శూన్యం తల కింద
నేనేదో వొక అవయవాన్ని.
నేనెక్కణ్ణించి పుట్టానో
ఎలా పెరిగానో
'47 దగ్గిరే ఎలా విరిగానో
మీరెవరూ చెప్పలేదుగా -
దేవుడి అంగాంగాన్ని పంచుకొని కోసుకోనీ
లేదంటే దోచుకోనీ వెళ్ళిన మీరంతా
నాకేమీ మిగల్చలేదుగా -
నేను శరీరం లేని నీడని
ఏ గోడ మీంచో రహస్యంగా
పారేయబడిన ఆత్మని -
దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు.
ఇక్కడెక్కడో నా కాళ్ళ కింద నేలని
కుంకుమ చేతులు కోసుకెళ్ళిపోయాయి.
అక్కడెక్కడో కూలిన గోపురాల దుమ్మంతా
రెపరెపలాడ్తున్న నా దేహమ్మీద సమాధి కడుతోంది.
రెప్పల వస్త్రాలు కళ్ళకి కప్పి
నా వొంటి మీది చల్లని మాంసాన్ని
ఎవరెవరో అపహరిస్తున్నారు.
నా వొళ్ళు వొక అల్ కబీర్!
నాకు నేనే గుర్తు తెలియని శవాన్నయి
బొంబాయీ నెత్తుటి రోడ్ల మీద కుప్పకూలిపోతున్నాను.
నేనెవ్వరికీ అంతు దొరకని కూడలిని
నా మీంచి ఎవరెటు వెళ్తారో తెలీదు.
నిజంగా నేను శూన్యలోక వాసిని
ఎక్కడయినా ఎప్పుడయినా ప్రవాసిని.
నాలో సాగాన్ని చీకట్లో ముంచి
ఇంకో సగం అంతా వెలుగే వెలుగు అనుకుంటున్న భ్రమని.
నా లోపలి వలయాల్లో నేనే దూకి
కాలం ఆత్మని క్షణ క్షణం హత్య చేస్తున్న వాణ్ని.
అర్ధ రాజ్యాలూ అంగ రాజ్యాలూ కోరను
నా నాడుల్ని నాకు కోసిమ్మనడానికి
ఏ భాషా లేని వాణ్ని.
శవమయి దాక్కోడానికి వున్నా లేకపోయినా
తల దాచుకోవడానికి చారెడు నేల చాలంటాను.
ఉన్న చోటే పవిత్రమనుకుంటున్న వాణ్ని
ఎక్కడెక్కడో ఆంటీ ముట్టని బట్టలా విసిరేయొద్దంటాను.
నలభై ఏడుతో కాదు
నాతో నన్నే భాగించ మంటాను.
నా నవ్వులూ నా ఏడ్పులూ
నా అవమానాలూ, నా అనుమానాలూ
నా మాన భంగాలూ హత్యలూ
అన్నీ మీవి కూడా అంటాను.
నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.
విభజించి పాలించే నా శత్రువులారా,
నన్నెవరూ రెండుగా చీల్చలేరు.
నా కనుపాపల్ని ఎవరూ పేల్చలేరు.
1996
(ఒక డిసెంబరు ఆరు కి రాసిన కవిత...)
7 comments:
నమస్కారం.
మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
http://samoohamu.com సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .
మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును(add@samoohamu.com).
సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది.
మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి.
దయచేసి మీ సలహను / సూచలను అభిప్రాయాలను దయచేసి info@samoohamu.com తెలుపండి .
మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
--
ధన్యవాదముతో
మీ సమూహము
http://samoohamu.com
"నా తల్లి వుమ్మ నీరుని వుమ్మి చెయ్యొద్దంటాను.".....చాలా ఆర్ద్రంగా ఉంది, కళ్ళు చమర్చాయి.
ఈ పద్యం నాకు గుర్తుంది. చాలా పవర్ఫుల్ గా రాశారు.
padyaM aadyaMtamU kallalO neellu sullu tirigaayayyaa..
