వంశీ:
మీ ప్రశ్నలు బాగున్నాయి, ఎప్పటిలానే చాలా హాస్యస్ఫోరకంగా వున్నాయి. మీ వాక్యం ఢమరుకం అని నేనే ఎక్కడో అన్నాను కదా. సరదాగా/ సీరియస్ గా చదువుకొని ఆనందిస్తున్న/ ఆలోచిస్తున్న సమయంలొ వర్మ గారు "వాటికి సమాధానం ఇవ్వరా? " అని నిలదీశారు.
వాటన్నిటికి సమాధానం ఇచ్చే శక్తిగాని యుక్తిగానీ నాకు వున్నాయని అనుకోను. కాని, వొక ముఖ్యమయిన విషయం మీ ప్రశ్నల్లో వుంది. కవిత్వం చదవడం కచ్చితంగా భిన్నమయిన అనుభవం. ఈ కవిత 1996లో మొదటి సారి "ఇండియా టుడే" సాహిత్య వార్షికలో అచ్చయింది. తరవాత అనేక సంకలనాల్లో చేరింది. కనీసం ఇద్దరు దీనిని ఆంగ్లంలోకి అనువదించారు. ఒక అనువాదం ఇండియన్ లిటరేచర్ ఆంగ్ల పత్రికలొ అచ్చయింది. మరో అనువాదం నా.సి. (కొత్త పాళీ) గారి బ్లాగులో ఆయనే చేసారు. ఇక్కడ దీన్ని పవర్ఫుల్ కవిత అని వ్యాఖ్యానించిన వారు కూడా ఆయనే. ఇప్పటి వరకూ చాలా మంది విమర్శకులు ఈ కవితని ఉల్లేఖిస్తూ రాసారు.
వారెవ్వరూ ఇంత ఆసక్తి కరమయిన ప్రశ్నలు అడగలేదు. రెండు భాషలతో వ్యవహరించవలసిన అనువాదకులు కూడా మీ మాదిరి అర్ధ సంక్షోభంలో పడలేదు.
సాధారణ భాషకీ, సాహిత్య భాషకీ మధ్య ఉన్న వ్యత్యాసం మీకు చెప్పేంత వాణ్ని కాదు. కాని, సాధారణ భాషని వాడుకుంటూనే, ఆ భాషనీ అసాధారణమయిన ఎత్తులకి తీసుకు వెళ్ళడం కవిత్వం చేసే పని అనుకుంటా. ఉదాహరణకి: ఉమ్మ నీరుని ఉమ్మి చేయ్యోద్దంటాను అన్నప్పుడు ఉమ్మ నీరులో ఏమేం ఉంటాయో ఒక శాస్త్రవేత్తగా చెప్పడం వేరు. ఉమ్మ నీరుకి అమ్మతనానికీ మధ్య ఉన్న ఉద్వేగపూరితమయిన ముడిని చెప్పడానికి శాస్త్రవేత్త భాష పనికి రాదు. అందులో పుట్టుకకి సంబంధించిన వేదన కూడా వుంది. ఆ వేదన, ఉద్వేగం ఎంతో కొంత అర్ధం అయ్యింది కాబట్టే, సౌమ్య వెంటనే " ఆర్ద్రంగా వుంది, కళ్ళు చెమర్చాయి" అని రాయగలిగారు అనుకుంటా -- వడ్రంగి పిట్ట కూడా "కళ్ళలో నీళ్ళు సుళ్ళు తిరిగాయి" అన్నారు. కవిత "పవర్ఫుల్" గా వుంది అని కొత్త పాళీ అనడానికి కూడా ఎంతో కొంత ఈ ఉద్వేగమే కారణం అనుకుంటా.
అంత మంది అలా అన్నప్పుడు వారి స్పందనలోని నిజాయితీని అనుమానించ లేం.. కదా! కాబట్టి ఈ కవితలో సాధారణమయిన మాటలే ఏదో ఒక అసాధారణమయిన శక్తిని చూపిస్తున్నాయి. అదే కవిత్వీకరణ అనుకుందాం. మనలో గొప్ప భాషా శాస్త్రవేత్త కాని, శాస్త్రవేత్త కాని భాషని ఒక స్థాయి దాకా అందుకోగలరు. భాషని అత్యంత తర్కబద్దంగా ఉపయోగించగలరు. కాని, కవిత్వంలో వుండే వ్యాకరణం అర్ధం కావడానికి ఆ ఇద్దరికీ వుండే తర్కం మాత్రమె సరిపోదు. ఉద్వేగాన్ని తర్కించ లేమని బుచ్చి బాబు ఎక్కడో అంటాడు. మరి కవిత్వ భాష బ్రహ్మ పదార్థమా? కాకపోవచ్చు. కొందరి విషయంలో అవునూ అవవచ్చు.
కవిత్వ భాష భిన్నమయింది మాత్రం అనగలను. ఈ భాషని ఇక్షు రసంగా మార్చే వారు కొందరు, నారికేళ పాకం చేసే వారు కొందరు, పాషాణ పాకం చేసే వారు మరికొందరు. కానీ, ఈ కవితలో పాషాణ పాకం లేదని కూడా చెప్పగలను, ఎందుకంటే, కొంత మందికి ఇది అర్ధమయి, స్పందించే అవకాశం కూడా ఇచ్చింది కాబట్టి.
