ఇవాళ నాన్నగారు కన్ను మూసిన రోజు.
ఆయనది ఊహించని మరణం. ఆయన అలా మృతశరీరంతో పడివుండడం వొక మాయ అనీ, వున్నట్టుండి మళ్ళీ ఏదో వొక రోజు నవ్వుతూ ఆయన అలా నడుచుకుంటూ వెనక్కి వచ్చేస్తారని చాలా కాలం వొక దిగ్భ్రమలో, భ్రమ లాంటి నమ్మకంతో వుండే వాణ్ని.
చనిపోయినప్పుడు ఆయన వయసు 57 ఏళ్లు. అసలు లోకానికి ఏమీ చెయ్యని వాళ్ళు నూరేళ్ళు బతుకుతున్న పాడు కాలంలో అలాంటి వాళ్ళ ఆయుషు అంతా నాన్నగారికి వచ్చేస్తే బాగుండు అని స్వార్ధంగా, క్రూరంగా అనుకుంటూ వుండే వాణ్ని చాలా కాలం! నా స్పృహా, నా చైతన్యం, నా చదువూ అన్నీ బిక్కచచ్చిపోయిన ఆ మరణానంతర విషాద కాలంలో!
కానీ, మృత్యువుకి నా ఉద్వేగాలేవీ లేవు, తెలియవు కూడా !
అది మనిషిని వొకానొక జ్ణాపకంగా మాత్రమే మిగిల్చే కరకు వాస్తవం!
*
నాన్నగారిని తలచుకోగానే ముత్యాల కోవలాంటి ఆయన తెలుగక్షరాలు గుర్తొస్తాయి నాకు.
చిన్నప్పటి మా బడి గోడ మీద వొక దినపత్రిక సైజులో నాలుగు పేజీల గోడ పత్రిక “మధురవాణి” గుర్తొస్తుంది. ప్రతినెలా బడిపిల్లల కవితలూ, కథలూ, చిరు వ్యాసాలతో ఆ నాలుగు పేజీలను ఆయనే స్వహస్తాలతో రాసేవారు. ఆ పత్రిక గోడ మీద అతికించిన రోజు మా అందరికీ పెద్ద పండగే! నాలుగో తరగతి నించి పదో తరగతి పిల్లల దాకా ఆ పత్రికని ఆసాంతం చదివే వారు. అంతే కాదు, ఆ పత్రికలో తమ పేరు చూసుకోవాలని ఉత్సాహపడే వాళ్ళు. స్కూల్ లో నాన్నగారికి ఎంత పేరుండేదంటే – ఆ రోజుల్లో “కౌముదీ పిక్చర్స్” బానర్ కింద వచ్చే సినిమాలన్నిటికీ నాన్నగారే కథలూ, కవిత్వం రాసేవారని వాళ్ళు అనుకునేవాళ్ళు. “అబ్బే అది నేను కాదురా!” అని ఆయనెంత చెప్పినా వాళ్ళు వినే వాళ్ళు కాదు. వాళ్ళకి రచయిత అన్నా, కవి అన్నా ఆయనొక్కరే! చిన్న వూళ్లలో వుండే పెద్ద నమ్మకాల్లో ఇదీ వొకటి! నాన్నగారు ఇంకా వివరించబోతే, “లేకపోతే, ఆ సినిమా వాళ్ళు “కౌముది” అని మీ పేరెందుకు పెట్టుకుంటారు సార్!” అనే వాళ్ళు.
కౌముది అనే పేరుతో అప్పటికి నాన్నగారి నవలలు రెండు వెలువడ్డాయి. ఒకటి: కళంకిని, రెండు: విజయ. సుంకర, వాసిరెడ్డితో కలిసి ఆయన అనువదించిన ‘రంగభూమి” విశాలాంధ్ర వాళ్ళు అనేక ఎడిషన్లు వేశారు. విశాలాంధ్ర, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో ఆయన కవిత్వమూ, కథల అనువాదాలు ఎక్కువగా వస్తున్న కాలం అది. అభ్యుదయ రచయితల సంఘం ఖమ్మం జిల్లా శాఖకి ఆయన అప్పటికే అధ్యక్షులుగా వున్నారు. కమ్యూనిష్టు పార్టీ వారి ఆంధ్రప్రదేశ్ యువజన సమాఖ్య వారి పత్రిక “యువజన” ని సాహిత్య పత్రికగా తీర్చిదిద్దిన సంపాదకవర్గంలో ఆయన వున్నారు.
