నాన్న..కొందరు స్నేహితులు...!





దిగులు లేదు
ఎంత చీకటి పడనీ
ఈ అడివి దారి
ఈ చీకటి వంతెన
అలవాటు కాకపోతేనేం?
దీన్ని దాటడానికే
ఈ శరీరాన్ని కూడదీసుకున్నా.


గుర్తేనా నీకు?
ఏ మునిమాపు పొలం లోనో
చెట్ల గుబురు లొ చిక్కడిపోయి
వొక వెర్రి పాట పాడుకుంటూ
చీకటిని దాటేయ్యడం?


వొక్కో సారి
దిక్కులు మారిన ప్రయాణంలో
వెనక్కి తిరగాల్సిన ముఖంమీద
అనేక భయాల ముడతలు
సంశయాల నీడలు
మరణమే
ఈ క్షణానికి నయమనిపించే దిగాలుతనం
గుర్తేనా నీకు?


మధ్యలోనే బతుక్కి
ఎర్ర జండా వూపి
వొక మిత్రుడు
మరీ భయానకమయిన ఆ పొద్దుట
రైలు పట్టాల మీద ముక్కలయి
కనిపించినప్పుడు
ఏ పదాలు రాసుకున్నానని?
వొక్క మాటా పెగల్లేదు కట్టెదుట.


మధ్యలోనే ప్రయాణాలు
ఆగిపోవడం
ఈ బతుక్కి కొత్త కాదు కదా?!


మరీ బలహీనమయిన రాత్రి
అతను - ఎవరైతేనేం ?
నిశ్సబ్దంగా పై దూలానికి
నిండయిన తన శరీరాన్ని
వేలాడ దీసి వొక చివరి నవ్వు
మా మొహాల మీద రువ్వి వెళ్ళిపోయినప్పుడు
అప్పుడయినా ఏం చేశామనీ?
వాక్యాలన్నీ చేతలుడిగిపోవడం తప్ప.


చిరునవ్వు
సగంలో తెగిపోవడం
అప్పటికింకా కొత్తే !
అయినా సరే..
చెయ్యడానికేమీ లేదుగా!


చిన్న చీకట్లు
పెద్ద మరణాలు ఎలా అవుతాయో
ఎప్పటికీ అర్ధం కాదు
కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది.


నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో.
నిద్రలోంచి తెగిపడ్డాను
గాఢమయిన చీకట్లోకి.


ఏడుస్తూ వుండిపోయాను
తెల్లారే దాకా.
చీకటీ వంతెనా
దిగులు పొలాలూ
ఖాళీ ఆకాశాలూ
అన్నీ నువ్వే.


అనగలనా..దిగులు లేదు…అని
అలవాటు కాని చీకటిలో
నిలబడి.

2009

("ఊరి చివర" నుంచి)
Category: 13 comments

13 comments:

srikanth said...

beuatiful. a poem

karlapalem Hanumantha Rao said...

నాకు చాలా చాలా ఇష్టమయిన కవిత ఇదీ అఫ్సర్ జీ !ఎన్ని సార్లు చదివానో ఇదివరకు! అయినా ప్రతి సారీ నన్ను అదే దిగులు ముసురు కమ్మేస్తుంటుంది. మీ అక్షరాల తడి ఎప్పటికప్పుడు ఇలా తాజా అలజడి రేపటం నాకు కొత్త కాదనుకోండి.

Afsar said...

@శ్రీకాంత్, ఎలా వున్నారు? మంచి మాటకి థాంక్స్!
@హనుమంత రావు గారు: మరీ నల్ల పూస అయిపోయారేమిటి? హైదరబాద్ అను కారడవిలో తప్పిపోయారా?
అవును, ఇది నాకు కూడా నచ్చిన నా కవితల్లో వొకటి. "ఊరి చివర" నించే!

SREEDHEESSPACE said...

తెగిపడ్డాను నిద్రలోంచి.. చీకట్లోకి.. అఫ్సర్ ఈ కవిత చాలా అద్భుతం. ఎన్నిసార్లు తటస్థపడినా చదవకుండా వదిలేసి వెళ్ళడం సాధ్యం కాని కవిత.

వాసుదేవ్ said...

అఫ్సర్‌జీ నమస్తె....మీ ఊరిచివర ఇంతకుముందు చదివాను కానీ ఇదెలాగో మిస్సయింది....ఇంతమంచి కవితని ఇప్పుడైనా చదవగలిగినందుకు ఆనందంగా ఉంది...చీకటి వంతెన, దిగులు పొలాలు, ఖాళీ ఆకాశలు......మీ కవితలకి కవచకుండలల్లాంటివి......మళ్ళీ మళ్ళి చదవలన్పించేవి ఇవే.....మీ వాసుదేవ్

kavi yakoob said...

wonderful poem..
...yakoob

కెక్యూబ్ వర్మ said...

గుండెల్ని పిండేసే కవిత సార్..సంకలనంలో చదివినా మళ్ళీ ఈరోజు చదివితే ఫాదర్స్ డే రోజూ చేసుకోవాలనిపిస్తుంది...చేయాలి కూడా...

Narsim said...

