Monday, September 20, 2010

ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం ; చర్చకి ఆహ్వానం!




ఈ వారం టెక్సాస్ టెంపుల్ లో తెలుగు సాహిత్య సదస్సు జరగబోతోంది. సాధారణంగా టెక్సాస్ లో ఎక్కడ సాహిత్య సమావేశం జరిగినా అది వొక పెద్ద పండగ, వొక సందడి. పైగా, టెంపుల్ నిజంగా గుడి లాంటి వూరు. చిన్న వూరు. పెద్ద వినాయకుడి గుడి. చూడ ముచ్చటయిన వూరు. అక్కడ తెలుగు సాహిత్య సభ అంటే అచ్చంగా అది పండగే!

ఈ సదస్సుకి రమ్మని మందపాటి సత్యం గారు, టెంపుల్ రావు గారు ఆహ్వానం పంపినప్పుడు మొదట వక్తగా వెళ్లడానికి పెద్ద ఉత్సాహంగా అనిపించలేదు. వేదిక కిందనే వుండి అందరితో పిచ్చాపాటి మాట్లాడుతూ కాస్త బాధ్యత లేకుండా సరదాగా గడిపేద్దామని అనుకున్నా. కానీ, రావు గారు మళ్ళీ ఈ-లేఖ రాసి, ఉత్సాహ పరిచారు. చాలా ఆలోచించిన మీదట ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యం ఎట్లా మారిందో మాట్లాడితే బాగుంటుందని అనిపించింది. నాకు ఇంటర్నెట్ లోకంతో అంత పరిచయమేమీ లేదు. కానీ, అచ్చు పత్రికలలో చాలా కాలం పాటు సాహిత్య పేజీలూ, ఆదివారం అనుబంధాలు ఎడిట్ చేసిన అనుభవం వున్నందు వల్ల, ఇంటర్నెట్ లోకం సాహిత్యాన్ని ఎట్లా ప్రభావితం చేసిందో మాట్లాడితే బాగుంటుందని అనుకున్నా. నెట్ వచ్చాక తెలుగు భాష కూడా కొంత మారింది. నెటిజనులు, అంతర్జాలం, బ్లాగరి, బ్లాగడం లాంటి పదాలు పుట్టడం పైకే కనిపిస్తున్న మార్పు. ఇది కాక సాహిత్య సంస్కృతి బాగా మారిందని నా అభిప్రాయం. పాఠకుడు అన్న పదానికి అర్ధం మారిందని నాకు అనిపిస్తోంది. అసలు నెట్ చూసే జనం ఎంత అన్న ప్రశ్న పక్కన పెడితే, ఈ మార్పు తెలుగు సాహిత్య సంస్కృతిని కొంచెం మలుపు తిప్పేదేనని నాకు అనిపిస్తోంది.

ఈ విషయం మీద ఇప్పుడిప్పుడే నేను ఆలోచనలు కూడదీసుకుంటున్నా. ఈ లోగా మీ అందరితో ముచ్చటించవచ్చు కదా అని అనుకుని, ఈ విషయం మీద మీ అభిప్రాయాల్నీ, మీ అనుభవాల్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నా.

మీరు నెట్ లో చదివే పత్రికల గురింఛీ, రచనల గురింఛీ, నెట్ చదవడం మొదలు పెట్టాక మీ అభిరుచిలో వచ్చిన మార్పుల గురించీ ఇక్కడ రాస్తే అది నాకు ఎంతో వుపయోగపడుతుంది. మీ మాటల్ని మీ మాటలుగానే నేను సభాముఖంగా, ఆ తరవాత నా సుదీర్ఘ వ్యాసంలోనూ పేర్కొంటాను. 

ఈ మూడు ప్రశ్నల గురించి ఆలోచించండి.

1. ఇంటర్నెట్ తరవాత తెలుగు సాహిత్యంలో బాగా కనిపిస్తున్న మార్పులు ఏమిటి?
2. ఇంటర్నెట్ వల్ల పాఠకుల సంఖ్య పెరిగిందా? పెరిగితే ఈ పాఠకులు ఏ వర్గం నించి పెరిగారు?
3. ఈ-పత్రికలు, బ్లాగుల పాత్ర గురించి మీరేమనుకుంటున్నారు?

ఈ మూడు ప్రశ్నలకే పరిమితం అవ్వాలని లేదు, అంతకి మించి చెప్పాలనుకున్న విషయాలు వుంటే నిర్మొహమాటంగా చెప్పండి.

మీ అభిప్రాయాలూ తప్పక రాస్తారని నమ్ముతున్నా.

Sunday, September 19, 2010

తెనాలి దాటుతూ....