మీ ప్రశ్నలకి సమాధానం ఇంకా వెతకాలి నేను. ఆ వెతుకులాటకి ప్రారంభం ఈ కవిత్వ/ శాస్త్ర వ్యాకరణ వైరుధ్యం, భిన్నత్వం వొక ప్రారంభం మాత్రమే. కాని, ఈ కవితని ఇంకా చక్కగా, అర్ధ వంతంగా వివరించగల/వ్యాఖ్యానించ గల సమర్ధులు వున్నారనే నమ్మకంతో, వారి అభిప్రాయాల్ని సైతం ఆహ్వానిద్దాం.
సంచయనం
-
ఈ వారం ( డిసెంబర్ మూడు, 2017) ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధం లో ప్రచురితమయిన
నా కథ " సంచయనం".
http://lit.andhrajyothy.com/tajakadhalu/sanchayanam-10635
7 years ago
19 comments:
అఫ్సర్
మీరన్నట్టు కవిత్వ భాష నిస్సందేహంగా భిన్నమయినది. ఇతరుల నిజాయితీ నేను శంకించలేదు. వారికి కలిగిన ఉద్వేగం నాకు కలగలేదు అని చెప్పటానికి ఆ మాటలు ఉటంకించాను. అక్కడే నాలోనే లోపం ఉందేమో అన్న భయోమయం వ్యక్తపరిచాను.
పాషాణపాకం లేకున్నా అసలు వారికి కలిగిన ఉద్వేగాన్ని నాలో ఎందుకు కలిగించలేకపోయింది అని ఆలోచిస్తూ ఉంటే బుఱ్ఱ గోరువెచ్చగా వేడెక్కిన తరువాత, అనగా మరిగి తఱక కట్టకముందే అందులో నుంచి కొన్ని ప్రశ్నాపనిముట్లు తీసి ఆ టపాలో వేసా! మీరన్నట్టు అది "అర్థ సంక్షోభమే".
నాకు "అర్ధ సంక్షోభమే" అని కూడా అనిపిస్తోంది ఇప్పుడు కొద్దిగా చల్లబడ్డ తరువాత.
కవిత్వ భాష బ్రహ్మపదార్ధం అవ్వచ్చు, కాకపోవచ్చు అన్న దానితో "రెలటివ్" గా ఏకీభవిస్తున్నా. అది పరబ్రహ్మ స్వరూపం అని మటుకు చెప్పగలను.
ఇతరుల అభిప్రాయాలు మనకొద్దండీ....మనం మనం చూసుకుందాం....! లోకోభిన్నరుచి కాబట్టి - ఇది కూడా ఎక్కలేదా నీకు అని ఒకాయన, ఇది నేనే రాసుంటే ఇలా రాసుండేవాడినని ఒకాయన, అసలు నాకర్థమయ్యింది ఇది అని ఒకాయన - ఇలా వీర కంపు చేసి మీ ఇంపైన కవితను, నా సొంపైన బుఱ్ఱను కొలిమిలోకి తోస్తారు...:) అవి చదివి ఊరుకోలేని నేను ఆవేశ వంశీ రూపం ధరించి అశ్మములు, మృత్తికలు తీసుకుని రావాల్సొస్తుంది....
అలా కాకుండా చక్కగా అర్ధవంతంగా, అర్థవంతంగా విశదీకరిస్తే వారికి మా గొల్లనడిగి, ఇది చలికాలమైనా సరే కుండెడు చల్ల ఇప్పిస్తా!
నా కామెంటుకు సమాధానంగా ఏకంగా ఓ పోస్టే వేసినందుకు బోల్డు ధన్యవాదాలు....
భవదీయుడు
వంశీ
అయ్యా వంశీ గారు అఫ్సర్ గారి కవితను మీరు పోస్ట్ మార్టం చేయడానికి ప్రయత్నించిన తీరు చూస్తుంటే ద్రౌపది వస్త్రాపహరణం సీను ఎప్పుడొస్తుందా, చీర విప్పితే ఏమైనా కనబడదా అన్న ఆసక్తితో డ్రామాకొచ్చిన వారు, ఆ సీను చూసి కళ్ళు ఎఱబారి రక్శించబూనిన కామకేళీ విలాస పురుషుడైన శ్రీక్రిష్ణున్ని కూడా భక్తితో ధ్యానించిన వారున్నట్లు అనిపించింది. మహాకవి కాళిదాసు కాళీ మాత పాలిండ్లు వర్ణించిన తీరును మనం ధ్యాన శ్లోకంగా చేసుకున్నామని వాటినే చూస్తూ ప్రార్థిస్తారా ఎవరైనా? అవి కాళిదాసు వర్ణించేంతవరకు వాటివైపు చూసారా ఎవరైనా? దేవతా విగ్రహాన్ని కామవికారంతో చూస్తామా? అలాగే కవితా పాదాలలోని భావాన్ని అనుభవించిన వారి గురించి మీరు చేసిన వెటకారం అలానే వుంది. మీ గొల్లనడిగి చల్ల మీరే తాగి వీలైతే ఐస్ క్రీం కూడా తిన్నా మాకభ్యంతరంలేదు...
