Friday, August 27, 2010

ఒక నేను వెళ్లిపోయింది

వొక జీవిత కాలం తరవాత, నాన్నా
నువ్వు అర్ధం అవుతున్నావ్ నెమ్మదిగా.

అతి నెమ్మదిగా

ఆగిపోయిన వేడి నిట్టూర్పులాగా
సాయంత్రపు గూటిలో ఆరిపోవడానికో
పారిపోడానికో నిరాకరించే గుడ్డి దీపంలాగా.


వందల వుదయాలు
ఇంకా కొన్ని వందల సాయంకాలాలు
సడి సేయని కొన్ని రాత్రులూ స్నేహరాహిత్యపు నడి రాత్రులూ

ద్రవించని చీకటి పగళ్ళూ

నేర్పలేని బతుకు పాఠం ఏదో
కొత్త పేజీ తిప్పుతోంది ఈ పూట


నువ్వు పూర్తిగా నా కంటిలోంచి జారిపోయాక
ఈ ఇల్లు నీ అనంతర నిశ్శబ్దపు నదిలో
పొగిలిపోతున్న పడవ.


నువ్వు వెళ్ళాకనే
నీ తలాపు దీపపు నీడలోనే

నిన్ను నిజంగా చూస్తున్నానేమో నేను.


ప్రేమించాల్సింది బతుకునో
మరణాన్నో తెలియక
వొక నిట్టూర్పు నిట్టాడి మీద
నిటారుగా వొరిగే గుడిసె నేను.


మరణం ఎప్పుడూ వో కొత్త పాఠమే !

అదే పేజీ మీద
అదే ఈగ
అదే నెమలీక
అదే పునరుక్తి.


(నాయుడూ, ఇది మీ నాన్న కోసమే అని చెప్పలేను, నా కోసమే అనీ అనుకుంటాను, ఎప్పుడో రాయాలనుకొని రాయలేకపోయిన రామ్ కోసం అని కూడా అనుకుంటాను.)

Thursday, August 26, 2010

చార్మినార్ సూర్యుడికి ఎదురుగా...

వొక సీతాకోక చిలక
ఆత్మహత్యకి ముందు విడిచి వెళ్ళిన
కోకల రంగులు
రోడ్డు మీద మెరుస్తూ కనిపిస్తాయి


వెయ్యి మందికిపైనే
ఈ రోడ్డుని తొక్కి వెళ్ళిపోయారు
ఎవరికెవరూ కనిపించకుండా.


వొక మధ్యాన్నం
చార్మినార్ సిగ మీద సూర్యుడు
తెల్ల బంతి పువ్వై నవ్వుతున్నప్పుడు
కాసేపు అతని వొకానొక చూపులోకి
నువ్వూ ప్రయాణించు.



అంత కష్టమేమీ కాదు
కణ కణ నిప్పుల కొలిమిలోకి
వొక కన్నుని వొంపి
అనేక చూపుల ద్రవాన్ని
బయటికి లాగడం!


వొక సీతాకోక చిలక
తన రంగులన్నీ మరచిపోయి
నలుపులోకి నిష్క్రమించింది
ఈ మలుపు దగ్గిరే.



ఇక్కడి నించి
జీవితాన్ని చూడు

అదెలా కనిపిస్తూ వుందో
కాస్త చెప్పు.

ఇప్పటి దాకా నడుస్తూనో
పరిగెత్తుతూనో వెళ్ళిన ఆ వెయ్యి మంది

కనీసం


వెయ్యి అబద్ధాలు చెప్పారు
అమాయకంగానే!