ఊరు దాటుతున్నప్పుడు

పక్కనే ఏరు కదలాలి

అమ్మ చాచిన చెయ్యిలా.



అప్పుడే తెరుచుకుంటున్న

ఎండ తలుపుల్లోంచి

సూర్యుడు తొంగి చూస్తుండగా

చల్లని నుదుటి మీద

ఆడుకుంటున్న నులి వెచ్చని జ్నాపకం.





అప్పుడప్పుడూ

ఈ గట్టు మీంచి ఆవలి గట్టుకి

కళ్ల పక్షుల్ని చివరంటా షికారుకి పంపాలి.



ఏరు మీంచి పారే గాలి అలల మీంచి

ఏ భాషకీ తెగని మాటల్ని పంపి

తిరుగుటపాలో

కళ్ళు పట్టేటన్ని ఆకాశప్పాఠాల్ని వొంపుకోవాలి.



రోడ్డు మీద నడిచేటప్పుడు

నీటి పొరల మీద కాళ్ళు మోపినట్టుండాలి



నదిని రెక్కల కింద దాచుకున్నంత తృప్తిగా

బుడుంగున మునిగి తేలుతున్న కొంగలు

అలా మాటి మాటికీ ఆకాశంలోకి

ఏ మాటల్ని ఎగరేస్తున్నాయో చూడాలి.



చిత్రంగా మనం

గదులు కట్టుకున్నట్టే

నదులకూ తాళాలు వేస్తాం కదా

ఆ తాళాల సందుల్లోంచి

నురుగులు కక్కుతున్న నీళ్ళల్లో

కన్నీళ్ళున్నాయో లేదో చూడాలి.



ఆ పచ్చని నేలని దాటి

ఆకాశం తప్ప అక్కడ ఇంకేమీ లేనట్టు

అల్లుకుపోయిన లోకంలో

ఏ కాలానికీ ఏ దారికీ దొరక్కుండా

ఎక్కడెక్కడికో తప్పి పోవాలి.



ఊరు చేరుతున్నప్పుడు

పక్కనే ఏరు కదలాలి

అమ్మ చాచిన చెయ్యిలా.



నీటి ఉరుకులకి తెగిపోతున్న గట్ల మీదికి

వొంగి వొంగి ఆ చెట్లన్నీ

ఏ వూసులు చెబుతున్నాయో వినాలి.



లోపలి గుస గుసలన్నీ

బయటికి వచ్చీ రాకుండానే



అప్పుడొస్తుందింక తెనాలి!



(1994. “వలస” నుంచి)



Friday, September 17, 2010

ముస్లిం సాహిత్య విమర్శ - ఎటు వైపు?!

అక్షర సాంకేతికైకమౌ విద్యల

నెల్ల వారును నభ్యసింప గలరు

అవి కృతకంబులు, నధ్యాత్మ విదులయిన

సాధకునకు ప్రపంచకమె చదువు.

మేఘాల రేఖలు మెరపుల చలనంబు

కడలిని సిగారు సుడులు నిసుక

నేల గాలికిగ్రాలు చాలును సెలయేళ్ళ

వాలును నిజమయిన వ్రాతలనగ...



1939లో "బ్రహ్మర్షి" ఉమర్ అలీ షా కవి తన "సూఫీ వేదాంత దర్శము" అనే దీర్ఘ కావ్యంలో ఆ పద్యం రాసినప్పుడు సూఫీ తత్వం గురించి ఇప్పుడున్నంత చర్చ లేదు. కాని, ఆశ్చర్యంగా ఈ దీర్ఘ కావ్యం సూఫీ వేదాంత దర్శనం దగ్గిరే ఆగిపోలేదు. ఇంకా ముందుకు వెళ్ళి, లోతయిన సాహిత్య విమర్శ కూడా చేస్తుంది. కావ్యం పుట్టుక, కవిలోనూ, పాఠకుడిలోనూ అది కలిగించే రస స్పందనల్ని గురించి చాలా మంది విమర్శకులు అనేక విధాల వ్యాఖ్యానించారు. కాని, ఉమర్ అలీ షా వాటన్నిటికీ భిన్నంగా "మతాంతర మహా పరివర్తన"తో నిండిన సాహిత్య విమర్శ తత్వాన్ని ప్రతిపాదించారు. సాహిత్య విమర్శకి సూఫీ భావనలు ఏ విధంగా దోహదం అవుతాయో కవితాత్మకంగా వివరించారు. 1990ల తరవాత తెలుగు ముస్లిం సాహిత్యంలో తిరిగి సూఫీ తత్వచాయలు కనిపించడం మొదలెట్టాయి.అయితే, కాలం మారింది, భావనలూ మారాయి. విమర్శ విధానమూ మారింది. ముస్లిం సాహిత్యం, ముస్లిం సాహిత్య విమర్శ ఈ రెండు రంగాలలో ఇటీవలి కాలంలో వచ్చిన మార్పులు చాలా సంక్లిష్టమయినవి. ముస్లిం సాహిత్య విమర్శని వొక ప్రత్యేక రంగంగా గుర్తించాల్సిన చారిత్రక అవసరం ఇప్పుడు ఏర్పడుతోంది. ముస్లిం సాహిత్య విమర్శకి సంబంధించిన భావనల చరిత్ర అన్వేషణ