చింతకాని ఖమ్మం జిల్లాలో చాలా చిన్న వూరు. పాసింజరు బండి దిగి అయిదు మైళ్ళు నడిస్తే కానీ, అసలు వూరు రాదు. కానీ, ఆ చిన్న వూరే ఆయన సాహిత్య కేంద్రం అయ్యింది. మా ఇల్లు నిత్యం రచయితలూ, కవుల రాకపోకల్తో సందడిగా వుండేది. ప్రతి నెలా ఎవరినో వొకరిని పిలిచి బడిలో ప్రసంగాలు ఇప్పించే వారు నాన్న. అలా దాశరథి, పెద్దిభొట్ల, హీరాలాల్ మోరియా, కవిరాజమూర్తి ఇలా ఎందరో నేను నాలుగో తరగతిలో వుండగానే ముఖాముఖీ తెలుసు. వాళ్ళ పద్యాలూ, కథలూ మా పిల్లలందరికీ కంఠోపాఠం.
ఉపాధ్యాయ వృత్తిని కేవలం ఉద్యోగంగా ఆయనెప్పుడూ భావించలేదు. ఆయన పేరుకే హిందీ పండిత్ గానీ, తెలుగు, ఇంగ్లీషు పాఠాలు కూడా చెప్పేవారు. వొక్క లెక్కలు తప్ప అన్నీ చెప్పే వారు. ఆ రకంగా విద్యార్ధులందరికీ అందుబాటులో వుండే సార్ అనే పేరుంది. ఏ విద్యార్థి ఎప్పుడు వచ్చినా సమయం చూసుకోకుండా పాఠం చెప్పడానికి సిద్ధమయే వారు. ఆ రకంగా చాలా మంది విధ్యార్ధులకి మా ఇల్లు, మా ఇంట్లో పుస్తకాలు అన్నీ మావే మావే అనే భావం వుండేది.
అప్పట్లో బడిపంతులు అంటే ఇప్పటి మాదిరి పెద్ద జీతాలు లేవు. బతకలేని బడిపంతులు అన్నది నిజం! పైగా, మాది పెద్ద కుటుంబం. అమ్మ తెల్లన్నం వండిందీ అంటే ఆ రోజు పండగో పబ్బమో అయ్యి వుండాలి! లేకపోతే, జొన్నన్నం, గోంగూర పచ్చడే రోజూ! లేదంటే, సజ్జ రొట్టెలు! ఇక కొత్త బట్టల జత ఏడాదికి వొకసారి. చాలా కష్టంగా గడిచేవి రోజులు. కానీ, ఇంట్లో ఏదో వొక ఉత్సాహం నిరంతరం తరగలెత్తినట్టుండేది. చుట్టూ బోలెడు పుస్తకాలు, ప్రతి వారం ఎవరో వొకరు చుట్టాలు, స్నేహితులు ఇంట్లో అతిధులుగా వుండే వాళ్ళు. కబుర్లూ, కథలూ, పాటలూ...హోరెత్తినట్టుండేది ఇల్లు. మేం పట్టణం అంటే ఖమ్మం వెళ్ళే దాకా ఆ ఉత్సాహం అలా కొనసాగింది.
*
చింతకాని నా బాల్యానికి పునాది. నాన్నగారి యువకోత్సాహానికి సంబరం. కవిత్వంలాగా బతకడం అంటే ఏమిటో తెలిసినట్టే వుండేది ఆ కాలంలో అంత పేదరికంలో కూడా!
కానీ, తెలియని వొక దుఖం ఏదో ఆయన లోపల వుండేదనుకుంటా. మారని సమాజం పట్ల ఏదో అసంతృప్తి, ఏదో చేయాలన్న తపన! బడిని గుడిగా మలుచుకొని అదే ధ్యాసగా బతకడంలో ఆయన ఆ దుఖానికి విముక్తి కనుక్కున్నట్టు అనిపించేది.