@ వడ్రంగి పిట్ట
పిట్టా కొంచెమే, కూతా కొంచెమే...:)
నా కామెంటు మీద వెలువరించిన అతి విలువైన మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.
భవదీయుడు
వంశీ
కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ రచననైనా) చదవడం వ్యక్తిగత (subjective) అనుభవం అని మనం ఆమోదిస్తే, దానికి పొడిగింపు (corollary)గా అన్ని రచనలూ అందరు పాఠకుల కోసమూ కాదు అని కూడా మనం ఒప్పుకోవచ్చు. ఒక రచన ఒక పదిమందిలో ఇంచుమించు ఒకేలాంటి ఉద్వేగాలని రేపినందువల్ల, పదకొండో వ్యక్తిలో అటువంటి ఉద్వేగం కలిగించక పోయినట్లైతే అంత మాత్రం చేత అది ఆ వ్యక్తిలో "లోపం" కాదు. రచనలో లోపం అంతకంటే కాదు.
ఇది తుని తీర్పులాగా ఉన్నదీ అంటే .. కొన్ని అంతే మరి.
నా మనసులో తరచూ మెదిలే ఇంకో విషయం - తెలుగు కవిత్వం, తెలుగు సాహిత్యం బాగా విస్తృతమైనవి. అందులో అనేక రూపాలకీ అనేక అనుభవాలకీ స్థానం ఉంది. ఈ స్థానం ఒకరు ఆమోదిస్తేనో, ఒకరు కల్పిస్తేనో వచ్చేది కాదు - దానికదే ఉంది, స్వయంభువుగా. ఉదాహరణకి - కొందరికి కవిత్వం అంటే ఛందో రూపంలో ఉంటే తప్ప అదసలు కవిత్వమే కాదు. దీనికి పూర్తిగా వ్యతిరేకదిశలో ఉన్న మరి కొందరికి ఛందస్సులో ఉన్నదేదైనా (ఇప్పుడు రాసినదైనా, వెయ్యేండ్ల కిందట రాసినదైనా) అనాగరికమే, పనికి రానిదే. కవి ఎలాగైతే స్వీయానుభవాన్ని విస్తృత పరిచి సారవజనీనం చెయ్యడానికి ప్రయత్నిస్తాడో అలాగే కావ్య పాఠకుడు స్వీయానుభవాన్ని దాటి తన ఆస్వాదన సామర్ధ్యాన్ని విస్తరింప చేసినప్పుడు ఆ సార్వజనీనతని తన అనుభవంలో తెచ్చుకోగలుగుతాడు.
The Rishis said "A no bhadrAH kratavo yantu vishvataH"
They do come from all sides, but the question is - are we open to them?
Thanks to both Vamsi and Afsar for a very engaging discussion.
వంశీ గారి ప్రశ్నల నుంచి ఇంకొక ఆలోచన వచ్చింది. కవిత్వాన్ని ఆస్వాదించడం ఎలాగో నేర్పించగలమా? ఇది నేర్పితే నేర్వగలిగిన విద్యేనా?
హైస్కూలుదాకా తెలుగు వాచకాల్లో పద్యభాగం అంటే - ప్రతిపదార్ధం, భావం రాయడం, కవి పుట్టుపూర్వోత్తరాలు, ఇట్లాంటి సంబరమే. మరి కాలేజిలో పీజీలో తెలుగు సాహిత్య బోధన ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. అందులో ఎక్కడైనా అసలు ఆధునిక కవిత్వ బోధన కానీ చర్చకానీ ఉన్నదేమో తెలియదు. దీన్ని గురించి ఎవరికైనా తెలిసి ఉంటే పంచుకోగలరు.
కవిత్వాన్ని ఆస్వాదించడం ఎలాగో నేర్పించగలమా?
______________________________
అచ్చంగా ఇది ఆశించే, నాకర్థం కాని కవిహృదయం తెలుసుకుందామనే ఆ ప్రశ్నలు వేసింది. అయితే అఫ్సర్ గారు నాకర్థమయ్యే "టీక" రూపంలో కాకుండా వివిధోపచార వచనరూపంలో దెబ్బ వేసారు. :)
ప్రతి కవి ఈ టీక బాట పట్టాలనుకోవడం ఓ రకంగా అత్యాశే అయినా, ఆశించడంలో తప్పు లేదుగా. ఒకవేళ ఆ బాట పడితే మటుకు అంతకన్నా సంతోషం లేదు. ఆ కవి హృదయం అందరికీ తెలుస్తుంది. కవితకు ఆలంబన ఏమిటో, అది వ్రాసినప్పుడు ఆయనకు కలిగిన ఆలోచనేమిటో, దానికి సహాయపడ్డ వాతావరణమేమిటో, కవితా స్వరూపమేమిటో పాఠకుడికి కొద్దిగా ఎఱికలోకి వస్తుంది.