కూడా ఇప్పుడు జరగాల్సి వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ అంటే, సూఫీ భావనల నేపధ్యం మాత్రమే కాకపోవచ్చు. కాని,స్థానిక ముస్లింల భావ చైతన్యంలో అదొక ప్రధాన సాధనం. పైన పేర్కొన్న పద్యంలో మూడు కీలక పదాలు ఈ సూఫీ భావనకి ముఖ్యం. అవి 1. కృతకమయిన అక్షర సాంకేతికత 2. ప్రపంచక చదువు 3. నిజమయిన వ్రాత.

సూఫీలు సమకాలీన వ్యవస్థల్లోని అన్ని రకాల కృతిమత్వాల మీదా నిరసన ప్రకటించారు. ఈ విషయంలో వాళ్ళు మన భక్తి ఉద్యమ తాత్వికతకి దగ్గిరగా వస్తారు. చాలా సందర్భాల్లో బసవన్నకీ, అక్క మహాదేవికీ, అన్నమయకీ, భక్త రామదాసుకీ వీళ్ళు ఆత్మ బంధువులు. భక్తిని ఇహ పర ఐక్యతకి సాధనంగా భావిస్తూనే, ఇహంవైపు, భౌతికమయిన శరీర ప్రతీకలవైపు మొగ్గు చూపించడం ద్వారా భక్తిని భూమార్గం పట్టించాలన్న పట్టింపు సూఫీ-భక్తి సంప్రదాయాల వారసత్వంగా కనిపిస్తుంది. తెలుగు నాట పల్లె ముస్లింల జీవన ఆధ్యాత్మిక సరళిని సమీపంగా చూసిన అనుభవం వున్న వారికి ఈ సామరస్య సారస్యం బోధపడుతుంది.

మౌఖిక సాహిత్య విమర్శ ఇప్పుడు అనివార్యంగా చర్చలోకి వస్తోంది కాబట్టి, మొహర్రం గీతాల గురించి తూమాటి దోణప్ప గారి వ్యాసంలోని ఈ వాక్యాలు పరిశీలించదగినవి.

"పల్లె పట్టులలో ముస్లింలు ముక్కాలు మువ్వీసము నిరుపేదలు. వీరిలో చాలా మందికి చదువు రాదు. ...ఇందులో ఉరుదూ నేర్చిన వారు ఉడ్డా ముగ్గురు. అరబ్బీ నెరిగిన వారు అసలే అరుదు. పట్టింపు కలవారు కొందరు ఉరుదూ భాషామయ గీతికలను తెలుగులో రాసికొని, కొరాను సమీప భాషలో పాడితిమని తృప్తి పడుదురు. వట్టి అట్టహాసంలేల అని మరికొందరు ప్రాంతీయ భాషలో పాడి, తమ దుక్ఖమును ప్రకటింతురు." (దోణప్ప)

భావనల వ్యాప్తిలో భాషకి అంత ప్రాముఖ్యం లేదని దీన్ని బట్టి అర్ధం అవుతుంది. వ్యక్తీకరణ అనేది భాషని మించిన ప్రక్రియ అనీ దీని భావం. ఇప్పుడు తెలుగు ముస్లింలు రాస్తున్న ఆధునిక కవిత్వానికి కూడా ఇది వర్తిస్తుంది. అయితే, అందులో ఏది 'కృతకం' ? ఏది 'నిజమయిన వ్రాతా? ఏది 'ప్రపంచకం చదువు ' అన్నది ప్రశ్న. ఈ మూడు లక్షణాలు ఆయా కాలాల సాహిత్యంలో ఏ విధంగా నిలబడుతున్నాయో తరచి చూడవలసిన/ చూపించవలసిన బాధ్యత విమర్శ రంగానిది. ముస్లిం సాహిత్య విమర్శ రంగంలో ఇప్పుడు ఈ పని అంత సజావుగా సాగడం లేదనే చెప్పాలి. దీనికి ముఖ్య కారణం సాహిత్య విమర్శ పరిధులని ముస్లిం సాహిత్య విమర్శకులు సరిగా గుర్తించకపోవడం. ఈ విషయం లోనారసి వివరించే ముందు మనం కొంత వెనక్కి వెళ్ళాలి.