జీవితం అనే కావ్యంలోసగం వృధసగం వ్యధ..అని ఆయన ఒక కవితలో రాసుకున్నారు. ఆయన వచనంలో ఆయన నికార్సయిన మార్క్సిస్టు, కానీ కవిత్వంలోకి వచ్చే సరికి ఆయనలోని కాల్పనికుడు ఆ మార్క్సిస్టుని దాటుకుని వచ్చేవాడు. ‘రచయితకి స్వేచ్చ వుండాలి, ఎంత కమ్యూనిస్టు అయినా!” అనే వారు ఆయన.
అనేక సంవత్సరాల పాటు పార్టీ కోసం బతికి, సర్వస్వం పార్టీకి ధారపోసి, తన కోసం ఏమీ మిగుల్చుకోలేదు నాన్నగారు.
పార్టీ చీలిపోయాక క్రుంగదీసిన నైరాశ్యంలోంచి బయట పడేసరికి ఆయన నిరుద్యోగి. ఆయనే రాసుకున్నట్టు “చిరుద్యోగి, పోనీ, దురుద్యోగి సైతం కాలేని నిరుద్యోగి.” అప్పుడు ఆయనకి హిందీ అనే గడ్డిపోచ దొరికింది. అది పట్టుకుని అలహాబాద్ హిందీ మహావిద్యాలయానికి వెళ్ళి, అక్కడ చదువుకొని, వెనక్కి వచ్చి ఆయన హిందీపండితులుగా చేరారు. అలా ఆయన ఉద్యోగంలోకి కుదురుకునే సరికి నేను నాలుగో తరగతిలో వున్నా. అప్పటికి బడికి పంపే స్తోమతు లేక నన్ను ఉర్దూ క్లాసులకి పరిమితం చేసింది మా అమ్మ. ఆ విధంగా నేను నాలుగో తరగతి దాకా తెలుగు అక్షరముక్క తెలీకుండా పెరిగాను. నాలుగో తరగతి తెలుగు బడిలోకి వచ్చేసరికి నాకు కష్టాలు మొదలయ్యాయి. తెలుగు రాదు, ఉర్దూ మీద మమకారం పోదు. బడిలో అందరూ ఏడిపించడం మొదలెట్టారు. నాకు కచ్చపుట్టింది. మా నాన్నగారి రాతని అనుకరించడంతో నా తెలుగు మొదలయ్యింది. ఆయన నెల రోజులలో నాకు వోనమాలు నేర్పించి, రెండో నెలలోకి వచ్చే సరికి చిన్న కథలు చదివించడం మొదలెట్టారు. ఏడాది తిరిగే సరికి నేను పెద్ద పుస్తకాలు చదవడం మొదలెట్టాను. శ్రీ శ్రీ కవిత్వాన్ని ఇంటా బయటా పాటల కింద మార్చేసి హోరెత్తించే వాణ్ని. అది చూసి, మా హెడ్మాస్టర్ “అరె, ఈ జన్మలో నీకు తెలుగు రాదనుకున్నాను రా! మొత్తానికి సాధించావ్!” అనడంతో నా గర్వ పతాక ఎగిరింది బడిలో!
కానీ, అదంతా నా గొప్పతనం కాదు, పాఠం చెప్పడంలో నాన్నగారి నేర్పరితనమే తప్ప!
“సార్ క్లాసులో ఒక్క సారి చెప్పిన తరవాత షెల్లీ పద్యమయినా నోటికి వచ్చేస్తుంది, పెద్దన పద్యమయినా బట్టీ కొట్టినట్టు వుండిపోతుంది ” అని బడిలో విద్యార్ధులు అనే వారు. అందులో ఆశ్చర్యమేమీ లేదు. ఆయన రాస్త్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా వరసగా అయిదుసార్లు అవార్డులు గెలిచి, తరవాత రాష్ట్రపతి అవార్డు అందుకున్నారు. చివరి రోజుల్లో “అక్షరదీపం” పట్టుకుని మారుమూలల పల్లెలకి వెళ్ళి పాఠాలు చెప్పేదాకా వెళ్లింది ఆయన తపన. చివరికి ఉపాధ్యాయ వృత్తి కోసం తనలోని రచయితని వదులుకున్నారు. ఆయన తరవాతి కాలంలో రాసిన రచనలు కూడా “అక్షరదీపం” వాచకాలూ, కథలూ, పాటలు మాత్రమే!
