("ఊరి చివర" చర్చలో భాగంగా తిరునగరి సత్యనారాయణ గారు మరో ఈ-లేఖ పంపారు. ఆయన నాకు రాసిన ఈ-లేఖతో పాటు దీనిని ప్రచురిస్తున్నాను.)
అఫ్సర్ గారూ: నేను కింది జాబు రాస్తే పోస్టు కావడం లేదు. దయచేసి పోస్టు చేయరూ -
- తిరునగరి సత్యనారాయణ
(ఇదంతా నా సోది - దీనిలో అఫ్సర్ కవిత్వం మీద విమర్శ లేదు అభిప్రాయమూ లేదు - చదువరులు క్షమించాలి) భూషణ్ గారు తిట్టి పోస్తారని, ఒకింత అహంకారమూ (అహంకారము ఉండడం తప్పు కాదు - పోతే మితి మీరితేనే సమస్య) , కించిత్తు చీత్కారమూ ప్రదర్శిస్తారని నేను ఆరోపణ చేయలేదు. ఆయన రాసిన సమీక్షలు (అభిప్రాయాలు) చదివేక నాకనిపించిందది. కవికి అహంకారం వుంటే నష్టం లేదు (అట్లా అని వుండాలని కాదు) కానీ విమర్శకులకి ఉంటే ఇంక ఆయన/ఆమె అభిప్రాయాలు పట్టించుకోవాలని అనిపించదు. నా అభ్యర్థన అల్లా అఫ్సర్ కవిత్వం బాగా లేదని విమర్శ చేయవచ్చు - తప్పు లేదు - కానీ అది సమగ్రంగా వుండాలి.
అంటే కవిత్వంలోని వస్తువును, తాత్విక దృక్పథాన్ని, మూలాల్ని, రూపాన్ని, ఆయన వాడిన సాహితీ పరికరాల్ని అన్నీ పట్టించుకోవాలి. వాటి మీద ఆధార పడి విమర్శ చేయాలి. వస్తువు రూపమూ ఒక దాన్నొకటి బలపర్చుకుంటున్నాయా, వాటి మధ్య సంబంధం ఎలా ఉంది, ఎక్కడ రూపం బలహీనమైంది (అంటే పద్యం బలంగా లేదు) ఎందుకు బలంగా లేదు, వస్తువు నీరస పడడం వల్ల అలా జరిగిందా? కవిగా అఫ్సర్ ఏమైనా కొత్త తాత్విక ప్రతిపాదనలు చేస్తున్నాడా కవిత్వం లో? కొత్త చూపును, కొత్త అనుభవాన్ని ఇస్తున్నాడా పాఠకులకు? ఇస్తే ఆ అనుభవం, ఆ చూపు ఎట్లా సాధ్యమైంది? ఏ వస్తువు వల్ల, ఏ రకంగా ఆ వస్తువుని present చేయడం వల్ల, ఏ సాహితీ, కవితా పరికరాల్ని వాడడం వల్ల అది సాధ్యమైంది? ఈ పరిశీలనలు చేస్తే అఫ్సర్ కవిత్వంపై సరి ఐన విమర్శ జరిగేది. న్యాయం జరిగేది. ఫలితంగా సాహిత్యానికి, పాఠకులకు మేలు జరిగేది. అంతే కానీ ఈ పద్యాలు చెత్తగా ఉన్నాయి, కంగాళీ గా ఉన్నాయి, నానాటికీ తీసికట్టు నాగంభొట్ల్లు అని తీసిపారేస్తే దాని వల్ల ఉపయోగమేమిటి? అవి తిట్లు కావా?