1



తెలుగు సాహిత్య రంగంలో "ముస్లిం సాహిత్యం " అనే వొక ప్రత్యేక ఉనికి సంబంధిత పదం వాడుక 1990ల తరవాతనే బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకు ముందు అనేక మంది ముస్లింలు అనేక సాహిత్య ప్రక్రియల్లో విశేషమయిన కృషి చేశారు. ఉమర్ అలీ షా మొదలుకొని ఇప్పటికీ రాస్తున్న పూర్వపు చాలా మంది ప్రముఖ ముస్లిం రచయితలకు సాహిత్య రంగంలొ పేరు ప్రఖ్యాతులు వచ్చినప్పటికీ, 'ముస్లిం' అనే గుర్తింపు లేదా ఉనికి సమస్యని ఆ రచయితలు ఎదుర్కోలేదు. జాతీయోద్యమం నించి విప్లవోద్యమం దాకా ఇలాంటి ధోరణినే గమనించవచ్చు.ఉనికి ఉద్యమాలు ప్రధానంగ 1985 తరవాత వచ్చినవే కనుక ఈ విషయం దళిత, స్త్రీ వాదాలకు కూడా వర్తిస్తుంది.



అయితే, ముస్లిం రచయితల పరిస్తితి దళిత, స్త్రీ వాదాలకి భిన్నమయినది. అంతకు ముందు నించీ రాస్తూ వచ్చిన తెలుగు ముస్లిం రచయితలకు 'ముస్లిం' అనే ముద్ర లేకపోయినప్పటికీ, ఆ రచయితలు చాలా మంది ఉర్దు సాహిత్యం వల్ల ప్రభావితులు.ఇస్లామిక్ సాహిత్య అధ్యయనంలో పెరిగినవాళ్ళు. తెలుగు సాహిత్య పఠనం వల్ల అదనంగా వారి అవగాహన విస్తరించింది. ఏదో వొక రూపంలో తెలుగులో ఈ రచయితల రచనల మీద ఆ సంస్కృతి ప్రభావం కనిపిస్తుంది. ఆ విధంగా ముస్లిం భావన/ఉర్దూ సాహిత్య ప్రభావాలు తెలుగు సాహిత్యంలో 1990ల పూర్వం నించీ వున్నాయి. ఈ ప్రభావం ముస్లిం రచయితల మీద ఎంత వుందో , ముస్లిమేతర రచయితల మీదా అంతే వుంది. దీనికి స్పష్టమయిన వుదాహరణ గురజాడ కథలే.



కాని, సాహిత్య విమర్శ రంగాన్ని ఈ 'ముస్లిం' భావన ఎంత వరకు ప్రభావితం చేసిందన్నది ప్రశ్న. ఉమర్ అలీ షాలో కొంత స్పష్టంగా కనిపించే ఈ భావన దేశ విభజన తరవాత ఉర్దూ, ముస్లిం సంస్కృతులకు ఇతర గుర్తింపు ఆపాదింపబడింది. దీనికి సంబంధించిన సంఘర్షణ కవిరాజ మూర్తి, నెల్లూరి కేశవ స్వామి లాంటి రచయితల్లో కనిపిస్తుంది. విమర్శ రంగానికి వస్తే, సదాశివ గారి విమర్శ వ్యాసాల్ని ఈ నేపధ్యం నించి చూడాల్సి వుంది. అభ్యుదయోద్యమం నించి వచ్చిన కౌముది లాంటి వారు తమ విమర్శ పరిభాషలో ఆ ఉర్దూ సాహిత్య సిద్ధాంతాల వల్ల ప్రభావితం అయినట్టుగా కనిపిస్తారు. దాశరధి, నారాయణ రెడ్డి, శేషేంద్ర, ఖాసిం ఖాన్,బిరుదు రాజు రామరాజు, కే.వి.గోపాల కృష్నా రావు, మొహమ్మద్ అలి, కాళోజి లాంటి వారి నించి ఇప్పటికీ విమర్శ రంగంలో వున్న ఖాదర్ మొహినుద్దిన్ లాంటి వారి విమర్శ పరిభాషపైన ఉర్దూ/ముస్లిం సంస్కృతుల ప్రభావం వుంది.