“నేను ఎప్పటికీ పాఠకుడిని మాత్రమే. చదవడంలో వున్న ఆనందం నాకు రాయడంలో లేదు. అయినా నేను ఉపాధ్యాయుడిని, అంతే! ఈ రోజు పాఠాలు బాగా చెబితే ఆ రోజుకి నా కల తీరినట్టే, నా లక్ష్యం నెరవేరినట్టే!” అనే వారు ఎప్పుడూ. కానీ, తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఇంగ్లీషు, అరబ్బీ, ఫారసీ భాషలు చదువుకొని, వాటి సాహిత్యాలని ఆపోసన పట్టిన నాన్నగారు, ఒక మారుమూల పల్లెలో బడిపంతులుగా వుండి, జాతీయస్థాయిలో రచయితలతో స్నేహాలూ, ఉత్తరప్రత్యుత్తరాలూ నడిపిన నాన్నగారు…జీవితాన్ని వొక అక్షర ఉద్యమంగా మలుచుకున్న నాన్నగారు...ఇప్పటికీ, ఎప్పటికీ మరణశయ్య మీద ఆయన్ని వూహించలేను!
ఆయన చివరి డైరీలో రాసుకున్న ఈ వొక్క వాక్యం ఎప్పటికీ నా మనసులో వెలుగుతూ వుంటుంది:
“అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు”
*
కౌముది అనే పేరు ఆయన ఎందుకు పెట్టుకున్నారు తెలియదు. ఆయన అసలు పేరు షంషుద్దిన్, అంటే సూర్యుడు అని. దానికి పూర్తి వ్యతిరేకంగా ఆయన చంద్రకాంతిని ఆశ్రయించి “కౌముది” అని పెట్టుకున్నారు.
ఆయనంటే మహాకవి దాశరథికి చాలా ప్రేమ. “కౌముది” అన్న పేరంటే మరీ ప్రేమ. తరచూ ఉత్తరాలు రాసుకునే కాలంలో దాశరథి ఆయనకి ఇలా రాశారు :
“ఖమ్మంలో ఎండలు మండిపోతున్నాయని విన్నాను. కానీ
రేయెండ మీరుండ
నీరసించు మండుటెండ”
రేయెండ అంటే రాత్రి కాసే ఎండ అనీ, కౌముది అనీ వేరే చెప్పకర్లేదు కదా!
14 comments:
Some people in life are always a part of you. Even though you miss them, u never lose them. Becoz you always find the memories of time spent with them still living in you
మీ నాన్నగారు శారీరకంగా మీకు కనపడకున్నా ఎప్పుడూ మీ మనసులోనే మీతోనే ఉన్నారుగా..
మీ నాన్న గారి గురించి తెలియకపోయినా .. మీరు రాసిన పోస్ట్ నన్ను కదల్చి వేసింది ..
మీ నాన్న గారు శారీరకంగా లేకపోయినా మానసికంగా మీకెప్పుడు తోడుగా నీడగా ఉంటారు ..
నాన్నగారు మరణించలేదు మీ జ్ఞాపకాల్లో జీవించే ఉన్నారు ! ఉంటారు !
వా[.,
"కౌముది" అన్న పేరు వినటమే తప్పించి మీ నాన్నగారి గుఱించి కానీ ఆయన రచనల గుఱించి కానీ తెలియని అజ్ఞానిని. ఐదు సార్లు ఉత్తమోపాధ్యాయునిగా బహుమతినందుకుని రాష్ట్రపతి పురస్కారం దాకా వెళ్ళటం బహుధా స్ఫూర్తిదాయకం... ముఖ్యంగా మంచి ఉపాధ్యాయుడిని కావాలని తపించే నాకు, అమెరికాలో నివసిస్తున్నా తెలుగు భాషావికాసానికి పరిశోధనాస్థాయి బోధనతో తోడ్పడుతున్న మీకు, మన లాంటి మఱింకెందఱికో!