మీరు సూచించిన విభాగాల్లో నేను ఛందో విభాగంలో పడిపోతాను కాబట్టి నాకు ఇలాటి కవితలు చూసినప్పుడల్లా, అలా అలవాటైపోయిన లయ కోసం వెతుక్కుంటూ అది కనపడకపోయేటప్పటికి, కనీసం అర్థం మీద పడి అసలు సంగతి తేల్చుకుందాం అనుకోవటం కూడా నా "పేట్రేగింపుకు" ఒక ఊతం.. నాలా ఆలోచించేవాళ్ల మధ్య, మీ అనాగరిక విభాగ ప్రతినిధుల మధ్య గొడవలకి అదీ కారణం.
ఆస్వాదన అనుభవాన్ని విస్తృత పరుచుకుందామనే ఈ ప్రశ్నల పితలాటకం. అఫ్సర్ గారు మంచివారు అవబట్టో, ఉపాధ్యాయ వృత్తిలో ఉండబట్టో, నాలాటి వచన కవితానుభవశూన్య విద్యార్థులని బోల్డు మందిని చూసి ఉండబట్టో ఓపిక చేసుకుని ఈ టపా వేసారు. ఇలా నేను ప్రశ్నలేసిన మిగతా "కౌ" లకు ఆ "ఇది" లేదు. గ్రాసం నెమఱు వేసుకుంటూ చప్పట్లతో పెంచుకున్న కొవ్వు బొజ్జల మీద చేతులేసుకుని తోకలూపుకుంటూ, తల కిందకు పెట్టి కొమ్ములతో దాడికి సిద్ధమైపోయి, విఱుచుకుపడటమే నేను ఇప్పటివరకూ చూసింది. ఇహ నా ఆస్వాదనానుభవాన్ని ఎక్కడ పెంచుకునేది?
ఇలాటి అనుభవాలు నాకే కాదు, బోల్డు మందికి కలిగే ఉంటాయన్న "మాట" రాతి శాసనం మీద చెక్కి ఎవరికైనా బహుకరించేస్తా...
నా మటుకు "ఆస్వాదించడం" నేర్పేవాళ్లుండాలే కానీ, భేషుగ్గా నేర్చుకునే విద్యే. అది కుదరనప్పుడు నేర్చుకోవాలనుకునేవాడికి, తెలుసుకోవాలనుకునేవాడికి ప్రశ్నలే ఆధారం. ఆ ప్రశ్నలకు సమాధానం కవిగారి నుంచే వస్తే మరింత సంతోషం. అలాగని ప్రతిదీ చెంచాతో కుక్కకుండా, బాలారిష్టాలు దాటేదాకా సహాయపడితే చాలు. బాలారిష్టాలు దాటాయని ఎలా తెలుస్తుంది? ప్రశ్నల ధాటి తగ్గినప్పుడు, కవితకు తగ్గ ప్రశ్నలేసినప్పుడు, వెటకారం తగ్గినప్పుడు, చప్పట్లు సందర్భానుసారంగా కొట్టినప్పుడు.....
అదండీ....నా ఘోష ఇంతటితో సమాప్తమండీ కొత్తపాళీ గారు, అఫ్సర్ గారు....బోల్డు ధన్యవాదాలు...
భవదీయుడు
వంశీ
చర్చంటూ మొదలయ్యింది కాబట్టీ, అది మంచిదే అని నాకనిపించింది కాబట్టీ నేనూ ఒక రాయేస్తున్నాను.
వంశీగారు, మా గురూజీ గిరీశంగారు చెప్పిన "అట్నుంచి నరుక్కు రమ్మన్నారు" అన్నది నేనప్పుడప్పుడూ పాటిస్తూ ఉంటాను. ప్రస్తుతం ఆ మార్గం తొక్కుతున్నాను. "నాకే జన్మభూమీ లేదు!" అన్న కవితలో మీకు అర్థం కాని విషయాలని ప్రశ్నించారు. అసలు అర్థమైన అంశమేవైనా ఉందా? ఈ కవిత దేని గురించని మీరనుకుంటున్నారు? ఈ కవిత చదివిన తర్వాత మీలో కలిగిన "అనుభూతి" ఏమిటి?
కొద్దిగా వివరించగలరా.
మీ గిరీశం సంగతేమో కానీ మా తాతయ్య ఓ మాటనేవాడు - ఒరే ఎవరైనా అటునుంచి నరుక్కుని వస్తున్నప్పుడు చింతచెట్టు ఎక్కు. నీకు పులుపు, నరికేవాళ్లకు సలుపు లభిస్తాయని. అప్పటి మా తాతయ్య మాట ఇలా గుర్తుకొచ్చినందుకు ఆనందం.
ఇహ అర్థాల సంగతి - నాకర్థమైన దాని సంగతికొస్తే ఆ కవితకు సంబంధించిన టపాలోని నా ప్రశ్నలే మీ ప్రశ్నలకు జవాబు. ఏమిటీ? ఎక్కడైనా ప్రశ్నలకు ప్రశ్నలు జవాబా అని అడిగితే ఏమీ చెప్పలేను. అఫ్సర్ గారన్న "ఈ కవితలో సాధారణమయిన మాటలే ఏదో ఒక అసాధారణమయిన శక్తిని చూపిస్తున్నాయి. అదే కవిత్వీకరణ అనుకుందాం" -- .అసలా శక్తి ఏమిటో తెలుసుకోవాలన్న ప్రయత్నమే ఈ నా ప్రశ్నా - చర్చల బాధ.
