"వీడికి ఇంక పొట్ట కొస్తే తెలుగక్షరమ్ముక్క రాదు!" అనుకున్నారు నా తురకంతో విసిగిపోయి మా అమ్మా నాన్న.
బట్టలు ఉతకడం అనాల్సింది బట్టలు "కడగడం" అనీ, అంట్లు కడగాల్సింది పోయి " అంట్లు ఉతకడం" అనీ అనేవాణ్ణి నా నాలుగో తరగతి దాకా! చింతకానిలో నా ఉర్దూ మీడియం చదువూ, దానికి తోడు నా వీధి బడి పంతులు వీర బాదుడూ నన్ను ఆ రోజుల్లో తెలుగు భాషకి దూరం చేశాయి. తెలుగు రాకపోతే ఎలా అని అమ్మా నాన్న దిగులు పడడం మొదలుపెట్టారు. తెలుగు వల్ల నా నాలుగో తరగతి చదువు నరకమయి పోయింది నాకు! తెలుగు రాకపోతే పర్లేదులే ఆ ఉర్దూ అరబ్బీ సరిగ్గా ఏడిస్తే చాలు అంది అమ్మమ్మ. ఇంగ్లీషు బాగా చదువుతున్నాడు, "ఇనఫ్..ఇనఫ్" అని సంబరపడిపోయాడు పెద మామయ్య. "అమ్మో, తెలుగు రాకపోతే ఎలా? నా పరువు గంగలో కలిసిపోతుంది" అనుకున్నారు నాన్న, పైకి చెప్పకపోయినా!
అప్పుడు మా అమ్మానాన్నకి వొక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది, వీడి తెలుగు ఇంటి చదువుకి ఎలాగూ బాగుపడదు అనుకున్నారు. వొక సాయంత్రం ఇద్దరూ నన్ను తీసుకువెళ్లి, శుభలక్ష్మి టీచరు ఇంట్లో పడేశారు. అప్పటికే ఆ ఇంటి వసారాలో పది పదిహేను మంది నా ఈడు పిల్లలు అమ్మ, ఆవు, ఇల్లూ, ఈగా అంటూ నానా యాగీ చేస్తున్నారు. వాళ్ళంతా నిజానికి నా ఈడు పిల్లలు కాదనీ, నేను వాళ్ళ కంటే పెద్దవాడినని, వాళ్ళు వొకటో క్లాసో, రెండో వెలగబెడ్తున్నారనీ నాకు తరవాత అర్థమయ్యింది.
శుభలక్శ్మి టీచరు నన్ను ఎగదిగా చూసి, "చూడడానికి టమాటా పండులా వున్నావ్! ఎందుకు రాదు, తెలుగు నీకు చక్కా వస్తుంది లే!" అనేసింది ఇంకేం ఆలోచించకుండా! "వీడి సంగతి నేను చూసుకుంటాలే సారూ!" అని అమ్మా నాన్నని పంపించేసింది శుభలక్ష్మి టీచరు. అంతే, నేను "ఆ అంటే అమ్మ" అని దిద్దుతూ వుంటే, నా కంటే వయసులోనూ, సైజులోనూ అన్ని విధాలా చిన్న వాళ్లయిన అరుణా, అజయ్, నాగి, అహ్మదూ, ప్రసాదూ, పద్మా కిస్సుక్కు కిస్సుక్కున నవ్వుకోవడం నాకు వినిపిస్తూనే వుంది.
