్టినయ్.
"అతని శరీరపు అన్ని భాషలూ తెలిసిన కుర్చీ
అప్పుడప్పుడూ అతని వొంటరి తలని
తన కడుపులో దాచుకున్న టేబులు".
చాలా బాగా చెప్పారు.
రవి వీరెల్లి
ఈ కవిత మీద అద్భుతమయిన వ్యాఖ్యలు రాసిన మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.బహుశా, ఇటీవలి కాలంలో నేను రాసిన ఏ కవితకీ ఇంతటి స్పందన రాలేదనుకుంటా.
guruji wonderful poem
different from your style surprisingly
may be narrative poetry touches deep in the heart is a universal fact
with respects
bollojubaba
బాబాజీ:
ఎలా వున్నారు? ప్రతి కవితా వొక కథనమే అనుకుంటాను, అలాంటప్పుడు కథనకవిత్వం అంటూ విడిగా వుంటుందా?
Curious mix up of prose & poetry!
Very touching sir. Remained like a photograph with its simple but mysterious images. I felt the emptiness and silence and the still expectant looks of all the inanimate objects made animate by his absent presence!
- Vijay Koganti
Post a Comment