అసలు నా బాధంతా మన తెలుగు సాహిత్య విమర్శ, ముఖ్యంగా కవిత్వంలో రెండు రకాలుగా సాగుతోంది - ఒకటి వ్యక్తిగత అభిరుచుల ఆధారంగా ఆ పద్యాన్ని ఐతే ఆకాశానికెత్తడమో లేదా పాతాళానికి తొక్కేయడమో (లేదా బురదలో) జరుగుతోంది. పద్యంలో ఇక్కడ ఖాళీ జాగా లు వదిలాడు, ఇక్కడ ఏమీ చెప్పకుండా నిశ్శబ్దం పాటించడం వల్ల పద్యానికి గొప్ప అందమొచ్చింది, లేదా ఈ వాక్యాన్ని ఇక్కడ సరిగ్గా విరగ్గొట్టి ఇక్కడ సెమీకోలన్ వాడడం వల్ల పద్యం గొప్పదైంది - అంటూ సారంలేని విమర్శ వల్ల ఏమి ఒరుగుతుంది - మహా ఐతే ఒక రకమైన పద్యం ఎట్లా చదవాలో ఎట్లా రాయాలో తెలుస్తుంది - కానే పద్యాలన్నీ అట్లానే ఉంటాయా? ఉండాలా? అట్లా నియమముందా? లేక ఆయా సాహితీ 'విమర్శకులు' వారి వారి అభిరుచులని బట్టి పద్యం మంచి చెడులని నిర్ణయిస్తారా? లేదా పద్యం మంచి చెడులని నిర్ణయించే పద్దతి మరేదైనా ఉందా? ఇంక మరో పద్దతి పద్యాలని paraphrase చేస్తూ వ్యాసాలు రాయడం. సమకాలీన పరిస్థితులని, ఉద్యమాలని, ధోరణులని,ఇంకా సవాలక్ష general knowledge విషయాలని, కవి పద్యాలని పక్క పక్కన పేరుస్తూ వ్యాసం (వీలయితే వ్యాసాలు) రాసి మధ్య మధ్య పద్యాలకు ప్రతి పదార్థం రాసి explain చెయ్యడం. దురదృష్టవశాత్తు తెలుగులో కవిత్వ విమర్శ వీటిని దాటి బయటికి రావడం లేదు.
అట్లా కాకుండా పద్యాల్లో ఉన్న వస్తు రూపాలకి మధ్య ఉన్న కార్యకారణ ( uni directional కాదు bi directional) సంబంధాన్ని, పద్యంలో చెప్పబడిన వస్తువు (ఎంత చిన్న పద్యమైనా వస్తువుండాలి కదా - లేకుండా పద్యం ఎట్లా రాయవచ్చో నాకు తెలియదు) లేదా భావం లేదా అనుభూతి లేదా ఆవిష్కరించబడిన చూపు - ఎందుకు బాగుంది - ఎందుకు బాగులేదు - అది ఏ తాత్విక చింతనని మన ముందు ప్రతిపాదిస్తున్నది - మనలో ఏ తాత్విక చింతన కలిగిస్తున్నది - ఆ పద్య మనలో కలిగించే అనుభూతికి (లేదా feelings) తాత్విక మూలాలేమిటి - ఆ పద్యం మన ఆలోచనలని కొంచెమైనా స్థాయి పెంచుతున్నాయా లేదా - ఆ పద్యంలో ఆ వస్తువుని/ ఆ అనుభూతిని/ feelings కలిగించడానికి కవి వాడిన కవితా పరికరాలేమిటి - అవి కొత్తవా పాతవా అరిగిపోయినవా (cliche) - ఇట్లా కొంత చదువరుల స్థాయి పెంచే విధంగా, కొత్త ఆలోచనలు పుట్టించే విధంగా, పరిధి విస్తరించే విధంగా విమర్శ చేస్తే (అభిప్రాయాలు చెప్పడం కాదు - అభిప్రాయాలు చెప్పినప్పుడలా అహంకారం ప్రవేశిస్తుంది - ఇదంతా నాకే తెల్సు నేనే బాగా చెప్పగలను - ఈ కవి - చదివే పాఠకులు శుద్ధ waste అనే భావం ప్రవేశిస్తుంది ) ఎంత ఉపయోగకరంగా ఉంటుందో సహృదయులు ఆలోచించాలని నా మనవి.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
2 comments:
పాఠకుడి స్థాయిని పెంచని విమర్శ అనవసరం.
అఫ్సర్ గారికి, నమస్తే.
మీ అక్షరం బ్లాగును అక్షరం పొల్లుపోకుండా చదివే వానిలో నేను ఒకన్ని. 'ఊరి చివర' సమీక్షలపై అందరు రాస్తున్న వాఖ్యలను చదివిన తర్వాత నాకు ఒక సందేహం కలిగింది.
అసలు ఒక పుస్తకానికి రివ్యూ ఎలా రాయాలి?