Tuesday, August 24, 2010

సంధ్యా వందనము

( మూలం- అఫ్సర్
- అనువాదం- గన్నవరపు నరసిం హ మూర్తి )


పిలువ రాదె నిన్ను పెందలకడ వేళ
చెవిటి చెవుల లోన చేసి రొదలు
శ్వాస విడచి నీదు మూసిన కళ్లందు
చాలు నిద్ర యనుచు మేలుకొనవె

ప్రాత విడుపు గాదె ప్రత్యూష వేళందు
కాళ్ళు ముఖము కళ్ళు కడుగ జలము
సంధ్య వేళ శృతులు స్మరణ చేయగ బూన
నొక్క దిక్కు కేల మ్రొక్కు లీయ


ఒక్కటొక్క టంచు నొక్కయు దిక్కేల
ద్రవము నౌట నాదు దర్శనంబు
పాఱు నన్ని దిశల ప్రాజ్ఙత గలిగుండి
పవన రీతి నాదు ప్రార్ధనంబు

ప్రొద్దు పొడుచు వేళ ముద్దు ముందటి మాట
మాపటందు గూడు మలిన మూడె
మొము వాయి పాడ మోహన రాగమ్ము
హృదయ తమ్మి విచ్చె ఉదయ మందు


పిలువ రాదె మఱల పెందలకడ వేళ
తర్పణంబు జేసి తపము జలము
ఇంద్రియమ్ము లందు నిమ్ముగా నొలికించి
చక్షురాశి తెరుమ సంధ్య వేళ

శున్య మావరించె సుందర జగతంత
పిలువ రాదె నిన్ను వేకు వందు
చెవులు చిల్లు పడగ చేయుచు ప్రార్ధన
వింధ్య వోలె వంగి సంధ్య వేళ

(original in English: see www.afsarpoetry.blogspot.com)

Saturday, August 21, 2010

యిక్కడేదో వొక జాంచెట్టు...

1

యెవ్వరికీ చెప్పలేదు

కానీ యిక్కడ నేన్నిల్చున్న చోట
వొక జాంచెట్టు పెరుగుతూ వుండేది అనాథలాగా.
గాలీ, ఆకాశం, సూర్యుడూ దాన్ని అతి ప్రేమగా పెంచేవి యెవ్వరికీ తెలీకుండా !

2

పొద్దున్న నిద్రమొఖంతో మబ్బు కళ్ళతో
దాని ఆకుల్లోకి తీక్షణంగా చూసి
దాని కొమ్మల్లోంచి రాలిపడే కిరణాల్ని కళ్ళలోపల దాచుకొని
పొద్దుటా, మధ్యాన్నం, రాత్రి పూటా ఆ వొకే వొక్క జాంచెట్టు దాని నీడ నేనయ్యానో అది నా నీడ అయ్యిందో?!

3

దాని లేలేత వగరు ఆకుల్ని అప్పుడప్పుడూ నవుల్తూ
దాంతో మాట్లాడ్తున్నట్టొ, పోట్లాడ్తున్నట్టో
అన్ని వయసుల యేడేసి రంగుల్లో దాంతో ఆడ్తూనో,
రాయని ప్రేమ లేఖల్ని దాని జడ పాయల్లో దాస్తూనో దాపరికాలు లేవు యిక్కడికొచ్చాక.
పరాయి క్షణాల్లేవు యీ గడియారంలో.

4

యెవ్వరికీ చెప్పనయితే లేదు
కాని యిక్కడ నేను కూర్చున్న చోటే
యీ అరుగు మీద జీవితాన్ని గురించి
బేఫికర్ గా బేఖాతర్ చేస్తూ
రాత్రిని పగల్లాగా, పగటిని రాత్రిలాగా మార్చి మార్చి చూసుకొని లేనిపోని తకరార్లు పడి,
ఆరునూర్లయ్యి ఆరు కాలాల వర్ణ వివర్ణ దృశ్యాలన్నీ మారి
చివరికి యెవరికెవరు మారామో తెలీదు కానీ
యిప్పుడీ క్షణం ఆ చెట్టు వొక అజ్నబీ!