తెలంగాణా నించి వచ్చిన ప్రతి విమర్శకుడి పైనా, పరిశోధకుడి పైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కొంత ఉర్దూ/ముస్లిం సంస్కృతి చాయ కనిపించడంలో ఆశ్చర్యం యేమీ లేదు. అయితే, అదంతా "ముస్లిం సాహిత్య విమర్శ" అని నిర్ధారించడానికి అవకాశం లేదు. కాని, ముస్లిం సంస్కృతికి సంబంధించిన అంశాలు తెలుగు సాహిత్య విమర్శకి కొత్త కాదు అని చెప్పడానికి మాత్రం ఉపయోగ పడతాయి. కాని, "ముస్లిం" అనే గుర్తింపు వచ్చాక విమర్శ ఎలా మారిందో ఇప్పుడు చూద్దాము.



2



ముస్లిం సాహిత్య విమర్శ అని ఇవాళ వాడుకలో వున్న ధోరణికి నిర్దిష్టమయిన ఉనికి రాజకీయాలు వున్నాయి. 1990ల తరవాత ముస్లింలు రాస్తూ వస్తున్న సాహిత్యంలో ముస్లిం ఉనికి అంతకు ముందు వున్న అమూర్త ముస్లిం ఉనికికి భిన్నమయింది. దానికి తగినట్టుగానే, కొత్త ప్రశ్నలకి సమాధానంగా ముస్లిం సాహిత్య విమర్శ కొత్త గీటురాళ్ళని ఏర్పరుచుకుంది. అందులో మొదటిది: ముస్లిం ఉనికిని బాబ్రీ మసీదు అనంతర పరిణామాల నించి తిరిగి నిర్వచించుకోవడం. రెండు: సాంప్రదాయంపైన ధ్వజమెత్తడం. మూడు: తమ గుర్తింపు బహిరంగ ప్రకటనకి సాహిత్యంలో ఉర్దూ/ముస్లిం పరిభాషని వినియోగించడం. ఇప్పుడు ముస్లిం సాహిత్య విమర్శ అనగానే కొన్ని పడికట్టు రాళ్ళు కూడా స్థిరపడి పోయాయి.

ఈ వ్యాస రచయితతో సహా ఖాదర్ మొహినుద్దీన్, కరీముల్లా, ఖాజ, స్కై బాబా, దిలావర్,ఖదీర్ బాబు, ఉష యస్ డాని, షమీవుల్లా లాంటి వారు ఈ కొత్త ఉనికి నేపధ్యంలోనే ముస్లిం సాహిత్య విమర్శ చేస్తున్నారు. నాన్-ముస్లిం వర్గాల నించి ముస్లిం సాహిత్యం మీద విమర్శ రాస్తున్న వారు కూడా ఈ ఉనికి రాజకీయాలను విస్మరించలేని స్తితి వుంది. గుడిపాటి, సుంకిరెడ్డి, కాసుల ప్రతాప రెడ్డి, సురేంద్ర రాజు లాంటి వారు ముస్లిం సాహిత్య విమర్శకి అందించిన దోహదాన్ని ఈ సందర్భంగా విడిగా చెప్పుకోవాలి. విషాదం ఏమిటంటే, ఆది నుంచీ ముస్లిం సాహిత్యకారుల మద్దతుతో బలపడుతూ వచ్చిన దళిత సాహిత్యకారులు ముస్లిం సాహిత్యం గురించి కనీసం ప్రస్తావనలు చెయ్యకపోవడం. ఉనికి ఉద్యమాలు బలపడడానికి దళిత-ముస్లిం సాహిత్యకారుల మధ్య అయిక్యత బలపడాల్సిన అవసరమూ వుంది.



ముస్లిం సాహిత్య విమర్శ ఇప్పుడు ఏ స్తితిలో వుందంటే, అసలు సృజనాత్మకమయిన సాహిత్యం వెనక్కి పట్టి, ప్రతి వొక్కరూ ఏదో వొక స్తాయిలో విమర్శ వ్యాసాల సుడిగాలిలో చిక్కుకుపోయారు. ఈ పరిణామం దళిత/ స్త్రీ వాదాల సాహిత్య చరిత్రకి భిన్నమయిన నడక. దళిత/స్త్రీ వాదాల విషయంలో సాహిత్య విమర్శ వాటి వాటి సృజనాత్మక సాహిత్యానికి అనుబంధంగా సాగి, ఆ ఉద్యమాలకు వూపునిచ్చింది. దానికి భిన్నంగా ఇప్పటి ముస్లిం సాహిత్య విమర్శ ముస్లింల సాహిత్య సృష్టిని నీరుకారుస్తోంది. దీనికి ప్రత్యామ్నాయ దిశలో ముస్లిం సాహిత్య విమర్శ పురోగమించాల్సిన అవసరం ఇప్పుడు వుంది. ఈ వ్యక్తి కేంద్రిత సాహిత్య విమర్శ కూడా ఇప్పుడు వెనక పట్టి, అటు విమర్శా, ఇటు సృజనాత్మక సాహిత్యం కూడా మందగించాయి.