కాసేపు శుభలక్ష్మి టీచరు వాళ్ళని గమనించి, వాళ్ళ పలకలు లాక్కుని 'అలీఫ్ బే తే" అని మూడక్షరాలు రాసి దిద్దమంది. (టీచరుకు ఆ మూడక్షరాలే వచ్చని నాకు తరవాత తెలిసిన సీక్రెటు!) అంతే, ఆ కిస్సుక్కు గాళ్ళంతా తలకిందులయి పోయారు. "ఇప్పుడు నువ్వు రాయరా?" అని నన్ను బోర్డు దగ్గిరకు లాక్కెళ్లింది. ఇదే అదను రచించెదను....అనుకొనేసి, బోర్డు మీద ఎడమ వైపు నించి సర్రున నాలుగు వాక్యాలు ఉర్దూలో రాసే సరికి, కిస్సుక్కు గాళ్ల మైండు బ్లాకయి, బ్లాంకయి పోయింది. కాకపోతే, వొక సమస్య ఏమిటంటే, వొక వారం రోజుల పాటు నేను తెలుగు అక్షరాలు కూడా ఎడమ వైపు నించే రాసే వాణ్ని. కుడివైపుకి రావడానికి నానా యాతనా పడాల్సి వచ్చింది.
ఈ పూట నా మూడు మొహాల చదువుని తలుచుకుంటూ వుంటే, ఆ శుభలక్ష్మి పంతులమ్మే గుర్తొస్తోంది.
"నేను కుడివైపుకి అలవాటు పడి, తెలుగు రాయగలను" అన్న ఆత్మవిశ్వాసం నాలో వెలిగించిన శుభలక్ష్మి పంతులమ్మగారిని ఈ పూట తలచుకోకపోతే, అది నన్ను నేనే మరచిపోవడం!
ఆ పంతులమ్మ గారు ఎక్కడున్నారో నాకు తెలియదు! కానీ, ఇప్పటికీ గుండ్రంగా అందంగా వొక తెలుగక్షరం రాసినప్పుడల్లా, పోనీ టైపు కొట్టినప్పుడల్లా, ఆ అక్షరాల అందంలోంచి ఆమె అందమయిన చిరునవ్వే కనిపిస్తుంది.
అప్పుడు ఆ కిసుక్కు గ్రూపు మీద నాకు ఎంత కసి పుట్టిందంటే, ఆరోతరగతికి వచ్చే సరికి నేను మా శుభలక్ష్మిపంతులమ్మ గారికి వొక కథ రాసేసి - అవును తెలుగులోనే- చూపించాను. ఆ రోజు ఆమె కళ్ళలోని మెరుపు ఇప్పటికీ నాకు కనిపిస్తూనే వుంది.
అమ్మయ్య, నా మొదటి తెలుగు గండం గట్టెక్కింది!
ఆ తరవాత నా రెండో తెలుగు పర్వం మొదలయ్యింది ఖమ్మంలో జ్యోతి బాల మందిర్ లో!
ఆ విషయం తరవాత మాట్లాడతాను!
(ఇవాళ టీచర్స్ డే సందర్భంగా...)
10 comments:
ఆలిఫ్ బేతే చితగ్గొట్టేశారన్న మాట.
క్యూట్ స్టోరీ
ఆ పంతులమ్మ గారు ఈ బ్లాగ్ చదివితే ఎంత సంతోషిస్తుంది కదా, తన విద్యార్ది ఇంత చక్కని తెలుగు నేర్చుకుని, ఒక మంచి కవి ఐనందుకు!
తెలుగు రాకపోతే ఎలా అని అమ్మా నాన్న దిగులు పడడం మొదలుపెట్టారు_____________తెలుగు వస్తుందేమో అని భయపడే వాళ్ళ మధ్య బతుకుతున్న నాకు ఈ మాటలు చెవుల్లో అమృతం పోసినట్టు వినిపిస్తూ కనిపిస్తున్నాయి.