వొక జ్నాపిక : “ ఈ జాంచెట్టుని పెళ్ళగించి, ఇంకో చోట నాటగలవా?” - అని అడుగుతుంది సయీద్ అఖ్తర్ మీర్జా సినిమా ‘నసీమ్ ‘( 1995) లో వొక ప్రధాన పాత్ర. ఆ జామ చెట్టు భారతీయ ముస్లిం అస్తిత్వానికి వొక ప్రతీక.













































































































































































































యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం!

యింతే! ఆ క్షణానికి గెల్చిన అప్పటి ఆటలు ఇప్పుడు వోడిపోతాం.


1

బయటి కన్ను మూసుకున్నప్పుడు లోపలి కన్ను వెలిగించుకొని
లోపలి కన్ను మసకేసినప్పుడు బయటి కన్ను దీపం పెట్టుకొని
వొళ్ళంతా తడుముకొని వెతుక్కున్నట్టు చెట్టు
నన్ను నిలువెల్లా జల్లెడ పడ్తుంది,
నన్ను యెట్లయినా నన్నుగా రాల్చాలని!

2

అననైతే అన్లేదు గాని యిన్నాళ్ళ యిన్నేళ్ళ నిశ్శబ్దం తరవాత వొక చెట్టూ వొక నిలువెత్తు మనిషీ కుప్ప కూలిపోతున్నట్టే వుంది కళ్ళ ముందర!

3

వెతుక్కుంటూ వెళ్తే యిప్పుడిక్కడ ఏమీ లేదు కాని వొక మిగుల పండిన జాంపండు వాసన వొంటికంతా అంటుకున్న నిప్పు.

4
మాగన్నుగా నిద్దరోతున్న లోపటి వొళ్ళు
దాని గడ్డ కట్టిన నిద్రా హిమవత్పర్వత లోఅరణ్యం
నిప్పు గుండం.

5

నిద్ర మీంచి నిప్పుల నడక వొకే వొక్క మెలకువ యిప్పుడీ వొళ్ళు లోతైన వేళ్ళ గాయం! 2006
*

Thursday, August 19, 2010

హైదరాబాద్: కొన్ని వానలూ కొన్ని చలి గాలులూ!





1
ఇక్కడ సాయంత్రం ఏనాడూ లేదు కాబట్టి
ప్రతి నిద్రలో
వొక సాయంత్రాన్ని కలకంటాను ఇప్పటికీ.


చెట్లకి నీడలు చెరిగిపోయాక
ఆకాశం ఎండనంతా ఆరేసుకున్నాక
ఒక చలి గాలిని కప్పుకొని


ఏదో ఒక సాయంత్రం
చీకటి పడేలోగా
గూడులోకి రెక్కలు ముడుచుకోవాలి.


2


వాన మధ్యాన్నమే మొదలయ్యిందో
పొద్దుటి నించీ పడుతూందో తెలీదు
మధ్యాన్నం మొదలయ్యే బతుక్కి
ఉదయాలూ తెలియవు.


మధ్యాన్నం లేచే సరికి
గడియారం మోగీ మూల్గీ
విసుక్కుంటూ వుంటుంది.
కాలాన్ని
తిరగేసి చూడడం అలవాటే!


3

వానలూ చలికాలాలూ

వాటి భ్రమణ కాంక్షల్ని చంపుకున్నాక

మొలిచిన అష్టావక్ర .



4

హైదరాబాద్ నా రూపాంతరం


వొక కల లేని నిద్ర
నిద్ర రాని కల

- కునుకు కప్పుకున్న మెలకువ.

Monday, August 16, 2010

తెలంగాణా కథ గురించి మళ్ళీ...!






