సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా?! : చర్చకి ఆహ్వానం

"సింగిడి" కరపత్రం ఒక ముఖ్యమయిన విషయాన్ని చర్చకి తీసుకు వచ్చింది. ఈ ప్రకటన బ్లాగులో పెట్టినప్పుడు నా వుద్దేశం కేవలం కథ చుట్టూ జరుగుతున్న రాజకీయాలని చర్చించడమే. సింగిడి తెలంగాణ రచయితల సంఘం వారు లేవనెత్తిన ప్రశ్నలు నిజానికి చాలా వివాదాస్పదమయినవి. చర్చించదగినవి. కథలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పనిచేస్తాయన్నది వొక ముఖ్య విషయం అయితే, అసలు కథల ఎంపికలో ప్రాంతీయ రాజకీయాలు ఎలా పని చేస్తాయన్నది ఇందులో ప్రధాన చర్చ. నవీన్, శివశంకర్ ల "కథ" సంకలనాలు ఒక ట్రెండ్ని సృష్టించాయి. ఇవి ఎంత బలమయిన ముద్ర వేసాయో నేను నా విమర్శ పుస్తకం "కథ-స్థానికత" లో వివరంగానే చర్చించాను.

కానీ, తరవాతి కాలంలో "కథ" సంకలనాలు వాటి గౌరవాన్ని కోల్పోయాయని చెప్పక తప్పదు. వివిధ ప్రాంతాల రచయితలే కాకుండా, అసలు ఏ ప్రాంతానికీ చెందని రచయితలు కూడా కొంత కాలంగా కథ సంకలనాల మీద ఏదో వొక రకంగా నిరసన ప్రకటిస్తూనే వున్నారు, ఆ సంపాదకుల కథల ఎంపికని ప్రశ్నిస్తూనే వున్నారు.

సింగిడి లేవనెత్తిన ప్రశ్న ముఖ్యంగా అదే.

సింగిడి కరపత్రం మీద "అక్షరం"లో జరుగుతున్న చర్చలో చాలా మంది ఇతర అభిప్రాయాలు చెబుతున్నారు. ఇక్కడ వేరే ప్రశ్నలు కూడా పుట్టుకొస్తున్నాయి.


సంకలనం సంపాదకులకు కనీస అర్హతలు కొన్ని వుండాలన్నది ఇక్కడ చాలా మంది తమ వ్యాఖ్యల్లో వ్యక్తం చేస్తున్నారు. ఈ అభిప్రాయం రావడంలో తప్పేమీ లేదు. తెలుగులో సంకలనాలకి గొప్ప సాంప్రదాయం వుంది. చరిత్ర వుంది. కథ సంకలనాలు తీసుకువచ్చిన వారంతా మౌలికంగా రచయితలు, విమర్శ రంగంలో కృషి చేసిన వారు. ఇటీవలి కాలంలో ఈ సంప్రదాయం పోతోంది. ఎవరయినా సంపాదకుడు/ ఎడిటర్ కావచ్చు అన్న అభిప్రాయం వ్యాపిస్తోంది.


ఈ విషయం మీద చర్చ మొదలెట్టాలని చాలా మంది అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో సంకలనాల బెడద కూడా ఎక్కువయిపోయిందని కొందరు ఇతర బ్లాగ్మిత్రులు రుద్ర తాండవం చేస్తున్నారు. ఈ సందర్భంగా మాగంటి వంశీ లేవనెత్తిన ప్రశ్నలు కూడా చర్చించ దగినవి. ఈ చర్చలు సాహిత్య/ సాహిత్యేతర అంశాలని కూడా ప్రస్తావిస్తున్నాయి.

ఇప్పుడు ఒకే ఒక సూటి ప్రశ్న ఏమిటంటే:

సంకలనం ఎడిటర్లకి అర్హతలు వుండాలా? వుండాలి అనుకుంటే ఆ అర్హతలు ఏమిటి?

