అమెరికాలో
ఎక్కడికైనా వెళ్ళడం వేరు, అరిజోనాలోని టూసన్ అనే నగరానికి
వెళ్ళడం వేరు. మరీ తెలియని భాషలో అసలేమీ తెలియని రచయిత రాసిన పుస్తకం ఏదో చదువుతున్నట్టే
అనిపించింది. ఎయిర్ పోర్టులో దిగగానే ఎంతో ఎత్తయిన బలిష్టమైన
కొండ బ్రహ్మజెముడు వృక్షాలు చూపుని
కట్టిపడేస్తాయి. చుట్టూ వున్న ఎడారిని ధిక్కరించి నిలబడే ఈ వృక్షాలు వాటికవే
శిల్పాల్లా కనిపించాయి. ఎయిర్ పోర్టు నుంచి అరిజోనా యూనివర్సిటీకి తీసుకెళ్లిన
డ్రైవర్ అహ్మద్ కి ఈ వూరంటే మహా ఇష్టం. ఎప్పుడో ముప్ఫయేళ్ల కిందట ఆఫ్గన్ దేశం నుంచి తిన్నగా ఇక్కడికే
చేరుకున్నాడు అహ్మద్. “అప్పుడు ఇదంతా ఇంకా కొంత ఎడారిలానే వుండేది,” అని అతను వచ్చీ రాని ఉర్దూలో అఫ్గానీ యాసలో చెప్తున్నాడు. అప్పటికే ఈ
వూరు గురించి కొంత చదివాను కాబట్టి, నాకు వెంటనే అరిజోనా కవి
డాన్ హిగిన్స్ రాసిన కవిత గుర్తొచ్చింది. టూసన్ అంటే నల్ల కొండ పాదాల కింది ఊరు
అనే అర్థం వుందట. చుట్టూ నల్లగా ఎత్తయిన కోటగోడల్లా నిలబడి వున్న కొండల్ని చూస్తే
అలాగే అనిపించింది.
దిగంతంలోకి సూర్యాస్తమయం
కొంత నెత్తురోడుతుంది.
టూసన్, నువ్వు ఎడారి కలల కాన్వాస్ కదా,
బ్రహ్మజెముడు వృక్షాలు నిటారుగా నిలబడే వుంటాయి
పురాతన కాలాల సైనికుల్లా-
వాటి ముళ్ళ దేహాలు
గాలితో ఏదో గుసగుసలాడుతూ వుంటాయి ఎప్పుడూ-
నేను
కవిత్వాన్ని తలచుకుంటున్నప్పుడు రోజువారీ జీవితంలోని సంఘర్షణ ఏదో
చెప్పుకొస్తున్నాడు డ్రైవర్ అహ్మద్. “నేను వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా చాలా
మారిపోయాయి. తప్పదు కానీ, వ్యత్యాసాలు బాగా పెరిగాయి”
అంటున్నాడు. పేదరికం ఎక్కువగా వుండే ఫిలాడేల్ఫియా నగరం నుంచి వచ్చిన వాణ్ని
కాబట్టి అదేమీ విశేషంగా అనిపించలేదు. చూస్తూ వుండగానే మాకు బస ఏర్పాటు చేసిన
యూనివర్సిటీ కాంపస్ లోని హోటల్ వచ్చేసింది.
అప్పటికే
అక్కడొక మేళా జరుగుతున్నంత సందడి వుంది. హోటల్లోకి అడుగు పెట్టగానే పొడుగాటి
క్యూలు, అటూ ఇటూ హడావుడిగా నడుస్తున్న వాళ్ళు.