ఈ కవితను విమర్శించటం అని కాదు కానీ.....ఈ కవితల్లోని చాలా లైన్లలో ఏదో లోపం. ఏమిటో తెలియదు. లోపమేమిటో తెలీకుండానే, నీకు అర్థం కాకుండానే దీని గురించి వ్రాయ సాహసిస్తున్నావా అని అడుగుతారా? :) ఆకట్టుకుందేమో కూడా తెలియని అయోమయం. చదివినప్పుడు చెమర్చలేదు, నీళ్లు సుళ్లు తిరగలేదు, పవర్ఫుల్ అనిపించలేదు...లోపం నాలోనే ఉన్నదేమో అన్న భయోమయం.
కొన్ని పంక్తుల మీద ప్రశ్నలు...మీకు వీలున్నప్పుడు వివరించండి...ఎగతాళికి కాదు, అర్థం కాకే అడుగుతున్నానని మీరు అర్థం చేసుకోవాలని విన్నప విజ్ఞాపన పత్రం:
అ) అంగాంగాన్ని పంచుకొని, దోచుకుని, కోసుకుని వెళ్లిపోయిన వాళ్లు ఏదైనా ఎవరికైనా ఎలా మిగులుస్తారు? ఎందుకు మిగులుస్తారు?
ఆ) పోనీ ఒకవేళ పిసరంత మిగిల్చారే అనుకుందాం! అప్పుడు పిసరంతే మిగిల్చారే అన్న ఆక్రోశం కనపడేదా? అర్థం కాలా!
ఇ) గోడల మీంచి పడేసిన ఆత్మ ఏమన్నా విరిసిన పువ్వా? తుమ్మెదలు గ్రోలడానికి, నేను తినకపోయినా - మాంసం లాటి - రుచికరమైన మధువు లేనప్పుడు ఆ పువ్వు గురించి ఎవరికి చెపుతుంది? ఎందుకు చెపుతుంది? చెపుతే మటుకు వారు ఏం చేస్తారు? వాసన లేని పువ్వుకు విలువేది?
ఈ) కూడలిలో ఉండేవే సాధారణంగా నాలుగు దార్లు, పోనీ నలభై అనుకుందాం కాసేపు, కాదు కాదు నాలుగొందలు అనుకుందాం మరి కాసేపు - కూడలి ఉన్నదే అందుకు - ఎందుకు ? మీద పడి పోవడానికి. కూడలి పని దారి చూపించటమే! చూపించాక వాడు ఎటు వెళ్లినా తెలియనవసరం ఉన్నదా?
ఉ) దేవుడిది కోసుకెళితే మిగల్చలేదని ఓ రకంగా చెప్పినప్పుడు, నా నాడులు కోసి నాకిమ్మని చెప్పటానికి భాషెందుకు కరువయ్యింది?
ఊ) వుమ్మ నీరు వుమ్మి చెయ్యటమేమిటి? వుమ్మ నీర్లో వుమ్మి, మూత్రం, మలం అన్నీ సర్వంసహా కలగలుపేగా? బయటవాడు వుమ్ముతున్నాడనుకుంటే, కిళ్లీ కొట్టు వాడికి బేరం వచ్చిందని సంతోషించవచ్చు. కవి హృదయం అదే అయితే మరుమాట లేదు.
ఋ) రెప్పలకు వస్త్రాలు కప్పి మాంసం అపహరించినవాడు శరీరాన్ని రెండుగా చీల్చి కూడా చల్లని మాంసాన్ని అపహరించ వచ్చుగా, ఆ మాంసంలో కనుపాపలు ఓ భాగంగా భావించవచ్చుగా అన్న సందేహం పొడసూపింది.
అయ్యా - అవీ సందేహాలు.....కుదిరినప్పుడు నివృత్తి చెయ్యండి...
భవదీయుడు
మాగంటి వంశీ
దేశ దేశాలూ పట్టుకు తిరుగుతున్నాను
అన్ని దేశాలూ నావే అనుకుంటున్నాను
ఊరూరూ ఇల్లిల్లూ నాది నాదనే అనుకుంటున్నాను
ఏ తుమ్మెదా నా చిరునామా చెప్పదు ....... .
"వసుధైక కుటుంబం" అనే భావనకు
పూర్తిగా వ్యతిరేకమైన కర్కశ భావాలను వెదజల్లుతున్నారు.
"ఏ తుమ్మెదా.." అనేది మాత్రమే
మి"గత" వాక్యాల్ని కవిత్వంగా మార్చింది
pheww.....what a strong feel....geddam kinda cheyi pettukuni chaduvutunna daanni, civariki tala okkasary vidiliste gani bayataku raledu nenu!
Post a Comment