వ్యాసాన్ని పంచుకున్నందుకు నెనర్లు. అంతటి స్ఫూర్తిదాత మరణమెల్లప్పటికీ కృంగదీసేది కాబోదు... ఆ తపనలో నుంచి ఒక ఆర్తి, ఒక స్ఫూర్తి పుట్టుకువచ్చాయనే నా నమ్మకం.
'రంగభూమి'అనువాదకులలో కౌముది గారు ఒకరనే విషయం ఎందువల్లనో నేను గమనించలేదు. బహుశా అనువాదకులెవరో చూడకుండా పుస్తకం చదివి వుంటాను. గొప్ప నవల, చక్కని అనువాదం. అఫ్సర్ నీ అక్షరాలలో నాన్న గారి బొమ్మ తడి తడిగా చాల గొప్పగా వుంది. “అనుభవమే చివరి వెలుగు. ఈ క్షణమే చివరి క్షణం. ఆ వొక్క క్షణమూ సదామణి సదృశ జ్వాలగా వెలుగు”. ఒక్క క్షణం, సదా మణి. ఇది అర్థమైతే; దుఃఖం, ఎంత దుఃఖమైనా ఎంత అనవసరమయ్యేదో.
అఫ్సర్ గారూ షంషుద్దీన్ అంటే సూర్యుడు,,,,,కౌముది అంటే చంద్ర కాంతి అన్నారు మీరే.....పగలూ రాత్రి ప్రతీ నిమిషం, ప్రతీ క్షణం మీ నాన్నగారు అలా మీ జ్ఞాపకాల్లో సదా మీతో ....హెచ్చార్కె గారన్నట్టు మీ అక్షరాల్లో మీ నాన్నగారి బొమ్మ తడి తడిగా చాలా గొప్పగా ఉంది.
నేనేమీ రాయలేకపోతున్నా సర్.. సారీ
అఫ్సర్ గారు....మీ నాన్న గారి జ్ఞాపకాలలొ తడిసిపోయి కాసేపు ఈ లోకాన్ని మరిచిపోయారేమో అనిపించింది .... చిత్రం ఏమిటంటే, మీ వ్యాసం చదువుతూ నేను కూడా అలాంటి అనుభూతికే లోనయ్యా ...వొకరిని తక్కువ చెయ్యడం అని కాదు గాని, ఎంతయినా సాహిత్యం అమ్మకు ఇచ్చినంత precious place నాన్నకు ఇవ్వక పోవడం అన్యాయం అనిపిస్తుంది అప్పుడప్పుడూ ......ఇంతకు ముందు కూడా 'మీ నాన్న గారి జ్ఞాపకాలని వొక ధారావాహికగా వ్రాస్తే బాగుంటుందని వొక కామెంట్ పెట్టినట్టు గుర్తు....ప్రయత్నించండి ....
మిత్రులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు...
కోడూరి: మీ సూచన గురించి - రాయాలని వుంది కానీ, అందులో వున్న ఉద్వేగ తీవ్రతని తట్టుకోలేక ఆగిపోతున్నాను. మరీ దగ్గిర విషయాలు మరీ ఎక్కువ సార్లు రాయలేమనుకుంటా. అయినా, ప్రయత్నించాలి.
Afsar garu,
Thanks to inspiring teachers Story. I will share with others and connect with others.
జ్ఞాపకంగా మారిన వాస్తవాన్ని, అక్షరంగా మార్చడంలో,.
మీ శైలి గొప్పగా వుంది సార్, మీ నాన్న గారిని నాలాంటి ఉపాధ్యాయులకు స్ఫూర్తిగా నిలిపారు,ధన్యవాదాలు..
A great personality whom we never forget ever.Ialso had a little friendship with your family while you were at KHAMMAM.AFSAR LIFE MOVES ON.MAY HIS SOUL REST IN PEACE AND BLESS US.
No,morewords
Post a Comment