మధ్యలో పుస్తకాల షాపు. మాకు స్వాగతం చెప్పడానికి ఇద్దరు ముగ్గురు వలంటీర్లు. పండగ
వాతావరణమే అంతా- నిజానికి అక్కడ వున్న మూడు రోజులూ, ఆ తరవాత
అనువాద సభల రెండో భాగం జరిగిన చికాగో యూనివర్సిటీ కాంపస్ లో వున్న మూడు రోజులూ అదే
పండగ వాతావరణం. దేశాదేశాల రచయితలు ఈ
అమెరికా అనువాద ఉత్సవాలకి వచ్చారని వాళ్ళ వాళ్ళ ముఖాలు చూస్తేనో, భాషలు వింటేనో తెలుస్తూనే వుంది. ఇన్ని దేశాలూ,
భాషల మధ్య “తెలుగు” అంటే ఏమిటన్న ప్రశ్న ఎప్పటిలానే నన్ను నిలదీస్తోంది.
2
దాదాపు
యాభై యేళ్లుగా ఎక్కడా ఆగకుండా అనువాదాల
మీద పనిచేస్తున్న సంస్థ – అమెరికన్ లిటరరీ ట్రాన్స్ లెటర్స్ అసోసియేషన్ (ఆల్టా). ఏడాది
కిందట ఆ సంస్థ నిర్వాహకుల నుంచి నాకు ఈమెయిల్ వచ్చినప్పుడు వాళ్ళెవరూ నాకు తెలీదు.
ఈ సంస్థలో కనీసం నాకు సభ్యత్వమూ లేదు. ఈ ఏడాది మొట్టమొదటిసారి వాళ్ళు వాళ్ళ భాషల జాబితాలో
తెలుగుని కలిపారు. అప్పటిదాకా హిందీ, ఉర్దూ,
అప్పుడప్పుడూ కన్నడ మాత్రమే వాళ్ళ జాబితాలో వున్నాయి. అనువాదకులు మాత్రమే కాకుండా, యూనివర్సిటీ స్థాయిలో అనువాదాల చుట్టూ కోర్సులు చెప్తున్న వాళ్ళని
నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ రెండీటిలోనూ నా పాత్ర పరిమితమే. ఆ విషయమే
నిర్వాహకులకు చెప్పాను. “మా దృష్టిలో మీరే వున్నారు.
రావాల్సిందే” అని వెంటవెంటనే వాళ్ళు ఏర్పాట్లు చేశారు.
టూసన్
లో జరిగిన సదస్సుల్లో ఎక్కువ భాగం యూరోపియన్ భాషలే. ఆ భాషల్లో అనువాదాలు చేస్తున్న
అమెరికన్ రచయితలూ,అధ్యాపకులు. దక్షిణాసియా నుంచో, ఇండియా నుంచో వచ్చిన వాళ్ళని వేళ్ళ మీద లెక్కపెట్టాల్సిందే. ఆ కొద్ది
మంది కూడా బంగ్లా దేశ్ లేదా పాకిస్తాన్. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళలో కన్నడ నుంచి
వివేక్ షాన్ బాగ్ అనువాదాలు చేసిన శ్రీనాథ్ పేరూర్, కాశ్మీరీ
రచయిత అజర్ వాని, తెలుగు నుంచి నేను మాత్రమే వున్నాం. ఒకరు
బంగ్లా నుంచి, మరొకరు పాకిస్తాన్ నుంచి, హిందీ భాష కోసం ప్రసిద్ధ అనువాదకురాలు డైసీ రాక్ వెల్ వున్నారు. అందువల్ల, మూడు రోజుల పాటు జరిగిన ప్రతి సెషన్ లోనూ ఎంతో కొంత మాట్లాడక తప్పలేదు. తెలుగు
మాత్రమే కాకుండా, దక్షిణాసియా సాహిత్య పాఠాలు చెప్పే
అధ్యాపకుడిగా హింది, ఉర్దూ భాషల అనువాదాల ప్రాముఖ్యాన్ని
కూడా చెప్పాలని నిర్వాహకులు ముందే చెప్పారు. ఇది అంత తేలిక కాదు కానీ, చాలా మటుకు తెలుగు కేంద్రంగానే ఎక్కువ మాట్లాడాను.
3
ఈ
వారం రోజుల సభల్లో నా మొదటి ప్రతిపాదన: లిఖిత సాహిత్యాల మీద వున్న శ్రద్ధ మౌఖిక
సాహిత్యాల మీద లేనే లేదని! ఇదేమీ కొత్తది కాదు కానీ, అక్కడ
వున్న ఎక్కువ మందికి ఆ విషయం అంత బలంగా చేపప్దమ్ నచ్చినట్టుంది.