ముస్లిం సాహిత్య విమర్శ ముఖ్యంగా మూడు పాయలలో ప్రవహించడానికి అవకాశం వుంది.

ఒకటి: పూర్వ సాహిత్యంలో ముస్లిం సందర్భాల విశ్లేషణ. - కే.వి. గోపాల కృష్ణా రావు, బిరుదురాజు రామరాజు, సదాశివ లాంటి వారు చూపించిన మార్గం ఇప్పటికే వుంది. దీని కోసం అవసరం అయితే ఉర్దూ, పర్షియన్ భాషలు నేర్చుకోవడం చారిత్రక అవసరం. మంచి సాహిత్య విమర్శకి కేవలం రాజకీయ పరిజ్ఞానం మాత్రమే సరిపోదు. ఆయా సంస్కృతులకి మూలమయిన భాషల పరిజ్ఞానం అవసరం.

రెండు: వర్తమాన జీవితంలో ముస్లిం సమూహాల సాంస్కృతిక అంశాల శోధన, వాటికి సాహిత్యంతో అనుసంధానం. ముస్లిం చరిత్ర, సాంస్కృతిక రంగాల అధ్యయనం పైకి దృష్టి సారించాలి. మన దేశంలోనూ, ఇతర ముస్లిం దేశాల్లోనూ ముస్లిం మేధావులు సాంస్కృతిక అధ్యయన రంగంలో విశేష కృషి చేస్తున్నారు. ముఖ్యంగా చరిత్ర రంగంలోనూ, తాత్విక రంగంలోనూ. కనీసం వాటి అవగాహన ముస్లిం సాహిత్య విమర్శకులకు వుండాలి.



మూడు: సృజనాత్మక ముస్లిం రచయితలని నీరసపరిచే, పెడతోవన పట్టించే వ్యక్తి -కేంద్రిత రాజకీయ విమర్శల నించి బయట పడడం. వ్యక్తులు, వ్యక్తి కేంద్రిత ఉనికి రాజకీయాల వల్ల వ్యక్తులు కొంత కాలం పెత్తనం చెయ్యవచ్చు. కాని, మొత్తంగా ఆ సాహిత్య చరిత్ర తుడుచుకుపోతుంది. కొత్త తరం సాహిత్యంలోకి రాకుండా పోతుంది. ముస్లిం సాహిత్య విమర్శ అంటూ నిలబడాలంటే, ముందు ముస్లిం రచయితలు అంటూ కొందరు "నిజమయిన వ్రాతలు" రాయాలి. సృజనాత్మక సాహిత్యం పునాదిగా విమర్శ అభివృద్ధి చెందాలి. లేకపోతే, గాలిలో కత్తులు దూయడం అవుతుంది.

("పాలపిట్ట" మాస పత్రికలో "కాలి బాట" శీర్షిక నించి)

Wednesday, September 15, 2010

"పొద్దు"లో కొత్త కవిత :ఒక నిజ రేఖ మీద...'

పద్యం నీకొక భద్ర గది.


అది నాకు నిప్పు చేతుల నెగడు.

- మిగతా కవిత "పొద్దు" లో చదవండి.
 
http://www.poddu.net/?q=node/739

Monday, September 13, 2010

గతం ఇప్పటిదేనని...!

            - కృష్ణుడు (హస్తినా పురి నించి )



ఎప్పుడో ఒకప్పుడు


ఏదో ఒక దుస్స్వప్నం

గుండెను పిండించి

సిరాలో ప్రవహిస్తుంది

ఏదో ఒక నిశీథి

......నక్షత్రం రాలి

మనసుకు గుచ్చుకుంటుంది

ఉన్నట్లుంది

ఒక పాట కత్తిలా మారి

పొరల్ని చేదిస్తుంది

ఎప్పుడో ఒకప్పుడు

ఏడు సముద్రాల అవతలి నుంచి

అఫ్సర్ కవిత

గతం ఇప్పటిదేనని గుర్తు చేస్తుంది.


