ఎడిటర్లకి కావాల్సిందేమిటి?: మాగంటి వంశీ

క్లుప్తం అని బంధాలేస్తే ఎలా చచ్చేది? సరే నాలుగైనా, నలభై ఐనా క్ఌప్తం నాకు లుప్తమే కాబట్టి..ఈ నలభై ముక్కలు....

ఆనాటి సంపాదకత్వం - సాహితీ సేవకొక పీఠం
ఈనాటి సంపాదకత్వం - సంపాదనకొక మార్గం

సంకలనమో, సంగ్రహమో ఏదైనా సరే - ఈనాటి సంకలన సంపాదకులకు కావలసినదేమిటి? డబ్బు పోగెయ్యటం, తల ఎగరెయ్యటం, పోట్లు పొడవటం

అందరూ ఊరుకుంటారా? - ఎవడన్నా తిరిగి పొడిస్తే రాజీకి రావటం.

పాతవారు సరే, చరిత్రలోకెక్కిపోయారు వారి ప్రతిభతో మఱి ఇటీవలి కాలం వారు? అమెరికాలోనో, యూరపులోనో ఉండటం - వారి స్వంత డబ్బులు దాచుకోవటం. పఱుల డబ్బులు దొబ్బటం, తందనాలాడటం, ఆంధ్ర దేశంలో రియల్ ఎస్టేటు కొనుక్కోవటం. మాట వినకపోతేనూ, ఎదురు చెపుతేనో మీద పడి రక్కటం, దుష్ప్రచారాలు చెయ్యటం. పాఠక హక్కుల హననం చెయ్యటం.సాహిత్యానికి సమాధి కట్టటం.? ఎలా? అలాగే!
......
.............
................................
....................................................


మరి ఈ చర్చలో పాల్గొనటానికి అర్హతలేమిటీ? డబ్బుల కోసం పీడింపబడ్డవారు, సంకలనాలు చదివి గుండెపోటు వచ్చిన వారు, సంకలన సంపాదక నటరాజ తాండవ నర్తనానికి బలి అయిపోయిన తాడిత జనాభా వారు, వారి కులకంపుకు కళ్లు బైర్లు కమ్మినవారు.....ఇలా బోల్డంతమంది అభాగ్యులు, నిర్భాగ్యులు, కండలు పీక్కుతినే అఘోరా సాధువులు - వీరందరూ అర్హతలున్నవారే!

మరి ఎడిటర్లకు కావల్సిందేమిటి ? – పరిశీలనా శక్తి, నైశిత్యం సాహిత్య పైత్యం, రస ప్రకోపం. వ్యుత్పత్తి, అభ్యాసం, తప్పులు దిద్దటంలో అపారమైన పరిణితి. నిజమైన సాహితీ సేవ చెయ్యాలన్న నిర్దిష్ట తపన. వివిధ మనస్తత్త్వాలు కల సాహితీవేత్తల మధ్య అభిప్రాయభేదాలు తొలగించగల నైపుణ్యం. తత్కాల, దీర్ఘకాల స్వప్రయోజనాల దృష్ట్యా ఒక వర్గానికి కొమ్ము కాయకపోవటం.చుట్టఱికం, దగ్గరగా కూర్చుని చుట్ట కాల్చడం వల్లే వచ్చిందన్న దాన్ని నమ్మకపోవడం. అలా చుట్టలు కాల్చేవాళ్లని దగ్గరికి రానివ్వకపోవటం.సాధికారంగా, వివరణాత్మకంగా లోపాలు ఎత్తి చూపించగలగటం. రచయిత ఒప్పుకోకపోతే ఆ రచనని ఎత్తి చెల్లికి మళ్లీ పెళ్లి కాయితాల సహవాస భాగ్యం కల్పించటం.మంచి కథలు దొరకకపోతే ఆ సంకలనం మానుకోవటం.మంచివి దొరికినప్పుడే సంకలిద్దాం అని లోపలా బయటా ఆశావాదిగా ఉండగలగటం.సంకలన ప్రచురణ వల్ల వచ్చే ఉపయోగంలో సద్వినియోగ శాతం గుర్తించగలగటం.ఆ ఉపయోగాన్నీ, సద్వినియోగాన్నీ మరు సంకలనానికి మెట్టుగా ఎలా వాడుకోవాలో తెలియటం.సంకలనానికొచ్చిన కథల్లో ఈనెలన్నీ తీసి తమలపాకే మిగలకుండ ఉండే పని చెయ్యకపోవటం.డబ్బు, పేరు, ప్రతిష్ట అనే మానసిక వ్యాధికి దూరంగా ఉండగలగటం.ప్రచురణ డబ్బుల కోసం అదేపనిగా ప్రజలని ఈమెయిళ్లతో పీడించకపోవటం.ఈమెయిళ్లకు జవాబివ్వకపోతే ఫోన్లు చేసి మరీ అడుక్కోకపోవడం.

మఱి పీడిత జనాభానో? పీడిత పాఠకులలో రెండు రకాలు - బలహీనులు, బలవంతులు.బలహీనులు ఏరకంగా ? బలవంతులు ఏ రకంగా? విద్య, సాహిత్య పరిచయం - - ఇవే బలాలు, అవి లేకపోతే బలహీనాలు.