చక్కగా మినపట్టు వేసుకుందామని, దానిలో ఆవకాయ వేసుకుని ఆవకాయ నంచుకోగా మిగిలిన డొక్కు బుగ్గలో పెట్టుకుని ఆనందిద్దాం అనీ, ఆ టపా వేళకు కుంపటి రాజేసి పెనం పెట్టా....ఎక్కడో తేడా వచ్చి పెనం బదులు బుఱ్ఱ గోరువెచ్చగా వేడెక్కడం మొదలయ్యింది. అలా అవ్వగానే కుంపట్లో బొగ్గుల మీద నీళ్ళు పోసి ఆపేసానని చెప్పాగా అందుకే.....మీరు కొచ్చెన్ మార్కేసిన అంశాలు, అనుకోళ్లు, అనుభూతులు అన్నీ ఆ బొగ్గులతో పాటు అప్పుడే, ఆ టపాలోని ప్రశ్నలతో పాటే ఆరిపోయాయి. మఱుమాట లేదు. ఇహ నా కుంపటి తిఱిగి వెలిగించేదీ లేదు.
అఫ్సర్ గారు బాహువులు చాచి వెతుకుతున్న సమర్థులు మీరైతే నాకంతకన్నా సంతోషం లేదు. సరస్వతీ పుత్రులైన మీరు దయ తలచి ఆ కవితార్థ సమాధానం నా చెవుల్లో పోయగలిగితే రేపు సుబ్రహ్మణ్యషష్టి రోజు రుద్రాభిషేకం చేసుకుంటా....నా కుంపటి ఆరిపోయింది కాబట్టి, మీమీ కుంపట్లు రాజేసి ఆ జన్మభూమి కవితా మినపట్టు, దానితో పాటు కొసరుగా మిగిలే ఆవకాయ డొక్కు ప్రసాదించండి మహప్రభో......అది మీరైనా సరే, ఇంకెవరైనా సరే!
భవదీయుడు
వంశీ
@ వంశీ, మీ అభిలాష అర్ధమయింది. కానీ కవిగారే తన పద్యానికి వివరణ ఇచ్చుకోవడం హాస్యాస్పదమై కూర్చుంటుంది, ఎక్కడో బాగా అరుదైన సందర్భాల్లో తప్ప. దాన్ని విడమరిచి చెప్పాలి అంటే ఎవరైనా సమర్ధులైన ఉపాధ్యాయులే తగు. సమకాలీన కవిత్వాన్ని సాధారణ పాఠకుడికి పరిచయం చేసే పనిని కొంతవరకూ చేకూరి రామారావు గారు తన చేరాతలు శీర్షికద్వారా చేశారు. ఇంకా ఇటువంటి మరికొన్ని పుస్తకాలు ఉండొచ్చు.
All the best.
వంశీగారు,
ఆశ, దోశ, మినపట్టు, వడ!:-) ఎవరి కుంపటి వాళ్ళు రాజేసుకొని ఎవరికి వారు స్వయంగా వేసుకు తినాల్సిన మినపట్టేనండి కవిత్వాస్వాదన. అది ఛందోబద్ధమైనా, కానిదైనా. మహా అయితే ఇతరులు ఆ మినపట్టు తయారీ విధానాన్ని వివరించగలరే కాని వాళ్ళు వేసుకున్న మినపట్టుని మరొకళ్ళ నోట్లో పెట్టడం సాధ్యమయ్యే పని కాదు. తీరా కష్టపడి వేసుకు తిన్నా కొందరికి దోశా మినపట్టు లాంటివి రుచించకపోవచ్చు. చక్రపొంగలి దద్దోజనాన్నే జిహ్వ కోరుకోవచ్చు. అంచేత ఆ రిస్కు తీసుకుని, ఉట్టినా చెయ్యకాల్చుకోడానికి సిద్ధపడ్డ వాళ్ళే వంటకి సిద్ధం కావాలి!
"నాకే జన్మభూమీ లేదు" అన్నారేమిటో అని చదివాను. నా కేమీ అర్ధము కాలేదు. కాకపోతే నాలాంటి వాళ్ళ కి అర్ధమవ్వాలని దానిని వ్రాయలేదని నేను ఊర్కున్నాను. బహుశ వ్రాసేవారు అందరోకోసం వ్రాయరేమో.
మీ ప్రశ్నలకి కొన్ని సమాధానాలు ఈ ముఖాముఖీలో దొరకవచ్చు.
http://www.poddu.net/?q=node/775
వంశీ గారి కష్టం అర్థమవుతుంది కానీ ఎలా అర్థం చేసుకున్నారో చెప్పడానికి వెనుకంజ వేయడం బాలేదు. తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోయాక చెప్పేవాడికీ చిరాకెత్తుతుంది.
