పక్కన
వొకే వొక కప్పులో మిగిలిపోయిన చాయ్
అతను తాగకుండానే మిగిలిపోయానే అని క్షోభిస్తూ.
మంచానికి అటూ ఇటూ
సగంలో మూతపడిన వొకట్రెండు పుస్తకాలు
రాత్రి ఆ కాస్త సేపూ మేలుకొని వుండి
అతనే చదివేసి వుంటే బాగుండు కదా అని లోచదువుకుంటూ.
హ్యాంగర్లకి
నిశ్శబ్దంగా వేలాడుతున్న మూడు నాలుగు చొక్కాలూ ప్యాంట్లూ
తిరిగొచ్చి ఆ దేహం
తనలో దూరుతుందా లేదా అన్న ప్రశ్నమొహాలతో -
నీ కోసం అంటూ
ఎప్పుడో వొక సారికిగాని మోగని గొంతుతో
చీకటి మొహంతో నిర్లక్ష్యంగా పడి వున్న సెల్.
ఇంకా
అతని శరీరపు అన్ని భాషలూ తెలిసిన కుర్చీ
అప్పుడప్పుడూ అతని వొంటరి తలని
తన కడుపులో దాచుకున్న టేబులు
అతని మణికట్టుని వదిలేసిన గడియారం
ఈ రాత్రికి అతను వేసుకొని తీరాల్సిన బీపీ టాబ్లెట్
కంప్యూటరు చుట్టూ పసుపు పచ్చ స్టీకి నోట్ల మీద
ఇదే ఆఖరి రోజు అని ముందే తెలియక
ఎవరూ చెప్పే వాళ్ళు లేక
అతను రాసుకున్న కొన్ని కలలూ కలలలాంటి పనులూ
అతని నిశ్శబ్దం చుట్టే తారట్లాడుతున్న అనేక అనాథ ఊహలూ
తన చివరి క్షణం
ఎలా వుండాలో అతనెప్పుడూ వూహించనే లేదు
ఇంత దట్టమయిన ఏకాంతంలో
అతనికంటూ వొక్క క్షణం ఎప్పుడూ దొరకనే లేదు.
దొరికి వుంటే,
ఏమో
ఈ ఏకాకి గదిని ఇంకాస్త శుభ్రంగా వూడ్చి పెట్టుకునే వాడేమో!
కనీసం
ఆ సగం తిన్న పండు మీదా
తన మీదా ఈగలు ముసురుకోకుండా అయినా చూసుకుని వుండే వాడు.
కానీ,
మరణానికి అంత తీరిక లేదు
అదీ ఏకాంతంతోనే విసిగి వుంది
విసిగి విసిగీ అదీ హడావుడిగానే వచ్చిందీ,
వెళ్లిపోయింది అతని తోడుగా.
ఇంకో కంటికి కూడా తెలీకుండా.