పతంగ్....
వొక వూహ కావచ్చు సాయంత్రానికి కరిగి నీరయ్యే ఏదో వొక నీడ కావచ్చు పొద్దుటికి సూరీడు రావచ్చు రాకపోవచ్చు ఇవాల్టి రాత్రి చీకటిగానే మిగిలిపోవచ్చు ఆకాశం మీద చుక్కలు ఎక్కడికీ వలసపోకపోవచ్చు సాయంత్రప్పూట హైద్రాబాద్ వొక మెరుపు కల

ఆ ఇరానీ చాయ్ నిజంగా అదే పరిమళమై నన్నూ మన శరీరాల నిద్ర చర్మాల మీద చర్నాకోల కావచ్చు కాకపోవచ్చు అసలు ఆ టేబుల్ చుట్టూ శరీరరహిత ఆత్మలు మాత్రమే పరిభ్రమిస్తూ వుండొచ్చు క్రాస్ రోడ్ గీసిన పెయింటింగ్ కళ్ల కిందా చూపు పారినంత దాకా.

వొక అర్ధరాత్రి అంటూ లేకపోవచ్చు వొక పోలీసు కన్ను మాత్రమే అటూ ఇటూ పరుగులు తీస్తూ వుండొచ్చు గోడల మీద ఎరుపు లేకపోవచ్చు మరేదో రంగులో కార్పొరేట్ సంతకాలే ఎగురుతూ వుండొచ్చు ఎవరో వొక అనామకుడు లావారిస్ ఆవారా తన పత్తా దొరక్క/దొరికిన పత్తాకి అన్ జాన్ కొట్టి కాపిటలిస్టు దుర్గమ్మీద మజాక్ వుడాయించవచ్చు, ఎంత మారిపోయావ్, హైద్రాబాద్! నువ్వొక మంత్రించిన పిచ్చి కల.

వొక వూహ కూడా కాకపోవచ్చు ఎప్పటికీ కరిగి నీరు కాలేని ఇంకేదో నీడ కూడా కాకపోవచ్చు ఇవాల్టి పగలు కూడా చీకటిగానే మిగిలిపోవచ్చు ఆకాశం మీద చుక్కలు వుండగానే సూరీడు రోడ్ల మీద కరిగిపోవచ్చు. ఈ క్షణపు ఆత్మహత్యవీ..వచ్చే క్షణపు హత్యవీ...ఆ రెండీటీ నడుమ వొక అరక్షణపు వాంఛవీ...చివరిదాకా చంపి కొసప్రాణం మీద సూర్యుడిని వేలాడదీసే....మాయాప్రవాసివి..మోహావేశపు వుక్కిరిబిక్కిరి కెరటానివి.


(బొమ్మ: అక్బర్. దౌర్జన్యంగా, కర్టసీ కూడా లేకుండా)

11 comments:

కెక్యూబ్ వర్మ said...

ఇంత విషాదాంతాన్ని మింగుడు పడక నిజంగా ఉక్కిరి బిక్కిరయ్యాను సార్...మీ భావానికి తగ్గట్టు అక్బర్ బొమ్మ కూడా హత్తుకుంది...

వాసుదేవ్ said...

పొద్దున్నే మంచి మేల్కొలుపు నాకు అఫ్సర్‌జీ......ఇరానీ ఛాయ్ ఘాటు, ఘుమఘుమలు మీ బ్లాగునుంచి తప్పించుకుని నన్ను చుట్టుముట్టినట్లు అనుభూతి.....ఒక దైనందిన జీవితపు మాములు విషయాలే ఎంతో స్ఫూర్తినిస్తాయి అని మీ శైలిలో చెప్పడం మళ్ళి వాల్ట్ వ్హిట్‌మన్ ని గుర్తుకుతెచ్చింది..........వాసుదేవ్

Afsar said...

వర్మ: అవును విషాదమే...మింగుడు పడని హైదరబాద్!

@వాస్: థాంక్ యు! మీరు వాల్ట్ వ్హిత్మన్ ని భలే తలుచుకున్నారు. ఈ మధ్య వాల్ట్ వ్హిత్మన్ ని ఎక్కువగానే చదువుతున్నా. కవులంతా మళ్ళీ వ్హిత్మన్ ని చదవాలనీ కోరుకుంటున్నా.

జ్యోతిర్మయి ప్రభాకర్ said...

మీకు అభినందనలు తెలిపేంత స్థాయి నాకు లేకున్నా ఈ అద్భుతమైన రచనను చదివి తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యానని తెలియజేయకుండా ఉండలేకపోతున్నాను

ఆ.సౌమ్య said...

హ్మ్ మీ టపా హైదరాబాదు తో నా అనుబంధాన్ని గుర్తుచేసింది...ఏమిటో బాధగా అనిపించింది.

ఉమ said...

బావుంది అఫ్సర్ మెరుపుకల. హృదయాన్ని తాకీ తాకకుండా తడిమే నగరం నిజంగానే వొక మెరుపు కలే.

Afsar said...

@జ్యోతిర్మయి గారు: భలే వాళ్ళే! కవిత్వంలో స్థాయీ అంతస్తూ లేవు కదా!. మీ మంచి మాటకి థాంక్స్.

@సౌమ్య: అవును, సౌమ్యా! మీ అనుబంధం గురించి రాస్తే బాగుంటుంది, మీ అందమయిన వచనంలో.

@ఉమా; నువ్వా? నిజంగా నువ్వేనా? కవిత్వం చదివి పెడమొహం పెడ్తావనుకున్నా. (అలా నువ్వేప్పుడూ చెయ్యలేదనుకో! అది వేరే సంగతి!)

ఆ.సౌమ్య said...

అఫ్సర్ గారూ పొద్దున్నే నామొహాన వేల కాంతులు వెలిగించారు....నాది అందమైన వచనం అని మీరు సర్టిఫికేట్ ఇస్తే అంతకన్నా కావల్సినదేముంది చెప్పండి. :)

తప్పకుండా హైదరాబాద్ తో నా అనుబంధం రాస్తాను.

ఎం. ఎస్. నాయుడు said...

sir. a little change in your expression, unexpressed.

Nutakki Raghavendra Rao said...

ఈ క్షణపు ఆత్మహత్యవీ..వచ్చే క్షణపు హత్యవీ...ఆ రెండీటీ నడుమ వొక అరక్షణపు వాంఛవీ...చివరిదాకా చంపి కొసప్రాణం మీద సూర్యుడిని వేలాడదీసే....మాయాప్రవాసివి..మోహావేశపు వుక్కిరిబిక్కిరి కెరటానివి.


(బొమ్మ: అక్బర్. దౌర్జన్యంగా, కర్టసీ కూడా లేకుండా)

At this juncture Iam a kid to comment.No words to express Afsar jee ....Nutakki Raghavendra Rao.

Afsar said...

రాఘవేంద్ర గారు:

భలే వారే మీరు! అయినా మంచి మాటకి ధన్యవాదాలు!

Web Statistics