ఆ తరంలో ఏ టీచరు చూసినా మీ శుభలక్ష్మి టీచరమ్మ లాంటి వాళ్ళే! లెక్కలు రాకపోతే ఇంటికి పిలిపించి కూచోబెట్టి(డబ్బులక్కాదు)చెప్పినవాళ్ళూ, వెంటబడి హిందీ నేర్పించి వ్యాస రచనదాకా తీసుకెళ్ళిన వాళ్ళూ.... ఆనాడు విద్యార్థికీ టీచర్ కీ మధ్య ఉండే కనపడని సన్నని బంధమేదో ఈనాడు ఉన్నట్టు (పూర్తిగా తెగిపోయిందనలేను గానీ) కనపడదు. ఎంతోమంది టీచర్లను చూశాక అంటున్నా ఈ మాటైనా!
ఆది పర్వం అవగొట్టారు...ఆ ద్వితీయ పర్వమేదో తొందరగా చెప్పండి!
అరో తరగతిలోనే కథ రాసేసారా? మీరు సామాన్యులు కారు.
అఫ్సర్ భాయ్ .
... కిసుక్కు ....క్కు... క్కు...
ఈ సౌండ్ అలా కాదు, ఇంకోలా, మరోలా ,
మీ మీద అభినందనల పూలు పడేలా...
@కొత్త పాళీ: అప్పటి ఉరుదూ పిచ్చి అలాంటిది!
@అనిల్; శుభలక్ష్మి పంతులమ్మ గారు ఎక్కడున్నారో తెలీదు! మేం పట్నం రావడంతో వాళ్ళందరూ దూరమయి పోయారు.
@సుజాత: అవును, మీరన్నది నిజం. అన్నిటితో పాటూ, అదీ వ్యాపారమయిపోయింది. కానీ, ఇప్పటికీ అంకితభావం వున్న అధ్యాపకులు మనకు వున్నారు, అదీ కొంతలో కొంత అదృష్టం.
@శ్రీ: కథ మాత్రమే కాదు, కవిత్వం కూడా! క్లైమాక్స్ యేమిటంటే, చివరికి స్కూల్ డే నాడు మా కోతిమూకతో కృష్ణదేవరాయల మీద "రారాజు" అని వొక మూడు అంకాల నాటిక వేయించాను. ఆ నాటిక కథ- మాటలు, పద్యాలు, దర్శకత్వం, హీరో, అన్నీ మనమే! సూపర్ హిట్ ఆ రోజుల్లో! కాకపోతే, అందులో కృష్ణదేవరాయలు మరీ మాడ్రన్ తెలుగు మాట్లాడాడని ఆ తరవాత పోస్ట్మార్టం లో తేలింది.
మీ సజీవమైన వచనం వెనుక కథలోని మీరు, శుభలక్ష్మి టీచరు గారు, మీ బుడ్డి స్నేహితులు, ఆ వెనక ఇప్పుడు అది చదువుకొని సంతోషిస్తున్న మేము.. ప్రాణం కాసేపు హాయిగా ఉంది..
మీ మొహం లో టమేటా కనుక్కొని.. బహుశా ఆవిడే మీలోకి కవిత్వం కూడా తనవంతు సరఫరా చేశారనుకొంటా..
kisukku group!
e lanti grouplu appudu kudaa undevi ani ippude thelustondi sir.
kaani eppudu alaanti grouplu kaasta balapaddayi.
chaala baagundi sir. aa panthulamma gaaru deenini chadivithe chaala anandistundi.
ఎంతో ఆర్ద్రమైన జ్ఞాపకాలు అఫ్సర్. గురు పరంపర అంటే ఇదే. ఒక గురువునుండి ఆ దీపకళిక ఇంకొకరిని వెలిగిస్తూపోవడమే. మనఃపూర్వక అభినందనలు.
NS మూర్తి.
ప్రతి ఒక్కరికీ ఓ "శుభలక్ష్మి" ఉండే తీరుతారు పాతికేళ్లనాడు పాఠశాలల్లో ఉన్నవారికి కదండి. నా కథ కాస్త తారుమారు - హిందీ నేర్పిన "సీతారత్నం" గారు అంతే! మీరు రాసిన మిగిలిన విశేషాలు మరి మీ గురువు గారికి తెలుసునా?
Post a Comment