ఈ లింకు చూడండి. ఇటువంటి చర్చే కొంత జరిగాక కామేశ్వరరావు గారిక్కడ ఇచ్చిన వివరణ చాలామందికి సాయపడింది.
http://poddu.net/?q=node/730
కామేశ్వరరావు గారిలాగా ఆధునిక తెలుగు కవిత అన పేరుతో ఒక బ్లాగు మొదలుపెట్టి ఒక్కో కవితనూ వివరిస్తే కవిత్వసారం నలుగురికీ అందించినట్లవుతుంది, కవ్త్వానికి పాఠకులూ పెరుగుతారు.
కొత్తపాళీ గారు
చేకూరి వారి వివరాలకు ధన్యవాదాలు..... హాస్యాస్పదం ఎందుకవుతుందో అర్థం కాలేదు కానీ, అర్థంతో పాటు ఇంతకుముందు అన్నట్టుగా కవితకు ఆలంబన ఏమిటో, అది వ్రాసినప్పుడు కవికి కలిగిన ఆలోచనేమిటో, దానికి సహాయపడ్డ వాతావరణమేమిటో, కవితా స్వరూపమేమిటో పాఠకుడికి కొద్దిగా ఎఱికలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యటానికి ఆ కవిత వ్రాసిన కవులలో పేరుకుపోయిన ఓ రకమైన నిరాసక్తత ఒక కారణమనీ, ఒకవేళ పొఱపాటున విశదీకరిస్తే ఓస్ ఇంతేనా అని ఎద్దేవాలు ఎదురవుతాయేమోనన్న భయం ఇంకో కారణమనీ నేననుకుంటున్నా....ఏమో నేనూ, నా కారణాలూ తప్పు అయి ఉండవచ్చు....! అసలు కవికి ఆ కవిత స్వరూపం "ఎక్స్ ప్లెయిన్" చెయ్యాల్సిన అవసరమూ ఉండకపోవచ్చు. అలాగైతే ఆ కవిత చక్కగా దస్త్రం కుట్టుకుని మడిచి తన దిండు కిందే పెట్టుకోవచ్చుగా అన్న ఆలోచన వస్తూ ఉంటుంది...అయినా నా పిచ్చిగానీ ఆబ్స్ ట్రాక్ట్ పెయింటింగులు కొన్ని మందలు పిచ్చోళ్లలాగా కొనుక్కోటల్లా? ......:)
కామేశ్వర రావు గారూ
:) ...ఛందోబద్ధ కవిత్వంతో గత పదేళ్ల కాలంలో ఆ ఆస్వాదన గొడవెప్పుడు రాలా నాకు. ఛందోబద్ధం కానిదాని సంగతి తెలుసుకుందామనే ప్రయత్నం. కనీసం అర్థం తెలిస్తే ఆస్వాదన సంగతి అదే ఎఱికలోకి వస్తుందని నమ్మకం. ఛందోబద్ధ కవిత్వంతో చేతులేం ఖర్మం, అన్నీ కాలినాయి. అయితే అలా కాలాక వచ్చిన నొప్పులు చాలా బాగున్నాయి. నొప్పులెక్కడన్నా బాగుంటాయా అంటారా? నొప్పి శరీరాన్ని విడిచి వెళ్ళే రోగం కాబట్టి, రోగం కుదురుకుంది కాబట్టి ఆ నొప్పులు ఆనందించాననే చెబుతాను. ఛందోబద్ధ కవిత్వమూ, దాని అర్థాలు అన్నీ ఇప్పుడు నానుంచి విడదీయలేని భాగాలే, అమితమైన ఇష్టాలే.....అలాటి అర్థాన్నే, ఇష్టాన్నే ఈ వచన కవిత్వంలో పట్టుకోవటానికే, ఆ నొప్పులు పడటానికే ఈ ప్రయత్నమంతానూ. ఆదిలో కుంపట్లు వెలగవుగా.....ఊరకే ఆరిపోతూంటాయి.....వచన కవిత్వం కుంపట్లు వెలిగించుకున్నవాళ్లు, చేతులు కాల్చుకున్నవాళ్లు, కొండొకచో మీలాటివారు సహాయం చేస్తారని అనుకున్నా....నా అంతట నాకే వెలిగించుకోటం వచ్చాక, మధ్యలో ఆర్పుకునే ఆవేశం తగ్గాక మీవి, ఇతరులవి - మినపట్టు, దద్ధోజనం అవసరమేమున్నది? అన్నీ నేనే చేసుకుంటా, ఆనందిస్తా, ఆస్వాదిస్తా... :) అయినా రాక ఎక్కడికి పోతుంది, దొడ్లో తోటకూర తఱగ......ఇహ మన గుంపునొదిలేసా.... ఇతరులెవరైనా వివరించడానికి పూనుకుంటే మళ్లీ వస్తా...
అనానిమస్సు గారికి - చిర్రెత్తుకొస్తే చక్కగా ఓ గంగాళం చన్నీళ్లు పోసుకుని కూర్చోండి. వెనుకంజ వెయ్యటమేమిటన్నది మీ ప్రశ్న - వెనుకంజ వెయ్యలేదన్నదీ, నేనిచ్చిన సమాధానం మీరు సరిగ్గా చదవలేదన్నదీ నా జవాబు...