మీ జవాబులు క్లుప్తంగా రాయండి.


ఇక, ఈ వ్యాఖ్యలలో కొందరికి నా సమాధానాలు:


@నర్సింహ మూర్తి గారు;

ఎలా వున్నారు?

మీరన్నది నిజమే. కొంచెం వేడి వుంటే నష్టం ఏమీ లేదు. కానీ, ఇప్పటి దాకా కనీసం ఇరవై వ్యాఖ్యలు - అసభ్యత, అనాగరికం - అనుకున్నవి తీసేయ్యాల్సి వచ్చింది.

చాలా మంది ఒకే ఒక వాక్యంలో జిందాబాద్, వర్ధిల్లాలి, ముర్దాబాద్ అన్నట్టు రాస్తున్నారు. తెలుగు సాహిత్యంలో ఈ ఏక వాక్య విమర్శ విధానం పోవాలని నేను కోరుకుంటున్నా.

పైగా, ఇక్కడ నేను చర్చించాలనుకున్న విషయం వేరు. ప్రతిస్పందనలు వేరుగా వున్నాయి. వీటిని ఎలా అర్ధం చేసుకోవాలో నాకు తెలియడం లేదు. వ్యక్తుల మీద ఇంత బలమయిన ఇష్టానిష్టాలు వుంటాయా అని ఆశ్చర్యంగా వుంది.

7 comments:

కామేశ్వరరావు said...

అఫ్సర్ గారు,

చాలా "ఆసక్తికరమైన" చర్చాంశమే! అయితే నాదొక చిన్న సందేహం. ఈ చర్చలో పాల్గొనేవాళ్ళకి ఎలాంటి అర్హతలైనా ఉండాలా? అవసరం లేదా?

Anonymous said...

మంచి చర్చ ప్రారంభించినందుకు ధన్యవాదాలు. ఈ మద్య సంకలనాల మీద సంకలనాలు వచ్చి పడుతున్నాయి. జాతీయ స్థాయి నుంచి వాడ దాకా.

ఇందులో మంచి రచనలు వుంటున్నాయా అంటే అదీ లేదు. ఆశ్రిత పక్షపాతం, కుల మత వైషమ్యాలు, అభిరుచిలో అత్తెసరు సరుకు...ఇలాంటప్పుడు పాఠకులందరూ అడుగుతున్న ప్రశ్న ఇది.

అర్హతలు వుండాలి. కొన్ని ప్రమాణాలు వుండాలి. లేకపోతే, సాహిత్యం ఇంతకన్నా అధోగతికి దిగజారుతుంది. సాహిత్యాన్ని కొనే వాళ్ళు తగ్గిపోతారు.

పెద్దలే కాదు, ఒక మంచి పుస్తకాన్ని కొనాలనుకున్న ప్రతి ఒక్కరూ ఈ చర్చలో పాల్గొనడం బాగుంటుంది. నా మటుకు నేను సంకలనకర్త కి కొన్ని అర్థతలు వుండాలనీ అంటున్నాను. అక్కరలేదని మీరు అనగలరా?

గౌరి శంకర్ జూటూరి

శాయి రాచకొండ said...

అఫ్సర్ గారు,
మంచి చర్చనీయాంశం!
వచ్చిన చిక్కేమిటంటే, ఒక వైపు నించి అర్హతలని నిర్ధారించడం అంత సులభమైన పని కాదు.
రెండో పక్క మీడియా స్వతంత్రత, మీడియా అవకాశాలు విపరీత స్థాయిలో పెరిగి పోతున్నాయి. అవకాశం వచ్చినప్పుడు ఎవరు ఆగగలరు? ఎవరు ఆప గలరు? భైరవభట్ల గారు అడిగినట్లు, చర్చలో పాల్గొనేందుకు అర్హతలు కావాలా? ఈ విషయ ప్రపంచంలో ఎవరికీ తగ్గది వారు తీసుకోవడమే మిగులుతుందేమో!

prasadklv said...