నవల, వ్యాసం, కధ మరియు కవిత రాయడానికి కొన్ని పద్దతులు ఉన్నట్టు రివ్యూ రాయడానికి కొన్ని ప్రామాణిక సూత్రాలు ఉంటాయని నేను అనుకుంటున్నాను. కాని పుస్తకం నెట్ లో రాసిన 'ఊరి చివర' రివ్యూ చదివిన తర్వాత రివ్యూ రాయడానికి సూత్రాలు ఏవి అవసరం లేదేమో అనిపించింది. ఎందుకంటే రివ్యూ లో చివరగా రాసే conclusion(?) మొదట్లో కనిపించింది. ఆ conclusion ను బలపరచడానికి మిగతా రివ్యూ రాసినట్టు అనిపించింది.
రివ్యూలో సంకలనం గురించి చెప్పాల్సిన చాలా విషయాలు ప్రక్కన పెట్టి, రచయిత మీద తనకున్న వ్యక్తిగత అభిప్రాయాల గురించి ఎక్కువగా రాసినట్టు అనిపించింది. రివ్యూ ఇక మొదలవుతుందన్న సమయంలో end అయినట్టు అనిపించింది.
రివ్యూ ఎలా రాస్తే ఉపయోగకరంగా ఉంటుంది అనే విషయంపై తిరునగరి గారు చాలా మంచి సూచనలు ఇచ్చారు. ఒక సాధారణ పాఠకుడిగా నేను కూడా రివ్యూ ఇలా ఉండాలని కోరుకుంటున్నాను:
రచయిత అసలు ఈ సంకలనం ఎందుకు రాసుంటారు?
సంకలనం ద్వారా పాఠకులకు ఏం చెప్పదలచుకున్నారు?
ఎలాంటి పాఠకుల కోసం రాసారు?
అందులో ప్రధానమైన వస్తువు ఏది?
ఆ వస్తువుపై రచయితకు ఎంత పట్టు ఉంది?
రచయిత పదాలను ఎంత మెళుకువగా ఉపయోగించారు?
కవితలు సంకలనం థీమ్ లో ఇమిడేట్టు ఉన్నాయా?
పదాలు, పదచిత్రాలు, లయ, శిల్పం ఎంతవరకు బాలన్సు చేయగలిగారు?
సంకలనంలో కవితలను ఒక పద్దతిలో అమర్చగలిగారా?
సమీక్ష రాస్తున్న వ్యక్తికీ ఆ వస్తువు మీద ముందు ఉన్న అభిప్రాయం ఏమిటి, ఆ సంకలనం చదివిన తర్వాత ఆ అభిప్రాయం ఏమైనా మారిందా?
రచయిత ఎంతవరకు పాఠకులను మెప్పించగలిగారు, ఎంతవరకు influence చేయగలిగారు?
చివరగా, ఈ సంకలనం ఎలాంటి పాఠకులకు నచ్చుతుంది, ఎలాంటి పాఠకులకు నచ్చదు, ఎందుకు నచ్చుతుంది/నచ్చదు?
సద్విమర్శ చేసినప్పుడు వ్యక్తిగత అభిప్రాయాన్ని పక్కన పెట్టి రివ్యూ చదివే పాఠకులను దృష్టిలో పెట్టుకుని రాస్తే కాస్త ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం.
ఇది నేను నాకున్న మిడిమిడి జ్ఞానంతో ఒక సాధారణ పాఠకుడిగా చేస్తున్న వ్యక్తిగత అభిప్రాయం.
చివరగా, 'ఊరి చివర' నేను కూడా చదివాను. నాకు చాలా నచ్చింది. ఇందులోని చాలా కవితలు నేను express చేయలేని ఒక అద్వితీయమైన అనుభూతిని మిగిల్చాయి. నాలో చాలా ఆలోచనలు రేకెత్తించాయి. నేను గమనించిన మరో విషయం ఏమిటంటే, 'ఊరి చివర' ఈ మద్య వచ్చిన సంకలనాలలో అతి ఎక్కువగా చర్చించబడ్డ సంకలనం.
ఎవరో రాసినట్టు, అఫ్సర్ గారు ఏం పోసి పెంచారో ఈ తీయని పళ్ళు ఇచ్చే జామ తోటను, అందరి కళ్ళు దీనిమీదే. అఫ్సర్ గారు, మీరు ఇక రాళ్లేరుకోడానికి సిద్దంకండి!
తిరునగరి గారు,
మీరు 'ఊరి చివర' పై రివ్యూ రాస్తే చదవాలని ఉంది.
-రవి వీరెల్లి
Post a Comment