భవదీయుడు
వంశీ
PS: అఫ్సర్ గారు - మీరిచ్చిన పొద్దు లింకు చూస్తాను ఇప్పుడు.....లింకుకు ధన్యవాదాలు
కవిత్వమంటే ఇష్టం నాకు. చదవడమన్నా, తోచిందేదో అప్పుడప్పుడూ రాయడమన్నా ఇష్టం. అని కవిత్వమే జీవితమైనవాణ్ణి మాత్రం కాదు. అఫ్సర్ గారి కవిత్వాన్ని ఫాలో ఔతున్నా, ఈ కవిత మాత్రం ఇప్పుడే చదివాను. వంశీ గారి ప్రశ్నలకు జవాబులుగా కాదుగానీ,ఆ సందర్భాల్లో నాకు బోధపడిన నాలుగు మాటలు పంచుకోవాలనిపించింది. ఐతే వీటన్నిటికీ ..... కవిభావన ఇది కావచ్చునేమో? అని జోడించుకోవాల్సిందే.
- దేవుడి అంగాంగాన్ని...... , అంటే చాతుర్వర్ణ్య వ్యవస్థలో దేవుడి శిరస్సు,భుజాలు.. ఇలా ఎవరికివాళ్లు దొరికింది దోచుకున్నారని...
- శరీరం ఇక్కడ విగ్రహారాధనకు ప్రతీక. అది లేకుండా రహస్యంగా విడదీయబడి, పారేయబడిన ఆత్మ తానని..
- పూల చిరునామాలు తెలిసిన తుమ్మెదైనా సరే.. తనలోని ప్రేమ తత్వాన్ని గుర్తించదని"తానేమిటో" అవగాహన చేసుకోదని...
- దారులన్నీ కలుస్తున్నాయా? విడిపోతున్నాయా? ఏది కూడలి అంతు? ఏ దారి అంతైనా తెలుస్తుందేమోగాని కూడలి అంతు ఎట్లా తెలుస్తుంది? తన బతుకు, తన సమస్య, తనను కేంద్రంగా ఎవరు ఏం చర్చించుకుంటున్నదీ, ఏనిర్ణయానికివస్తున్నదీ,ఎటు వెళ్తున్నదీ తెలీదు.
- నాడులు స్పందనలకు ప్రతీకలు. స్పందించే అవకాశం ఇమ్మని కోరడామూ స్పందనే కదా! ఆ స్పందనకే అవకాశం లేదే అని కవి హృదయ వేదన.
- వుమ్మ నీటి విషయం కవి చెప్పారు. వుమ్మ నీరు అమ్మదనానికీ, వుమ్మి ఛీత్కారానికి ప్రతీకలు.
- కలిసి ఉద్యమించే వాళ్లందరినీ ఏదో విధంగా చీల్చాలన్నదే శత్రువు పన్నాగం. విడివిడిగా కనిపిస్తున్నా కనుపాపల దృష్టి ఒక్కటే. ఆందుకే తన ఉద్యమతత్వాన్ని చీల్చలేరని, తన దృక్పథానికి కారకాలైన కనుపాపలను పేల్చలేరని కవి భావన.
ఇందులో వంశీ గారు అర్థ సంక్షోభమని భావించినవాటినే ప్రస్తావించాను.
కవి ఎదుటి వాళ్లపై ఒంటి కాలిపై లేచ్తున్నాడానీ అనలేము. "నాలోసగాన్ని చీకట్లో ముంచి...." అని తనవారి తప్పునూ ఎత్తి చూపుతున్నాడు.
ఆధునిక కవిత్వానికి టీకాటిప్పణీ సులువు కాదనే నా భావన. చేరాతల్లాగ ప్రస్తుతం సాధ్యపడదేమోగానీ.. వ్యంగ్య ధోరణికి తావు లేకుండా, సహృదయ వాతావరణంలో ఇలాంటి చర్చలు సాగడం అవసరమనే నాభావన.
14 ఏళ్ల క్రితం రాసిన కవిత గురించి,తన బ్లాగులో ఇంత చర్చ జరగడానికీ అవకాశం కల్పించిన అఫ్సర్ గారికి నమస్సులు. వంశీ గారు సహృదయాత్మక సందేహాలు పునాదులుగా ఇలాగేచర్చలు కొనసాగిద్దాం. మీకూ కృతజ్ఞతలు.

మడిపల్లి రాజ్‌కుమార్

ఈ వంటలమంటల ముచ్చట్లలో కి కొంచెము ఆలశ్యము గా వచ్చాను. మన్నించగలరు.
ముందుగా ఈ కవిత రాసిన అఫ్సర్ గారికి, దాని గురించి అద్భుతముగ వివరణ అందించిన రాజకుమార్ గారికి అభినందనలు.
ఏ కవిత గురించైనా విశ్లేషించే ముందు రెండు విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. 1) కవితలోని సందేశము ఏమిటి? 2) దానిని పాఠకుల దగ్గరకు కవి ఎంత బలముగా తీసుకెడుతున్నాడు?