కీలకోపన్యాసాలిచ్చిన ఇద్దరు ముగ్గురు ప్రసిద్ధులు వాళ్ళ వాళ్ళ ప్రసంగాల్లో నా
ప్రతిపాదనని హాయిగా ప్రస్తావించడమే కాకుండా, ఈ మూడు రోజులూ
నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ చాలా సేపు మాటల్లోకి దింపారు. నా
అభిప్రాయాల్లోంచి చాలా శ్రద్ధగా తీసుకున్న నోట్సులు చూపిస్తూ, ఒక్కో విషయం ఆరాతీశారు. తెలుగుకి సంబంధించినంత వరకూ తెలంగాణ సాయుధ పోరాటం
తరవాత మౌఖిక సాహిత్యాల మీద పెరిగిన ఆసక్తి గురించి వివరంగా చెప్పాల్సి వచ్చింది.
అలాగే, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాల్లో
వివిధ స్థానిక ఉద్యమాల చరిత్రలో ఈ మౌఖిక సాహిత్యం ఎలా భాగమైందో కూడా
చెప్పుకొచ్చాను.
సాహిత్య
సృజనలో వుండే అనేక భాషల జమిలి (హైబ్రిడ్) తత్వాన్ని అనువాదాల్లోకి తీసుకురావాల్సిన
అవసరం వుందన్నది నా రెండో ప్రతిపాదన. ఇది కూడా మంచి చర్చకి తావిచ్చింది. శ్రోతలు
దీనికొక ఉదాహరణ అడిగినప్పుడు తెలుగు- దఖనీ ఉర్దూతో పాటు, రాయలసీమలో తెలుగూ, కన్నడ భాషల హైబ్రిడ్
సృజనలోంచి కొంత వివరించాను.
ఇక
మూడో ముఖ్యమైన ప్రతిపాదన: ప్రపంచ భాషల పటంలో తెలుగు కానీ, దఖనీ కానీ ఎక్కడ నిలుస్తాయో, కలుస్తాయో
చెప్పడం! మొదటి నించీ ఈ రెండు భాషలకూ ఒక అంతర్జాతీయ నెట్ వర్క్ వుందని నా వాదన.
సంస్కృతం నుంచి విడివడ్డాక తెలుగులో , అలాగే, పర్షియన్ నుంచి
విడివడ్డాక దక్షిణాది ఉర్దూలో ఇది బలంగా కనిపిస్తుంది. సాహిత్య సంస్కృతికి ప్రపంచం
అనే ఇరుసు కాకుండా, స్థానికత అనే కేంద్రం నుంచి చూసినప్పుడే
ఈ ప్రాపంచికత అర్థమవుతుంది. ఆ దృష్టి నుంచి చూస్తే ప్రపంచ భాషల నుంచి అనువాదాలు
ఎంత అవసరమో, మరీ స్థానిక భాషల నుంచి ఇంగ్లీషులోకి, ఇతర పెద్ద యూరోపియన్ భాషల్లోకి కూడా అనువాదాలు వెళ్ళాల్సిందే.
ఈ
అనువాదాల్లోంచి టూసన్ లాంటి కొత్త ప్రదేశమైనా, ఆఫ్ఘన్
లాంటి ఇతర భాష అయినా చిరపరిచితమయ్యే కొత్త పుస్తకాలే అవుతాయి. ముఖ్యంగా చికాగో
యూనివర్సిటీ కాంపస్ లో జరిగిన సదస్సుకి ముగింపు మాటలు చెప్పే అవకాశం నాకు
దొరికింది. “సాహిత్యంలో సృజన ఎంత ముఖ్యమో, అనువాద సృజన అంతే
ముఖ్యం. అప్పుడు సరిహద్దుల మధ్య గోడలు కూలిపోతాయి. భాషల మధ్య వంతెనలు గట్టిగా
నిలబడతాయి.”
*
No comments:
Post a Comment