ప్రాంతం/ ప్రాంతీయత తెలుగు కథకి ఇవాళ కొత్త అంశాలు కావు. తెలుగు కథ పుట్టినప్పటి నించీ "ప్రాంతం" ఆ కథకి పునాది. ప్రాంతం నేపధ్యం లేకుండా తెలుగు కథ ఏ నాడూ లేదు. కాని, ప్రాంతాన్ని వొక దృక్పథాంశంగా తీసుకోవడం గత మూడు దశాబ్దాలుగా తెలుగు కథా నిర్మాణంలో, కథా సాహిత్య విమర్శలో కనిపిస్తున్న మార్పు. ఈ మార్పుని మరింత నిర్దిష్టంగా నిర్వచించడానికీ, లేదా, వివరించడానికీ "ప్రాంతం" "ప్రాంతీయ వాదం" అనే రెండు భావనల్ని చర్చించి, ఈ కొత్త "ప్రాంతీయ వాద" చర్చలో తెలంగాణా కథ స్థానాన్ని అంచనా వెయ్యడం ఈ వ్యాసం వుద్దేశం. అయితే, ప్రాంతీయ వాదం అనే భావనకి ఇంతకు ముందే తెలుగు సాహిత్య, సామాజిక రంగాలలో వొక చట్రం నిర్మితమయి వుంది కాబట్టి, ఆ పదానికి బదులు "స్థానికత" అని కొంత విస్తృతార్ధంలో వుపయోగించాల్సిన అవసరం వుంది.
ఇవాళ ప్రాంతం పేరుతో తెలుగు కథకులు చర్చలోకి తీసుకు వస్తున్న అంశాలు అవి ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, కొత్తగా ప్రపంచీకరణ పేరిట వస్తున్న ఆర్ధిక, మార్కెట్, అంతర్జాతీయ రాజకీయ ప్రేరిత భావనల్ని యెదుర్కోవాలన్న ప్రతిఘటన వాంచ స్థానిక కథకులలో కనిపిస్తోంది. తెలుగు కథ ఇప్పటి దాకా సాగించిన నూరెళ్ళ ప్రయాణానికి, ఇప్పుడు రెండో వందలో సాగించబోతున్న కొత్త ప్రయాణానికి కొత్త పునాది మరీ ముఖ్యంగా ఈ పదేళ్ళ కథల్లో వుంది. ప్రాంతీయ అసమానత అనే అంశమే ఈ కొత్త శతాబ్ది ప్రయాణానికి కెంద్ర బిందువు అయినప్పటికీ, తెలుగు కథ ఆ పరిమితిని దాటి, "స్థానికత"ని బలంగా తీర్చి దిద్ది, ప్రపంచీకరణని సవాలు చేయబోతున్నదని ఈ వ్యాసంలో నా ప్రధానమయిన వాదన. అసమానత అనే భావనని కొత్త సందర్భం నించి అర్ధం చేసుకొవాల్సిన అవసరం వుంది. ప్రాంతీయ అసమానత అనేది ప్రాంతానికి మాత్రమే పరిమితంకాదు, ఆ ప్రాంతంలో వుండే ఇతర అసమనాతల్ని కూడా సమంగా చూడక తప్పదు. తెలంగాణలో దళిత స్త్రీవాదులు, ముస్లిం రచయితల కథల్లో ఈ కొత్త అసమానతల కోణాలు మనం చూడ వచ్చు.
ప్రాంతం నించి ప్రాంతీయ అసమానతల్ని ప్రతిబింబించేంత దూరం దాకా సాగిన తెలుగు కథా ప్రయాణం కూడా చిన్నదేమీ కాదు. మొదటి తెలుగు కథ ఎవరు రాశారన్న వివాదం కొంచెం పక్కన పెడితే, ఆధునిక తెలుగు కథకి వొక నిర్దిష్టమయిన ఆకృతినీ, చెలామణినీ తీసుకు వచ్చిన గురజాడ వొక ప్రాంతాన్ని ఎన్ని కోణాల నించి చూపించ వచ్చో అన్ని కోణాల్నీ కథల్లో చూపించాడు. వొక నిర్దిష్టమయిన