కొంచెం గతం, కొంచెం స్వప్నం...కలిస్తే ఫణి!కథలూ కబుర్ల "పల్లకీ" శ్రీనివాస ఫణి డొక్కాతో కొన్ని కబుర్లు


1. అమెరికా వచ్చాకా జీవితం పట్ల మీ దృష్టిలో మార్పు వచ్చిందా?
అమెరికా వచ్చేనాటికి నాకు ఇరవై రెండేళ్ళు. అప్పటికి జీవితం అంటే ఇదీ అనే ఖచ్చితమైన అభిప్రాయం గానీ, ఆలోచన గానీ లేదు. ఏదో, గాలివాటంగా బతకడమే. చదువుకోడానికి మొదట మెంఫిస్ వెళ్ళాను ఒక సెమిస్టరు. అక్కడ విపరీతమైన బెంగ మొదలయ్యింది. నెలకి ఆరొందలు స్కాలర్షిప్పిచ్చేవారు. ఎవరినన్నా ఇంకో మూడొందలు అప్పడిగేసి,ఎయిరిండియాలో వన్ వే టిక్కెట్టు కొనేసుకుని ఇంటికెళిపోదామని వుండేది. తోటల్లో ఎగిరే రామచిలుకని పట్టుకొచ్చి పంజరంలో పెటినట్టనిపించేది. అయితే, ఒక సెమిస్టరయ్యాకా, అట్లాంటా వచ్చేసాను అన్న దగ్గరికి. అప్పట్నించీ, బానే వుండేది. ఏ లోటూ తెలియనిచ్చేవాడు కాదు అన్న. అంచేత బెంగ తగ్గింది. మెల్లగా ఉద్యోగం కూడా రావడంతో, కాస్త ఆత్మ స్థైర్యం, "పరవాలేదు, మనం కూడా దేనికో ఒకందుకు పనికొస్తాం" అనే నమ్మకం కలిగాయి. నెల నెలా జీతం బేంకులో పడుతుంటే, త్రివిక్రముడిలా విశ్వాసం పెరిగిపోయేది. ఎప్పుడు కావలిస్తే అప్పుడు ఇండియాకెళ్ళి మనవాళ్ళందరినీ చూసుకు రావచ్చును అనే ధైర్యం వచ్చి, బెంగ తగ్గింది.

కడుపు నిండిన బేరం కాబట్టి, వంట దగ్గిరినించీ అన్నీ అన్నే చూసుకునేవాడు కాబట్టి, కాస్త పాటలమీద, కథలూ గట్రా రాయడం మీద మనసు పోయేది. అప్పటికి జీవితం పట్ల బెరుకు పోయి, "అన్న వెళ్ళిన దారిలో ఫాలో అయిపోతే, మన పావు కూడా పంట గడి చేరుకుంటుందనే" గెట్టి నమ్మకం కలిగింది. అప్పట్నించీ జీవితం పైన, భవిష్యత్తు పైన, కాస్త ఆశ, ఆసక్తి మొదలయ్యాయి. జీవితంలో మొట్టమొదటి సారిగా "మర్నాటి"గురించీ, "మరుసటి సంవత్సరం" గురించీ ఆలోచించడం, భవిష్యత్తు గురించి చిన్న చిన్న కలలు కనడం మొదలు పెట్టాను.