కవితాంశం గనక ఏ హిమాలయాల అందాల వర్ణనో, లేకపోతే ఏ అప్సరస సొగసు హొయలగురించో అయితే అస్సలు చిక్కే లేదు. మొదటి విషయము గురించి అప్పుడు అస్సలు పట్టించుకునే పనే లేదు. కేవలము కవితాశైలి, భాష, ఛందస్సు లాంటి విషయాలను మాత్రమే విశ్లేషించాలి. సంప్రదాయకవిత్వము ఎక్కువ శాతము ఈ కోవలోకి వస్తుంది. అందులో సబ్జెక్టు వివాదాస్పదముగా ఉండదు. ఆధునిక కవిత్వము అలా కాదు. దళిత కవిత్వము, మైనారిటి కవిత్వము, ప్రత్యేకరాష్ట్ర వాద కవిత్వము, ఇలా ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి.
"నాకే జన్మభూమీలేదు" కవిత విషయానికి వస్తే - ఇందులోని అంతర్లీనమైన సందేశము కొందరికీ అస్సలు రుచించకపోవొచ్చు. మరికొందరికది గుండెలకు దగ్గరగా ఉండేదయి ఉండవచ్చు. కవితను ఆస్వాదించటములో వీరిద్దరి మధ్య తప్పకుండా వ్యత్యాసము ఉంటుంది.
వంశీగారికి ప్రశ్న - మీకు కవితాంశము నచ్చలేదా లేక అస్సలుకే అర్థము కాలేదా?
సరే ఆ ప్రశ్న అప్రస్తుతము అనుకుంటే మిగతా సంగతులు మాట్లాడుకునే ముందు.. మీకూ నాకూ అందరికీ ఒక చిన్న homework. ఒకరోజు గడువు అనుకుందాము. ఈ లింక్ లోని ఈ (అయోమయముగా ఉండే ) ఆంగ్ల కవితను చదవండి. సుదీర్ఘసమాసాలు సందులు లేని సరళమైన భాష. దీనిని చదివాక మీ పొయ్యి పరిస్థితి చెప్పండి. ఈ assignment ఇక్కడ వ్యాఖ్యలుంచిన వారందరికీ ఇవ్వబడినది అని గుర్తించగలరు.
Frost Poem
ఈ వంటలమంటల ముచ్చట్లలో కి కొంచెము ఆలశ్యము గా వచ్చాను. మన్నించగలరు.
ముందుగా ఈ కవిత రాసిన అఫ్సర్ గారికి, దాని గురించి అద్భుతముగ వివరణ అందించిన రాజకుమార్ గారికి అభినందనలు.
ఏ కవిత గురించైనా విశ్లేషించే ముందు రెండు విషయాలను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. 1) కవితలోని సందేశము ఏమిటి? 2) దానిని పాఠకుల దగ్గరకు కవి ఎంత బలముగా తీసుకెడుతున్నాడు? కవితాంశం గనక ఏ హిమాలయాల అందాల వర్ణనో, లేకపోతే ఏ అప్సరస సొగసు హొయలగురించో అయితే అస్సలు చిక్కే లేదు. మొదటి విషయము గురించి అప్పుడు అస్సలు పట్టించుకునే పనే లేదు. కేవలము కవితాశైలి, భాష, ఛందస్సు లాంటి విషయాలను మాత్రమే విశ్లేషించాలి. సంప్రదాయకవిత్వము ఎక్కువ శాతము ఈ కోవలోకి వస్తుంది. అందులో సబ్జెక్టు వివాదాస్పదముగా ఉండదు. ఆధునిక కవిత్వము అలా కాదు. దళిత కవిత్వము, మైనారిటి కవిత్వము, ప్రత్యేకరాష్ట్ర వాద కవిత్వము, ఇలా ఇంకా ఎన్నో ఎన్నో ఉన్నాయి.
"నాకే జన్మభూమీలేదు" కవిత విషయానికి వస్తే - ఇందులోని అంతర్లీనమైన సందేశము కొందరికీ అస్సలు రుచించకపోవొచ్చు. మరికొందరికది గుండెలకు దగ్గరగా ఉండేదయి ఉండవచ్చు. కవితను ఆస్వాదించటములో వీరిద్దరి మధ్య తప్పకుండా వ్యత్యాసము ఉంటుంది.
వంశీగారికి ప్రశ్న - మీకు కవితాంశము నచ్చలేదా లేక అస్సలుకే అర్థము కాలేదా?
సరే ఆ ప్రశ్న అప్రస్తుతము అనుకుంటే మిగతా సంగతులు మాట్లాడుకునే ముందు.. మీకూ నాకూ అందరికీ ఒక చిన్న homework. ఒకరోజు గడువు అనుకుందాము. ఈ లింక్ లోని ఈ (అయోమయముగా ఉండే ) ఆంగ్ల కవితను చదవండి. సుదీర్ఘసమాసాలు సందులు లేని సరళమైన భాష. దీనిని చదివాక మీ పొయ్యి పరిస్థితి చెప్పండి. ఈ assignment ఇక్కడ వ్యాఖ్యలుంచిన వారందరికీ ఇవ్వబడినది అని గుర్తించగలరు.
http://www.ketzle.com/frost/snowyeve.htm
Post a Comment