స్థలాన్ని, కాలాన్ని, సమూహాల్ని సన్నిహితంగా అధ్యయనం చేయడం ద్వారా సమకాలీన చరిత్రనీ, సంస్కృతినీ సునిశితంగా అంచనా వేసే ఆధునిక ఆంథ్రొపాలజిస్టులకూ, ఇథ్నాగ్రాఫర్లకూ అవసరమయిన సమగ్ర సమాచారంతొ పాటు, ఆ స్థల కాలాల్లోని వివిధ సమూహాల భావోద్వేగాల చరిత్ర సమస్తం గురజాడ కథల్లో వుంటుంది. (ఉదాహరణకి: "దేవుళ్లారా! మీ పేరేమిటి?") వలస పాలనకీ, ప్రాంతీయ అధికార శక్తులకూ మధ్య స్థానిక జనం ఎంత రాపిడికి గురయ్యారో, ఆ రాపిడి లోంచి కొత్త అస్తిత్వాలు ఎలా పుట్టుకు వచ్చాయో ఆ కథల్లో చూడ వచ్చు. ప్రస్తుత తెలంగాణా కథా చర్చకి సంబంధించినంత వరకు కూడా ఈ కథలు ముఖ్యమయినవే. హైదరాబాద్ చరిత్ర, ముస్లిం సంస్కృతి, ఉర్దు ప్రభావాల గురించి ఇప్పటికింకా అపోహలు వున్నాయి.(ఉదాహరణకి: సెప్టెంబరు "ప్రాణహిత" వెబ్ పత్రికలో జాజుల గౌరి వ్యాసం చూడండి) తెలంగాణ స్థానిక చరిత్రలో ముస్లిం సంస్కృతి పాత్ర విడదీయలేనిది. దీనికి "పీర్ల పండగ" సూఫీ దర్గాలు వొక బాహ్య సంకేతం మాత్రమే. ఒక విశాల భావనగా ముస్లిం సంస్కృతి కట్టుదిట్టమయిన వొక సెక్యులర్ స్పేస్ ని నిర్మించింది. ఈ విషయం తెలంగాణ కథకుల కంటే వొక కళింగ కథకుడు గురజాడ ముందుగా సాహిత్యంలో రికార్డు చెయ్యడం మనం గమనించాలి. హిందూ జాతీయ వాదం, ముస్లిం వ్యతిరేక అంతర్జాతీయ వాదం వివిధ రూపాల్లో మన అస్తిత్వాల్ని ప్రభావితం చేస్తున్న సందర్భంలో తెలంగాణ స్థానికతలో, సామాజిక అసమానతల చర్చలో ఈ సెక్యులర్ భావనని తెలంగాణా కథకులు ఎలా అర్ధం చేసుకుంటున్నారో, తెలంగాణా బతుకులో సగ భాగమయిన ముస్లింలని కథల్లోకి ఎలా తీసుకువస్తున్నారో నిశితంగా చూడాల్సిన అవసరం గురజాడ కాలం కన్నా ఈ కాలంలోనే ఎక్కువ. ముస్లింలని సరిగా అర్ధం చేసుకోవడం ద్వారా మాత్రమే, మనం మన చుట్టూ వున్న స్థానికతని సక్రమంగా అర్ధం చేసుకోగలం. ఈ స్థానిక జీవన విధానం అర్ధం కానంత కాలం మనకి ఇందులో వున్న అసమానతలు బోధపడవు. గత పదేళ్ళుగా తెలంగాణా కథని దగ్గిరగా పరిశీలిస్తే, మన కథకులు ఈ కొత్త అసమానతల వాస్తవికతకి సమీపంగా వస్తున్నారని ఆధారాలు దొరుకుతాయి. ముస్లిం సమూహాల స్థానిక వేదన 'వతన్ 'లో వుంది. దళిత స్త్రీల సంఘర్షణకి 'నల్లపొద్దు ' ఆ తర్వాత ఆ రచయిత్రులు రాస్తున్న కథనాల్లో వుంది. గని కార్మికుల బాధల్ని తవ్విపోసే కథలు వున్నాయి. చేతివృత్తుల వారి కడగండ్లని, వూరి జనం చెదిరిపోతున్న బతుకుల్ని రాసే కథకులు ఈ అయిదారేళ్ళలో పెరిగారు.