2. ఆ మార్పు మీ రచనలలో ఎలా వ్యక్తమయ్యింది? వొకటి రెండు ఉదాహరణలు ఇవ్వగలరా ?
మానవ జీవితం పట్ల అవగాహన పెంచుకోవాలనే తపన ఉండేది మొట్టమొదటి రచనల్లో ("సాయంకాలం" కథ). రాను రాను ఆ జనరలైజ్డ్ ఆలోచన నించి, నేను ("నేనూ - నా లేఖినీ" కథ), నా అనుభవాలు ("నేనెరిగిన రైలు ప్రయాణం" కథ), నావాళ్ళు ("కాశిపిల్లి మామ్మ" కథ), నా చుట్టూ ఉన్న జనాలు ( "తెలుగువాడూ - జీవ పరిణామమూ" కథ), అనే ఒక సబ్జెక్టివ్ ధోరణి మొదలయింది. నా జీవితం మీద నాకు కాస్త పట్టు రావటం వల్లా, అన్న ఆసరాతో నాకాళ్ళమీద నేను నిలబడ గలగటం వల్లా, నా దృక్పథంలో వచ్చిన మార్పే, ఈ రచనలకి కారణమని, ఇప్పుడాలోచిస్తే అనిపిస్తోంది.

3. ఇక్కడికి వచ్చాకా మీరు చేసిన రచనలు ఆంధ్రాలో వుండగా చేసిన రచనలకి ఏవిధంగా భిన్నమయినవి?
నేను ఇండియాలో ఉన్నప్పుడు రాసిన కథలు చాలా తక్కువ. నా మొదటి కథ "సాయంకాలం" - తనలో జరుగుతున్న సంఘర్షణ ( ఈ సృష్టిని అర్థంచేసుకోవాలనే తపన) ని ప్రకృతిలో చూసే ఒక పరిశీలకుడూ, మానవ జీవితాన్ని అర్థం చేసుకోవాలనుకునే ఒక విద్యార్థీ, అందరికీ మంచే జరగాలని కోరుకునే ఒక స్వాప్నికుడూ - ఇలా సాగిపోతుంది. ఇతనికి తన జీవితాన్ని గురించీ, భవిష్యత్తు గురించీ ఆలోచనే లేదు అప్పటికి. అల్లాగే, "ప్రేమాయణం" అనే ఒక వ్యాసంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టటానికి గల ఐదు కారణాలని చర్చించాను ( ఇది అముద్రిత రచన ). దానిలోనూ అంతే, ఒక జడ్జిగానో, అబ్జర్వర్ గానో, కనబడతాను. అంతా జనరలైజ్డ్ గా ఉంటుంది.

అమెరికాలో, అన్న దగ్గర కాస్త కుదుటబడ్డాకా, బాల్యాన్ని గుర్తుకుతెచ్చుకోవడం, ఆనాటి అల్లర్లూ, ఆ సరదాలూ, అప్పటి వ్యక్తులూ, చిన్ననాటి అనుభూతులూ, ఈ భావాలన్నీ కథలరూపంలో వచ్చేవి. తరవాత బెంగ తీరిన పిమ్మట, మూడు, నాలుగు పాత్రలతో కథలు రాయడం మొదలుపెట్టాను ("పల్లకీ" కథ అప్పుడు రాసినదే). మధ్య మధ్య చిన్న చిన్న విషయాలమీద నా కామెంటరీ కూడా రాసేవాణ్ణి. తరువాత రెండువేల సంవత్సరానికి కాస్త అటూ, ఇటూగా, సెటైర్లు రాయడం మొదలయింది. మన అందరిలోనూ ఉన్న గుణాలని "ఇవి మంచివి, ఇవి చెడ్డవి" అని చూసే భావం పోయి, మంచి గుణాలని మెచ్చుకుంటూ, అంత మంచివి కానివాటిని చూసి కాస్త నవ్వుకుంటూ, "నథింగ్ ఈజ్ పెర్ఫెక్ట్, టేకిటీజీ" అనుకుంటూ, హాస్యం, వ్యంగ్యం కలిసిన రచనలు చేయటం కాస్త అలవాటయింది. అల్లా చాలా సెటైర్లు రాసాను, ఇంకా రాస్తున్నాను.