WE CAN NOT IMAGINE AN EDITOR OF A BOOK OF ANY COMPILATION WITH OUT BASIC KNOWLEDGE OF THAT PARTICULAR FIELD.THAT IT SELF IS KNOWN AS "ARHATHA" OTHERWISE THER WILL NOT BE ANY QUALITATIVE AUTHENTICITY TO THAT
WORK.
SO ANY EDITOR OF PARTICULAR COMPILATION NEEDS SOME BASIC QUALIFICATION.

Anonymous said...

సింగిడి వీరులకి దండాలు...ఈ పాట అన్ని తెలంగాణా సభల్లో పాడవలెను...



ఎత్తి పోస్తే ఉయ్యాలో
చెత్త కాదోయ్ ఉయ్యాల
చెత్త కాదోయ్ ఉయ్యాలో
అది సంకలనమోయి జంపాలో...

ఏడాదికోసారి ఉయ్యాలో
చీదితే ముక్కు ఉయ్యాలో
ఉమ్మి కాదోయ్ ఉయ్యాలో
అవి కథల అలలోయ్ జంపాలో...

వాణ్ని పీకి వీన్ని పీకి ఉయ్యాలో
రాబట్టి చందాలు ఉయ్యాలో
వెయ్యాలోయ్ పుస్తకం ఉయ్యాలో
మొగాలోయ్ మన పేరే జంపాలో...

కథకో తద్దినము ఉయ్యాలో
చేద్దాము ఫూటుగా ఉయ్యాలో
కథల సొమ్ము ఒకడిది ఉయ్యాలో
సోకు మనదోయ్ జంపాలో..


సంపాదక సామ్రాట్టు ఉయ్యాలో
కొలువు తీరాడు ఉయ్యాలో
పుస్తకాల బొమ్మలు ఉయ్యాలో
కొలువు చేస్తాయిక జంపాలో...

- పేరడీ పేరన్న

సామాన్యుడు said...

ఉండాలన్నదే నా అభిప్రాయం. ఇంతవరకు మొత్తం తెలుగు ప్రాంతాన్ని రిప్రజెంట్ చేసిన నవీన్+పాపినేని ల కథా సంకలనాలు వచ్చే ఏడాదినాటికి అలా తేగలరా అన్న సందేహం ఓపక్కన. సాహిత్యంలో చోటుచేసుకున్న స్తబ్ధత వలన వచ్చిన వాటిలో మంచిగా అనుకున్నవి తేవడానికి ప్రయత్నించే విధంగాను, కొత్తదనాన్ని చూపించడానికి, పాఠకులను ఆలోచింప చేయడానికి పనికి వచ్చే విధంగా తేగలిగినవారుగా వుంటే చాలు. ప్రాంతీయవాదం, కుల, వర్గ దృక్పధాలతో, పేరున్న వారివి, దగ్గరి వారివి సంకలనాలలో చొప్పించడం వలన వాటి ప్రాముఖ్యతతో పాటు, అవసరం కూడా లేక అమ్ముడుపోని కట్టలే వున్న కొద్దిపాటి పుస్తక దుఖానాలలో దర్శనమిస్తున్నాయి. పాఠకునికి దగ్గరగా వెళ్ళే ప్రయత్నం చేయడానికి కృషి జరగాలి. వంద రూపాయలు ఖర్చు పెట్టి కొన్న పుస్తకం చదివేదిగా వుండాలనుకోవడం మన హక్కేగా సార్..

annavaram devender said...

Sankalanam sampadakulaku unda kudani arhathalu chepputha.kulala matha,linga,pranthala patla,kathala empikalo moggu chupakudadu.ee gadichina sankalanalu veetiki atheetham kavani nirupinchinayi.mukyanga telangana kathanu poorthiga anyayam chesindi.sapadakulaku sama drukpatham undale.
---Annavaram Devender

Web Statistics