బలహీన పాఠకుడికి మిగిలేదేమిటి? - నెత్తికి చేతులు, గుడ్లలో నీఱు, గుండెకు దడ, చేతికి చముఱు. బలవంతుడు ఈ మోత నుంచి తప్పించుకునే అవకాశం ఉన్నది. ఎందుకంటే వీడికి కొద్దిగా బుఱ్ఱ ఉన్నది కాబట్టిన్నూ, విద్యతో పాటుగా అవసరమైతే మర్మభేదం, దండోపాయం, మాటల ఈటెలు, ఎకసెక్కాలు ఉపయోగించన్నా తప్పించుకోగల నేర్పు ఉండబట్టిన్నూ. బలహీనుడికి ఆ అవకాశం మృగ్యం. చలికాలంలో అర్ధరాత్రి బట్టల్లేకుండా బయటకెళ్లి పళ్లు టకటకలాడుతున్నా శబ్దం బయటికి రాదుగా!

మఱి రచయితలూ నిరసన ప్రకటిస్తూనే ఉన్నారుగా? వాడి కథ ఆ సంకలనానికెక్కలేదని ఒహడి బాధైతే, ఇంకోడిది ఎక్కిందన్న బాధతో ఒహడు, ఆ సంకలనం చేసినవాడి కులం నాది కాదు కాబట్టి రాళ్లు విసిరి దుగ్ధ తీర్చుకుందామన్న కుతితో ఒహడు...

మఱి అప్పటిదాకా నిద్రపోతున్న సంఘాలు? కుంభకర్ణుడు ఉంటేనేం, చస్తేనేం? ఎవడికి ఉపయోగం? ఒక్క ఆ రావణాసురిడికి తప్ప - మధ్య మధ్యలో లేవటం, అరవటం, మెక్కటం, మళ్లీ పడుకోటం . తెలంగాణోళ్ల సంఘమైతేనేమి, ఆంధ్రోళ్ల సంఘమైతేనేమి? అన్నీ ఆ తీరే!

అవకాశం దొరికితే అవతలివాడిని ఎక్కుదామని చూసేవాళ్లు ఎలా పోతే మనకేంటి? మఱి నువ్వు ఇప్పుడు చేసిన పని అదేగా అంటున్నారు జనాలు! అవును! ఆ అవకాశం ఇచ్చిన అఫ్సర్ గారికి బోల్డు ధన్యవాదాలతో!

అర్థం పర్థం లేకుండా, వందల సంఘాలున్నాయి, వేలాది రచయితలున్నారు - ఊపునివ్వాలి, విరగపొడవాలి అంటూ బాకా ఊదుకుంటూ తిరక్కపోతే గత నాలుగైదు దశాబ్దాలుగా చెయ్యని, చెయ్యలేని పని - సందు దొరికింది కదాని ఊరకే మొఱిగే బదులు బుద్ధి తెచ్చుకుని కాపలా కాస్తే ఇంకో యాభై ఏళ్లకైనా తమ ప్రాంత రచయితలకు మేలు చేసినవారవుతారు, సాహితీ సేద్యాన్ని నిలబెట్టినవారవుతారు.

రాజీకి రాకుండా మాకు నచ్చినవాళ్లవే వేసుకుంటాం,మాకు నచ్చినవాడే రచయిత, వాడి రచనే రచన, వాడి కథే కథ అని ఈ ఆంధ్ర సంఘం వాళ్లు అనటానికి దమ్ములూ లేవు...చేసిన తప్పు తెలుసుగా! కుక్కిన పేనన్నా నయం! బీరాలు పోవటం, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించటం, నచ్చనివాడిని వెలివెయ్యటం మానుకుని అసలు మొదలెట్టినప్పటినుంచి అందరినీ కలుపుకుని, అన్ని ప్రాంతాల వారికి సమాన ప్రాతినిధ్యమిచ్చుంటే పోయేది. ఆ పనీ చెయ్యలా, పోనీ మా సంకలనాలు మా ప్రాంతం వాళ్లకి మటుకే అని ఓ డిస్క్లెయిమరూ పెట్టలా ! ఇప్పుడు ఆకులు పట్టుకుంటే మిగిలేది ఏమిటి? పానకం బిందె!

ఇహ ఇంతటితో ఆపుతున్నా - రాండి మీద పడండి.....రాండి...కాచుకుని కూర్చున్నా !

మాగంటి వంశీ
Category: 2 comments

2 comments:

astrojoyd said...

meeru uhisttunna sakala lakshna sampannulaina sampaadakulu bhutaddamlo choosina kanaraaru.aa rojulloni editorle veru sumandee..

veera murthy (satya) said...

బలహీన పాఠకులు, అభాగ్య పాఠకు లంటూ ఎవరూ ఉండరు......... మెడలు వంచేది.....తలలు దించేది వాళ్ళే........దిక్కుమాలిన రచనలు, మగజైన్లు, అర్ట్కల్స్, న్వుస్, ఎన్ని రావడం లేదు.....సంఘాలూ సాహిత్యులకి....పాఠకులకి కాదు.....ఒక్కటి మాత్రం వాస్తవం...స్పర్దలుంటేనే సంఘాలొస్తాయి.....లాభాలు గడించడానికి, సేద్యాలు చేసుకోడాని కే ఈ సంఘాలు....
పాఠకులకి కాదు.....ఇదంతా మాటల మెలికలు తప్ప మరేమీ కాదు.

Web Statistics