4. అమెరికాలో వున్న తెలుగు రచయితగా మీ భవిష్యత్తు గురించి మీ ఆలోచనలు ఏమిటి?
తెలుగు రచయిత / కవి అనేది ఒక అంతరించిపోతున్న స్పీషీసు. మనసులో కాస్త తడి, మనిషన్న వాడిమీద ప్రేమ, విశ్వాసం, తెలుగు మీద కాస్త మమకారం, మాటల్లో కాస్త చమత్కారం - ఈ లక్షణాలున్న రైటర్సు ఇప్పటికే అతితక్కువ, ప్రపంచం మొత్తం మీద. ఇహ భవిష్యత్తు గురించి చెప్పనక్కరలేదు. మన సంతృప్తి కోసం రాసుకోవడం, పుస్తకాలు అచ్చేసుకోవడం. ఎవరన్నా మెచ్చుకుంటే సంబరపడిపోవడం, అంతవరకే. దీనివల్లేదో భాష ఉద్ధరింపబడుతుందని గానీ, మరో తరం వారో, ఆ పై తరం వారో మన కథలు చదివేసి "అన్నన్నా, మనం ఫలానా వారి సమకాలీకులుగా పుట్టి వుంటే ఎంత బాగుణ్ణు" అనేసుకుంటారనే వెఱ్ఱి అపోహలు గానీ నాకు లేవు.

నామట్టుక్కు నాకు మనుషులంటే ఇష్టం. వాళ్ళ మనసుల్ని తాకడం ఇష్టం. భేషజాల తెరల్ని దాటుకుని వెళ్ళి, అందరిలోనూ ఉండే అమాయకమైన పసిపిల్లవంటి హృదయాలతో కబుర్లాడడం ఇష్టం. నాకు నచ్చినన్నాళ్ళు రాస్తాను. ఎవరన్నా మెచ్చుకున్నన్నాళ్ళు రాస్తాను. ఓపికుంటే అచ్చేయించుకుంటాను. చదువుతానంటే ఇస్తాను.

ఇది ఇంటర్నెట్టు యుగం కాబట్టి, ఓ అరవయ్యో, వందో ఏళ్ళ తరువాత, వీకీపీడియా లోనో, మరొహ సైటులోనో, "ఫణి డొక్కా" అని సెర్చ్ చేస్తే, రెండు డేట్లు, నేను రాసిన పుస్తకాల పేర్లూ ఉండచ్చు. అప్పుడెవరన్నా వెఱ్ఱి బాగులవాడు తెలుగులో పరిశోధనా గ్రంధం రాస్తూంటే, నా పేరూ జత చెయ్యొచ్చు. ఈ ఋణానుబంధం అంతవరకే.
Category: 6 comments

6 comments:

Anonymous said...

Chaala bagundi mee interview
and mee kadalu kooda! :)

Magic....2 win Man's heart said...

nenu sagam eh chadivenu....sayantram lopala complete chesesthanu... sailaja ganti ki relative ni from her mom's sde.dokka seethamma garu gurinchi koncam telusu through my father....mee blog and interview chala bavundandi....

Best wishes,
madhuri vadlamani

కొత్త పాళీ said...

Very realistic and down to earth.
I also like his statement on being subjective in his writings

రవి వీరెల్లి said...

ఫణి గారు,
చాలా బాగా చెప్పారు. రచయితగా మీ భవిష్యత్తు గురించి చెప్పిన తీరు నచ్చింది.
మంచి రచయితగా మీకు పేరు రావాలని ఆశిస్తూ,
-రవి వీరెల్లి

కెక్యూబ్ వర్మ said...

ఫణిగారు ఉన్నదున్నట్లు మాటాడిన తీరు, ఆయన నిర్మొహమాటత్వం, భవిష్యత్ దృక్పధం ఆకట్టుకున్నాయి.

పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్...

Chandra Somaraju said...

Vaastavaniki chaala daggarinundi nenu kuda chusinatlanipinchindi - ee interview chaduvutu vunte...The expressions are pure, simple and powerful in terms of reaching my innerself. I felt the same while I was reading Pallakee book. I hope to read all your writings ...

Web Statistics