కొన్ని మరణాలు పెద్ద చీకటిలా ముసురుకోవడం, రొజూ తెలుస్తూనే ఉండడం....పెద్ద బాధ, నిద్రలోంచి చీకట్లోకి తెగి పడడం ఇంకా పెద్ద బాధ. అఫ్సర్ గారు మంచి పీస్.

-నర్సిం

Afsar said...

"కవిత్వం రాయడం గొప్ప కాదు,

నా కవిత్వాన్ని మీ కంటి వెలుగుగా మార్చుకున్నారే, అది మీ గొప్ప!" అన్నాడు గాలిబ్ మహాకవి, ఎంత పొగరుబోతు అయినా సరే!

ఈ కవిత మీద మీ స్పందన నాకు ఓ కొత్త ఉత్సాహం.

@శ్రీధర్: నీ మాట పది కాలాలు వుంటుంది నా మనసులో.
@వాసుదేవ్ (శ్రీనివాస్); ఎలా వున్నారు? బహుత్ కాల దర్శనం! "ఊరి చివర"లో చాలా మంది చాలా చదవలేదు, చదివినా అందులో వున్న political tone వల్ల చదివింది దాచుకోవడానికి ఇష్ట పడలేదు. అయిననూ, నాకు రాజకీయ కవిత్వమే ఇష్టం!

@నర్సిం: చాలా థాంక్స్.
@వర్మ; ఫాదర్స్ డే మీద నాకేమీ పెద్ద ఇష్టం లేదు, కానీ, నాన్నకి వో రోజు, ఓ క్షణం లేదు కదా! నా లోపలి ఫెమినిస్టు వల్ల, అప్పుడప్పుడూ నాన్నకి అన్యాయం జరిగిందేమో అని వొక పశ్చాత్తాపం!
@యాకూబ్: నువ్వు మంచి తండ్రివి కాబట్టి, ఈ కవిత చప్పున నీ గుండెని తాకింది.

కోడూరి విజయకుమార్ said...

అఫ్సర్ గారూ...నిజానికి 'ఊరి చివర' సంకలనం తో పోలిస్తే, 'వలస' నాకు చాలా ఇష్టమైన సంకలనం..నన్నెంతో ప్రభావితం చేసిన కవితలు చాలా వరకు అందులో వుండడం కూడా వొక కారణం అనుకుంటాను...అయితే 'ఊరిచివర' లో వున్న కవితల్లో నన్ను అమితంగా కదిలించిన కవితల్లో ఇది మొదటిది...బహుశా నాన్న గురించి రాసింది కావడం వల్ల అనుకుంటాను...
మరీ ముఖ్యంగా,
'కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది'.......
................................
'నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో..'
ఈ పాదాలు చదువుతున్నప్పుడు గొంతు పూడుకు పోకుండా ఉంటుందా ఎవరికైనా?
మీరన్నది నిజమే..అమ్మతో పోలిస్తే నాన్నకు అన్యాయం జరిగిన మాట .....బహుశా, నాకూ ఏ మూలో ఆ వేదన వుండడం వల్ల అనుకుంటా...నా మొదటి సంకలనం లో పద్యాలు అమ్మ తో మొదలైతే, రెండవ సంకలనంలో నాన్నతో మొదలవుతాయి...

కోడూరి విజయకుమార్ said...

అఫ్సర్ గారూ...నిజానికి 'ఊరి చివర' సంకలనం తో పోలిస్తే, 'వలస' నాకు చాలా ఇష్టమైన సంకలనం..నన్నెంతో ప్రభావితం చేసిన కవితలు చాలా వరకు అందులో వుండడం కూడా వొక కారణం అనుకుంటాను...అయితే 'ఊరిచివర' లో వున్న కవితల్లో నన్ను అమితంగా కదిలించిన కవితల్లో ఇది మొదటిది...బహుశా నాన్న గురించి రాసింది కావడం వల్ల అనుకుంటాను...
మరీ ముఖ్యంగా,
'కొన్ని మరణాలు
పెద్ద చీకటిలా ముసురుకోవడం
రోజూ తెలుస్తూనే వుంది'.......
................................
'నాన్నా,
చివరి సారిగా నీళ్ళతో కడగమని
అందరూ నన్ను నీ నిర్జీవ శరీరం ముందుకి
నెట్టిన ఆ మరణ క్షణం నిన్న రాత్రి కలలో..'
ఈ పాదాలు చదువుతున్నప్పుడు గొంతు పూడుకు పోకుండా ఉంటుందా ఎవరికైనా?
మీరన్నది నిజమే..అమ్మతో పోలిస్తే నాన్నకు అన్యాయం జరిగిన మాట .....బహుశా, నాకూ ఏ మూలో ఆ వేదన వుండడం వల్ల అనుకుంటా...నా మొదటి సంకలనం లో పద్యాలు అమ్మ తో మొదలైతే, రెండవ సంకలనంలో నాన్నతో మొదలవుతాయి...

Afsar said...

విజయ్;

థాంక్ యు.

మీ రెండో పుస్తకం నేను చూసినట్టు లేదు. మీ కొత్త పుస్తకం గురించేనా మీరు మాట్లాడుతున్నారు?

Padmapadmapv said...

Afsarji..Kalluchemagillai..plz..meebooks..konadaniki..trychesa..challa.butAviAkadadorikuThayo..chepandi..

Web Statistics