(కృష్ణుడు...ఇప్పుడు కృష్ణా రావు గా పత్రికాలోకానికి సుపరిచితుడు. ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్. 1980లలో తెలుగు దినపత్రికలలో సాహిత్య పేజీల సాంప్రదాయం నిలబెట్టడంలో కృష్ణుడిది కీలక పాత్ర. అలనాటి అనువాదాలూ, వాద వివాదాలలో కృష్ణ దౌత్యాలు ముఖ్య ఘట్టాలు. అఫ్సర్ బ్రాండ్ కవిత్వం, అఫ్సరీకులు అనే పదబంధాలు అతని సృష్టే! )

Sunday, September 12, 2010

గజల్ సాయంత్రాలు కొన్ని

చూడలేదు



కళ్లలోనే వుండిపోయాడు కానీ
గుండెల్లోకి ఎప్పుడూ చూడలేదు.

నౌక మీదనే బహు దూరాలు వెళ్ళాడేమో
కానీ, సముద్రాన్ని ఎన్నడూ చూడలేదు.

ఎక్కడయినా చుక్కలా రాలిపడ్డానా
ఎగాదిగా చూస్తారు అందరూ

పగటి బతుకులోనే గడిచిపోయింది కాలమంతా
కాసింత నీడ ఎలా వుంటుందో తెలియలేదు.

నడుస్తూనే వున్నాను అనంతంగా
మైలు రాయి వొక్కటయినా ఇందాకా  చూడలేదు.

గుబాళించే ఈ పూలన్నీ నావి కావు
నేను పడుకుని వున్న ముళ్ళ పడక నువ్వు చూడలేదు.

నన్ను ప్రేమించిన ప్రతి వొక్కరూ అంటారు
నేనొక బండ రాయినని!

 కాలుతున్న  కొవ్వొత్తిని కదా,
నన్నెవరూ తాకి చూడలేదు.



మూలం: బషీర్ బద్ర్


Friday, September 10, 2010

ఇఫ్తార్ సైరన్












నాకు భలే ఇష్టమయిన కేక!

ఇక ఈ పూట కడుపులో చంద్రోదయమే!


ముప్పొద్దులూ ఎక్కడున్నాయిలే

ఈ చీకటి పొయ్యిలో సూర్యుణ్ణి రాజేసేది

ఎప్పుడూ వొక్క పొద్దే!

కడుపులో భగభగా మండే సూర్యుళ్ళ చుట్టూ

గిరగిర తిరిగే భూగోళం అమ్మ.


ఎల్లా తెల్లారుతుందంటావ్?!

ఫజర్ నమాజ్ అయ్యాక

అజా పిలుపుకి ఆకలి తెలీదు

ఆ ఆకలి కేకకి భాషా తెలీదు



భూమి చుట్టూ ఏకనాదమయి మోగిన కంఠం

తిరిగి మసీదుని చేరేలోగా

కడుపు ఆ మూల ఖిబ్లా కన్నా ఖాళీ, ఖాళీగా..దిగులు దిగులుగా...


ఈ పగలు ఎంత స్వచ్ఛంగా వుందో తెలుసా?

మీరంతా ఎంత

పవిత్రమయిపోతున్నారో నెలంతా వొక్క పొద్దుతో!

నేను ఏళ్ల తరబడి

ఈ వొక్కపొద్దు అగ్నిలో కాలీ కాలీ

బూడిద కాలేక

మీరంతా తొక్కీ తొక్కీ

అలిసిపోయిన నిప్పు గుండంలా పడి వున్నా.



చిన్నప్పటి నించీ ఏం చూశానో ఏం విన్నానో

అదే చెబుతున్నా.

కాలెండర్లో రోజు రోజుకీ పెరిగిపోతున్న

రోజుల భారాన్ని మోయలేక నాన్న

అసహనంతో వేసిన కేకల్లో

ఎన్ని రోజా పిలుపులున్నాయో?



ఎప్పుడూ నిండుకునే ఇంట్లో

మిగిలిన ఖాళీల్ని భర్తీ చేయలేక

రెప్పల బురఖా కింద దాక్కున్న కన్నీటి చుక్క అమ్మ.

నిజంగానే

ఆ మూడో వాడు రాకపోతే

ముప్పొద్దులూ వుండెనా మాకు?!



5.20 ఇఫ్తార్

మధ్యాన్నమయ్యేసరికి గడియారానికీ చులకనే!

తక్కుతూ తారుతూ నడుస్తుంది రోగిష్టి ముండ!

ఆ గంజి నీళ్లూ, ఆ బూందీ ఓ అరటి పండూ

రోజంతా వెంటాడే ఆ తీయని పరిమళం


ఎలాగోలా జాలి పడి, పరిగెత్తవే కాలమా?



పోనీలే,

ఈ వొక్క నెలయినా వొక్క పొద్దయినా దక్కనీ...

ఇక మిగిలిన 330 రోజులూ మూడంకెలే కాదా!