అలాగే, తెలంగాణాతో పాటు ప్రాంతీయ అసమానతకి గురవుతున్న ఇతర ప్రాంతాలు కూడా వున్నాయి. ముఖ్యంగా, రాయల సీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు. ఆ ప్రాంతాల పట్ల ఎలాంటి వైఖరి వుండాలన్నది కీలకమయిన అంశం; అక్కడి కథకులు ఎలాంటి స్థానికత గురించి మాట్లాడుతున్నారో, ఎలాంటి అసమానతల్ని గురించి మాట్లాడుతున్నారో, వాటికీ తెలంగాణా స్థానికతకి పొంతన కుదురుతుందో లేదో బేరీజు వేసుకుంటే, తెలంగాణా స్థానికత మరింత తేట పడుతుంది. అసమానతల సారూప్యాలూ, భిన్నత్వాలూ స్థానికతని నిర్వచించడంలో, అర్ధం చేసుకోవడంలో సాధనాలు అవుతాయి. కమ్ముకు వస్తున్న ప్రపంచీకరణ, మార్కెట్ యుగంలో స్థానికత కేవలం వొక ప్రాంతానికి, వొక కులానికీ, వొక మతానికీ, వొక వర్గానికీ సంబంధించిన సమస్య కాదు, అందరి/అన్ని ప్రాంతాల ఉనికి సమస్య. మార్కెట్ వ్యూహ రచనలో మొదటి బలి పీఠాలు మన వూళ్ళు. పట్టణీకరణ కేవలం బాహ్య ప్రపంచానికి పరిమితం కాదు, పొడుగాటి గోడల షాపింగ్ మాల్ బయట వీధిలోనే కాదు, మనస్తత్వాల్నీ మార్చేస్తుంది. మీడియా మాయాజాలం కేవలం కనువిందు కాదు, మన ఆలోచనల దిశ మార్చేస్తుంది. ఈ స్తితిని ఇప్పటికే తెలంగాణా కథకులు కథల్లోకి తీసుకు వస్తున్నారు. కాని, ఈ స్థితి ఎలాంటి అసమానతల్ని కొత్తగా నిర్మిస్తుందో కథకులు ఇంకా పట్టుకోలేక పోతున్నారు. ఈ కొత్త పరిస్థితిని బట్టి ఆలోచిస్తే, 'ప్రాంతం' 'ప్రాంతీయ వాదం' అనే భావనలకు ఇప్పటికే ఏర్పడి వున్న చట్రాల వల్ల, ఆ పదాలు నిర్దేశించిన భావాన్ని బట్వాడా చెయ్యలేకపోతున్నాయి. కొండొకచో, సంకుచిత రాజకీయ పరిమితులు కూడా కొందొకచో అడ్డుపడుతున్నాయి. కాబట్టి, కొత్త కథకులు కొత్త ప్రశ్నలకు వెతుక్కుంటున్న సమాధానాలకు 'స్థానికత ' సరయిన/ ప్రత్యామ్నాయ వాడుక అనుకోవచ్చు.
("పాల పిట్ట" మాస పత్రిక నించి)
*

Saturday, August 14, 2010

పూర్తి కాని వాక్యాలు

ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం (జులై 6) లో అచ్చయిన కొత్త కథ-   1           మ రీ పెద్ద విలాసాలేమీ కోరుకోలేదు సబీనా. అన్నీ చిన్నచిన్న కోరికలే!   ...