అమెరికా తెలుగు కథకులలో సీనియారిటీకి చేరుకున్న కథకులు కలశపూడి శ్రీనివాస రావు గారు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ చలాకీ గా వుండే శ్రీనివాస రావు గారు కేవలం రచయితే కాదు, నలుగురికీ సాయపడాలన్న తపన వున్న వ్యక్తి. అక్షరం ముక్క రాయకుండా కూడా మహా సాహిత్యవేత్తల్లాగా వుపన్యాసాలు దంచుతూ, పరుల కోసం ఒక్క డాలరు కూడా ఖర్చు పెట్టకుండా మహా రాజ పోషకత్వం వహించే మహన్న భావులు కొల్లలుగా వున్న గంజాయి వనంలో అచ్చంగా తులసి మొక్క కలశపూడి. ఆయన విస్తృతంగా రాయకపోవడం మన దురదృష్టమే! శ్రీనివాస రావు గారి బ్లాగు :
http://sahityakalasam.blogspot.com/
1. అమెరికా వచ్చాక జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అవును చదువు, పని, బ్రతుకు ముప్పెటలా కలసి పోయి నాకు తెలియ కుండానే నన్ను ‘నేను’ గా తీర్చి దిద్దింది అమెరికా. దాని వలన జీవితం పట్ల నా దృష్టిలో మార్పు వచ్చింది.
2. ఆ మార్పు మీ రచనల్లో ఎలా వ్యక్తమయింది? వొకటి రెండు వుదాహరణలు ఇవ్వగలరా?
జీవితం పట్ల నా దృష్టిలో వచ్చిన మార్పు, ఆలొచనల్లొ విశాలత్వం ఆచరణలొకి అనువదిచడానికి సహాయం అవుతూ వచ్చింది. ఇప్పటివరకూ ప్రచురించబడ్డ నా 45 రచనలలో ( కథ, కవిత, గల్పిక, నాటకం, నవల, వ్యాసాలలో) ఈ విషయం పరిణామం చెందుతూ వచ్చింది. ‘ మీ ఆవిడని కొట్టారా ?’ కథ లో ఒక పాత్ర లో మార్పు మాత్రమే చూడగలిగిన నేను ‘మా వూరి మంత్రి శతకం ‘ లో సమాజం లో మార్పు చూడగలిగాను.
3. ఇక్కడికి వచ్చాక మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనాలకి ఏ విధంగా భిన్నమయినవి?
ఆంద్రా లో ఉన్నప్పుడు వ్రాసినవి కవితలు. అదంతా భావకవిత్వం. సరదాగా, రాయగలనని తెలిసి రాసి చూసుకొందామని వ్రాసినవి. అచ్చు లో చూసుకోవాలని కూడా అనిపించలేదు. కారణం నేను వ్రాసిన వాటికంటే నేను చదివినవే చాలా బాగున్నాయనిపించడం కాబోలు. అమెరికా లో వ్రాసినవే నలుగురితో పంచుకోవాలన్పించి, సారస్వత సమూహాలలో చదవడం, ఇక్కడ పత్రికలకి పంపడం, తర్వాత అక్కడ పత్రికలకి పంపడం జరిగింది.
4. అమెరికా వచ్చాక మీ మొదటి రచన ఏది? దాని నేపధ్యం కొంచెం చెప్పండి.
‘వెయ్య కిటికీలు ‘ జీవితం ఒక వెయ్య కిటికీల భవంతిలా తోచింది అమెరికా జీవితం. ఎంతోమందిని కలవడం , వారి వారి ప్రపంచలోకి తెలుపులు తెరిచి రమ్మనమని స్నేహపూర్వక ఆహ్వానం ఇవ్వడం, ఆనందాన్ని, ఆలోచనల్ని, అనుభవాలని అలవోకగా ఇవ్వడం జరుగుతున్నా నేపథ్యంలో ఈ బ్రతుకుకి వెయ్యకితికీలు ఉన్నాయ్. తెరిచి చూడడం నేను చెయ్యవలసిన పని అని తెలుసుకున్న సమయంలో వ్రాసిన రచన అది.
5. డయాస్పోరా సాహిత్యాన్ని గురించి మీరు ఏమనుకుంటున్నారు? తెలుగు డయాస్పోరా సాహిత్యం అంటూ వుందనుకుంటున్నారా?
స్పటికం లాంటి మనిషి మెదడుమీద కాంతి లాంటి ఒక ఆలోచన వచ్చి ఇంద్ర ధనస్సులాంటి ఊహల్ని సృస్తి స్తుంటే వెలువడే సాహిత్యంకి భాష, భౌగొళిక హద్దులు ఉండవు. పరిశోధకుల పరిశోధనల కోసం తగిలించి పదం డయాస్పోరా సాహిత్యం అని నా అభిప్రాయం. రాసేవాళ్ళకి రిజర్వేషన్ కోటాలో రచయత తరగతిలో సీటు ఇవ్వాలంటే డయాస్పోరా సాహిత్య విభాగం అవసరమే. అమెరికా నుండి వస్తున్నా తెలుగు సాహిత్యం లో చాలా భాగం డయాస్పోరా సాహిత్యమే.
6. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
మీరు రచయతగా నా భవిస్యత్తు అని అడుగుతున్నారని భావించి ఈ జవాబు ఇస్తున్నను. అమెరికా వాతావరరం ఎన్నోవిధాలుగా రాసేవారికి రాయడానికి అవకాశాలని ఇస్తుంది. దానిని నేను ఆవగింజంత కూడా ఉపయోగించుకోవడంలేదు. భవిష్యత్తులో బత్తాయి అంత కాకపోయినా బ్లూ బెర్రీ అంతైనా బ్లాగ్ బరిలో ఉపయోగించుకోవాలని అనుకొంటున్నాను.
3 comments:
కలశపూడిగారికి అభినందనలు. నిజమైన మంచి మనిషి ఆయన.
- కావేరి
కలశపూడిగారూ..కలాన్ని విదిలించండీ..!
కథ గురించి ఏ బీ సీ డీ లు తెలియని అమెరికా చౌదరి గారి వీరంగాలు చూసి వెగటు పుట్టిన తరవాత - కలసపూడి గారి ముఖా ముఖి ఎంతో రిఫ్రెషింగ్ గా వుంది. ఇలాంటి రచయితలని మరింతగా పరిచయం చేయండి సారూ!
Post a Comment