నేనెంత పవిత్రమయిపోతున్నానో ఈ నెలంతా?!



                                            (1997, “వలస “ నించి)

(ఏదో వొక నెల పుణ్యం కోసం కాకుండా, పూటకి ఠికానా లేక, ఏడాదిలో మూడు వందల రోజుల పైనే వొక్క పొద్దులుంటున్న కోట్ల మందికి)

Tuesday, September 7, 2010

తేనెటీగల గుహ







ఈ దారి పక్కన ఎప్పుడు నడిచినా

కనీసం వెయ్యి తేనెటీగల తుట్టెలు

కదిలించినట్టే!



రాకాసి తేనెటీగలు

కట్టుకున్న తేనె గూడు

ఈ కొండ.




ఆకుపచ్చ లోయ

లోతు కనుక్కోమని సైగ చెసినట్టే వుంటుంది



అటూ ఇటూ కొండల అల్లిక జిగిబిగి

రహస్యాలు వెతుక్కుంటున్నట్టే వుంటుంది



రెండు కొండల మధ్య ఈ నడక

ఎప్పుడూ



పొరలుపొరలుగా

చుట్టుకున్న ఆచ్చాదనలన్నీ విప్పి



నన్ను నా లోపలి లోయల్లోకి

వడి వడిగ రువ్వుతుంది

                                 వడిసేల రాయిలాగా.



(ఆస్టిన్-టెక్సాస్ లో నాకు చాలా ఇష్టమయిన బీ కేవ్స్ దగ్గిర )

Sunday, September 5, 2010

వానలో హైదరాబాద్!




వొంటరి రాస్తా మీద
చిట్టికప్పల్లా ఎగిరెగిరి పడ్తుంటాయి చినుకులు

చినుకు వొక అల్లావుద్దీన్ అద్భుత దీపం.
దీని బుడగ దేహంలోకి నేను జారిపోతాను
నగరపు పైపై మెరుగుల నా దేహం
కాసేపు దీప కాంతిని ధరిస్తుంది.

వొంటరి రాస్తా పక్కన
కాసిన్ని వాన నీళ్ళు
పిల్ల మడుగులయి ఎటో పారాలని చూస్తాయి
నా వొంటిని మడిచి
కాయితప్పడవలాగా అందులోకి వదిలేస్తాను.

అది ఎటు వెళ్ళి
ఎటు వస్తుందా అని చూస్తూ వుంటాను.

దాని రెక్కల మీద నా కన్ను అతికిస్తాను.

అది కదలడం మరిచిపోయిందని
కాసేపటికి
అర్ధమవుతుంది నాకు.

ఈ వూళ్ళో వానకి ఏ పనీ లేదు
అది ఎవరికోసమూ కురవదు

తనలో తానే తపస్సు చేసుకునే నీటి బుడగ
ఓ అరక్షణం నన్ను నిలదీసే పాము పడగ.

Wednesday, September 1, 2010

హైదరాబాద్ వొక కవి సమయం

ఇది నన్ను వెతుక్కుంటుందో లేదో నహీ మాలూం -

లేకిన్-

నేనెప్పుడూ దీని వేళ్ళ సందులోంచి చిరిగిన ఆకాశాన్నీ, చింపిరి జుత్తు నేలనీ, కొంకర్లు తిరిగే చలి చెట్లనీ వెతుక్కుంటూ వుంటా పొద్దస్తమానం.


ఆ కాంపస్ కెళ్ళే దారిలో ఆ ఆకుపచ్చ మలుపు మీద వాలిపోయిన సాయంత్రం రెక్క మీద
ఎటు ఎగిరి వెళ్ళానో నహీ మాలూం..


కానీ-


జారిపోతున్న వొక రాత్రి దాని మోదుగు పూల ఎర్రదనంలో కరిగిపోతా ఇప్పటికీ.

ఇప్పుడక్కడ పొద్దుటా సాయంత్రం ప్రతి రాత్రీ వొక కల వెయ్యి గులాబీ రేకులై దారిని పరచుకుంది

అప్పుడెప్పుడో మరిచిపోయిన కల జెండా అయి ఎగరడం చూస్తున్నా.


ఈ చీకటి దారి చివర వొక సూర్యుడి కోసం

చూస్తున్నా.

యుద్ధంలో నువ్వూ నేనూ మనం

  యు ద్ధంలో వెనుకడుగువేయడం పిరికివాళ్ళ లక్షణం . పోరాడి గెలవాలని చరిత్ర ఎన్నో అనుభవాలనిచ్చింది. అయితే ఆ యుద్ధం మనతో మనకే అయితే..! మనిషికీ, ...